కథా నాయకుడు - సరికొండ శ్రీనివాసరాజు

Kathanayakudu

ఆధునిక కాలంలో కూడా ఆ ప్రాంతంలో నాటక కళ రాజ్యమేలుతుంది. చుట్టుపక్కల చాలా గ్రామాల ప్రజలు పగలంతా పడిన శ్రమను మరచిపోవడానికి రాత్రి వేళల్లో నాటకాలను చూస్తున్నారు. పాఠశాలలకు వెళ్ళే పిల్లలకు కూడా నాటకాలు అంటే పిచ్చి. వాళ్ళకు అభిమాన కళాకారులు ఉంటున్నారు. "నాకు వీరేంద్ర అంటే వీరాభిమానం. అన్నీ హీరో పాత్రలే వేస్తూ చాలా గొప్పగా నటిస్తాడు. అతనికి సాటి మరెవరూ లేరు." అన్నాడు హరి. "నాకు లీలావతి అంటే చాలా ఇష్టం. కథానాయికగా ఆమె నటన ఇంకెవ్వరికీ రాదు. ఎంత అందంగా ఉంటుందో." అన్నది శ్రుతి. " నాకైతే రంగారావు అంటే చాలా చాలా ఇష్టం. అతని నటనకు మరెవ్వరూ సాటిరారు." అన్నాడు శివ. "రంగారావా? ఛీ! పచ్చి విలన్ పాత్రలు వేస్తాడు. చేసేవి అన్నీ దుర్మార్గపు పనులే. ఇదేం అభిమానం?"అన్నాడు హరి. "వీడి ఆలోచనలు కూడా చెడ్డ ఆలోచనలే కావచ్చు. అందుకే రంగారావు అంటే అంత పిచ్చి." అంటూ వెర్రి నవ్వులు నవ్వింది శ్రుతి. "అన్ని రకాల పాత్రలను అవలీలగా పోషించేవాడు నిజమైన నటుడు. రంగారావు గారు అటు విలన్ పాత్రలే కాక, హాస్య పాత్రలూ వేసి నవ్విస్తాడు. తండ్రి, తాత పాత్రలను వేసి, ఇలాంటి తండ్రి, తాత మన ఇంట్లో ఉంటే ఎంత బాగుంటుంది అన్నంత సహజంగా నటిస్తాడు తెలుసా! నవరసాలలోనూ అవలీలగా నటిస్తాడు. ఎక్కడ విలన్ పాత్రలు వేసినంత మాత్రాన అతణ్ణి నిజంగానే చెడ్డవాడు అంటే ఎలా? మీకు అసహ్యం పుట్టించేలా నటించాడు అంటే ఆ పాత్రలో జీవించినందువల్లనే కదా! అందులోనూ అతడు సేవా కార్యక్రమాలను చేస్తాడని విన్నాను" అన్నాడు శివ. పగలబడి నవ్వారు హరి, శ్రుతులు. అంతే కాదు. శివ అభిమానం గురించి ప్రతి ఒక్కరికీ ప్రచారం చేశారు. చాలామంది శివను హేళన చేసి మాట్లాడినారు. వెంటపడి మరీ పగలబడి నవ్వారు. ఇవేవీ పట్టించుకోలేదు శివ. ఒకరోజు ఆ ఊరిలో నాటక ప్రదర్శన అవుతుంది. హరి, రంగ, సోము ముగ్గురూ కలిసి నాటక ప్రదర్శన తర్వాత తమ అభిమాన నటుడు అయిన వీరేంద్రను కలవబోయారు. వీరేంద్ర వీరిని కలవనియ్యకుండా దూరంగా పంపించమని ఒక వ్యక్తికి చెప్పాడు. "మీరంటే మాకు పిచ్చి అభిమానం సర్! మీతో ఒక సెల్ఫీ దిగాలని ఉంది." అన్నాడు హరి. "మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళిపోతారా? లేదా?" అని గుడ్లురిమి చూశాడు వీరేంద్ర. దెబ్బకి బెదిరి అక్కడ నుంచి వెళ్ళిపోయారు మన మిత్ర బృందం. శ్రుతి తన స్నేహితురాళ్ళతో కలిసి తన అభిమాన నటిని చూడటానికి వెళ్ళారు. "మా తరగతిలో గీత అనే అమ్మాయి కుటుంబం చాలా పేద కుటుంబం. గీత చాలా తెలివైన అమ్మాయి. పూట గడవక తల్లిదండ్రులు ఆమెను చదువు మానిపించి, పనిలో పెట్టారు. ఎలాగైనా ఆ కుటుంబాన్ని ఆదుకోండి ప్లీజ్!" అని వేడుకున్నారు. లీలావతి ఏమీ మాట్లాడకుండా వాళ్ళను చాలా నిర్లక్ష్యంగా చూసింది. అక్కడ నుంచి దూరంగా వెళ్ళిపోయింది. నిరాశగా వెళ్ళిపోతున్న వాళ్ళకు పిలుపు వచ్చింది. రంగారావు గారు వాళ్ళను పిలిపించి, "మీ స్నేహితురాలు గీత ఇంటికి వెళ్దాం పద." అన్నాడు. రంగారావు గారు గీత తల్లిదండ్రులతో మీ అమ్మాయి చాలా తెలివైన అమ్మాయి కదా! బాగా చదివి మంచి ఉద్యోగం సాధిస్తే మీ కష్టాలు గట్టెక్కుతాయి కదా! మీ అమ్మాయి చదువుకు అయ్యే ఖర్చులు మొత్తం మీ అమ్మాయి ఉద్యోగం సాధించేదాకా నేనే భరిస్తాను. మీకు కావలసిన ఆర్థిక సహాయం కూడా చేస్తాను. దయచేసి మీ అమ్మాయికి అన్యాయం చేయకండి. ఇలాంటి నిరుపేదలు ఎక్కడ ఉన్నా చెప్పండి. వాళ్ళ పిల్లల చదువుకు కావలసిన సహాయం చేస్తాను." అన్నాడు. పిల్లలకు నిజమైన కథా నాయకుడు ఎవరో అర్థం అయింది. శివను క్షమించమని వేడుకున్నారు ‌ రంగారావు గారు ఇచ్చిన మాటను తన ఆఖరి శ్వాస వరకు నిలబెట్టుకున్నాడు.

మరిన్ని కథలు

Parina pachika
పారిన పాచిక!
- - బోగా పురుషోత్తం
Tatayya salahalu
తాతయ్య సలహాలు
- గాయత్రి కులకర్ణి
Seshajeevitam
శేష జీవితం
- మద్దూరి నరసింహమూర్తి
Veda samskruthi
వేదసంస్కృతి
- టి. వి. యెల్. గాయత్రి.
Nijamaina bhakthi
నిజమైన భక్తి
- బోగా పురుషోత్తం, తుంబూరు.
Ontaritanam 2.0
ఒంటరితనం 2.0
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు