ఉత్తానపాదుడు సునీతి దంపతుల కుమారుడు అయిన ధ్రువుడు గొప్ప విష్ణు భక్తుడు. ప్రశంసనీయమైన యశస్సు కలవాడు. ఆయనకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు అయిన ఉత్కలుడు శాంతమూర్తి, సమదర్శనుడు. మందబుద్ధివలె, వెర్రివాడివలె, ప్రవర్తించేవాడు. మంత్రులు వానిని పిచ్చివానిగా భావించి అతని తమ్ముడైన వత్సరునకు పట్టం కట్టారు. వత్సరుని వంశంలో ‘ఉల్ముకుడు’ అనేవానికి ‘పుష్కరిణి’ అనే భార్య వలన అంగుడు, సుమనుడు, ఖ్యాతి, క్రతువు, అంగీరసుడు, గయుడు అనే ఆరుగురు పుత్రులు ఉదయించారు.
ఒకసారి రాజర్షి అయిన అంగభూపతి అశ్వమేధయాగం తలపెట్టాడు. హోమం పూర్తయిన తరువాత దేవతలు హవిర్భాగాలను అందుకోవడానికి రాలేదు. అప్పుడు సదస్యులు రాజా! నువ్వు పూర్వ జన్మలో చేసిన పాపం వలన నీకు సంతానము లేదు. అందుచేతనే దేవతలు హవిర్భాగాలను భుజించడానికి రాలేదు. నీవు ముందు పుత్రకామేష్టియాగం చేసి పుత్రుణ్ణి పొందాలి. అలాచేస్తే దేవతలు హవిస్సులో తమ తమ భాగాలను అందుకుంటారు. తరువాత యజ్ఞపురుషుడైన శ్రీహరిని ప్రార్థిస్తే నీకు అన్ని కార్యాలు చక్కగా నెరవేరుతాయి అని చెప్పారు. వారి సలహా ప్రకారం అంగరాజు పుత్రకామేష్టి నిర్వర్తించి యజ్ఞపురుషుని ద్వారా లభించిన పాయసాన్ని తన భార్య సునీథకు ఇచ్చాడు. కొద్దిరోజులకు ఆమె గర్భం దరించి ఒక పుత్రుని కన్నది. ఆ కుమారుని పేరు వేనుడు.
ఆ వేనుడు తన మాతామహుడయిన మృత్యుదేవతవలె అధర్మ మార్గంలో జీవించ సాగాడు. చిన్నతనంలోనే తన ఈడు పిల్లలను ఈడ్చుకొని వచ్చి జాలి లేకుండా పశువులను చంపినట్లు చంపేవాడు. పాపమార్గంలో తిరుగుతున్న కుమారుని అంగరాజు ఎన్నో సార్లు దండించాడు. అయినా అతని ప్రవర్తనలో మార్పు లేదు. చెడ్డ కొడుకు వల్ల మనోవ్యథతో ఒకనాడు అంగరాజు ఎవ్వరికీ చెప్పకుండా ఇల్లు విడిచి ఎక్కడికో వెళ్ళి పోయాడు. ఎంత వెదికినా ఆయన జాడ తెలియలేదు.
రక్షకుడైన రాజు లేకపోవడం వలన పశువులవలె ప్రవర్తిస్తున్న ప్రజలను చూసి భృగువు మొదలైన మునీంద్రులు లోక క్షేమం కొరకు వేనుని తల్లి సునీథ అనుజ్ఞతో వేనునికి రాజ్యాభిషేకం చేసారు. వేనుడు స్వభావసిద్ధమైన అహంకారంతో మధించిన ఏనుగు వలె తిరుగుతూ, అందరినీ అవమానిస్తూ తిరిగేవాడు. పరమ సాధువు అయిన సునీథ కడుపున పుట్టినప్పటికీ స్వభావం వలన దుష్టుడు. మునులందరూ ఎంత హితభోధ చేసినా వినలేదు. నేను తప్ప వేరే భగవంతుడు లేడు, నన్ను పూజించండి అని ఆ మునులను హేళన చేసేవాడు. చివరకు ఆ మునీశ్వరుల శాపంతో వేనుడు మరణించాడు.
సునీథ తన కుమారుడి మరణానికి దుఃఖించింది. యోగశక్తి చేత వేనుని శారీరాన్ని చెడిపోకుండా కాపాడింది. రాజు లేకపోవడం వలన దేశమంతా అరాచకమై ఒకరి నొకరు హింసించు కోవడం, దోపిడీలు, హత్యలు ఎక్కువ కావడం జరిగిందని గ్రహించారు. ఎంతో గొప్ప పేరు గాంచిన వంశం ఇంతటితో ముగియ కూడదని, వంశాన్ని నిలబెట్టాలని మునులు నిర్ణయించుకున్నారు. వేనుని శవాన్ని సమీపించి మునీంద్రులు అతని తొడను మథించారు. అప్పుడు వేనుని తొడ నుండి ఒక బోయవాడు పుట్టాడు. అతను నల్లగా, పొట్టిగా ఉన్నాడు. ఆ మరుగుజ్జువాడు దీనముఖంతో ‘నేను చేయవలసిన పని ఏమిటి’ అని అడిగాడు. అప్పుడు మునులు ‘నిషీద’ అనగా ‘కూర్చుండు’ అన్నారు. అందుచేత వాని పేరు ‘నిషాదుడు’ అయింది. అతని కులంలో పుట్టిన వాళ్ళంతా నిషాదులై పర్వతాలలో అడవులలో సంచరిస్తూ వేనుని చెడు పనులకు వారసులయ్యారు.
ఆ తరువాత మునులు వేనుని హస్తాలను మథించారు. అప్పుడు ఆ చేతుల నుండి లోక సంరక్షణార్థం శ్రీమన్నారాయణ అంశతో ఒక పురుషుడు, లక్ష్మీదేవి అంశతో ఒక స్త్రీ ఉద్భవించించారు. అది చూసి ప్రజలందరూ ఎంతో సంతోషించారు. ఆ పురుషుడే “పృథు చక్రవర్తి” అనే పేరుతో సుప్రసిద్ధుడయ్యాడు. ఆ స్త్రీ పేరు “అర్చి”. ఆ కన్యకు సుగుణాలే అలంకారాలు. ఆమె పృథు చక్రవర్తిని వరించింది. వారిద్దరు దంపతులైన శుభ సమయంలో దేవతలు పూలవానలు కురిపించారు. అప్సరలు నాట్యం చేశారు. కిన్నెరులు గానం చేశారు. బ్రహ్మాదిదేవతలు పృథువు నారాయణాంశతోను, ఆయన భార్య అర్చిమహాదేవి లక్ష్మీదేవి అంశతోనూ పుట్టారని నిశ్చయించుకొని, పృథువుకి శాస్త్రోక్తంగా రాజ్యాభిషేకం చేసారు.
పృథు చక్రవర్తికి కుబేరుడు బంగారు సింహాసనం ఇచ్చాడు. ఇంద్రుడు కిరీటమునూ, వరుణదేవుడు చల్లని వెన్నెల గొడుగునూ, వాయుదేవుడు తెల్లని వింజామరలనూ, ధర్మదేవత పుష్పమాలికనూ, యముడు రాజదండమునూ, బ్రహ్మదేవుడు వేదమయ కవచమునూ, సరస్వతీదేవి ముత్యాల హారమునూ బహూకరించారు. విష్ణుమూర్తి సుదర్శన చక్రమునూ, లక్ష్మీదేవి తరిగిపోని సంపదనూ, పరమేశ్వరుడు అర్ధచంద్రాకారం గల కరవాలమూ, పార్వతీదేవి ‘శతచంద్రం’ అనే డాలునూ, చంద్రుడు తెల్లని గుర్రాలను, సూర్యుడు బాణాలనూ, అగ్ని ధనస్సునూ, భూదేవి పాదుకలను బహూకరించారు.
పృథుచక్రవర్తి ఉత్తముడు. ధర్మపరాయణుడు. మహాదాత. దయామయుడు. ప్రజారక్షకుడు. పరాక్రమవంతుడు. అటువంటి పృథుచక్రవర్తి రాజ్యపాలనలో ఒకసారి భూమి సారహీనమై పోయింది. ప్రజలు పంటలు లేక మలమల మాడిపోతూ రాజును శరణుజొచ్చారు. రాజు భూమిపై కోపగించాడు. భూదేవి భయంతో గోవు రూపం ధరించి పారిపోయింది. రాజు వదలక వెంటాడాడు. హవిర్భాగాన్ని స్వీకరించి కూడా ఎందుకు ధాన్యాలను విస్తరింప లేదు అని ప్రశ్నించాడు.
కోపంగా ఉన్న చక్రవర్తిని చూసి భూదేవి “రాజా, శాంతించు. నాకు అభయాన్ని ప్రకటించు. పూర్వం బ్రహ్మదేవుడు నాలో ఉంచిన ఓషధుల్ని దుర్జనులు అనుభవించారు. కొన్ని దొంగలు ఎత్తుకు పోయారు. అందువలన నేను బక్కచిక్కిపోయాను. యజ్ఞాలు జరపడానికి వీలుగా మిగిలిన ఓషధుల్ని నేను మింగివేసాను. అవి జీర్ణించుకు పోయాయి. నువ్వు దోహనక్రియను కల్పించి నా పొదుగు నుండి తిరిగి ఓషధులను పొందవచ్చు. నేను ఇప్పుడు మిట్టపల్లాలతో విషమంగా ఉన్నాను. నన్ను చదును చేసి సమంగా చెయ్యి.” అని చెప్పింది.
అప్పుడు పృథువు సంతోషింతో మనువును గోవత్సంగానూ, తన చేతిని పాత్రగాను చేసి తను దోగ్ధగా భూమి నుండి ఓషధులను పితికాడు. తరువాత ఋషులు వేదమయమైన క్షీరమును; దేవతలు అమృతమయమైన క్షీరమును; అప్సరసలు, గంధర్వులు ‘గాంధర్వం’ అనే క్షీరమును; పితృదేవతలు ‘కవ్యము’ అనే క్షీరమును; సిద్ధులు ‘సిద్ధి’ అనే క్షీరమును; విద్యాధరులు విద్యామయమైన క్షీరమును; కింపురుషాదులు ‘మాయ’ అనే క్షీరమును; పిశాచాలు రుధిర క్షీరమును; నాగులు విషరూపమైన క్షీరమును; క్రూరమృగాలు ‘మాంసం’ అనే క్షీరమును; పక్షులు కీటకాలు, ఫలాదులు అనే క్షీరమునూ – ఈ విధంగా అందరూ తగిన పాత్రలలో తమకు తగిన క్షీరములను భూమి నుండి పిండుకున్నారు. అప్పుడు పృథుచక్రవర్తి అందరి ఆకలిని తీర్చిన భూదేవిని తన కుమార్తెగా స్వీకరించాడు. ప్రజలు భయం పోయి సుఖసంపదలతో బ్రతుకుతున్నారు.
పృథు మహారాజు మహా వైభవంగా 99 అశ్వమేథాలు పూర్తి చేసి నూరవ యాగాన్ని ప్రారంభించి యజ్ఞేశ్వరుడైన శ్రీహరిని ఆరాధింపసాగాడు. ఇంద్రుడు ఇదంతా చూసి అసూయ పడ్డాడు. మాయావేషం ధరించి, యజ్ఞాశాలకు వచ్చి యజ్ఞపశువును అపహరించి ఆకాశమార్గం పట్టాడు. అత్రిమహాముని ఈ విషయం పృథుచక్రవర్తి కుమారునకు చెప్పగా అతను కోపంతో ఆకాశంలో వెళ్ళే ఇంద్రునిపైకి దుమికాడు. ఇంద్రుడు దొంగవేషాన్నీ, గుర్రాన్ని విడిచిపెట్టి పారిపోయాడు. అతని పరాక్రమానికి మెచ్చి మునులు అతనికి ‘జితాశ్వుడు’ అని పేరు పెట్టారు.
ఇంద్రుడు గుర్రాన్ని అపహరించిన సంగతి పృథు చక్రవర్తికి తెలిసి కోపంతో అతనిపై బాణాన్ని ప్రయోగించడానికి సిద్ధపడ్డాడు. అప్పుడు విద్వాంసులు యజ్ఞదీక్షితుడైనవాడు యజ్ఞపశువును తప్ప మరి దేనినీ వధించరాదు, కాబట్టి ఇంద్రుణ్ణి సంహరించే పని విరమించు అని చెప్పారు. బ్రహ్మదేవుడు పృథుచక్రవర్తితో “రాజా ఇంక నువ్వు యాగాలు చేయవలసిన అవుసరం లేదు. నీకు తొంభై తొమ్మిది యజ్ఞాలు చేసిన ఫలం అప్పటికే లభించింది. మోక్షధర్మం తెలిసిన వాడివి కాబట్టి నీవు ఇంద్రుని పై రోషం విడిచిపెట్టి అతనికి క్షమించు. ఇంద్రుడి మాయవల్ల పుట్టిన పాషండులు భూలోకం అంతా వ్యాపించకుండా ఉండాలంటే నువ్వు ఈ యజ్ఞాన్ని ఆపివేయాలి” అని చెప్పాడు.
బ్రహ్మ ఆజ్ఞను తలదాల్చి పృథువు ఇంద్రుడితో మైత్రి చేసుకున్నాడు. ఇంద్రుడు రాజును క్షమాపణ కోరాడు. యజ్ఞభోక్త అయిన శ్రీహరి పృథువుతో “ప్రజలను రక్షించడం రాజుకు పరమ ధర్మం. నీవు ప్రజల అనురాగాన్ని పొంది సమచిత్తంతో పరిపాలించు. ధర్మార్థకామాలు మూడింటి యందు ఆసక్తి వీడు.” అని ఉపదేశించాడుపృథుచక్రవర్తి చేసిన పూజా సత్కారములు గ్రహించి శ్రీహరి సంతుష్టి చెందాడు. పృథుచక్రవర్తిని ఆశీర్వదించి వైకుంఠానికి తిరిగి వెళ్ళాడు. నరులు, సిద్ధులు, మునులు, గంధర్వులు, కిన్నరులు, పితృదేవతలు అందరూ చక్రవర్తి సత్కారాలు అందుకొని సంతోషంతో తమ నివాసాలకు వెళ్లారు. ఆ తరువాత పృథువు నగరానికి వచ్చి ప్రజల స్వాగతాన్ని అందుకొని, అంతఃపురంలో ప్రవేశించాడు.
పవిత్ర చరిత్రుడు, యశస్వంతుడు అయిన పృథుచక్రవర్తి పురాకృత సుకృతం వల్ల ప్రాప్తించిన భోగభాగ్యాలను అనుభవించాడు. జనరంజకుడై, దుండగులకు దండధరుడై సప్తద్వీపాలలో విస్తరించిన రాజ్యాన్ని పరిపాలించాడు. కొంతకాలం తరువాత ఒకనాడు దీర్ఘసత్రమనే యాగం చేయాలనే కోరికతో దీక్ష వహించాడు. ఆ యాగంలో నిత్యమంగళాకారుడు అయిన మహారాజు తేజస్సుతో విరాజిల్లుతూ, ఋషులను, పితృదేవతలను చక్కగా పూజించాడు.
ఆ సమయంలో పృథుచక్రవర్తి సదస్యులను ఉద్దేశించి గంభీరమైన మాటలతో “దయచేసి వినండి. ధర్మాన్ని నిలబెట్టడానికి బ్రహ్మదేవుడు నన్ను నియోగించాడు. ధర్మబద్ధమైన ప్రజాపాలన సమర్థవంతంగా ఆచరించేవానికి కర్మసాక్షి అయిన భగవంతుడు ఏ లోకాలను అనుగ్రహిస్తాడో ఆ పుణ్యలోకాలు నాకు లభిస్తాయి. రాజు ప్రజలను ధర్మమార్గంలో నడిపించాలి గాని ధనాపేక్షతో పన్నులు వసూలు చేయకూడదు. అలా చేస్తే ప్రజలు చేసిన పాపాలు రాజుకే సంక్రమిస్తాయి. ప్రజలు చేసే మంచి పనులు రాజుకు మంచి చేస్తాయి. ప్రజలు అసూయారహితులై, సర్వం పరమేశ్వరార్పణ అనుకుంటూ ధర్మాన్ని ఎల్లప్పుడూ ఆచరించాలి. అదే మీరు నాకు చేసే సేవ. భక్తితో భగవంతుడైన వాసుదేవుని పాదపద్మాలను ఆశ్రయించుకొన్నవానికి సమస్త దోషాలు తొలగిపోతాయి. విజ్ఞానము, ధైర్యమూ, శక్తీ లభిస్తాయి. అపారమైన సంసార దుఃఖాన్ని పొందరు. గొప్ప వైరాగ్యం ప్రాప్తిస్తుంది” అని చెప్పాడు. సదస్యులు ఆయనను ఈశ్వరునిగా భావించి నమస్కరిస్తూ, జయజయధ్వానాలు చేసారు.
ఆ సమయంలో బాలసూర్యుల వలె ప్రకాశించే దేహాలతో సనకసనందనాది మహాసిద్ధులు అక్కడికి విచ్చాశారు. మహారాజు వినయంతో ఆ యోగీంద్రులకు నమస్కరించి, ఆసనములపై కూర్చుండబెట్టి పూజించాడు. మీరు లోక శుభంకరులు. మీ రాక వల్ల నాకు సర్వశుభాలు లభిస్తాయి. నాకు మోక్షసాధనమైన ఉపదేశాన్ని ఇవ్వండి అని అన్నాడు. పరమ యోగీంద్రుడైన సనత్కుమారుడు పృథుచక్రవర్తికి బ్రహ్మ తత్త్వాన్ని భోధించాడు. ఆ సిద్ధులు చక్రవర్తి భక్తికి సంతుష్టులై ఆయనను దీవించి ఆకాశగమనంలో వెళ్ళిపోయారు. తదుపరి పృథుచక్రవర్తి సదాచారపరాయణుడై, సత్కర్మలను ఆచరిస్తూ, భార్యయైన అర్చిమహాదేవి వల్ల తనతో సమానులైన విజితాశ్వుడు, ధూమ్రకేశుడు, హర్యశ్వుడు, ద్రవిణుడు, వృకుడు అనే ఐదుగురు కుమారులను పొందాడు. ఆ రాజేంద్రుడు “రాజ” అనే శబ్దాన్ని సార్ధకం చేసుకున్నాడు.
ఒకనాడు మహారాజు తనకు వార్ధక్యం వచ్చిందని తెలుసుకొని రాజ్యాన్ని కొడుకులకు అప్పగించాడు. ప్రజలు విచారంతో చూస్తుండగా భార్యతో కలిసి తపోవనానికి వెళ్ళాడు. అత్యంత ఘోరమైన తపస్సును ఆచరించాడు. తరువాత నిజశరీరాన్ని విడిచిపెట్టి ముక్తిని పొందాడు. మహాసాధ్వి అయిన అర్చిమహాదేవి పతిదేవుని పాదపద్మాలను స్మరిస్తూ చితిమీద సహగమనం చేసింది. ఆమె పాతివ్రత్యాన్ని దేవతలు కొనియాడారు. పృథుచక్రవర్తి, అర్చి దివ్యపదమైన విష్ణులోకాన్ని పొందారు.
ఈ పృథుచక్రవర్తి పుణ్య చరిత్ర విన్నా, చదివినా శుభాలను కలిగిస్తుంది. ధర్మార్థకామ మోక్షాలను సిద్ధింప చేస్తుంది. శ్రీహరిపాదాల మీద నిశ్చలమైన భక్తి కలుగుతుంది. విష్ణుపదాన్ని పొందుతారు.
*************