నేను, విశ్వనాదం చిన్ననాటి స్నేహితులం. విశ్వం సబ్- కలెక్టర్ గా రిటైర్ అయ్యాడు. వాళ్ళ నాన్న ఒక స్కూల్ టీచర్ అవటం వల్ల పిల్లల ప్రవర్తన అందరికి మెప్పుగోలుగా ఉండేది. ఒక రకంగా వాళ్ళు మాకు బంధువులే. విశ్వం వాళ్ళ ఇంట్లో రెండవ వాడు, చురుకైన వాడు.
మా నాన్న న్యాయవాద వృత్తికి వారసుడు కావాలని నన్ను లా చదివించి లాయర్ని చేసాడు. నేను జిల్లా కోర్టులో జడ్జ్ గా ఉన్నన్నాళ్ళు నెలకు ఒకసారైనా మా కుటుంబాలు కలుస్తూఉండేవి. ఇప్పుడు పక్క పక్క ఇండ్లు కావటం వల్ల మా కలయిక హద్దులు దాటి ఒకళ్ళకు ఒకళ్ళు కాపల కాస్తున్నాం.
విశ్వంకి ఒక్క కొడుకు, ఆకాష్. తల్లి తండ్రులు, తాతలు కూడా గారాబంగా చూసుకునేవారు. కొడుకుకు తనకంటే తన ఎక్కువ స్థితిగతులు కలగాలని విశ్వం ముక్కోటి దేవతలను ప్రార్ధించే వాడు. కొడుకు యోగ క్షేమాలు, ఉన్నత జీవితం కోసం పరి తపించే పోయేవాడు. సరస్వతి కటాక్షం, జ్ఞాన సముపార్జన అత్యున్నతంగా ఉన్న కుటుంబం అవ్వటంతో విశ్వం కొడుకు చురుకుగా చదువుకుంటూ, ఉన్నత మైన ఉద్యోగం సంపాదించాడు. హైదరాబాద్ లో పెద్ద సాఫ్ట్ వేర్ కంపెనీలో తన కంటే ఉన్నత మైన స్థాయి లో ఉన్నాడని చెప్పుకుంటూ విశ్వం బంధు మిత్రుల ప్రశంసలు పొందుతుండేవాడు. పుత్ర వాత్సల్యం తో విశ్వం తన కొడుకుకు అంతరంగంగా దగ్గర అవ్వలేకపోయాడు. జూన్ నెలాఖరుకి విశ్వం సబ్- కలెక్టర్ గా పదవి విరమణ చేసాడు. ఊర్లో ఎంతో ఘనంగా జరిగిన ఆ కార్య క్రమానికి తన కొడుకు రాలేక పోయినా, సమర్ధిస్తూ ఫారిన్ డెలిగేట్ల తో మీటింగ్ లు ఉన్నాయని అందరిని సమాధాన పరిచాడు.
శ్రావణ మాసంలో హైదరాబాద్ రమ్మని కబురు రావటంతో విశ్వం భార్యా భర్తలు కొడుకు దగ్గరకు వెళ్లారు. అక్కడున్న వారం రోజుల్లో ఆకాష్ తల్లి తండ్రులకు ఒక ఇంటిని, ఒక ఇల్లాల్ని చూపించాడు. విశ్వం అతని భార్య విస్మయం చెంది తేరుకునే లోపు తన జీవిత భాగస్వామిగా పరిచయం చేసాడు. అనుకోని పరిస్థితుల్లో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాల్సి వచ్చిందని ఆకాష్ నమ్మ బలికాడు.
" నాన్న మేమిద్దరం ఎం ఎస్ చెయ్యటానికే అమెరికా వెళుతున్నాం. సౌమ్య వాళ్ళ నాన్న బిజినెస్ లో నష్టపోయి మాకు సహాయం చేసే పరిస్థితుల్లో లేరు. నీ రిటైర్మెంట్ డబ్బు కాస్త సర్దుబాటు చేస్తే మా భవిష్యత్ బాగుంటుంది." చాలా దీనంగా బ్రతిమాలాడు. తన కొడుకు నోరు విప్పి ఎన్నడూ అడగనందున విశ్వం తన పరిధిని దాటి సహాయం చేసాడు. తాను విదేశాలకు వెళ్తుంటే నాన్నకు వీడ్కోలు ఇచ్చే మనో స్థైర్యం ఉండదని ఆకాష్ నన్ను మాత్రమే హైదరాబాద్ పిలిపించారు. అమితమైన పుత్ర వాత్చల్యం, కొడుకు తమ పట్ల చూపించే నిర్లక్ష్యం ధోరణి భార్య భార్తలిద్దరి ని ఎంతో మనస్తాపానికి గురి చేసింది.
**********************
రిటైర్ అయినా కొత్తల్లో సరదాగా గడిచింది. విశ్వం డిపార్ట్మెంట్లో ఎంతో గౌరవం సంపాదించాడు. మేము రోజూ వాకింగ్ కి వాకింగ్కి వెళితే ఆయనను ఎదిగిన వాళ్ళు ఎంతో మర్యాదతో పలకరించేవారు. పదవి విరమణ కాలం ఇంత సాఫీగా సాగిపోతుందని మేమూహించలేదు.
కొడుకు విదేశాల్లో ఉండటం విశ్వం దంపతులకు ఎంతో సంబరం కలిగించింది. అత్తా కోడళ్ల ఫోన్లో పలకరింపులు, ముచ్చట్లు తో ఒక సంవత్సరం గడిచి పోయింది. విశ్వం మ్యారేజ్ డే కేక్ పార్సిల్ కూడా వచ్చింది.
"మన అబ్బాయి ఫోన్ చేసాడండి. మనం అందరం ఒకే చోట ఉందాం రమ్మంటున్నాడు. పోయిన సారి హైదరాబాద్ లో మనం చూసిన ఇల్లు అమ్మేసి పెద్ద బంగాళా కొంటున్నాడట. . కోడలు కుడా మాట్లాడింది. ఒక సంవత్సరంలో వాళ్ళు వచేస్తారట. హైద్రాబాద్లో అన్ని సదుపాయాలూ ఉంటాయని, మీ రిటైర్మెంట్ లైఫ్ బాగుంటుందని ఎంతగానో చెప్పింది.".
మరో నెలకే విశ్వం భార్య సంతోషం గా వచ్చి " మన అబ్బాయి మూడు కోట్లు పెట్టి హైదరాబాద్ లో బంగాళా కొన్నాడండి. అది కూడా ఆన్ లైన్ లో. భార్య భర్తల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. కొడుకు యు.ఎస్ లో బాగా సంపాదిస్తున్నాడని, భగవంతుడు కరుణించాడని ఆనంద పడ్డారు. కోడలు ఫోన్ చేసి కారు బుక్ చేస్తాం పై వారం హైదరాబాద్ పోయి ప్రాపర్టీ ఏజెంట్ ను కలిసి ఇంటీరియర్ సెలెక్ట్ చెయ్యమన్నది. ఇల్లాలు విషయం పక్కన పెడితే, ఇంటి విషయంలో తనను సంప్రదించటంతో విశ్వంకి కొడుకు పైన అపారమైన గౌరవం కలిగింది.
మరో వారానికే కొడుకు ఫోన్ చేసాడని వచ్చింది. "బ్యాంకు వాళ్లు హౌసింగ్ లోన్ ఇవ్వమని పేచీ పెడుతున్నారట. ఇప్పటివరకు బిల్డర్ కి కోటి రూపాయలు చెల్లించాడు. డబ్బు కోసం వెంపర్లాడు తున్నాడు. అంత పెద్ద మొత్తం ఎవరిని అడగాలో అర్ధం కాక దిగులు గా ఉన్నాడటండి. పాపం లోక జ్ఞానం లేనివాడు. అందులో ఇండియా లో కూడా లేడు. మనమేదయినా ఆదుకోగలమా ఆలోచించండి." విశ్వానికి ఏమి చెయ్యాలో పాలు పోలేదు. ఇట్టే వారం రోజులు గడిచి పోయింది. కొడుకుకి అండగా నిలువ లేనందుకు తనను తాను దూషించుకున్నాడు.
"ఏవండీ నిన్న మన కోడలు గంట సేపు మాట్లాడింది. గృహ ప్రవేశం కూడా మనల్నే చేయమంటోంది. వాళ్ళు వచ్చే టప్పటికి సామాను సర్దేసుకుని ఉంటె అందరం కలసి హైదరాబాద్ షిఫ్ట్ అవుదామన్నది. ఎంతో మంచి పిల్ల. మనల్ని గుండెల్లో పెట్టి చూసు కుంటుంది. " అబ్బాయి కూడా మాట్లాడాడు. అందరం ఒకే చోట ఉంటునప్పుడు రెండు ఇండ్లు, రెండు సంసారాలు ఎందుకంటాడు. మనం మన పిల్లల దగ్గర ఉండటంలో ఎంతో ఆనందం ఉన్నది. మీరు సరే అంటే ఆన్ లైన్ లోనే మన ఇంటికి బేరం పంపిస్తానన్నాడు."
"ఆ .... "
" అవునండి, మనం ఈ ఇల్లు వదిలేసి పిల్లాడి దగ్గర కు చేరుకుందాం. ఎప్పటికైన మనం చేరే వలసింది వాడి దగ్గరకే కదా! అవసరానికి వాడికి డబ్బు సమకూర్చిన వాళ్ళం అవుతాము. కోడలుపిల్ల దగ్గర మన మర్యాద కాపాడుకుంటాం"
" అది కాదె పాతుర్లోది తాత గారు ఇచ్చిన డాబా, నా బాల్యం నుండి ఎంతో అనుబంధం ఉంది. మనం ఇప్పుడుండేది దగ్గరుండి మనకు అనుకూలంగా కట్టు కున్నది. మన శ్రమ,ప్రేరణ ఈ ఇంటితో ముడిపడి ఉన్నాయి. ఈ రెండింటిని వదిలి మనమెక్కడికి పోతాం. ఇవి ఎప్పటికైనా వాడివే కదా."
" ఆస్తి పాస్తులు పిల్లల తరువాతే కదా. ఒక్క సంవత్సరం ఇక్కడే ఒక అద్దె ఇంట్లో ఉండి, ఆ పై ఏడాది హైద్రాబాద్లో మన సొంత ఇంట్లో మనమే గృహ ప్రవేశం అవుతు కొడుకు కోడలు పిలుచు కుందాం. నా మాట కాదనకండి. అబ్బాయి కోరిక కూడా ఇదే. మన జీవితంకి భద్రత ఉంటుంది"
విశ్వం మౌనము, కాల యాపన కుటుంబ సభ్యులకు అనుకూలమయ్యాయి. నిర్ణయం తీసుకోలేక రెండు ఇళ్ల కాగితాలు కొడుక్కు పంపించాడు. కీడు శంకిస్తున్న మనసుకు సమాధానం చెప్పుకున్నాడు. భార్యది అమాయకత్వమొ, అత్యుత్సాహమో అర్ధం కాక మిన్నకుండి పోయాడు.
సన్నిహితంగా ఉన్నా నా దగ్గర విషయం దాచిపెట్టి విశ్వం దంపతులు ఊరి బయట అద్దె ఇంట్లో చేరారు. ఎవ్వరి ప్రమేయం లేకుండానే ఇల్లు అమ్ముడు పోయింది. వాతావరణం మారి విశ్వం భార్య ఆరోగ్యం దెబ్బ తిన్నది.
***************************
" మామయ్యా మీ అబ్బాయి పరిస్థితి బాగా లేదు. రోజూ కాసినోకి వెళుతున్నాడు, తాగుడుకు అలవాటు పడ్డాడు. అప్పులు చేసాడు. మరో మూడు నెలల్లో మేము వచ్చేద్దామనుకుంటే ఈ దరిద్రం పట్టుకుంది. ఫైనాన్సర్లకు ముప్ఫయి వేల డాలర్లు కడితే కానీ ఇండియాకు రానివ్వరు. మీ అబ్బాయి విషయం అంత దాచిపెట్టి, ఇప్పుడు ఒప్పుకుంటున్నాడు."
" అదేంటమ్మా ఇలా జరిగింది. ప్రస్తుతానికి మేము సహాయం చెయ్యగలిగే స్థితిలో లేము, మీ అత్తయ్యకు ఆరోగ్యం కూడా బాగా లేదు. నువ్వు ఒంటరి దానివి, ఈ సమస్యను ఇట్లా నెగ్గు కొస్తావో, భగవంతుడి ప్రార్ధించటం కంటే నేను ఏమి చెయ్యలేను."
" మీ అబ్బాయి ప్రవర్తన చూసి మా నాన్న పెళ్ళికి ముందే చెప్పాడు ఈయన నిలకడగా ఉండడని. ఇదంతా నా ఖర్మ బిల్డర్ నుంచి డబ్బు కట్టాలని వత్తిడి పెరిగింది. ఈయన్ని నిలదీస్తే సూసైడ్ చేసుకుంటానంటున్నారు. నా దగ్గర కొద్ది డబ్బు ఉన్నది, మీరు కొంత సహాయం చేసినా మీ అబ్బాయిని దక్కించు కోగలుగుతాం".
ఫోన్లో మాట్లాడుతున్నంత సేపు ఏడుస్తూనే ఉన్నది. ఇటు వైపు నేనేడుస్తున్నది కూడా గమనించటం లేదు. కొడుకు జాగ్రత్త పరుడు, తెలివిగలవాడని అందరికి తెలుసు. తనకు కొడుకు పైన అదే నమ్మకం. ఎక్కడో పొరపాటు జరిగింది, ఎవరో మోసం చేశారు అనే భార్యను బుజ్జగించాడు. కొడుకు పరిస్థితికి జాలి పడినా విశ్వం దంపతులు నిస్సహాయులయ్యారు.
" మన కంటి ఎదుటే బిడ్డను పోగొట్టుకునే దౌర్భాగ్యం మనకు వద్దండి, ఏది చేసైయినా అబ్బాయిని కాపాడండి."
అని భార్య మొరపెడితే విశ్వం పూర్వికులు ఇచ్చిన డాబా కుదువ పెట్టి పది లక్షలు కోడలు పేర బ్యాంకు లో వేసాడు. భగవంతుడి కటాక్షం కరువై, భార్యకు గుండె పోటు వచ్చి కాలం చేసింది.
*************************************
" ఒరేయ్ కాశీ, మా పాతూరు డాబా ఇక నాకు దక్కదా ? దానిమీద చేసిన అప్పుకు వాయిదాలు కట్టటానికి నా పెన్షన్ సరి పోవటంలేదు. వాయిదాలు కట్టక బకాయి పెరిగిపోయింది. "
"అన్నయ్య ఆ బంగాళా మీద నువ్వు చేసిన అప్పు కాక నీ కొడుకు వడ్డీ వ్యాపారి దగ్గర కుదువ పెట్టాడు. అందుకే అది కోర్ట్ కేసయింది. "
"కాశీ మీ వదిన అదృష్టవంతురాలు.తానుండగానే కొడుకుకు అన్ని ఏర్పాట్లు చేసింది. ఐశ్వర్యవంతుణ్ణి చేసింది. . నిలువ నీడ లేకపోవటం నా దౌర్భాగ్యం. ".
"అన్నయ్య నువ్వు వాడికి స్వేచ్ఛ ఇచ్చావు, జాగ్రత్తలు చెప్పలేదు. నీ ఆలోచనలు ఎప్పుడు వాడికి పంచలేదు, పిల్లలతో ఎడబాటు అనర్ధాలకు తావిస్తుంది."
"ఒరేయ్ కాశీ1, మానాన్న నన్ను ఎంతో కష్టం చేసి చదివిందాడు. ఆయన పెద్దగా చదువుకోక పోయినా నా భవిష్యత్ పైన శ్రద్హ పెట్టి, శ్రేయోభి లాషుల సలహాలు తీసుకుని గ్రూప్ 1 చేయించాడు. ఆయన నిజంగా ధన్యుడు. నన్ను మనిషిగా నిలబెట్టిన ఆయన ఆశయాన్ని స్ఫూర్తి గా తీసుకొని మా కొడుకు జీవితానికి బాసటగా నిలవాలనుకున్నాను. కొడుకు నాకంటే ఉన్నతంగా బ్రతకాలని, మాత్రమే అనుకున్నాను."
" అన్నయ్య! నువ్వెప్పుడైనా మీ నాన్నతో అనుబంధం, కర్తవ్య బాధ్యతల విషయం నీ కొడుక్కు చెప్పావా, పోనీ ఒక తండ్రి కొడుకు నుండి ఏమి ఆశిస్తాడో పరోక్షంగా నైనా చెప్పావా. అవ్యక్తమైన భావాలు అర్ధం చేసుకోవటం, అప్రకటిత బాధ్యతలు స్వీకరించటం ఈ తరంవారికి తెలీదు. అది నీతోనే కాలం చేసింది. నిఖచ్చిగా చెప్పక పోవటమే నువ్వు చేసిన పొరబాటు.
" కాశీ! నీ పిల్లలకు నువ్వు క్రమ శిక్షణ నేర్పించావా"
"అన్నయ్య నేను నేర్పించాను అని చెప్పలేను కానీ,పిల్లల ఎదుటే వాళ్ళ ప్రవర్తనా నియమావళి మాట్లాడుకునే వాళ్ళం"
" కాశీ మా వాడు ప్రేమించి పెళ్లి చేసుకోకుంటే నా మేన కోడలిని కోడలు చేసుకోవాలని మా కోరిక. నాకొడుకుని ఆ పిల్ల వివరాలు కూడా అడగకుండా ఒప్పుకోవాల్సి వచ్చింది. ఆ విధి రాత నా తల రాతను మార్చేసింది."
"అన్నయ్య పిల్లల విషయంలో నువ్వు తప్పు ఆలోచిస్తున్నావు. నువ్వు నీ కొడుకుకు వివాహ ప్రయత్నం చేసావా, ఈ విషయంలో వాడిని సంప్రదించావా. నీ ఆలోచనలు, మనో భావాలు వ్యక్తం కాలేదు కాబట్టి, వాడు అడ్వాంటేజ్ తీసుకున్నాడు. పిల్ల మంచిది. ఈడు జోడు బాగుంది. ప్రేమ వివాహమైనా వాళ్లిద్దరూ ఒద్దికగా ఉన్నారు. పెళ్లి కి ముందు జరిగిన మనస్పర్థలు వదిలేస్తే, ఇప్పుడు అందరు కలిసే ఉంటున్నారు. నువ్వు కోరుకున్నట్లే నీకొడుకు అందలం ఎక్కాడు, సంతోషంగా ఉండు."
"కాశీ! అబ్బాయి అమెరికా వెళ్లే ముందు నిన్నే ఎందుకు పిలిచారు, ఏమైనా గొడవ అయ్యిందా." అతృతతో అడిగాడు విశ్వం.
"అన్నయ్య మీ అబ్బాయి గుణవంతుడు. నీకున్న హోదా,పలుకుబడి వాడిని కష్టం తెలియకుండా పెంచాయి. స్వేచ్ఛ స్వతంత్రం మితిమీరి మీ కోడలు ప్రేమలో మునిగిపోయాడు. వీడి ప్రవర్తన నచ్చలేదని, తమ పిల్లను సరిగ్గా చూసు కోలేడని మీ వియ్యంకుడు ఇష్టపడలేదు. తెలివైన మీ కోడలు మన వాడిని వదల్లేదు.
" మీ నాన్న ఇచ్చిన జీవితం కంటే మంచి జీవితం ఇస్తాను " అని నమ్మ పలికాడు. ఇటువంటి యోగ్యుడు, అమాయకుడు తరువాత దొరకడని ఆ పెద్ద మనిషి ఒప్పుకున్నాడు. అందుకు నేను సాక్షిని అయ్యాను.
ఆకాష్ అమెరికా నుండి వచ్చిన తరువాత విశ్వం తన పలుకుబడిని ఉపయోగించి ఒక సాఫ్ట్ వేర్ కంపెనీలో చేర్పించాడు. అది చిన్న కంపెనీ, లాభాలు సంపాదించేది అవటంతో ఆకాష్ ఎంతో డబ్బు గడించాడు. తన తెలివితో మేనేజర్ హోదా పొంది భార్య బిడ్డలను ప్రేమగా చూసుకున్నాడు.
**********************************
వదిన కాలం చేసి ఐదు సంవత్సరాలు నడిచి పోయాయి. కోడలు వత్తిడి చేస్తే రెండు ఏళ్ళు హైదరాబాద్ వెళ్ళాడు. అద్దె ఇల్లు ఖాళీ చెయ్యకుండా, నన్ను విడిచి వెళ్లకుండా వొస్తూ పోతు ఉండేవాడు.
కోడలు పరాయి పిల్లయినా విశ్వానికి కొంత మర్యాద ఇచ్చేది. అది కూడా ఆమె విషయంలో జోక్యం చేసు కోకుంటేనే. చిన్న నాటి స్మృతులు, అమ్మ జ్ఞాపకాలు ఎప్పుడూ ఉండేవి కావు. పెద్దల గురించి కబుర్లు, జీవిత అనుభవాలు ఆకాష్ భార్యతో మాట్లాడే వాడే కానీ, అవి విశ్వం వరకు వచ్చేవి కావు. కొడుకుతో ఎడబాటు, వారి ఇరువురి మధ్య నిశ్శబ్దం విశ్వం తట్టుకోలేక పోయేవాడు.
వర్క్ ఫ్రేమ్ హోమ్ జరుగుతున్న రోజులవి. తాను చెప్ప్పిన టైంకి ఇంటికి రాలేదని, ఉద్యోగస్తులను నిల్చోబెట్టి మాట్లాడే వాడు. వాళ్ళను ఇతర ఉద్యోగస్తులు విమర్శిస్తే ఆనందం పడేవాడు. ఇతరులపైన కంప్లైంట్స్, విమర్శలు ప్రోత్సాహించేవాడు.
విశ్వం చెప్పబోతే, "మీకేంతెలుసు కంపెనీ విషయాలు. ఇవి మీ రోజులు కావు. వీళ్ళతో ఇలాగే ఉండాలి మీరు హద్దులు తెలుసుకోండి" అన్నాడు. ఆరోజున జరిగిన చేదు అనుభవం విశ్వాన్ని క్రుంగ దీసింది.
***********************
" అన్నయ్య నువ్వు దిగులు పడకు. నీ కొడుకు నిన్ను పూలల్లో పెట్టుకొనే చూసుకునే రోజులొస్తాయి, అవసరమైతే నేను జోక్యం చేసుకుని మాట్లాడుతాను. "
విశ్వం కి కోడలు చెప్పిన మాట గుర్తుకొచ్చింది. " మానాన్న ఇచ్చిన జీవితం కంటే మంచి జీవితం ఇస్తానని మీ అబ్బాయి నాకు వాక్దానం చేసాడండి. నన్ను పూలల్లో కాకున్నా ప్రేమగా, బాధ్యతగా చూసుకుంటున్నారు"
అది ఆమె అదృష్టం. వాడి పలకరింపు కూడ అనర్హుడిని అవటం నా దురదృష్టం"
"అన్నయ్య ! భగవంతుడి కరుణా కటాక్షం నీకు మెండుగా ఉన్నాయి. నీకు ఎన్నటికైనా మేలే జరుగుతుంది."
"కాశీ నేను భగవంతుడిని రోజూ ఒక్కటే కోరు కుంటున్నాను. నా కొడుకు తన భార్యకు వాక్దానం చేసి నట్లుగా -
'నాన్న మీరు నాకిచ్చిన జీవితం కంటే, నేను మంచి జీవితాన్ని ఇస్తాను' అనే భావన వాడిలో కలగ చెయ్యమని.
"అన్నయ్య నీ 'పితృ మనో వాంఛ' సబబైనదే. ఎంతమంది సన్నిహితులున్నా బిడ్డల మర్యాద మనుషులను జీవించేలాగా చేస్తుంది. నీ కొడుకు నోటి నుంచి ఆమాటలు వినపడేలాగా నేను చేస్తాను. నువ్వు దిగులు పడకు."
" ఈ యువకులు ప్రేమ మాయలో పడి పడుచు యువతులకు ధైర్యం ఇవ్వగలుగుతారు, కానీ తల్లి తండ్రులకు మాత్రం అధైర్యం మిగులుస్తారు. అందులో నాకొడుకు ఒకడు. "
"అన్నయ్య అవధులులేని ఈ పిల్లల నిర్లక్ష్యానికి అడ్డు కట్ట పడాలి. తల్లి తండ్రుల వారసత్వమే కుటుంబమని అందరికి తెలియాలి. నా న్యాయవాద వృత్తిని అనుసంధానించి అందరిని ఈ విషయంలో హెచ్చరిస్తాను."
ఆరోజే నేను నిశ్చయించుకున్నాను. జడ్జిగా రిటైర్ అయిన నేను ఈ కొత్త బాధ్యతను తీసుకోవాలని, 'పితృ మనో వాంఛ' ను యువకులు ఆకళింపు చేసుకోటానికి నా వంతు ప్రయత్నం నేను చెయ్యాలని.
******************************************