తొలి వలపే - శ్యామ్ కుమార్ చాగల్

Toli valape

అదొక పల్లెటూరు. వర్షాలు పుష్కలంగా పడటం తో చెరువులో నీళ్లు నిండుగా వుండి ఏటి కాలువలు నిండు గా పారుతున్నాయి .
వెంకటేశు టీ కొట్టు వ్యాపారం హాయిగా సాగుతోంది. పంటలు సరిగ్గా పండటం తో పంట దిగుబడి అద్భుతం గా వచ్చి రైతులందరి జేబుల్లో డబ్బులు గల గల మంటున్నాయి.

వెంకటేశు టీ కొట్టు పక్కనే వున్న స్కూల్ లో గంట మోగింది . వెంటనే బిల బిల మంటూ అమ్మాయిలూ అబ్బాయిలు బయటకు పరుగెత్తుకొచ్చి కబుర్లు చెప్పుకుంటూ, కోలాహలంగా ఇండ్ల వేపు నడక కొనసాగించారు.

ముందుగా నడుస్తున్న స్వరూప ను చూస్తూ కాస్త వెనుకగా అడుగులు వేస్తున్నాడు రవి. లయ బద్దంగా కదులుతున్న రెండు జడలను చూస్తూ తన్మయత్వంలో నడుస్తున్నాడు.

రెండు సంవత్సరాలుగా స్వరూప ను అలా చూస్తూనే వున్నాడు రవి. ఎన్ని సార్లు చూసినా తనివి తీరటం లేదు రవికి.
స్కూల్ ఆట పాటల్లో, డాన్స్ లో స్వరూప పక్కనే రవి వుండి అదొక గొప్పతనం గా భావిస్తాడు.

ముందుగా నడుస్తున్న స్వరూప తన ఇంటి వేపు మళ్లింది. స్నేహితుల తో నడుస్తున్న రవి కూడా స్వరూప ఇంటి వేపు గా వెళ్తుండటం చూసి రమేష్ పిలిచాడు" రేయ్ రవి అటెందుకు వెళ్ళటం,, ఇటు కదా? "

వెంటనే ఆగి పోయి తేరుకుని రమేష్ వేపు చూసాడు రవి. " నేను వొస్తాను గానీ నువ్వెళ్లు " అని చెప్పి స్వరూప రెండు జడలను చూస్తూ మళ్ళీ స్వరూప వెనక నడవ సాగాడు రవి.

'ఏంటో వీడు ' అనుకుని తనింటి కి వెళ్లి పోయాడు రమేష్.

స్వరూప ను చూస్తుంటే మనసులో కలుగు తున్న తీయటి ఆలోచనల తో , అవి ఎందుకో అర్థం కాక స్వరూప ఇంటి వరకూ నడుస్తూ వెళ్లి పోయాడు రవి.
ఇంటి గుమ్మం మెట్లు ఎక్కుతూ అనుకోకుండా వెనక్కు చూసింది స్వరూప. అక్కడ కనపడిన రవి ని చూసి " ఏంటి రవి,,ఎటు వెళ్తున్నావ్, ఇటు ?" అంది నవ్వుతూ.

స్వరూప నవ్వు, చక్కటి పలు వరుస చూసి రవి గుండె వేగం హెచ్చింది.
" అహ .ఏమీ లేదు ..ఊరికే ....గుడి కి వెళ్ళొద్దామని....వెళుతున్నా " ఖంగారు గా అన్నాడు రవి.

" ఓ ...మరైతే రా ఇంట్లోకి ..నేనూ వస్తా .." అంది స్వరూప.
" పర్లేదు ..ఇక్కడే నిలుచుంటా ..త్వరగా రా మరి " అన్నాడు గొంతు సవరించుకుని . రవి మనసు ఆనందం తో గంతులు వేసింది.

"సరే వుండు పది నిముషాల్లో వచ్చేస్తా " అంటూ లోనికి హుషారుగా పరుగెత్తుకెళ్లింది స్వరూప.

అప్పుడే బయటకు వచ్చిన స్వరూప నాన్నగారు రవి ని చూసి " ఎవరి కొడుకువి నువ్, రామయ్య కొడుకువి కదూ ? " అని ప్రశ్నించి, రవి సమాధానం కై ఎదురు చూడ కుండా కండువా బుజం మీద సర్దుకుని ,అక్కడున్న సైకిల్ తీసుకుని తొక్కుతూ వెళ్లి పోయాడు.

పాఠశాల దుస్తులు తీసి, నీలి రంగు వోణి వేసుకుని వస్తున్న స్వరూప ను చూసి మైమరచి పోయాడు రవి. చెవుల కున్న జూకాలు ఎంత బాగా కదులుతున్నాయి అనుకున్నాడు.
"ఏంటీ చూస్తున్నావ్ ? ! ...పద " అంది స్వరూప.
గుడి వేపు నడుస్తూ ఆ రోజు స్కూల్ లో జరిగిన విషయాలను ఏకరువు పెట్టసాగింది స్వరూప.
అన్నింటికీ వూ కొడుతున్న రవి ని చూసి అంది " నువ్వెందుకీ రోజు ఆల్జీబ్రా అన్నీ తప్పులు చేశావూ ?"

" ఏమో? నాకెందుకో లెక్కలంటేనే భయం,, పైగా టీచెర్ చెప్పేది నాకసలు అర్థం కావటం లేదు " అన్నాడు రవి తల కిందకు వేసుకుని.

" అల్జీబ్రా చాలా ఈజీ ,, మా ఇంటికి రా, నే చెపుతాను ,,భయ పడకు '' అంది రవి అర చేతిని తన చేతి తో నొక్కుతూ భరోసా ఇస్తున్నట్లుగా.

అర్థం కానీ మధురమైన భావన ఉప్పొంగింది రవి మనసులో. స్వరూప కేసి చూశాడు రవి.
రవి కళ్ళలోకి చూసి మనోహరంగా నవ్వింది స్వరూప.

గుడిలోకి వెళ్లి ప్రదక్షిణ చేసి , దేవుడికి మ్రొక్కి, తీర్థం తీసుకునే సమయంలో వీరిని చూసి పూజారి అన్నాడు " బాగా మొక్కుకొండి ... ఈ సారి పెద్ద పరీక్షలు కదా..అన్నీ పాస్ అవ్వాలి "

" సరేనండి " అని ఇద్దరూ గుడి లో నుండీ బయటకు వచ్చారు.

ప్రతీ రోజూ స్వరూప ఇంటికి వెళ్లడం, ప్రతి సెలవు నాడు ఆటలు అయిపోగానే స్వరూపను కలవడం అలవాటు అయిపోయింది రవికి. ప్రతీ సినిమాకు స్వరూప తన స్నేహితులతో బాటు రవిని తీసుకెళ్లేది. ఇంతలో పదవ తరగతి పరీక్షలు మొదలయ్యాయి.

రవి స్నేహితులందరూ స్వరూప విషయం లో రవిని ఆట పట్టించడం మొదలు పెట్టారు.
అవి విని రవి సిగ్గు మొగ్గలయ్యే వాడు. స్వరూప పేరు వినగానే మనసు ఉరుకులు పెట్టేది.

కాలేజి చదువు అయిపోయాక , వుద్యోగం రాగానే , స్వరూపనే పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు రవి. పెళ్లి రాముని గుడి మంటపం లో అయితే ఇంకా బావుంటుంది అనుకున్నాడు. లేదా భద్రాచలం గుడిలో అయితే ఎలా ఉంటుంది అని ఆలోచించాడు.

పరీక్షలు అయిపోయాక సెలవులకు పుణ్య క్షేత్రాల ద్దర్శనానికి స్కూల్ బస్సు వేశారు. స్వరూప కూడా వస్తానని అనటం తో రవి కూడా ఇంట్లో నాన్నను ఒప్పించి బయలు దేరాడు. అనుకున్నట్లుగా ఆ రోజు స్నేహితులందరితో కలిసి వచ్చి బస్సు ఎక్కాడు. కొద్దిసేపట్లో నే బస్సు మొత్తం నిండి పోయింది. అంతా కలయ చూసాడు కానీ స్వరూప కనపడ లేదు. వెనక కూర్చున్న అమ్మాయిల దగ్గరకు వెళ్లి అడిగాడు " ఉమా..స్వరూప రాలేదా ,ఎక్కడా?"

" ఏమో తెలీదు ..వస్తానంది మరి" సమాధానం చెప్పింది ఉమ.

" లక్ష్మి , నీకు తెలుసా " అని అడిగాడు.

లేదన్నట్టుగా తల అడ్డంగా ఊపింది లక్ష్మి.

ఇంతలో బస్సు తలుపులు మూసి వేశారు డ్రిల్ల్ మేష్టారు . ఆ వెంటనే బస్సు కదిలింది.
కిటికీ బయట తల పెట్టి బస్సు వెనక రేగుతున్న దుమ్ములోనుండీ , స్వరూప కనపడుతుందేమో,వస్తుందేమోనని చూడ సాగాడు రవి. బస్సు వూరు దాటి , వేగంగా వెళ్ళిపోయింది.

స్వరూప రాలేదని ఏదో తెలీని దిగులుతో మనసంతా బాధ తో సీటులో పక్కనున్న స్నేహితుడి భుజం పైన వొరిగి నిద్ర లోకి జారుకున్నాడు రవి.

పదిహేను రోజుల ప్రయాణం ముగించి బస్సు విద్యార్థుల తో తిరిగి వూరికి అర్ధ రాత్రి చేరుకుంది.
రాత్రి ఇంటికి వెళ్లి పడుకుని ఉదయం ఎనిమిది గంటలకు లేచాడు. లేవగానే స్వరూప గుర్తుకొచ్చింది . వంటింట్లోకి వెళ్లి " అమ్మా..స్వరూప వచ్చిందా ?" అని అమ్మను అడిగాడు.
" లేదురా .... నువ్వు ముందుగా మొహం కడుక్కొని స్నానం చెయ్" అంటూ పెరట్లోకి వెళ్లి పోయింది రవి అమ్మగారు.
త్వరగా స్నానం చేసి ,ఏమీ తినకుండా వెంటనే స్వరూప ఇంటికి చేరుకున్నాడు రవి. ముందు వసారా లోనే ఉమ తో కలిసి మాట్లాడుతూ కనిపించింది స్వరూప.
రవిని చూడగానే చెంగున పరుగెత్తుకుని వచ్చింది.

స్వరూప దగ్గరకు రాగానే దిగులుతో చూసి " టూర్ కు ఎందుకని రాలేదు?" అని అడిగాడు రవి.

" అది చెబుతా కానీ, ముందు నువ్ లోనికి పద " అంటూ ఉషారుగా ఇంట్లోకి దారి తీసింది స్వప్న.

" రా రా రవి ! ఎప్పుడొచ్చావు ? "అంటూ పిలిచింది స్వరూప అమ్మగారు.

అంతలో స్వరూప లోని కెళ్ళి ఒక ప్లేట్ నిండా లడ్డూలు, మురుకులు, అరిసెలు పట్టుకొచ్చి రవి చేతిలో పెట్టి " ముందు ఇవి తిను " అంది ప్రేమగా చూస్తూ.

" మీ స్వరూప కు పెళ్లి కుదిరిందోయ్ , వచ్చే నెల పెళ్లి అంది " స్వరూప తల్లి నవ్వుతూ.

అదివిని కాళ్ళ కింద భూమి కదిలి పోయి, ఏమి అర్థం కాక స్వరూపను చూస్తూ వుండిపోయాడు రవి.
రవి కళ్ళలో భావాలు కాస్త తెలిసీ తెలియనట్లుగా అర్థం అయ్యాయి స్వరూప కు.

తల వంచుకుని కూర్చున్న రవి ని చూసి స్వరూప మొహం లో సంతోషం ,నవ్వు పలచబడింది." అవును... రవి , నువ్ ఊరిలో లేవుగా ,..ఉంటే నీకే మొదలు చెప్పేదాన్ని " అంది రవి ని జాలిగా చూస్తూ.

ఏమీ మాట్లాడ లేదు రవి . " నేను మళ్ళీ వస్తాను " అంటూ లేచి స్వరూప కళ్ళలోకి చూసి ఇంట్లోనుండి బయటకు వెళ్లిపోయాడు రవి. అతని కళ్ళలోని బాధను గమనించిన స్వరూప కు కళ్ళలో కాస్త నీరు ఉబికింది.

అక్కడే వున్న ఉమ లేచి వచ్చి ,స్వరూప తో కలిసి ఇంటి పెరట్లోకి వెళ్లి " పాపం రవి కి నువ్వంటే బాగా ఇష్టం కదూ ?" అంది.

" అవును,కానీ ఏం చేయను, తనింకా చిన్న వాడు,ఇప్పుడే కదా నాతో కలిసి పది పాస్ అయ్యేది, ఇంకా కాలేజీ కి వెళ్ళాలి, వుద్యోగం రావాలి, ఎలా కుదురుతుంది. పైగా వయసులో ఇంకా చిన్న వాడు.. .. " అంది నిరాశగా మొహం పెట్టి.

" కానీ చాలా మంచి వాడు........పోనీ లేవే , మనకు బోలెడు పెళ్లి పనులు వున్నాయి పద " అని లోపలి కి వెళ్ళింది ఉమ.
" అవును, నువ్వు కూడా ఇంకా చిన్నదానివే ...ఇప్పుడే .నీకర్థం కాదు గానీ , ఇంతకీ గోరింటాకు వచ్చిందా ?" అని అడుగుతూ తాను కూడా లోనికి అడుగులు వేసింది స్వరూప.

పదిహేను రోజుల తర్వాత ఒక సాయంత్రం వేళ చెరువు గట్టు మీద రవి, తన స్నేహితులతో కూర్చుని నీళ్ళలోకి రాళ్లు విసర సాగాడు.
"మరిప్పుడు ఏం చేస్తావు. ..ఇంకో వారం లో పెళ్లి,.వదిలెయ్యి రా. మనకెందుకు చెప్పు ..ఇక స్వరూప ను మర్చిపో " అని సలహా ఇచ్చాడు శంకర్ తల వంచుకుని కూర్చున్న రవి ని చూసి.
అది విని ఏమీ మాట్లాడ లేదు రవి.
అప్పుడన్నాడు రాము " ఒరేయ్ రవి, మన స్కూల్ లో ఉమ వుంది చూశావూ, తానెప్పుడూ ఎప్పుడూ నిన్నే చూడటం గమనించాను...స్వరూప కంటే బెటర్ "

అది విని లేచి నిలబడి " మరిప్పుడు ఉమ మనతో బాటే ఇంటర్ లో జాయిన్ అవుతుందంటావా?" అని ఆలోచిస్తూ అడిగాడు రవి.

" అవును ...నాకు ఈ రోజే తెలిసింది " సమాధానమిచ్చాడురమేష్ .

" అలాగా..అయితే.. రేపే ఉమ ఇంటికెళ్లి కలవాలి " అంటూ హుషారుగా క్రాఫ్ లోకి వేళ్ళు పెట్టి సర్దుకున్నాడు రవి.

స్నేహితులందరూ లేచి వెనకాతల బట్టలకు అంటుకున్న దుమ్ము దులుపుకుని, సరదాగా జోకులు వేసుకుంటూ వెంకటేశు టీ కొట్టు వేపు నడిచారు. ఆకాశం లో పక్షులు గుంపులుగా తిరిగి వెళుతున్నాయి. పడమట దూరంగా ఎర్రటి సూర్యుడు అస్తమించసాగాడు. వీధి దీపాలు వెలగటం మొదలు పెట్టాయి.

మరిన్ని కథలు

Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు
Pratibha
ప్రతిభ
- చెన్నూరి సుదర్శన్
Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు