" నేను చదువుకుంటాను నాన్నగారూ "అన్నది ఉష .
'అలాగేనమ్మా , చదివిస్తానమ్మా "అన్నారు కృష్ణమూర్తిగారు .
సంతోషంగా లోపలికి వెళ్లింది ఉష . కూతుర్ని నిట్టూర్చాడు కృష్ణమూర్తి . ఉషకు మూడో సంవత్సరం పుట్టినరోజునాడు ఉష తల్లి చీరకు మంటలంటుకుని నిమిషాల్లో చనిపోయింది . ఆ సంఘటన వాళ్ల అందమైన జీవితాలనే మార్చింది . కృష్ణమూర్తి తల్లి ,తండ్రి తానే గా మురిపెంగా ,ముద్దుగా పెంచుతున్నారు . ఆర్ధికం గా యే సమస్యలూ లేవు . అయన ఆశలు ,ఆశయాలూ భవిష్యత్తూ అన్నీ అన్నీ ఉష చుట్టే అల్లుకున్నాయి . ఉష కూడా అందుకు అనుగుణంగా ఆయన ఆశలకు ఆశయాలకు అనుగుణం గా చదువుకుంటూ బళ్లో తెలివైన విద్యార్ధినిగా పేరు తెచ్చుకుంది . ప్రస్తుతం ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం పరీక్షలు వ్రాసింది . ఆ ఊళ్లో చాలామంది వైద్యం కోసం దూరపు ప్రాంతాలకు వెళ్లడం వసతులు లేక ,డబ్బులు సరిపోక బాధపడడం ఉష గమనిస్తూ వుంది . అందుకే ఎం . .బి . బి ఎస్ చదివి తన వూళ్లో క్లినిక్ పెట్టి అందరికీ సేవ చెయ్యాలని కోరిక . అంతేకాదు తన భావి జీవితాన్ని గురించి కొన్ని అభిప్రాయాలు వున్నాయి . తనకంటూ ఒక గుర్తింపు వుండాలని ,ప్రత్యేకత వుండాలని ,కోరిక .
కృష్ణమూర్తి గారికి చదివించడం యిష్టమే కానీ ఉషను వదిలి వుండలేరు . ఉషతో పాటు మరో వూళ్లో వుండడానికి ఆయనకు యిష్టం లేదు . ఇంతలొ కొందరు బంధువులు ఉషకు పెళ్లి చేసి యిల్లరికం అల్లుణ్ణి తెచ్చుకోమని సలహా యిచ్చారు . మొత్తానికి ఉష ఇంటర్మీడియట్ మెరిట్ మార్కులతో ప్యాసయ్యింది . కానీ మెడికల్ లో సీటు దొరకలేదు . ఉషకు మొదటిసారి వూహించని వైఫల్యం . తట్టుకోలేకపోయింది . చదవాలనే ఆసక్తికూడా తగ్గింది .
"ఉషా ,జీవితం కేవలం చదువే కాదమ్మా ,నువ్వు కోరుకున్నట్టు మనవూళ్ళో క్లినిక్ పెట్టుకుందాం . మన వూళ్లో డిగ్రీ కాలేజీలో చేరు ,నీ కోరిక నెరవేర్చే బాధ్యత నాది "అంటూ కృష్ణమూర్తి గారు ఉషకు నచ్చచెప్పారు . నాన్న ప్రేమ ,ఆప్యాయతలో పెరిగిన పిల్ల కాబట్టి ఆయన మాట ప్రకారం డిగ్రీలో చేరింది . ఉషకు సాహిత్యం యిష్టం . బి . ఏ లో చేరింది . క్రమం గా చదువు మీద ఆసక్తి ,ఉషారు కాలేజీలో కూడా తెలివైన విద్యార్ధినిగా పేరు తెచ్చుకుంది . సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటూ అందమైన హరివిల్లును తనచుట్టూ అల్లుకుంది . కృష్ణమూర్తిగారు కూతురు ఆనందానికి మురిసిపోయారు . జీవితం హాయిగా గడిచిపోతున్నది .
ఉష డిగ్రీ రెండో సంవత్సరం ముగించింది . సెలవులిచ్చేసారు . ఉష ఫ్రెండ్సంతా ఢిల్లీ టూర్ పదిహేను రోజులు ప్రోగ్రాం వేసారు . ఉషకు వెళ్లాలని వుంది కానీ నాన్నను ఒంటరిగా వదిలి వెళ్లాలంటే బెంగగా వుంది . ఆయనకూ దిగులే కానీ కూతుర్ని నిరుత్సాహపర్చడం యిష్టం లేదు . ప్రోత్సహించి ఉష ను పంపారు . మొదటిసారి ఉష ను వధిలి అన్ని రోజులు వుండడం ఆయనకు దిగులుగా వుంది . తోచక స్నేహితుడు రాంమూర్తి దగ్గరకు వెళ్లారు .
