ప్రియమైన నాన్నగార్కి అనిరుధ్ నమస్కరించి వ్రాయునది మీరు ఎంతో ప్రేమతో నా పుట్టినరోజుకు పంపించిన గ్రీటింగ్ కార్డ్ అందింది. ఈ అరవైఐదు సంవత్సరాల వయసులో కూడా మీ దస్తూరి ముత్యాలని మరిపిస్తోంది అచ్చం మునుపటిలానే! మీరు వ్రాసే ఉత్తరాలన్నింటిని ఎంతో అపురూపంగా భద్రపరుచుకుంటూ ఉంటాను. మీరు అందించిన వారసత్వ సంపదకి మచ్చుతునకలు ఆ ఉత్తరాలు. ఈ ఉరుకుల పరుగుల పోటీ ప్రపంచంలో ఒంటరిగా ఫీలయినపుడు, ఎక్కడ ఓడిపోతానో అని భయపడినపుడు మీరు వ్రాసిన ఉత్తరాలు చదువుకుంటుంటే వెయ్యి ఏనుగుల బలం వచ్చినట్లుంటుంది. నిజం నాకెంతో ధైర్యంగా అన్పిస్తుంది.
నాన్నగారూ! నాకు నిన్నటితో నలభైరెండు సంవత్సరాలు పూర్తయ్యాయి. ఎందుకో ఒక్కసారి వెనక్కి తిరిగి బాల్యంలోకి తొంగి చూసుకోవాలన్పిస్తోంది. మీకు ఎన్నో చెప్పాలని వుంది. మీతో ఎన్నో అనుభూతులని పంచుకోవాలని మరీ మరీ అన్పిస్తోంది. నాకు మీలాటి తండ్రి లభించినందుకు నేను ఎప్పుడు ఎంతో గర్విస్తూ ఉంటాను నాన్నా! బాల్యంలో నా ఎదుగుదలకి మంచి పునాది వేసారు మీరు. పెద్దయ్యాక ఇతరుల కళ్ళతో కాకుండా నా కళ్ళతో నేను కలలు కనేలా నన్ను ప్రోత్సహించారు. నన్ను నేను తెలుసుకునేలా నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించారు. నా లక్ష్యాన్ని చేరుకునేలా నన్ను ఉత్సాహపరిచారు. ప్రతి ఉదయం నేను చిరునవ్వు చిందించేలా చక్కని వాతావరణాన్ని కల్పించారు. నా ప్రతి సాయంత్రాన్ని ఉల్లాసంగా మలిచారు. ఏ రకమైన ఆంక్షలు పెట్టకుండా, నా నిర్ణయాల మీద నమ్మకం ఉంచి, నా అంతరాత్మని నేను అనుసరించేలా స్వేచ్చగా పెరగనిచ్చారు. ఎన్ని కష్టాలు, ఒడిదుడుకులు ఉన్నప్పటికీ మనం జీవించడానికి అత్యద్భుతమైన ప్రదేశం మన కుటుంబమే అని తెలియచెప్పారు.
నా బాల్యం ఎంత రమ్యంగా, రసవత్తరంగా గడిచిందో మీకు ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేకపోయినా నాకు మళ్ళీ మళ్ళీ తలపోయడం ఎంతో ఆనందానిస్తుంది. నాకు ఆ రోజులన్నీ ఎదురుగా కళ్లకి కట్టినట్లుగా కన్పిస్తున్నాయి. సెలవురోజుల్లో సాయంత్రాలు బీచ్ కు తీసుకువెళ్ళి నేను గాలిపటం ఎగరవేస్తూ ఇసుక గూళ్ళు కడుతూ ఉంటే ముంతకింద పప్పు, కోన్ ఐస్ క్రీమ్ తిన్పిస్తూ మీరూ, అమ్మ ఎంత మురిసిపోతూ ఉండేవారని? రోజూ హోం వర్కుతో పాటు, జనరల్ నాలెడ్జ్ కి సంబంధించిన విషయాలు ఎలా మనసుకు హత్తుకునేలా నూరిపోసేవారో? వారం వారం క్రమం తప్పకుండా సాయిబాబా, కృష్ణుడి మందిరాలకు తీసుకువెళ్ళి క్రమశిక్షణ జీవితంలో అలవడాలంటే ధైవభక్తే శరణ్యమని చేతులతో నిరూపించారు. అప్పుడప్పుడు జూ పార్కు సందర్శనం, కుందేళ్ళని, పక్షులని ఇతర జంతువులని చూస్తూ కేరింతలు కొట్టే నన్ను చూసి మీరు ఎలా మైమర్చిపోయేవారో కదా! సీతాకోక చిలుకల వెంట పరుగులు తీయడం పావురాలకి మేత వేయడం, ఇంద్ర ధనస్సులో రంగుల్ని చూసి పులకించిపోవడం, ఇంటి పెరట్లో గులాబీలు విరగబూస్తే పరవశించిపోవడం! మల్లెపందిరి దగ్గర మంచమ్మీద మీ పక్కన పడుకొని ఆకాశంలో నక్షత్రాలని అబ్బురంగా చూస్తూ ఎన్నెన్ని కథలు ఆశ్చర్యంగా విన్నానో, అవన్నీ ఎలా మర్చిపోగలను? ఒకసారి బ్యాంక్ లో కేషియర్ పొరపాటుగా నాకు వెయ్యిరూపాయలు అదనంగా ఇస్తే మీరు నన్ను వెంటబెట్టుకు వెళ్లి తిరిగి ఆ సొమ్ము కేషియర్ కి ఇప్పించేసి, 'అలా చేయడం మూర్ఖత్వం కాదు, మన వ్యక్తిత్వాన్ని పతనం చేసుకోకుండా హుందాగా నిలబెట్టుకోవడం అని ఎంత బాగా హత్తుకునేలా చెప్పారు నాన్నా. అంతేనా! వేసవి సెలవుల్లో తాతగారి పల్లెటూర్లో ఎంత స్వేచ్చగా, హాయిగా గడిపానో ఎప్పటికీ మర్చిపోలేను. అక్కడి పంట పొలాలు, పిల్ల కాలువలో ఈతలు కొట్టడం, జామ, మామిడి చెట్లెక్కి వాటి పళ్ళు తినడం, అక్కడి మనుషుల ఆత్మీయతానురాగాల పలకరింపులు, వేణుగోపాలస్వామి గుడిలో బావి దగ్గర స్నానాలు, ఆముంగిట్లోని పారిజాతం పూలతో స్వామిని సేవించడం అబ్బ ఎంత. అపురూపమైన ఆహ్లాదకరమైన అనుభూతులు, నిజంగా అదొక స్వర్ణయుగం కదా నాన్నగారూ. నా ప్రతి అనుభూతిలో మీరూ భాగస్వాములే!
ఇక చదువు విషయం సరేసరి! ఎన్నో విషయాలు ఎంతో విపులంగా వివరించేవారు. ఏ ట్యూషన్స్ అవసరం లేకుండా మీ సాన్నిధ్యంలో ఎంతో నేర్చుకున్నాను. నాన్నగారూ! మీ మనవడు పెద్దవాడవుతున్నాడు. మీ ఇమెయిల్ ఎకౌంట్ అడుగుతున్నాడు. వాడు వాళ్ళ తాతగారితో ఇంటర్నెట్ లో చాట్ చేస్తాడట. తాతగారి దగ్గర కంప్యూటర్ లేదని చెప్పేసరికి వాడు చాలా నిరాశపడిపోయాడు పాపం! నేను మీ నుంచి పొందిన చిన్న చిన్న ఆనందాలు, సరదాలు నా కొడుకుకి కూడా పంచాలనుకుంటున్నాను నాన్నా. వాడిప్పుడు పదమూడేళ్ళ వాడయ్యాడు. కాని ఇంతవరకు గాలిపటం ఎగురవేయలేదంటే నమ్ముతారా? గోళీలు, గోడుంబిళ్ళ ఇవేం ఆడలేదు తెలుసా? జామ చెట్టుగాని, మామిడి చెట్టుగాని ఎక్కలేదు. వాడు ఈ అనుభవాలన్నీ చవి చూడాలని నా కోరిక. వాడి బాల్యం అసంతృప్తిగా, అసంపూర్తిగా ఉండకూడదు నాన్నా! కాని ఏం చేయను? వాడు కొత్త 'తరం' కొడుకు. తెలుగులో 'అంకెలు' 'డిఫికల్ట్ గా' అన్పిస్తాయి వాడికి. ఈ కాన్వెంట్ కల్చర్ తెలుగు భాష మాధుర్యాన్ని పూర్తిగా మర్చిపోయేలా చేయడంలో కృతకృత్యురాలయింది. చిన్నప్పుడు సుమతీ శతకం, వేమన పద్యాలు మీరు ఎంతో శ్రావ్యంగా పాడి ఎంతో చక్కగా నాతో వల్లెవేయించేవారు కదా నాన్నా! అవేవి రాజాకు తెలియవు. వాడికి కంప్యూటర్ గేమ్స్ అంటే ప్రాణం. కేబుల్, టి.వి. కార్టూన్ నెట్ వర్క్, క్రికెట్, ఫ్రెండ్స్ ఇవి ఉంటే చాలు. సెల్ ఫోన్లో గంటల కొద్దీ ఫ్రెండ్స్ తో మాట్లాడ్డం మరీ మరీ ఇష్టం. వాడికి మాక్ డోనాల్డ్, పిజ్జా హట్ లో బర్గర్స్, చిప్స్, కాప్సికమ్ పిజ్జా మహా ఇష్టం. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ హై సొసైటీ కల్చర్ లో వాడు తన బాల్యాన్ని, నైతిక విలువల్ని కోల్పోతున్నాడేమో అని నాకు అప్పుడప్పుడు అనిపిస్తోంది.
దాదాపు ఆరు, ఏడు సంవత్సరాలు చదువని, రీసెర్చ్ అని అమెరికాలో గడిపి నేనీ రోజు బోంబే మహానగరంలో ఒక ప్రతిష్టాత్మకమైన సంస్థలో ఉన్నతమైన పదవిలో ఉన్నానంటే దానికి ప్రేరణ, ప్రోత్సాహం అంతా మీరే కదా నాన్నా. బాల్యంలో మీరు నాలో నింపిన ఆత్మవిశ్వాసం, పనిపట్ల అంకిత భావం, జీవితం పట్ల సానుకూల దృక్పథం, ఆశావహ దృష్టికోణం ఇవన్నీ నేనీ స్థాయికి చేరుకోవడానికి దోహదపడ్డాయి. మనకంటే ఆర్ధికంగా తక్కువ స్థాయిలో ఉన్న రామం, శివా ఎంత కష్టపడి పట్టుదలతో కఠోర పరిశ్రమతో ఐఐటి సాధించారో నాకింకా గుర్తే! అన్ని సౌకర్యాలు, వసతులు ఉన్న నేటి తరం పిల్లలు ఇంకా ఏవో కంఫర్ట్స్ లేవని గొణుక్కుంటూ సమయాన్ని టీవీ, కంప్యూటర్స్, ఫ్రెండ్స్, ఫోన్లు, క్రికెట్ తో దుర్వినియోగం చేసుకొంటూ చదువులో వెనకబడిపోతుంటే కనీస అవసరాలు కూడా తీర్చే స్థోమత లేని బీద తల్లిదండ్రుల పిల్లలు ఎంత బాగా చదువుకొని వృద్ధిలోకి వస్తున్నారో నాకెంత చక్కగా వివరించేవారు నాన్నా! మన దూరపు చుట్టాలబ్బాయి నెలరోజుల పాటు ఎంసెట్ కోచింగ్ కి పల్లెటూరు నుంచి మన ఇంటికి వచ్చి ఎంత చక్కగా తపస్సులాగా చదువుకొని మంచి ర్యాంక్ సాధించాడో ఇవాళ్టికీ నేను మర్చిపోలేను. మీరెపుడూ అనేవారు కదా కడుపునిండిన వాడికి ఆకలి విలువ తెలియదు. ఖాళీ కడుపుతో ఉంటే గంజే పరమాన్నంలా అన్పించి ఆవురావుమని తింటారు! అని. అలాగే ఏ కనీస వసతులు కూడా లేని పల్లెటూరి వాడికి నగరాల్లో ఏ.సి కార్లలో తిరుగుతూ, పెద్ద పెద్ద భవనాల్లో నివసించే వారంటే ఏదో తెలియని ఆకర్షణ. తామూ అలాగే ఏదో ఒకరోజు అయి తీరాలనే మొండి పట్టుదలతో, తమ కలల్ని సాకారం చేసుకోడానికి అహోరాత్రులు అకుంఠిత దీక్షతో లక్ష్యాన్ని సాధించి తీరతారు. కాని నగరాల్లో, అన్ని కంఫర్ట్స్ కు అలవాటుపడిన పిల్లలు ఇలాటివారిని చిన్నచూపు చూడకుండా తామరాకు మీద నీటి బొట్టులా ఉంటూ కష్టపడి తమ లక్ష్యాన్ని సాధించాలని ఎంత నేర్పుగా చెప్పేవారు నాన్నా మీరు! మీకంటే మీ కొడుకు ఉన్నత స్థాయిలో ఉండాలని, చిన్నప్పుడు మీకు లేని సౌకర్యాలు నాకు అమర్చి అలాగే నాకు లేనివి నా కొడుకు పొందాలని కోరుకునే వారు మీరు.
ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే మీ సిద్ధాంతాన్ని నేను త్రికరణ శుద్ధిగా ఆచరిస్తున్నాను. పెద్దవారి పట్ల గౌరవం, చిన్నవారితో సఖ్యతగా ఉండడం, ఇతరులతో షేర్ చేసుకోవడం అందరితో మన్ననగా మసులుకోవడం అన్నీ మీరు నాకు ఎంత ఓపిగ్గా నేర్పించారు నాన్నా. ఒక్కడినే సంతానం కావడంతో ఎక్కడ మొండిగా, అహంకారంగా తయారవుతానోనని చాలా జాగ్రత్తలు తీసుకుని నన్ను పెంచి పెద్దచేశారు. ఎప్పుడూ నేను ఎవరితో వేలెత్తి చూపించు కోలేదు. ఎప్పటికీ నా బాల్యాన్ని మర్చిపోలేను. కానీ ఒక్కొక్కసారి రాజాను చూస్తుంటే ఒక తండ్రిగా నేను సక్సెస్ కాలేకపోతున్నానేమోనని బెంగగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ మహానగర వాతావరణ ప్రభావమో, స్నేహితులు సమ్మోహమో కాని రాజాలో అహంకారం ఛాయలు కొద్ది కొద్దిగా కన్పిస్తున్నాయి. ఇప్పుడిప్పుడే టీనేజ్ లోకి అడుగుపెడుతున్న రాజాకి బీదరికం శాపం కాదని తెలియాలి. తన కంటే తక్కువ స్థాయి వారి పట్ల కరుణ, జాలి చూపడం వాడు నేర్చుకోవాలి. ఎప్పటికప్పుడు రాజాని దగ్గర కూర్చోబెట్టుకొని ఇవన్నీ చెప్పాలనుకుంటాను. కానీ వాడికెప్పుడూ హోంవర్కు, ట్యూషన్స్ కాస్త టైము దొరికితే క్రికెట్, ఫ్రెండ్స్ నాకూ మీ కోడలికి ఉద్యోగ బాధ్యతలతో తీరిక లేని జీవితం ఈ కంప్యూటర్ యుగంలో స్పీడ్ పెరిగిపోయి, కుటుంబ సభ్యులంతా కలిసి మనసారా మాట్లాడుకోడానికి, కడుపారా కలిసి తినడానికి తీరిక దొరకడం లేదంటే నమ్మండి. అందుకే మీ సాంగత్యంలో, సంరక్షణలో రాజాని ఉంచాలనుకుంటున్నాను. మొక్కై వంగనిది మానైవంగునా అన్నట్లు ఈ కౌమారదశలో సక్రమంగా తీర్చి దిద్దకపోతే వాడి భవిష్యత్తు ప్రశ్నార్ధకరంగా మారడం ఖాయం.
మీరంటే వాడికి చాలా ప్రేమ, గౌరవం. మీ మాటంటే ఎంతోగురి. అందుకే జీవితాన్ని చదవడం వాడికి ఇప్పటి నుంచే నేర్పించాలి. కష్టపడి సాధించిన విజయంలో ఎంత సంతృప్తి ఉంటుందో వాడికి తెలియచెప్పాలి. ఇతరుల సాఫల్యాలకి మనస్ఫూర్తిగా అభినందించడం ఎంత గొప్ప విషయమో వాడికి తెలియజేస్తూ చిన్నప్పుడు మన వీధి చివరి పోస్టు మాస్టరుగారి అబ్బాయి మధు కష్టపడి ఐ.ఐ.టి సాధించిన వైనం వివరించాలి. తమ లక్ష్య సాధనలో కొన్ని త్యాగాలు ఈ వయసులో ఎంత అవసరమో, ఇప్పుడు కష్టపడితే తర్వాత జీవితంలో అంతా సుఖమే అన్న సంగతి వాడి మనసుకి హత్తుకునేలా మీరే చెప్పాలి నాన్నా. బీదవాళ్ళ పిల్లలే కాదు గొప్పవాళ్ళ పిల్లలు కూడ పట్టుదల, ధృడసంకల్పం ఉంటే లక్ష్యాన్ని సాధించితీరతారు అన్న విషయాన్ని మీ ఈ ఐఐటి కొడుకు ఉదాహరణతో చెప్తారు కదా! తల్లిదండ్రుల బట్టి కాకుండా తనకి తానుగా వాడు గుర్తింపు తెచ్చుకోవాలి.
జీవితానికి సంబంధించిన సున్నితమైన అంశాల్ని మృదువుగానే అయినా ఖచ్చితంగా మసులుకునేలా రాజాకి చెప్తారని ఆశిస్తున్నాను. అందుకే నాన్నగారూ! ఈ సారి సెలవులకి నేను మీ మనవణ్ణి మీ దగ్గరకి తీసుకువస్తున్నాను. అసలు నేను మీ కోడలు ఎన్నోసార్లు మా దగ్గరికి వచ్చేయమని అభ్యర్ధించాము. కాని పుట్టి పెరిగిన ఊరు, సహజ సిద్ధమైన ప్రకృతి వనరులు, ఆప్యాయత పంచే స్నేహితులు, ఆత్మీయత కురిపించే ఊరివాళ్ళు - వీరందరిని వదిలి రావడానికి మీకు మనస్కరించలేదు. అందుకే మేమే మీ దగ్గరికి వస్తున్నాము. కొన్నాళ్ళువాడు మన పల్లెటూరి జీవితాన్ని ఎంజాయ్ చేసాక మీరు వాడి భవిష్యత్తు దృష్ట్యా మాతో ముంబాయి వచ్చేయాలని మా అభ్యర్ధన. మనమంతాకలసి ఉంటే వాడు మీ పెంపకంలో, పర్యవేక్షణలో ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని సంతరించుకోగలడని మా ప్రగాఢ విశ్వాసం. వాడు మీ మాటలు తప్పక వింటాడనే నా నమ్మకం. బాల్యం అంటే ఎంత రసవత్తరంగా వుంటుందో, ప్రతి క్షణాన్ని ఎంత చక్కగా ఆస్వాదించవచ్చో, పెద్దవాళ్ళ సాహచర్యం ఎంత ధీమాని, బలాన్ని ఇస్తుందో వాడికి మీరే వివరించాలి. మీరు మాతో ఉంటే మాకు ఎంతో తృప్తిగా, నిశ్చింతగా ఉంటుంది. నాన్నా! ఇదిగో మీ కోడలు భోజనానికి పిలుస్తోంది ముద్దపప్పు, ముక్కలపులుసు, గుత్తొంకాయ కూర, గోంగూర పచ్చడి మీకు చాలా ఇష్టమైన వంటకాలు కదా ఇవి నాన్నా! త్వరలో మనం కలిసి గడపబోయే శుభ ఘడియలకోసం ఎదురుచూస్తూ....
***