" నానమ్మా ,,నాకు దోసెలు కావాలిప్పుడు " మారాం చేస్తూ అడిగాడు రాము . బోసి నోరు తో నవ్వుతూ మనమడిని చూసి " ఎ ప్పుడంటే అప్పుడు వెంటనే రావురా ,,రాము..ముందు పప్పు నానెయ్యాలి,,రుబ్బాలి." అంది నానమ్మ దమయంతి. " నాకవన్నీ తెలీదు..నాక్కావాలి " అన్నాడు నానమ్మను వాటేసుకుని. గోధుమపిండి తో దోసెలు చేసింది దమయంతి . సంతోషంగా తిన్నాడు రాము. " మరి నాకు కజ్జికాయలు ఎప్పుడు చేస్తావు " అడిగాడు రాము. "ఇదుగో నీ పుట్టిన రోజు వస్తోంది కదా ...అప్పుడు చేస్తా" అంది దమయంతమ్మ ,మనమడి ని దగ్గరకు తీసుకుని ముద్దాడుతూ. "సరే " అని చేతులు విడిపించుకుని ఇంటి బయటకు పరుగెత్తాడు రాము. "ఏమిటో వీడు వయసు పదమూడు వచ్చినా ఇంకా ....చిన్న తనం పోలేదు రా కృష్ణా " అంది దమయంతమ్మ అప్పుడే ఇంట్లోకి వచ్చిన చిన్న కొడుకు కృష్ణ ను చూసి. " అవునమ్మా ,వాడికసలు అమ్మా నాన్నగుర్తుకే రారు..నువ్వూ నేనూ ఉంటే చాలు " అన్నాడు బాబాయి కృష్ణ తృప్తిగా . కొద్ధి రోజులలో కృష్ణ కు పెళ్లి కుదిరింది. మరుసటి నెలలో వివాహం ముహూర్తం కూడా పెట్టుకున్నారు. బాబాయి పెళ్లి అనగానే చెప్పలేని ఆనందం లో తేలిపోయాడు రాము. చిన్న కొడుకు పెళ్లి కాస్త ఆలస్యం అయ్యిందని దిగులు పెట్టుకున్న దమయంతమ్మకు ఇప్పుడు సంతోషం అంతా ఇంతా కాదు. తెలిసిన ప్రతీ ఇంటి కి తిరిగి పెళ్లి విషయం చెప్పింది. పెట్టుకున్న ముహూర్తానికి ఎలాంటి అవాంతరాలు లేకుండా పెళ్లి సాఫీగా సంతోషంగా జరిగి పోయింది. కొత్తగా వచ్చిన కోడలితో ఇంట్లో ఆనందాలు వెళ్లి విరిశాయి. ఒక్కొక్కరుగా చుట్టాలందరూ పెళ్లి ఇంట్లోనుండీ వెళ్లి పోయారు. పదిహేను రోజుల తర్వాత ఇంట్లో దమయంతమ్మ, కోడలు నిర్మల, మనమడు రాము, కృష్ణ మాత్రమే మిగిలారు. ఉదయాన్నే ఆరు గంటలకు దమయంతమ్మ లేచి స్నానం ,పూజ ముగించుకుని కాఫీ కలిపి మనమడికి ఇచ్చి ,వంట మొదలు పెట్టింది. టిఫిన్ సమయం అయ్యినప్పటికీ కోడలు గదిలో నుండీ బయటకు రాలేదు. తొమ్మిది గంటలకు నిద్ర లేచి వచ్చి టూత్ బ్రష్ పట్టుకుని పళ్ళు తోముకోవటం మొదలు పెట్టింది నిర్మల. కొత్త కోడలు కదా, పోనీలే మెల్లిగా పద్ధతిలోకి వస్తుంది అని సర్ది చెప్పుకుంది దమయంతమ్మ. కానీ నెల గడిచిన తర్వాత కూడా ఇదే తంతు కొనసాగింది. నెల కింద ముగ్గురికి వంట చేసే దమయంతమ్మ ఇప్పుడు నలుగురికి చేయసాగింది . వంటలో కనీస సహాయం కూడా చేయకుండా దూరంగా ఉండి , రేడియో వింటూ ఉండేది నిర్మల. ఇక వుండ బట్టలేక ఒక రోజు దమయంతమ్మ అంది " అమ్మ నిర్మలా రోజూ కాస్త పెందరాడే లేచి స్నానం చేసి, నాకు కాస్త వంట దగ్గర సహాయం చెయ్యి . ఇన్నేళ్లు వాడు చేయి కాల్చుకోకూడదని, నే చేసాను ఈ వయసులో కూడా" " నాకు వంట రాదండి , మా ఇంట్లో నన్ను వంట వద్దకు వెళ్ళనివ్వ లేదెప్పుడూ " అని సమాధానం చెప్పింది నిర్మల అమాయకంగా మొహం పెట్టి. " సరేలేమ్మా, ఎల్లకాలం నేను ఉంటానా,,నువ్వే కదా చేసుకోవాలి. ఇది నీ ఇల్లు . మెల్లిగా నేర్చుకో " అంది. ఆ రోజు రాత్రి భర్త కృష్ణ తో అంది నిర్మల " నేను వంట రాదనీ నిజమే చెప్పా అత్తయ్య కు , కానీ అత్తయ్య వినిపించుకోకుండా నా మీద అరుస్తోంది "అని చెప్పి ,భర్త వొడిలో తల పెట్టింది. "పర్వ లేదులే నే నచ్చ చెబుతా అమ్మకి,, నువ్వేం ఖంగారు పడకు " అన్నారు అసలు నిజం తెలీని కృష్ణ. ప్రతీ రోజూ ఆఫీస్ నుండీ ఇంటికి వచ్చే సరికి భార్య నుండీ ఒక పిర్యాదు వినవలసి వచ్చేది కృష్ణకు. " ఏమండీ ,,అత్తయ్య ను చూసుకుని మీ అన్నగారి కొడుకు కూడా నేనంటే మర్యాద లేకుండా మాట్లాడుతున్నాడు " అంది నిర్మల కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ కృష్ణ వద్ద. " ఎందుకు ..వాడికి అంత ధై ర్యం వచ్చిందా..బహుశా నానమ్మ ఇచ్చిన అలుసు అయివుంటుంది ,,నే రేపు వాడిని మందలిస్తాలే,,వాడు స్వతహాగా చాలా మంచివాడు " అని సర్ది చెప్పాడు కృష్ణ. మరునాటి ఉదయం టిఫిన్ చేస్తూ అన్నాడు కృష్ణ " అమ్మ నువ్వు దాన్నేమన్నా అనదలిస్తే ,వాడి ముందు అనమాక ..వాడికి పిన్ని అంటే గౌరవం ఉండదు " అని చెప్పి వెళ్లిపోతున్న కొడుకుని చూసి విస్తు పోయి చూస్తూ వుండి పోయింది దమయంతమ్మ. కొద్దీ రోజులు తాను దూరంగా ఉంటే కోడలికి బాధ్యతలు తెలిసొస్తాయి అనుకుంది . ఆ నెల పెన్షన్ రాగానే రెండవ కొడుకు వద్ద, కాస్త కాలం గడిపి వస్తే సరి అనుకుని ,ఆ విషయం పోస్ట్ కార్డు ద్వారా కొడుక్కి రాసి పోస్ట్ డబ్బా లో వేసి వచ్చింది దమయంతమ్మ. నెల మొదటి వారం లో పెన్షన్ డబ్బులు తీసుకుని ఇంటికి వచ్చి ,సాయంకాలం కొడుక్కి ఆ విషయం చెప్పి, మనవడిని ముద్దాడి బస్సు స్టాండ్ వేపు నడక సాగించింది దమయంతమ్మ. ఇక ఆరోజంతా నిర్మల ఆనందానికి అవధుల్లేవు . రాము ను చూసి ఇక ఈ కుర్ర వెధవ పని పట్టి వీడిని కూడా తరిమేయాలి అని నిశ్చయించుకుంది. తనకు ,భర్త కి కూరలు వేరే గా పెట్టుకుని , మిగిలిన కూరలో అయిదు చెంచాల కారం గుమ్మరించింది.ఆ రోజు నుండీ అలాగే చేయ సాగింది. కారంతో ,నీళ్లు తాగుతున్న రాము ను చూసి నవ్వు కునేది నిర్మల. "పిన్నీ చాలా కారంగా వుంది, కారం తక్కువ వేయండి " అన్నాడు రాము ఒక రోజు. " ఇష్టం ఉంటే తిను లేదా మానెయ్యి , మేము కూడా తింటున్నంగా " అంది కోపంగా . మారు మాట్లాడ కుండా ఆ కారాన్ని తింటూ గట గటా నీళ్లు నిండుగా తాగి లేచి వెళ్ళిపోయాడు రాము. ఆ రోజు సాయంకాలం భర్త రాగానే కాఫీ చేతికి అందించి అంది నిర్మల "నే చేసిన వంట తినటం లేదు మీ అబ్బాయి." " ఏ ఎందుకని.?" ఖంగారుగా అడిగాడు కృష్ణ . " కారం ఎక్కువగా వుంది అని ఊరికే గోల '" అంది "మనం తింటున్నాం గా ,,కారం ఏమీ లేదే? " అన్నాడు సాలోచనగా. " అదే మరి ..నే చెప్పేది , అత్తయ్య వెళ్ళినప్పటినుండీ ,ఇలా ప్రతీ దానికి నాతో తగాదా పెట్టుకుంటున్నాడు " అంది బాధ పడుతున్నట్లుగా మొహం పెట్టి. " సరేలే చిన్న వాడు ...వాడికేమీ తెలీదు ..కొద్దీ రోజులు గడిస్తే వాడే సర్దుకుంటాడు" అని చెప్పి లేచి బాత్ రూము కెళ్ళాడు కృష్ణ. ఒక వారం గడిచిన తరువాత ఒక రోజు. బయటకెళ్ళి ఆడుకుని మధ్యాన్నం భోజనానికి వచ్చాడు రాము. అది చూసి అన్నం వడ్డించకుండా పక్కింట్లో కి వెళ్ళిపోయింది నిర్మల. ఇల్లంతా నిర్మల కై వెదికాడు రాము. ఎక్కడా కనపడ క పోయేసరికి వంటింట్లోకి వెళ్లి ప్లేట్ లో అన్నం పెట్టుకుని తినటం మొదలు పెట్టాడు. అప్పుడొచ్చింది నిర్మల . వస్తూనే కోపంగా రాము ను చూసి " నే వచ్చే వరకూ వుండొచ్చుగా లేదా ..నన్ను పిలవచ్చుగా " అని సాగింది. " మీరు లేరు ,,నే పెట్టుకుని తింటే ఏంటి నష్టం " అని సమాధానం ఇచ్చాడు రాము ఇక పిన్ని అరుపులు భరించ లేక. " అయితే రోజూ నువ్వే పెట్టుకో ..నేను వడ్డించను ఇక మీదట" అరిచింది నిర్మల. " సరే మరేం పర్వ లేదు..పెట్టుకుంటా నేనే" సమాధానం చెప్పాడు . ఆ రోజు సాయంత్రం కృష్ణ ఇంటికి రాగానే ఏడుపు మొదలు పెట్టింది నిర్మల. అది చూసి కంగారు పడి ఏం జరిగిందని అడిగిన కృష ను చూసి కళ్ళు తుడుచుకుని చెప్ప సాగింది నిర్మల "వాడికి నేను పెడితే తినడ ట,, భోజనం తానే వడ్డించు కుం టానన్నాడు " " మళ్ళీ ఎందుకలా చేస్తున్నాడు? నే చెబుతా నుండు." అని బయట ఆడు కుంటున్న రాము ను పిలిచాడు కృష్ణ. బాబాయి పిలవటం విని బాగా భయ పడుతూ ఇంట్లోకి అడుగు పెట్టాడు రాము. " ఎరా..తల తిరుగుంతుందా,, మీ పిన్ని నీకు అన్నం లో విషం కలిపి పెడుతోందా.? నెనే పెట్టుకుని తింటావన్నావంటా ..పిచ్చి వేషాలు మానెయి , వెళ్ళిక్కడనుండీ " అని గదిరించాడు కృష్ణ. బాబాయి కోపం మొదటి సారి చూసి..వణికి పోయాడు రాము. ఆ కోపం చూసి సమాధానం చెప్పే సాహసం కానీ, చెప్పే సమయ స్ఫూర్తి కానీ లేక ,భయం తో బయటకు వెళ్ళిపోయాడు రాము. ఎవరికీ చెప్పుకోవాలో తెలీలేదు. ' నానమ్మ కూడా లేదు.ఏం చేయాలి, ' అనుకున్నాడు రాము. ఆ నిస్సహాయ స్థితి లో అమ్మ బాగా గుర్తుకొచ్చింది రాముకు మొదటి సారి జీవితం లో 'అమ్మా నాన్న వద్ద కు వెళ్లి పోవాలి, ఇంక ఇక్కడ వుండ కూడదు ' అనుకున్నాడు. ఆ విషయం బాబాయి కి చెప్పే ధైర్యమ్ లేదు. చెప్పకుండా వెళ్లడం ఎలా అని ఆలోచించాడు. ట్రైన్ టిక్కెట్లకు డబ్బులెలా అని ఆలోచించ సాగాడు. అప్పుడు ఆ చిన్న బుర్రకు పెద్ద ఆలోచన తట్టింది .అదేమిటంటే అప్పుడే పదవ తరగతి పాస్ అయ్యాడు కనుక ఇంక ఆ టెక్స్ట్ బుక్స్ తో అవసరం లేదు,,వాటిని అమ్మెయ్య వచ్చు అని. వెంటనే ఎవరూ చూడకుండా వాటిని తీసుకెళ్లి షాప్ లో అమ్మి పది రూపాయలు తెచ్చుకుని సరి అయిన సమయం కొరకు మరుసటి రోజు చూడ సాగాడు. ఆ రోజు బాబాయి వేరే వూరికి వెళ్ల టం చూసి ఈ రోజు వెళ్లి పోవాలి అని నిశ్చయించుకుని, పిన్ని చూడ కుండా ఒక బ్యాగ్ లో తన బట్టలు సర్దుకుని స్టేషన్ వేపు , అమ్మా నాన్నను చూసే ఆనందంలో పరుగులు తీసాడు రాము. 2 పదిహేనేళ్ళు గడిచి పోయాయి. నిర్మల కు ముగ్గురు సంతానం . ముందుగా కొడుకు ఒక్కడే. తర్వాత ఇద్దరు కూతుర్లు జన్మించారు. " ఏంటీ మార్కులు ,, ..సరిగా చదవ కుంటే ,కాళ్ళు విరగ్గొడతా " కళ్ళు ఉరుముతూ చూసాడు కొడుకుని కృష్ణ, చేతిలో కొడుకు స్కూల్ రిపోర్ట్ చూసి. " పోనీ లెండి వాడి వయసెంత ఇంకా 11 సంవత్సరాలుకూడా నిండా లేదు ,తిట్టకండి అని పక్క రూమ్ లోకి తీసుకెళ్లింది నిర్మల తన కొడుకుని . పక్క రూమ్ లో వెళ్ళాక తాను మెల్లిగా మందలించ సాగింది " దున్న పోతులా తిని తిరగ కుంటే చదువుకుంటూ కూర్చో వచ్చుగా,,ముందు ఆటలు మానెయ్యి,,బయటకు వెళ్ళితే వీపు చీరేస్తాను " అంది. " ఇలా తిట్టావంటే ..నేనేటై నా వెళ్లి పోతా" అని అన్నాడు అలిగి నట్లుగా కొడుకు ప్రశాంత్. " వెళ్ళారా వె ళ్ళు..ఏంటి బెదిరిస్తున్నావా " అరిచింది ఇంకా కోపంగా. ఆ రోజు అన్నం తిన కుండా అలిగి పడుకున్నాడు ప్రశాంత్. మరుసటి రోజు అందరూ ఉదయం నిద్ర లేచి చూసే సరికి ప్రశాంత్ కనిపించ లేదు. వీడెటు వెళ్ళాడు ఇంత పెందలాడే లేచి అనుకుని వెదికింది నిర్మల. ఆ పిమ్మట వంట పనిలో పడిపోయింది. స్కూల్ సమయం అవుతున్నప్పటికీ ప్రశాంత్ రాక పోవటం చూసి కాస్త కంగారు మొదలయింది నిర్మలకు. భోజనము సమయం వరకూ చూసి భర్త కృష్ణ ఆఫీస్ కు వెళ్ళింది. విషయం అంతా విని, వెళ్లి కొడుకు స్నేహితుల ఇండ్లలో వాకబు చేశారు కృష్ణ. ఇక్కడకు రాలేదని సమాధానం చెప్పా రందరు.. స్కూల్ కి వెళ్లి కనుక్కుంటే అక్కడికి కూడా రాలేదని తెలిసింది. ఊరంతా వెదికారు కానీ ఎక్కడా ప్రశాంత్ జాడ తెలీలేదు. లేత మనసు పిల్ల వాడు కొంప తీసి ఏమైనా చేసుకున్నాడేమో అని భయం మొదలయింది కృష్ణ, నిర్మల మనస్సుల్లో. చీకటి పడే సమయానికి చెరువు వేపు వెళ్లారు ఏడుస్తూ. అక్కడంతా నిర్మానుష్యం గా వుంది. అక్కడ గొడ్లు కాస్తున్న వాళ్ళను అడిగారు. వాళ్ళెవరూ అటువంటి అబ్బాయిని చూడ లేదని చెప్పింది విని , ఇంటికి తిరిగి వచ్చారు. "బహుశా హైదరాబాద్ లో మా అక్కయ్యల ఇండ్లకు వె ళ్ళాడేమో ఫోన్ చెయ్యండి " అంటూ సలహా ఇచ్చింది నిర్మల . అందరికీ ఫోన్ చేసినప్పటికీ అందరూ" ఏమైంది "అని వివరాలు కనుక్కుని ,"ఇక్కడకు అయితే రాలేదు సుమీ " అని సమాధానాలు ఇచ్చారు. " వీడు అమ్మమ్మ ఊరికి వెళ్లి ఉంటాడు ఖచ్చితంగా " అన్నారు కృష్ణ ,భార్య నిర్మలను చూసి. " అవునండీ మరిచే పోయాము.. మనం ఎక్కువగా ,ఎప్పుడూ అటే వెళ్ళుతుంటాముగా ,,వాడికి ఆ అడ్రస్ కూడా బాగా సులువు " అని తీర్మానించుకుని ,గుండె దిటవు చేసుకుని ఫోన్ చేశారు. రాజమండ్రి లో నిర్మల తల్లి ఫోన్ లేపింది. " అమ్మా.. ప్రశాంత్ వచ్చాడా అక్కడికి ?" ఆతృతగా అడిగింది నిర్మల . " రాలేదే ..ఎప్పుడు బయలు దేరాడు ..ఏ ట్రైన్ కు ఎక్కించావూ?" ప్రశ్నించింది నిర్మల అమ్మగారు. జరిగిందంతా చెప్పింది నిర్మల. అక్కడకు కూడా వెళ్ళ లేదని అర్థం అయ్యి, ఇక తప్పదనుకుని , కొడుకు ప్రశాంత్ ఫోటో తీసుకుని పోలీస్ స్టేషన్ కు వెళ్లారు కృష్ణ. పోలీస్ ఇన్స్పెక్టర్ కృష్ణ చెప్పిందంతా విని ,వివరాలన్నీ రాసుకుని " మేమన్ని పోలీస్ స్టేషన్ లకు ఈ విషయాలు పంపిస్తాము . రేపు ఒక సారి రండి.ఈలోగా మాకేమైనా తెలిస్తే మీకు తెలియ చేస్తాము, మీరు కూడా మీ చుట్టాలందరికి తెలియ పరచండి " అని చెప్పి పంపించేశాడు ఇన్స్పెక్టర్. ఇంటికొచ్చాక దుఖం పట్టలేక ,ఇంకా ఎం చేయాలో ,ఎక్కడ వెదకాలో తెలీక , కృష్ణ ,నిర్మల రోదిస్తూ పడుకున్నారు. మనకెందుకు దేవుడు ఇలాంటి శిక్ష వేసాడు అని అనుకున్నారిద్దరూ. రాత్రంతా నిద్ర లేదు వాళ్లకు. తెల్లవారుజామున నిద్ర పట్టింది ఇద్దరికీ. కాసేపట్లోనే వున్నట్లుండి పెద్దగా మ్రోగింది ఫోన్ . ఆ చప్పుడుకి ఉలిక్కి పడ్డారు ఇద్దరూ. పక్క మీద నుండీ లేచి పరిగెత్తారు ఫోన్ దగ్గరకు. రిసీవర్ లేపి " ..హెల్లొ.హలో" అన్నారు కానీ అటువైపు నుండీ చప్పుడు లేదు.చాలా సేపు చూసి ఫోన్ పెట్టేసారు. "పోలీస్ స్టేషన్ కు చేయండి , వాళ్ళేమైనా చేసి వుండ వచ్చు " అంది నిర్మల, నీరసించి పోయిన భర్తను చూసి. పోలీస్ స్టేషన్ కు ఫోన్ చేయటానికి రిసీవర్ తీసేలోపు మళ్ళీ రింగ్ అయ్యింది ఫోన్. వెంటనే ఫోన్ లేపింది నిర్మల " హలో,హలో " అని అరిచింది . అటువైపు నుండీ " బాబాయి గారు..నేను రాముని,,వినపడుతోందా ?" ఏమీ సమాధానం ఇవ్వకుండా ,వెంటనే భర్త వేపు చూసి ఫోన్ ఇచ్చి " మీ అన్న కొడుకు ,మాట్లాడండి " అని మొహం చిరాకుగా పెట్టి ,వెళ్ళిపోయింది నిర్మల . ఫోన్ తీసుకుని " ఎరా ..రాము..ఎక్కడ నుండీ ,ఏంటి విషయాలు..ప్రశాంతుడు కనపడటం లేదురా ..మేమంతా అదే కంగారులో వున్నాం" అన్నాడు. " బాబాయి గారు..నమస్కారం ..ఏమీ కంగారు వద్దు..వాడిక్కడికి ఇదుగో ప్రొద్దున్నే వచ్చాడు...ఎలా వచ్చావురా అంటే ఏమీ చెప్పటం లేదు.బట్టలన్నీ మట్టి కొట్టుకు పోయి వున్నాయి. బజారుకు వెళ్లి రెండు డ్రెస్ లు తెచ్చా. అన్నం తిని పడుకున్నాడు. నేను చాలా సేపటినుండీ మీకు ఫోన్ ట్రై చేస్తున్నా" అంటున్న రాము మాటలను విని , వొంట్లో బలమంతా పోయినట్లని పించి మాట పెగలక ఏడవటం మొదలు పెట్టారు కృష్ణ . " చ చ బాబాయి గారు..మీరు ఏడవటం ఏంటి.. నేనున్నానుగా ..వాడిక్కడ సేఫ్ ..మీరొచ్చే వరకూ నే చూసుకుంటా..ఏం పర్వాలేదు . వాడి రూపం చూడగానే నాకర్థమైంది, ఇంట్లో చెప్పకుండా వచ్చాడని " అని నవ్వాడు రాము. " సరేరా రాము , నేను బయలు దేరి వస్తా" అని చెప్పి ఫోన్ పెట్టేసాడు కృష్ణ . వంటింట్లో నుండి వచ్చి అన్నీ విన్న నిర్మల అంది " అమ్మయ్య దేవుడి దయ కొద్దీ వాడు దక్కాడు " అంది " దేవుడి దయ కొద్దే మాత్రమే కాదు , నేను రాముని పెంచిన పుణ్యం నా కొడుకును కాపాడింది.. చూడు ..ఇంత మంది చుట్టాలను వదిలేసి వీడు, నీవు చిన్నపుడు ఇంట్లో నుండీ తరిమేసిన, ఎక్కడో దూరంగా వున్న రాము దగ్గరకు వెళ్ళాడు " అన్నాడు భార్య వేపు మొహం అదోలా పెట్టి. భూమి గుండ్రంగానే వుంది అనుకున్నాడు కృష్ణ . ***