తెలియని మమతల బంధం - B.Rajyalakshmi

Teliyani mamatala bandham
అప్పారావు గారు కిటికీ దగ్గర కూర్చుని చదువుకుంటున్నారు ,ఆయనకు మేడ మెట్లెక్కుతూ యెవరో వగరుస్తూ వస్తున్నట్టుగా అడుగుల చప్పుడు వినిపించింది .దగ్గరకొస్తున్న కొద్దీ అవి రంగయ్య అడుగుల చప్పుడని అర్ధమయ్యింది .భయం ,దుఃఖం ,కంగారు ,చెమటలు తుడుచుకుంటూ రంగయ్య లోపలికివచ్చాడు .
“బాబుగారూ ,బాబుగారూ”వగరుస్తూ ఆయాసపడుతూ అప్పారావు గారి దగ్గర దుఃఖం తో నించున్నాడు .
“ఏమిట్రా ఏమయ్యింది ?అంత కంగారు ?కొంప మునిగినట్టు అంత చప్పుళ్లేమిట్రా?”కోపం గా అరిచారు అయన .
“మన అర్జున్ ని యెవరో చంపేసారు బాబుగారు !” రంగయ్య వగరుస్తూ చెప్పాడు .
“ఆ …ఆ ..ఏమిట్రా నువ్వు చెప్పేది ?అసలేం జరిగిందిరా ?”ఆయన పుస్తకం ప్రక్కన పెట్టేసి విస్మయం గా కంగారు గా రంగయ్యకేసి చూసారు .
“బాబుగారూ !రోజూలాగే పొద్దున్న అర్జున్ తో తోటకెళ్లాను .మొక్కలకు నీళ్లు పెడుతున్నాను అర్జున్ హాయిగా ఆడుకుంటున్నది ,మధ్య మధ్య నేను చూస్తూనే వున్నాను .ఇంతలో తుపాకీ గుళ్ల చప్పుడయింది ,రెప్పపాటులో మన అర్జున్ వాలిపోయింది .”యేడ్చేసాడు రంగయ్య .
అప్పారావుగారు ఒక్క క్షణం శిలయ్యారు.నాలుగేళ్లక్రిందట ఒకరోజు వుదయం పార్కులో నడుస్తుంటే ఒక చెట్టుక్రింద చిన్న కుక్కపిల్ల తెల్లగా ముద్దుగా కూన లాగా వుంది ,కాలికి దెబ్బతగిలి రక్తం కారుతుంటే మూలుగుతూ కనపడింది .అప్పారావు గారు అది చూస్తూ తట్టుకోలేకపోయారు .స్వతహాగా జాలీ ,ప్రేమా దయాగుణం కల వ్యక్తి .ఆ కుక్కపిల్లను యెత్తుకుని యింటికి తెచ్చేసారు .దెబ్బలన్నీ తుడిచి మందు రాసారు .ఎందుకో ఆ కుక్కపిల్ల మీద ఆపేక్ష యేర్పడింది .క్రమం గా కోలుకుంది .ఆయన దానికి “అర్జున్ “అని పేరు పెట్టుకున్నారు అది ముద్దు ముద్దుగా తోకాడిస్తూ ఆయన చుట్టూ తిరుగుతుంటే ఆయనకు తెలియని వుల్లాసం వచ్చేది .బంతి ఆడేవారు అర్జున్ తో ,పేపర్ తెచ్చివ్వడం నేర్పారు .ఆయన కాఫీ త్రాగుతుంటే అర్జున్ కూడా ప్రక్కన గిన్నెలో పాలు తాగుతూ ఠీవిగా చూసేది .వాళ్లిద్దరి మధ్య అనుబంధం పెరిగింది .రోజూ తనతో వాకింగ్ కి వచ్చేది .చెప్పాలంటే అర్జున్ ఆయన దినచర్యలో జీవితం లో ఒక భాగమయ్యింది .ప్రస్తుతం ఓపిక లేక అప్పారావు గారు అర్జున్ ని రంగయ్య కు యిచ్చి వాకింగ్ కు పంపిస్తున్నారు .
అర్జున్ అంటే తన యజమానికి ఎంతిష్టమో ,రంగయ్యకు తెలుసు .నల్లరంగు జూలు ,మెరుస్తున్న కళ్లు అందం గా వుండే అర్జున్ చనిపోయిందంటే వూహించడానికే యిద్దరికీ బాధగా వుంది .
అప్పారావు గారు రంగయ్యా తోటకు వెళ్లారు .వుద్వేగం ,బాధా ,మనసంతా కలచివేస్తున్నది .అప్పారావు గారికి కోపం ,ఆవేశం కూడా వచ్చాయి .రక్తం మడుగులోనిర్జీవం గా పడున్న అర్జున్ ని చూడగానే దుఃఖం ఆగలేదు .నిన్నటి వరకూ తనతో బంతాట ఆడుకున్న అర్జున్ యిప్పుడు కేవలం జ్ఞాపకమే !
అప్పారావుగారికి ఒక జరిగిన సంఘటన గుర్తుకొచ్చింది .తమ ప్రక్క తోటలో కోళ్లను అర్జున్ అల్లరి పట్టిస్తుండేది .ఒకసారి ఆ తోట యజమాని తనతో కోపం గా విసుగ్గా చెప్పాడు కూడా కానీ తను పెద్దగా పట్టించుకోలేదు .చిన్న చిన్న విషయాలకు కుక్కను చంపుతారా !! ఆయనే యీ పని చేసాడేమో
ఆ రాత్రి అప్పారావుగారు నిద్రపోలేదు .మబ్బుల్ని చూస్తూ ,నక్షత్రాలను చూస్తూ ,కీచురాళ్ల శబ్దం వింటూ అర్జున్ జ్ఞాపకాల్లో లీనమయ్యారు .అర్జున్ యిప్పుడు తోటలో అందమైన సమాధిలో శాశ్వత నిద్ర పోతున్నది .కొడుకూ ,భార్యా ,అర్జున్ అందరూ తన జీవితం లోనించి వెళ్లిపోయి గత జ్ఞాపకాలుగా గుండెల్లో నిండిపోయారు .
ఆయనకు యిప్పుడు ప్రతివుదయం అర్జున్ సమాధి దగ్గర కొద్దిసేపు కూర్చుని అక్కడే బంతి విసరడం అర్జున్ పరుగెత్తుతూ తెచ్చి యివ్వడం వూహించుకోవడం దినచర్య అయ్యింది .ఇంటికివచ్చి అర్జున్ నిలువెత్తు చిత్రం ముందు గిన్నెలో పాలు పెట్టి అక్కడే కూర్చుని కాఫీ త్రాగుతుంటే అర్జున్ నవ్వుతూచూస్తూ వుంటుంది ,

మరిన్ని కథలు

Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు
Pratibha
ప్రతిభ
- చెన్నూరి సుదర్శన్
Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు