సాధారణంగా మనం ఏదో ఒక ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళినప్పుడు ఆ పని పూర్తి కాక పోవడం వలన కానీ, మనకు అనుకోకుండా ఒక ప్రమాదం జరిగినప్పుడు గాని, నిష్కారణంగా ఎదుటి వారి నుండి అపనిందను ఎదుర్కొన్నప్పుడు గాని, మనకు ఎటువంటి సంబంధం లేని విషయంలో మనల్ని దోషులుగా భావించి దురుసుగా ప్రవర్తించి మర్యాదకు భంగం కలిగించిన సందర్భాల్లో తమ తమ సహజసిద్ధమైన నమ్మకాలను ప్రక్కనబెట్టి "ఈరోజు పొద్దున్నే ఎవరి మొహం చూసామో! లేదా ఈరోజు లేచిన వేళా విశేషం మంచిది కాదేమో!" అని అందరం అనుకుంటాం. నేటి సమాజంలో దాదాపు అందరి చేతిలో ఇంటర్నెట్ సదుపాయం కలిగిన సెల్ ఫోన్ చేతిలో ఉండటం వలన బయటకు వెళ్ళటానికి అవసరం లేకుండానే సకల పనులను చక్కబెట్టుకోగలిగిన పరిస్థితులు ఉన్నా... ఈ మాధ్యమాన్ని దుర్వినియోగ పరిచే సమాజంలోని కొందరు వ్యక్తుల ద్వారా గౌరవప్రదంగా బ్రతుకుతున్న వయోవృద్ధులకు కూడా అపనిందలు ఎదురవుతున్నాయి ... అనడానికి ఉదాహరణంగా ఈ మధ్య కాలంలో జరిగిన ఒక సంఘటన గురించి వివరిస్తాను అది మధ్యాహ్నం 2:30 ప్రాంతం. మధ్యాహ్నం నిద్రకు అలవాటు పడిన నా శరీరం ఆ సమయంలో నిద్ర లోకి జారుకుంది. మా శ్రీమతి అప్పుడే భోజనం చేసి, బెడ్ రూం తలుపు దగ్గరకు వేసి, తనకు నచ్చిన సీరియల్ ఏదో వీక్షిస్తూ ఉంది. 2:40 ప్రాంతంలో మా శ్రీమతి ఫోన్, పరిచయము లేని ఒక కొత్త వ్యక్తి ద్వారా రింగ్ అవటంతో "హలో ఎవరూ? "అని ఈవిడ పలకరింపు తోనే అవతలి వ్యక్తి" ఎవరే నువ్వు? వాడికి ఫోన్ ఇవ్వు! "అనే కరుకైన మగ గొంతు వినపడటంతో అసహనానికి గురైన మా ఆవిడ సింపుల్ గా ఫోన్ కట్ చేసింది. కానీ అవతలి వ్యక్తి విడువకుండా తిరిగి ఫోన్ చేయడం, ఈవిడ కట్ చేయడం జరిగిపోతున్నాయి. చివరకి ఫోన్ సైలెన్స్ మోడ్ లో పెట్టి తను కూడా రెస్ట్ తీసుకోవాలని నా రూమ్ లోకి వచ్చింది. మగత నిద్రలో ఉన్న నాకు రింగ్ అయిన శబ్దం వినపడంతో "ఎవరి ఫోన్ అది !అన్నిసార్లు రింగ్ అవుతుంది !"అని అన్నాను. "ఎవరో వెధవ లెండి !ఏదో నెంబర్ అనుకొని ఫోన్ చేస్తున్నట్లు ఉన్నాడు. ఫోన్ సైలెన్స్ లో పెట్టా"నంది . తిరిగి నాలుగున్నర ప్రాంతంలో ఫోన్ ఆన్ చేసి ఎవరైనా పరిచయస్తుల నెంబర్ ఏమోనని గమనించాను. అప్పటికే ఆ నంబర్ నుండి దాదాపు 10 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. ఫోన్ ఆన్ చేసిన ఐదు నిమిషాలకి తిరిగి ఆ నంబర్ నుండి కాల్ వచ్చింది నేను సమాధానంగా ....హలో.. అని అన్నాను. అవతలి వ్యక్తి వెంటనే "ఏరా బాడ్కౌవ్.. ఫోన్ కట్ చేస్తావు "అని అన్నాడు. దానికి ప్రతిస్పందిస్తూ వెంటనే నేను "నీవు ఎవడివి రా! పరిచయం లేని వ్యక్తులతో మాట్లాడే విధానం ఇదేనా? ఎందుకు ఫోన్ చేస్తున్నావు ?"అని అన్నాను. వాడు తిరిగి మాట్లాడుతూ వ్రాయటానికి ఇబ్బంది పడే పదజాలంతో దూషిస్తూ "నీ మెసేజెస్, కాల్స్ రికార్డ్ చేసి నీమీద పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాను" అని ఇంకా ఏదో చెప్పబోయాడు. నేను ఇతను ఏదో తప్పుడు సమాచారంతో ఇలా ప్రవర్తిస్తున్నాడనుకుని ఫోన్ కట్ చేశాను. కానీ అతడు మరలా మరలా విసిగించడంతో ఆ నంబర్ ని బ్లాక్ చేయడం జరిగింది. పట్టువదలని విక్రమార్కుడిలా అతను తిరిగి మరో కొత్త నెంబర్ నుండి పదినిమిషాల తర్వాత ఫోన్ చేసి అదే కంఠస్వరంతో బూతు పురాణం వల్లిస్తూ" నా ఫోన్ ఎలా బ్లాక్ చేస్తావు? నీ అంతు చూస్తాను! "అంటూ ఇంకా ఏదేదో అనే లోపల కట్ చేసి ఆ నంబరు కూడా బ్లాక్ చేశాను. నేను మా శ్రీమతి ఇద్దరం కూర్చుని 'ఈ కార్తీక సోమవారం మౌనంగా ఉండవలసిన రోజు .ఇదేమి చిత్రమో!ఇలాంటి అపనింద పాలు అవుతున్నా'మనుకొని బాధపడ్డాం. ఈరోజు నిద్ర లేచిన వేళా విశేషం మంచిది కాదేమో అని సరిపెట్టుకోకుండా ,ఈ సంఘటన పూర్వాపరాలు తెలుసుకోవాలనే ఉత్సుకతో సబ్ ఇన్స్పెక్టర్ గా పనిచేసి పదవీ విరమణ చేసిన మా తమ్ముడికి విషయం చెప్పి ,ఈ రెండు ఫోన్ నెంబర్ లను అతనికి పంపించాను. తన పూర్వ పరిచయంతో అదే డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న వ్యక్తుల ద్వారా ఆ ఫోన్ నెంబర్ వ్యక్తుల యొక్క అడ్రస్లు సేకరించి ,తిరిగి అతనికి తన నెంబర్ ద్వారా ఫోన్ చేసి, పోలీసు భాషలో దబాయించడం ద్వారా నిజం తెలియ వచ్చింది. అసలు విషయానికి వస్తే అవతలి వ్యక్తి యొక్క ఆరోపణ ప్రకారం మా ఆవిడ ఫోన్ నెంబర్ నుండి ,ఇంటర్మీడియట్ చదువుతున్న తన చెల్లెలికి వేదనకు గురి చేసే అశ్లీలమైన చిత్రాలతో కూడిన సందేశాలు వస్తున్నట్లు... అది పంపుతున్నది ఈ నెంబర్ నుండి అని అనుకుని, వాటిని పంపుతున్న వ్యక్తిగా నన్ను నిర్ధారించుకుని, ఆవేశంతో అలా ప్రవర్తించినట్లు తెలియజేస్తూ, తన చెల్లికి వచ్చిన సందేశాలను మా తమ్ముడికి ఫార్వర్డ్ చేశాడు. అతను చెప్పినట్లే అవి అసభ్య పద ప్రయోగమే. కానీ అందులో మనకు బోధపడని విషయం ఏమిటంటే ఆ మెసేజ్ పంపిన వ్యక్తి యొక్క ఫోన్ నెంబరులోని మొదటి ఎనిమిది నంబర్లు మా ఆవిడ ఫోన్కి సంబంధించినవే.కానీ ఆఖరి రెండు నంబర్లు కనిపించకుండా డాస్ డాస్.. గా ఉంది. పోలీసు వారి టెక్నాలజీ ఉపయోగించి పూర్తి నంబరును బయట పెట్ట గలిగాడు మా తమ్ముడు. మా శ్రీమతి ఫోన్ నెంబర్ లోని ఆఖరి రెండు నెంబర్లు...58. అసలు దోషి యొక్క ఆఖరి నంబరు.. 85. ఇక్కడే అవతలి వ్యక్తి తనకు తెలిసిన కంప్యూటర్ పరిజ్ఞానంతో నంబర్ ని తారుమారు చేశాడు. అసలు విషయం తెలుసుకున్న తర్వాత ఎవరైతే మమ్ములను దుర్భాషలాడాతూ నిందించాడో అదే వ్యక్తి పదే పదే క్షమాపణలు అడిగి తప్పు జరిగిపోయింది అని ప్రాధేయపడ్డాడు .ఈ ప్రక్రియ అంతా ఒక 15 నిమిషాల్లోనే జరిగిపోయింది. కొసమెరుపు...... ---------------------- దుర్భాషలాడిన వ్యక్తియొక్క అభ్యర్థన మేరకు అసలు దోషిని పట్టించడంలో మా తమ్ముడు సహకరించి, తన పలుకుబడితో దీనికి సృష్టికర్త మెదక్ జిల్లాలోని రామాయణంపేట వ్యక్తిగా గుర్తించి, పోలీసులకు అప్పజెప్పి ,దేహశుద్ధి చేసి, తిరిగి అటువంటి తప్పుడు పనులు చేయనని హామీతో కథ సుఖాంతమైంది. తన చెల్లి విషయము లో జరిగిన ఈ సంఘటన తీవ్రత దృష్ట్యా ,తోబుట్టువు అయిన అన్న అలా ప్రవర్తించడం సహజమే! కేవలం ఒక్క మాట సహాయమే అమాయకుడైన ఒక బాధితుడికి ఉపశమనం కలిగింనదులకు సంతోషిస్తూ అతను వ్యక్తపరచిన కృతజ్ఞతలే మాకు కార్తీక మాసాంతములో లభించిన ఫల శృతి- అనుకున్నాం !! ***