"కృష్ణమూర్తి ,యీ పదిరోజులకే అంత దిగులు పడితే ,ఉష పెళ్లయ్యి అత్తారింటికి వెళ్లిపోతే అప్పుడయినా అమ్మాయి నీ దగ్గర వుండదుగా !"అంటూ ఒకవిధంగా మనోనిబ్బరాన్ని యిచ్చేవారు రాంమూర్తి . కృష్ణమూర్తి కూడా ఉష యేనాటికైనా ఆడపిల్లే కానీ యీడపిల్ల కాదుగా అనుకునే వారు .
ఉష ఢిల్లీ ట్రిప్ సరదాగా జరుగుతున్నది . అందరూ కలిసి కొన్ని రిసార్ట్స్ తీసుకున్నారు . రోజుకొక స్పాట్ చూస్తున్నారు . ఆ రోజు తాజమహల్ చూడాలని ఆగ్రా ప్రోగ్రాము ఫిక్స్ అయ్యింది ఉష సహజం గా భావుకురాలు చలువరాతి తాజమహల్ అందాన్ని నిండు పౌర్ణమి కాంతుల్లో చూడాలని యెన్నాళ్లనించో అనుకుంటున్నది . చల్లని సాయంకాలం ,యమునా తరంగాలలో వుయ్యాలలూగే ధవళకాంతుల తాజమహల్ చూడాలని ఉష మనసు విరబూసిన సుమధుర మల్లెపందిరయ్యింది . అందమైన ప్రణయసౌధాన్ని చూడడానికి ఉష అందం గా తయారైయ్యింది . ఇంతలో నాన్న దగ్గర్నించి ఫోన్ వచ్చింది . నేలమీద జారిపడి తలకు దెబ్బతగిలి పరిస్థితి విషమం గా వుందని తెలిసింది . ఉష కన్నీళ్లతో ఫ్రెండ్స్ అందరికీ వీడ్కోలు చెప్పి యింటికి బయల్దేరింది .
తండ్రిని ఆ స్థితిలో చూస్తుంటే ఉష దుఃఖం ఆపుకోలేకపోయింది . దగ్గరుండి వేళకు మందులిచ్చి కంటికి రెప్పలా చూసుకుని మామూలు మనిషిని చేసింది . అప్పుడే కృష్ణమూర్తిగారికి ఉషకు పెళ్లి చెయ్యాలన్న ఆలోచన వచ్చింది . ఉషకు ఒక సంవత్సరం చదువుతే డిగ్రీ చేతికొస్తుంది . పోస్టుగ్రాడ్యుయేషన్ చెయ్యాలని అందులోనూ సాహిత్యంలో చెయ్యాలని ఉష కోరిక .
ఒకరోజు కృష్ణమూర్తిగారు హడావిడిగా వచ్చి ఉషను పెళ్ళిచూపులకు తయారవమన్నారు .అర్ధం కాక ఉష వెర్రిమొహం తో నాన్నను చూసింది .
“అవునమ్మా ,నా ఆరోగ్యం బాగున్నప్పుడే నీకు పెళ్లి చేస్తే నాకు తృప్తిగా వుంటుంది .ఈ వూరి సంబంధమే !నా ఫ్రెండ్ రాంమూర్తి అన్నయ్య కొడుకు బ్యాంకు లో పనిచేస్తున్నాడు .ఇక్కడ ఒక్కదానివిగా పెరిగావు ,అక్కడ ఒక ఆడపిల్ల ,ఒక తమ్ముడు యితనికి వున్నారు . మంచి కుటుంబం అని చెప్పాడు రాంమూర్తి !ఇంకో రెండు గంటల్లో వాళ్లు వస్తారు “అన్నారు కృష్ణమూర్తి గారు .
ఉష కన్నీళ్లతో "నాన్నా "నా చదువు యింకా పూర్తి కాలేదు ,నాన్నా నీకు నేను అంత భారమయ్యానా "అన్నది .
ఆ ప్రశ్నకు ఆయన మనసు గిలగిలలాడింది /. "పిచ్చితల్లి యెంత చదివినా ,యెంత సిరిసంపదలున్నా యెదిగిన ఆడపిల్లకు పెళ్లి చెయ్యకపోతే లోకం నన్ను క్షమించాడమ్మా ,పైగా నేను నిన్ను బిడ్డా పాపలతో చూడాలనీ ,వాళ్లను నా చేతులతో ఆడించాలని నా కోరికమ్మా " అన్నారు .
తండ్రినే చూస్తూ వుండిపోయింది . డాక్టరు అవ్వాలన్న కోరిక తీరలేదు ,కనీసం డిగ్రీ ముగించి సాహిత్యంలో పోస్టుగ్రాడ్యుయేషన్ చెయ్యాలన్న కోరిక కూడా తీరడం లేదు ,ఏమిటీ యీ అవాంతరాలు ! అన్నీ తెలిసిన నాన్నే యిలా మాట్లాడితే తను ఏం చెయ్యగలదు ? ఉషకు ఆవేదన ,అశాంతి మొదలయ్యాయి . కానీ పుట్టి బుద్దెరిగినప్పటినించీ నాన్న మనసు కష్టపెట్టకుండా ఆయన మాటకు గౌరవమిస్తూ కట్టుబడుతున్నది .
శ్రీధర్ కి ఉష నచ్చింది , అతని తల్లితండ్రులకు అంగీకారమయ్యింది . వారం లోపలే వున్నంతలో ఘనంగా పెళ్లి జరిగింది అత్తవారింట్లో అందరూ చదువుకున్న వాళ్లే ,అందువల్ల తను పై చదువులు చదువుకుంటానంటే ఒప్పుకుంటారని సంతోషించింది . అత్తగారు తమ పరిచయస్తుల దగ్గర తన సంస్కారాన్ని పొగుడుతుంటే ఆనందించింది . భర్త శ్రీధర్ ఉషను ప్రేమగా చూసుకుంటున్నాడు . ఉష డిగ్రీ ఫైనల్ కోసం కాలేజీ లో చేరుతానని భర్తకు చెప్పింది . అత్తగారు ఒప్పుకున్నారు . ఆ విధం గా ఉష యింట్లో అత్తగారికి వంట పనిలో సాయం చేసి త్వరగా పనులు ముగించుకుని తయారయ్యేది . శ్రీధర్ బ్యాంక్ కు వెళ్లేటప్పుడు ఉషను కాలేజీలో దింపేవాడు . రోజులు హాయిగా గడిచిపోతున్నాయి . ఉష పట్టుదలతో బాగా చదువుకుంటున్నది . పరీక్షలు దగ్గరకొస్తున్నాయి కానీ ఉష కు ప్రసవించే రోజులు కూడా యించుమించు పరీక్షల సమయమే !ఒకవేళ పరీక్షలు వ్రాయలేక[ పొతే ఉషకు దిగులుగా వుంది . అదేమాట శ్రీధర్ తో అన్నది . శ్రీధర్ నవ్వేసాడు .
." ఉషా ,ఎక్కువగా ఆలోచించకు ,మన పుట్టబోయే బిడ్డకన్నా యే పరిక్షలు ముఖ్యం కాదు . చదువూ ,పరీక్షలూ ఎప్పుడయినా కుదురుతుంది . మాతృత్వం అపురూపవరం ,అందుకే నెలలు దగ్గరకొచ్చాయి ,కాలేజీ మానేసి యింటిపట్టున వుండు "అన్నాడు శ్రీధర్ .
ఉష చదువు అటకెక్కింది . పండంటి మగబిడ్డ పుట్టాడు . ఇప్పుడు ఉష ప్రపంచం చిట్టి పాపే !చదువు దాదాపు కుదరనట్టే ! . శ్రీధర్ కి మరోచోటికి బదిలీ అయ్యింది . పసిబిడ్డతో ఉష భర్తతో కలిసి పట్టణానికి బయల్దేరింది . వెళ్లేముందు తండ్రిని కలిసింది .
కృష్ణమూర్తిగారు " అమ్మా ఉషా ,నా మనవణ్ణి చూసాను ,యింతకన్నా ఏం కావాలి !ఉషా జీవితాన్ని చదువుకో ,భర్తా ,బిడ్డలూ అనే పరీక్షలలో అత్తవారింట్లో మంచి గుర్తింపు తెచ్చుకో " దీవించారు .
ఎడారిలో యెండమావిలాగా ఉష చదువు ఆగిపోయింది కానీ అరుదుగానయినా యెడారిలో వర్షం కురిసి చిగురించే వసంతం కోసం ,ఉషోదయం కోసం యెడారి కోయిల యెదురుచూస్తున్నది .
ఉష లాంటి అమ్మాయిలు మనచుట్టూ యెందరో వున్నారు ,జీవితాన్ని వున్నంతలో ఆస్వాదించడమే నిండయిన జీవనపయనం !
.
.