ప్రకృతి-పురుషుడు-ప్రపంచం - VIJAYA VANI. JANNABHATLA

Prakruthi Purushudu Prapancham

తెల్లవారుజామున 4 గంటల అయినట్లుంది . తూర్పున కుహూ-కుహూ మని కిలకిల రావమ్ చేసింది ఒక పక్షి. వెంటనే నిద్ర లేచావా నేను కూడా లేచాను అని సమాధానం గా పడమర నుంచి కుహూ-కుహూ మంది ఇంకొక పక్షి. మీరు ఇద్దరూ మాత్రమేనా మేము కూడా లేచాము అని ఉత్తర దక్షిణ దిక్కుల నుంచి శబ్దాలు మొదలుపెట్టాయి మిగతా పక్షులు. ఇవి ఏ జాతికి చెందిన పక్షులు తెలియదు కానీ పొద్దున్నే 4:30 5 మధ్యలో విపరీతంగా ప్రయత్నం చేస్తూ ఉంటాయి, నిద్ర పోతున్నా ఈ మనుష్య జాతిని నిద్ర లేపటానికి . ఈరోజు శుక్రవారం పొద్దున్నే నిద్ర లేవాలి, తల స్నానం చెయ్యాలి దీపం వెలిగించాలి. కాస్త తల స్నానం చెయ్యాలి దీపం వెలిగించాలి. కాస్త తొందరగా ఆఫీస్ కి వెళ్ళాలి అని అన్ని గుర్తు వస్తున్నా బద్ధకం గా మంచం మీద దొర్లుతూనే వుంది కళ్యాణి. ఇక లాభం లేదు అనుకుని యో ఏమో కావు కావు మని కాకులు అరవడం మొదలు పెట్టాయి . మొదట అరిచినా పక్షులు మృదువుగా మధురం గా మేము నిద్ర లేచాము సుమా మీరు కూడా నిద్ర లేవండి అని చెప్పినట్లు అనిపించినా , ఈ కాకులు మాత్రం మీరు నిద్ర లేవండి లేదంటే మేము ఇంకా గోల చేస్తాం అని బెదిరించినట్లు అనిపిస్తుంది. బద్దకాన్ని తరిమికొట్టి,నిద్ర లేచి రెండు చేతులు దగ్గరగా చేర్చి అరచేతులు చూస్తూ '' కరాగ్రే వసతే లక్ష్మీ , కర మధ్యే గోవిందా / సరస్వతే ( గోవిందా అనాలో, సరస్వతే అనాలో ఎప్పుడు కన్ఫ్యూషన్ , సర్లే ఇద్దరూ వున్నారనుకుంటే పోలా అనుకోని ఇద్దరినీ స్మరించుకొని ) కర మూలే గౌరీ స్థితః , ప్రభాతే కరదర్శనః కోటి జన్మ పాపం తస్యానస్యతు అని మంత్రం ముగించి పక్కనే తన హస్త భూషణం అయిన మొబైల్ ఫోన్ చేతిలో తీసుకొని మంచం దిగింది కళ్యాణి. మంచం పక్కనే కింద పడి వున్నఇయర్ ఫోన్స్ కళ్ళకద్దుకొని మరీ తీసుకొంది . అవును మరి ఇవి చేసే సహాయం మనుషులు కూడా చెయ్యరు, రాత్రిళ్ళు పాత పాటలు వింటూ పడుకునే అలవాటు . ఒంటరి గా వుండే కళ్యాణి కి పక్షులు, పాటలు నేస్తాలు.

ఒక్కొటొక్కటి గా లైట్లు వేసుకుంటూ దేవుడి రూమ్ లో ఇంకో దండం పెట్టి, హాల్ లోకి వచ్చింది. సారెగామా కార్నివాల్ లో స్పిరిట్యుయల్, రొమాన్స్, సాడ్ , హ్యాపీ అని ఇన్ని మూడ్స్ , సైగల్,లతా, కిశోర్, ముఖేష్,ఆశాభోంస్లే అని ఎన్ని ఆప్షన్స్ ఉన్నా , అన్ని వదిలేసి యూ ఎస్ బి ని సెలెక్ట్ చేసుకొని నొక్కింది. ముందుగా భజగోవిందం ఆ తర్వాత విష్ణు సహస్రనామం, ఎమ్మెస్సమ్మ గాత్రం పొద్దున్నే వింటే నరాలు ఉత్తేజితమయినట్లు , మనసు ప్రశాంతం గాను అనిపిస్తుంది. తూర్పు బాల్కనీ లోంచి బయటకి చూస్తే దూరం గా ఊరు , పెద్ద ఇండిపెండెంట్ ఇళ్ళు చిన్నగా కనిపిస్తున్నాయి. వాటికి పైన సింటెక్స్ ట్యాంకులు. ఎందుకో తెలీదు, అన్నిటికి పసుపు రంగు వేశారు. దూరం నుంచి చూడటం వల్ల శివలింగాల్లా కనిపిస్తున్నాయి. సూర్యుడు బయటకి రాగానే. బ్రష్ చేసుకొని, కిచెన్ వర్క్ పూర్తి చేసుకొని , కాఫీ కప్ చేతిలో పట్టుకొని చూస్తే అప్పుడు కనిపించింది, ఇంకొక ఒంటరి నేస్తం. దాని పేరు ఏమిటో తెలీదు,సూర్యోదయం అయిన కాసేపటికి కనిపిస్తుంది. క్లియర్ గా వున్న ఆకాశం లో పెద్ద పెద్ద సర్కిల్స్ కొడుతూ ఉంటుంది. భూమి కి చాలా ఎత్తులో ఎగురుతూ ఉంటుంది. అందువల్ల చిన్నగా కనిపించినా ఒక సారి కొమ్మ మీద కూర్చుంటే బాగా దగ్గరగా చూసింది, భయ్యం వేసింది కల్యాణికి. బాగా బలిష్ఠం గా వుంది, చూపు కూడా చాలా తీక్షణం గ వుంది. గద్ద జాతికి చెందిన పక్షి అయి ఉండచ్చు, దాని అరుపు కూడా విచిత్రం గా అడవి పక్షి అరిచినట్లుంటుంది. సుమధురం గా శబ్దం చేసుకుంటూ తనకే స్వంతమయిన ఆకుపచ్చని వర్ణం లో వచ్చింది, ఇంకెవరు మన రామచిలుక . రెండు సార్లు పిలిచిందో లేదో ఒక పది , పదిహేను దాకా గుంపు గా , గోల గా అరుచుకుంటూ అర్ధ చంద్రాకారం గ బయలుదేరాయి. డ్యూటీ కి అనుకుంటా . ఇంకా రోజంతా మళ్ళి కనిపించవు. నిజం చెప్పాలంటే, మైసూరు లాంటి ప్రదేశాలలో ఇంటికంటే బయట ఉండటమే ఇష్టం గా అనిపిస్తుంది స్వచ్చమయిన గాలి, స్వచ్చమయిన నీరు, శబ్ద కాలుష్యం అసలు లేనే లేదు. సెక్యూరిటీ గార్డులు తప్ప, మనుషులు కూడా కనిపించటం కూడా అరుదు అనే చెప్పాలి. ఆఫీస్ వాతావరణం కూడా సైలెంట్ గానే ఉంటుంది సెంట్రల్ ఆఫీస్ ముంబై వాళ్ళు కానీ, హైదరాబాద్ / బెంగుళూరు రీజినల్ ఆఫీస్ వాళ్ళు కానీ స్టేట్మెంట్లు, స్టాటిస్టిక్స్ అని హడావుడి చేస్తారు. డిపార్ట్మెంట్ లో ఉన్న స్టాఫ్ అందరు మైసూర్ లోకల్ వాళ్ళే, మేడం , మేడం అంటూ చాలా గౌరవం గ చూస్తారు, వయసులో చిన్నది అయినా వాళ్లకు బాస్ అన్న మర్యాద ఇస్తారు. పని కూడా బాగా చేస్తారు. లంచ్ టైం లో అమ్మ ఫోన్ చేస్తే కానీ గుర్తు రాలేదు, ఆ రోజు సాయంకాలం బెంగళూరు వెళ్లాలని. బ్యాంకు లో ప్రొబేషనరీ ఆఫీసర్ గా పని చేస్తున్న కళ్యాణి కి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు తల్లితండ్రులు. చదువు పేరు తో కొన్నాళ్ళు, ఉద్యోగం రావాలన్న వంక తో మరి కొన్నాళ్ళు ఆపగలిగింది. ఇంకా ఆ అవకాశం లేదు. పైగా కళ్యాణి బ్యాచ్ మేట్స్, స్కూల్ మేట్స్ అందరికి వరసగా పెళ్లిళ్లు అయిపోతున్నాయి. అమ్మ, నాన్న కళ్యాణి కి చాలా ఫ్రీడమ్ ఇచ్చారు, ఎవరినయినా ప్రేమిస్తే చెప్పమన్నారు. కులం, మతం కంటే తమకు కూతురి సంతోషమే తమకు ముఖ్యమని మరీ మరీ చెప్పారు. ఆ విషయం కొంచెం గర్వం గా అనిపించినా , వాళ్ళ మాట విని పెళ్లి చేసుకోవాల్సిన బాధ్యత తన మీద ఉందని ఫీల్ అవుతోంది, ఈ మధ్య. ఫ్రీడమ్ మీన్స్ రెస్పాన్సిబిలిటీ అన్నాడొక ఆంగ్ల కవి. అందుకే ఒప్పుకుంది, ఈ బెంగళూరు ప్రయాణానికి, పెళ్లి చూపులకి. అక్కడ తన స్కూల్ మే ట్ , చిన్న నాటి నేస్తం రమ్య ని కూడా చూడొచ్చు. రమ్య పేరు గుర్తు వస్తేనే మనసంతా ఉత్తేజం తో నిండి పోతుంది . రమ్య స్వభావమే అంత. నవ్వుతు, నవ్విస్తూ తనకి ఇష్టమయిన విధం గ జీవితాన్ని గడుపుతూ ఉంటుంది. రమ్య సాంగత్యం లో వున్న వాళ్ళు ఎవరయినా సరే , దాని అత్యుత్సాహం చూసి ఉత్తేజితులు అవ్వాల్సిందే.

తన కేబిన్ కిటికీ నుంచి బయటకి చూస్తేఎదురుగా నాలుగు రోడ్ల కూడలి మధ్య పెద్ద సర్కిల్. మిలీనియం సర్కిల్ దాని పేరు. పక్కనే పెద్ద స్టేడియం, బన్ని మంటప అంటారు మైసూరు అంటేనే గుర్తు వచ్చేది, ముసోరె చాముండేశ్వరి అమ్మ వారు, మహారాజా పాలస్ మరియు బృందావన్ గార్డెన్స్. ఇక్కడ దసరాలు చాలా సంబరంగా జరుపుకుంటారు. ఊరేగింపు తర్వాత బన్ని మంటప లో సామాన్య ప్రజలకు దర్శనమిస్తారు. అమ్మవారిని ఆహ్వానించి కుర్చోపెట్టే ప్రదేశం, ఈ స్టేడియం. బన్ని మంటప అంటే తెలుగు లో ఆహ్వాన మంటపం అని అర్ధం. కోవిడ్ కారణం గ రెండు సంవత్సరాలనుంచి అమ్మ వారి ఊరేగింపు పాలస్ కే పరిమితం అయ్యింది. వీ .ఐ .పి లకు మాత్రమే అనుమతి. శ్రీవారి బ్రహ్మోత్సవాలు లాగా ఆంతరంగిక వ్యవహారం అయ్యింది.

సాయంకాలం నాలుగు గంటలు అయినట్లుంది. కాష్ కౌంటర్ పనులు తెమిలించుకొని చూస్తే , మిస్డ్ కాల్ ఫ్రొం రామ్ అని చూపిస్తోంది మొబైల్.. ఇక్కడ సాయంకాలం నాలుగు గంటలు అంటే , అమెరికా లో వాషింగ్టన్ డీసీ లో పొద్దున్న ఆరున్నర అయ్యి ఉంటుంది. అయినా రామ్ బయలుదేరి 24 గంటలు అయ్యింది కదా, కొంపతీసి బెంగుళూరు అప్పుడే రీచ్ అయ్యాడా ఏమిటి అనుకుంటూ ' మిస్డ్ యువర్ కాల్, వాట్సాప్ అని మెసేజ్ చేసింది, నో రెస్పాన్స్ అటునుంచి. కాల్ చేస్తే మొబైల్ స్విచ్ ఆఫ్ అని వస్తోంది. సర్లే అని మిగతా పనులన్నీ పూర్తి చేసుకొని క్యాబ్ ఎక్కింది. మైసూర్ సిటీ రోడ్ ట్రాఫిక్ లు అన్ని దాటుకుంటూ, కొలంబియా ఆసియ హాస్పిటల్ కాంప్లెక్స్ ని దాటి బెంగుళూరు మెయిన్ రోడ్ ఎక్కింది కార్. ఒంటరి ప్రయాణం, మౌనం గ ఉంటే మంచిదనిపించి కామ్ గా బయట చూస్తూ కూర్చుంది కళ్యాణి. ఒక అరగంట లోపే ' వెల్కమ్ టు టెంపుల్ టౌన్ శ్రీరంగపట్న " అన్న బోర్డు కనిపించింది. శ్రీరంగం అంటే తమిళనాడు కదా, కొంప తీసి రూట్ మార్చాడా ఏమిటి , డ్రైవర్ రాంగ్ రూట్ పట్టించాడేమో అని భయ్యం వేసి గూగుల్ మాత ని ఆశ్రయించింది. మైసూర్ టు బెంగుళూరు రూట్ అని కొడితే మైసూర్-శ్రీరంగపట్న -మండ్య-మద్దూర్-చెన్నపట్న-రాంనగర-బిడాడి -బెంగుళూరు అని చూపించింది. ఇంకా డీటెయిల్స్ లోకి వెళితే ఈ శ్రీరంగపట్నాన్ని " ఆది శ్రీరంగం" అని, కర్ణాటక లోని " శివసముద్రం" ని "మధ్య శ్రీరంగం" అని, తమిళనాడు లో ని తిరుచిరాపల్లి లో శ్రీరంగం ను " అంత్య శ్రీరంగం" అని అంటారని చెపుతోంది గూగుల్ మాత . ఆలా ఆలోచిస్తూనే నిద్ర లోకి జారుకుంది కళ్యాణి. ... రాత్రి ఎనిమిది అయినట్లుంది. ఫోన్ మోగటం తో మేలుకొని చూసింది , అటునుంచి రమ్య " ఎక్కడున్నావు? " అని అడుగుతోంది.

డ్రైవర్ వంక చూసి " భయ్యా హమ్ లోగ్ కహాపే హై ?" అని అడిగింది. డ్రైవర్ కి అర్ధం అయినట్లు లేదు. ఫోన్ లో వున్నాడు, టోల్ గేట్ ఫీజు కడుతున్నాడు, మనం ఇప్పుడు ఎక్కడున్నాం అంది, గాలి శబ్దం లో కల్సి పోయినట్లుంది కళ్యాణి ప్రశ్న. టోల్ దాటి కార్ విపరీతమయిన స్పీడ్ తో చీకట్లు చీల్చుకుంటూ పరిగెడుతోంది కార్. ఒక పక్క కొండ లాగ వుంది, బయట గాలి బాగా వస్తోంది, ఏసీ కార్ అయినప్పటికీ. డ్రైవర్ విండో గ్లాస్ పైకి ఎత్తగానే, ముచ్చట గా మూడో సారి అడిగింది అదే ప్రశ్న. నైస్ రోడ్ ఎంటర్ అయ్యాము మేడం , ఇంకొక 45 మినిట్స్ పడుతుంది అన్నాడు. ఓహో, ఇతనికి తెలుగు వచ్చు అన్న మాట అనుకుని , రమ్య కి విషయం తెలియచేసింది. ఇంత సేపూ రమ్య లైన్ లో నే వుంది, ఇవతల ఏమి జరుగుతోందో తెలియక. మళ్ళి గూగుల్ మాత ని ఆశ్రయించింది , NICE రోడ్ అంటే, N -నంది I -ఇన్ఫ్రాస్ట్రక్చర్ C -కారిడార్ E - ఎంటర్ ప్రైజస్ అన్నది ఒక ప్రైవేట్ టోల్ రోడ్ అని అర్ధం అయ్యింది. ఫాస్టెస్ట్ రూట్ లో నే వెళుతున్నాడన్నమాట,అనుకుంది. కొద్ధి సేపట్లోనే పెద్ద ఫ్లై ఓవర్ ఆ తర్వాత పెద్ద పెద్ద బిల్డింగ్స్ , అపార్ట్మెంట్స్ లో మినుకు మినుకు మంటున్న విద్యుద్దీపాలు, " వెల్కమ్ టు బెంగుళూరు " అన్న ఒక బోర్డు కనిపించాయి వరసగా. ఒక పెద్ద ఫ్లైఓవర్ మీద వెళుతోంది కార్. గూగుల్ లో " ఎలక్ట్రానిక్ సిటీ ఫ్లైఓవర్ అని చూపిస్తోంది. లొకేషన్ ముందరే షేర్ చేయటం వాళ్ళ డ్రైవర్ ఏ ప్రశ్న లు వెయ్యకుండా వేగం గా కార్ నడుపుతున్నాడు. విప్రో గేట్ నెంబర్ 12, 11, 10 అని చదువుతోంది, గేట్ నెంబర్ 9 దాటగానే కార్ ఒక పెద్ద అపార్ట్మెంట్ ముందు ఆగింది. సెక్యూరిటీ గార్డ్ కార్ దగ్గరకి వచ్చాడు. కళ్యాణి క్యాబ్ దిగి రిజిస్టర్ ఎంట్రీ వెయ్యలేమో అనుకుంది, తన క్వార్టర్స్ లాగా. అవసరం లేదు త , సెక్యూరిటీ కెమెరా లో కార్ తనకు కనిపిస్తోందని చెప్పింది రమ్య. క్యాబ్ నెంబర్ ఫోన్ లో కంఫర్మ్ చేసుకొని, వాళ్లకి ఏదో సెక్యూరిటీ యాప్ ఉంటుందిట, అందులో పర్మిషన్ ఇచ్చిందిట. అప్పుడు కానీ క్యాబ్ లోపలికి రాలేదు. ఎదురుగా నాలుగు బ్లాక్ లు కనిపిస్తున్నాయి. ఎవరినయినా అడుగుదామంటే, మెయిన్ గేట్ సెక్యూరిటీ వరకు వెళ్ళాలి, ఈ లోపు మళ్ళి లైన్ లోకి వచ్చి చెప్పింది A బ్లాక్ లాస్ట్ గా ఉంటుంది అని, ఎంటర్ అయ్యాక ' లెఫ్ట్ వింగ్' అని రాసి ఉన్న లిఫ్ట్ ఎక్కమంది. తిరుపతి లో శ్రీనివాసం కాంప్లెక్స్ లాగ అనిపించాయి. చిట్టా చివరిగా ఉన్న ఫ్లాట్ లోనించి ఒక రెడ్ కలర్ వెల్వెట్ నైటీ లో బయటకి వచ్చి 'ఇక్కడ, ఇక్కడ' అని అరుస్తోంది ఒక చేత్తో డోర్ పట్టుకొని గట్టిగా అరుస్తోంది రమ్య. గాలి బాగా వీస్తోంది. డోర్ పడిపోతే ఆటో లాక్ అయిపోతుంది అని అడ్డం గా నిలుచొని పిలుస్తోంది. చేతిలో మొబైల్, చెవిలో ఇయర్ ఫోన్స్. ఈ రెండు లేకుండా రమ్య ని ఊహించలేము. దాన్ని చూడగానే ప్రాణం లేచి వచ్చింది . ప్రశాంతమయిన మైసూర్ నుంచి ఇంత గడబిడ గా ఉన్న 25 అంతస్థుల అపార్ట్మెంట్ లో తనకంటూ ఒకరున్నారనిపించింది. ఈ పోస్టింగ్స్ కూడా ఇద్దరి మనస్తత్వాలకి తగ్గట్టుగానే ఇచ్చారనిపించింది. పూర్తిగా ప్రకృతి లో కలిసిపోయి , ప్రపంచానికి దూరం గా నివసించే మనస్తత్వం నాది. టెక్నాలజీ ని స్వంతం చేసుకుంటూ ప్రపంచం తో పాటు పరుగులు తీసే మనస్తత్వం రమ్య ది.. ఎంటర్ అవుతుంటే, మెయిన్ డోర్ పైన చిన్న సి సి టీవీ కెమెరా కనిపించింది. నా చూపు పసిగట్టిన రమ్య " దానితో మనకి సంబంధం లేదు. అపార్ట్మెంట్ అసోసియేషన్ వాళ్ళు పెట్టించారు. ఇంటిలోపలి టెక్నాలజీ మాత్రమే మనది, అని నవ్వింది. ఇంటిలోపల సన్నగా , పొడుగ్గా వున్నా కారిడార్ లో మేము నడుస్తుంటే ఒకొక లైట్ వెలుగుతోంది. మేము ఆ ప్రదేశం దాటగానే ఆరిపోతున్నాయి. సెన్సర్ టెక్నాలజీ అన్న మాట. వెనక్కి తిరిగి " పవర్ సేవింగ్" అని నవ్వి , నా చేతిలో ఉన్న చిన్న బాగ్ తీసుకోండి. ఎల్ షేప్ లో ఉన్న హాల్, మాడ్యూలర్ కిచెన్, రెండు బెడ్ రూమ్స్. చాలా చిన్న గా కాంపాక్ట్ గా ఉంది . హాల్ లో డైనింగ్ టేబుల్ కి బదులుగా బార్ టేబుల్ కనిపించింది. దాని మీద అందం గా అమర్చిన కాండిల్ లైట్స్, ఫ్రూట్ బాస్కెట్ కనిపించాయి. ఏంటి? బార్ టేబుల్ ఉన్న ఇల్లు తీసుకొన్నావు . అది కూడా మొదలెట్టావా ? అని నవ్వుతూ అడిగింది కళ్యాణి. ఏదో, అప్పుడప్పుడు అది కూడా బీర్ మాత్రమే అన్న రమ్య కేసి ఆశ్చర్యం గా చూసింది. సర్లే హాల్ లోకి రా, నీ కోసం ఏమి చేసానో చూడు అంటూ చెయ్యి పట్టుకొని లాక్కెళ్ళింది. వాల్ మౌంటెడ్ టీవీ ముందు ఒక సోఫా సెట్ , టీ పాయ్ మీద హాట్ పాక్స్ లో డిన్నర్ రెడీ గా ఉంది. చూడటానికి మోడరన్ గా వున్నా వంట చాలా బాగా చేస్తుంది రమ్య. ఇంతలోనే, హే అలెక్స ప్లీస్ ప్లే తూ మిలే , దిల్ ఖిలే సాంగ్ అనగానే పెద్ద సౌండ్ తో పాట రావటం మొదలు పెట్టింది. మళ్ళి ' హే అలెక్స ప్లీజ్ రెడ్యూస్ వాల్యూం ' అనగానే, ఈ సారి పాట మంద్ర స్థాయి లో రావటం మొదలుపెట్టింది. కల్యాణి కి ఎంతో ఇష్టమయిన పాట గుర్తు పెట్టుకొని రాగానే పాడించటం చాలా సంతోషం గా అనిపించింది. చేయి పట్టుకొని డాన్స్ చెయ్యటం కూడా మొదలు పెట్టింది. ముందరే చెప్పాగా రమ్య ఎక్కడ ఉంటే అక్కడ అంత ఉత్సాహమే అని. ఆ ఉత్సాహానికి కొంచెం సేపు ఫుల్ స్టాప్ పెట్టి, స్నానం చేసి వస్తా అని, వేడి నీళ్లు వస్తాయా అని అడిగింది. బాత్రూం బయట ఆల్రెడీ వేసి వున్న స్విచ్ చూపించింది, డాన్స్ చేస్తూనే. ఒక కార్నర్ లో హాస్పిటల్ లాగ చిన్న రౌండ్ వాష్ బేసిన్ విత్ స్టాండ్, పక్కనే నేల కి అంటని వెస్ట్రన్ కమోడ్ , దాని పక్కనే చిన్న గట్టు, దాని పైన షాంపూ, సోప్ , హ్యాండ్ వాష్ , కండీషనర్ అన్నీను. ఒక మనిషి నిలబడి స్నానం చేసేంత స్థలం మాత్రమే వుంది అక్కడ. నీట్ గ వుంది కానీ చాలా ఇరుకు గా అనిపించింది. మైసూర్ లో బాత్రూం , ఇక్కడ ఒక బెడ్ రూమ్ అంత ఉంటుంది. స్నానానికి షవర్ తిప్పగానే, నెత్తి మీద నీళ్లు పడుతూ , ఏదో వాటర్ ట్యాంక్ లాగ శబ్దం కూడా వస్తోంది. ఏమిటా అని చూస్తే, ఫాల్స్ సీలింగ్ లోపల, హీటర్ పెట్టినట్లున్నారు. రెండు ట్యూబ్ లు , రాక్షసుడి కన్ను లాగ ఒక చిన్న రెడ్ లైట్ కనిపించింది. ఇంట్లో ఎంటర్ అవ్వగానే పవర్ సేవింగ్ లాగ, ఇది స్పేస్ సేవింగ్ అన్నమాట అనుకుంది.

డిన్నర్ కి తనకి ఎంతో ఇష్టమయిన కాప్సికమ్ కూర, మామిడికాయ పప్పు చూడగానే ఆకలి ఆవురుమనిపించింది. ఈ సీజన్లో మామిడికాయలు ? ఆశ్చర్యం గా అనిపించింది. మరి ఏమనుకున్నావు, రమ్య అంటే అని కాలర్ ఎగరేసింది నవ్వుతూ . ఆన్లైన్ లో అన్ సీజనల్ ఫుడ్స్ అన్న సైట్ లో ఆర్డర్ చేసిందిట, ఒక మామిడి కాయ డెబ్బయి రూపాయిలుట. కమ్మగా డిన్నర్ అయ్యాక, కాసిని వేడి పాలు ఉన్నాయా అని అడిగా. ఆ పాల లో కొంచెం పసుపు, మిరియాల పొడి, బెల్లం వేసుకొని తాగుతున్న కళ్యాణి ని ఈ అలవాటు ఎప్పటినుంచి అని అడిగింది. " ఇమ్మ్యూనిటి పెంచుకోవటానికి, కోవిడ్ ని జయించటానికి, నవ్వుతూ చెప్పింది కళ్యాణి. ప్లేయిన్ సోడా ని ఒక గాజు గ్లాస్ లో తెచ్చుకొని కూర్చుంది రమ్య. కిచెన్ లో సోడా మేకర్ తో తానే తయారు చేసుకోని తెచ్చుకుంది. " సరే , ఇంతకీ ఎప్పుడు నీ పెళ్లిచూపులు ?" స్ట్రెయిట్ గా పాయింట్ లోకి వచ్చింది రమ్య. పెళ్ళిచూపులా , పాడా ..అయ్యగారు రేపు హోటల్ లో కలుద్దాం, ఒక గంట మాట్లాడి డిసైడ్ చేసుకుందాం అన్నాడు . చూపులన్నీ ఇప్పుడు వాట్సాప్, పేస్ బుక్ లో అయిపోతున్నాయి గా అంది. అవునా , మరి అమ్మాయి గారు ఏమనుకుంటున్నారు నచ్చినట్లేనా అంది రమ్య. నచ్చక పోవడానికి ఏమి లేదు, ఆలా అని నచ్చాడని చెప్పలేను . సిన్సియర్ గా అనిపించాడు, ఇద్దరు అమ్మాయిలను చూస్తున్నాడు ట , ఈ ట్రిప్ లో . అమెరికా వుద్యోగం వదిలేసి బెంగళూరు వస్తే ఓకే, లేకపోతే లేదు అంది. అదేంటి , మరి నువ్వు మైసూర్ కదా , సందేహం వెలిపుచ్చింది రమ్య. దానిదేముందిలే ఒక ఏడాది ఎలాగూ అవ్వొస్తోంది, ఇంకొక ఇయర్ చేస్తే బెంగళూరు ఇస్తారుగా అని దారి లో జరిగిన ఇంకొక విషయం చెప్పింది. ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం రేపు, అంటే శనివారం సాయంకాలం కలవాల్సింది, కానీ రామ్ ఫ్లైట్ రీ షెడ్యూల్ అవ్వటంవల్ల లేట్ గా వస్తున్నాడు. సోమవారం సాయంత్రం కానీ కలవటానికి లేదు అంది. అయితే ఇంకేం, మండే లీవ్ పెట్టు, నేను కూడా పెడతా ఇద్దరం కల్సి ఎంజాయ్ చేద్దాం అంది రమ్య ఉత్సాహంగా. అదే , ఇంకా ఏమి ఆలోచించలేదు. అతను ఇండియా లో ల్యాండ్ అవ్వగానే మెసేజ్ చెయ్యమని చెప్పాను అంది. రమ్య కూడా ఏదో చెప్పబోయి ఆగిపోయింది. ఇద్దరికీ నిద్ర ముంచుకొస్తోంది, వారమంతా డ్యూటీ , తర్వాత ప్రయాణం, స్నేహితురాలి సాంగత్యం, మంచి నిద్ర పట్టేసింది కళ్యాణి కి. .

మర్నాడు పొద్దున్నే మెలుకువ వచ్చేటప్పటికి , బెడ్ రూమ్ తలుపు దగ్గరగా వేసి వుంది. బయట నుంచి ఏదో కీ మని శబ్దం వస్తోంది. డోర్ ఓపెన్ చేద్దామని చూస్తే, బయట నుంచి లాక్ చేసినట్లుంది. వచ్చి తెరిచింది. బెడ్ రూమ్ డోర్ కి ఒక కుర్చీ అడ్డం పెట్టి వుంది. బయటకి వచ్చి ' ఏమిటి ఇది అంతా అని అడిగింది. ఇదిగో, ఈ మేడం గారు వదిలేస్తే లోపల దూరుతుంది అని చూపించింది. తాబేలు లాగ రౌండ్ గా వుంది, ముందు వైపు చిన్న టెంటకిల్స్ లాగా బయటకి వచ్చాయి. "రోబో క్లీనర్ " ట . ఇల్లు విడుస్తుంది ట, తుడుస్తుంది ట . దాని వెనక్కాల పడి సపర్యలు చేస్తోంది. నేల మీద కీ మని శబ్దం చేసుకుంటూ తిరుగుతోంది. అడ్డం వస్తే వెనక్కి తిరిగి వేరే దిశ లో వెళుతోంది. కొన్ని సార్లు ఆగిపోతుందిట. దాన్ని సూపర్ వైస్ చెయ్యాల్సిందేనట. కళ్యాణి కి మాత్రం పొద్దున్నే తలుపు తీయగానే నవ్వు మొహం తో ఎదురు వచ్చే మా " రత్నమ్మ" గుర్తు వచ్చింది. ఇల్లు ఊడవటం , తుడవడం, బట్టలు ఉతకడం, ఆరెయ్యటం, మడతలు పెట్టటం, ఫ్లాట్ ముందు ముగ్గు పెట్టటం, గిన్నెలు తోమటం అన్ని శుభ్రం గా ఒక గంట లో పూర్తి చేస్తుంది. నేను సూపర్ వైస్ చెయ్యాల్సిన అవసరమే లేదు అనుకుంది. జొమాటో లో ఆర్డర్ ఇచ్చిన బ్రేక్ ఫాస్ట్ లు లాగించి, మధ్యాన్నం పలావు కి అన్నీ సిద్ధం చేసుకొని మళ్లీ కబుర్లు లో పడ్డారు, స్నేహితురాళ్ళు ఇద్దరు. " కళ్యాణి పెళ్లిచూపులు" అన్న టాపిక్ పెట్టుకొని అల్లరి చేస్తోంది రమ్య. సరే నీ విషయం ఏమి చెప్పలేదు, పప్పన్నం ఎప్పుడు పెడతావు అని అడిగింది కళ్యాణి. నిన్న రాత్రే కదా , మామిడికాయ పప్పన్నం పెట్టాను , నీకు ఇష్టమని రాగానే పెట్టించేసా అంది నవ్వుతూ . సరే నీకు ఇంకొక విషయం చెప్పాలి, మంగళవారం పొద్దున్న అమ్మ, నాన్న వస్తున్నారు. ఒంగోలు అబ్బాయే, అమెరికా లో ఉద్యోగం . అంత అల్లరి చేసే రమ్య సిగ్గుపడటం మొదటి సారి చూడటం. అందం గా వున్నాడు, నిజాయితీ గల వ్యక్తి లా అనిపించాడు. పేరు కు తగ్గట్లు కృష్ణుడి లాగా కొంటె మాటలు కూడా మొదలు పెట్టాడు, మద్రాస్ ఐఐటీ లో ఎమ్ టెక్ చేసాడు అంది రమ్య. ఒంగోలు అబ్బాయి, మద్రాస్ ఐఐటీ క్వాలిఫైడ్ అనగానే కొంచెం ఇబ్బంది గా అనిపించింది కళ్యాణి కి. ఇద్దరు అమ్మాయిలని చూస్తున్నాను , ఈ ట్రిప్ లో అన్న రామ్ మాటలు గుర్తు వచ్చాయి. అమ్మాయి గారి సిగ్గు చాలా బావుంది. ఇంతకీ మీ కృష్ణుడి పూర్తి పేరు ఏమిటో అని అడిగింది. " ఇంగువ వెంకట రామక్రిష్ణ శర్మ" అంది. అది వినగానే తన మొబైల్ నుంచి ఫోటో చూపిస్తూ " ఇతనేనా, చూడు " అంది కళ్యాణి. "ఓహ్. ఎస్" ఎక్సయిటింగ్ గా చెప్పింది రమ్య. ఇద్దరి ఆశ్చర్యం కొంచెం సద్దు మణిగాక , నిజం ఏమిటి అన్నది ఇద్దరికీ అర్ధం అయ్యింది. కొంచెం సేపు జోకులు వేసుకున్నా, స్నేహితురాళ్లు ఇద్దరి మనస్సులో ఏదో ఇబ్బంది. ఇంక " రామ్ పెళ్లిచూపులు విత్ కళ్యాణి" అండ్ " కృష్ణ పెళ్లిచూపులు విత్ రమ్య" అన్న రెండు టాపిక్స్ కి ఫుల్ స్టాప్ పడింది. లంచ్ విత్ బిరియాని కూడా ఏదో సినిమా చూస్తే కొంచెం డల్ గానే అయ్యింది. రమ్య లో హుషారు తగ్గింది. ఆలా, ఆలా సాయంకాలం అవ్వగానే ఇద్దరు కల్సి బాల్కనీ లో టీ తాగటానికి కూర్చున్నారు. ఇక్కడ వున్నా హై రైజ్ అపార్ట్మెంట్స్ లో అయిదవ ఫ్లోర్ లో పిచ్చి గాలి వస్తుందని టఫ్ గ్లాస్ అద్దాలు బిగించారు. హాల్ అటాచ్డ్ బాల్కనీ కావటం వల్ల చల్లని ఏ.సి గాలి ఇద్దరినీ తాకుతోంది. బాల్కనీ లో ఉన్న ఆకుపచ్చ రంగు ఆర్టిఫీషీయెల్ కార్పెట్ కాళ్ళ కింద మెత్తగా తగులుతోంది. చాయ్ నిజం గా చాలా బాగుంది. ఆ మాటే బయటకి చెప్పింది కళ్యాణి. "బెంగుళూరు లో చాయ్ పాయింట్ అని బాగా ఫేమస్ . ఆ షాప్ లో చాయ్ తాగుతుంటే , ఐడియా వచ్చింది. వాడి దగ్గరే టీ పొడి కొంటే పోలా అనుకొ ని అడిగాను. " అస్సాం స్పెషల్ మసాలా చాయ్ పౌడర్ " తో చేసాను. " అని ఉత్సాహం గా చెపుతోంది తనకంటే రెండు సంవత్సరాలు చిన్నదయిన రమ్య. మళ్ళీ దాన్ని ఆ మూడ్ లో చూడగానే ఆనందం వేసింది. బాల్కనీ లోంచి ప్రపంచం అంతా చాలా సైలెంట్ గా అనిపిస్తోంది. ఆ గ్లాస్ అద్దాల్లోంచి బయట కార్లు, బస్సు లు, టు వీలర్ లు, దూరం గా ఫ్లైఓవర్ మీద వెళుతున్న వాహనాలు అన్నీ శబ్దం చెయ్యని చిత్రాల్లాగా కదులుతున్నాయి.

రేపు మధ్యాహ్నం లంచ్ తర్వాత బయలుదేరుతున్నాను. ఓలా క్యాబ్ బుక్ చేసాను అంది కళ్యాణి. " అదేంటి? రామ్ వచ్చేది మండే ఈవెనింగ్ కదా? " ఆశ్చర్యం గా అడిగింది రమ్య. " నేను రామ్ ని కలవట్లేదు " ఇంకొక బాంబ్ పేల్చినట్లయింది రమ్య కి. " ఎందువల్ల? " అరిచినంత పని చేసింది రమ్య . " ఎందుకో, మనస్కరించట్లేదు. రామ్ వైపు నుంచి ఏ తప్పు లేదు. ముందు గానే అన్ని విషయాలు చెప్పాడు . ఈ ట్రిప్ లో ఇద్దరు అమ్మాయిలని చూస్తున్నానని ముందే చెప్పాడు. కానీ, నేను ఊహించని ట్విస్ట్, ఆ రెండో అమ్మాయి నువ్వే కావటం. అవన్నీ అలా ఉంచితే , నాకంటే రామ్ ని నువ్వే ఎక్కువ ఇష్టపడుతున్నావు. అందుకే అతను నీకు కృష్ణుడి కొంటె చేష్టలు చూపిస్తున్నాడు. అన్నిటికి మించి నువ్వు ఈ బంధానికి/సంబంధానికి చాలా ఎక్కువ విలువ ఇవ్వబట్టే నువ్వు మీ పేరెంట్స్ ని కూడా రమ్మన్నావు .నువ్వు నాకు లాగ బెంగళూరు లో ఉంటామా, అమెరికా లో ఉంటామా ఎవరి కోసం ఎవరు ఉద్యోగం మారాలి అని ఇద్దరి మధ్యా ఏదో కాంట్రాక్టు లాగ ఆలోచించలేదు. నీ మనసులో ప్రస్తుతానికి రామ్ వస్తున్నాడు, నాకు నచ్చాడు, నేను కూడా నచ్చితే బాగుండు. అమ్మా , నాన్న పెద్దవాళ్ళు. వాళ్ళ సమక్షం లో పెళ్లి జరిగితే బాగుండు, వాళ్ళు హ్యాపీ గ ఫీల్ అవుతారు అన్న నిజాయితీ తో కూడిన ఉత్సాహం, ఆనందం తప్ప , నీ ఉద్యోగం గురించి కానీ, నీ భవిష్యత్తు గురించి కానీ ఏ ఆలోచన లేదు. నీది చాలా " రమ్యమయిన ప్రేమ, రమ్యా" . " ఇంగువ రామకృష్ణ శర్మ నీవాడు, నీకు కాబోయే శ్రీవారు " అని చెప్పటం ముగించి రమ్య చేయి పట్టుకొని మెత్తగా నొక్కింది కళ్యాణి. ఒక పెద్ద వాన వెలిసినట్లయ్యింది, స్నేహితురాళ్ళిద్దరి మనస్సుల్లో . ఆ తర్వాత కబుర్లే, కబుర్లు.

ఈ ప్రకృతి గురించి కానీ, ఆ ప్రపంచం గురించి కానీ , ఆ ఇద్దరూ కల్సి తన జీవితం గురించి తీసుకున్న నిర్ణయం గురించి కానీ తెలియని పురుషుడు గాలి లో ఎగురుతూ వస్తూనే ఉ న్నాడు, ఇండియా కి.

మరిన్ని కథలు

Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు
Pratibha
ప్రతిభ
- చెన్నూరి సుదర్శన్
Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు