ముక్తేశ్వరం ఊళ్లో ఏ ఇద్దరు కలిసినా ఒకటే టాపిక్. రిషికేష్ నుంచి ఒక స్వామి శివాలయానికి
వస్తున్నారని, ఆయన ఆశీర్వదించి విభూతి ఇస్తే, ఎటువంటి రోగాలయినా పోవడమే కాకుండా,
మనసులోని కోరికలు తీరుతాయని చాలా మంది అనుకుంటున్నారు. డబ్బు ఏమీ అడగరని, విభూతి
మాత్రమే ఇస్తారని చెప్పుకుంటున్నారు.
***
స్వామిజీ రావడానికి రెండు గంటలు ముందే గుడిముందు పెద్ద క్యూ తయారైయింది.
అయితే మొత్తం అంత మందిలోనూ ఇద్దరు విలక్షణ మయిన వ్యక్తులు వేరు వేరు గా నుంచున్నారు.
ఒకరు ఆ ఊరికి దగ్గర లొనే పట్టణం లో లెక్చరర్ గా పనిచేస్తున్న నారాయణ, రెండోది రామకోటి రామ
లక్ష్మి గారు. ఆవిడ చాలా కాలం నుంచి రామకోటి రాస్తూ, ఆ పుస్తకాలు రామాలయం లో సమర్పిస్తూ
ఉంటుంది.
మొత్తానికి అనుకున్న టైం కి ఇద్దరు శిష్యులతో స్వామీజీ వచ్చారు
ఆలస్యం లేకుండా వచ్చిన వెంఠనే గుడి ఆవరణలో ఉన్న ఒక మంటపం లో కూర్చుని, శిష్యులు
ఒక్కొక్కరినే పంపుతూ ఉంటే భక్తులని కలిశారు.
ఎవరు ఏది అడిగినా విభూతి ఇచ్చి పంపారు.
లెక్చరర్ నారాయణ గారు, రామకోటి రామలక్ష్మి గారు అందరికన్నా ఆఖరున వెడతామని చెప్పి
వెనక ఉండిపోయారు.
అందరూ వెళ్లిన తరువాత నారాయణ గారు వెళ్లి, తన పేరు చెప్పి స్వామికి నమస్కరించారు.
" స్వామి! మీతోటి ఒంటరిగా మాట్లాడాలి " అన్నారు నారాయణ గారు
" అలాగే తప్పకుండా " అని చెప్పి దగ్గర లో ఉన్న శిష్యులని వెళ్ళమని చెప్పారు
" స్వామి!మీరు ఎందుకు అమాయకులకి, ఆశలు కల్పిస్తున్నారు. మీ విభూతి వాళ్ల రోగాలనికుదిర్చి,
కోరికలని తీరుస్తుందా? " అడిగారు నారాయణ తనకి ఉన్న శాస్త్రీయ దృక్పధం తో.
స్వామి చిన్నగా నవ్వి " మీరు ఆలా అనడానికి కారణం చెప్ప గలరా? " అడిగారు స్వామి
" స్వామి! ఈ సృష్టిని పరిశీలిస్తే అంతా ప్రకృతి సహజ మయిన ఒక ప్రణాళిక ప్రకారం జరుగుతూ
ఉండడం చూస్తూనే ఉన్నాము. అది ఆకాశం లో ఉన్న సూర్య, చంద్రులు కానీ, భూమి కానీ అన్నీ ఒక
ప్రణాళిక కి లోబడి సంచరించడం చూస్తూనే ఉన్నాము. అటువంటి ప్రణాళిక ఈ గ్రహాల మీద
ఉన్న మానవులకి వర్తించదా? అటువంటి ప్రణాళిక బద్ధం గా జరిగేవాటిని మీ విభూతి ప్రభావితం
చేస్తుందని ఎలా చెప్పగలరు?" అడిగారు నారాయణ
" చాలా మంచి ప్రశ్న వేశారు నారాయణ గారు. ఒకటి చెప్పండి. మీరు చెప్పిన గ్రహాలు అవీ ఒక
ప్రణాళిక ప్రకారం నడుస్తున్నాయి. తామే ఆ ప్రణాళిక వేసుకోలేవు కదా? అవన్నీ జడం కాబట్టి వేరే
శక్తి తో కూడిన జ్ఞానం లేకుండా అది జరగదు. అంత కాకపోయినా చిన్నదయినా ఒక ప్రణాళిక వేసి
అమలుపరిచే శక్తి , జ్ఞానం మీకు ఉన్నాయి అని ఒప్పుకుంటారా?
" ఎందుకు లేదండి ఉంది " ఒప్పుకున్నారు నారాయణ.
" కానీ మీ జ్ఞానానికి ఆకారం లేదు. అందు చేత అది అనంతం. అనంతమయిన శక్తి మీకు ఉందని
నమ్మితే అద్భుతాలు జరుగుతాయి " అన్నారు స్వామి
" ఇప్పుడు మీరు ఇచ్చే విభూతి కి దానికి సంబంధం తెలియలేదండి " సందేహం వెలిబుచ్చారు
నారాయణ.
అది తెలియాలంటే ఒక సంఘటన గురించి చెప్పాలి. ఒక మాటు మాగురువు గారి ఇంట్లో ఏదో
వివరిస్తోంటే ఆయన దగ్గర కూర్చున్నాను. ఇంతలో పక్కింటి నుంచి పెద్ద గా అరుపులు
వినిపించాయి. ఒక పిల్లవాడు పరుగున వచ్చి , "మా తాత నల్ల మందు డబ్బా ఎక్కడో పోయిందండి.
ఇప్పుడు అది పడక పోతే రాత్రంతా గోల చేస్తాడండి. ఇంట్లో ఎవరు లేరండి. ఇప్పటికే అరిచి గోల
చేస్తున్నాడండి " అన్నాడు
మా గురువు గారు ఒక్క క్షణం అలోచించి, నన్ను లోపలికి వెళ్లి బెల్లం డబ్బా లో బెల్లం తీసేసి డబ్బా
పట్టుకురామ్మన్నారు. నేను లోపలికి వెళ్లి తెచ్చి ఇచ్చాను. ఆయన డబ్బా అడుగున అంటుకున్న
మట్టి లా ఉన్న బెల్లం తీసి చిన్న ముద్ద గా చేసి ఆ కూర్రాడికి ఇచ్చి ' ఇదిగో నల్లమందు ' అని చెప్పి
ఇవ్వమన్నారు. అది వేసుకుని ఆయన మాట్లాడకుండా పడుకున్నాడు.
ఇప్పుడు నేను ఇచ్చే విభూతి అలాంటిదే. నమ్మిన వాళ్లకి నమ్మిన శాతం బట్టి తమలో ఉన్న శక్తే
అద్భుతాలు చేస్తుంది.
" అంటే వాళ్ళ వాళ్ళ నమ్మకం బట్టి అన్నమాట" అన్నాడు నారాయణ విశ్లేషించు కుంటూ
"మనం ఏమీ డబ్బు తీసుకోవటం లేదు కదా. ఏ కొద్ది మందికి పనిచేసినా మంచిదే కదా?" అన్నారు
స్వామి.
నారాయణ గారు నమస్కరించి వెళ్లి పోయాడు.
ఆఖరున రామకోటి రామ లక్ష్మి గారు వచ్చింది.
ఆవిడ రాగానే " ఏమి కావాలమ్మా? " అని అడిగారు స్వామి
" నాకు ఏ కోరికలు లేవు స్వామి. పిల్లలంతా ఎవరి జీవితాలు వాళ్లు గడుపుతున్నారు. ఇహం
లో కానీ, పరం లో కాని నాకు ఇంకేమీ అక్కరలేదు. మోక్షం మాత్రం ప్రసాదించండి " అంది వినయం
గా
" ఇంకేమీ అక్కరలేక పోవడమే మోక్షం. అంత కన్నా వేరే ఏమీ లేదు. ఈ విభూతి నోట్లో వేసుకోండి
చాలు " అని విభూతి ఇచ్చారు, ఆమెకి. అదే నల్ల మందు లాగ పనిచేస్తుంది అనుకుంటూ
సమాప్తం