సిగ్గుతో,తన చూపులు భూమాతకు అర్పిస్తూ, పదహారణాల తెలుగమ్మాయిలా! అత్తిపత్తి ఆకులా! ముడుచుకు కూర్చున్నది ఆమె. సాంప్రదాయ వస్త్రధారణలో ముగ్ద రూపంతో. కాస్త దగ్గరగా గోడకు ఒక ప్రక్కగా నిలబడి అల్లరి చూపుల్తో ,మన్మధ బాణాలను సంధిస్తున్నాడు అతను. మేఘాల మాటున దాగిన చందమామలా, వెలుగులు చిందే మోముతో,మనస్సులోని ప్రేమను జతచేస్తూ..కొంటె తనం రంగులద్దుకున్న బాణాలవి. సున్నితంగానే తిరస్కరిస్తుంది ఆమె. మకరందం గ్రోలుతున్న తుమ్మెదను, సుమం సున్నితంగా నిలవరిస్తున్నట్లు. మరి కాస్త చనువు తీసుకుంటున్నాడు అతను. పొద్దుతిరుగుడు పువ్వులాగా తల వాల్చింది ఆమె. కల్మషం లేని ప్రేమలోకం వారిరువురిది. ఎటువంటి స్వార్దం దరి చేరనివ్వని అనుబంధం వారిది. ఆమె....అల అతను... సవ్వడి ఆమె .. విచ్చుకున్న పుష్పం. అతను ...పరిమళం ఆమె ....నింగి అతను ....నెలవంక ఆమె వయస్సు డెభై పూర్తి చేసుకుంటుంది . అతని వయస్సు మరో రెండు కలుపుకుంది. ఆమె పేరు తారామణి,అతని పేరు సుబ్బారావు. ఆదర్శ దాంపత్యానికి నిలువెత్తు సాక్ష్యం వారే. ,*** "హోయ్! కుర్రాడా....?, ఏమిటా చిలిపి సైగలు." నోటికి చేతులు అడ్డుగా పెట్టుకుని, నవ్వుతుంది డెభై వసంతాలు పూర్తి చేసుకున్న తారామణి,బోసి నవ్వుల పసిపాపాయిలా. నోటిలో ఊడిపోగా! మిగిలిన పన్నెండు పళ్ళు కనిపించనీయక జాగ్రత్త పడుతూ, దాచేసే ప్రయత్నంలో.... జారిపోతున్న పట్టు పంచెను సరి చేసుకుంటూ.. కొత్తగా కొన్న కళ్ళజోడు మాటున చూపులను దాచేస్తూ,గాల్లోనే ఓ ముద్దు బట్వాడా చేసాడు సోగకళ్ళు సుబ్బారావు గారు. "అందుకోగలవా"అంటూ.. అక్కినేని నాగేశ్వరరావు గారిలా అభినయుస్తూ. ముద్దును అంతే చాకచక్యంగా! గాల్లోనే అడ్డుకుని . "చూసావా..."అనేలా కనుసైగ చేసింది. నడుము పైన చేతులు ఉంచుతూ,నిలబడి చూస్తూ తారామణి. "నీ ముందు నా ఆటలు సాగవులే"అనే జాలి చూపులను, తారామణికి కానుకగా ఇచ్చేసాడు సుబ్బారావుగారు. తల మీద అక్కడక్కడా ఉన్న నాలుగు వెంట్రుకల్తో, కలిపి అల్లుకున్న జడ చివరి జడ గంటలను , చేతితో తిప్పుతూ.. అల్లరిగా సుబ్బారావు గారి వైపు చూసింది తారామణి. క్రింది పెదవిని పంటితో నొక్కుతూ. "చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది,దానీ దిమ్మ దియ్యా,అందమంతా చీరలోనే ఉన్నది,"అని పాడుతూ, తొలిసారిగా ప్రేమలో గెలిచిన యువకుడిలా " చేతిని గాల్లో ఊపేసాడు సుబ్బారావు గారు. "ఇకచాల్లే! ఇలా రండి " వయస్సు పెరుగిన కొలది ,అల్లరి ఎక్కువ అవుతుంది." తన పక్కన ఉన్న కాస్త స్థలం చూపెడుతూ ప్రేమగా పిలిచింది తారామణి. "ఉండవోయ్!ఉరికే కూర్చునేందుకా? పార్కు దాకా మనం వచ్చింది ?" "కుదిరించుకుని రెండు గంటల పాటు మాటలు,ఆ తరువాత ,సమోసాలు,వేడివేడి మిరపకాయ్ బజ్జీలు....తినేసి,మెల్లగా రెండు కేసులు చప్పరిస్తూ.. వెళ్ళాలని నేను ఆశ పడుతుంటే.. "ఉండు రెండు పులైసులు తీసుకొస్తా" ఒకరికి ఒకరం తినిపించేసుకుందాం " అంటూ అప్పటి వరకు గోడకు ఆనుకుని ఉన్న సుబ్బారావుగారు , దగ్గర్లో ఉన్న చక్రాల బండి వైపు అడుగులు వేశాడు. "అల్లరి పిల్లోడోయమ్మా!"అనుకుంది మనసులో తారామణి. పేరుకే కాదు?, నిజంగానే అందంలో తారామణి ఆమె. వృద్ధాప్యం చెంతకు చేరనంత వరకూ. ఎందరికో కలల రాకుమారి ఆమె, రోజులో ఒక్కసారైనా ఆమెను చూడాలని , తారామణి ఇంటికి ఎదురుగా ఉన్న సుబ్బారావుగారి ఇస్త్రీ బండి దగ్గరకు వచ్చేవాళ్ళు, ఊరిలోని నూనూగు మీసాల యువకులు. ప్రతి రోజూ వారికి దినచర్యలో భాగంగా మారిపోయింది. సుబ్బారావుగారు వాళ్ళతో పోటీ పడలేకనో?, తనకా అదృష్టం దక్కదు అనుకున్నాడో! ఏమో?, తన పని తాను చేసుకుపోతుండే వాడు. "తంతే బూరేలు బుట్టలో పడ్డాడు" అనే సామెతను నిజం చేస్తూ, తారామణి ఏరికోరి సుబ్బారావుగారిని వరించింది. అతనిలోని అమాయకత్వం.స్వచ్చమైన చిరునవ్వు,వినయంగా నమస్కరించి, పలకరించే విధానం, ఆకట్టుకోవడంతో. అప్పటి వరకూ ఇస్త్రీ బండి సుబ్బారావు,యువకులు దృష్టిలో సినిమాలోని ప్రతినాయకుడులా మిగిలిపోయాడు. ఎందరో యువకుల కలల రాకూమారిని సుబ్బారావు గారు దక్కించుకోవడంతో.అదృష్టాల సుబ్బారావు గారు" అనేవారు అందరూ... ఈర్షగా చూస్తూ.. ఆటపట్టిస్తూ కొందరు,, తమకు దక్కని అదృష్టంను తలుచుకుంటూ..కసిగా కొందరు. అది చూసి ముసి ముసిగా నవ్వుకునేవాడు సుబ్బారావుగారు. "ఎంతపోటీ ఇచ్చారా! మీరు నాకు",అనుకునేవాడు మనసులో. **** "కూర్చున్న జంటలవైపు చూసింది చాల్లే !ఇలా రండి ", తారామణి మాటలకు "వస్తున్నా!వస్తున్నా " పున్నాగ చెట్టు నుండి పూలు తెచ్చి ,తారామణి తలపై తలంబ్రాలు పోసినట్లుగా పోసాడు సుబ్బారావు గారు ..అల్లరిగా. "పెళ్ళిరోజు గుర్తు చేసుకున్నారా?" తన ప్రక్కన ఉన్న కాస్త స్థలం చూపించింది తారామణి. "అవునోయ్.." "ఈ తారామణి నా ఇల్లాలిగా అడుగిడిన రోజు ఎలా మర్చిపోగలను " అంటూ ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు సుబ్బారావు గారు. "అవునవును.." "అయాయకంగా కనిపిస్తూనే,నన్ను ఆకట్టుకుని, బుట్టలో వేసుకున్న, సుబ్బారావు గారి పెళ్ళిరోజు కదా !ఈ రోజు ." సుబ్బారావు గారి భుజాల చుట్టూ చేతిని వేస్తూ ,దగ్గరగా జరిగింది తారామణి. పవిట చెంగున భద్రంగా ముడివేసి దాచిన ,నిమ్మతోనలు తీసి సుబ్బారావు గారికి అందించింది. "ఇవంటే నాకు చాలా చాలా ఇష్టం అమ్మను విసిగించి మరీ కొనిపించుకునేవాన్ని నా చిన్నతనంలో."అంటూ కృతజ్ఞతగా తారామణి వైపు చూస్తూ, నిమ్మతొనలు నోటిలో వేసుకున్నాడు సుబ్బారావు గారు. "అవునవును,! పట్టులంగా ,పాలనురుగు వంటి రవికతో,పదేపదే లేగదూడ వెంట పరుగులు తీస్తూ,నా మనస్సును కూడా నీవైపు తిప్పుకున్న టక్కరి మణి కూడా !నీవే కదా!"అన్నాడు సుబ్బారావు. తారామణి బుగ్గ గిల్లేస్తూ.. ఇద్దరి కన్నుల్లో కల్మషం లేని వెలుగులకు , అదరాలపై చిరునవ్వులు,జతకూడుతుంటే. పగలంతా ప్రహారా కాసిన సూర్యుడు, పడమటి కొండల్లో సేద తీరేందుకు మెళ్లిగా జారుకుంటున్నాడు. దంపతులను ఏకాంతంగా కాలం గడపాలని దీవిస్తూ. ఎప్పుడూ! గడుపదాటని తారామణి, సుబ్బారావుగారి కోసం, ప్రతి సంవత్సరం ఇలా బయటకు వస్తుంటుంది. సరదాగా గడిపేందుకు గతంను తల్చుకుంటూ, చిన్నపిల్లలా ఈ రోజు గడిపేందుకు. బాల్య స్నేహితుల్లా, ఒకరి చేతిని ఒకరు వదలని పసిహృదయం వారిది. యాబై వసంతాల వైవాహిక జీవితాన్ని ప్రతిక్షణం ఆస్వాదిస్తూ,ఒకరి కొరకు అనేలా ,గడుపుతూ,తమకు పిల్లలేరు, అనే విషయం గురించి ఆలోచించక, ఒకరికి ఒకరు చంటి బిడ్డగా ఒదిగిపోతూ. వైవాహిక జీవితాన్ని గడుపుతున్న ఆదర్శ దంపతులు వారు. ఎందరికో ఆదర్శంగా నిలిచిన అపురూపమైన జంట. * శుభం.*