పరిష్కారం - వెంకటరమణ శర్మ పోడూరి

Parishkaaram

రోజూ లాగే శేఖర్ మారేడుపల్లి లో తన ఇంటికి చేరేటప్పటికి రాత్రి తొమ్మిది అయింది. స్నానము, భోజనం చేసి సోఫా లో కూర్చుని టి వి ఆన్ చేయగానే,

" ఎవరో తెచ్చి ఈ కవర్ ఇచ్చి వెళ్లిపోయారు " అని ఒక చిన్న కవర్ అందించింది భార్య జానకి

పోస్ట్ లో కాకుండా అలా వచ్చి ఇవ్వడం ఏమిటి అని, కవర్ చించి చూశాడు శేఖర్ . లోపల ఒక తెల్ల కాగితం మీద ఎర్రని అక్షరాలు ఉంటె ఏమిటా అని చదివాడు.

" బాగానే సంపాదిస్తున్నావు అంతా నువ్వు ఒక్కడివే తింటే ఎలాగ ? ఎంత ఇస్తావో ఆలోచించుకో రేపు రాత్రి ఫోన్ చేస్తాం తయారుగా ఉండు " అని సంతకం బదులు " ఎవరో నీకు

తెలుసుగా? " అని ఉంది

ముందు శేఖర్ కి అర్థం కాలేదు. కానీ రక్తం తో రాసినట్టు కనిపించేలా ఎర్ర అక్షరాలూ, రాసిన విధానం చూస్తే ఇదేదో తీవ్ర వాదుల పని అని అతనికి అనుమానం వచ్చింది.

భార్య చూడకుండా వెంఠనే మడిచి జేబులో పెట్టేసుకున్నాడు. విషయం పూర్తిగా తెలియకుండా ఆమెకు చెబితే కంగారు పడుతుందని అతనికి తెలుసు.

వంట ఇల్లు సర్ది వస్తూ " ఎవరది?ఎదో ఉత్తరం పంపారు ?" అంది జానకి వచ్చి

"పక్క వీధిలో గణేశ చవితి సంఘం వాళ్ళు చందా ఇవ్వాలని కోరుతూ రాశారు " అని ముభావంగా చెప్పి టివి చూడాలి అన్నట్టు దృష్టి టివి లో న్యూస్ వింటూ కూర్చున్నాడు.

******

శేఖర్ ప్రబుత్వఅధీనం లో ఉన్న ఒక ఇంజినీరింగ్ సంస్థలో సీనియర్ ఆఫీసర్. హెడ్ ఆఫీస్ లో నూట యాభై మంది, జిల్లాలలో ఒక వెయ్యికి పైగా ఉద్యోగులు ఉన్న సంస్థ.

సంస్థ చేసే ప్రోజక్టులు స్వభావం దృష్ట్యా కొన్ని కొన్ని స్థానాలలో ఉన్న ఉద్యోగులు అక్రమంగా చాలా సంపాదన చేసుకోవచ్చు. కొద్దిమంది కాకపోయినా, చాలా మంది అవకాశం

అందిపుచ్చుకుని, విలువలికి తిలోదకాలు ఇచ్చిఅడ్డం గా చాలా సంపాదించారు. విలువలికి ప్రాధాన్యం ఇచ్చే కొద్దీ మందిలో శేఖర్ ఒకడు. ఇటువంటి నేపధ్యం లో తనకి అలాంటి

ఉత్తరం ఏమిటని అనిపించింది అతనికి

దృష్టి టివి మీద ఉన్నా, మనసు పరి పరివిధాల పోయింది శేఖర్ కి . తాను రాజకీయాలలో గానీ, వ్యాపారంలో కానీ అక్రమ సంపాదనలలో లేడు. ఉద్యోగం లో కూడా, తన మిగతా

సహోద్యోగులలాగా అక్రమ సంపాదన ఏమీ లేదు. అటువంటి నేపధ్యం లో ఇలాంటి ఉత్తరం రావడం ఆశ్చర్యమే. ఇది తప్పనిసరిగా తప్పు అడ్రసు అయి ఉండాలి.

ఎవరికో ఇమ్మన్నది పొరపాటున తనకి పంపడం జరిగిందేమో అని అనుమానం వచ్చింది. జానకి దగ్గరలో లేదని నిశ్చయించుకుని, జేబులోంచి కవర్ తీసి పైన అడ్రసు చూశాడు

సందేహం లేదు తన పేరు మీదే ఉంది. అయితే అదే పేరు ఉన్న ఇంకోవ్యక్తి దేమో అనుకోవడానికి తన డిజిగ్నేషన్ తో సహా కంపెనీ పేరు ఉండడంతో, తనకి రాసిన ఉత్తరమే అని

నిశ్చయించు కున్నాడు.

రాష్ట్రం లో అన్ని జిల్లాలలో తమ ఆఫీస్ యూనిట్ హెడ్స్ లో చాలా మంది దారుణంగా అడ్డదారుల్లో సంపాదిస్తున్న సంగతి అతనికి తెలిసినా, వాళ్ళల్లో హెడాఫసులో పని చేస్తున్న

తనని కూడా చేర్చి ఇలా బెదిరించడం అతనికి ఆందోళన కలిగించింది.

ఇలాంటివి ఎవరితో చర్చించి సలహా తీసుకోవాలో అన్నది అతనికి పెద్ద సమస్య అయింది. మరునాడు సాయంత్రం లోగా వాళ్ళు ఫోన్ చేస్తే ఏమి చెప్పాలన్నది అతనికి తట్ట లేదు .

అతనికి గతం లో వార్తా పత్రికలలో చదివిన కొన్ని విషయాలు గుర్తుకు వచ్చాయి. కొంత మంది పౌర హక్కుల పోరాటం లో ఉన్న లాయర్లు అన్నల పట్ల సానుభూతి

ఉన్నవాళ్లు అని చదివి నట్టు గుర్తు. వాళ్ళల్లో అతనికి ముఖ్యంగా కృష్ణ వీరన్, హర గోపాల్ పేర్లు గుర్తు ఉన్నాయి. వాళ్ళ సలహా తీసుకుంటే మంచిదేమో అని అనిపించి, వెంఠనే వాళ్ళ

ఫోన్ నుంబర్లు డైరెక్టరీ లో వెదికితే హరగోపాల్ నంబర్ దొరికింది.

ఇంట్లోంచి అయితే జానకి వింటుందని, బయటికి వచ్చి హరగోపాల్ కి ఫోన్ చేశాడు. తనని పరిచయం చేసుకుని " సార్ మిమ్మలిని ఒక మాటు కలవాలి. వీలుపడుతుందా ? ఒక విషయం

లో తమరి సలహా కావాలి " అన్నాడు.

" సయోధ్య హోటల్ పక్క సందులో ఇరానీ హోటల్ ఉంది . రేపు పన్నెండు గంటలకి అక్కడికి రండి.. ఆ సమయం లో అక్కడ తక్కువమంది ఉంటారు. కిటికీ పక్క టేబుల్ వద్ద ఖాళీ

ఉంటె అక్కడికి వచ్చి వెయిట్ చేయండి . నేను గళ్ళ షర్ట్ వేసుకుని వస్తాను " అని చెప్పాడు హరగోపాల్

అతను తన సమస్యని తేలిక గా తీసుకోకుండా సానుభూతి తో వినడంతో శేఖర్ సంతోషించాడు .

***

మరునాడు సెలవు పెట్టి హరగోపాల్ చెప్పిన టయిముకి ముందుగానే హోటల్ కి చేరుకున్నాడు. హరగోపాల్ చెప్పినట్టుగా పెద్ద గా జనం లేరు. కిటికీ పక్కన టేబుల్ వద్ద కూర్చుని

బిస్కుట్స్ ఆర్డర్ చేశాడు . ఒక పదినిమిషాలకి, గళ్ళ షర్ట్ లో, మధ్య వయసులో ఉన్న వ్యక్తి తన టేబుల్ దగ్గరికి వచ్చి కూర్చున్న వ్యక్తి, తో అవునా కాదా అని ప్రశ్నించకుండానే

" నమస్కారం హరగోపాల్ గారు " అని చేయి కలిపాడు

బేరర్ ని పిలిచి చాయ్ ఆర్డర్ చేసి, తనని మళ్ళీ పరిచయం చేసుకున్నాడు.

" ఇప్పుడు మొత్తం ఏమి జరిగిందో చెప్పండి " అన్నాడు హర గోపాల్

తనకి ఉత్తరం ఎలా వచ్చిందో, అందులో ఏమి ఉందొ అన్నీ వివరించాడు శేఖర్

" మీకు వచ్చిన ఉత్తరం కవర్ తో సహా నాకు చూపించండి " అన్నాడు హరగోపాల్. జేబులోంచి ఉత్తరంతో సహా ఉన్న కవర్ తీసి అందించాడు శేఖర్

కవర్ ని , దాని మీద అడ్రసుని, లోపలి ఉత్తరాన్ని బాగా పరిశీలించాడు హర గోపాల్,. చాయి సిప్ చేస్తూ కాసేపు ఎదో ఆలోచించాడు ఆయన.

అతనికేసి ఆత్రుత గా చూస్తూ శేఖర్ కూడా చాయ్ పూర్తి చేశాడు

" మీ ఉద్యోగ వివరాలు, మిగతా విషయాలు చూస్తే, మీరు దీనిని ఎవరు పంపారు అని అనుకుంటున్నారో, వాళ్ళు కాదనిపిస్తోంది. వాళ్ళు మీలాంటి వాళ్ళ జోలికి రారండి. అయినా నాకు

ఒక్క రోజు టైం ఇవ్వండి. మీకు వాళ్ళు పంపినదో కాదో చెబుతాను. ఇవాళ ఫోన్ చేస్తామని రాశారు కాబట్టి, వాళ్ళు ఫోన్ చేస్తే ఇంకో రోజు టైం కావాలి అని చెప్పండి " అన్నాడు హర

గోపాల్.

" మీరు ఇలా స్పందిస్తారని అనుకోలేదండి. మళ్ళీ రేపు ఫోన్ చేస్తానండి " అని నమస్కరించి వచ్చేశాడు శేఖర్

********

ఆ రోజు సాయంత్రం శేఖర్ ఎదురు చూసినట్టు గానే రాత్రి ఎనిమిదింటికి ఫోన్ రింగ్ అయింది. ఫోన్ వస్తుందని అతనికి తెలుసు కాబట్టి, శేఖర్, ఇంకెవరు ఎత్తకుండా తానే ఫోన్ ఎత్తాడు.

" శేఖర్ గారా?" అన్నారు ఎవరో అవతలినుంచి . " అవునండి . మీరెవరో చెప్పండి " అన్నాడు జవాబు గా

" నేనెవరు అన్నది అప్రస్తుతం., ఉత్తరం చదివావా ? ఎంత ఇవ్వడానికి నిర్ణయించావు ? " అన్నాడు ఫోన్ చేసిన వ్యక్తి , గొంతులో కాఠిన్యం కనపరుస్తూ

" నేనేదో ఎక్కువ సంపాదిస్తున్నాననిమీరు అనుకుంటున్నట్టు న్నారు. అది నిజం కాదు . అయినా నేను ఆలోచించుకోవడానికి ఇంకో రోజు గడువు కావాలి. రేపు రాత్రి ఫోన్ చేయండి "

అని ఫోన్ పెట్టేశాడు శేఖర్.

చెప్పినట్టుగానే మరునాడు సాయంత్రం అయిదింటికి హరగోపాల్ ఫోన్ చేశాడు శేఖర్ కి .

" మీఋ అనుకున్నవాళ్ళు ఎవరూ కాదండి. అందు చేత మీరు ఏమీ ఆందోళన పడక్కర లేదు " అన్నాడు హరగోపాల్

"చాలా థాంక్స్ అండి మీ సహాయానికి విలువ కట్టలేను " అన్నాడు శేఖర్ కృతజ్ఞతగా

" అది సరే. మరి వాళ్ళకి ఏమని జవాబు చెబుతారు ? " అడిగాడు హరగోపాల్

" ఏమీ ఆలోచించలేదండి. మీరేమన్నా సలహా ఇస్తారా ? "అన్నాడు శేఖర్

ఎలా జవాబు చెప్పాలో శేఖర్ కి చెప్పి " మీరు అలా చెప్పగానే వాళ్ళు ఇంక మిమ్మలిని బాధించరు" అని ఫోన్ పెట్టేశాడు హరగోపాల్

*******

చెప్పినట్టుగానే మరునాడు రాత్రి ఉత్తరం పంపిన వాళ్ళ దగ్గరనుంచి మళ్ళీ ఫోన్ వచ్చింది. ఈమాటు శేఖర్ ధైర్యంగా ఫోన్ ఎత్తాడు

" ఏమండీ ఏమి ఆలోచించారు. ఎంత? ఎలా పంపాలో ఆలోచించు కున్నారా ?" అన్నాడు అవతలి వ్యక్తి

" ఓ అదాండీ. నేను ఇవ్వదలుచుకున్నది నిన్ననే హర హర రావు గారికి అందించాను. అయన మీకు చెబుతానన్నారు. బహుశా ఇవ్వాళో రేపో చెబుతారేమో " అన్నాడు

హరగోపాల్ చెప్పినట్టుగానే అవతల వ్యక్తి ఇంకేమీ మాట్లాడకుండా ఫోన్ పెట్టేశాడు.. కృష్ణ వీరన్, హర గోపాల్ లాగే, హర హర రావు ప్రముఖ పౌర హక్కుల నాయకుడు. ఆ విషయం

అందరికీ తెలుసు.

సమస్య పరిష్కారం బాగానే అయింది కానీ, హరగోపాల్ చెప్పినట్టు వాళ్ళు తీవ్ర వాదులుకాక పోతే, ఫోన్ చేసి బెదిరించిన వాళ్ళుఎవరయి ఉంటారన్నది శేఖర్ కి ప్రశ్నార్థకం గానే

మిగిలిపోయింది.

అయితే దానికి జవాబు అతనికి దాదాపు సంవత్సరం తరవాత దొరికింది.

విదేశాలలో ఉద్యోగ ప్రయత్నాలు ఫలించి శేఖర్ కి మూడేళ్ళ కాంట్రాక్టు మీద ఒక అవకాశం వచ్చింది.

దానికోసం ప్రస్తుత ఉద్యోగం లో జీతం లేని సెలవు, రూల్స్ ప్రకారం తీసుకున్నాడు. ఇది జరిగిన రెండు రోజులకి అతనికి ఇంటికి ఒక ఫోన్ వచ్చింది

" ఇక్కడ సంపాదించింది చాలదా ? విదేశాలలో కూడా సంపాదించాలా ? రాఘవ రెడ్డి గారు మీకు ఫోన్ చేసి ఎంత ఇస్తారో అడగ మన్నారు ?. ఫామిలీ ఇక్కడే ఉంటుంది కదా ?"

అన్నాడు

మొదట శేఖర్ కంగారు పడ్డా డు. రాఘవ రెడ్డి ఒక జిల్లాలో ప్రముఖ మాఫియా లీడర్. ఏమి చెప్పాలో తెలియలేదు." నేను అలోచించి చెబుతాను రెండు రోజులలో ఫోన్ చేయండి"

అని ఫోన్ పెట్టేశాడు.

ఆలోచిస్తే అతనికి వెంఠనే తట్టిన విషయం ఏమిటంటే, తాను విదేశాలు వెడుతున్న సంగతి ప్రస్తుతం పనిచేస్తన్న ఆఫీసులో తప్ప, బయట ఎవరికీ తెలిసే అవకాశం లేదు. అంటే

ఆఫీసులో నే ఎవరో ఇది చేస్తున్నారేమో అనిపించింది. సమర్థనీయం గా లేకపోవడం వల్ల యూనియన్ వాళ్ళు తెచ్చిన కొన్ని ప్రతిపాదనలు సమర్థించక పోవడం చేత , కొంతమంది

లీడర్లు అసంతృప్తి తో ఉన్న మాట నిజమే అయినా, తన మీద చాలా మందికి గౌరవం ఉన్న సంగతి అతనికి తెలుసు. సందేహం తీర్చుకోవడానికి, అతనికి కాస్త సన్నిహితుడయిన

నర్సి రెడ్డి కి ఫోన్ చేశాడు. నర్సిరెడ్డి రాఘవరెడ్డి ఉండే జిల్లా యూనిట్ కి ఇంచార్జి. అదే ఊళ్ళో ఉంటాడు.

విషయం విని "రాఘవ రెడ్డి ఆపరేషన్ విధానం వేరు సార్ , మీ లాంటి వాళ్ళ వద్దకి అతను వచ్చే అవకాశం లేదు . ఈ మధ్యన మన ఆఫీసర్లకి వేరే విధం గా ఫోన్లు చేసి, భయ

పడ్డ వాళ్ళ దగ్గర డబ్బులు గుంజారని తెలిసింది. ఇదంతా కొన్ని అపోహల ఆధారంగా మన యూనియన్ వాళ్లే చేస్తున్నారని తెలిసింది. " అని నర్సిరెడ్డి వివరించాడు.

నర్శిరెడ్డి చెప్పినది విని శేఖర్ ఊపిరి పీల్చుకున్నాడు

అనుకున్నట్టు గానే రెండో రోజున ఫోన్ వచ్చింది. ఎంత? ఎక్కడ ఇస్తారని . హరగోపాల్ ధర్మమా అని జవాబు అతని దగ్గర రెడీ గా ఉంది

" రాఘవ రెడ్డి గారికి పంపించేశాను కదా ?" అని చెప్పగానే ఫోన్ కట్ అయింది

సమాప్తం

మరిన్ని కథలు

Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు
Pratibha
ప్రతిభ
- చెన్నూరి సుదర్శన్
Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు