మాధవరావు రాధికల అమ్మాయి ఆమని భర్త మహేష్ తో బెంగళూరులో కాపురం చేస్తూంటే, అబ్బాయి ఆనంద్ భార్య సత్యతో పూణేలో ఉంటున్నాడు.
ఎల్లుండి సంక్రాతి. అంతేకాక, రావుగారి 55వ పుట్టినరోజు. నిన్ననే వచ్చిన కొడుకు-కోడలు, కూతురు-అల్లుడు తో ఇల్లంతా సందడేసందడి.
"ఎల్లుండి మీపుట్టినరోజుకి ఏమేమి చెయ్యాలో చెప్తే, ఆ పనిలో ఉంటాను" భర్తని ఉద్దేశించి చెప్పింది రాధిక.
"రాధికా, నేను కోరేది తప్పకుండా చేస్తావా"
"మీకెందుకొచ్చింది అనుమానం"
"తీరా చెప్పిన తరువాత, కాదంటావేమో అని"
"ఇన్నాళ్ల మన కాపురంలో మీరు చెప్పింది ఎప్పుడేనా కాదన్నానా, పిల్లలముందర నన్ను అవమానిస్తున్నారు" అని కళ్లనీళ్లు పెట్టుకుంటున్న తల్లినిచూసి –
కొడుకు, కూతురు ఒక్కసారిగా –"అదేమిటి నాన్నగారూ, అలా మాట్లాడి, ఇంత మంచిసందర్భంలో, అమ్మమనసు కష్టబెట్టేరు."
"నేను చెప్పినది తప్పకుండా చేస్తానని నా చేతిలో చేయివేసి చెప్తే, నాకేమిటి కావాలో అప్పుడు చెప్తాను."
"ఈ మెలికేమిటి కొత్తగా" అని కళ్ళనిండానీళ్లతో అడిగిన రాధిక, భర్తచేయి పట్టుకొని "సరే, మీకు కావలసినది నేను తప్పకుండా చేస్తాను, కొడుకు, కోడలు, కూతురు, అల్లుడు అందరూ సాక్ష్యం. సరేనా. నన్ను మీ మాటలతో నొప్పించకుండా ఇప్పుడేనా చెప్తారా"
"నాకేమిటి కావాలో చెప్తాను విను. ...... రేపు నువ్వు నాతో డాక్టర్ దగ్గరకి రావాలి. లేదంటే, నేను ఈసారి పుట్టినరోజు అసలు జరుపుకోను."
వెంటనే, ఆనంద్, "అమ్మకేమిటయ్యింది నాన్నా ? తోడుగా నేను కూడా వస్తాను."
వెంటనే, అల్లుడు " నేను కూడా వస్తాను మామయ్య."
వాళ్ళని ఆగండి, అని చేత్తో వారించి, రావుగారు ---
" ఆరునెలలై మీఅమ్మకి రాత్రుళ్ళు ఊపిరి సరిగ్గా ఆడడంలేదు, నిద్ర పట్టడంలేదు. డాక్టరు దగ్గరకి వెళ్లి చూపించుకుందాం అంటే, 'ఏమీ అక్కరలేదు, అదే సర్దుకుంటుంది' అని నా మాట వినడంలేదు. రోజంతా ఉండే పనిమనిషిని, వంటమనిషిని పెట్టుకుందామంటే వినడంలేదు. మీరంతా ఉన్నారన్న ధైర్యంతో ఈ విషయం ఇప్పుడు లేవనెత్తేను. మీరేనా చెప్పి అమ్మని డాక్టర్ దగ్గరకి వెళ్ళడానికి ఒప్పించండి."
-2-
"పిల్లలూ ఆయన మాటలు ఏమీ పట్టించుకోకండి. చిన్నవిషయానికి రాద్ధాంతం చేస్తున్నారు. నిన్ననగా వచ్చేరు మీరు. నేనెలా ఉన్నానో మీకు తెలీడంలేదూ ?"
"అలా కొట్టి పారీకు రాధికా, వారంరోజులు క్రిందట రాత్రి రెండుగంటలకి ఊపిరి ఆడక నువ్వు ఎంత అవస్థ పడ్డావో గుర్తుకి వస్తేనే భయమేస్తోంది. గంట పట్టింది సర్దుకుందికి. పైగా, ‘పిల్లలుండే నాలుగు రోజులూ మీరు ఈ సంగతి వాళ్ళ దగ్గర లేవనెత్తేరో, ఒట్టే’ అనలేదూ, అప్పుడు"
ఆయన మాటలు విన్న తరువాత, ఆమని, సత్య రాధికని ఒడిసిపట్టుకోగా, "అంతమందిమీ ఉన్నాం భయమెందుకు. నువ్వు రేపు తప్పకుండా డాక్టరు దగ్గరకి వెళ్తున్నావు.” అని తల్లితో చెప్పిన ఆమని---
" నాన్నా, మీరెప్పుడూ అమ్మకి ఇలా ఉంటున్నదని నాకు చెప్పేలేదు. తమ్ముడికి కూడా చెప్పినట్టులేదు. రేపు ఉదయం తమ్ముడు ఆయన మీతో వస్తారు. అమ్మని తప్పకుండా డాక్టరుకి చూపించండి" అని తేల్చేసింది.
"ఇదే ధైర్యం కోసం ఇన్నాళ్లూ ఎదురు చూసేనమ్మా. రేపు పది గంటలకి డాక్టర్ అప్పాయింట్మెంట్ ఇప్పుడే తీసుకుంటాను."
అందరూ అలా బలవంతం చేయడంతో, రాధికగారు మరేమీ మాట్లాడలేకపోయారు.
హాస్పిటల్ లో రాధికగారికి పరీక్ష చేసిన డాక్టర్ గారు వెంటనే PFT చేయించమని చెప్పి-- ఆ రిపోర్ట్, తన రిపోర్ట్ కలిపి అదే హాస్పిటల్ లో ఉన్న PFT పెద్దడాక్టరుగారికి చూపించమన్నారు.
అన్నీ చూసిన ఆ డాక్టరుగారు -- "ఊపిరితిత్తుల పరిస్థితి సంతృప్తిగా లేదు. ఎందుకేనా మంచిది హృద్రోగ నిపుణుడికి వెంటనే చూపించండి" అని చెప్పేరు.
హృద్రోగనిఫుణుడు ఈసీజీ, ఎకో పరీక్షలు చేయించి -- రిపోర్ట్ లు చూసి –
"ఇంత ఆలస్యం చేసేరేమిటి? ఓపెన్ ఆపరేషన్ చేసి గుండెలో పాడైపోయిన వాల్వ్ తీసి కొత్తది వేయాలి. 5 లేక 6 రోజులు హాస్పిటల్ లో ఉండవలసి వస్తుంది, ఆవిడకి 53 ఏళ్ళున్నందులకు ఇటువంటి ఆపరేషన్ 20శాతం రిస్క్ తీసుకొనే చేయవలసి ఉంటుంది, ముందే చెప్తున్నాను. త్వరగా ఆవిడని హాస్పిటల్ లో చేర్పిస్తే మంచిది” అని చెప్పేడు.
“ఎందువలన ఇలాంటి పరిస్థితి ఏర్పడింది” అని డాక్టరుని అడిగితే –
" ఎక్కువ బరువైన వస్తువు ఏమేనా ఆవిడ గుండెమీద ఎప్పుడేనా పడిందా" అని అడిగేరు.
"సుమారు పదేళ్లకిందట ప్రమాదంలో కిందపడిన ఆమెమీద స్కూటరు పడితే, కాలు విరిగి మూడునెలలు మంచంమీదే ఉండవలసివచ్చింది" అని జవాబిచ్చేరు.
"అప్పుడు గుండెకేమేనా X-Ray తీయించేరా” అని డాక్టరు అడిగితే --
"కాలు విరిగింది కాబట్టి, గుండెకి X-Ray తీయించమని ఎవరూ చెప్పలేదు" అని జవాబిచ్చేరు.
"సరే, జరిగిందేదో జరిగిపోయింది. అప్పుడు ఏర్పడ్డ లోపానికి ఇంతవరకూ చికిత్స లేకపోవడంతో ముదిరి, ఇప్పుడు ‘త్వరగా’ ఆపరేషన్ చేయవలసిన పరిస్థితి వరకు వచ్చింది" అని బోధపరచేరా డాక్టరు.
-3-
అసలు విషయం తెలుసుకున్న అందరి మనసులలో పండగ వాతావరణం ఆవిరైపోయి, ఇల్లంతా నిశ్శబ్దం నిండుకుంది.
"డాక్టర్లు మనల్ని భయపెట్టడానికి డబ్బులు గుంజుకుందికి ఏవో చెప్తూ ఉంటారు. ఆరు నూరైనా నేను మాత్రం ఆపరేషన్ చేయించుకోను" అని భీష్మించుకున్న రాధికగారిని ఒప్పించేసరికి, అందరికీ ‘తల ప్రాణం తోకకి వచ్చింది’ అన్నంత పనైంది.
అదేరోజు సాయంత్రం ఆనంద్ మహేష్ హాస్పిటల్ కి వెళ్లి ఎంత ఖర్చు అవుతుంది, ఇన్సూరెన్సు ఎంతవరకూ వస్తుంది, తదితర వివరాలన్నీ తెలుసుకొని, రావుగారి పుట్టినరోజు మరునాడు, రాధికగారిని హాస్పిటల్ లో చేర్పించడానికి, ఆరోజుకి రెండో రోజున ఆపరేషన్ చేయించడానికి నిశ్చయం చేసుకొని వచ్చేరు.
అనుకున్నరోజున ఉదయం ఏడోగంటకి ఆవిడని ఆపరేషన్ గదిలోకి పంపించి, ఆవిడకి కేటాయించిన గదిలోనే అందరు ఉండి, ‘ఆపరేషన్ విజయవంతం’ అవాలి అని భగవంతుడిని ప్రార్ధిస్తూ, మనసులో ఆతృత పడుతూ ఉండగా --
సాయంత్రం ఆరు తరువాత - డాక్టరుగారు పిలిచి -- "ఆపరేషన్ విజయవంతం అయింది, ICUలో ఉంచేము, ఉదయం ఆరుసరికి తెలివి రావాలి, పది తరువాత చూడడానికి అవకాశం ఉంటుంది" అని చెప్పేరు.
ఆవిడ ఆపరేషన్ విజయవంతమైంది అన్న వార్త వారి మనసులలో ఆనందం నింపింది. ఆ రోజంతా 'మృత్యుంజయ మంత్రం' జపిస్తూ కూర్చున్న రావుగారు, అప్పుడు నడుం వాల్చేరు.
రాధికగారికి ఆరో గంటకి తెలివి వచ్చింది. మొదట రావుగారు ఆమని ఆవిడని చూడడానికి వెళ్ళేరు. అక్కడ ఉన్న నర్సు 'ఆవిడ ఒక ఇడ్లీ తిన్నారు' అని కూడా చెప్పడంతో వాళ్ళ ఆనందానికి అవధులు లేవు. తరువాత, సత్య ఆనంద్ వెళ్లి చూసొచ్చేరు. మహేష్ తో మళ్ళా ఆమని వెళ్లి, చూసి వచ్చేరు.
ఒంటిగంటకి డాక్టరుగారు " వెంటిలేటర్ తొలగించేం. మరునాడు ఉదయం పేస్ మేకర్ తోనే గదికి మార్చి, ఒక రోజు ఉంచి, మరునాడు పేస్ మేకర్ తీసేసి గదిలోనే ఉంచి, ఆ మరునాడు అన్ని టెస్ట్ లు చేసి, సాయంత్రం ఇంటికి వెళ్ళడానికి అనుమతి ఇవ్వబడుతుంది" అని చెప్పేరు.
ముందురోజంతా మానసికంగా అలసిపోయిన రావుగారు - చక్కబడుతున్న భార్య పరిస్థితి తలచుకుంటూ, మరో రెండు మూడు రోజులలో ఆమెని ఇంటికి కూడా తీసుకొని వెళ్ళిపోవొచ్చన్న ఆనందంతో, తేలికపడిన మనసుతో ఆ రోజు రాత్రి తొమ్మిది గంటలకే నిద్రలోకి జారుకున్నారు.
రాత్రి రెండు అవుతూండగా ఆనంద్ కి ICU నించి ‘వెంటనే రమ్మని’ పిలుపొచ్చింది.
‘ఎందుకో ఏమిటో’ అన్న ఆత్రుతతో, మహేష్ తో కలిసి, పరుగులాంటి నడకతో ICU దగ్గరకి వెళ్ళేడు, ఆనంద్.
అప్పుడక్కడ డాక్టరు వీళ్ళతో -----
-4-
" రాత్రి భోజనం చేసిన రెండుగంటల తరువాత కడుపులో నొప్పి అన్నారు. గంట గడచినా తగ్గలేదంటే, మందులు ఇంజక్షన్ ఇచ్చేము. మరో గంట గడిచినా ఇంకా తగ్గలేదంటే స్కానింగ్ చేసేము. స్కానింగ్ లో కిడ్నీ చిన్న ప్రేగులు ఇన్ఫెక్షన్ కి గురి అయినట్టుగా తెలుస్తోంది, మూత్ర విసర్జన అవడంలేదు. ఈ కాగితం మీద సంతకం చేస్తే వెంటనే 'డైలసిస్' చేస్తాం, రేపు ఉదయం మరోసారి స్కాన్ చేసి, అవసరమైతే, చిన్న ప్రేగులకి ఆపరేషన్ చేస్తాం" అని చెప్పేరు.
ఏదుపందుకున్న ఆనంద్ ని ఓదార్చి ధైర్యం చెప్పిన మహేష్, విషయమంతా ఆమనికి సత్యకి చెప్పి, తప్పదుకాబట్టి రావుగారిని లేపేరు.
ఉలిక్కిపడి లేచిన ఆయన విషయం తెలుసుకొని, డీలాపడిపోయి, ‘నేను ఇప్పుడే రాధికని చూడాలి’ అని పట్టుపట్టడంతో అందరూ ICU దగ్గరకి వెళ్ళేరు. కానీ, అప్పుడు ఆవిడని చూడడానికి కుదరదని చెప్పేరు అక్కడున్న పనివారు.
డాక్టరుతో మాట్లాడాలంటే – “ 'డైలసిస్' చేస్తున్నారు, ఇప్పుడు కుదరదు ” అని అన్నారు.
అప్పటినుంచి 'ఎప్పుడు తెలవారుతుందా, ఆవిడ పరిస్థితి ఎలా ఉంటుందా' అన్న ఆలోచనతో మిగిలిన రాత్రి భారంగా గడిచిందందరికి.
ఉదయం ఏడుగంటలకి ఆవిడకి మరోసారి స్కాన్ చేసిన డాక్టరు - ఆవిడ ఆరోగ్యంలో ఎటువంటి మెరుగుదల లేకపోగా, అనూహ్యంగా దిగజారడం ఆరంభమైంది కాబట్టి, మరో గంటపోతే మరోసారి 'డైలసిస్' చేసి, పదిగంటలైతే చిన్న ప్రేగులకి ఆపరేషన్ చేస్తామని చెప్పి, అందుకు సంబంధించిన కాగితాలమీద సంతకాలు తీసుకొని లోనికి వెళ్ళిపోయేరు.
పదిగంటలకు చిన్న ప్రేగులకి ఆపరేషన్ ప్రయత్నాలు జరుగుతూండగానే, ఆవిడకి గుండె నొప్పి విపరీతంగా వచ్చి, పదిహేను నిమిషాలలో గుండె పనిచేయడం పూర్తిగా ఆగిపోయింది.
తరువాత డాక్టర్లు ఎంత ప్రయత్నం చేసినా - పైకి లేచిపోయిన ఆమె ప్రాణం మరి వెనక్కి రాలేదు.
*******************