మట్టికి మరణం లేదు - శింగరాజు శ్రీనివాసరావు

Mattiki maranam ledu

అది బాగా వెనుకబడిన ప్రాంతం. పట్టణానికి యాభై కిలోమీటర్ల దూరంలో ఉండే మానోపాడు గ్రామం. అందరూ రైతు కూలిలే అక్కడ. పేరుకు అందరికీ పొలాలున్నా అక్కడ పండే పంటలు శూన్యం. అందుకే అందరూ చుట్టుపక్కల గ్రామాలకు కూలీలుగా వెళ్తుంటారు. పంటనీటికే కాదు తాగే నీటికి కూడ కటకటగానే ఉంటుంది అక్కడ. అటువంటి ఊరిలో కూడ ప్రాథమిక పాఠశాల ఉంది. అదికూడ ఏకోపాధ్యాయ పాఠశాల. అక్కడ పనిచేసే ఉపాధ్యాయుడు అతికష్టం మీద పట్టణానికి బదిలీ చేయించుకున్నాడు. అలాంటి తాడు, బొంగరం లేని ఊరికి ఉపాధ్యాయుడుగా కొత్తగా ఉద్యోగం తెచ్చుకున్న హరినాయక్ వచ్చాడు. ఆ ఊరికి పట్టణం నుంచి రావాలంటే ఉన్నది ఒకే ఒక బస్సు. అదికూడ ఉదయం ఒకసారి, తిరిగి సాయంత్రం మరోసారి. హరినాయక్ వచ్చేముందు తను రిలీవు చెయ్యవలసిన టీచరును కలిశాడు. అతను చెప్పినదాన్ని బట్టి హాజరు పట్టీలో యాభై మంది విద్యార్థులు ఉన్నా, పట్టుమని పదిమంది పాఠశాలకు రారట. మధ్యాహ్న భోజన పథకం కోసం హాజరు పట్టీ పెంచారట. తనకు తెలిసిన విషయాలను చెప్పి పంపారు టీచరుగారు. ఉదయం వచ్చే బస్సులో దిగి పాఠశాలలోకి అడుగుపెట్టాడు హరినాయక్. కొత్త టీచరు వస్తున్నాడని గామోసు ఓ ఇరవై మంది వరకు వచ్చారు పిల్లలు. కొత్త ఉపాధ్యాయుడిని పలకరించడానికి వచ్చారు సర్పంచిగారు. "అరెరె కొత్త పంతులుగోరా. ఏంది సారూ మీరు శానా పెద్దోల్లేమో అనుకుంటి. గట్టింగ మా సిన్నోడంత లేరు. అయినా పిల్లోళ్ళు సరిగానే రాని ఈ బడికెందుకొచ్చినవయ్యా. కమ్మంగా ఏడైనా మంచిసోటికి పోకపోయినవా" "అదేమిటి సర్ అలా అంటారు. పిల్లలను దగ్గరుండి బడికి పంపి స్కూలు బాగా నడిచేటట్టు చూడాలి గానీ, మీరే మమ్మల్ని నిరాశపరిస్తే ఎలా!" " కాదయ్యా పంతులూ. పిల్లోళ్ళని స్కూలుకాడికి పంపిత్తే, నీల్లు ఎవురు తెత్తారు, పొలంకాడికి ఎవురుబోతారు. ఇయన్నీ అయే పనులు కాదయ్యా. వచ్చినోడికి సెప్పి నీ జీతం నువ్వు తీసకపో. పదేల్ల నుంచి వచ్చిన పంతులెల్లా ఏదో పొడస్తామని రావడం, నాలుగు రోజులాగి సర్దుకోని కూసోడం, ఇది మాకు మామూలే. అయినా నాకెందుగ్గాని. ఏదో కొత్తోడివని ఓ పాలి పలకరించి పోదామని వచ్చినా. వత్తా పంతులూ. సిన్నోడివి ఎక్కవ ఆలోసించమాక" అని ఓ నవ్వు నవ్వి వెళ్ళిపోయాడు సర్పంచి. ఆ ఊరి పరిస్థితి అర్థమయింది హరినాయక్ కు. పిల్లలను బడికి పంపకుండా చేస్తున్నది వారి ఇబ్బందులే తప్ప అయిష్టత కాదు. జీతం కోసమే ఉద్యోగం చేయటమన్న మాట నచ్చలేదు అతనికి. ఎంతో ఇష్టపడి ఈ వృత్తిని ఎంచుకున్నాడు. గురువు అంటే 'చీకటిని తొలగించేవాడు' అని ఎందరో చెప్పగా విన్నాడు. బ్రతుకుకు వెలుగు చూపించవలసిన వృత్తిలో ప్రవేశించి స్వార్ధంగా ప్రవర్తించడానికి అతని మనసు అంగీకరించలేదు. ఏదో ఒకటి చేసి ప్రజలలో చైతన్యం తీసుకురావాలి అనే దృఢసంకల్పం కలిగింది అతనిలో. ***** "వద్దు సారూ. మా పిలగాల్లకి సదువు ఎందుకు సెప్పు. ఆల్లేమైనా ఉద్దేగాలు సెయ్యాలా? ఊల్లు ఏలాలా? గుక్కెడు నీల్లకోసం ఆమడ దూరం పోవాల. ఆల్లు మీ కాడికొత్తే మాకు తాగనికి నీల్లు ఎవురు తెత్తారు. ఊల్లో పంటలు లేక మేమేడేడికో వోయి కూలీ సేసుకుంటామాయె. మేమింటి కాడికొచ్చే తలికి ఈ ఆడపిల్లోల్లు అంత కూడు ఉడకేసి పెట్టాలె. ఇయన్నీ మాకు కుదరవులే సారు. మా గూడెపోల్ల బతుకులు ఉట్టికెక్కవ, సొరగానికి తక్కవ. మా బతుకులు మమ్మల్ని బతకనీయండి" ఊరి చివరి గూడెం పెద్ద వాళ్ళ అసహాయతను తెలియచేశాడు. " అలా అనకు పెద్దయ్యా. నువ్వు కూలి చేసుకుని బ్రతికావని, నీ బిడ్డలు కూడ అలాగే బతకాలా. వాళ్ళు చదువుకుని మాలాగ ఉద్యోగాలు చెయ్యాలని లేదా. తరతరాలుగా మీ బ్రతుకులు ఇలా బానిస బ్రతుకులలా మిగిలి పోవలసిందేనా. మార్చండి పెద్దయ్యా. మీకోసం ప్రభుత్వాలు ఎన్నో వసతులు కల్పిస్తున్నాయి. వాటిని అందుకుని ఎదగండి" వారిలో మార్పు తేవాలనే తాపత్రయం హరినాయక్ ది. "పొలం సేద్దామంటే నీల్లు లేవు. ఊరి సివర సెరువును సదును సేసినారు. ఆడేదో పెద్ద పేక్టరీ కడతామని రాయియేసి అయిదేల్లయింది. రాలిన సుక్క జారిపోయిందే గాని, నేల తడిచే పాగే లేదు. ఆసాములంతా యెగసాయం అచ్చిరాలేదని దిగాలుపడి కూసున్నారు. సెరువు మద్దెలో కమ్మటి మంచినీటి బాయిని పూడ్చేసినారు. తింటానికి కూడులేక, తాగనిక నీల్లులేక, దేనికి సామీ మాకీ సదువులు" నిరాశ స్పష్టంగా కనిపించింది అతని మాటల్లో. మాటలతో కాదు నేరుగా రంగంలోకి దిగితేనే ఊరిని, ఊరి జనాలను మార్చగలనని నిర్ణయించుకున్నాడు హరినాయక్. అనుకున్నదే తడవుగా సర్పంచి గారిని, ఊరి పెద్దలను కలిశాడు. తన మనసులో ఉన్న ప్రణాళికను వారితో చర్చించాడు. ముందు చాలామంది అది వృధాప్రయాస అన్నారు. కొంతమంది అతని ఆలోచనలో మంచి ఉద్దేశ్యం ఉన్నపుడు ప్రయత్నం చేస్తే తప్పేముంది అన్న ధోరణి ప్రదర్శించారు. చివరికి సర్పంచి నిర్ణయంతో సరికొత్త మార్పుకు శ్రీకారం చుట్టారు. "ఒరేయ్. నా మాట ఇనండ్రా. ఆయన ఈడబుట్టలే. మన ఊరు గాదు. అయినా మన బతుకులు బాగుసేయాలని మంచి మాటలు సెబుతున్నాడు. అందులో నాకు మంచే కనిపించిందిరా. ఇయాలనుంచి అందరం కట్టుగా ఉందాం. ముందా సారాయి కొట్టును మూసేద్దాం. ఊల్లో ఎవురు మందు తాగనికి లేదు. అదో కట్టుగా పెట్టుకుందాం. సారు సెప్పినట్టు ఓ అయిదేల్లు సూద్దాం. బగమంతుడు సల్లంగ జూత్తే మన బతుకులు మారిపోతయి. మన పిల్లోల్లు పెద్ద సదువులు సదివే దారి దొరకద్ది. ఏమంటారు?" చెప్పాడు సర్పంచి. "మనమేదో పొడుత్తామనే ఆశలేదు మామ. కాకపోతే ఈ అయ్యోరు అందరిలా గాక, మంచి సెయ్యాలనే పట్టుదలగ ఉన్నాడు. ఆయన మాట తోసెయ్యలేక సరే అంటున్నము. ఇక మీరు ఎట్టా సెబితే అట్టా. ఊరు ఊరంతా మీ యెంటే ఉంటది. ఊరెట్టాగున్నా మడుసులమన్నా కలిసివుంటాం. 'గోసీకి మించిన దరిద్రం లేదంటారు'. ఇప్పుడు మన బతుకులు అలానే ఉన్నయి కదా. దేనికయినా తెగించి ముందడుగెయ్యాల. కానీండి సారు. మీరేది చెబితే అదే" అన్నాడు ఆ ఊరి యువతరానికి ప్రతినిథి రాజు. అందరూ ఒకటిగా చేతులు కలిపారు. ఒక ఉద్యమం ఊపిరిపోసుకుంది ఆ గ్రామంలో. ******** "సార్. మానోపాడులో ఊరి జనమంతా మనమిచ్చే ఉచితాలను తిరస్కరించారు. మాకు ఉచితాలు కాదు, ఉపాధి కావాలని నిలదీస్తున్నారు. అదీగాక మొన్న జిందేరి కంపెనీ వారు పరిశ్రమను స్థాపించాలని సర్వేకు వెళితే ఊరంతా అడ్డుకుని వాళ్ళను వెనక్కు పంపారు" చెప్పాడు కలెక్టరు ప్రవీణ్ కు, అతని సెక్రటరీ ప్రభు. "ప్రజలు ఏదైనా ఉచితంగా ఇస్తామంటే చాలు ఎగబడతారు. కానీ వీళ్ళేమిటి మాకు ఉచితాలు వద్దు, ఉపాధి కావాలి అంటున్నారు. మరల పరిశ్రమలు వద్దంటున్నారు. ఇక్కడ వాళ్ళు ఏంకావాలనుకుంటున్నారో నాకు అంతుచిక్కడం లేదు ప్రభూ. సరే, ఒకసారి వాళ్ళను నేరుగా కలిస్తే తెలుస్తుంది కదా" అన్నాడు ప్రవీణ్. " సరే సర్. మీ ఇష్టం. రేపు ఉదయాన్నే వెళదాము" అని వెళ్ళిపోయాడు ప్రభు. ******** 'ఎలక్షనుల సమయంలో తప్ప ఏ రాజకీయ నాయకుడు ఆ పక్కలకు రారు. పంటలు పండవు. నీటి వసతి లేదు. అధికారులు కూడ అంటీముట్టనట్టు ఉంటారు. అంతా నిరక్ష్యరాసులు కావడం వలన ఎవరూ సమస్యలను కూడ చెప్పుకోలేరు'.. ఇదీ మానోపాడు గురించి అందరి అభిప్రాయం. ఊరి పొలిమేరలు చేరగానే పచ్చదనం కొట్టొచ్చినట్టు కనిపించింది. చెరువు నిండా నీరు ఉంది. అసలిది మానోపాడేనా అని అనుమానం వచ్చింది ప్రవీణ్ కు. ఊరు చేరగానే జనమంతా అతని చుట్టూ గుమికూడారు. అందరినీ సమావేశ పరచి సర్పంచిని పిలిచి అడిగారు ప్రవీణ్. " సర్పంచి గారు. ఎందుకు రైతులకు ఇచ్చే భరోసాను, ఉచిత పథకాలను మీరు తిరస్కరించారట. కారణం తెలుసుకోవచ్చా" " నిజమే సర్. ఒకప్పుడు ఉచితం అంటే ఊరికే వచ్చిన సొమ్ము కనుక తీసుకుని, అందుబాటులో ఉన్న సారాయి తాగి తిరిగి ప్రభుత్వానికే ఇచ్చేశాం. అది చదువు లేని మా అమాయకత్వం. కానీ ఈ అయిదు సంవత్సరాలలో మాలో చాలా మార్పు వచ్చింది సర్. కాదు మీ ప్రభుత్వ ఉద్యోగే మాలో ఈ మార్పు తెచ్చాడు. మట్టికి మరణం లేదు, ఆ మట్టిని నమ్ముకోమని మాకు చెప్పాడు. ఏ చెట్లను, చెరువులను మేము నిర్లక్ష్యం చేశామో, వాటిని అభివృద్ధి చేశాలా మమ్మల్ని చైతన్యవంతులను చేశాడు. పాఠశాలకు వెళ్ళను ఇష్టపడని మా పిల్లలను చదువు మీద శ్రద్ధ కలిగేలా చేశాడు. మాకు రాత్రిపూట బడిలో చదువు చెప్పాడు. నేలను నమ్ముకున్న వాడికి అన్నానికి దిగులు ఉండదని చెప్పి, మరల మమ్మల్ని వ్యవసాయం వైపు నడిపాడు. ఇంకుడుగుంటలు త్రవ్వి నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంచుకున్నాము. పంటమార్పిడి విధానం అవలంభించి చేనును సారవంతం చేసుకున్నాము. ఇప్పుడు మేము నీటికోసం, కూటికోసం ఎక్కడికీ వెళ్ళనక్కరలేదు. పదిమందికి పెట్టే స్థితిలోనే ఉన్నాం. మా భాష మారింది. మా ఆలోచనా మారింది. దీనికంతటికీ కారణం మా హరినాయక్ పంతులు గారు. ఆయన ఒక్క అడుగు ముందుకు వేశాడు. మేము, మా ఊరి యువతరం పట్టుదలను పెంచుకుంది. తమ కాళ్ళ మీద తాము నిలబడాలని ఇదంతా చేసింది. అందుకే మీరిచ్చే ఉచితాలు మాకు అక్కరలేదు. నారు మేమే పోసుకుంటాం, గొడ్లను పెంచుకుని సేంద్రియ ఎరువులు మేమే తయారుచేసుకుంటాం. పరిశ్రమలు తెచ్చి మా ఊరిని కలుషితం చేసి, ఉపాధి పేరుతో మా ఆరోగ్యాలను నాశనం చేయకండి. ఇక్కడ అందరికీ పొలం పనులతో ఉపాధి దొరుకుతుంది. మీ రాజకీయ స్వార్ధం కోసం మమ్మల్ని బిచ్చగాళ్ళను చేసి, జీవితాంతం బానిసలుగా బ్రతికేలా చేయకండి. మా పొలాలను లాగేసుకుని పరిశ్రమలు పెట్టాలనే ఆలోచనను విరమించుకోండి. ఈ ఒక్క సహాయం చేయండి చాలు" ఆవేశంగా సాగినా అన్నీ నిజాలే మాట్లాడిన సర్పంచి మాటలు కలెక్టరును ఆలోచనలో పడేశాయి. 'మట్టికి మరణం లేదు' అన్న మాటలు ప్రవీణ్ గుండెలను తాకాయి. అవును మట్టికి నిజంగానే మరణం లేదు. అది ఎప్పుడూ మొలకలకు జీవం పోస్తూనే ఉంది. అలాగే మట్టిని నమ్ముకున్న రైతుకు కూడ అకాలమరణం ఉండకూడదు. హరినాయక్ వంటి యువ గురువులు ఊరికొక్కరుంటే చాలు ప్రతి గ్రామం ఆదర్శగ్రామం అవుతుంది. హరినాయక్ ను వేదిక మీదకు పిలిచాడు. "గురువు అన్న పదానికి నిలువెత్తు నిదర్శనం హరినాయక్. ఇతని మాటను నమ్మి మీరు అడుగు ముందుకు వేసి మీ జీవితాలలోని చీకట్లను తొలగించుకున్నారు. ఈ ఊరికి నేను కలెక్టరు కావడం నా అదృష్టం. ఇకనుంచి మీకు నేనొక హామీ ఇస్తున్నాను. మీ పంచాయితీకి రావలసిన నిధులను రెట్టింపు చేస్తాను. ఏ పరిశ్రమలూ మీ ఊరి ఛాయలకు రావు. మీ వ్యవసాయానికి కావలసిన పెట్టుబడులకు మీరు ఇబ్బందులు పడకుండా సహకార బ్యాంకు శాఖను ఇక్కడ పెట్టేలా ప్రయత్నిస్తాను. మీ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకుని నా జిల్లాలో ప్రతి గ్రామం మారాలి. ఉచితాల కోసం ఎగబ్రాకడం మాని, స్వశక్తికి పట్టం కట్టాలి. మట్టికి మరణం లేదని నిరూపించాలి. అదే మన కర్తవ్యం. మీ వెంట నేనున్నాను. మీ నాయకుడు హరినాయక్ మాటను వేదంగా తలచి ముందుకు నడవండి. అందరికీ శుభాభినందనలు" అని చెప్పి అందరినీ అభినందించాడు ప్రవీణ్. " కలెక్టరు గారి మాటలను స్పూర్తిగా తీసుకుని మనం ముందుకు సాగుదాం. ఇక్కడ ఎవరూ నాయకులు లేరు. మనమందరమూ నాయకులమే. కాబట్టి మనది నాయకుడు లేని ప్రజాగ్రామం. మా ఆలోచనలను మెచ్చి, ఇతోధిక సాయం అందిస్తానన్న కలెక్టరుగారికి మనందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ సందర్భంలో మాదొక చిన్న మనవి. ఈ గ్రామంలో చిన్న కుటీర పరిశ్రమలను ఏర్పాటు చేసుకోవడానికి అనుమతిని, ఆర్ధికసాయాన్ని ప్రభుత్వం నుంచి మేము కోరుతున్నాము. అందుకే మేము 'ఉచితాలు వద్దు ఉపాధి కావాలని' కోరాము. మా కోరికను మన్నిస్తారని ఆశిస్తున్నాము" అని ముగించాడు హరినాయక్. 'ఉచితాలు వద్దనుకుని ఉపాధి కావాలనుకున్న వీరికి వాతావరణ కలుషితం లేని కుటీరపరిశ్రమలు స్థాపించుకునే నైపుణ్యతను అందచేయాలి. అందుకు ప్రభుత్వం నుంచి సహాయం అందెలా చూడాలి. వీరికి చేదోడువాదోడుగా నేనుండాలి' అనే నిర్ణయంతో బయలుదేరాడు కలెక్టరు ప్రవీణ్. ****** అయిపోయింది ********

మరిన్ని కథలు

Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు
Pratibha
ప్రతిభ
- చెన్నూరి సుదర్శన్
Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు