స్నేహ బంధం - రాము కోలా.దెందుకూరు.

Sneha bandham

రామాపురం అనే గ్రామంలో స్నేహానికి మారుపేరు అక్కన్న,సోమన్న అనే మిత్రులు.. రక్తసంబంధికులే ఒకరికి ఒకరు దూరమౌతున్న ఈ రోజుల్లో, ఆత్మీయంగా కలిసి,ఒక్కమాటపై నిలిచే వీరంటే గ్రామంలో ప్రతి ఒక్కరికీ ఎనలేని గౌరవమే. ఇరువురిలో ఎవరికి ఏ కష్టమోచ్చినా ఒకేలా స్పందించే వారు.. సమస్యను ఇరువురు కలిసే పరిష్కరించుకునే వారు. వర్షాలు ముఖం చాటేయడంతో, పంటకు నీటి ఎద్దడి ఏర్పడుతుంటే,ఇద్దరు కలిసి, తమ పొలంలో బావిని తవ్వాలనే నిర్ణయం సమిష్టిగా తీసుకున్నారు.. అక్కన్న కాస్త ఆర్థికంగా వెనుకబడిన వాడు కావడంతో,సోమన్నతో తన మనసులో మాట తెలియజేసాడు. "ఇద్దరం బావి తవ్వడం ఖర్చుతో కూడిన పని.అందుకే, ఒకరు మాత్రమే బావితవ్వి. మరొకరి పొలంలో పంటకు నీరు వాడుకుందాం. అందుకుగాను నీళ్ళు వాడుకున్న వాళ్ళు ప్రతి సంవత్సరం ఐదు బస్తాలు ధాన్యం బావి తవ్వి పొలం నష్టపోయిన వారికి ఇచ్చుకుందాం". అనే తన మనసులో మాట తెలియచేసాడు అక్కన్న. సోమన్నకు కూడా అది నచ్చింది. "అక్కన్న! నీ కుటుంబం పెద్దది , ఖర్చులు కూడా కాస్త ఎక్కువే.అందుకే నా పోలంలో బావి తవ్వుతాను,నీళ్ళు నువ్వు వాడుకోవచ్చు. అనుకున్న ప్రకారం ధాన్యం నాకు,వెసులు బాటు చూసుకుని ఇస్తే సరిపోతుంది."తన "ఎలాగు మనవి పక్క పక్కన పొలాలు.ఇబ్బంది ఉండదు.రాత్రి పూట నీళ్ళు మలుపుకోవడానికి ఎవరో ఒకరు వస్తుంటే సరిపోతుంది. ఏమంటావ్!"అన్నాడు సోమన్న. "నీ మాట నేను ఎప్పుడైనా కాదన్నానా?అలాగే చేద్దాం "అన్నాడు అక్కన్న.. అలా కొంతకాలం గడిచి పోయింది. సోమన్న పిల్లలు ఎదిగి వచ్చారు.తమకు నీటి కొరత లేదు.మరో నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకుంటే సరిపోతుంది.అని సోమన్నకు నచ్చచెప్పి,కౌలుకు తీసుకుని వ్యవసాయం చేయడం మొదలెట్టారు. రాను రాను అక్కన్న పొలంకు నీళ్ళు సరిగా అందని పరిస్థితి ఏర్పడింది. ఒకటి రెండు సార్లు ,విషయం సోమన్న కు వివరించే ప్రయత్నం చేసాడు. "నిజమే!బావిలో నీళ్ళు సరిపోవడం లేదంటున్నారు పిల్లలు కూడా.!" "ఎం చేస్తాం!సర్దుకు పోవడమే,"అంటూ మాట దాట వేసాడు సోమన్న. "అది కాదు"అనబోతున్న అక్కన్నతో,"వ్యవసాయం పిల్లలు చేతుల్లోకి వెళ్ళిపోయింది." "ఉడుకు రక్తం . మన మాట వినేలా లేరు. నువ్వే ఏదైనా మార్గం ఆలోచించుకో". అనేసి తన పనిలో మునిగి పోయాడు సోమన్న. చేసేది ఏమీ లేక,అక్కన్న తన పొలం ,తాకట్టు పెట్టి,తెచ్చిన డబ్బుతో పొలంలో బోరు బావి తీయించాడు.గంగమ్మ కరుణించిందేమో నీళ్ళు పుష్కలంగా పడ్డాయి. నీటి వసతి తోడు,శ్రమించే మనస్థత్వం జతకూడడంతో నాలుగు సంవత్సరాల్లోనే తన పక్కన ఉన్న మరో మూడు ఎకరాలు కొనేసి,వ్యవసాయం పెంచుకున్నాడు అక్కన్న. కాలం క్రమేనా,వర్షాలు తగ్గిపోవడం,కొందరు బోరు బావులు వేయించడంతో సోమన్న పొలం లోని బావిలో నీళ్ళు అడుగంటి పోవడం మొదలైంది. కాస్తో కూస్తో పండిన పంట కౌలు చెల్లింపులకు సరిపోవడంతో సోమన్న కొంత పొలం అమ్మక తప్పలేదు. పంటలు సరిగా పండడం లేదంటూ,సోమన్న పిల్లలు పట్నం వెళ్ళి పోయారు. "ఏదో ఒక పని చేసుకు జీవిస్తాం,ఇక్కడ వ్యవసాయం చేయలేం "అనేసి. సోమన్న పొలంలోని బావి ఎండి పోవడంతో ,వరి పంట వేయలేక,చిరు ధాన్యాల పంటలు వేస్తుండే వాడు., గిట్టుబాటు ధర లేక అందిన కాడ అంది నట్లు అప్పులు చేసి.పొలం తాకట్టు పెట్టి తెచ్చిన డబ్బుతో పొలంలో బోరు బావి తీయించే ప్రయత్నం చేసాడు. కానీ ఎక్కడా చుక్క నీరు పడక పోవడంతో. ఏమి చేయాలో!ఎలా అప్పులు తీర్చాలో తెలియక నలుగురికి మొఖం చూపించుకోలేక.ఇంటి నుండి బయటకు రావడం తగ్గించేసాడు. విషయం ఆనోటా,ఆనోటా పలికి చివరకు అక్కన్న చెవిని చేరింది. ఒక రోజు వీలు చూసుకుని అక్కన్న,సోమన్న దగ్గరకు వచ్చాడు. సోమన్న విషయం అంతా చెప్పి బోరున విలపిస్తూ,తనకు చనిపోవడం తప్ప మరో మార్గం లేదంటూ అక్కన్న చేతుల్లో ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడ్చాసాగాడు. "తప్పు సొమన్నా!అటువంటి ఆలోచన తప్పు." "ఈ స్నేహితుడు ఉండగా నీకు ఇబ్బంది,రానే రాదు." "నా దగ్గర ఉన్న డబ్బులతో ముందు నీ అప్పులు తీర్చు." "రేపటి నుండి నా నాలుగు ఎకరాలు,నీ ఎకరం కలిపే సాగుచేద్దాం." "పంటను వాటాలు వారిగా పంచుకుందాం! నా డబ్బులు వెసులు బాటు చూసుకుని వాయిదాల పద్దతిలో తీరిస్తే సరిపోతుంది. అధైర్యపడకు "అంటూ సోమన్న భుజం తట్టాడు అక్కన్న. "ఆపదలో అందుకునే వాడే నిజమైన నేస్తం అని ఋజువు చేసావు." "నీ ఋణం తీర్చుకోలేను, "చేతులెత్తి నమస్కరించాడు సోమన్న. "మనది తీర్చుకునే ఋణాను బంధం కాదు, స్నేహ బంధం" అంటుంటే సోమన్న అక్కన్నను గట్టిగా కౌగిలించుకున్నాడు,ఆనంధాశ్రువులతో. * శుభం.*

మరిన్ని కథలు

Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు
Pratibha
ప్రతిభ
- చెన్నూరి సుదర్శన్
Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు