సుమిత్ర:
సాయంత్రం ఆఫీసు నుండి ఇంటికి వచ్చి బట్టలు మార్చుకోడానికి బీరువా తలుపు తెరవగానే ఎదురుగా ఒక కాగితం రెప, రెపలాడుతూ కనిపించింది. తీసి చూస్తె హిమజ వ్రాసిన ఉత్తరం. తొందర, తొందరగా వ్రాసినట్టుంది, దస్తూరి అవకతవకగా వుంది. ఈ పిల్లకి నాకు ఉత్తరం వ్రాయాల్సిన అవసరం ఏమొచ్చిందబ్బా అనుకుని, మెల్లగా చదవొచ్చులే అని కాఫీ తయారుచేసుకుని తెచ్చుకుని సోఫాలో కూర్చుని ఉత్తరం చదవడం మొదలెట్టాను.
“ప్రియమైన అమ్మకు,
నువ్వు తిట్టినా, కొట్టినా కూడా నీకొక విషయం చెప్పాలి. నీతో ముఖాముఖి చెప్పే ధైర్యం లేక ఈ లేఖ ద్వారా తెలియచేస్తున్నాను. నువ్వు ఒప్పుకుంటావనే ఆశిస్తున్నాను. అలాగే నాన్నగారిని కూడా ఒప్పిస్తావని అనుకుంటున్నాను.
నేను, జయంత్ ఒకరినొకరం ఎంతో ఘాడంగా ప్రేమించుకుంటున్నాము. ఒకరిని విడిచి మరొకరు ఉండలేక పోతున్నాము. మీరు అనుమతిస్తే పెళ్లి చేసుకుందామను కుంటున్నాము. మా ఆశలను వమ్ము చేయవద్దని వేడుకుంటూ,
నీ హిమజ “
ఆ ఉత్తరం చదవగానే కోపానికి బదులు ఫక్కున నవ్వొచింది. ఎంత అమాయకత్వంగా వ్రాసింది నా చిట్టి తల్లి. పసితనంలో అమ్మా తాయిలం పెట్టు అని మారాం చేసినట్టు అడిగింది.
చూస్తుండగానే ఎంత పెద్దదైపోయింది. నిన్నగాక మొన్ననేగా సంగీతం నేర్పించడానికి సాయంత్రం టీచర్ దగ్గరకు తీసుకు వెళ్ళితే సంగీతం నేర్చుకుంటూ, నేర్చుకుంటూ టీచర్ వొడిలోనే పడుకుని నిద్రపోయింది. పోయినేడేగా ఇంటర్ పాసయింది. అప్పుడే ఆరిందాలా ఎన్ని మాటలు నేర్చిందో.
హిమజకి మూడేళ్ళ వయసొచ్చేసరికే తనలో ఏదో ప్రత్యేకమైన ప్రతిభ, కౌశల్యం ఉన్నాయనే విషయాన్ని అందరమూ గ్రహించాము. హిమజ నాన్నగారికి సంగీతంలో కొద్దో గొప్పో ప్రావీణ్యం ఉంది. బాగా పాడగలరు కూడా. ఆయన ఇంట్లో పాడుకుంటుంటే ఒక్కసారి విన్నా కూడా హిమజ అప్పటికప్పుడే ఆ పాటల్ని తిరిగి పాడేది. అంత ఏకసంథాగ్రాహి. తన కంఠం కూడా శ్రావ్యంగా ఉండేది. ఈ విషయాలన్నీ గమనించి హిమజని ఐదేళ్ళ వయసులోనే శాస్త్రీయ సంగీతం నేర్చుకోవడానికని ఒక సంగీతం టీచర్ దగ్గర చేర్పించాం.
అనుకున్నట్టుగానే హిమజ చాలా తొందరగా సంగీతంలో ప్రావీణ్యం సంపాదించింది. ఎన్నో సంగీత పోటీలలో బహుమతులు పొందింది. శాస్త్రీయ సంగీత పోటీలలోనే కాకుండా సినిమా పాటల పోటీలలోకూడా పాల్గొని ఎన్నోచోట్ల ప్రధమ బహుమతినికూడా పొందింది. ఇంటర్ చదువుతున్నప్పుడే ఒక ప్రఖ్యాత సంగీత విద్వాంసుడి ఆధ్వైర్యంలో ఒక ప్రముఖ టీవీ సంస్థవారు పదిహేను నుంచి పాతిక సంవత్సరాల వయసు గలవారికి నిర్వహించిన పాటల పోటీలో స్వర్ణ పతకాన్ని కూడా సంపాదించింది. ఆ పోటీలో గెలిచాక హిమజకి ఎన్నో సంగీత కచేరిలలో, సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనడానికి చాలా ఆహ్వానాలు రావడం మొదలయ్యాయి. అలాగే సినిమాలలో నేపధ్య గానానికి కూడా అవకాశాలు రావడం మొదలయ్యాయి. వీటన్నిటితోను తనెంతో తీరికలేని మనిషి అయిపోయింది.
సంగీతంతో ఎంత బిజీగా ఉన్నాకూడా హిమజ ఏనాడూ చదువుమీద నిర్లక్ష్యం చూపలేదు. ఎప్పుడూ మంచి మార్కులే తెచ్చుకునేది. ఈ ఏడే కంప్యూటర్ ఇంజనీరింగులో కూడా జాయినయింది. ఇంకో నాలుగేళ్ళల్లో చదువు పూర్తి చేసుకుని జీవితంలో ఉచ్ఛస్థితిని అధిరోహిస్తుందనుకుంటే అకస్మాత్తుగా, ఉరుములేని పిడుగులాగా ఈ దిమ్మెరపోయే సందేశం అందించింది. తను కాలేజీ నుంచి ఇంటికి రాగానే ఈ విషయమేదో త్వరగా తేల్చేయాలి. తనొచ్చేసరికి వంటంతా పూర్తిచేసేసుకుంటే తనతో తీరిగ్గా మాటలాడడం కుదురుతుందనుకుంటూ వంటింటిలోకి నడిచాను.
హిమజ:
నేను జయంత్ ని మొదటగా చూడ్డం ఒక టీవీ సంస్థవారు నిర్వహించిన పాటల పోటీ క్వార్టర్ ఫైనల్ దశకి చేరుకున్నప్పుడు. అప్పటివరకు మేమిద్దరం చెరో బృందంలో ఉండేవాళ్ళం. అందువలన కలిసే అవకాశం రాలేదు. క్వార్టర్ ఫైనలప్పుడు కూడా హలో అంటే హలో అనుకోవడం తప్పించి ఎక్కువగా మాటలాడింది లేదు. ఫైనల్సుకి చేరుకున్నప్పుడు మాత్రం మేమిద్దరమే కాకుండా మాతోపాటు ఫైనల్స్ చేరుకున్న మరో ఇద్దరు అభ్యర్దులతో కలిసి అన్ని విషయాలు చర్చించుకునేవాళ్ళం. రిహార్సల్స్ సమయంలో మేము చేస్తున్న తప్పులు, పాడే విధానాన్ని ఇంకా ఎలాగ మెరుగు పరుచుకోవచ్చు మొదలైన విషయాలని చర్చించి ఒకరికొకరం సలహాలిచ్చుకొనేవాళ్ళం. పేరుకే పోటీ కాని అందరం కలిసిమెలిసి ఉంటూ ఒకరికొకరు ప్రోత్సాహం ఇచ్చుకునేవాళ్ళం.
నాకు శాస్త్రీయ సంగీత జ్ఞానం బాగానే ఉన్నా సినిమా సంగీతం గురించి అంత బాగా తెలియదు. జయంత్ కి సినిమా పాటల పరిజ్ఞానం చాలా ఎక్కువ. అందుకే పాటలు పాడేటప్పుడు అతని సలహాలు తీసుకునేదాన్ని. ఏ పాట ఏ శ్రుతిలో పాడితే నా స్వరానికి
సరిపోతుందో, ఏ పాటకి గమకాలు ఎక్కడ ఎలాగ పలకాలో అన్నీ పాడి చూపెట్టేవాడు. అతని మార్గదర్శకత్వం ప్రభావమో, దేవుడిదయో తెలియదు కానీ ఆ పాటల పోటీలో ప్రధమ బహుమతి జయంత్ తో కలిసి నాకు కూడా ఉమ్మడిగా లభించింది. మాతో పాటూ ఫైనల్లో పోటీపడిన మిగతా ఇద్దరూ కూడా మాకేమి తీసిపోలేదు. ఏదో ఒకటీ అరా మార్కుల తేడాతో మేము విజేతలయ్యామంతే.
పాటల పోటీ అయిపోయే సమయానికి మా ఇద్దరి మధ్య సాన్నిహిత్యం బాగా పెరిగింది. ఒకరి వ్యక్తిగత విషయాలు మరొకరు తెలుసుకునే స్థాయికి పెరిగింది. అలాగే మా కుటుంబ సభ్యులు కూడా ఒకరికొకరు బాగా దగ్గరయ్యారు. ఆ పాటల పోటీ సమయానికి నేను ఇంటర్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. జయంత్ బీకాం ఫైనల్లో ఉన్నాడు. బీకాం అయిపోయాక సియ్యే చేద్దామనుకుంటున్నాడు.
పాటల పోటీ అయిపోయాక మాకు ఎన్నో దేశ, విదేశీయ సాంస్కృతిక కార్యక్రమాలలో పాడటానికి అవకాశాలు వచ్చాయి. ఆ విధంగా జయంత్, నేను ఒకరికొకరం బాగా చేరువయ్యాం. ఏ ప్రోగ్రాములు లేనప్పుడు వాట్స్ అప్ లో ఎన్నో విషయాలు మాట లాడుకునేవాళ్ళం. ఈలోగా నా ఇంటరూ, జయంత్ డిగ్రీ రెండూ పూర్తయ్యాయి. నేను ఇంజనీరింగులో జాయినయ్యాను; జయంత్ సియ్యే కోర్సులో చేరాడు.
రెండు నెలల క్రితం వైజాగులో ఏదో ప్రోగ్రాంకి పిలుపొస్తే ఇద్దరం కలిసి వెళ్లాం. ప్రోగ్రామునుంచి తిరిగి వస్తున్నప్పుడు రైల్లో జయంత్ అన్నాడు “హిమజా! నాకెందుకో మనమధ్య సంబంధం స్నేహానికన్నా అతీతమైనదనిపిస్తోంది. నువ్వేమంటావు?”
“ఏమో. నాకైతే ప్రత్యేకంగా ఏమీ అనిపించటంలేదు. ఇద్దరం మంచి స్నేహితులమని తప్పించి అంతకుమించి మరేవిధమైన ఆలోచన లేదు” నేను బదులిచ్చాను.
“అంతేనంటావా. మరే ప్రత్యేకమైన భావన కలగటంలేదా?”
“ఊహూ. నాకున్న ఎంతోమంది స్నేహితులలో నువ్వు అత్యంత సన్నిహితుడివి. అంతకు మించి మరేం లేదనుకుంటున్నాను .”
నా మాటలకు జయంత్ కొద్దిగా హర్ట్ అయ్యాడనిపించింది. కొద్దిసేపాగి అన్నాడు “అయితే ఒక పని చేద్దాము. ఒక మూడు నెలల పాటు ఒకరితో ఒకరు మాటలాడుకోకుండా, చూడకుండా ఉందాము. అప్పుడు కూడా మన ఫీలింగ్స్ ఇలాగే ఉంటే యధాప్రకారం స్నేహితులుగా కొనసాగుదాము.” అతని మాటలకు నేను అంగీకారం తెలిపాను.
ఇంటికొచ్చాక ఒక రెండు మూడు రోజులు మామూలుగా గడిచిపోయాయి. కాలేజీతోనూ, ఇంటి పనులతోనూ కాలక్షేపం అయిపోయింది. నాలుగోరోజు కాలేజీకి సెలవిస్తే ఇంట్లో సంగీత సాధన చేస్తూ కూర్చున్నాను. సాధన చేస్తున్నంతసేపూ ఏమాత్రం ఏకాగ్రత కుదరలేదు. ధ్యాసంతా జయంత్ వైపే మళ్ళుతోంది. ఎంత ప్రయత్నించినా అతని గురించిన ఆలోచనల్లోంచి బయటపడలేకపోయాను. చివరికి విసుగుపుట్టి ఆ రోజుకి సాధన ఆపేశాను.
క్రమంగా జయంత్ గురించిన ఆలోచనలు నన్ను ఉక్కిరిబిక్కిరి చేయసాగాయి. ఏ పని చేస్తున్నా ధ్యాస అతని మీదకే వెళ్ళేది. కాలేజీలో పాటాలు వింటున్నప్పుడు, స్నేహితులతో బాతాఖానీ చేస్తున్నప్పుడు, చదువుకునేటప్పుడు, అన్నం తినేటప్పుడు, నిద్ర పోయేటప్పుడు ఒకటేమిటి ఏ పని చేస్తున్నా అతనే గుర్తుకొచ్చేవాడు. దాంతో పరధ్యానం కూడా ఎక్కువైంది.
ఈ బాధ భరించలేక చివరికి ఒకరోజు జయంత్ కి ఫోన్ చేశాను నువ్వు చెప్పిందే సరైనదనిపిస్తోందని, బహుశా ఇద్దరం ప్రేమలో పడ్డామేమోనని. జయంత్ కూడా అదే అన్నాడు నాతో మాటలాడకపోయేసరికి ఈ వారమంతా నరకంలాగా గడిచిందని, తనకు కూడా నాతో ప్రేమలోపడ్డాననిపిస్తోందని. ఆ తరువాత ఇద్దరం యధాప్రకారం కలుసుకోవడం, మాటలాడుకోవడం మొదలెట్టాము. కొద్దిరోజులయ్యాక ఇద్దరం నిర్ణయించుకున్నాం మా ప్రేమ విషయమై ఇళ్లల్లో చెప్పేయాలని.
అనుకోవడమైతే అనుకున్నాముగాని ఈ విషయం ఇంట్లో ఎలా చెప్పాలో అర్థం కాలేదు. ఆలోచించి, ఆలోచించి చివరికి ఒక ఉత్తరం వ్రాసి అమ్మ బీరువాలో కనపదేటట్టు పెట్టి గప్ చుప్ గా కాలేజీకి వెళ్ళిపోయాను. కాలేజీ నుంచి సాయంత్రం ఇంటికొచ్చేసరికి అమ్మ సోఫాలో కూర్చుని పేపర్ చదువుకుంటోంది. నాన్నగారు ఇంకా ఆఫీసునుంచి వచ్చినట్టులేరు. నేను పిల్లిలా నా గదికి పోయి ఏదో పుస్తకం చదువుతున్నట్టు నటించసాగాను. అనుకున్నట్టే కొద్దిసేపట్లో అమ్మనుంచి పిలుపు వచ్చింది. గుండె దడదడలాడుతుంటే అమ్మ దగ్గరకు వెళ్ళాను.
సింధూర:
కాలింగ్ బెల్ మ్రోగితే ఎవరొచ్చారా అని వెళ్ళి వీధి తలుపు తీశాను. చూస్తే ఎదురుగా హిమజ. నా ప్రియాతిప్రియమైన శిష్యురాలు. ఎంతలో ఎంత ఎదిగిపోయింది. సంగీతం నేర్చుకోవడంకోసం పదిహేడేళ్ళ క్రితం అమ్మ చెంగు పట్టుకుని ఎంతో బిడియంగా ఈ వాకిట ముందర నిలబడ్డ చిన్నారి ఈ రోజు ఎంత పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంది. ఆ అమ్మాయిని చూస్తే నా మనసంతా ఆనందంతో పులకరించిపోయింది.
“రా హిమజా, లోపలి రా” ఎంతో ఆప్యాయంగా హిమజను ఆహ్వానించాను. హిమజ లోపలికి వచ్చి కూర్చుంది. కుశల ప్రశ్నలయ్యాక తను వచ్చిన పని చెప్పింది, “టీచర్ ! వచ్చే ఆదివారం నా పెళ్లి. మీరు, అంకుల్ తప్పకుండా ఒక రోజు ముందుగానే రావాలి. అమ్మా, నాన్నగారూ తరువాత వచ్చి మిమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానిస్తామన్నారు. నేను రేపటినించి ఒక నాలుగు రోజులపాటు ఊళ్ళో ఉండటంలేదు. అందుకని ఇవ్వాళ్ళే మిమ్మల్ని కలిసి పిలుద్దామని వచ్చాను.”
“చాలా సంతోషం హిమజా. అబ్బాయెవరు? అప్పుడెప్పుడో కొన్నేళ్ళ క్రితం మీ అమ్మ నువ్వెవరితోనో ప్రేమలో పడ్డావని తను అడ్డుపడ్డానని చూచాయగా చెప్పింది. ఆ అబ్బాయేనా?” కుతూహలం ఆపుకోలేక గబగబా ప్రశ్నలు సంధించాను.
హిమజ చిరునవ్వుతో సమాధానం చెప్పింది “అవును టీచర్! ఆ అబ్బాయే నేను పెళ్లిచేసుకోబోతున్న ఈ అబ్బాయి.”
“అదేమిటి. మరి ఈ పెళ్ళికి మీ అమ్మా నాన్నా ఒప్పుకున్నారా?” నా సందేహం నివృతి చేసుకుందామని అడిగాను.
“అటువంటిదేమిలేదు టీచర్. జయంత్, నేను పెళ్ళిచేసుకుందామనుకుంటున్నామని చెప్పినప్పుడు అమ్మ వ్యక్తం చేసిన అభ్యంతరమల్లా జయంత్ మంచిపిల్లాడే కానీ మేమిద్దరమూ ఇంకా చిన్నపిల్లలమేననీ, జీవితంలో ఇంకా స్థిరపడలేదనీ. బాగా చదువుకుని, మా సంగీత ప్రపంచంలో కూడా ఒక స్థాయికి చేరుకున్నాక ఇంకా మేమిద్దరమూ ఒకరంటే ఒకరు ఇష్టపడితే తమకెలాంటి అభ్యంతరము లేదని చెప్పింది. జయంత్ వాళ్ళింట్లోకూడా దాదాపు అటువంటి అభిప్రాయమే వ్యక్తం చేశారు. జయంత్, నేను తరువాత ఈ విషయం గురించి చర్చించుకున్నాక మాకు కూడా ఇంట్లో వాళ్ళు చెప్పింది
సబబే అన్పించింది. అందుకే ఆరోజు ఇద్దరం కలిసి ఒక నిర్ణయానికి వచ్చాము ఇద్దరి చదువులు అయిపోయి జీవితంలో స్థిరపడేదాకా ఇద్దరం మంచి స్నేహితులలాగే మెలగాలని. ఈ నాలుగేళ్ళల్లో జయంత్ తన సియ్యే పూర్తి చేశాడు. నేను బియ్యీ పూర్తి చేశాను. కళా రంగంలో ఒక స్థాయి సంపాదించుకుని ఇద్దరం డబ్బు కూడా బాగానే సంపాదించాము. అంతేకాదు ఒకరంటే ఒకరికి ఇష్టం మరింత పెరిగింది. అందుకనే ఇంట్లోవాళ్ళకి చెప్పేశాము మేమిద్దరం ఒకటవ్వాలనుకుంటున్నామని. ఈసారి ఇరు కుటుంబాలలోంచి ఎటువంటి అభ్యంతరమూ రాలేదు.”
“మీరు సంగీత ప్రపంచంలో స్థిరపడి ఆర్జించడం మొదలుపెట్టి చాలా కాలమైంది కదా, మరి ఇప్పటిదాకా ఎందుకాగారు?” హిమజకున్న ప్రజాదరణ తెలిసినదాన్నికాబట్టి నా సందేహాన్నివ్యక్తపరచకుండా ఉండలేకపోయాను.
“మీకు తెలియనిదేముంది టీచర్. విపరీతమైన పోటీ ఉన్న ఈ కళా రంగంలో ఎప్పుడు ఎవరికి ఆదరణ ఉంటుందో, ఎప్పుడు ఎవరు అథఃపాతాళానికి నెట్టివేయబడతారో ఎవరికీ తెలియదు. అందుకే మా చదువులు పూర్తి చేసుకుంటే భవిష్యత్తుని ధైర్యంగా ఎదుర్కోగలమని ఇంతకాలం ఆగాము.” ముఖంలో ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతుండగా సమాధానం చెప్పింది హిమజ.
ఆ అమ్మాయి పరిణితి చెందిన ఆలోచనలు, వివేకం, ఉజ్వల భవిష్యత్తుకోసం వేసుకుంటున్న ప్రణాళికలు చూసి నేను ఎంతో ముగ్దురాలినైపోయాను. నేటి తరం పిల్లల తొందరపాటుతనం, అన్నీ తెలుసుననే అహంభావం, సంస్కార రాహిత్యాల గురించి విమర్సిస్తామే కానీ, వారిలోని పరిపక్వత, భవిష్యత్తు గురించిన అవగాహన కనక మన తరం, మన ముందుతరం వారిలో కొద్దిగానైనా ఉంటే ఎన్నో జీవితాలు నాశనం అయ్యేవి కాదుకదా అనిపించింది.
మరికొద్దిసేపు నాతో గడిపి సెలవు తీసుకుంది హిమజ. ఆ అమ్మాయి తన జీవితాన్ని తీర్చిదిద్దుకుంటున్న తీరు చూస్తే ఎంతో ముచ్చటేసింది.
*************