భాగవత కథలు -9 భరతవర్ష చక్రవర్తి – భరతుడు - కందుల నాగేశ్వరరావు

Bharatavarsha chakravarthi Bharatudu

భాగవత కథలు -9

భరతవర్ష చక్రవర్తి – భరతుడు

-1-

స్వాయంభువ మనువు రెండవ కుమారుడైన ప్రియవ్రతుడు ఒకసారి ‘ఆధ్యాత్మ సత్ర యాగం’ తలపెట్టాడు. తండ్రి ఎంత చెప్పినా రాజ్యపాలనకు అంగీకరించ లేదు.బ్రహ్మదేవుని ఆజ్ఞ శిరసావహించి చివరకు పట్టాభిషేకం చేసుకున్నాడు.విష్ణుసేవాపరాయణుడై రాజ్యపాలన చేసాడు. విశ్వకర్మ కుమార్తె బహిర్మతిని వివాహం చేసుకున్నాడు. ప్రియవ్రతుడు ఒకసారి సూర్యుడికి అవతల ఉండే చీకటిని పోగొట్టాలని తన రథంతో సూర్యుడి చుట్టూ ప్రదక్షిణ చేసాడు. ప్రయవ్రతుని రథచక్రాల వల్ల పడ్డ గాడులు సప్త సముద్రాలుగాను, వాటి మధ్యప్రదేశాలు ఏడు ద్వీపాలుగాను రూపు చెందాయి.అవే జంబూ, ప్లక్ష,శాల్మలీ, కుశ, క్రౌంచ, శాక, పుష్కర ద్వీపాలు. ప్రియవ్రతుడు తన మొదటి ఏడుగురు కుమారులకు ఏడు ద్వీపాలు ఇచ్చి సన్యసించాడు.

ప్రియవ్రతుని తరువాత వారి కుమారుడు అగ్నీధ్రుడుజంబూద్వీపాన్ని ధర్మమార్గంలో పరిపాలించాడు. బ్రహ్మదేవుణ్ణి తన తపస్సుతో ప్రసన్నంచేసుకున్నాడు. అగ్నీధ్రుడు పూర్వచిత్తి అనే అప్సరసను వివాహం చేసుకున్నాడు. నూరువేల సంవత్సరాలు పట్టపురాణితో కలిసి రాజ్యపాలన చేసాడు. వారికి వరుసగా నాభి, కింపురుషుడు, హరివర్షుడు, ఇలావృతుడు, రమ్యకుడు, హిరణ్మయుడు, కురువు, భద్రాశ్వుడు, కేతుమాలుడు అనితొమ్మండుగురు కుమారులు కలిగారు. తరువాత పూర్వచిత్తి తిరిగి బ్రహ్మలోకానికి వెళ్ళి పోయింది. అగ్నీధ్రుడు జంబూద్వీపాన్ని తొమ్మిది వర్షాలుగా విభజించి తన తొమ్మండుగురు కొడుకులకు పంచి ఇచ్చాడు. భార్యావియోగం సహించలేక తానూ బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు.

అగ్నీధ్రుని పెద్ద కుమారుడైననాభి,తన భార్య మేరుదేవితో కలిసిసంతానం కోసం వాసుదేవుణ్ణి పూజించాడు. అతని భక్తికి మెచ్చి శ్రీహరితన అంశతో మేరుదేవి గర్భంనుండి ఋషభుడుగా జన్మించాడు. ఋషభుడు పెరిగి పెద్దవాడై తన గొప్పతనాన్ని లోకమంతా చాటాడు. ఇంద్రుడి కుమార్తె అయిన జయంతిని వివాహమాడాడు. ఆమె ద్వారా భరతుడు మొదలైన వంద మంది పుత్రులు జన్మించారు.ఋషభుడు ఈశ్వరుడే అయినా సామాన్యుడిలా ఉంటూ ధర్మాచారపరాయణుడై రాజ్యపాలన చేసాడు. కొంత కాలం గడిచాక అవధూతలా మౌనవ్రతం పాటిస్తూ, పిచ్చివాడిలా తిరుగుతూ చివరకు అడవిలో దావానలంలో చిక్కుకొని కాలిబూడిదైనాడు.

-2-

భరతుడుఋషభుని జ్యేష్ఠపుత్రుడు. విశ్వరూపుడనే రాజుకుమార్తె‘పంచజని’ నివివాహమాడాడు. సమస్త కర్మలను వేదోక్తంగా ఆచరిస్తూ, దాని ఫలితాన్ని భగవంతుడికి సమర్పిస్తూ యాభైవేల సంవత్సరాలు రాజ్యం చేసాడు.భరతునికి సుమతి, రాష్ట్రభృత్తు, సుదర్శనుడు, ఆచరణుడు, ధూమ్రకేతువు అనే అయిదుగురు కుమారులు జన్మించారు. అంతకు ముందు ‘అజనాభవర్షము’ అని పిలువబడే రాజ్యం అప్పటి నుండి ‘భరతవర్షము’ అనే పేరుతో ప్రసిద్ధి చెందింది.భరతుడు తనకు సంక్రమించిన ధనరాశిని తన తనయులకు పంచియిచ్చి, గండకీనది సమీపాన ఉన్న పులహాశ్రమానికి వెళ్ళిపోయాడు.ఇష్టదైవమైన పరంధాముని పాదపద్మాలను భక్తితో పూజించడం వలన ఆయన హృదయం ఆనందంతో నిండి పోయింది.

ఒకనాడు భరతుడు గండకీనదిలో స్నానం చేస్తుండగా నిండు చూలాలైన ఒక లేడి నీరు త్రాగటానికి ఆ నదికి వచ్చింది. అది నీరు త్రాగుతుండగాఒక సింహం బిగ్గరగా గర్జించింది. ఆ గర్జనకు బయపడిన లేడి అదిరిపడి దాహం తీర్చుకోకుండానే ఒక్క గెంతు గెంతింది.దాని గర్భంలోని పిల్ల జారి నీటిలో పడింది. తల్లి జింక ఓ కొండరాతిపై పడి మరణించింది. తల్లిలేని పిల్లను భరతుడు ఆశ్రమానికి తీసుకొనివచ్చి ఎంతో గారాబంగా పెంచసాగాడు. దాని మీద ముద్దుతో క్రమంగా భరతుడు భగవంతునిపూజాకైంకర్యములు మరచిపోయాడు. నానాటికి దాని పైన మోహం పెంచుతున్నాడు. ఇలా ఉండగా ఒకనాడు ఆ లేడిపిల్ల ఆశ్రమం విడిచి పారిపోయింది.ఆ లేడిపిల్ల కనిపించకపోయేసరికి భరతునికి మనసు చెదిరిపోయింది. మాటిమాటికీ జింకను తలచుకుంటూ వాపోయాడు. దీనితో భరతుడు యోగబ్రష్టుడయ్యాడు.ముక్తి మార్గానికి ఆటంకమని తలచి బార్యాపిల్లలను, సమస్తమూ వదిలి పెట్టి తపస్వి అయ్యాడు. కాని ఒక జింక పిల్లతో బంధాన్ని పెంచుతున్నాడు.మహర్షులకైనా కర్మబంధాన్ని తప్పించుకోవడం సాధ్యం కాదు. ఈ విధంగా భరతుడు బాధపడుతున్న సమయంలో ఆ జింక పిల్ల తిరిగి వచ్చింది. దానిని చూసి సంబరపడ్డాడు. కొంత కాలం గడిచింది. భరతునికి చివరి గడియలు ఆసన్నమయ్యాయి. అంత్యకాలంలో కూడా ఆ జింకనే తలంచుకుంటూ మరణించాడు.

-3-

తరువాత జన్మలో భరతుడు ఒక లేడి పిల్లగా పుట్టాడు. జింక గర్భాన్ని పుట్టినా తను పూర్వజన్మలో భగవంతుని ఆరాధించిన సుకృతం వలన పూర్వ స్మృతి పోలేదు.తను మహారాజుగా దేవేంద్ర భోగాలనుఅనుభవించడం, కుమారులకు రాజ్యాన్ని అప్పగించి ఆశ్రమంలో తపస్విగా ఉండటం, ఒక లేడి పిల్లపై వ్యామోహం పెంచుకొని సాకిన ఫలితంగా యోగబ్రష్టుడు కావడం అంతా తలంచుకున్నాడు. ఆశ్రీహరిని భక్తితో ప్రార్థించాడు. తాను జింకగా పుట్టిన కాలాంజనమనే పర్వత ప్రాంతాన్ని వదలి పులహాశ్రమం చేరాడు. అక్కడినదీతీరంలోనే జింక శరీరం విడిచి స్వచ్ఛంద మరణం పొందాడు.

-4-

లేడి దేహం వదిలిపెట్టాక భరతుడు తరువాత జన్మలో అంగీరసగోత్రుడైనఒక బ్రాహ్మణుడి రెండవ భార్యకు కుమారుడిగా పుట్టాడు. పుట్టింది మొదలు సంసార బంధాలకు దూరంగా ఉన్నాడు. విష్ణుమూర్తి పాదాలను నిరంతరం ధ్యానిస్తూ ఆయన కథలను ఆలకిస్తూ భరతుడు కాలం గడప సాగాడు. శ్రీహరి అనుగ్రహం వలన పూర్వజన్మ స్మృతి కలిగింది. అందువలనఇతరులతోటి సాంగత్యం జన్మ పరంపరలకు కారణమవుతుందని భయపడి, బంధవిముక్తి కోసం పిచ్చివాడిగా, మూగవాడిగా, చెవిటివాడిగా ప్రజలకు కనిపిస్తూ జీవితం గడుపుతున్నాడు.

భరతుడికి ఇష్టం లేకపోయినా తండ్రి కోరికపై ఆయన దగ్గర వేదాధ్యయనం, కర్మకాండలు అన్నీ నేర్చుకున్నాడు. గాయత్రీ మంత్రోపదేశాన్ని పొందాడు. కొన్నాళ్ళకు తండ్రి చనిపోయాడు. తల్లి భర్తతో సహగమనం చేసింది. సవతి తల్లి కొడుకులకుభరతుడు అంటే ఇష్టం లేదు. అందుచేత అతని వేదాధ్యయనాన్ని ఆపించి ఇంటిపనులు చేయమని శాసించారు.అన్నలు ఏది పెడితే అది తినేవాడు. భరతుడు తన దేహంపై ఏమాత్రం శ్రద్ధలేకుండామాసిన బట్టలతో ఉండేవాడు. కటిక నేలపై పడుకొనేవాడు. వానిని పనికిమాలిన మొద్దు అనుకొనేవారు.

భరతుడు కాపలా కాస్తున్న పొలానికి దగ్గరలో ఓ నగరం ఉంది. ఆ నగరానికి నాయకుడైన భిల్లరాజుకు పిల్లలు లేరు. పిల్లలకోసం కాళికాదేవికి బలి ఇవ్వడానికిఒక మనుష్యుడిని వెంటపెట్టుకుని పోతున్నాడు. అయితే మార్గమధ్యంలో వాడు తప్పించుకొని పారిపోయాడు. బటులు ఎంత గాలించినావాడు దొరక లేదు. ఆ సేవకులు భరతుడిని పట్టుకొని,బలికి మనిషి దొరికినందులకు సంతోషించారు.తల స్నానం చేయించి, కొత్త బట్టలు కట్టించి కాళికాలయానికి తీసుకువెళ్ళారు. బయంకరమైన కత్తి పట్టుకొని కాళికాదేవి పూజలో బలి ఇవ్వడానిక సిద్ధమయ్యారు. భరతుడు ఏమాత్రంబెదరలేదు. అతని బ్రహ్మతేజస్సును చూసిన కాళికాదేవి చెలరేగి పోయింది. బ్రాహ్మణహింసకు పూనుకున్న బోయవాడిశిరస్సు పట్టుకొని అతని పరిచారకులను చెల్లాచెదురు చేసింది.భరతుడు కాళికాలయం నుండి తిరిగివచ్చి మరలపొలం కాపలా కాయడం మొదలెట్టాడు.

-5-

ఇలా కొన్ని సంవత్సరాలు గడచి పోయాయి. ఒకసారి సింధుదేశాన్ని పరిపాలించే ‘రహుగుణుడు’ అనే రాజుకు ‘ఆధ్యాత్మ విధ్య’ తెలుసుకోవాలని బుద్ధిపుట్టింది.అతడు ఇక్షుమతీ నదీ తీరాన ఉన్న కపిలమహర్షిని దర్శించడానికి పల్లకీలో బయలుదేరాడు.పల్లకీ మోసే బోయీలు పొలానికి కాపలా కాస్తున్న భరతుడిని చూసి అమాయకుడిలా ఉండటంతో తమతో తీసుకువెళ్ళారు. పల్లకీ బొంగును అతని భుజం మీద పెట్టారు. భరతుడు ఎదురు చెప్పకుండా పల్లకి మోస్తున్నాడు.అలవాటులేని భరతునికితక్కిన బోయీలకు నడక కుదరక పల్లకి ఎగుడు దిగుడుగా ఊగుతోంది.కొత్తగా వచ్చిన భరతుని వలననే ఇలా జరిగిందని రాజుగారికి మిగతా బోయీలు విన్నవించారు.

ఆ మాటలు విన్న సింధురాజు రహూగణుడు కోపంతో బ్రాహ్మణ జన్మలోనున్న భరతుని గద్దించాడు. ఎత్తిపొడువు మాటలతో నిందించాడు. అయినా సరే భరతుడు ఏమీ మాట్లాడకుండా పల్లకిని అలా మోస్తూనే ఉన్నాడు. భరతునికి ఇదే ఆఖరి జన్మ అని తెలుసు. అందువలన అహంకార మమకారాలను మనస్సు లోనికి రానీయ లేదు. పల్లకి ముందటిలాగానే ఎగుడు దిగుడుగా పోతుంటే రాజు పిచ్చి కోపంతో ఇలా అరిచాడు. “ఓరీ! నేను చెప్పింది వినుపించుకోకుండా నీవు అడ్డదిడ్డంగా నడుస్తూ పల్లకి మోస్తున్నావు. నీ కుంటి నడకలు వదిలించి నిన్ను సరియైన మార్గంలో పెడతాను.”

అందుకు భరతుడు ఇలా సమాధానం ఇచ్చాడు. “ఓ రాజా! బరువు శరీరానికి మాత్రమే కాని నాకు కాదు. యజమాని సేవకుడు అనే సంబంధం కర్మ వల్ల కలిగింది. కనుక అది శరీరానికే గాని జీవునికి కాదు. నేను రాజుని అనే అభిమానంతో నీవు నన్ను ఆజ్ఞాపించావు. నీవు అధికారం అనే మత్తులో మునిగి ఉన్నావు. పిచ్చివాడూ, తెలివిలేనివాడూ ఎంతో నేను అంతే. ఎవ్వరూ పూర్వజన్మ కర్మ ఫలాన్ని తప్పించుకో లేరు. నాకు శిక్ష విధించడంలో నీకు కలిగే లాభం ఏమీ లేదు. నేను నా పూర్వజన్మల కర్మలను పోగొట్టు కోవడానికే ఇలా పల్లకి మోస్తున్నాను అని చెప్పి భరతుడు దండె వదలిపెట్టకుండా ఎప్పటిలాగ పల్లకిని మోయ సాగాడు.

శాస్త్ర సమ్మ తాలయిన బ్రాహ్మణుని వాక్యాలను రాజు విన్నాడు. తత్వజ్ఞానాన్ని తెలుసుకోవాలని వెళుతున్న రాజుకి జ్ఞానోదయం అయ్యింది. ఆయనలోనిఅహంకారం తొలగింది.వెంటనే పల్లికి దిగి బ్రహ్మతేజస్సుతో వెలిగిపోతున్న ఆ బ్రాహ్మణునికి సాష్టాంగ దండ ప్రమాణం చేసాడు. వినయంతో చేతులు జోడించి ఇలా అన్నాడు. “నీవు మామూలు బ్రాహ్మణుడివి కాదు. నన్ను ధన్యుణ్ణి చేయడానికి వచ్చిన ఏ అవధూతవో! నీ మహిమ తెలుసుకోలేక నేను అపచారం చేసాను. నన్ను దయతో క్షమించు.నీవు పైకి మూర్ఖుడిలా కనపడుతున్నావు. నీ మాటల వల్లనువ్వు విజ్ఞాన రహస్యాలు, యోగశాస్త్రాలు తెలిసిన గొప్ప యోగివి అని తెలుస్తోంది. నేను కపిలమహర్షి దగ్గర బ్రహ్మవిద్యోపదేశం పొందాలని వెళ్తున్నాను”, అని అన్నాడు.

అప్పుడు బ్రాహ్మణ కుమారుడైన భరతుడు ఇలా చెప్పాడు. “రాజా! లోక వ్యవహారాలలో నిత్యత్వం ఉపాధి వల్ల వస్తుంది. అయితే అది సత్యం కాదు. అగ్ని జ్వాలతో కుండ కాలుతుంది. కాలిన కుండ కారణంగా అందులో పోసిన నీరు వేడెక్కుతుంది. ఆ నీటిలో వేసిన బియ్యం గింజలు ఉడికి అన్నం తయారవుతుంది. అలాగే దేహాన్ని, ఇంద్రియాలనూ ఆశ్రయించుకొని జీవుడు ఉన్నాడు. దేహంలోనే ప్రాణం, ఇంద్రియాలు ఉన్నాయి. అందువల్ల దేహేంద్రియాలకు సంబంధించినవి అన్నీ జీవునకూ సంక్రమిస్తాయి. ప్రజల రక్షణ, శిక్షణల కోసం రాజు ఉన్నాడు. చెడు కర్మలు వదలిపెట్టి విష్ణు పాదాలను సేవిస్తే సంసార బంధాల నుండి విముక్తు డవుతాడు.”

ఆధ్యాత్మ తత్వాన్ని సమగ్రంగా వివరించమని కోరిన రాజుకు భరతుడు “రాజా! పూర్వ జన్మలలో చేసిన కర్మలను బట్టే ఈ జన్మలో ఫలితాలు కలుగుతుంటాయి. ఆ ఫలితాలను మానవుడు ఈ జన్మలో తన శక్తి యుక్తుల వల్ల కలిగాయని భావిస్తూ ఉంటాడు. మనస్సు సంసారబంధంలో చిక్కుకొని ఉన్నంతవరకు తత్వయోగం నిత్యమైనదని తెలుసుకోలేవు. నేను పూర్వజన్మలో భరతుడు అనే పేరుగల చక్రవర్తిని. ఇప్పుడు సర్వసంగపరిత్యాగిని. పూర్వజన్మలో విధివశాత్తూ ఒక జింకతో స్నేహం వలన జింకగా జన్మించాను. విష్ణుభక్తి వల్ల మరల మానవ జన్మ పొందాను” అని చెప్పాడు. సింధు భూపతికి తత్వజ్ఞానాన్ని భోధించాడు. సంసారం అనే అడవి నుండి బయటపడే మార్గాలను సూచించాడు.రహూగణుడు సత్పురుషుడైన భరతుని సాంగత్యం వల్ల తత్త్వజ్ఞానం పొందాడు. దేహంపై వ్యామోహం విడనాడాడు. రాజు మ్రొక్కులు అందుకొని భరతుడు అక్కడి నుండి భూ సంచారానికి వెడలిపోయాడు.

యజ్ఞమయుడూ, ధర్మస్వరూపుడూ, సాంఖ్యయోగీశ్వరుడూ, పుణ్యపురుషుడూ అయిన భరతుని చరిత్రను వినిపించిన వారినీ, విన్నవారినీ శ్రీమన్నారాయణుడు తప్పక రక్షిస్తాడు. వారికి అన్ని శుభాలు కలుగుతాయి.

*శుభం*

మరిన్ని కథలు

Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు
Pratibha
ప్రతిభ
- చెన్నూరి సుదర్శన్
Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు