మీనాక్షమ్మ ఆరోగ్యం అడపాతడప బావుండటం లేదు. రెండు మూడు సార్లు హాస్పిటల్ లో కూడా జాయిన్ అయ్యారు కూడా . అలాంటి సమయం లోనే కల్యాణి తో అన్నారు . “మరణం ప్రతి వాళ్ళకి తప్పదని తెలుసు. అందరు ఏళ్ళ కాలం కట్టకట్టుకుని ఈ భూమి మీద ఉండిపోరు. ఎప్పుడో అప్పుడు పోవాల్సిందే. అలాంటప్పుడు యెంత చక్కగా ఉండాలి. చిన్నప్పుడు మన ఇంట్లో నాన్నమ్మ తాతగారు, తో పాటు అత్తయ్యలు,మావయ్యలు,అందరూకలసిమెలిసి ఉండేవారు యెంతబావుండేదో ? గొడవలు వచ్చేవి కాని అవి అప్పుడే చితుకులమంటలా చప్పున చల్లారిపోయేవి.,ఇప్పుడు మటుకు మనుష్యుల కు ఒకళ్లంటేఒకళ్ళకి పడటం లేదు. ఇలా అయితే కొన్ని రోజులకు మనుష్యుల కోసం మొహం వా చిపోతారు అన్నారు మీనాక్షమ్మ . అలా ఆవిడ అన్న కొన్ని రోజులకే కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికించేస్తోంది. ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద వాలటం లేదు. ఎవరూ ఎవరినీ కలవటం లేదు. అందరిలోనూ భయం.భయం.ముట్టుకుంటే అంటుకుంటోంది. ఏ పరిస్థితి లు ఎదురైనా మనిషిని మనిషి కలిసే సందర్భాలు చాలా తగ్గిపోయాయి. పరామర్శలు, పెళ్లి శుభాకాంక్షలు, పుట్టిన రోజు ఆశీస్సులు ఇలా ఆనంద,విషాదాలను దూరం నుంచే అందచేస్తున్నారు. అన్నీ కూడా ఆన్లైన్ లో జరిగిపోతున్నాయి.పెద్ద పెద్ద సమావేశాలు నిర్వహించే వాళ్ళ దగ్గరనుంచి, సామాన్యుడు వరకు ఇదే తీరు. ఇదంతా చూస్తున్న మీనాక్షమ్మ అంది కోడలు తో “చూసావా అప్పుడు మనుష్యులు కిట్టలేదు. ఇప్పుడు అందరూ కావాలని దేవురించినా ఎవరు రావటం లేదు.ఇది కాల మహిమ కాకపోతే ఇంకెవిటీ? దేవుడో, ప్రకృతో ఏదో ఒకటి మనలని గమనిస్తూనే ఉంటాయి. మనం చేసే పనులకు మనమే జవాబుదారీ లము.” ఆవిడ బాధ అర్ధం అయింది. దగ్గరగా వెళ్లి చెయ్యిపట్టుకుంది. ** విజయ సెల్ మోగుతోంది . “మమ్మీ కాస్త తొందరగా వచ్చి తీసుకుంటావా ? రేడియోలో 24x7 వస్తూనే ఉంది. మళ్ళి నీ రింగ్ టోన్ లో ను అదే పాట. ఎంత మీ ఊరి సైడ్ బాష అయినా ఇంత ఇష్టం ఏంటి బాబు.ఒకటే డిస్టబ్చేస్తోంది,అయినా ఫోన్ దగ్గరగ ఎందుకు పెట్టుకోవు” అని శ్రుతి అరిచింది. ఆ అరుపు కి వంటింట్లోంచి ఒక్క ఉదుటున హాల్ లో కి వచ్చి ఛార్జ్ లో ఉన్న ఫోన్ తీసుకుంటూ “రాక్షసీ! ఆ పాట నాకిష్టమే” అంటూ కూతుర్ని ముద్దుగా కోప్పడి, అదే పాటను హమ్ చేస్తూ ఆన్సర్ బటన్ నొక్కింది అవతల నుంచి కళ్యాణి “ఏంటి బిజీ గ ఉన్నావా విజయా? అంది. “లేదు లే ఇవాళ ఆదివారమే గ కాస్త లేట్ గ పనులు చేసుకుంటున్నాను.మాధవ్ టూర్ లో ఉన్నారు,శ్రుతి మూడ్స్ తెలుసుగా ,సరేలే ఏంటి విషయం” అడిగింది విజయ “ఏముంది మా అత్తగారి బంధు ప్రీతిగురించి తెలుసు కదా ! అది ఇప్పుడు పీక్స్ కి వెళ్ళింది. “అవునా !” “విజ్జూ! అసలు విషయం ఈ మాటు ఏకంగా దేశ రాజధానికే వెళుతున్నాను ఆవిడ సొంత తమ్ముడి కూతురు పెళ్లి. దానికి అందరం వెళదామని పోరుతున్నారు. వెళ్ళచ్చు కదా అంటావేమో ఆరునెలల క్రితం మా అత్తగారి చెల్లెలు కొడుకు పెళ్ళికి శ్రీకాకుళం దగ్గర ఉన్న పల్లెటూరు లో పెళ్ళికి వెళ్ళాము గుర్తుంది కదా” “ఆ. ఆ. గుర్తుంది కళ్యాణి” . “అబ్బ ఆ పెళ్లి లో ….. తలచుకుంటే నే ఉక్రోషం కోపం తన్నుకు వస్తాయి. అసలే పల్లెటూరు . ఇంకా ఇప్పటికీ అన్ని పాత పద్దతులు నడుస్తున్నాయి ఇదీ అని చెప్పలేను . చిరాకు పుట్టింది. ఎప్పుడూ అక్కడనుంచి బయట పడతానా అనిపించింది. పోనీ,వద్దు అన్నామనుకో ఇక ఆవిడ గొణుగుడు భరించలేము. పైగా నా పెద్దరికం ఏం ఏడ్చింది.,ఇది వరకు మీనాక్షమ్మ వస్తే చాలు ఏ ఇంటికయినా కళ ఇట్టే వచ్చేస్తుంది అనుకునే వారు , ఆ మహారాజు కాస్త దాటి పోయేసరికి ఇలా మూల పడ్డాను. అయినా ఇక నా తదనంతరం ఈ ఇంటి బరువు బాధ్యత నీదే కదా ! నువ్వు నాతొ వచ్చావు అనుకో అక్కడ అందరూ మీనాక్షమ్మ కోడలు ,చక్కగా అత్తగారు చెప్పినట్లుగా వింటుంది. ఎవరింటికయినా ,ఎక్కడికయినా భేషజం లేకుండా ఇట్టే వస్తుంది అంటూ మెచ్చుకుంటారు.ఇదే మా చిన్నతనం లో అయితే పెళ్ళికి వెళ్ళడం అంటే ఎంత సంబరంగా ఉండేదో ఇప్పుడయితే బొత్తిగా అబిమానాలు,ప్రేమలు లేకుండ పోయాయి అని ఒకటే గొడవ సరేలే నా సొద చెప్పి నీ టైం వేస్ట్ చేసానా , ఎలాగు వెళ్ళడం తప్పదు కదా, వచ్చాకా కలుస్తాను” అంటూ కళ్యాణి ఫోన్ పెట్టేసింది ** ఫోన్ పెట్టేసాక కూడా విజయను కళ్యాణి గురించి న ఆలోచనలు చుట్టుముట్టాయి. విజయ,కళ్యాణి ఇద్దరూ డిగ్రీ వరకు కలిసి చదువుకున్నారు. ఆ తరువాత ఒక జాతీయ బ్యాంకు లో ఉద్యోగాలు తెచ్చుకున్నారు. పెళ్ళిళ్ళు అయ్యాయి. పిల్లలు పుట్టారు. విజయ వాళ్ళ ఆయన ఒక్కడే సంతానం కావటం వల్ల అత్తగారు వీళ్ళ దగ్గరేఉంటారు.మావగారు చాల కాలం క్రితమే పోయారు. కళ్యాణి పెద్ద కోడలు అవటం వల్ల అత్తగారు ,మావగారు ఎక్కువగా వీళ్ళ దగ్గరే ఉంటారు. ఈ మధ్య నే అంటే రెండేళ్ళ క్రితం మావగారు కాలం చేయడం తో ఆవిడ బయటకు వెళ్ళడం తగ్గింది. దానికి తోడు మంచి పాకేజీ తో vrs అవకాశం రావడం తో కళ్యాణి ఉద్యోగం కూడా మానేసింది . ఇహ అప్పటి నుంచి ఇంట్లో ఉండటం వల్ల చుట్టాల ఇళ్ళకి వెళ్ళడం అనేది కల్యాణి వంతు అయింది. కళ్యాణి అత్తగారు మీనాక్షమ్మ మంచి ఆవిడే, కాకపోతే బంధు ప్రీతి ఎక్కువ. పెద్ద కుటుంబం కావడం తో శుభకార్యాలు అవీ బాగానే ఉంటూ ఉంటాయి కాకపోతే ఇక్కడే అసలు విషయం అంతాను. ఈవిడ కి చుట్టాలంటే ఉండే ప్రీతి తో ఏ ఊరు అయినా వెళుతుంటే అక్కడే ఉన్న చుట్టాల పేర్లు చెప్పి వాళ్ళఇళ్ళ లోనే తప్పకుండా దిగమనేది వీళ్ళని . అది కళ్యాణికి పిల్లలకి నచ్చేది కాదు. గోపాల్ తల్లి మాటకు ఎదురు చెబితే బాధ పడుతుంది అని ఏం మాట్లాడకుండా ఉండే వాడు.పోనీ చెప్పకుండా ఏ హోటల్ లో అయినా దిగుదామనుకుంటే ,ఈవిడ ముందే వాళ్ళకి ఫోన్ చేసి ఫలానా రోజు మా వాళ్ళు వస్తున్నారు అనిచేప్పేసేది .ఇదే కాకుండా ఇంకో ముఖ్యమైన సంగతి. అప్పట్లో ప్రైవేటు ,పర్సనల్ అనుకునే వారు కాదు . కారణం అన్నీ ఉమ్మడి కుటుంబాలే. కాలక్రమేణా ఒక్కళ్ళ సంపాదన మీద కాకుండా భార్యాభర్తలు ఇద్దరూ సంపాదించడం కుటుంబాలు చిన్నవి అవడం లాంటి కారణాల వల్ల ఆర్ధికంగా వెసులుబాటు దొరకడం తో మనషుల ఆలోచనలలో మార్పు వచ్చింది. చిన్న చిన్న చిన్న కుటుంబాలు ఏర్పడ్డాయి తరాలు మారాయి వాటి తోపాటు మనుష్యుల స్వభావాలు ,ఆలోచనలు తీరుకూడా మారాయి. ఇవన్నీ ఆవిడకి అర్ధం అయేవి కావు అని కల్యాణి తరచూ అనేది” అనుకుంటూ ఉండగా “విజయా.అమ్మా” అన్న,మాధవ్ శృతిల పిలుపు తో ఈ లోకం లోకి వచ్చింది. ** పదిహేను రోజు లు గడిచాయి. ఓ రోజున కళ్యాణి, విజయ ఇంటికి వచ్చింది . “అదే అనుకుంటున్నాను కళ్యాణీ, ప్రయాణపు బడలిక లో ఉన్నవేమో అని నేను కూడా ఫోన్ చేయలేదు” “ఆ అంత పని అయిందేలే,” “పెళ్లి బాగా జరిగిందా ,అక్కడ నుంచి వేరే ఊళ్లు కూడా వెళ్ళరా” “ఆ ..ఆ.. ఆగ్రా ,మథుర వెళ్ళాము” ఆ మాట ,ఈ మాట మాట్లాడుకున్నాక “విజయా పెళ్లి లో జరిగిన నీకు కొన్ని విషయాలు చెబుతాను. నువ్వు వింటే భలే ఆశ్చర్య పోతావు” “నిజమా ,అయితే చప్పున చెప్పు”. “మొన్న పెళ్ళికి వెళ్ళామా,అక్కడఅంటూ ... కళ్యాణి ,చెబుతుంటే విజయ కి అక్కడ జరిగినది కళ్ళకి కట్టినట్లు కనిపిస్తోంది. **. రైలు దిగి టాక్సీ లో పెళ్లి వారింటికి చేరుకోగానే వాళ్ళ మర్యాదలు చూసి పొంగి పోయారు మీనాక్షమ్మ గారు. ఎంతయినా ఆప్రేమలు ఎక్కడ కు పోతాయి అని ఒకింత గర్వంగా కళ్యాణి వేపు చూసారు. ఆ చూపులను తట్టుకోలేక మొహాన్ని పక్కకు తిప్పుకుంది. మరునాడుపొద్దున్న పెళ్లి . హాలు లో అందరూ అప్పుడే వెళ్ళడం .ఇక ఆ రోజు రాత్రికి ఇంట్లో మెహందీ ,సంగీత్ అన్ని నడుస్తున్నాయి. ఊరు నుంచి వచ్చిన వాళ్ళని పట్టించుకునే ఓపిక ,తీరిక లేవు ఎవళ్ళకి. అక్కడకి పలహారాలు ,కాఫీలు అన్ని వస్తున్నాయి. అయినా మీనాక్షమ్మ లో ఏదో వెలితి. స్నానానికి,వెళితే అబ్బే ఈ బాత్ రూమ్ కాదు అని ఒక సారి , అప్పుడే మీకు అంత తొందర ఎందుకు అని ఒక సారి,ఇలా ఆవిడ ,ఆవిడతో పాటు నేను ,ఆయన పిల్లలు కూడా ఇబ్బంది పడాల్సి వచ్చింది. ముఖ్యంగా బాత్రూం,దగ్గర ,పడుకోవడం దగ్గర ఎదుర్కొన్న ఇబ్బంది అంతా ఒక ఎత్తు అయితే , వాళ్ళు మాట్లాడుకునే మాటలు మరో ఎత్తు ఇవాళ రేపు చుట్టాలింటికి పొద్దున్న దిగి రాత్రికి వెళ్ళిపోయేలా ఉండాలి తప్ప ఇలా రెండు మూడు రోజులు,అందులో డిల్లీ లాంటి మహానగరం లో ఉండటం కష్టమే, అందుకే మే ఎప్పుడూ దిగినా మా వారి ఆఫీస్ గెస్ట్ హౌస్ లోనో,లేకపోతె హోటల్ లోనో దిగుతాము అనడం ఆవిడకి కష్టంగా తోచింది.అంటే వీళ్ళు తను ఉండే ఊరు కి వచ్చి వెళ్ళిపోతున్నారు కానీ ఇంటికి మాత్రం రావటం లేదన్న మాట పైగా . అడిగితే ఏవో కారణాలు చెప్పారు ,నిజానికి వాళ్ళకు తనని కలిసి వెళ్ళే ఉద్దేశ్యమే లేదు. తనే అతిగా బందు ప్రీతి తో కొట్టుకు పోతోంది అనే భావన కలిగింది. దాంతో ఆవిడ కళ్యాణి దగ్గరకు వచ్చి “మనము పెళ్లి అయిపోగానే వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళిపోదాము” అని చెప్పారు. అంతే అప్పటి నుంచి ఆవిడ బాగా upset అయ్యారు”. “అంతేలే పెద్ద వాళ్లు కదా మనసుకి కష్టం కలిగి ఉంటుంది” అంది విజయ.ఇంటికే వెళ్లేసరికి ఆవిడ ఏదో అయిపోతున్నారు. అర్జెంటు గా అంబులెన్సు కి ఫోన్ చేసి ఆసుపత్రికి తీసుకుని వెళ్ళింది. గోపాలు కి ఫోన్ చేసి వెంటనే రమ్మనమని చెప్పింది.. ** ఆ పెళ్లి లో జరిగిన సంఘటన లతో ఆవిడ మనసు ని బాగా కలవర పెట్టాయి. అదే అలోచించి ఇలా ఆరోగ్యం పాడయింది. క్రితం రెండు సార్లు కన్నా ఈ మాటు ఆవిడ పరిస్థితి బావులేదని డాక్టర్స్ చెప్పారు. ICU లో ఉన్న ఆవిడ ఆరోగ్యం బాగా దిగజారిపోయింది. రెండు రోజులు చాలా బాధపడి ఆవిడ కన్ను మూశారు. ** “అయ్యా కార్యక్రమం పూర్తి అయింది.! అని ఇంక పిండాలు గంగ లో వేసి రావడమే. మీరు భోజనాలు చేసేయవచ్చు. అమ్మా మీకు తృప్తిగా అనిపిస్తోందా?,దానాలు,ఇవ్వడం లో కూడా ఏమి లోపం చేయలేదు.అన్ని శాస్త్రోక్తంగా యదావిధిగా జరిపించాము. ఇక మాకు సెలవిప్పిస్తారా” అనిజూమ్ కాల్ లో ఉన్న కళ్యాణి తో గోపాల్ తోనూ అన్నాడు. వెంటనే గోపాల్ “చాలా బాగా చేసారండి కుమార్ గారు అవునండి మాకు చాల తృప్తిగా ఉంది. మనస్పూర్తిగా చెబుతున్నాను”.అన్నాడు “అవును నిజమే ఇక్కడ అయితే ,కరోనా భయం తో ఈ మాత్రం కూడా చేయలేకపోదుము” అంది కల్యాణి “నిజం నాకు అదే అనిపించింది కుమార్ గారు .రక్తబంధం లేదు గానీ కర్మబంధం చేయించింది. మా అమ్మకి బంధు వులు లేకపోతె అస్సలు నచ్చదు. ఈ కరోనా మూలానా ఏమిచెయ్యలేనేమో అనుకున్నాను. కానీ మీరంతా ఉండి అమ్మకి ఆలోటు తీర్చారు.”అన్నాడు బెంగుళూరు నుంచి చెల్లెలు మైదిలీ,బావగారు మురళీ, కెనడా నుంచి గోపాల్ తమ్ముడు మోహన్ అతని భార్య పద్మ పిల్లలు కూడా చక్కగా చూసారు. ఏమనుకున్నారో మీనాక్షమ్మ తమ్ముడు మరదలు కూడా డిల్లీ నుంచి కార్యక్రమాన్ని లైవ్ లో చూసారు. అక్కడి తో కార్యక్రమం తో పాటు జూమ్ మీటింగ్ కూడా అయ్యిపోయింది. విడిగా తమ్ముడు,చెల్లెలు తో కాసేపు మాట్లాడాడు గోపాల్ మాటల మధ్యలో కళ్యాణి అంది “ మీరిద్దరూ రాలేదు కానీ .మీ మావయ్య కూతురి పెళ్ళిలో ప్రవర్తించిన తీరు చూసి చాల బాధ పడ్డారు ,పైగా నాతొ అన్నారు కూడా ఇంక ఈ చుట్టాల పీకు కి తిలోదకాలు ఇచ్చేస్తానే. ఎవరు మనతో మాట్లాడితే వాళ్ళే మనవాళ్ళు మనము ఉన్నా లేకపోయినా మన గురించి నాలుగు మంచి మాటలు మాట్లాడుకోవాలి అంటూ ఉండేవారు”.అని అత్తగారి గురించి చెప్పికళ్ళ నీళ్ళు పెట్టుకుంది. “అవును వదినా అమ్మతో నీ అనుబంధం చాల ఎక్కువ” అంది ఆడపడచు తోటి కోడలు కూడా “అవునక్కా” అంది ఆడపడచు మాటను బలపరుస్తూ అప్పటికే చాలా ఆలస్యం అయిందని తమ్ముడు, చెల్లెలు చెప్పటం తో లాప్టాప్ మూసేసి భార్యా భర్తలు భోజనం చేయసాగారు. ** “సారీ విజయా ! ఈ పన్నెండు రోజులు అయ్యాకా మాట్లాడదామని ఆగాను., ఎలా ఉన్నారు ఇంట్లో అందరూ” “అందరం జాగ్రత్తగానే ఉన్నాము కళ్యాణీ, నిజానికి నేను పర్సనల్ గా రావలిసిన దే. ఇదిగో ఈ కరోనా భయం తో రాలేకపోయాను. నీకు తెలుసు కదా ! అదే గోపాల్ గారికి చెప్పాను” అంది. “పర్వాలేదు విజయా! పరిస్థితి అన్ని చోట్ల ఇలానే ఉంది. ఆవిడ పెద్ద వయసు తో పోయింది గానీ ఎటువంటి అనారోగ్యం ము లేదు. కానీ ఈ కరోనా పరిస్థితులవల్ల ఆవిడ పోయిన రోజు దహనం చేయడం చాలా కష్టమయింది. దానికి పెద్ద లైన్ ,టోకెన్ ఇవ్వడం లాంటివి జరిగాయి.అప్పుడే గోపాల్ బాధపడ్డాడు అమ్మ పొతేబందువులు ,సొంత పిల్లలు కూడా రాలేక పోవడం , ఎవరూ లేని అనాధ శవానికి చేసినట్లు..అని" గట్టిగ ఏడ్చాడు. అది చూసిన గోపాల్ స్నేహితుడు చెప్పాడు.. కాశీ లో పెట్టేయమని. నిజానికి అతనొక్కడే ఉన్నాడు గోపాల్ పక్కన ఈ మధ్యనే వాళ్ళ అక్క చనిపోతే వాళ్ళు కాశీలోనే పెట్టేరుట వాళ్లతో మాట్లాడి ఏర్పాటు చేస్తానులే అన్నాడు అతను. అలా అత్తయ్య కర్మ కాండలు కాశీ లో జరిగి పోయాయి.ఆవిడ కి బంధువలంటే ఇష్టమో తెలుసు కాబట్టి అందరిని పిలిచి బోజనాలు అవి పెట్టె వాళ్ళము మాములు పరిస్థితులు అయితే , కానీ ఇప్పుడు ఈ విపత్కర సమయం మనిషికి మనిషి తగిలితే వైరస్ అంటుకు పోతుంది అని తెలిసినప్పుడు అది సాద్యం కాదు. ఎప్పుడూ సందడిగా నలుగురు మనుషులు చుట్టురా ఉండాలని కోరుకున్న ఆవిడకి ఇక్కడ ఎవరూ రాకుండా ఇంట్లో చేసినా,ఆత్మతృప్తి ఉంటుందా ? పోనీ అదేదో అక్కడే చేద్దాము పైగా కాశీలో కుమార్ గారింట్లో జరిపించడం అదీ ఆశ్రమం తరహా ఇల్లు వాళ్ళది అక్కడ ఉండే మనుషులతో సందడిగా ఉంటుంది అనుకున్నాము అందరం . సొంత పిల్లలు మేము స్వయానా వెళ్లకపోయినా ఆ కార్యక్రమాన్ని యధావిధిగా, ఒక కర్తను పెట్టి శాస్త్రోక్తంగా, శ్రద్ధగా జరిపించారు కుమార్ గారు. విజయా! అత్తగారి కర్మకాండలు సంతృప్తిగా జరిగాయి అసలు రంగు తెలిసిన ఆ బంధువుల కన్నా, మనిషి తెలియక పోయినా ఆత్మీయంగా తలచుకున్నారు వాళ్ళు,అది చాలనిపించింది.. " “పోనీలే, కళ్యాణీ! ఈ విధంగా అయినా ఆవిడ ఆత్మ సంతోషిస్తుంది, కొన్ని బంధాలు మనిషి లేకపోయినా కూడా నిలిచేఉంటాయి.." ------------------------------------------------------------------------------