గుంటూరు గురించి ప్రత్యేకంగా తెలుగు ప్రజలకు చెప్పాల్సిందేదీ లేదు. తెలుగు రాష్ట్రాలలో ప్రతి ఒక్క జిల్లాకూ ఒక విశిష్టమైన స్థానం ఉంది. అన్ని జిల్లాల ప్రజలలాగే గుంటూరు వాసులకూ కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. సాధారణంగా గుంటూరంటే మిర్చియార్డూ, ప్రత్తి, పొగాకు బోర్డులూ గుర్తుకు వస్తాయి. గుంటూరులో పండే వర్జీనియా పొగాకు సుప్రసిధ్ధమైనది. ఈ పొగాకు ఆకులు పసిడి పసుపు వర్ణంలో ఉంటాయి కాబట్టి దీనికా పేరు వచ్చింది. ఇప్పుడు మీకు గోల్డ్ ఫ్లేక్ సిగరెట్లలో ఏ పొగాకు వాడతారో తెలిసిపోయింది కదా.
అలాగని ఈ కథకూ, పొగాకుకూ ఏమాత్రం సంబంధం లేదు. ఎందుకంటే ఈకథ ఒ గుంటూరోడిది. గుంటూరోళ్ళను చూసే ఛార్లెస్ డార్విన్ పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించి ఉంటాడు. ఎందుకంటే గుంటూరోళ్ళు మారుతున్న కాల, భౌగోళిక, రాజకీయ, సాంఘిక పరిస్థితులతోబాటు మారగలగడంలో మిగతా ప్రపంచంలోని మానవులకన్నా ఓ పిసరంత ఎక్కువ ప్రావీణ్యులు.
మన కథకు కథానాయకుడు యడ్లపల్లి శివ శంకర వెంకటేశ్వర వరప్రసాదు. ఇంటిపేరే వాళ్ళ ఊరిపేరు కూడానూ. కృష్ణాతీరంలోనున్న ఆ గ్రామంలో వాళ్ళ నాన్న ఒక రైతు. సుబ్బయ్యకు, అదే వై.ఎస్.ఎస్.వి.వి. ప్రసాద్ తండ్రికి, చిన్నప్పటినుంచీ చదువంటే అసహ్యం, చిరాకు, కోపం. హిరణ్యకశిపుడికి విష్ణుమూర్తి మీద ఉన్న పగకన్నా చిన్నప్పటి సుబ్బయ్యకు చదువు మీద పగెక్కువ. చాలా కష్టపడి ఊళ్ళోనే పెద్దబాలశిక్ష పూర్తిచేసిన తరువాత బడి మాటెత్తితే ఊరి బయట కృష్ణలో దూకుతాననేవాడు. కానీ కొంచెం పెద్దయిన తరువాత తన తప్పు తెలుసుకున్నా, ఊరుదాటనని నాయనమ్మకు మాటిచ్చాను కాబట్టి పక్కూళ్ళోనున్న బడికి పోలేకపోయానని చెప్పుకుంటాడు. కనీసం ఈ కథనన్నా జనాలు నమ్మాలికాబట్టి, అతడు యడ్లపల్లి నుంచి ఎక్కడికీ వెళ్ళడు.
అలాంటి సుబ్బయ్యకు పదో తరగతి పాసైన భారతితో పెళ్ళి జరిపించారు పెద్దలు. మరి ఆరోజుల్లో కేవలం రెండెకరాల పొలం కట్నంగా ఇస్తే చదువుకున్న వాళ్ళెవ్వరూ ఆమెను చేసుకోరు. ప్రభుత్వమెంత వరకట్న నిషేధం గురించి ప్రచారం చేసినా ఇప్పటికీ కేవలం కట్నం కోసం ఐ.ఏ.ఎస్ అవ్వాలనుకునే వాళ్ళు కోకొల్లలు. ఇహ యాభై ఏళ్ళ కిందటి మాట చెప్పాలా. పెళ్ళైన పది రోజులకే భారతికి భర్త ఎలాటివాడో అర్థమైంది. కానీ కొంచెం తెలివైనది కావడం వల్ల, ఈ ఇనుప విగ్రహానికి పట్టిన తుప్పు వదలించే ప్రయత్నంజేసి తన శక్తిని వృధా చేయడం సరిగాదని గ్రహించింది. అందుకే తాను జన్మనిచ్చే ప్రాణిని, తనకు కావలసిన విధంగా మొదటినుంచే తీర్చిదిద్దాలనుకుంది. ఆ ప్రాణియే మన ప్రసాద్. అదేనండీ, వై.ఎస్.ఎస్.వి.వి. ప్రసాద్.
ఆమె అర్థంచేసుకోలేనిదేంటంటే, ప్రసాదులో తన తండ్రి అంశ కూడా ఉంటుందని. మరి కాకరకాయ విత్తనాలు చల్లితే పొట్లకాయలు కాస్తాయా? ఈ సంగతి భారతికి ఆర్థమయ్యేటప్పటికి ప్రసాద్ హైస్కూలుకొచ్చేశాడు. ఇహ ఉపేక్షించి లాభంలేదని బాగా ఆలోచించి భారతి ఒకరోజు ప్రసాదుకు ఇష్టమైన జున్ను చేసి, వాడు మెక్కుతుంటే మెల్లగా “ఒరే నాన్నా, మీ నాన్న వాళ్ళ నాయనమ్మకు ఊరి పొలిమేర దాటనని మాటిచ్చాడు కదరా? మరి నువ్వేం మాటిస్తావు? ఒక్కసారిగా మెత్తని జున్నుముక్క మండుతున్న బొగ్గుముక్కలాగా అనిపించింది ప్రసాదుకి. కానీ, గుంటూరోడు కదా. అమ్మతో గొడవ పడితే తనకే తిండి దొరకదన్న చిదంబర రహస్యం గ్రహించినవాడై చిన్నగా నవ్వాడు “నాయనమ్మ పోయిన సంవత్సరమే కాలం చేసింది కదా? తను ముందే అడిగుండాల్సింది”.
ఈ పనికిమాలిల తెలివితేటలకేమీ తక్కువలేదని మనస్సులోనే తిట్టుకుని పైకిమాత్రం పారిశ్రామిక కాలుష్యాన్ని తన గర్భంలో దాచుకునికూడా నిర్మలంగా, ప్రశాంతంగా కనిపించే గంగానదిలా భారతి కూడా నవ్వింది. ఇంకో జున్ను ముక్క వాడికిస్తూ, “మీ నాయనమ్మ కూడా మీ నాన్న వాళ్ళ నాయనమ్మలాటిదేదో అడిగిందనుకో, నీ జీవితం కూడా మీ నాన్న జీవితంలాగే వధా అయిపోతుంది కదా” అన్నది. ప్రసాదు మునిపంటితో జున్ను కొరుకుతుంటే “ప్రతి తల్లీ, తన బిడ్డలకోసమే బ్రతుకుతుంది కదా. అందుకే నువ్వు నాకు ఒక మాటిస్తావా? నేనెటూ నీమంచే కోరతాను కదా?” అన్నది.
ప్రసాద్ అమ్మను ఒకసారి తేరిపారజూశాడు. ఆ... మాటే గదా. ఇస్తే ఏంబోయిందిలే అనుకుని అమ్మిచ్చిన జున్ను తింటూ, అమ్మకే వరాలిచ్చే దేవుడిలా మొహం పెట్టి “సర్లే అడుగు” అన్నాడు. “నువ్వు బాగా చదువుకుని అమెరికాకెళ్ళరా. ఇదే నాకోరిక”
“సరేలే” ఈమాత్రం దానికి ఇంత సీనెందుకన్నట్లుగా అమ్మకి వరమిచ్చేశాడు ప్రసాదు. ఇహ వాడి కష్టాలన్నీ అప్పటినుంచీ మొదలయ్యాయి. భారతి వాడిని రోజూ తెల్లవారుఝామున లేపి చదువుకోమనసాగింది. ఆవిధంగా భారతి ఆరు సంవత్సరాలు కష్టపడితే గాని వాడు ఇండర్మీడియెట్ ఫస్టుక్లాసులో పాసవ్వలేదు. కానీ, ఆమె భయపడ్డట్లే ప్రసాదుకు ఎంసెట్లో వచ్చిన రాంకుకు అండమాను ఇంజనీరంగ్ కాలేజీలో సివిల్ బ్రాంచి తప్ప ఇంకెక్కడా సీటు దొరికే అవకాశంలేదు. అప్పట్లో సివిలుకు పెద్దగా డిమాండు లేదు లేండి. ఇప్పుడంటే గోర్మెంటోళ్ళు నిజంగానే రోడ్లేస్తున్నారుగాని, అప్పుడైతే - సరేలే, ఆ పురాణమెందుకిప్పుడు? భారతికి మాత్రం ప్రసాదుని ఎలక్ట్రానిక్సు ఇంజనీరుని చేయాలని తపన. సుబ్బయ్య జన్యుకణాల శక్తిని ముందే గ్రహించింది కావడం వల్ల పెళ్ళైనప్పటినుంచీ ప్రతి సంవత్సరమూ సుబ్బయ్యతో రెండెకరాల పొలం కొనిపించింది. ప్రస్తుతం ఆ పొలమమ్మి పిల్లవాడిని బెంగుళూరు పంపించి చదివించమన్నది. తన పదిహేను సంవత్సరాల కష్టాన్నీ అమ్మమనడం సుబ్బయ్యకు నచ్చకపోయినా కుటుంబంలోని వాళ్ళూ, ఊళ్ళోని వాళ్ళూ అందరూ భారతి మాటలకు వత్తాసు పలకడంతో పొలమమ్మడానికి సిద్ధమయ్యాడు. దీంతో తన ప్రమేయం లేకుండానే ప్రసాదుకు బెంగుళూరులో ఇంజనియరింగు చదవాల్సి వచ్చింది. ఉన్న పొలమంతా అమ్మి తనను చదివిస్తున్నందుకు ప్రసాదుకు కూడా చదువంటే మునుపటికంటే కొంచెం ఎక్కువ శ్రద్ధ కలిగింది. కాలేజీలో చేర్పించడానికి అతనికూడా భారతే వచ్చింది. బెంగుళూరు నీళ్ళు వంటపట్టగానే మనోడికి తన తల్లి ముందుచూపు విలువ తెలిసింది. తన సహ విద్యార్థుల కుటుంబాలగురించి తెలిసిన తరువాత ఇలాటి అమ్మకు పుట్టడం నిజంగా పూర్వజన్మ సుకృతమని గ్రహించాడు.
ప్రసాదు ఇంజనీరింగు చదువుతున్న రోజుల్లో మొదటిసారిగా భారత ప్రధానమంత్రిగా ఒక తెలుగువాడు అధికారాన్ని చేబట్టాడు. అంతవరకూ ఇనుపగొలుసులతో కట్టిపడవేయబడ్డ భారత వ్వవస్థాపకతను అధికార బంధనాలనుంచి విముక్తుడిని చేశాడు.
ప్రసాదు చదువు పూర్తయ్యేటప్పటికి అప్పటికి ప్రపంచంలో ఏకైక అగ్రరాజ్యంగా స్థిరమైన అమెరికాకు వై2కే తెగులు పట్టుకుంది. కొత్త శతాబ్దంలోకి అడుగు పెట్టగానే తమ కంప్యూటర్లన్నీ ఆగిపోతాయని ప్రపంచంలోని సాంకేతిక మేధావులందరూ భయపడుతున్న రోజులవి. ఈ గండం గట్టెక్కించాలంటే వేలకొద్దీ కంప్యూటర్ ఇంజనీర్లు అవసరమని వాళ్ళు అంచనా వేశారు. అంతే, అప్పటి వరకూ సెక్యూరిటీ గార్డులకన్నా హీనంగా బ్రతుకుతున్న తెలుగు ఇంజనీర్లకు వై2కే తెగులు ఒక దైవదత్త అవకాశమని అర్థమయింది. వై2కే తెగులు నిజంగా కంప్యూటరులపైన పెద్దగా ప్రభావం చూపకున్నా, వేలకొద్దీ తెలుగు వాళ్ళు అమెరికాకు వెళ్ళి ఆంగ్లాన్ని తెలుగులో మాట్లాడే అవకాశం కల్పించింది. అందరిలాగే ప్రసాదు కూడా అమెరికా పయనానికి సిద్ధమయ్యాడు.
తను మొదటి సంవత్సరంలో ఉన్నప్పుడు ఫైనలియర్ స్టూడెంటైన బి.వి.ఎస్.కె. రావు దగ్గర అమెరికాకు ఎందుకు వెళ్ళాలో బాగా తెలుసుకున్నాడు. రాగింగు చేస్తూ “మీలో ఎవరికైనా అమెరికా వెళ్ళాలనుందా” అని రావు అడిగినప్పుడూ అమాయకంగా చేయెత్తాడు ప్రసాద్. అన్నట్లు రావు కూడా గుంటూరోడే. వాళ్ళది అప్పికట్ల.
చేయెత్తిన ప్రసాదుని “ఎందుకు నువ్వు అమెరికా వెళ్ళాలని అనుకుంటున్నావు?” అడిగాడు రావు.
“మా అమ్మ వెళ్ళమన్నది సార్”
“అమాయకత్వమా? తల పొగరా?” కోపంగా అడిగాడు రావు.
జవాబివ్వలేక నీళ్ళు నమిలాడు ప్రసాదు. అంతలో తెనాలి నుంచి వచ్చిన శిఖాకొల్లు సుబ్రహ్మణ్యం కూడా చేయెత్తాడు. రావు దృష్టి అటు పారింది. ఎందుకన్నట్లు కళ్ళెగరేసాడు.
“డబ్బులు సంపాదించడానికి సార్” ఠక్కున జవాబిచ్చాడు సుబ్రహ్మణ్యం. అంతే, ధనమనే పదం వినపడగానే, రక్తం వాసన పసిగట్టిన సొరచేపల్లాగా అందరూ సుబ్రహ్మణ్యం వైపు చూశారు.
“ఎంసెట్ లోనే ర్యాంకు తెచ్చుకోలేని వాడివి. నీకెవడ్రా అక్కడ ఉద్యోగమిచ్చేది” పరీక్ష చేస్తున్నట్లు ప్రశ్నించాడు రావు.
“నాకిండియాలోనే ఉద్యోగం రాదు. అమెరికాలో ఎవడిస్తాడు సార్” నవ్వాడు సుబ్రహ్మణ్యం. “అందుకే అక్కడకెళ్ళి చదువుకుందామనుకుంటున్నాను”
“ఏరా. నీ బాబు బాగా బలిసున్నోడా”
“ఆయన దగ్గరే డబ్బులుంటే నేను సంపాదించడం ఎందుకు సార్. వాటితోనే ఇక్కడ వ్యాపారం చేసేవాడిని. లేవు కాబట్టే అమెరికా వెళదామనుకున్నది”.
“అయినా నీకు అక్కడ సీటెలా దొరుకుతుందిరా? మనదేమో మెరిట్లో సీటు తెచ్చుకునే మొహం కాకపోయే. స్కాలర్ షిప్ లేకుండా అక్కడ చదవాలంటే కనీసం పాతిక లక్షలౌతాయి”
“అయిదుంటే చాలు సార్. మా మామయ్య దగ్గర అప్పు తీసుకుంటాను. అది బ్యాంకువాళ్ళకు చూపిస్తే ఇరవై వాళ్ళిస్తారు. ఎమ్మెస్ అయిపోయేలోపలే ఈలోన్ తీరిపోతుంది”
రావుకు దిమ్మదిరిగిపోయింది ఈ ప్లాన్ వినేసరికి. “అయినా చదువుకునేటప్పుడు డబ్బులెలా సంపాదిస్తావురా?”
“పెట్రోల్ పంపులో పనిచేస్తాను సార్” వెంటనే సమాధానం వచ్చింది. “కాలేజీలో అక్కడ బజ్జీలు, ఉల్లిపాయ పకోడీలు కూడా అమ్మాలని ప్లానుంది సార్. చలికాలంలో బాగా డిమాండ్ ఉంటుంది.”
“బజ్జీలమ్మడానికి అమెరిగా ఎందుకురా” రావు వదల్లేదు. “ఇక్కడే అమ్మొచ్చుగా”.
“ఇక్కడమ్మితే రుపాయలిస్తారు సార్. అక్కడయితే డాలర్లు దొరుకుతాయి”
ఇక ఓటమిని ఒప్పుకోకపోతే తనకు గర్వభంగం తప్పదని గ్రహించిన రావు, సుబ్రహ్మణ్యం దగ్గరకొచ్చి భుజం తట్టాడు. “నువ్వు బాగా పెద్దోడివౌతావురా” అని అభినందించి మిగతా వాళ్ళను చూసి “వీడి దగ్గర ఉన్నంతలో పదిశాతం తెలివి నేర్చుకోండిరా. మీరూ బాగుపడతారు”.
అతడు ఆమాట చెప్పకముందే ప్రసాదు సుబ్రహ్మణ్యానికి ఏకలవ్య శిష్యుడైపోయాడు. ఎలాగోలా డిగ్రీ పూర్తి చేసి తరువాత హైదరాబాదుకొచ్చాడు. ఒకరోజు నారాయణగూడాలోనున్న ఒక ఇరానీ హోటల్లో పాతమిత్రులందరూ కలిశారు. ప్రసాదును ర్యాగింగ్ చేసిన రావు కూడా ఉన్నాడు. ఇంకో నెలలో విమానమెక్కబోతున్నానని తెలిపాడు.
రెండు టీలు త్రాగిన తరువాత రావు ఆకస్మాత్తుగా వేదాంతధోరణిలో మాట్లాడసాగాడు. “ఎంతైనా మీరు అదృష్టవంతులురా. కొంచెం లేటుగా డిగ్రీ పూర్తి చేసారు. నేనూ నాలుగేళ్ళ తరువాత చేసుండాల్సింది”.
వినేవాళ్ళకు తన మాటలు అర్థం కాలేదని గ్రహించి విశదీకరించసాగాడు. “ఏంలేదురా. నాకు మొదటి ఉద్యోగం రామచంద్రాపురంలోని ఒక కంపెనీలో. అంత దూరంలో పనిచేయడానికి ఎవ్వడూరాడు. సెక్యూరిటీ గార్డులకు కూడా తిండి పెట్టి, ఉండటానికి గదిస్తే నెలకు రెండువేలు తీసుకుంటారు. యూనీఫారమ్, మన్ను, మశానం అన్నీ కలిపి మూడువేలు ఖర్చవుతుంది. అదే ఇంజనీరుని రిక్రూట్ చేసి నైట్ షిఫ్టులో డ్యూటీ వేస్తే పనికి పని జరుగుతుంది. వాళ్లే కాపలాగా ఉంటారు కాబట్టి గార్డు అవసరమూలేదు. అందులోనూ ఇంజనీరుకైతే పదిహేను వందలిస్తే చాలు. సిటీ బస్సులో వచ్చి పనిచేసి వెళతారు. కానీ ఒక విధంగా చూస్తే ఈ బ్రతుకు చాలా నేర్పిందిరా. ముఖ్యంగా బ్రతుకు విలువను నేర్పింది”.
* * *
అలా చాలా జీవిత సత్యాలను తన మిత్రులనుంచి గ్రహించిన మన గుంటూరోడు, అదే ప్రసాదు, తన చదువుకు పెద్దగా సంబంధంలేకపోయినా అమెరికాను వై2కే తెగులునుంచి రక్షించే తెలుగు పటాలంలో భాగం కావడం కోసం ఒక కంపెనీలో చేరాడు. వాళ్ళే జీతమిచ్చి శిక్షణా ఇస్తారు. అలాంటి ఓ అనామక సంస్థలో ఒక సంవత్సరం గడిపి ఇక తను భారతావనిని వీడే సమయమాసన్నమయినదని గ్రహించి వీసా కోసం మదరాసు పట్టణానికి వెళ్ళాడు.
అప్పట్లో మదరాసులోని కాన్సలేట్ జనరల్ ఆఫీసు వీసార్థులను చీమలను ఆకర్షించే బెల్లపు ముక్కలా ఉండేది. మదరాసుకు వెళ్ళేముందు ఇంటికి వెళ్ళి తల్లి భారతీదేవి ఆశీస్సులు తీసుకున్నాడు. వారం రోజులకు సరిపడా స్నానం చేసి, నీళ్ళు లేని నగరానికి సర్కారు ఎక్స్ ప్రెస్సులో బయలుదేరాడు. మద్రాసులో పనిచేస్తున్న క్లాసుమేటు రూముకెళ్ళి కాలకృత్యాలు తీర్చుకుని కాన్సలేటు జనరల్ ఆఫీసు దగ్గరకెళ్ళాడు. అసలు అతను ఇంకా అమెరికాలో ఉద్యోగాలు వెతుకుతూనే ఉన్నాడు. కాకపోతే మిగతా వాళ్ళ అనుభవాలు విని, ఈ వీసా ప్రహసనం గురించి కూలంకషంగా తెలుసుకోవాలని నిర్ణయించుకోవడం వల్ల అక్కడికి వెళ్ళాడు. అతను వెళ్ళేసరికి ఆ కార్యాలయం ముందు స్వతంత్ర భారతావని స్వర్ణయుగంలో ఉన్నప్పుడు రేషన్ కొట్టు ముందు కిరసనాయిలు కోసం నిలబడ్డ స్వతంత్ర పౌరులవలె దాదాపు ఒక రెండొందలమంది నీటుగా గడ్డం గీసుకుని, జులపాలన్నీ కత్తిరంచి, తమ దినసరి చర్యలో ఒక మార్పులాగా ఉతికి ఇస్త్రీ చేసిన బట్టలు ధరించి వరుసలో నిలబడి ఉన్నారు. వాళ్ళని చూస్తే ప్రసాదుకు ముందు జాలేసింది. చూడడానికి పంచదార డబ్బాదగ్గర వరుసలో నిలబడ్డ చీమలలాగా ఉన్నా, కనీసం చీమలకు చక్కెర పలుకులైనా దొరుకుతాయని గ్యారంటీ ఉంది. వీళ్ళకి అదీ లేదు. వాళ్ళపై జాలిపడుతూ ఉండగానే, రేపు తన పరిస్థితీ అదేనని అయ్యగారికి అవగాహన అయ్యింది. అంతలో క్యూలో నిల్చున్న ఒకతను కమల్ హాసన్ స్టైల్లో జేబులోంచి రుమాలు తీసి ముఖంపైనా, మెడ వెనుకనా ఉన్న చెమటను తుడుచుకుని రుమాలును బాగా పిండాడు. అరకప్పు నీళ్ళు కారాయి. ఆ అవస్థ చూడగానే ప్రసాదుకూ ఓ చెంబుడు చెమట పట్టింది. కారేచెమటను త్రాగునీరుగా మార్చగలిగితే ఆ నగరానికున్న నీటి సమస్య తీరిపోతుందని అనిపించింది.
క్యూలో నిలబడ్డ వాళ్ళందరినీ దగ్గరనుంచి చూశాడు. అక్కడున్న సెక్యూరిటీ గార్డులను బాగా పరికించి చూశాడు. తరువాత రోడ్డుకు ఆవలివైపునున్న హోటలుకెళ్ళి అరలీటరు సాంబారుతో రెండిడ్లీలు తిన్నాడు. బయటకెళ్ళి బడ్డీకొట్టులో ఒక సిగరెట్టు కొనుక్కుని కొట్టువాడితో బాతాఖానీ ప్రారంభించాడు. ప్రసాదు వచ్చీరాని అరవంలో మాట్లాడుతుంటే అతనూ తెలిసీ తెలియని తెలుగులో జవాబివ్వసాగాడు. అతనితో మాట్లాడిన తర్వాత ప్రసాదుకు మదరాసుకూ హైదరాబాదుకూ పెద్ద తేడాలేదనిపించింది. వీళ్ళు తెలుగును తమిళంలో మాట్లాడతారు. అక్కడ తెలుగును ఉర్దూలో మాట్లాడతారు. అంతే.
కొట్టుముందున్న బల్లమీద కూర్చుని గ్రాహకులు లేని సమయంలో కొట్టువాడైన నాడారు పాత న్యూస్ పేపరుతో ఈగలు తోలుతున్నప్పుడు కాన్సలేటు జనరల్ ఆఫీసు పనిచేసే విధానం గురించి కూపీ లాగసాగాడు. అతనూ అప్పటికి ఇలాంటి మేధావులను చాలా మందిని చూశాడు కాబట్టి అతని దగ్గర బాగానే సమాచారం అందింది.
ఆఫీసులో అధికారులందరూ అమెరికా వాళ్ళే. కొంతమంది గుమాస్తాలు, ప్యూనులు, గార్డులు మాత్రమే భారతీయులు. అందులోనూ గార్డులయితే అందరూ నేపాలీ గూర్ఖాలే. కానీ, చాలా మంది భారతీయులు పనిచేస్తున్నా, ఆ కార్యాలయంలో వీసాకు సంబంధించిన వ్యవహారం మొత్తం అమెరికన్లే చూసుకుంటారు. మనోళ్ళ మీద మనకే నమ్మకం లేనప్పుడు, వాళ్ళకెలా ఉంటుంది? ప్రసాదు కూడా కొట్టతని అభిప్రాయంతో ఏకీభవించాడు.
వీసా కౌంటరులో ఉండే ఆవిడ పేరు మార్గరెట్ లెబిడిన్స్కీ. రెండో ప్రపంచ యుద్ధం తరువాత పోలండు నుంచి వాళ్ళ తండ్రి అమెరికాకు వెళ్ళి స్థిరపడ్డాడు. ఆమె పెళ్ళి చేసుకోలేదు. బయట అద్దె ఇంట్లో ఉండడానికి భయపడి కార్యాలయంలోనే రెండో అంతస్తులో ఉన్న రెండు రూములను ఆక్రమించుకుంది. ఆమె అక్కడికొచ్చి రెండేళ్ళవుతుంది. నవ్వుతున్న చిన్నపాపలను చూసినా కూడా చిరాకు పడే ప్రవృత్తి. వీసా నిరాకరించిన తరువాత అభ్యర్థులు బాధపడితే సన్నగా నవ్వుకుని సంతోషపడేటంత సహృదయురాలు. అసలు అందుకనే ఆమెకు వీసా కౌంటరు బాధ్యతలు అప్పగించారని మిగతా వాళ్ళందరూ గుసగుసలాడుకుంటారు. ఆమెకు అమెరికా ఫారిన్ సెక్రెటరీ బాగా తెలుసునని పుకారు. నిజమో కాదో తెలియకపోయినా అమెరికన్లతో సహా ఎవ్వరూ ఆమె జోలికి పోరు.
ఆమె అభ్యర్థులతో కావాలనే అమెరికన్ యాక్సెంట్లో వేగంగా మాట్లాడుతుంది. అది అర్థం చేసుకుని జవాబివ్వగలిగితేనే వీసా. అది విన్న ప్రసాదుకు మాంత్రికుని ప్రాణం ఉన్న పిచ్చుక చచ్చిపోయిందని చెప్పినట్లనిపించింది. ఇంకో సిగరెట్టు కొనుక్కుని దమ్ముకొడుతూ ఆలోచించాడు. మాంత్రికుడిని చంపాలంటే చనిపోయిన పిచ్చుకకు ప్రాణం పోసి, మళ్ళీ చంపాలని నిర్ణయించుకున్నాడు.
మధ్యాహ్న భోజనం కూడా పక్కనున్న హోటలులో కానిచ్చి మళ్ళీ బడ్డీ కొట్టుకు చేరాడు. కార్యాలయంలో పనిచేసే భారతీయుల వివరాలు కనుక్కోవాలని నిర్ణయించుకున్నాడు. అంతలో కార్యాలయం నుంచి ఒ వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి పది పాకెట్లు మార్లుబరో కొన్నాడు. అతను మాట్లాడే తమిళం చూస్తే ప్రసాదుకు మరోచరిత్ర సినిమా గుర్తుకొచ్చింది. వెంటనే సమయం వృధా చేయకుండా “అన్నా మీరు తెలుగా?” అడిగేశాడు.
ఇలాంటోళ్ళను రోజూ వందలమందిని చూసే అతడు తిరిగి కూడా చూడకుండా అవునన్నట్లు తలాడించాడు.
“ఏవూరన్నా” మళ్ళీ అడిగాడు ప్రసాదు.
“నెల్లూరు” అతను తిరిగి వెళ్ళసాగాడు.
“అరే. మేం పక్కనే నన్నా. మాది గుంటూరు” అప్పటికే అతడు రోడ్డు సగం దాటేశాడు కాబట్టి ప్రసాదు చెప్పింది వినలేదు. విన్నా గుంటూరు, నెల్లూరుల మధ్య ఇంకో జిల్లా ఉందన్న సంగతి అతనికీ తెలియదు కాబట్టి ప్రసాదును ఏమీ అనడు.
“యారప్పా అదు?” ఇంకో సిగరెట్టు కొనుక్కుంటూ కొట్టువాడిని అడిగాడు ప్రసాదు.
చెప్పాలా, వద్దా అన్నట్లు చూసి “నాగిరెడ్డి, అటెండరుగా కాన్సలేటులో పనిచేస్తుంటాడు” జవాబిచ్చాడు.
వ్రేలాడతీసిన సన్నని చేంతాడుతో సిగరెట్టు అంటించుకుంటూ “ఏం జేస్తుంటాడెమిటి?” అన్నాడు ప్రసాదు. పొగ వదులుతూ ఆఫీసువంక చూసి “నాకేమైనా పనికొస్తాడా?” అన్నాడు.
ఇక పూర్తిగా నిజం చెప్పకపోతే ఈ ఇంటరాగేషన్ ఎప్పటికీ పూర్తవదనిపించింది నాడారుకి. దీర్ఘంగా నిట్టూర్చి “వాడుకోవడం తెలిసినవాడు ఎవరితోనైనా పనిచేయించుకోగలడు. నువ్వు చేయించుకోగలవా అన్నది నీకే తెలియాలి” అన్నాడు.
“ఇంతకీ నాగన్న లోపల ఏం చేస్తుంటాడు?”
కురుక్షేత్రం మధ్యలో లక్షలాది ముందు విరక్తిపరుడై నిరాశతో క్రింద కూర్చునియున్న అర్జునునికి గీతోపదేశం చేస్తున్న కృష్ణుడిలా చిరునవ్వు నవ్వాడు నాడార్. “మార్గరెటుకు రెండువైపులా రెండు ట్రేలు ఉంటాయి. కుడివైపు ఉండేది చిన్న ట్రే. వీసాకు అనుమతి ఇచ్చేట్లయితే అప్లికేషనుపై నోట్ వ్రాసి దాంట్లో వేస్తుంది. వీసా తిరస్కరించబడితే నోట్ వ్రాసి ఎడమవైపున్న పేద్ద ట్రేలో వేస్తుంది. అనుమతించబడ్డవాటిని పై అధికారి వద్దకూ, తిరస్కరించబడ్డవన్నీ ఎమిలీ వద్దకు తీసుకెళతాడు నాగిరెడ్డి. ఎమిలీ ప్రతి అప్లికేషనునూ, పాస్ పోర్టు సమాచారాన్ని కంప్యూటరులోకి ఎక్కిస్తుంది. ఒకసారి రిజెక్టయితే మళ్ళీ ఆరునెలల వరకూ అప్లై చేయడానికి వీల్లేదు”.
నాడార్ చెప్పిన విషయాన్ని ఏకాగ్రతతో విన్న ప్రసాద్ మళ్ళీ తన మనస్సులో మొత్తం సమాచారాన్ని మననం చేసుకున్నాడు. అతనికి ఎందుకో మాంత్రికుడి ప్రాణం ఉన్న చిలుకను బ్రతికించడం సాధ్యమేనని అనిపించింది. గుండెల నిండా పీల్చిన పొగాకు పొగను బయటకు వదలి మదరాసు కాలుష్యానికి తనవంతు సహాయాన్ని చేసి నాడారు వంక చూశాడు. “అవునూ. నీకెలా ఇన్ని విషయాలు తెలుసు?”
కొంచెం ఇబ్బందిగా ముఖం పెట్టాడు నాడార్. “నాగిరెడ్డికి ముందు నేనే ఆ పని చేసేవాడిని. మా మచ్చాన్ వీసా రిజెక్టయితే దాన్ని ట్రే మార్చి అప్రూవల్ ట్రేలో పెట్టాను. కానీ, దానిపైనున్న నోట్ లో రిజెక్టెడ్ అని వ్రాసి ఉండడం వల్ల నేనే ట్రే మార్చానని వాళ్ళకి అర్థం అయింది”
“మా నాయనే. మేమందరం అరవోళ్ళకి ఇంగ్లీషు బాగా తెలుసనుకుంటాం కదరా” ఆశ్చర్యంగా అన్నాడు ప్రసాద్.
“చదువుతాను కానీ. ఆ సమయంలో ఇంకేం చేయాలో తెలియలేదు” నిర్వేదంగా నవ్వాడు నాడార్. సగటు భారతీయునిలా తన కర్మకు శ్రీకృష్ణుడిపై భారంవేసి “నాకిక్కడ సిగరెట్లమ్ముకోవాలని రాసున్నదేమో”
“అంతేరా. మనం బాగుపడం. చేసే వెధవపనులన్నీ చేసి అన్నింటినీ ఆయనపై తోసేస్తాం. అందుకే మనకే దేవుడూ సహాయం చేయాలని అనుకోడు” నాడారుకు అర్థం కాకపోయినా అనేశాడు.
మళ్ళీ బల్లపై కూర్చుని తక్షణ కర్తవ్యం గురించి ఆలోచించసాగాడు. ఆఫీసులో జరిగే తంతును మనస్సులో నాలుగయిదు సార్లు ఊహించుకున్నాడు. చివరికి ఆఖరి సిగరెట్టు కొనుక్కుంటూ “నాగిరెడ్డి మందేస్తాడా?” అడిగేశాడు.
నల్లని నాడారు ముఖంపై మబ్బులలోనుంచి బయటకొస్తున్న చందమామలాగా ఒక చిరునవ్వు ప్రత్యక్షమయ్యింది.
ఆరాత్రి ప్రసాద్ నాగిరెడ్డిని రమ్యా బారుకు తీసుకెళ్ళి పీకలదాగా పట్టించాడు. బోనసుగా నాడారు కూడా రమ్ములో మునిగితేలాడు.
* * *
సరిగ్గా రెండు నెలల తరువాత మళ్ళీ ప్రసాద్ మదరాసు వచ్చాడు. నాగిరెడ్డికి ఇంకోసారి పీకలదాగా పట్టించాడు. మరుసటిరోజు బాగా తయారయి తెల్లవారుఝామున తొమ్మిదింటికే కాన్సలేటు ఆఫీసుకు చేరుకున్నాడు. తనకు మార్గరెట్ దర్శనమయ్యేటప్పటికి పన్నెండౌతుందని అనిపించింది. ముఖానికి పట్టిన చెమటను రుమాలుతో తుడిచి దాన్ని పిండుతూ మూడుగంటల సమయాన్ని మూడు నిముషాలలాగా గడిపేశాడు. చివరికి మార్గరెట్ దర్శనమయింది.
అప్లికేషన్ ఆమెకిస్తూ, “హాయ్ మేగీ” అన్నాడు. అమెరికన్లు చాలా ఫ్రెండ్లీగా ఉంటారని, తమ బాసులను పేరుపెట్టి పిలుస్తారని తెలుసుకోవడం వల్ల తానూ అమెరికన్లమాదిరిగా ఉంటానని ఆమెను నమ్మించడానికి అతను అలా మాట్లాడాడు. మార్గరెట్ తలెత్తి చూసింది. తనను మేగీ అని పిలిచే తన పాత బాయ్ ఫ్రెండ్సు గుర్తుకొచ్చారు. నూరడుగుల గోతిలో పూడ్చిపెట్టిన తన గతాన్ని ప్రసాద్ తవ్వి తీసినట్లనిపించింది. అతనిచ్చిన పేపర్లు తనకు ఎడమవైపున్న పెద్ద ట్రేలో విసిరేసి “నెక్స్ట్” అన్నది. ప్రసాదుకు పైప్రాణం పైనే పోయింది. కనీసం ఒక్క మాట కూడా మాట్లాడకుండా తన వీసా అభ్యర్థనను తిరస్కరించినందుకు మార్గరెటుపై చాలా కోపం వచ్చింది. కానీ అతను నోరు తెరిచేలోపే వెనకాల నిలబడయున్న వ్యక్తి ప్రసాదును ప్రక్కకు తోసి తన అప్లికేషన్ మార్గరెట్ ముందు ఉంచి రెండు చేతులూ జోడించి నమస్కరించి “గుడ్ మార్నింగ్ మేడమ్” అన్నాడు. ఇంకా పక్కనే నిలబడి ఉన్న ప్రసాద్ వైపు అతన్ని చూసి నేర్చుకోమన్నట్లుగా మార్గరెట్ చూసింది. తన వెనుక వచ్చిన వాడిని, మార్గరెటునూ కథలో వ్రాయలేని తిట్లు తిట్టుకుంటూ నాడార్ దుకాణానికి వెళ్ళాడు.
జరుగుతున్న తంతునంతా చూస్తున్న నాగిరెడ్డి చిన్నగా నవ్వుకుంటూ ప్రసాద్ అప్లికెషనును మాత్రం తీసి పక్కగదిలో ఉన్న తన గుడ్డ సంచీలో పెట్టాడు. ఆ సంచీలోంచి అతనికి విస్కీవాసన వస్తున్నట్లనిపించింది.
ప్రసాద్ సిగరెట్టుపై సిగరెట్టు కాలుస్తూ ఉండగా, దాదాపు ఒకటిన్నరప్పుడు నాగిరెడ్డి వచ్చాడు. ప్రసాద్ పాస్ పోర్ట్, అప్లికేషన్ అతని చేతిలో పెట్టాడు. తనను చూసి నాగిరెడ్డి నవ్వుతున్నట్లు అనిపించింది ప్రసాదుకి. అయినా రిజెక్టెడ్ లిస్టులో తనపేరు చేరకుండా చూసినందుకు ఆ క్షణంలో నాగిరెడ్డి నిజంగానే గజేంద్రుడికి మోక్షం ప్రసాదిస్తున్న శ్రీమహావిష్ణువులా కనిపించాడు. ఆరాత్రి నాగిరెడ్డితోబాటుగా ప్రసాదు కూడా పీకలదాగా తాగాడు.
తాగింతర్వాత నాగిరెడ్డి నిజంగానే మహావిష్ణువై పోయాడు. “చూడు తమ్ముడూ. నువ్వు వచ్చే శుక్రవారం మళ్ళీ రా. ఆ దయ్యం గురువారం రాత్రికి మూడు రోజులు తన ఫ్రెండ్సుతో ఉండటానికని బాంబే పోతుంది. శుక్రవారం రాబర్టుగారు కౌంటరులో ఉంటారు. ఆయన మొట్టమొదటి అప్లికేషనును ఎట్టి పరిస్థితిలోను తిరస్కరించరు”. రాముడివంక హనుమంతుడు చూస్తున్నట్లు చూస్తున్న ప్రసాదును జాలిగా చూశాడు నాగిరెడ్డి. “నేను చేయగలిగింది ఇంతే. ఇక నీ అదృష్టం” అన్నాడు.
“అన్నా, నువ్వు దేముడివన్నా” నాగిరెడ్డిని ముద్దుపెట్టుకోవాలన్న కోరికను కష్టపడి అణచుకున్నాడు ప్రసాద్.
* * *
ఇంకేముంది. తరువాత శుక్రవారం తెల్లారుఝామునే ప్రసాదు కాన్సలేట్ గుమ్మం ముందు తిష్ట వేశాడు. రాబర్ట్ పుణ్యమా అని గుంటూరోడికి వీసా దొరికింది. ఆరోజు రాత్రికూడా పీకలదాగా తాగొచ్చని రమ్యాబారులో ఎదురు చూస్తున్న నాగిరడ్డి మాత్రం మూడు గంటలు ప్రసాదు కోసం ఎదురుచూసి, చివరికి తన డబ్బులతో ఒక బీరు తాగి బయటకొచ్చాడు.
ప్రస్తుతం ప్రసాద్, భార్యాపిల్లలతో అమెరికాలో స్థిరపడ్డాడు. భారతి కూడా సంవత్సరానికి పదకొండు నెలలు వాళ్ళతోనే ఉంటుంది. ప్రతి సంవత్సరమూ సంక్రాంతికి అత్తారింటికి వెళుతుంది, అదే తన భర్తను చూడడానికి. ఊరి పొలిమేరదాటని సుబ్బయ్య మాత్రం ఎప్పుడో లోకాన్నే దాటేశాడు.
అన్నట్లు ప్రసాద్ పనిచేసే కంపెనీ ఓనరు శిఖాకొల్లు సుబ్రహ్మణ్యమే. కాలేజీలో సీనియరయిన రావుకు ప్రసాద్ సీనియర్. బళ్ళు ఓడలయినా, ఓడలు బళ్ళయినా అన్ని గుంటూరు బళ్ళూ, ఓడలు ఒక్కచోటే చేరాయి.
అదండీ మన గుంటూరోడి కథ.