జీవనలీల - B.Rajyalakshmi

Jeevana leela
జీవితపయనం మనకు తెలియని ఊహించని మలుపులెన్నో తిరుగుతుంది . మలుపుల్లో ముళ్లపొదలూ వుంటాయి ,వయ్యారాల సెలయేర్లూ వుంటాయి . చైతన్య జీవన పయనం వసంతం లో మొదలయ్యింది ,కానీ వసంతం చిగురించలేదు . కారణం ? చిగురు తొడగాలంటే ప్రకృతి సహకరించినా ,చీడపురుగులను ,కలుపు మొక్కలను తొలగించాల్సింది మనిషేగా !
చీకటి రాత్రిలో రైలు వేగంగా జీవనపయనం సమాంతర పట్టాలపై చీకటి వెలుగుల చక్రాలపైన గుండెల్లోని అగ్నికణికెల్లాగా పరుగెత్తుతున్నది . చైతన్య యెంత ప్రయత్నించినా మనసు అల్లకల్లోలాన్ని ఆపుకోలేకపోతున్నాడు
"చైతన్యా "రమణయ్యగారి పిలుపుకు రైలు కిటికీ వైపే చీకటిలోకి చూస్తున్న చైతన్య తలతిప్పి ఆయనను చూసాడు రమణయ్యగారు నవ్వుతూ చైతన్య చెయ్యి ప్రశాంతంగా నిమిరాను . ఆ పిలుపూ ,ఆ నవ్వూ ,ఆ ప్రశాంతతే మలుపులు తిరుగుతూ లోయలో జారుతున్న చైతన్య జీవితాన్ని ,సరైన దారిలో నిలబెట్టాయి .
రైలు వేగం తగ్గుతున్నది ,గమ్యం దగ్గరికొస్తున్నది . చీకట్లో కూడా యెన్నో యేళ్ళక్రిందట చూసిన పరిసరాలను గుర్తుపట్టగలుగుతున్నాడు . మర్చిపోలేని అనుభవాలు ఆ వూళ్లో అతని చుట్టూ అల్లుకుని వున్నాయి . అతనికి తన నీడల్లాంటి భూత ,వర్తమాన ,చీకటి వెలుగుల క్రీనీడలు విన్యాసం చేసాయి .చైతన్యలో అప్రయత్నంగా యేదో నిర్వేదం !కన్నీళ్లు సుళ్లు తిరుగుతున్నాయి .రమణయ్యగారు దగ్గరగా వచ్చి “ఎందుకేడుస్తున్నావు ?”అంటూ ప్రశ్నించారు .
చైతన్య సుజల నేత్రాలతో ఆయన్ని చూసి తల దించుకున్నాడు .
“చైతన్యా ,యీ వూరొదిలి సుమారు పాతికేళ్లవుతున్నది.అందరూ నిన్ను మర్చిపోయివుంటారు కూడా ,నీ గతం కూడా మర్చిపోయివుంటారు .ఇంకా నీకు భయమెందుకు ? “అన్నారు రమణయ్యగారు .చైతన్యకు మైకం కమ్మినట్టు కళ్లుతిరిగాయి .కాసిని మంచినీళ్లు త్రాగాడు .రైలాగింది.వాళ్లిద్దరూ దిగారు .చైతన్య కాళ్లు తడబడ్డాయి .వొళ్లంతా కంపించింది .పాతికేళ్ల క్రిందట యిదే రైల్వే స్టేషన్ అతని జీవితాన్ని మలుపు తిప్పింది .దూరం గా శివాలయం మసక మసక గా కనిపిస్తున్నది .రమణయ్యగారు చైతన్యను తనతో పాటు అక్కడి మఠం లోని తన గదిలోకి తీసుకొచ్చారు .ఇద్దరూ స్నానాలు చేసి సేద తీరారు .మఠం వాళ్లకు ముందే చెప్పి వుంచడం వల్ల రాత్రికి చపాతీలు ,టొమాటో పప్పు వేడివేడి గా సిద్ధంగా వున్నాయి .ఇద్దరూ తినేసి నడుం వాల్చారు .రమణయ్యగారు వెంటనే మంచి నిద్రలోకి జారారు .చైతన్యకు ఆలోచనలతో నిద్రపట్టలేదు .
గుండెల్లో అగ్నిపర్వతాలు మండుతున్నాయి .మర్చిపోవాలని ప్రయత్నించినా గతం నీడలా వెన్నాడుతుంది .
———————————————————————————————————————
రామయ్య ,జానకమ్మ దంపతులకు చైతన్య ఒక్కడే కొడుకు .వ్యవసాయం ,పాడి ,వారి జీవన భృతి .చిన్న పల్లెటూరు .వున్నంతలో ప్రశాంతమైన జీవనం .చైతన్య కూడా పెద్ద పెద్ద కోరికలు లేకుండా హైస్కూల్ చదువు ముగించి అదే వూళ్లో బడిపంతులుగా చేరాడు .చేతికందిన కొడుకును చూసి తృప్తిపడ్డారు .బళ్లో సహచరుడు శివయ్య పంతులు పరిచయం చైతన్య జీవితాన్ని మలుపు తిప్పింది .
“చైతన్యా ,మనకున్నది ఒకే జీవితం ,ఒకే యీ జన్మ ! ముసలివాళ్లమయితే. మనం ఆరోగ్యం గా చురుక్కుగా వుంటామో లేదో ,అసలు భవిష్యత్తేమిటో మనకే తెలియదు .యేమంటావు”అంటూ ఒకరోజు శివయ్య బళ్లో లంచ్ సమయం లో చైతన్య తో అన్నాడు .అతనేం చెప్పదల్చుకున్నాడో చైతన్యకు అర్ధం కాలేదు .కానీ అతను చెప్పిన మాటలు అర్ధం అయ్యాయి ! నిజమేగా !! భవిష్యత్తూ ,ఆరోగ్యం యెవ్వరూ వూహించలేరు.
“శివయ్యా ,నువ్వు చెప్పింది నిజమే కానీ అసలు నీ మనసులోని ఆలోచనలేమిటో , నాకర్ధం కావడం లేదు .నీ కళ్లల్లో యేదో తెలియని భావాలు కనపడుతున్నాయి .”అన్నాడు పాతికేళ్ల చైతన్య .శివయ్య నవ్వేసాడు .
“చైతన్యా ,మనం వుద్యోగాల్లో వున్నాం ,మనవాళ్లు మనకు పెళ్లిళ్లు చేసి బంధాల్లో బాధ్యతలల్లో దింపేస్తారు ,అందుకే కొన్నాళ్లు సరదాగా గడిపేద్దాం ,మా ఫ్రెండ్ రాఘవ పేకాట బాగా ఆడుతాడు నువ్వూ వస్తే అందరం సరదాగా ఆడుకుందాం .”అన్నాడు శివయ్య .చైతన్య కూడా సరేనన్నాడు .మొదట్లో ముగ్గురూ రాఘవ రూములో ఆడేవాళ్లు.చైతన్య పేకాట సంగతి చెప్పలేదు యింట్లో .క్రమక్రమం గా అది ఒక విడరాని వ్యసనమయ్యింది .తల్లితండ్రులకు చూచాయగా కొంత అర్ధమయ్యింది .మైథిలి తో పెళ్లి జరిగింది చైతన్యకు .పేకాట వ్యసనం తగ్గుతుందని వూహించారు కన్న తల్లితండ్రులు .మైథిలి పెళ్లయిన కొన్నాళ్లకే కుటుంబ పరిస్థితులను అర్ధం చేసుకుంది .చైతన్య పేకాట వ్యసనం మార్చాలని తీవ్రం గా ప్రయత్నించింది .అయితే భర్త తో పోట్లాట లేకుండా సామరస్యం గా పేకాట వ్యసన నష్టాలను చెప్పి చూసింది .కానీ లాభం లేకపోయింది .అతని తలితండ్రులు తమ శేషజీవితాన్ని కాశీ లో గడపాలని నిశ్చయించుకుని కోడలికి అన్నీ అప్పగించి వెళ్లిపోయారు .ఎంత ప్రయత్నించినా ,మైథిలి యెంత చెప్పినా చైతన్య పేకాట ఆపుకోలేక పోయాడు .మొదట్లో పేకాట లో అన్నీ గెలిచేవాడు .నోట్లకట్టలు చూస్తూ ,భార్య కు చూపిస్తూ తన సంపాదనకు గర్వించేవాడు .కష్ట పడకుండా వచ్చిన అదృష్టం యెండమావి అని వూహించలేకపోయాడు.వ్యసనం అంతర్వాహిని గా ప్రవహించి చైతన్య జీవన పయనాన్నే శాసించింది .
క్రమం గా విధి తన ప్రతికూలతను చూపించడం మొదలయ్యింది .చైతన్య పేకాట లో నష్టాలు చవిచూడటం మొదలయ్యింది .డబ్బులు పోగొట్టుకోవడం ఆరంభమయ్యింది .అయినా మళ్లీమళ్లీ ఆడడం ,డబ్బు పోగొట్టుకోవడం అలవాటయ్యింది .అప్పులు చెయ్యడం అలవాటయ్యింది .స్థిరచరాస్తులన్నీ పేకాటలో సమిధలయ్యాయి .మైథిలి మెళ్లో తాళి తప్ప అన్ని నగలూ రెక్కలొచ్చి వెళ్లిపోయాయి .చైతన్య చీకట్లో జారిపడ్డాడు .అనంతవైభవం హారతికర్పూరం లా కరిగిపోయింది .బడి కి సరిగా వెళ్లకపోవడం వల్ల వుద్యోగం వూడింది .చైతన్య యింటికెళ్ళడం మానేసాడు .అప్పులవాళ్ల ఒత్తిడి తట్టుకోలేకపోయాడు .మైథిలి ఓదార్పులనూ తట్టుకోలేకపోయాడు .సానుభూతిని భరించే శక్తి లేదు .వర్షపు నిశీధి చీకటి లో గమ్యం తెలియని పయనం !ఆలా ఆలా తిరుగుతూ నడిచిపోతున్నాడు .బంధాలు తెంచుకుంటున్నాయి .చైతన్యరహిత అవయవాల్లో యేదో అశాంతి ,అలజడి ! జీవితం పరిస్థితులూ ,ఆత్మబలం మీద ఆధారపడుతుంది .చైతన్యకు గమ్యం తెలియని పయనం నిరాశా నిస్పృహ అనిపించింది .చటుక్కున చెరువులో దూకేసాడు .
—————————————————————————————————————/—/
మరణం కూడా చైతన్యని తన దరికి రానియ్యలేదు .అతనికి స్పృహ వచ్చేసరికి “ఎవరు నువ్వు “అన్న మాటలు కలలో లాగా మెల్లిగా వినిపించాయి .నెమ్మదిగా లేచి కూర్చున్నాడు .ఎదురుగుండా కాషాయ ధారణతో ప్రశాంత చల్లని చూపులతో కరుణ తో కలిపించాడు .చైతన్య ఆయనకు కన్నీటిధారలతో నమస్కరించాడు .
“నేను బ్రతికి యెవరిని సంతోషపెట్టాలి !”అంటూ తన విషయాలన్నీ చెప్పాడు .కానీ మైథిలి పేరు కూడా ఉచ్ఛరించే అర్హత తనకు లేదని అనుకుని ఆమె సంగతి మాత్రం చెప్పలేదు .
“అయితే నాతో రా “ అంటూ తనతో తీసుకొచ్చేసారు రమణయ్యగారు .చైతన్య పయనం మరో మలుపు తిరిగింది .రమణయ్యగారు ఆశ్రమ జీవనం గడుపుతూ కొందరు సహచరులతో వేదపాఠశాల నడుపుతూ సనాతన ధర్మాన్ని ప్రభోదిస్తూ ప్రవచనాలను తెలుపుతూ వుంటారు .చైతన్య ఆశ్రమ జీవనానికి అలవాటుపడ్డాడు.నెమ్మది నెమ్మదిగా మనసు ప్రశాంతతకు అలవాటు పడింది .జీవిన భ్రమణం లో పాతికసంవత్సరాలు గిర్రున తిరిగిపోయాయి .అనుకోకుండా తన వూరి శివాలయం లో ప్రవచనాల కోసం రమణయ్యగారు వచ్చారు .తనతో పాటు చైతన్యను కూడా వెంటబెట్టుకొచ్చారు .
————————————/——————————
శివాలయం గంటల ధ్వని చైతన్యను వర్తమానం లోకి లాగింది ! అలసిన మనస్సు తో తెల్లతెల్లవారుతున్న ప్రకృతి ప్రశాంతం గా నవ్వుతూ కనిపించింది .తూర్పున బాలభానుడు “చైతన్యం వచ్చిందా “అంటూ తనల్ని ప్రశ్నిస్తున్నట్టుగా అనిపించింది .నెమ్మదిగా నదీ స్నానానికి బయల్దేరాడు .నదిలో తన ప్రతిబింబం” యిదే చెరువు లో నువ్వు చావును పిలిచావు కదా “అని నవ్వింది .తట్టుకోలేక అక్కడే అంతర్ముఖం లో ధ్యానం చేసుకున్నాడు .శివాలయం లోకి వెళ్లాడు .అక్కడ ప్రతి అడుగూ ,ప్రతి క్షణం మైథిలి గుర్తుకొస్తున్నది ,తల్లితండ్రులు గుర్తుకొస్తున్నారు .మైథిలి తనల్ని శిక్షించినా తృప్తి గా వుండేది కానీ తను తన భార్యను ఒంటరిగా వదిలేసి పిరికివాడిలాగా పారిపోయాడు .మైథిలి కోసం చూపులు వెతుకుతున్నాయి .ఊరివాళ్లుఅతన్ని గుర్తుపట్టలేదు .
గోపాలయ్య ఆ వూళ్లో పేరున్న మంచి వ్యక్తి .ఆయన రమణయ్యగారిని ,చైతన్యను భోజనానికి తనింటికి ఆహ్వానించారు .దైవసంకల్పం గా భావించి ఆయనింటికి వెళ్లారు .భోజనాలకు కూర్చున్నారు .
“ ఈవిడ మైథిలమ్మ గారు ! మా యింట్లో సుమారు యిరవేళ్లుగా వంట చేస్తున్నారు .చాలా రుచిగా శుచిగా చేస్తారు ,సీతమ్మ కున్నంత సహనమున్న వ్యక్తి .నా భార్యకు పిల్లలకు అన్నింటా తోడునీడ గా వుంటారు .నాకు ఒక దైవమిచ్చిన సోదరి .భర్త దేశాంతరాలు పట్టివెళ్లిపోయాడు .పేరుకే వంటమనిషి కానీ మా యింట్లో మనిషిలాగ కలిసిపోయారు .”అంటూ గోపాలయ్య వడ్డిస్తున్న స్త్రీని పరిచయం చేసారు .
చైతన్య కళ్లెత్తి చూసాడు .గుండెల్లో బడబాగ్ని రగిలింది .మైథిలి నిర్లిప్త భావం తో నమస్కరించి లోపలికి వెళ్లిపోయింది.వయసూ ,కాలం ,అనుభవాలూ కలబోసిన మైథిలిగా కనపడింది .అసలు తనల్ని గుర్తుపట్టిందా??తనల్ని అసలు సరిగ్గా చూసిందా ?చివరకు తన మైథిలి వంటలు చేసుకుని బ్రతుకుతున్నదా ?కారణం యెవరు ? చైతన్యకు తనమీద తనకే రోత వేసింది మైథిలి ముఖం అతని గుండెల్లో జ్వాల రేపుతున్నది .మైథిలి తన కన్నా వున్నతురాలు .గంభీర సెలయేటి జలజీవన స్రవంతి ! మళ్లీ మైథిలి తో ఆ నాటి అనుభూతులూ ,ఆనందాలూ పంచుకోగలడా ??
——————-
మర్నాడు వుదయం చెరువు దగ్గర స్నానం చేసి మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేసుకున్నాడు చైతన్య .చెరువు నిశ్శబ్దం గా నిర్మలం గా బంధాలకు అతీతం గా ప్రవహిస్తున్నది .నీళ్ళల్లోకి దిగి చుట్టూ కలయచూసాడు .మైథిలి బిందెలో నీళ్లు ముంచుతున్నది ,అతని మనసు చెదిరింది ,”మై ……థి ..”
గొంతు గుండెల్లో కొట్టుకుని విలవిలలాడింది .మైథిలి తలెత్తి చూసి గబగబా బిందె యెత్తేసుకుంటూ కొంగు నోట్లో పెట్టుకుని యేడుస్తూ యించుమించు పరుగెత్తుతూ వెళ్లిపోయింది .చైతన్య శిలయ్యాడు.ఆమెను యెలాగయినా కలవాలి ,మాట్లాడాలి అన్న తపన మొదలయ్యింది .
రాత్రి చీకటి పడ్డ తర్వాత ఒకనాటి తాను వున్న యిల్లు ,యీనాడు మైథిలి వున్న యిల్లు వెళ్లాడు చైతన్య .”మైథిలీ “అంటూ మెల్లిగా పిలుస్తూ తలుపు తట్టాడు .తలుపు తెరిచేవుంది .చిన్న దీపం వెలుగుతున్నది .మళ్లీ పిలిచాడు . తనమాటలే ప్రతిధ్వనించాయి ..ఇల్లంతా వెతికాడు .మైథిలి లేదు .తన మైథిలి లేదు .ఏమయింది??బల్ల మీద ఒక కాగితం మడిచి బరువు పెట్టి కనిపించింది .
“మీరు నన్ను చూసిన రోజే నన్ను కలవడానికి వస్తారని వూహించాను.మన దారులు సమంతరాలు .జీవితం పరిమితమైన జీవనపయనం.నేను వెళ్లిపోతున్నాను .నన్ను మళ్లీ వెతక్కండి .మీరు నన్ను స్వీకరించినా నేను మిమ్మల్ని స్వీకరించలేను .”
చైతన్య ముఖం పాలిపోయింది ! కలా ,భ్రాంతా ??అతనికే తెలియలేదు .మౌనం గా చీకటిలో నడక సాగిస్తూ సాగిస్తూ వెలుగు లోకి వచ్చాడు .మైథిలి వాక్యాలు చెవిలో మారుమ్రోగుతున్నాయి .అతనిలోని జడత్వం జ్యోతిలో లీనమయ్యింది .బంధాలు తెగిపోయాయి .సర్వసంగ పరిత్యాగిగా ఉషోదయపు ధవళకాంతులలో దరిచేరని తీరాన్ని అన్వేషిస్తూ సాగిపోయాడు .

మరిన్ని కథలు

Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు
Pratibha
ప్రతిభ
- చెన్నూరి సుదర్శన్
Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు