భాగవత కథలు - 7 ధ్రువ చరిత్ర - కందుల నాగేశ్వరరావు

Dhruva charitra
భాగవత కథలు - 7 ధ్రువ చరిత్ర
స్వాయంభువ మనువుకు శతరూప అనే భార్యవలన “ప్రియవ్రతుడు”, “ఉత్తానపాదుడు” అని ఇద్దరు కుమారులు కలిగారు. వారిలో ఉత్తానపాదునికి “సునీతి”, “సురుచి” అని ఇద్దరు భార్యలు. పెద్ద భార్య సునీతి కొడుకు “ధ్రువుడు”, చిన్న భార్య సురుచి కొడుకు పేరు “ఉత్తముడు”. ఉత్తాపాదునికి చిన్న భార్య సురుచి మీద మిక్కిలి ప్రేమ. దానితో పెద్ద భార్యను సరిగ్గా పట్టించుకొనేవాడు కాదు.
ఒకనాడు ఉత్తానపాదుడు ఉత్తముడిని తన తొడలపై కూర్చుండబెట్టుకొని ఆడిస్తున్నాడు. అప్పుడు ధ్రువుడు కూడా తన తండ్రి తొడలపై కూర్చోవాలని ప్రయత్నించాడు, కాని తండ్రి దగ్గరకు తీసుకోలేదు. అప్పుడు సురుచి గర్వంగా సవతి కొడుకును చూచి ఇలా అన్నది. “నా కడుపున పుట్టినవాడే తండ్రి ఒడిలో కూర్చునే అర్హుడు. వేరొకరి గర్భాన పుట్టిన నీకు ఆ అదృష్టం లేదు. నీవు విష్ణుదేవుని ప్రార్థించి నా కడుపున పుట్టేటట్లు కోరుకో. అప్పుడు నీ కోరిక నెరవేరుతుంది.”
పినతల్లి సురుచి మాటలు ధ్రువుడు భరించలేకపోయాడు. ఆమె చెప్పిన మాటలు మనస్సుకు గుచ్చుకున్నాయి. భిగ్గరగా ఏడుస్తూ కన్నతల్లి దగ్గరకు వెళ్లాడు. ఆమె కుమారుని బుజ్జగించి విషయం తెలుసుకుంది. సవతి మాటలకు ఆమె కూడా కుమిలి పోయింది. తరువాత కుమారునితో ఇలా అన్నది. “ నాయనా ఏడవకు. పూర్వజన్మలో చేసిన పాపం మనం అనుభవించక తప్పదు. మీ నాన్నగారు నన్ను దాసీలాగ కూడ చూడటం లేదు. నీ సవతి తల్లి చెప్పినట్లు ఏ దిక్కు లేనివానికి ఆ శ్రీహరియే దిక్కు. మీ తాతగారైన స్వాయంభువ మనువు వలె ఆ దేవదేవుని పాదాలను ఆశ్రయించు. నీ కోరికలన్నీ నెరవేరుతాయి.”
తల్లి మాటలువిన్న ధ్రువుడు తన మనస్సు గట్టిపరచుకొని పట్టణము నుండి బయటకు వచ్చాడు. దివ్యదృష్టితో ఈ విషయం తెలుసుకున్న నారదమహర్షి అతని దగ్గరకు వచ్చి ఆశీర్వదించి ఇలా అన్నాడు. “ కుమారా మానవులకు సుఖదుఃఖాలు దైవసంకల్పం వల్లనే కలుగుతాయి. మీ తల్లి చెప్పిన యోగమార్గం అతి కఠినమైనది. నీవు ఆటపాటలతో గడపాల్సిన పసివాడివి. ఈ ప్రయత్నం విరమించుకో. మోక్షం మీద కోరిక ఉంటే ముసలితనంలో ప్రయత్నించ వచ్చు.”
నారదుని మాటలు విన్న ధ్రువుడు ఇలా అన్నాడు. “ స్వామీ, ఇతరులెవ్వరూ పొందని స్థానాన్ని పొందాలని ఆశపడుతున్నాను. నాకు చక్కని ఉపాయాన్ని ఉపదేశించు.” ధ్రువుని మాటలు విన్న నారదుడు “నిన్ను ఆ నారాయణుడే మోక్షమార్గాన్ని పొందడానికి ప్రేరేపించి ఉంటాడు కాబట్టి ఆ మహానుభావుణ్ణి సేవించు. యమునా నది ఒడ్డున ఉన్న మధువనానికి వెళ్ళి స్ధిరమైన మనస్సుతో శ్రీహరిని ధ్యానించు.” అని చెప్పి, ‘ఓం నమో వాసుదేవాయ’ అనే వాసుదేవ మంత్రాన్ని ఉపదేశించాడు. అప్పుడు ధ్రువుడు నారదునకు ప్రదక్షిణం చేసి, నమస్కరించి, మధువనానికి బయలుదేరి వెళ్లాడు.
తరువాత నారదుడు ధ్రువుని తండ్రి అయిన ఉత్తానపాదుని దగ్గరకు వెళ్లాడు. రాజు చేసిన పూజలు అందుకొని, ఉన్నతాసనం పైన కూర్చొన్న తరువాత, రాజా నీ మొహం వాడిపోయి ఉంది. నీ విచారానికి కారణం ఏమిటి అని అడిగాడు. అందుకు ఉత్తానపాదుడు “ నా అయిదేండ్ల కుమారుని నేను అవమానించాను. అందుకు వాడు అలిగి, తల్లితో పాటు వెళ్ళిపోయాడు. వాడు ఏమైనాడో అనే బాధతో దుఃఖిస్తున్నను. నా చిన్న భార్య మీద ప్రేమతో ఈ దుర్మార్గపు పని చేసాను.” అప్పుడు నారదుడు “రాజా, నీ కుమారుణ్ణి నారాయణుడు రక్షించాడు. ధ్రువుడు విష్ణుదేవుని సేవించి సమస్త దిక్పాలకులూ పొందలేని నిత్యపదాన్ని పొందుతాడు. తొందరలోనే నీ దగ్గరకు వస్తాడు. నీ కీర్తిని కల్పాంతం వరకూ ఉండేటట్లు చేస్తాడు.” అని చెప్పి నిష్క్రమించేడు.
ధ్రువుడు మధువనంలో ప్రవేశించి యమునా నదిలో స్నానం చేసాడు. ఏకాగ్ర దృష్టితో సకల సృష్టికి కారణమైన భగవంతుని ధ్యానించాడు. నియమంతో, ఒంటి కాలిపై నిలబడి, తన శ్వాసను కూడా బంధించి పరమేశ్వరునితో అనుసంధానం చేసాడు. ఈ విధంగా శ్వాసను నిరోధించడం వల్ల శ్రీహరి కంపించాడు. ఆయన కంపించగానే లోకాలన్నీ ప్రకంపించాయి. ఈ విపత్తును గ్రహించిన దిక్పాలకులు ఆపదను తొలగించమని లోకరక్షకుడైన విష్ణుమూర్తిని ప్రార్థించారు.
దేవతల ప్రార్థన విన్న నారాయణుడు వారిని ఓదార్చాడు. ధ్రువుడు అనే బాలుడు నా యందు మనస్సును లగ్నంచేసి తపస్సు చేస్తున్నాడు. దాని వలన మీకు ఈ విపత్తు కలిగింది. మీరు బయపడకండి నేను ఆ బాలుని విరమింప చేస్తాను అని చెప్పాడు. ఆ తరువాత శ్రీహరి తన గరుడవాహన మెక్కి మధువనానికి వెళ్ళాడు.
ధ్రువుడు తన ముందు సాక్షాత్కరించిన కరుణామూర్తిని చూడగానే అతని మనస్సులోని రూపం మాయమయ్యింది. స్వామిని చూసి పులకించాడు. సాష్టాంగ నమస్కారం చేసాడు. భగవంతుని ఎలా స్తుతించాలో తెలియక తడబడుతూ నిలబడ్డాడు. ధ్రువుడి ఆలోచన గ్రహించిన పద్మనాభుడు తన చేతి శంఖంతో ఆ బాలుని చెక్కిలి తాకాడు. భగవంతుడు ప్రసాదించిన మహిమ వలన సుజ్ఞాని అయిన ధ్రువుడు పలు విధాల ఈశ్వరుణ్ణి స్తుతించాడు.
అప్పుడు భగవంతుడు మనస్సులో సంతోషించి ఇలా అన్నాడు. “ రాకుమారా, నీ వ్రత దీక్షకు మెచ్చాను. నీ అభిప్రాయాన్ని గ్రహించాను. నీ కోరిక తప్పక తీరుస్తాను. గ్రహాలూ, నక్షత్రాలూ, తారా గణాలు, సప్తర్షి మండలమూ, జ్యోతిశ్చక్రమూ దేనిని ప్రదక్షిణ చేస్తుంటారో అటువంటి ‘ధ్రువక్షితి’ అనే మహోన్నతమైన స్థానాన్ని అరవై ఆరు వేల సంవత్సరాల తరువాత నీవు పొందుతావు. ఇదివరకు ఎవ్వరూ దానిని పొందలేదు. మూడు లోకాలు నశించేటప్పుడు కూడా అది నశింపక ప్రకాశిస్తూ ఉంటుంది. అంత వరకు నీ తండ్రి రాజ్యాన్ని ధర్మ మార్గాన పరిపాలిస్తావు.” ఇలా ధ్రువుడి కోర్కెలను తీర్చి, అతడు చూస్తుండగానే నారాయణుడు అంతర్ధాన మయ్యాడు.
పెక్కు జన్మలెత్తినా కూడా పొందలేని స్థానాన్ని పొంది కూడా తన కోర్కె సిద్ధించలేదని ధ్రువుడు భావించాడు. పినతల్లి ఆడిన దుర్భాషలు మాటిమాటికీ స్మరిస్తున్న కారణంచేత, హరి ప్రత్యక్షమైనా ముక్తిని కోరలేక పోయినందుకు మనస్సులో పరితపించాడు. పేదవాడు మహారాజును సమీపించి ఊకతో కూడిన నూకలు కోరినట్లుగా పరమాత్మ ప్రత్యక్షమైనా నేను సంసారాన్ని కోరుకున్నాను అని ధ్రువుడు విచారించాడు.
హరి అనుగ్రహం అందుకొని కన్న కుమారుడు తిరిగి వస్తున్నాడని చారుల వల్ల తెలుసుకున్న ఉత్తానపాదుడు బంధు మిత్రులతో, మంత్రులతో, ఇద్దరు భార్యలతో బంగారు పల్లకీలు ఎక్కి వెళ్ళి ధ్రువుని కలుసుకున్నాడు. భగవంతుని కరుణాకటాక్షాలు పొందిన తన కుమారుడిని ప్రేమతో కౌగలించుకుని మైమరచి పోయాడు. వినయంతో ధ్రువుడు తల్లులిద్దరికీ భక్తితో నమస్కరించాడు. పినతల్లి సురుచి కూడా ఆనందంతో ‘చిరంజీవ’ అని ఆశీర్వదించింది. భగవంతుని దయకు పాత్రుడైన వానిని అందరూ అనుకూలభావంతో చూస్తారు. వారికి శత్రువులెవరూ ఉండరు. ధ్రువుడు తమ్ముడు ఉత్తముని ప్రేమతో కౌగలించుకున్నాడు. తల్లి సునీతి ప్రేమాభిమానాలు పొంగిపొరలగా తన కొడుకును దగ్గరకు తీసుకొని వాని స్పర్శతో ఇన్నాళ్ళు తను పడిన దుఃఖాన్ని మరచిపోయింది. అప్పుడు దేవేంద్రుడు స్వర్గంలో ప్రవేశించినట్లుగా ధ్రువుడు తిరిగి రాజభవనంలో ప్రవేశించాడు.
కొన్ని సంవత్సరాల తర్వాత తనకు ముసలితనం వచ్చిందని తెలుసుకొని, రాజర్షి ఉత్తానపాదుడు నవయవ్వనవంతుడైన ధ్రువునకు పట్టాభిషేకం చేసి తపోవనానికి వెళ్ళిపోయాడు. ధ్రువుడు శింశుమార ప్రజాపతి కుమార్తె ‘భ్రమి’ ని వివాహమాడి, ఆమెవల్ల ‘కల్పుడు’, ‘వత్సరుడు’ అనే ఇద్దరు కుమారులను; వాయు పుత్రిక ‘ఇల’ ను వివాహమాడి, ఆమె ద్వారా ‘ఉత్కలుడు’ అనే కుమారుని, ఒక కుమార్తెను పొందెను.
ధ్రువుని తమ్ముడైన ఉత్తముడు పెండ్లి కాకముందే హిమాలయ ప్రాంతంలోనున్న ఒక అడవికి వేటకు వెళ్ళి అక్కడ ఓ యక్షుని చేతిలో మరణించాడు. ఉత్తముని తల్లియైన సురుచి పుత్ర దఃఖంతో అడవికి వెళ్ళి అక్కడ మంటలలో చిక్కి మరణించింది.
మహావీరుడైన ద్రువుడు తమ్ముని మరణవార్త విని దుఃఖంతోను, కోపంతోను యక్షుల నగరమైన అలకాపురి చేరి ఆకాశం మారుమ్రోగేటట్లుగా శంఖం పూరించాడు. తనను ఎదిరించిన పదమూడువేల యక్షవీరులను గాయపరిచాడు. యక్షులంతా ధ్రువుని చుట్టుముట్టి బాణాలతో ముంచేసారు. ధ్రువుడు తన భుజపరాక్రమం తో శత్రు వీరుల శస్త్రాస్త్రాలను చెల్లాచెదురు చేశాడు. శత్రు సేనలను క్షణంలో మట్టుపెట్టాడు. మిగిలినవారు భయపడి పారిపోయారు. అప్పుడు రాక్షసుల మాయలు ధ్రువుణ్ణి కప్పివేశాయి. మహామునులు చేసిన హెచ్చరికతో రాక్షసమాయను గ్రహించిన ధ్రువుడు శ్రీహరిని స్మరించి నారాయణాస్త్రాన్ని ప్రయోగించాడు.
ఈ విధంగా ధ్రువుడు వధిస్తున్న నిరపరాధులైన యక్షులను చూసి ధ్రువుడి తాతగారైన స్వాయంభువ మనువు ఋషులతో కూడి వచ్చి ధ్రువునితో ఇలా అన్నాడు. “బిడ్డా, ఆగ్రహాన్ని చాలించు. తమ్ముని చావునకు పరితపించి నిరపరాధులైన యక్షులను సంహరించడం సరికాదు. నువ్వు మన వంశంలో పుట్టిన పుణ్యాత్ముడివి. వెంటనే నీ యుద్ధం విరమించు. శివుని సోదరుడైన కుబేరులని పట్ల అపరాధం చేసావు. ఆయనను ప్రార్థించు.” అని చెప్పి నిష్క్రమించాడు.
ధ్రువుని ప్రార్థనకు సంతోషించిన కుబేరుడు ప్రత్యక్షమై “కుమారా, నీ తాతగారి ఉపదేశాన్ని మన్నించి నీవు విరోధాన్ని విడిచి పెట్టావు. అందువలన నాకు ఎంతో సంతోషం కలిగింది. జీవుల పుట్టుకకూ, నాశనానికీ ‘కాలమే’ కారణం. భగవంతుడే అన్ని కర్మలకూ సాక్షీభూతుడు. నీ తమ్ముణ్ణి చంపింది యక్షులు కారు. యక్షులను చంపింది నువ్వు కావు.” అని చెప్పి, ఎన్నో వరాలు ఇచ్చి అంతర్ధాన మయ్యాడు.
ధ్రువుడు రాజధానికి మరలి వచ్చి ధర్మనిరతుడై యజ్ఞయాగాదులు నిర్వర్తించి పురుషోత్తముడిని పూజిస్తూ 66వేల సంవత్సరాలు రాజ్యపాలన చేసాడు. తరువాత రాజ్యాన్ని కుమారునికి అప్పగించి, బదరికావనానికి వెళ్ళి కాలం గడుపుతూ ఉన్నాడు. కొన్నేళ్ళకు ధ్రువుడి వద్దకు ఒక దివ్య విమానం వచ్చింది. అందులోనుండి దిగిన విష్ణుకింకరులు “ ఓ రాజా, నువ్వు తపస్సు చేసి మెప్పించిన విష్ణుమూర్తి మమ్మల్ని నీ వద్దకు పంపించాడు. ఎవరికీ దొరకని విష్ణుపదాన్ని నీకు ప్రసాదించాడు. దయచేసి ఈ విమానాన్ని ఎక్కండి” అన్నారు. ధ్రువుడు ఆ రథం ఎక్కబోతూ తల్లిని విడిచి వెళ్తున్నందుకు విచారించాడు. ఇది గ్రహించిన కింకరులు అప్పటికే ముందు భాగంలో నున్న సునీతిని చూపించారు. ధ్రువుడు పరమానందబరితుడై తల్లితో కలిసి విష్ణుభక్తులు మాత్రమే చేరుకోగలిగిన దివ్యపదమైన ఆ విష్ణుపదాన్ని చేరుకున్నాడు. ఇలా ధ్రువుడు చేరుతున్న విష్ణుపదం కాంతిమయమైనది. ఆ కాంతి ముల్లోకాలకు విస్తరిస్తుంది.
ఈ ధ్రువ చరిత్ర అతి పుణ్యమైనది. ఈ ధ్రువోపాఖ్యానాన్ని త్రికాలాలలో, పుణ్యదినాలలో భక్తిశ్రద్ధలతో పఠించినా, విన్నా ఉత్తమ గతి మరియు శ్రీహరి అనుగ్రహం లభిస్తాయి.
*****

మరిన్ని కథలు

Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు
Pratibha
ప్రతిభ
- చెన్నూరి సుదర్శన్
Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు