అవంతీపురాన్ని రణధీరుడు పాలిస్తున్న రోజుల్లో నందకుడు తన విద్యా పాటవాలను ప్రదర్శించి ఆయన అభిమానానికి పాత్రుడయ్యాడు.
రాజు కోరికపై నందకుడు గురుకుల పాఠశాలను ఏర్పాటు చేసుకుని అనతికాలంలోనే మంచి కీర్తి గడించాడు. ఎంత దూరం నుంచి తమ పిల్లలను తీసుకువచ్చి గురుకుల పాఠశాల చేర్పించేవారు తల్లిదండ్రులు.
అలా చేరిన వారిలో ఒకే రీతిగా విద్యనభ్యసించి గురువు గారు పెట్టిన ప్రతి పరీక్షలోనూ ప్రధములుగా వచ్చిన ముగ్గురు విద్యార్థులను చూసి నందకుడు ఆశ్చర్య చకితుడయ్యాడు. కొంచెం కూడా తేడా లేకుండా వారు చూపిస్తున్న ప్రతిభాపాటవాలకు అబ్బురపడ్డాడు.కాని వారి వారి మనస్తత్వాలలో తేడా ఉన్నట్లు గమనించాడు.
వారిని పిలిచి ఇలా అన్నాడు "గురువుకు శిష్యులందరిపైనా ఒకే విధమైన అభిమానం, సమదృష్టి ఉంటుంది. మీరు ఒక ఆరు మాసాల పాటు విదేశాల్లో మీ ప్రతిభా పాటవాలను ప్రదర్శించి సరిగ్గా నేను చెప్పిన రోజునాటికి ఇక్కడికి చేరుకోండి.నేను మీకు విద్య గరపడంలో ఎంతవరకు కృతకృత్యుడు అయ్యానో తెలుసుకునే అవకాశం కలుగుతుంది."
"అలాగే గురువర్యా" అని వారు ముగ్గురు ఆయన వద్ద సెలవు తీసుకున్నారు .
ఆరు నెలల అనంతరం తిరిగి మిత్రులు ముగ్గురూ గురువుగారు చెప్పిన రోజున గురువుగారి దర్శనం కోసం గురుకులానికి వచ్చారు. మొదటి వాడు విక్రముడు మెడలో తాడుతో కట్టిన ఒక వాడిపోయిన ఆకుతో, చేతిలో ఒక లేఖతో నిరాడంబరంగా వచ్చాడు. తన అనంతరం వచ్చిన మిత్రులను ఆప్యాయంగా పలకరించాడు.
రెండోవాడు ప్రసేనుడు చేతిలో ఒక లేఖ తో ఉన్నాడు. మూడవవాడు అభినందనుడు రావడమే ఆర్బాటంగా రథంలో వచ్చాడు. అతని వెనుక అనేక బహుమతులు పట్టుకుని ఇద్దరు సైనికులు ఉన్నారు.
గురుకులంలోని శిష్యగణం అంతా అభినందనుడి చుట్టూ చేరి సంభ్రమాశ్చర్యాలతో చూడసాగారు.
శిష్యులు ముగ్గురు అన్నట్టుగానే వచ్చారని తెలుసుకుని నందకుడు బయటకు వచ్చాడు.
వారు ముగ్గురు గురువుకు అభివాదం చేసి "గురువర్యా. వివిధ దేశాలలో నా ప్రతిభకు నేను పొందిన బహుమతులు" అని సగర్వంగా మిగిలిన ఇద్దరు మిత్రుల కేసి గర్వంగా చూశాడు అభినందనుడు.
ఆశ్రమ శిష్యగణం కొట్టిన చప్పట్లతో ఆ ప్రదేశం మారుమ్రోగిపోయింది.
అనంతరం నందకుడు మోకాళ్లపై మోకరిల్లి తన చేతిలోని లేఖను గురువుకు అందించాడు ప్రసేనుడు. పొరుగు రాజ్యం లో చూపిన ప్రతిభకు ఆ దేశపురాజు ప్రసేనుడిని తమ సేనాధిపతిగా నియమించిన నియామక పత్రం అది.
అభినందనుని వైపు ప్రసేనుడు మరింత విజయగర్వంతో చూసిన చూపుకు తనలో తాను నవ్వుకున్నాడు నందకుడు.
అనంతరం నందకునికి సాష్టాంగ ప్రణామం చేసి తన చేతిలోని లేఖను గురువు అందించాడు విక్రముడు.
అది చదివిన నందకుడు విక్రముని ఆప్యాయంగా కౌగిలించుకుని అందరి విద్యార్థులతో ఇలా అన్నాడు.
" చూసారా విద్యార్థులారా! ఈ ముగ్గురు విద్యార్థులు నా వద్ద సమానంగా చదువు నేర్పిన వారే. అయితే అభినందనడు విజయ గర్వంతో తన సంపదను ప్రదర్శించాడు.
ప్రసేనుడు పొరుగు రాజ్యం లో సేనాధిపతిగా నియమింపబడిన లేఖ తీసుకు వచ్చాడు.
మరి విక్రముడు వినయంతో సాధించిన విజయం ఏమిటో తెలుసా? మగధ దేశపు రాజు మనసు గెలిచాడు అంటే ఆ రాజ్యంలో ప్రజ్ఞ పాటవ ప్రదర్శనలో ప్రథముడైన వారికి తన అంతఃపురంలోని ఆలివ్ చెట్టు ఆకు తో సత్కరించడం ఆ దేశంలో అత్యున్నత గౌరవం. అతని వివాహానికి తరలి రమ్మని నాకు పంపిన ఆహ్వాన పత్రిక ఇది.
ఈ ముగ్గురిలోను ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనే వినయంతో మొదటి స్థానంలో నిలబడినవాడు విక్రముడు.
ఒకేవిధంగావిద్య అభ్యసించినా ప్రదర్శించిన తేడాల వలన ఉన్నత స్థానంలో ఉన్నాడు. ఇప్పుడు మీరు ఈ ముగ్గురిని అభినందించండి" అన్న గురువుగారి మాటలతో విద్యార్థులందరూ వారి ముగ్గురిని అభినందిస్తూ ఉంటే అయినవారికి ప్రసేనుడు విక్రముడు తమ తప్పు తెలుసుకుని తల దించుకున్నారు.
సమాప్తం