బంధం - లత కందికొండ

Bandham

పల్లవికి ఆ రోజు పెళ్ళిచూపులు జరిగాయి. పెళ్ళివారు వెళ్ళిపోగానే ‘‘అక్కా! అతను`అదే చరణ్‌`నీకు నచ్చేడా?’’ అడిగింది ప్రణతి.

‘‘ఎందుకు నచ్చడూ? లక్షణంగా వున్నాడు. మంచి కటుంబం. మంచి చదువు, మంచి ఉద్యోగం, అంతకంటే ముఖ్యంగా కట్నం లేకుండా చేసుకుంటామని మనల్ని వెతుక్కుంటూ వచ్చారు. నిక్షేపం లాంటి సంబంధం’’ అంది ఇందిర.

‘‘అమ్మా! నేను అడిగింది అక్కని, దాన్ని చెప్పనీ!’’ తల్లి మాటలకు అడ్డు తగులుతూ అంది ప్రణతి.

‘‘అక్కా! నిన్నే అడుగుతోంది నీ ఉద్దేశమేంటో చెప్పవేంటీ?’’ పల్లవిని రెట్టించి అడిగింది ప్రణతి.

‘‘ఒక మనిషిని చూసి, అతని బయోడేటా చూసి, ఇష్టాయిష్టాలు చెప్పమంటే యిదేమైనా ‘లవ్‌ ఎట్‌ ఫస్ట్‌సైటా!’ అతని అందం గురించా నువ్వడుగుతున్నది, లేక అతని అలవాట్ల గురించా? అందం గురించి అయితే నేనెందుకు? నువ్వూ చూసేవుగా! మా ఇద్దరిని ప్రక్కప్రక్కన చూస్తే నీకేమనిపించింది?'తగిన జోడీ' అనిపించిందా లేదా, నువ్వే చెప్పాలి. అతనెలాంటి వాడో తెలియాలంటే ఎలా సాధ్యం? వాళ్ళు పట్టుమని పావుగంట కూడా మనింట్లో లేరు. వచ్చేరు, చూసేరు, బయోడేటా, జాతకం ఇచ్చి ‘‘మీ అమ్మాయి ఫోటో వివరాలు చూసి వచ్చాం. జాతకాలు కూడా సరిపోయేయన్నారు. మాకు నచ్చింది. మీకూ నచ్చితే కబురు చెయ్యండి అన్నారు. ఆ మాత్రానికే వాళ్ళేంటో ఎలా తెలుస్తుంది. ఇంక మంచి ఉద్యోగం అంటావా! ఆమాత్రం ఉద్యోగం నేనూ చేస్తున్నాను. ఏ మాటకామాటే చెప్పుకోవాలి. అతని అన్నయ్య పిల్లలు మాత్రం నాకు తెగ నచ్చేసారు. భలే ముద్దుగా వున్నారు కదూ’’ అంది పల్లవి.

‘‘నిన్ను అడిగిందేంటి? నువ్వు చెప్పిందేంటి?’’ మళ్ళీ పల్లవిని రెట్టించి అడిగింది ప్రణతి.

‘‘నువ్వు చెప్పు! నీకెలా అన్పించారు? అడిగింది చెల్లిని పల్లవి.

‘‘నీ అందానికి తగడక్కా! వాళ్ళకి - ‘మాకు నచ్చలేదు ’అని చెప్పేయమ్మా!’’ అంది ప్రణతి.

‘‘నువ్వు నోరుమూస్తావా కాసేపు! నీక్కాదుగా సంబంధం చూసింది. నాకైతే అన్నివిధాలా నచ్చిందమ్మా! అందందేముంది? కలకాలం ఉంటుందా? రేపు పెళ్ళయ్యాక, పిల్లలు పుట్టేక, నువ్వు కూడా ఒళ్ళు చేస్తావు. ఇప్పటికి ఎన్ని సంబంధాలు తప్పిపోయాయో నీకే తెలుసు. జాతకాలు కలవలేదనీ, గోత్రం ఒకటైందనీ, శాఖవేరనీ, మగదిక్కులేని సంసారమనీ, లక్షల్లో కట్నం కావాలనీ` ఇలా ఎన్ని జరగలేదు? మీ నాన్నగారు పోయాక ఎలాగోలా ఈ సంసారాన్ని ఈదుకొచ్చి మిమ్మల్ని చదివించేను. నీ తర్వాత అది కూడా పెళ్ళికి సిద్ధంగా ఉంది. నీకుతెల్సుగా లక్షలు కుమ్మరించి మీ పెళ్ళిళ్ళు చేసే స్తోమత నాకు లేదని’’ కన్నీళ్ళు పెట్టుకుంది ఇందిర.

‘‘ఇప్పుడేమైందని ఏడుస్తున్నావమ్మా! నేను వద్దని చెప్పలేదుగా! నీ ఇష్టాన్ని నేను ఎప్పుడన్నా కాదన్నానా? అయినా అతను ఒకసారి సాయంత్రం బయట కలిసి మాట్లాడదామన్నాడు. వెళ్ళనా?’’ అడిగింది పల్లవి.

‘‘నా బలవంతంతో కాకుండా అతనితో మాట్లాడి నీకు పూర్తిగా ఈ పెళ్ళి యిష్టమైతేనే చేస్తాను తల్లీ!’’ అంటూ కూతుళ్ళిద్దరిని దగ్గరకు తీసుకుంది ఇందిర.

* * *

ఆ సాయంత్రం పల్లవి, చరణ్‌లు పార్క్‌లో కూర్చున్నాక చెప్పడం మొదలు పెట్టాడు. ‘నా చిన్నప్పుడే మా అమ్మా, నాన్న ఏక్సిడెంట్‌లో పోతే మా అన్నయ్యే నాకుదేనికీ లోటు లేకుండా పెంచి పెద్ద చేసేడు. అన్నయ్య పెళ్ళి అయ్యేక మా వదిన కూడా నన్ను తన సొంత తమ్ముడిలా చూసుకునేది,చూసుకుంటోంది. నేను ఈ రోజు యింత పెద్ద పొజిషన్‌లో ఉన్నానంటే వాళ్ళిద్దరే కారణం. వాళ్ళకి ఇద్దరు పిల్లలు. చూసేరుగా వాళ్ళని. రిషి, రమ్య. వాళ్ళంటే నాకు ప్రాణం. వాళ్ళకి అన్నయ్య కంటే కూడా నా దగ్గరే ఎక్కువ అలవాటు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, పెళ్ళయ్యాక మనమంతా కలిసి ఒకే ఇంట్లో ఉండాలని నా కోరిక. మీరు కాదనరనుకుంటాను.’

‘‘దానిదేముందండీ! చిన్నపిల్లలంటే నాకు కూడా చాలా ఇష్టం. ఇంక మీ అన్నావదినల గురించి అంటారా, మీ అమ్మా, నాన్నలు బ్రతికి వుంటే మనం అంతా కలిసి ఉండే వాళ్ళమా కాదా! అలాగే ఇప్పుడు అన్నావదినలనుకుంటాను. ఆ విషయం గురించి మర్చిపోండి.’’

‘‘హమ్మయ్యా!’’ గట్టిగా నిట్టూరుస్తూ, కూర్చున్నవాడు కాస్తా కొంచెం వెనక్కి ఒరిగాడు చరణ్

‘‘అదేటండీ! అంతలా నిట్టూర్చారు?’’

‘‘అదేం లేదండీ! మీరెక్కడ కాదంటారోనని భయపడ్డాను. ఈ రోజుల్లో ఎవరు చూసినా న్యూక్లియర్‌ ఫ్యామిలీస్‌నే కోరుకుంటున్నారు కదండీ! మీరు కూడా అలాగే మన పెళ్ళి అయ్యేక వేరు కాపురం పెడదామంటారేమోనని చాలా భయపడ్డాను. ఇప్పుడు మీరు అభయం యివ్వడంతో నాకు చాలా తృప్తిగా వుంది. ఇంక పెళ్ళి ముహూర్తాలు వెంటనే పెట్టించమని చెప్పనా?’’ఆత్రంగా అడిగేడు చరణ్

‘‘పోనీ, ఇప్పుడే ఈ పార్కులోనే చేసేసుకుందామా’’ కొంటెగా అడిగింది పల్లవి.

‘‘వైనాట్‌! నా మెళ్ళో గొలుసు తీసి మీ మెళ్ళో వేసేస్తా! సగం పెళ్ళి అయిపోయినట్లే! తక్కినది అటు అన్నయ్యా వాళ్లూ , ఇటు మీ అమ్మగారు చూసుకుంటారు. ఏమంటారు?’’ అన్నాడు మెడలో గొలుసు తియ్యబోతూ. ‘‘అంత ఓవర్‌యాక్షన్‌ అక్కర్లేదులేండి. మీతో ఏది వచ్చినా తట్టుకోవడం కష్టమన్నమాట’’ నవ్వుతూ అంది పల్లవి.

* * *

పల్లవి, చరణ్‌ల పెళ్ళి వాళ్ళు కోరుకున్నట్లుగానే అట్టహాసంగా కాకుండా ముఖ్యమైన బంధుమిత్రల సమక్షంలో నిరాడంబరంగా జరిగింది. పెళ్ళి అయి చరణ్‌ ఇంట్లో అడుగుపెట్టిన పల్లవిని, ఏ పనీ చేయనిచ్చేది కాదు కల్పన. ‘నువ్వు కొత్త పెళ్ళికూతురివి తల్లీ! హాయిగా మీ ఆయనతో కబుర్లు చెబుతూ కూర్చో` మైహూనా!’’ అంటూ వంటగది వైపే రానిచ్చేది కాదు.

పెళ్ళికి తీసుకున్న శెలవులైపోయి పల్లవి చరణ్‌ ఉద్యోగంలో చేరేక కూడా అంత అపురూపంగానూ చూసేది పల్లవిని. వాళ్ళని చూస్తే ఎవరూ తోడికోడళ్ళు అని అనుకోరు. ‘‘అక్కా! నేనేం చేయకుండా అంతా నువ్వే చేస్తోంటే - నాకు గిల్టీ గా ఉంది’ అని పల్లవి అంటే ‘‘చూడమ్మా! నా పిల్లలకీ , చరణ్‌కీ, కార్తీక్‌లకీ వండడం, టిఫిన్‌ బాక్స్‌లు సర్దడం ఇదివరకు చేసేదాన్ని కాదూ నేను? ఇప్పుడు వాళ్ళతో పాటు నీకూ కలిపి చేయలేనా ఏంటి?’’ అంటూ పల్లవి ఎంత చెప్పినా వినకుండా వంటింటి ఛాయలకి కూడా రానిచ్చేది కాదు కల్పన.

అలా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతోంది పల్లవి జీవితం.

ఆరోజు - ఆఫీసు నుండి త్వరగా వచ్చేసింది పల్లవి. చరణ్‌ ఎప్పుడొస్తాడోనని ఎదురు చూస్తోంది. కల్పనా కార్తీక్‌ - పిల్లలిద్దరినీ వాళ్ళ ఫ్రెండ్‌ ఇంట్లో పుట్టినరోజు పార్టీ వుందని అక్కడ దింపి, అటునుంచి అటే ‘సత్‌సంగ్‌’ కి వెళ్ళి, వచ్చేటప్పుడు పిల్లలని తీసుకొస్తామని చెప్పి వెళ్ళారు.

పల్లవి చరణ్‌ రాక కోసం ఆత్రంగా ఎదురు చూస్తోంది. ఇంతలో చరణే ఫోన్‌చేసి ‘‘పల్లవీ! నువ్వు అర్జంటుగా ఇంటి దగ్గరున్న అపోలో హాస్పిటల్‌కి రా! అన్నయ్యా వాళ్ళ బైక్‌ని లారీ గుద్దిందట’’ కంగారుగా చెప్తూ ఫోన్‌ పెట్టేసాడు.

పల్లవికి కాళ్ళూ చేతులు ఆడలేదు. ఏమై ఉంటుందని భయంవేసింది. ఇంటికి తాళం వేసి హాస్పటల్‌కి బయల్దేరింది.

పల్లవి, చరణ్‌ చేరేసరికి - అక్కడ కార్తీక్‌ శవమై పడి ఉన్నాడు. కొనవూపిరితో ఉన్న కల్పన కళ్ళలో వాళ్ళని చూడగానే ' ఆరిపోయే ముందు వెలిగే దీపంలాగా' చిన్న వెలుగు వెలిగింది. ‘‘పి..ల్ల..లు... జా..గ్ర..త్త.....’’ అంటూ ఆ మాట చెప్పడానికే బ్రతికి ఉన్నట్లు కళ్ళు మూసింది.

అన్నా, వదినా పోయి ఏడాది దాటినా చరణ్‌ యింకా కోలుకోలేదు. యాంత్రికంగా ఆఫీస్‌కెళ్ళి రావడం మాత్రం దినచర్యలో ఒక భాగంగా చేసుకున్నాడు.

ఇటు చరణ్‌తో పాటు పిల్లలిద్దరినీ కూడా సముదాయించడం పల్లవికి చాల కష్టమైపోయింది. ఇటు ఇల్లు అటు ఆఫీస్‌, ప్లిలల స్కూల్‌. అలవాటులేని పనులంతా తలమీద పడడంతో తలమునకలవసాగింది. పల్లవి రోజూ పిల్లలని లేపడం దగ్గరినుంచి వాళ్ళని స్కూల్‌కి తయారు చేయడం, వాళ్ళ బాక్సులు సర్ది పంపడం, ఇంటి పనులన్నీ చక్కబెట్టుకుని చరణ్‌తో పాటు తనూ ఆఫీస్‌కి వెళ్ళడం, ఆఫీస్‌ నుంచి వచ్చి మళ్ళీ వంట, పిల్లల హోంవర్క్‌- వీటితో ` జీవితం మెకానికల్‌గా తయారైంది పల్లవికి. పని వత్తిడితో విసుగు చికాకు కూడా వచ్చేవి. ఆ చికాకు, కోపం, పిల్లలమీద, చరణ్‌మీద చూపడం జరిగేది ఒక్కోసారి. చిన్న చిన్న విషయాలని కూడా భూతద్దంలో నుండి చూడడం మొదలుపెట్టేడు చరణ్‌.

ఒకరోజు - ‘‘రమ్యా! హోంవర్క్‌ చేసేవా!’’ అడిగింది పల్లవి.

‘‘ఇంకా లేదు’’ టీవీ చూస్తూ జవాబిచ్చింది రమ్య.

‘‘ఏంటా సమాధానం? ఇప్పుడు టీవీ చూస్తూ కూర్చొని ప్రొద్దున్న నా దగ్గరకి వస్తే మాత్రం నా వల్ల కాదని ఎన్నిసార్లు నీకు చెప్పేను? 7 గంటలనుండి 9 గంటల వరకు మీ ఇద్దరూ కూర్చొని రోజూ చదువుకోవాలని చెప్పేనా, లేదా!’’ అంటూ రమ్య చేతుల్లో రిమోట్‌ లాక్కుని టీవీ ఆపింది.

‘‘రిషీ! నీకు విడిగా చెప్పాలా! సెల్‌ఫోన్‌లో ఆ పిచ్చి ఆటలు ఆడొద్దని ఎన్నిసార్లు చెప్పేను ? లేచి చదువుకో’’ అంటూ వాడి చేతిలో ఫోను లాక్కుంది.

దాంతో ఇద్దరూ ‘‘బాబాయ్‌!’’ అని చరణ్‌ దగ్గరకి ఏడ్చుకుంటూ వెళ్ళి కంప్లయింట్‌ చేసేరు.

‘‘పల్లవీ! చిన్నపిల్ల అది! టీవీ చూస్తే ఏమైందిప్పుడు? రిషికి ఆడుకోమని నేనే ఫోన్‌ ఇచ్చాను’’ గదిలోంచి అరుస్తూ వచ్చాడు చరణ్‌.

‘‘చాలా గొప్ప పని చేసేరు! వాడు అందులో ఏం ఆటలు ఆడుతున్నాడో చూశారా! రమ్య హోంవర్క్‌ ఇంకా పూర్తి కాలేదు. అసలు ఏ రోజైనా పిల్లలు ఏం చదువుతున్నా రో కొంచెమైనా పట్టించుకుని ఉంటే మీకు తెలిసేది. వాళ్ళ ప్రోగ్రెస్‌ కార్డులు చూశేరా? 'ఏ ప్లస్‌' నుండి 'బిగ్రేడ్‌'కి వచ్చేరు యిద్దరూ మొన్నటి టెస్టులో.

‘‘చిన్నపిల్లలేగా! మెల్లిగా వాళ్ళే నేర్చుకుంటారు’’ విసుగ్గా అన్నాడు చరణ్‌. ‘‘ఏంటండీ నేర్చుకునేది! మీరు ప్రతిసారీ ఇలా వెనకేసుకు రాబట్టే వాళ్ళెందుకూ పనికి రాకుండా తయారవుతున్నారు. మీరు వాళ్ళని దగ్గర కూర్చోబెట్టి చదువైనా చెప్పండి, లేకపోతే నేనేమైనా అంటే కలగజేసుకోవడమైనా మానేయండి. అంతేగానీ తిన్నామా, పడుకున్నామా, లేచామా అన్నట్లు పొద్దునలేచి ఆఫీసుకెళ్ళి వచ్చి మీ గదిలో మీ పాటికి మీరు కూర్చుంటే వీళ్ళని చూడడం నావల్ల కాదు’’ విసురుగా అంది పల్లవి.

‘‘నాకు తెలుసు, ఏదో ఒకరోజు నువ్వు ఈ మాట అంటావని! వాళ్ళు తల్లీతండ్రీ లేని పిల్లలనేగా నీకు ఈ చులకన. అదే నీ పిల్లలైతే యిలాగే మాట్లాడతావా! ఇంక ఇంటిపనీ, వంటపనీ అంటూ ఏదో వాగేవు, ఆ మాత్రం పనులు అందరు ఆడవాళ్ళు చేస్తారు. నువ్వు ఒకర్తివే కాదు. ఇదుగో చూడు! ఇలా అస్తమానం నువ్వు అరిచి నాతో గొడవ పెట్టుకుంటే నీకు భయపడో, జాలిపడో వీళ్ళని ఏ హాస్టల్లోనో చేర్పిస్తాననుకుంటున్నావేమో! వీళ్ళు నా అన్న పిల్లలే! ` అంటే నా పిల్లలు` నీకంటే ముందు నా జీవితంలోకి వచ్చారు. నిన్నయినా వదులుకుంటాను గానీ, ఈ పిల్లలు మాత్రం నాదగ్గరే ఉంటారు. ఇంకోసారి వాళ్ళని పల్లెత్తు మాట అన్నా సహించేది లేదు. ఏమనుకుంటున్నావ్‌’’ అని అరుచుకుంటూ గదిలోకి వెళ్ళాడు.

పిల్లలిద్దరూ బిక్కుబిక్కుమంటూ యిద్దరివైపు బిత్తరచూపులు చూస్తూ నిలబడిపోయారు.

గదినుండి బయటకు వచ్చిన చరణ్‌ ‘‘రండి! మనం బయటికి వెళ్ళి డిన్నర్‌ చేసి వద్దాం’’ అంటూ రిషి, రమ్యలని తీసుకోని వీధి తలుపు ధడేలున వేసి వెళ్ళిపోయేడు.

చరణ్‌ మాటలకి చేష్టలుడిగినదైంది పల్లవి. జరిగినదేంటో గ్రహించేసరికి ఇంట్లో తను ఒకర్తే ఉన్నట్లు తెలుసుకుంది. పల్లవికి ఏడుపు రాలేదు. తమదెంతో ఆదర్శదాంపత్య మనుకుంది. ఇద్దరిమధ్యా ఎప్పుడు పొరపొచ్చాలొచ్చినా తనే ఒక అడుగు వెనక్కి వేసి ‘సారీ’ చెప్పేది. అలా ‘సారీ’ చెప్పడం వల్ల ఆక్షణం మాత్రమే తను ఓడిపోయినా, తమ బంధం నిలబడడం వల్ల జీవితాంతం తను గెలుస్తూనే ఉంటానని అనుకునేది. చరణ్‌ డిప్రెషన్‌లో ఉన్నాడని ఎప్పటికప్పుడు తన మనసు సమాధానపరుచుకొనేది.

అసలు ‘పెళ్ళి’ అంటేనే సర్దుకుపోవడం, ‘కమిట్‌మెంట్‌!’ ‘ప్రేమ’, ‘అహంకారం’ రెండూ ఒకే చెట్టుకున్న రెండు కొమ్మలైనా తేడా ఏమిటంటే ప్రేమ ఎప్పుడూ ‘సారీ’ చెప్పాలనుకుంటే, అహంకారం దాన్ని వినాలనుకుంటుంది. కాని ‘సారీ’ అన్న ఈ చిన్నపదంలో బంధాల్ని బలపరిచే మంత్రముంది. ఇది పల్లవి అనుభవంతో తెలుసుకున్న పాఠం. కోపం, బాధ, ప్రేమ ఇవి అందరిమీదా చూపించలేము. మనం ఇష్టపడే వారిమీద, ప్రేమించే వారిమీద ‘నా అనుకున్న వారిమీద మాత్రమే చూపించగలం’ అని కూడా తనకి తెలుసు. నిరాశ, నిస్పృహలున్నపుడు చిన్న సమస్య కూడా అనకొండలా భయపెడుతుంది. సంతోషంగా ఉంటే పెద్ద సమస్యలు కూడా దూదిపింజల్లా తేలిపోతాయని తెలిసే ప్రతీచోటా తనే సర్దుకుంటూ వచ్చింది. కాని ఈ రోజుఎంతమాటన్నాడు తనని? వాళ్ళు నీ సొంత పిల్లలైతే ఇలాగే మాట్లాడతావా? అని ఎలా అనగలిగేడు చరణ్‌?

పల్లవి మనసు గతంలోకి వెళ్ళింది.

* * *

ఆ రోజు - ఆఫీసు నుండి త్వరగా వచ్చింది పల్లవి. చరణ్‌ ఎప్పుడు వస్తాడా అని ఎదురుచూస్తోంది. ‘తను తల్లికాబోతోంది’! ఈ విషయం చరణ్‌తో పంచుకోవాలని మనసు ఉర్రూతలూగుతోంది. కాని ఇంతలో పిడుగులాంటి వార్త! అన్నయ్యా వదినలకి యాక్సిడెంట్‌ అయ్యిందని చరణ్‌ ఫోన్‌చేసి చెప్పేసరికి నవనాడులు కృంగిపోయేయి. ఆ తరువాత వాళ్ళ మరణం, పిల్లల బాధ్యత, చరణ్‌ పరిస్థితీ చూసి ఆ విషయం తనలోనే దాచుకుంది. అంతేకాదు ఆ వార్త బయటికి రాకుండా తనతోనే అంతమవ్వాలని కూడా నిర్ణయం తీసుకుంది. దానికి రెండు కారణాలు. అప్పటికే ఇద్దరి పిల్లల బాధ్యత మొయ్యడం తనకి తలకి మించిన పనవ్వడం ఒకటైతే రెండవది తన శరీర తత్వమేమిటో, అది ఎంత శ్రమని ఓర్చుకోగలదో తనకు తెలుసు. ఇప్పుడున్న పరిస్థితులలో తను కడుపుతో ఉండడం, దానితో తను పడే పాట్లు, ఆ తరువాత వచ్చే సమస్యలు ` ఇవన్నీ ఊహించుకునే అది తనవల్ల అయ్యేపని కాదనుకొని ధైర్యంచేసి తన కొలీగ్‌ రాధ సహాయంతో వాళ్ళ వదిన నర్సింగ్‌హోంలో గుట్టుచప్పుడు కాకుండా అబార్షన్‌ చేయించుకుంది. తల్లికి ఫోన్‌ చేసి, ఒంట్లో బాగాలేదని చెప్పి రెండు రోజులు ప్రణతిని తోడుగా తెప్పించుకుంది. తనకి వయసు మీరిపోలేదు. పిల్లలు అంతగా కావాలనుకుంటే మళ్ళీ పరిస్థితులు సర్దుకున్నాక కనవచ్చునని తనకి తనే నచ్చజెప్పుకుంది.

ఒకవేళ తను కోరుకున్నప్పుడు తనకి పిల్లలు పుట్టకపోతే 'ముత్యాల్లాంటి ఇద్దరు పిల్లలు ఉండనే ఉన్నారు తనకి' అనుకుంది. ఆరోజు నుండి ఈ రోజువరకు పల్లవికీ, రాధకీ, ఆ డాక్టర్‌కీ తప్ప ఈ విషయం ఎవ్వరికి తెలియదు. చెప్పి అనర్ధాలకి తావు ఇవ్వదలచుకోలేదు.

కాలింగ్‌బెల్‌ మ్రోగడంతో పల్లవి ఆలోచనల నుండి బయటపడి తలుపు తీసి లోపలికి వెళ్ళబోయింది. వెళ్తున్న పల్లవి చెయ్యి పట్టుకున్నాడు చరణ్‌.

‘‘సారీ పల్లవీ! ఈ మధ్య నాకేమౌతోందో నాకే తెలియడం లేదు. కోపంలో నిన్ను ఏవేవో అనేసాను. ఐయామ్‌ వెరీసారీ! అండ్‌ ఐ రియల్‌ మీన్‌ ఇట్‌ స్వీట్‌ హార్ట్‌! ఇదుగో పిల్లలూ! ఈ రోజు నుండి పిన్ని ఏం చెప్పినా ` కాదు ‘అమ్మ’ ఏం చెప్పినా మీరిద్దరూ బుద్ధిగా వినాలి. ఇంక ఈ పిన్నే మీకు ‘అమ్మ’ తెలిసిందా?’ అన్నాడు.

పల్లవి కళ్ళలో నీళ్ళు సుడులు తిరిగేయి. "ఏయ్‌ పిచ్చీ! ఏడుస్తున్నావా, ఎందుకు? ఈ రోజునుండి మనిద్దరం కలిసి వీళ్ళిద్దరిని జాగ్రత్తగా చూసుకుందాం. సరేనా!" అంటూ పల్లవినీ, పిల్లలనీ దగ్గరకి తీసుకున్నాడు చరణ్‌.

* * * * *

మరిన్ని కథలు

Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు
Pratibha
ప్రతిభ
- చెన్నూరి సుదర్శన్
Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు