ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా నివారణకు తొలిసారిగా టీకాని సృష్టించిన ఒక బహుళజాతి ఔషధ సంస్థ యజమాన్యం, ఐదు నక్షత్రాల హోటల్లో, నిర్వహిస్తున్న విలేకరుల సమావేశం సాగుతోంది. ఆ సంస్థ ముఖ్య కార్యనిర్వాహక అధికారి మాట్లాడుతూ, "ఆరు నెలల క్రితం, ఇదే తేదీన మేము కరోనా నివారణకు టీకా ఆవిష్కరించగలమని ప్రపంచానికి వాగ్దానం చేశాం. అ రోజు ఆది ఒక స్వప్నం. కానీ ఈ రోజు సత్యం…" అతని స్వరంలో ఆత్మవిశ్వాసం, విజయగర్వం తొణికిసలాడుతున్నాయి. కనక వర్షంలో తడిసి ముద్దవుతున్న అనుభూతికి లోనవుతున్నాడతడు.
"సంజీవని లాంటి ఈ టీకా మన దేశప్రజలందరికి అందడానికి ఎంత కాలం పడుతుంది?" అడిగాడు ఒక విలేఖరి. "తగినంత నిల్వలు వున్నాయి. అవసరాలకనుగుణంగా ఉత్పత్తి చేయగల సామర్థ్యం మాకుంది. ధర గురించి ఆలోచించకుండా టీకా కొనుక్కొని, ఎవరి కుటుంబాన్ని వాళ్లు రక్షించుకోవాలి." అన్నాడు, ఆ సంస్థ ప్రతినిధి.
"సరసమైన ధరకి, టీకా అందుబాటులో ఉండాలి. అప్పుడే పేదవాళ్ళు కూడా తమ ప్రాణాలను రక్షించుకోగలరు..." అని అంటున్న ఆ విలేఖరి మాటని మధ్యలోనే ఖండిస్తూ, " మీ అభిప్రాయం అర్ధమయ్యింది. కానీ మీరే చెప్పినట్లు ఈ టీకా సంజీవని. ప్రాణం ఖరీదుని వెల కట్టలేము. ధర ఎక్కువగానే వుంటుంది మరి. ఆ విషయం అందరూ అర్ధం చేసుకోవాలి." విచిత్రంగా భుజాలు ఎగుర వేస్తూ,చేతులు తిప్పుతూ అన్నాడు ఆ సంస్థ ప్రధాన అధికారి. మరో విలేఖరి వెంటనే స్పందిస్తూ, " రోజూ, మన దేశంలో కొన్ని కోట్ల మంది, పట్టెడు మెతుకులకు కూడా నోచుకోలేరు. వారికి ఈ టీకా అందని ద్రాక్ష లాంటిదే. కాబట్టి అలాంటి వారి కోసం, కనీసం కొన్ని టీకాలయినా ఉచితంగా..." అంటూ చెప్పబోతుంటే, ఆ సంస్థ ఆర్ధిక సలహాదారుడు, "ఉచితంగా ఇవ్వడానికి ఇది గచ్ఛాకు పుచ్చాకుతో చేసింది కాదు. కోట్లాది రూపాయలు వెచ్చించి, మా శాస్త్రవేత్తలు అహర్నిశలు కష్టించి సాధించింది. అందుకే మేధోసంపత్తి హక్కులు కూడా తెచ్చుకున్నాం. ప్రపంచంలోని అత్యంత క్లిష్టమైన సాంకేతిక పరిజ్ఞానంతో…" అతని మాటతీరుకి బాధ పడిన మరో విలేఖరి, వెంటనే ఆవేశంగా ప్రశ్నించాడు, "మరి కరోనా వ్యాధిగ్రస్తులైన పేదవాళ్ల దుస్థితి, ఎవరికి పట్టదా? కార్పొరేట్ సామాజిక బాధ్యత మీకు లేదా?". ఆప్రశ్నకి, చాలా ప్రశాంతంగా, ఆ సంస్థ ముఖ్య వాణిజ్య అధికారి, "మా బాధ్యతని, మాకు ఎవరూ గుర్తు చేయనవసరం లేదు. ఖరీదైన టీకాలు ఉచితంగా పంచి పెట్టడం మాత్రమే సామాజిక బాధ్యత కాదు. మా బాధ్యతని తప్పకుండా నిర్వహిస్తాం. అలాగని, ఉచితాల పేరిట ఖరీదైన టీకాలను దరిద్రులకి ధారపోయం. అవకాశాలని అందిపుచ్చుకుని మా ఆర్థిక పునాదుల్ని పటిష్టం చేసుకొంటాం”. ఒక క్షణం ఆగి, అందరిని పరికిస్తూ, “మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన, మీ అందరికీ ఇవే మా ధన్యవాదాలు." అంటూ రెండు చేతులు పైకెత్తి దండాలు పెట్టాడు. తదనంతరం జరిగిన భారీ విందుతో సమావేశం విజయవంతంగా ముగిసింది.
💐💐💐💐
విలేకరుల సమావేశం జరుగుతోంది. సాదాసీదాగా వున్నాయి ఆ కార్యక్రమ ఏర్పాట్లు. కార్యక్రమ నిర్వాహకులతో ఇష్టాగోష్టి నడుస్తోంది.
"కరోనా వ్యాధి నివారణకు మీరు, మందు ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. నిజమేనా?" అడిగాడు ఒక ప్రముఖ టీవీ చానల్ విలేఖరి. "నేనిస్తున్న ఆయుర్వేద మందు, కరోనా వ్యాధి నివారణకు కాదు, నిరోధక శక్తిని పెంచడానికి. ఐనా, కరోనా వైరస్ ప్రభావం గణనీయంగా తగ్గుముఖం పడుతున్నట్లు, మా మందు వాడిన రోగులు త్వరగా కోలుకొంటున్నట్లు తెలుస్తోంది." ఆ విలేఖరి ప్రశ్నకు శాంతంగా జవాబు చెప్పాడు ఆ ఆయుర్వేద వైద్యుడు పరంతప.
"కానీ మీ మందుకి విపరీతమైన ప్రచారం జరుగుతోంది. నిన్నటిదాకా ఈ గ్రామం పేరు కూడా వినని వాళ్లు, ఈరోజు రెక్కలు కట్టుకుని ఇక్కడ వ్రాలిపోతున్నారు." ఆందోళనగా అడిగాడు ఒక విలేఖరి. అందుకు సమాధానంగా, "ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మా మందుని గుర్తించింది. మందు తీసుకున్న రోగులు, త్వరిత గతిని సంపూర్ణ ఆరోగ్యం పొందడం, అందరు గమనిస్తున్నారు" అన్నాడు పరంతప. వెంటనే మరో విలేఖరి, " మీ మందు నిజంగా సంజీవనిలా పనిచేస్తోంది కదా! మందు కోసం డబ్బులు ఎంత వసూలు చేస్తున్నారు? ఎన్ని డోసులు వేసుకోవాలి? మీరు కనిపెట్టిన మందు మీద మేధోసంపత్తి హక్కులు కోసం ప్రయత్నాలు చేస్తున్నారా?" అని అడిగాడు. అందుకు ఆ వైద్యుడు ఇలా చెప్పాడు." దయ మరియు జాలియే వైద్య ధర్మం. డబ్బులు, రోగం, మందు వేర్వేరు విషయాలు కావు, వైద్యంలో భాగమే. మందు ఇస్తున్న వాడే, నారాయణ స్వరూపుడు కాడు... మందు కోసం వచ్చిన వారందరూ నారాయణ స్వరూపులే. కాబట్టి నా దృష్టిలో ఇద్దరు లేరు. రెండు రకాల వాళ్ళు లేరు. రోగులు దయనీయ పరిస్థితులను సొమ్ము చేసుకోవాలని ఏ వైద్య శాస్త్రం ఉపదేశించదు. మందుల తయారీ కోసం స్వచ్ఛందంగా ఆర్ధిక సహకారం చేస్తున్న దైవ స్వరూపుల తోడ్పపాటు మరచిపోలేనుది. అందుకే మందు ఉచితం. మందు మీద మేధోసంపత్తి హక్కులు భగవంతుడికి చెందుతాయి. ప్రకృతి ప్రసాదించిన వన సంపదతోనే మందు తయారు చేస్తాము." అది విని మరో విలేఖరి,"మీ సేవాభావం అభినందనీయం. మాధవ సేవయే మానవ సేవ…" వెంటనే ఆ వైద్యుడు, ఆ విలేఖరి కేసి నవ్వుతూ చూస్తూ," మిత్రమా! మీరు చెప్పినట్లుగా, కేవలం మానవ సేవయే మాధవ సేవ, ప్రార్ధించే పెదవుల కన్నా, పనులు చేసే చేతులు మిన్న లాంటి సందేశాలను కాదు మన కర్మభూమి చెప్పింది. అద్వేష్టా సర్వ భూతానాం, మైత్ర: కరుణ ఏవచ…. కేవలం మనుష్యుల మీదనే కాదు, సమస్త ప్రాణుల పట్ల ద్వేష భావన లేకుండా స్నేహా పూరితంగా వ్యవహరించాలి.ఆ ఎత్తుకి ఎదగ గలగాలి. ఆ సమ దర్శనమే భారతీయత. అదే మన ఆత్మ . ఆ దిశగా మనం ప్రయత్నిద్దాం. నమస్కారం." అంటూ సర్వ భూత హితాభిలాషి, విద్యా వినయ సంపన్నుడైన ఆ భిషక్కు, అమృత కలశ హస్త ధన్వంతరిలా, మందు పంపిణీ చేయడానికి ముందుకు నడిచాడు.
💐💐💐💐