శిల్లం గేరి గ్రామంలో శివయ్య అనే స్వామిజీ ఉండేవాడు. ఆ ఊరి శివాలయం అరుగు మీదే నివసించేవాడు. శివయ్య ఇల్లిల్లూ తిరుగుతూ బిక్షాటన చేసేవాడు. ఎవరు ఏమిచ్చినా మౌనంగా స్వీకరించి ఆకలి తీర్చుకునేవాడు.
చిన్న తనంలోనే ఇంటి నుంచి వెళ్లిపోయిన శివయ్య స్వామి ఎందరో రుషుల వద్ద శిష్యరికం చేసి ఆత్మజ్ఞానం పొందాడు. తన తపఃశక్తితో అతని ముఖం దివ్య తేజస్సుతో వెలిగిపోయేది. చాలా కాలంగా శివయ్య స్వామి శివాలయంలోనే ఉండేవాడు. ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు. అందరూ అతనికి మాటలు రావని భావించేవారు.
ఓ రోజు శివాలయం వద్ద ఓ భక్తుడు తీవ్ర జ్వరంతో బాధ పడుతుంటే శివయ్య స్వామి చూశాడు. ఏవో ఆకులు తెచ్చి నీళ్లల్లో కాచి కషాయం ఇచ్చాడు. వెంటనే తగ్గింది. ఈ విషయాన్ని పూజారి ఊరివాళ్ళందరికి తెలిపాడు. చిన్న జ్వరం , వాంతులు, విరేచనాలు, శరీరంపై కాలిన గాయాలకు, పుండ్లు వంటి వాటికి వైద్యం చేసి పంపేవాడు శివయ్య స్వామి.
ఎంతో మందికి శివయ్య స్వామి వైద్యం పనిచేసి ఆరోగ్య వంతులయ్యేవారు. ఆ వైద్య సేవలకు ప్రజలు ధన, వస్తు కానుకలు ఇచ్చేవారు.
శివయ్య స్వామి అవేమి స్వీకరించేవాడు కాదు. చిరునవ్వు నవ్వి పంపేసేవాడు.
స్వామీజీ వైద్యం పక్క గ్రామాలకు కూడా పాకింది. ప్రజలు చిన్న, పెద్ద రోగాలకు కూడా వైద్యం చేసుకుని వెళ్లేవారు. కొద్దిరోజులకు శివయ్య వైద్యం దశ దిశలా పాకింది. తన వద్దకు ఎంత మంది వచ్చినా ఓపికగా వైద్యం చేసి పంపేవాడు.
కాలం గడిచే కొద్ది అయన వద్ద శిష్య బృందం చేరింది. రోగులు ఇచ్చే తృణమో ఫణమో శిష్యులకు ఇచ్చేవాడు. నెమ్మదిగా ఓ కుటీరం ఏర్పాటు చేసుకున్నాడు. ఆదాయం బాగా రావడంతో ఓ ట్రస్ట్ ను రూపొందించారు. క్రమంగా ఆయనను ఆశ్రయించే వారి సంఖ్య పెరిగింది. అయన వారి యోగ క్షేమాలను సంజ్ఞల ద్వారా తెలుసుకుని ప్రేమ, ఆప్యాయతలు చూపేవాడు.
కొంత కాలానికి శివయ్య స్వామికి జబ్బు చేసింది. క్రమంగా అది పెద్దదై అతనిని బాగా కృంగ దీసింది. ఆరోగ్యం క్షీణించడంతో మంచం పట్టాడు. రోజురోజుకూ ఆరోగ్యము క్షీణించడంతో మంచం పట్టాడు. శిష్యులు ఆయనవద్దకు చేరుకుని సపర్యలు చేయసాగారు. రోజురోజుకు శివయ్య స్వామి పైకి లేవలేక పోయాడు.
" స్వామీ అందరికి వైద్యం చేసేవారు .. మీ అనారోగ్యానికి వైద్యం చేసుకోలేరా..?" అని ప్రశ్నించారు శిష్యులు .
శివయ్య స్వామి ఏమీ సమాధానం చెప్పకపోవడంతో శిష్యులు ఆందోళన చెందారు. శిష్యులే చందాలు వేసుకుని సమీపంలోని ఆసుప్రతిలో చేర్చారు. వైద్య పరీక్షల అనంతరం స్వామికి క్యాన్సర్ వచ్చిందని నిర్ధారించారు. అది వినడంతో అందరూ శివయ్య స్వామి వద్దకు చేరుకున్నారు. వారిని చూసిన స్వామి తన వద్దకు రమ్మని సైగ చేశాడు. అందరూ ఏమి చెబుతారో అని ఆసక్తిగా ఎదురుచూడసాగారు. అందరి ముఖాల్లో దుఃఖం ఉప్పోగింది. స్వామి ముఖంలో మాత్రం చిరునవ్వే కనిపిస్తోంది. " నాయనా .." అన్నాడు గట్టిగా. అక్కడున్నవారందరూ ఆయనకు మాటలు రావడం చూసి అవాక్కయ్యారు. " నశ్వరమైన ఈ దేహం గురించి చిం తించాల్సిన అవసరం లేదు.. ఈ జబ్బు నా పూర్వ జన్మ కర్మల ఫలితంగా వచ్చింది. అది ఇప్పుడు అనుభవించకతప్పదు.. మనం నిమిత్తమాత్రులం .. అఖండమైన సృష్టి ఏదో ఓ శక్తి అధీనంలో వుంది. మానవ శక్తికి కొన్ని లొంగుతాయి. మరికొన్ని దైవ శక్తికి మాత్రమే లొంగుతాయి. మనం ఎన్ని ఆస్తి పాస్తులు, కీర్తి ప్రతిష్టలు సంపాదించినా అవి మన వెంట రావు. నా రోగ బాధ దేహానికి మాత్రమే.. కాని మనసుకు కాదు.. అజ్ఞాన సాగరంలో చిక్కుకున్న మనం బయట పడడానికి భగవన్నా మ స్మరణ మాత్రమే అనుసరించాలి.. .. అదే అసలైన వైద్యం .." అన్నాడు.
ఆ మాటలతో శిష్యులు కళ్లు తెరిచారు. ఇన్నాళ్లు స్వామిజి చనిపోతే అయన ఆస్తిపాస్తులు తమ వశమవుతాయని హాయిగా బతకవచ్చని అజ్ఞానంతో ఆలోచించిన వారి స్వార్ధ బుద్ది తొలగిపోయి ముఖాలు జ్ఞాన వంతంగా ప్రకాశించాయి.