ఫర్ ఆల్ ఇష్యూస్... - పి. వి. రామ శర్మ

For All Issues

“ఏమండోయ్! మీ లండన్ దొరబాబు దిగబడేది రేపేకదా! రేపట్నుండీ ఆయనగారు వెళ్ళేదాకా రోజుకో అయిదువేల లీటర్ల నీళ్ళటాంకరు బుక్ చేయండి!” అంది ప్రఫుల్ల.

“ఇదిగో నువ్వలా పుల్లవిరుపుమాటలు మాట్లాడకు ప్రఫుల్లా. వాడప్పుడెప్పుడో లండన్ వెళ్లకముందు నీళ్ళు దుబారాగా వాడితేవాడుండొచ్చు. ఈ రెండేళ్లలో వాడిఅలవాట్లెలా మారేయో నీకూనాకూ ఏంతెలుసు? వాడో మూడువారాలుంటాడు. వాడితో పూర్వంలా పోట్లాడక కాస్త మామూలుగా ఉండు!” అన్నాడు వకుళమూర్తి.

ఆ దిగబడబోయే లండన్ దొరబాబు వరదరాజు అనే పేరుగల వకుళమూర్తి తమ్ముడు. లండన్లో ఉద్యోగం సంపాదించుకుని రెండేళ్లక్రితంవెళ్ళాడు. ఇంకా పెళ్లికాలేదు. రెండేళ్ల తర్వాత ఇప్పుడు పెళ్లిచూపులకని వస్తున్నాడు.. తనచదువూ, ఆ తర్వాత ఓసంవత్సరం సాఫ్ట్ వేర్ ఉద్యోగం హైదరాబాద్లో అన్నయ్య ఇంట్లోనేఉంటూ కానిచ్చాడు. తర్వాత తను పనిచేసిన కంపెనీ తరఫున లండన్లో ఉద్యోగం చేయడానికి వెళ్ళాడు. వరదరాజు పేరుకుతగ్గట్టు నీళ్ళు వరదొచ్చినట్టే వాడేఅలవాటున్నవాడు. వకుళమూర్తి ఉంటున్న ఏరియాలో నీళ్ళకొరతవల్ల వాళ్ళ అపార్ట్మెంట్ వాళ్ళు ఎప్పుడూ ఓ నీళ్ళటాంకర్ రెండ్రోజులకోసారి తెప్పించుకుంటుంటారు. వరదరాజుతో వాళ్ళవదిన ప్రఫుల్లకి వేరే ఏవిధమైన ఇబ్బందీలేదు గానీ, నీళ్ళవాడకం దగ్గరే ఇద్దరికీ రోజూ తగువే. “ఎవరైనా నీళ్ళకోసం బయట కొళాయిదగ్గర కొట్లాడుకుంటారుగానీ, మీ ఇద్దరేంటర్రా!? ఇంట్లోనే రోజూ పోట్లాడుకుంటారు” అని తలపట్టుకునేవాడు వకుళమూర్తి,

“సర్లెండి! రానివ్వండిచూద్దాం!”అంది ప్రఫుల్ల నవ్వుతూ. హమ్మయ్య! మాఆవిడ ప్రఫుల్లంగాఉంది అనుకున్నాడు వకుళమూర్తి.

వరదరాజు రానేవచ్చాడు. వస్తూనే, “వదినా నీళ్ళఇబ్బంది ఇంకా అలానేఉందా? ఏమన్నాతగ్గిందా? నేనర్జంటుగా తలస్నానం చేయాలి. నీళ్ళకి షార్టేజీఉంటే టాంకరుకి ఆర్డరియ్యి అన్నయ్యా!” అన్నాడు ఓవైపు వదిన్ని అడుగుతూ, ఇంకోవైపు అన్నయ్యకి ఓ ఆర్డర్ పాస్ చేస్తూ. ఇప్పుడు పోట్లాడనా మాననా అన్నట్టు భర్తవంక చూసింది ప్రఫుల్ల.

“ఫర్లేదురా! ఇప్పుడు నీళ్ళకిబ్బందిలేదు. మున్సిపల్ వాటర్ సంప్ కూడా పెట్టించేశాం.” అన్నాడు వకుళమూర్తి

అదిమొదలు తిరిగి వెళ్లడానికి రెండ్రోజుల ముందుదాకా నీళ్లని మునపటికన్నా ఎక్కువగా తెగ వాడేశాడు వరదరాజు. చివరిరెండ్రోజులూ మాత్రం విచిత్రంగా అతని నీళ్ళవాడకం బాగాతగ్గిపోయింది. అన్నిటికీ వెంట తెచ్చుకున్న టిష్యూ పేపర్లనే తెగవాడేవాడు.

“ఏంటోయ్! నీ నీళ్ళవాడకం ఇంతలా తగ్గిపోయింది. ఏమైందీ? ఇన్నాళ్లూ లేంది, ఇంకో రెండ్రోజులు వాడితే వరదొచ్చి ఇల్లు ములిగిపోదుగానీ, వాడుకో ” అనంది ప్రఫుల్ల.

“చాలా థాంక్సొదినా! నేనున్నాళ్లూ నీళ్ళకిబ్బందిలేకుండా చేసినందుకు. ఆ దేశంలొ నీళ్ళకిబ్బందిలేదుగానీ, చాలాజాగ్రత్తగా వాడాలొదినా. బాత్రూంలో ఇక్కడలా ఇష్టంవచ్చినట్టు స్నానాలు కుదరవ్. చుక్కనీరు బయటపడకుండా ఓ ఇరుకైన గ్లాస్ ఛాంబర్లొ దూరి పోసుకోవాలి. ఇక ఇల్లంతా కార్పెట్టే. పొరపాటున నీళ్ళు వలికాయా, చచ్చామే! ఇక టాయ్లెట్లలో కూడా మనలా కమోడ్ పక్కన టాప్ ఉండదు. దాని బదులు ఓ టిష్యూపేపర్ రోల్ ఉంటుంది. మనం ఇక్కడ చంటిపిల్లలకి తుడిచినట్టు, అక్కడ మన పనయ్యాక తుడుచుకోవడమే. బయటికెళ్ళినప్పుడు ఏం ముట్టుకున్నా, రెస్టారెంట్ లో ఏం తిన్నా, టిష్యూ తో చేతులు తుడుచుకోవడమే. చివరికి ముక్కు కారినా, ఓ టిష్యూ తో తుడిచేసుకోవడమే. జేబురుమాలు కి బదులు టిష్యూనే వాడతారు. అంతెందుకు!? “ఫర్ ఆల్ ఇష్యూస్ ఓన్లీ టిష్యూ!” అనుకో. ఏదేమైనా కొన్ని విషయాల్లో మనదేశంలో మనకున్న స్వేచ్ఛ విదేశాల్లో ఉండదొదినా! మళ్ళీ నేనక్కడికెళ్ళాక ఈ నీటిస్వేచ్ఛ ఉండదుగా. అందుకే ఇక్కడ హాయిగా జలకాలాడి, మళ్ళీ మా టిష్యూలనలవాటు చేసుకుంటున్నాను.” అన్నాడు వరదరాజు నవ్వుతూ.

====శుభం====

మరిన్ని కథలు

Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు
Pratibha
ప్రతిభ
- చెన్నూరి సుదర్శన్
Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు