సుబ్బారావుకు బాగా నీరసంగా ఉంది. ఉండదూ మరి. ప్రొద్దున్నే అయిదింటికి లేచి, వంట చేసి, పిల్లాడిని స్కూలుకు తయారు చేసి, వాడికి లంచ్ బాక్సు తయారు చేసి, ఏడున్నరకల్లా ఇంట్లోంచి బయటపడాలి. పది నిముషాలు బ్రిస్క్ వాకింగ్ చేసి, ముఖానికి పూసుకున్న పౌడరంతా చిల్లిపడ్డ పాల పొట్లంలా కారుతుంటే ఎ.సి. బస్సు రాగానే రగ్బీ ఆడి సీటు సంపాదించాలి. ఎనిమిది ఇరవై అయిదుకు మొబైల్ ఫోనులో పెట్టిన అలారం మ్రోగేంతవరకూ శీతవాయువులు పీల్చుకుంటూ నిద్రిస్తాడు. ఎనిమిదిన్నరకు బస్సు దిగి మూడు అంతస్థులు, అంటే డెభ్భైరెండు మెట్లెక్కి ఆఫీసుకెళ్ళి, బాసుగాడితో రోజంతా తిట్లు తింటూ పనిచేయాలి. మధ్యాహ్నం భోజనానికి తెచ్చుకున్న స్వయంపాకంలో తోటి ఉద్యోగులు కొంచెం కొసరి, “మీ ఆవిడ వంట అద్భుతం“ అని మెచ్చుకుంటుంటే, వాళ్ళ పొగడ్తలకు నిజమైన హక్కుదారుడని తనేనని కూడా చెప్పుకోలేని పరిస్థితిలో మిగిలింది తిని భోజనం అయిందనిపించి మళ్ళీ బాసుముందుకు బలిపశువులా వెళ్ళి మెడ చూపిస్తాడు. ఆఫీసుకు పావుగంట ముందు వచ్చాను కాబట్టి సమయానికి బయలుదేరవచ్చు అన్న లాజిక్కుతో రోజూ అయిదుగంటలకే బయటపడతాడు. కానీ, బాసుకు మాత్రమే తెలుసు, అయిదు తరువాత కూడా "ఇంకాస్సేపుండి తిట్లు తినరాదూ" అంటే తిరుగుబాటు జరుగుతుందని. అందుకే రోజూవారి సంతకం పెట్టి ఇంటికి వెళుతున్న రౌడీ షీటరును చూసి జాలిపడే రైటరులా "ఇంకెన్నాళ్ళు ఇలా అయిదింటికి వెళ్ళడం? ఇలా అయితే నీకు నేనెలా ప్రమోషన్ రికమెండ్ చేసేది?" అని పంపుతాడు. ప్రమోషన్ కూడా అడక్కుండా రోజూ తిట్లు తింటూ పనిచేసే సుబ్బారావులాటి ఊద్యోగి దొరకడం తన అదృష్టంగా భావిస్తాడు ఆ బాసుగారు. అయిదు ఇరవైకి బస్సెక్కి మళ్ళీ కునుకుతీస్తూ ఇంటికి చేరుకుని రాత్రికి వంట చేయాలి.
గానుగెద్దులా తయారైన తన జీవితం గురించి అతడు బాధపడని రోజు లేదు. బాధపడతాడు, బాధెక్కువైతే రెండు పెగ్గులేసి మర్చిపోడానికి ప్రయత్నిస్తాడే తప్ప, సుబ్బారావు తన కష్టాలకు ఇంకెవ్వరినీ నిందించడు. ఏమైనా అంటే, స్వయంకృతాపరాధమంటాడు.
దేవిక, అదే సుబ్బారావు భార్య, చాలా అందంగా ఉంటుంది. మన సుబ్బు కూడా బానే ఉంటాడుగాని, దేవిక మాత్రం మేకప్పేసిన సినిమా హీరోయినులా ఉంటుంది. స్నేహితుడి పెళ్ళిలో ఆమెను చూశాడు. మాట వరసకి సుబ్బారావు చెల్లెలు "ఆ అమ్మాయి నీ పక్కన చాలా బాగుంటుంద"న్నది. అంతే, మనోడు ఆ పిల్లనే చేసుకుంటానని ఇంట్లో గొడవ చేశాడు. వీడు ఎవరిని చేసుకున్నా నాకు పోయేదేముందని, దేవిక వాళ్ళతో సంబంధం మాట్లాడాడు సుబ్బారావు తండ్రి. దేవికనే చేసుకోవాలని సుబ్బారావు ఎంత ధృడంగా నిశ్చయించుకుని ఉన్నాడో, అంతే ధృడంగా తన వైవాహిక జీవితాన్ని దేవిక కూడా ఊహించుకుంది. ఒకేళ పెళ్ళైతే కాబోయే మామగారని కూడా చూడకుండా, తన డిమాండ్లను ఆయన ముందుంచింది.
"నేను వంట చేయను. అంటే చేయడం కూడా రాదనుకోండి" తెల్లబోయిన ఆయన ముఖంలోకి మళ్ళీ రంగులు తీసుకు రావడానికన్నట్లుగా "నాకు వంట నేర్చుకోవాలని కూడా లేదు". ఏడురంగులు చూపిస్తున్న దూరదర్శన్ ముందు కూర్చున గ్రుడ్డివాడిలా ఆయన మౌనంగా ఉండిపోయాడు. "నేను ఇంట్లో పని కూడా చేయను. అంటే, ఏపనీ చేయను. ఎప్పుడైనా నాకు మూడొస్తే ఒక గ్లాసు మంచినీళ్ళు మాత్రం ఫిల్టరులో పట్టి మీ అబ్బాయికి ఇస్తాను". సుబ్బారావు తండ్రి ఎత్తిన గ్లాసు దించలేదు. కానీ, ఆయన గొంతు పొడారిపోయింది. దేవిక మాత్రం ఆయన్ని పట్టించుకోకుండా స్త్రీ సహజమైన సిగ్గుతో తల వంచుకుని "ఖచ్చితంగా వేరే కాపురమే ఉండాలి". "బ్రతికించావు తల్లీ" మనసులోనే అనుకున్నాడాయన.
"జీతం మొత్తం నా కంట్రోల్ లోనే ఉండాలి. ఇంకా, పెళ్ళయిన మూడేళ్ళ వరకూ పిల్లలు వద్దు. ఒక్కళ్ళు చాలు. అబ్బాయిగానీ, అమ్మాయిగానీ". ఆయన నిర్లిప్తంగా కళ్ళు మూసుకుని వింటున్నాడు "మీ పిల్లలు, మీ ఇష్టం. కంటే కనండి, లేకుంటే లేదు" ఆయన మనసులోనే నవ్వుకుంటున్నాడు దేవికతోనే పెళ్ళి జరిగితే సుబ్బారావు ఎలా ఉంటాడో ఊహించుకుంటూ.
ఆయన ఉన్నదున్నట్లు చెప్పినా ఆమె షరతులన్నింటికీ అంగీకరించి దేవికను పెళ్ళి చేసుకున్నాడు సుబ్బారావు. పెళ్ళికి ముందే పిండివంటలూ, టిఫిన్లతో సహా వంట నేర్చుకున్నాడు. పెళ్ళయిన తరువాత భార్యకు వండి పెడుతూ, ఆఫీసుకు వెళుతూ, తనను తానే ఒక అమర ప్రేమికుడిలా ఊహించుకుని మురిసిపోయేవాడు.
కానీ, పెళ్ళయిన పదేళ్ళ తరువాత అతనికి అప్పుడప్పుడూ తాను తప్పు చేశానని అనిపించేది. అంటే, అతనికి దేవికతో ఏవిధమైన కష్టమూ లేదు. పాపం, ఏది వండి పెడితే అది తినేది. అతనికి ఓపిక లేకున్నా, లేక ఆరోగ్యం బాగోలేకున్నా బయటినుంచి తెప్పించుకునేదే గాని నువ్వే వంట చేయాలని అతనిని బలవంతం చేయలేదు. కానీ, గత కొన్ని నెలలుగా అతనికి తన భార్య చేతి వంట తినాలని కోరిక గలిగింది. ఒకాదివారం దేవికతో అన్నాడు "నాకు ఒకసారి నీ చేతి వంట తినాలనుంది". అమృతం కోరుతున్న రాక్షసులను చూసి మోహిని నవ్వినట్లు నవ్వింది దేవిక "మీకీ మధ్య పరాచికాలెక్కువయ్యాయి" అంటూ. బుర్ర గోక్కున్నాడు సుబ్బు.
కానీ, దేవిక చేతి వంట తినాలన్న కోరిక మాత్రం అతనిలో రోజురోజుకీ పెరుగుతుంది. ఈ తీరని కోరికతో అతని శరీరం దహించుకుపోయి, నిద్రలేమి ఎక్కువైంది. అలా ఒక నిద్రలేని రాత్రి, హాల్లో కూర్చుని తన ల్యాప్ టాపులో విచిత్ర విజ్ఞాన ఆవిష్రరణల గురించి చదువుతుంటే, అతనికి తన సమస్యకు పరిష్కారం దొరికినట్లనిపించింది. "బ్రెయిన్ కంట్రోల్ త్రూ మ్యూజికల్ వేవ్ హిప్నాటిజమ్" అనే పరిశోధనా వ్యాసం. ఎవరో బెల్జియం శాస్త్రవేత్త తన పరిశోధనలను బాగా వివరించాడు. ఈ విషయంలో రెండో ప్రపంచ యుద్ధకాలంలో నాజీలు యూదులపై ప్రయోగాలు కూడా చేశారట. కానీ, ఆ పరిశోధనల తాలూకు దస్తావేజులన్నీ యుద్ధంలో నాశనమైపోయాయి. సుబ్బారావు వెంటనే బెల్జియం శాస్త్రవేత్తకు ఈమెయిల్ వ్రాసి తను కూడా అదే సబ్జెక్టులో అమెచ్యూర్ పరిశోధనలు చేస్తున్నానని తెలిపాడు. బెల్జియం బ్రెయిన్ సైంటిస్టు కూడా తన పరిశోధనను, తాను జీవించి ఉండగానే ఎవరికో ఒకిరికి ఉపయోగపడుతుందని చాలా ఆనందపడ్డాడు. కానీ, బ్రెయిన్ పై రీసెర్చ్ చేసిచేసి అతనిబ్రెయిన్ కాస్తో కూస్తో పనిచేయడం వల్ల, దీపమున్నంతలో ఇల్లు చక్కబెట్టుకోవాలన్న సామెతకు సమమైన బెల్జియం సామెతను అనుసరించాడు.
మూడు నెలలో ఎనిమిది ఆన్ లైను మీటింగుల తరువాత సుబ్బారావుకు తన కోరిక తీర్చుకునేందుకు కావలసిన పరికరాలు వచ్చాయి. అంటే, సాఫ్ట్ వేర్ డౌన్ లోడ్ లింకు వచ్చింది. బెల్జియం సైంటిస్టు రెండు లక్షలు సంపాదించి, ఇక తనను ఊరికే డిస్టర్బ్ చేయవద్దని సుబ్బుకు చెప్పాడు.
తమ పడకగదిలో మంచానికి తలదగ్గర ఇరువైపులా, నాలుగు మూలలలో స్పీకర్లు ఫిక్స్ చేశాడు సుబ్బారావు. అమ్మాజానులో ఒక మీడియా ప్లేయర్ కొన్నాడు. దానికి ఈ స్పీకర్లన్నీ కనెక్ట్ చేసి, ప్రతిరోజూ తాను ఆఫీసుకు వెళ్ళే ముందు ఆ మ్యూజిక్ లూపులో సాయంత్రం వరకూ ప్లే చేసేట్టు సెట్ చేసి వెళ్ళేవాడు. అలా మూడు నెలలు గడిచిన తరువాత, ఇక తన కోరిక తీరే రోజు వచ్చిందని నిర్ణయించాడు. ఏం చూసి నిర్ణయించాడు అని అడగొద్దు. బెల్లీ సైంటిస్టు మూడు నెలలలో ఫలితాలు కనిపిస్తాయని చెప్పాడు. అందుకని మూడు నెలలు గడవగానే తన ప్రయోగం మొదలెట్టాడు సుబ్బారావు.
* * *
ఆరోజూ సాయంత్రం బస్సు ఎప్పటిలానే కిక్కిరిసి ఉంది. ఎ.సి.లో కూడా ఒకరి శరీరం నుండి వెలువడే దుర్వాసన ఇంకొకరి ముక్కులు పగలగొడుతుంది. అందువల్ల రోజూ నిద్రనే ఒక యోగంలా సాధన చేసే కొంతమంది తప్ప మిగతావారందరూ మేలుకునే ఉన్నారు. రోజువారీ లెక్క ప్రకారం సుబ్బారావు కూడా మురుగుకాలవలోని దోమపిల్లలా ప్రశాంతంగా నిద్రపోవాలి. కానీ, ఈరోజు నిద్ర పోలేదు. కాదు, నిద్ర రాలేదు. బస్సులోనే కాదు, రాత్రి ఇంట్లో కూడా నిద్ర రాదు. అసలు అతను గడచిన రాత్రి కూడా సరిగ్గా నిద్రపోలేదు. కళ్ళు మూసేటప్పటికి మూడయ్యింది. మళ్ళీ తెల్లారి సమయానికి లేచి ఇంటి పని, తరువాత ఆఫీసు పని. కానీ అతనికి ఏమాత్రం అలసట లేదు. తన కోరిక తీరే రోజు దగ్గరబడుతోంది. ఈ రోజు శుక్రవారం. ఇక తను ఆగాల్సింది శనాదివారాలు మాత్రమే. కేవలం రెండు రోజులు. సోమవారం తన భార్య తనకోసం వంట చేస్తుంది. ఆ రోజు పులిహోర, చక్కెరపొంగలి చేయించి ఆఫీసుకు తీసుకెళ్ళాలి. రోజుకన్నా రెండింతలు. అసలు రెండు క్యారియర్లు తీసుకెళ్ళాలి. అది తిని, తన సహోద్యోగులు తన భార్య వంటను మెచ్చుకుంటుంటే, “ఔను, మా ఆవిడ చేతి వంట అమృతం“ అని తను సత్యవాక్యాలు పలకాలి.
ఆరాత్రి నిద్రపోతున్న భార్య పక్కన పడుకుని కిటికీలోంచి వస్తున్న వెన్నెలను చూస్తూ మేల్కుండిపోయాడు. దాదాపు ఒకటిన్నరప్పుడు ఇక లాభం లేదని నిశ్చయించుకుని మంచం మీంచి లేచాడు. అల్మైరాలో పుస్తకాల వెనుక దాచిన షివాస్ రీగల్ బాటిల్ తీసుకుని హాల్లోకి వెళ్ళాడు. ఫ్రిజ్ లోంచి ఐస్ క్యూబ్స్ కూడా తీసుకెళ్ళాడు. వంటింట్లో ఉన్న డబ్బాలోంచి నాలుగు జంతికలు కూడా. అసలు తన పథకం గురించి తనకే ముచ్చటేస్తుంది.
అప్పుడెప్పుడో చిన్నప్పుడు బ్లాక్-అండ్-వైట్ టీవీలో చూసిన విఠలాచార్య జానపదాలు గుర్తొచ్చాయి. వాటిలో ఎస్.వి.రంగారావూ, రాజనాలా మాంత్రికుల వేషాలలో తమ మంత్రదండాలను తిప్పి అంజలీదేవినీ, కాంచనమాలనూ వశం చేసుకోడం గుర్తొచ్చింది. తనేమీ మాంత్రికుడు కాదు. తను ఒక శాస్త్రవేత్త. తను చేస్తున్నదీ వశీకరణమే. కాకుంటే ఏ మాయలూ, మంత్రాలూ లేవు. తన ప్రయోగం విజ్ఞానశాస్త్ర చరిత్రలో ఒక నూతన అధ్యాయం. న్యూటన్, ఐన్ స్టీనుల తరువాత ప్రపంచమంతా తన గురించే చెప్పుకుంటుంది. అసలు పెళ్ళయిన మగవాళ్ళందరికీ తనే భగవంతుడౌతాడు. అతనికి ఎక్స్-మెన్ సినిమాలోని ఛార్లెస్ జేవియర్ పాత్ర గుర్తొచ్చింది. ఛార్లెస్ ఒక కాల్పనిక పాత్ర మాత్రమే. కానీ, తాను ఆ పాత్ర వెనుకనున్న భావాలు మూర్తీభవించిన నిజం. ఎదురుగా స్విచాఫ్ చేసి ఉన్న టీవీ స్క్రీనులో తన ప్రతిబింబం కనిపించింది. బ్రహ్మానందం స్టైల్లో “ఏంటి మాస్టారూ, ఎక్కడికో పోయినట్లున్నారు“ అని తన ప్రతిబింబం తనతో అన్నట్లుగా ఊహించుకున్నాడు. తన ఆలోచనలపై తనకే సిగ్గేసింది.
శనాదివారాలు భార్యపై ప్రేమ ఒలకబోసేశాడు సుబ్బారావు. ఉదయం టిఫినుకి ఒకరోజు గారెలు చేస్తే, ఇంకోరోజు పూరీలు చేశాడు. శనివారం మధ్యాహ్నం భోజనానికి ఒకరోజు గుత్తి వంకాయ కూర, చింత చిగురు పప్పు వండాడు. ఆదివారమైతే ఏకంగా బిరియానీ చేశాడు. శనివారం సాయంత్రం షాపింగుకు తీసుకెళ్ళి దేవికకు పదివేలు పెట్టి కొత్త డ్రస్ కొన్నాడు. ఆదివారం సాయంత్రం మల్టీప్లెక్సులో సినిమా.
దేవికకు ఏమీ అర్థం కాలేదు. ఇంత సడెనుగా తన మొగుడు తనపై ఇంత ప్రేమను ఎందుకు ఒలకబోస్తున్నట్లు? కానీ, దీంట్లో తనకొచ్చిన బాధేం ఉందని తను కలవరపడాలి? దేవికకు సూబ్బారావంటే తెగ ఇష్టం. ఇలాటి మొగుడు ప్రపంచమంతా కంచుకాగాడా పెట్టి వెతికినా కూడా దొరకడని ఆమె అభిప్రాయం. ఒక్క దేవికే గాదు, దేవిక తల్లి కూడా. తనకు లేని అదృష్టం దేవికకు దొరికినందుకు ఆమె చాలా సంతోషిస్తుంది. “మా అల్లుడు బంగారం“, “ఎన్ని జన్మల్లో నోములు నోస్తే గాని మా అల్లుడు లాంటి అల్లుడు దొరకడు“, “మా అమ్మాయి ప్రపంచంలోని ఆడవాళ్ళందరికన్నా అదృష్టవంతురాలు“ తమ ఇంటికి విచ్చేసిన అమ్మలక్కలందరికీ మైసూరుపాకులూ, పునుగులతో బాటుగా ఇలాటి కొటేషన్సు తినిపించేది. అవడానికి తన కూతురే ఐనా, అతనికి దేవిక అభిప్రాయాలపై ఏమాత్రం ఇష్టం, గౌరవం, లేదు. “ఇదో పొగరు పట్టింది, వాడో వాజమ్మ“ అని అనుకుంటాడు. కానీ, దేవిక మాత్రం సుబ్బారావును బాగా గౌరవించేది. నలుగురిలో అతని గౌరవానికి ఏమాత్రం భంగం వాటిల్లకుండా చూసుకునేది. ఇంకా, నలుగురూ చూస్తూ ఉండగా పాదాభివందనం చేయడం, కాళ్ళు కడిగి నీళ్ళు నెత్తిన చల్లుకోవడం, పదినిముషాలకోసారి తాళిని కళ్ళకద్దుకోవడం చేసేది. చూసేవాళ్ళు “ఆహా, ఎంతటి పతిభక్తి“ అనుకుంటుంటే సుబ్బారావు ఛాతీ యాభైయ్యారంగుళాలయ్యేది. దేవిక మాత్రం ఇంటికి రాగానే “ఏమండీ, కాసిని పకోడీలు వేయించరూ“ అని గోముగా అడిగేది. లోపలి భాగోతం తెలిసిన వాళ్ళు“వీడి నెత్తినెక్కి తాండవమాడుతుంది“ అనుకుంటే, తెలీని అమాయకులు “మొగుడుని వశీకరణం చేసుకుని తన కొంగుకు ముడేసుకుంది“ అనుకుంటారు. ఎవరేమనుకున్నా దేవికకు ఏమీ పట్టదు. కాలు కదుపకుండా అన్నీ జరుగుతుంటే, బాధపడడం అవివేకం. అందుకే, సుబ్బారావు డబ్బులతో అతనికి ఆరునెలలకొకసారి కొత్త డ్రస్సు కొంటుంది దేవిక.
అలాటి దేవికకు కూడా, గత రెండు రోజులలో సుబ్బారావు ప్రవర్తన విస్మయం కలిగించింది. “నాకింత చేసే నా భర్తకు నేనేమీ చేయలేకపోయానే భగవంతుడా“ అని తలచుకుంటూ అయిదు నిముషాలు దేముడి ముందు మౌనంగా నిలబడాలని అనుకుంది. సినిమా చూసి ఇంటికి వస్తూ, “ఏదైనా రెస్టారెంటులో తిందామా“ అన్నాడు సుబ్బారావు. వెనుక సీట్లో నిదురిస్తున్న కొడుకును చూసి “వద్దులేండి, బాబు నిద్రపోయాడు. ఇంటికే వెళదాం“. ఇల్లు చేరగానే బాబీగాడిని భుజాన వేసుకుని వస్తున్న భర్త అడుగులో అడుగులేస్తూ, “లేటయ్యింది. అన్నం వండి, చారు పెట్టండి చాలు. మళ్ళీ మీకు రేపు ఆఫీసు ఉంది“ భర్త మీద జాలి పడింది దేవిక.
చారన్నం తింటూ “నిన్నొకటి అడిగేదా“ విషయం కదిపాడు సుబ్బారావు. “అదీ విషయం. ఈయనకు ఏదో కావాలి. అందుకనే ఈ రెండురోజులుగా కాకా పడుతున్నాడు“ అనుకుంది దేవిక. అయినా ఎప్పుడూ, ఏదీ అడగని మొగుడు ఏదో కావాలంటే, ఎలా కాదనగలదు? “చెప్పండి“, అన్నది దేవిక పెరుగన్నంలోకి నిమ్మకాయ నంచుకుంటూ.
“ఏం లేదు. నాకొకసారి నీ చేతి వంట తినాలనుంది“. కుండ బద్దలైపోయింది.
ఒక్క నిముషం మొగుడివైపు జాలిగా చూసింది దేవిక. "వినాశకాలే విపరీత బుద్ధి" అని మనసులో అనుకుని ముక్తసరిగా "సరేనండి" అంది.
"అంటే, రేపు లంచ్ నువ్వు చేస్తావా"? నిప్పుతో చెలగాటమాడుతున్న మిణుగురుపురుగులా కనిపించాడు సుబ్బారావు ఆమెకి. అలాగేనన్నట్లు తలూపింది.
"టిఫిన్ బయట చేస్తానులే" ఆమెకు పని తగ్గించడం మొదలెట్టాడు సుబ్బారావు. "ఊరికే కొంచెం పులిహోర, కొంచెం చక్కెరపొంగలి చేయి".
"అమంగళం ప్రతిహతమగు గాక" అనుకుంటూ కళ్ళు మూసుకుంది దేవిక.
"కొంచెం ఎక్కువ చేయి. మా కొలీగ్సుకు కూడా తినిపిస్తా". సుబ్బారావు కష్టాలు పంచుకునే అతని కొలీగ్సుపై ఆమెకు ఎంతో గౌరవభావం ఏర్పడింది.
ఆరాత్రి అతనికి రోజూలాగే నిద్ర పట్టలేదు. కళ్ళుమూసుకుని పడుకున్నాడు. దేవిక మేల్కుని ఉండడం అతనికి తెలుస్తూంది. పదకొండు కాగానే భార్య లేచి హాల్లోకి వెళ్ళడం చూశాడు. అయిదు నిముషాలు గడిచాక మెల్లగా పిల్లిలా అడుగులేస్తూ హాలుదగ్గరకెళ్ళాడు. యూట్యూబులో పులిహోర చేసే విధానం చూస్తుంది దేవిక. భర్తకు నిద్రాభంగం కలుగకూడదని హెడ్ ఫోన్లు వాడుతుంది. ఎంతో గర్వంగా ఫీలయ్యాడు సుబ్బారావు. తన కోరిక తీర్చడం కోసం పులిహోర చేసే విధానం నేర్చుకుంటుంది. అతనికి చాలా సంతృప్తిగా ఉంది. అరగంట తరువాత దేవిక వచ్చి నిద్రపోయింది.
కానీ, సుబ్బారావుకే నిద్ర రాలేదు. అసలు అతనికున్న ఎక్సైట్ మెంటుకి లేచి పరిగెత్తుతూ ఔటరు రింగు రోడ్డులో పది రౌండ్లు వేయాలని ఉంది. కానీ అతి కష్టం మీద తమాయించుకుని పడుకున్నాడు. అతనికి ఘంటసాల, బాలు పాడిన పాట "ఎన్నాళ్ళో వేచిన ఉదయం, ఈనాడే ఎదురౌతుంటే" పాట గుర్తొచ్చింది. ఎలాగో కష్టపడి రెండు దాటిం తర్వాత రెప్ప వాల్చాడు. వెంటనే ఒక కల. ఒక రంగుల కల. హిమాలయాలలో గోచి పెట్టుకుని సుబ్బారావు తపస్సు చేసుకుంటున్నాడు. తిండీ, తిప్పలు లేవు. నీళ్ళూ, నిప్పులు లేవు. కేవలం గాలి భోంచేస్తున్నాడు. అతని తపస్సుకు మెచ్చి అన్నపూర్ణమ్మ ప్రత్యక్షమయ్యింది. "భక్తా, సుబ్బా, ఏం కావాలి నాయనా".
"మాతా, అన్నపూర్ణేశ్వరీ. కొంచెం పులిహోర, చక్కెరపొంగలి పెట్టు తల్లీ".
"ఓస్, ఇంతేనా" కుడి చేయి గాల్లో తిప్పి మాయమయ్యింది అమ్మవారు.
అంతే, వెంటనే హోరున కొండగాలులు. హిమపాతాలు. ప్రక్కనే ఉన్న మంచుకొండలపై ఒక్కసారిగా జలపాతాలు. జలపాతపు కింద ఒక తీయని జలాశయం - అదే, సరస్సు. దానిపై దట్టంగా తామరపూలు. ఆ పూలు పక్కకు నెట్టుకుంటూ ఒక అప్సరస పైకి లేచింది. మంచుకన్నా తెల్లటి చీర. పసిడి వర్ణం. పట్టుకన్నా మెత్తటి ఒళ్ళు. కలువల్లాంటి కళ్ళు. రెండు చేతులలో రెండు బంగారు గిన్నెలు. సుబ్బారావు దగ్గరకొచ్చింది. వెంటనే అతని ముందొక అరిటాకు. అరిటాకులో ఆమె పులిహోర, చక్కెరపొంగలి వడ్డించింది. అతను తింటున్నాడు. అమృతం తింటున్నట్లుంది. ఆమె విసురుతుంది. అప్పుడు గుర్తుపట్టాడు ఆ అప్సరసను. తనే దేవిక. నిద్రలోనే నవ్వుకుంటూ అటు తిరిగి పడుకున్నాడు సుబ్బారావు.
తెల్లారింది. ఎప్పటిలానే ముందే లేచాడు సుబ్బారావు. మొదటిసారిగా అతనితోబాటే లేచింది దేవిక. సుబ్బారావే కాఫీ పెట్టాడు. సువాసనలు వెదజల్లే కాఫీ త్రాగి స్నానం చేసి దేవుడికి దీపం పెట్టి, వంటగదిలోకెళ్ళింది దేవిక. ఏడున్నరకల్లా అతని డబుల్ లంచ్ బాక్స్ రెడీ చేసి ఇచ్చింది.
పంచకళ్యాణి పై ప్రియురాలితో పయనిస్తున్న రాజకుమారుడిలా లంచ్ బాక్సును తీసుకుని ఆఫీసుకెళ్లాడు సుబ్బారావు. ఆరోజు క్యాంటీనులో గుండ్రాళ్ళలాటి ఇడ్లీలు తిన్నాడు. బాస్ తిడుతుంటే, రోజూ మౌనంగా ఉండే సుబ్బారావు ఆరోజు చిరునవ్వులు వెదచల్లాడు. అలాటి అమాయకపు ముఖం చూస్తూ తిట్టడానికి మనసురాక, బాస్ ఆఫీస్ వదిలి బయటకెళ్ళిపోయాడు.
చివరికి లంచ్ టైమయ్యింది. ఒలింపిక్ గోల్డ్ మెడల్ ఇంటికి తెచ్చిన కొడుకులా ఫోజు కొడుతూ డైనింగ్ ఏరియాకు వెళ్ళాడు సుబ్బారావు. డబుల్ క్యారియర్ చూడగానే అతని కొలీగుల ముక్కుల్లోంచి చొంగ కారసాగింది. నవ్వుతూ అందరికీ పులిహోర, చక్కెరపొంగలి వడ్డించాడు సుబ్బారావు.
నవ్వుతూ మొదటి ముద్ద నోట్లో పెట్టుకున్న శ్యామసుందరం "ఖ్ఖాఖ్ఖా" అంటూ విచిత్ర శబ్దాలు చేస్తూ నోట్లో ఉన్న పులిహోరతో వాష్ బేసిన్ వైపు పరిగెత్తాడు. నీలకంఠమైతే "యాఖ్, థూ" అంటూ అక్కడే ఊశాడు. పద్మావతి మాత్రం ముందు జాగ్రత్త చర్యగా కేవలం రెండు పలుకులు నోట్లోకి వేసుకుంది. నాలుకకు పులిహోర రుచి తట్టగానే వెంటనే ఆ రెండు పలుకులూ తన అరచేతిలో వేసుకుని, సుబ్బారావు వంక కోపంగా చూస్తూ లేచి వెళ్ళింది - చేతులు కడుక్కోడానికి. మిగతా నలుగురూ కూడా ఇంచుమించు ఇలాటి రియాక్షన్లే ఇచ్చారు. పులిహోరలో పులుపుందో లేదో తెలీలేదు గాని, ఉప్పు మాత్రం దట్టంగా ఉంది. నాలుగు ముద్దలు తింటే ఏనుగైనా సరే వాంతి చేసుకోవాల్సిందే.
ఆముదం తాగిన ముఖం పెట్టి నవ్వడానికి ప్రయత్నించాడు సుబ్బారావు. "కొంచెం ఉప్పెక్కువయినట్లుంది".
"కొంచెం"? పద్మావతి గొంతులో కోపం.
నోర్మూసుకుని పాయసాన్ని చూశాడు సుబ్బారావు. ముందు అతను గమనించలేదు కాబట్టి తెలియలేదు గాని, విరిగిన పాలతో చేసినట్లుంది చక్కెరపొంగలి. ఎందుకైనా మంచిదని ఒక మెతుకు తీసి నోట్లో వేసుకున్నాడు. పుల్లగా ఉంది. ఏం మాట్లాడకుండా లేచి తన క్యారియరు పట్టుకుని బయటకెళ్ళిపోయాడు సుబ్బారావు.
నేరుగా బాస్ దగ్గరకు వెళ్ళి ఒంట్లో నలతగా ఉంది, హాఫ్ డే లీవు తీసుకుంటున్నానని సమాచారమిచ్చి అతను సమాధానమిచ్చేలోపల అక్కడినుంచి వెళ్ళిపోయాడు. ఎప్పుడూ అనుమతి అడిగే సుబ్బారావు ఇలా డైనమిక్ గా ఇన్ఫార్మ్ చేసి వెళ్ళినందుకు బాసుకు కోపమొచ్చింది. కానీ, ఈ లక్షణాన్ని అతను కూడా "పాపం, నిజంగానే బాగోలేదులావుంది" అనుకుని సర్దుకున్నాడు.
లంచ్ బాక్స్ ఆఫీసులోనే వదిలేసి బయటికొచ్చాడు సుబ్బారావు. ఆటో పిలిచి దగ్గరలో ఉన్న బారులోకెళ్ళి కూర్చున్నాడు. తన ప్రయోగం ఇలా ఫెయిలయినందుకు అతనికి కోపంగా ఉంది. "ఉప్పటి పులిహోర, పుల్లటి చక్కెరపొంగలి". కావాలనే దేవిక ఇలా వంట చేసిందని అనిపించింది. ఇలా చేస్తే ఇంకెప్పుడూ తనని వంటచేయమని అడగనుగా. కానీ, హాఫ్ బాటిల్ త్రాగాక, అతనికి అనిపించింది. వశీకరణం చేసి మనిషి మనసు మార్చవచ్చుగాని, తెలియనివి నేర్పించలేము కదాయని. అసలు ఇలాటి గొంతెమ్మ కోరికలు కోరుకున్నందుకు తనపైన తనకే కోపం వచ్చింది. తానే ఇలా ఉంటే, ప్రస్తుతం దేవిక ఎలా ఉందో? దేవికపై బాధతో ఇంకొక హాఫ్ బాటిల్ త్రాగి, అక్కడే వాంతి చేసుకుని ఆటోలో ఇంటికి చేరుకునేప్పటికి పదిన్నరయింది.
బాబీగాడు పడుకున్నాడులావుంది. దేవిక మాత్రం మేల్కునే ఉంది. అతన్ని చూడగానే ఆమెకు కోపమొచ్చింది, ఇంతలేటయినా బయటున్నందుకు, ఫోన్ స్విచాఫ్ చేసినందుకు. "ఎక్కడికెళ్ళారింత సేపు ? నాకెంత కంగారుగా ఉందో తెలుసా?"
కళ్ళెర్రబడి, జుట్టు రేగి ఉన్న అతని అవస్థను చూడగానే జాలేసింది. ఇది ఖచ్చితంగా తన పాకశాస్త్ర ప్రావీణ్య మహాత్యమేనని గుర్తించింది. ఒక్కరోజు వంటతో ఎలాటి వాడిని ఎలా చేశాను అని అనుకుంది.
మెల్లగా అతనిని లోపలికి తీసుకెళ్ళి పడుకోబెట్టింది. చాలారోజులుగా నిద్రలేమితో బాధపడుతున్న సుబ్బారావు చివరికి ప్రశాంతంగా నిద్రపోయాడు. లేచేప్పటికి పదకొండు. తల పగిలిపోతుంది హాంగోవరుతో. మంచం మీద కూర్చుని ఏడుస్తుంది దేవిక. సుబ్బారావు లేవడం చూసి అతని దగ్గరకొచ్చి దగ్గరగా ముడుచుకుని పడుకుని ఏడవసాగింది. మెల్లగా తల నిమిరాడు సుబ్బారావు.
"ఊర్కో దేవీ" ఊరడించసాగాడు.
ఒక్క మాట కూడా అనకుండా తనను ఊరడిస్తున్న భర్తను చూసి దేవిక వెక్కిళ్ళు పెట్టసాగింది.
మెల్లగా ఆమెను జరిపి లేచాడు సుబ్బారావు. పళ్ళు తోముకుని, ముఖం కడుక్కున్నాడు. బాత్రూములోంచి బయటకు వచ్చేటప్పటికి చేతిలో కాఫీ కప్పుతో రెడీగా ఉంది దేవిక. రాక్షసామాత్యుడు చంద్రగుప్తునిపై ప్రయోగించిన విషకన్యలా కనిపించింది అతనికి.
"నేను చేస్తాగా" అన్నాడు సుబ్బారావు. ఆ కాఫీ రుచి చూడడానికి కూడా అతనికి ధైర్యం చాలలేదు.
బుంగమూతి పెట్టింది దేవిక. "పొద్దుటి నుంచి మూడు సార్లు నేను తాగాను. బానే ఉంది. త్రాగండి" బలవంతంగా అతని చేతిలో పెట్టింది. త్రాగి నిలదొక్కుకోవడం కష్టమౌతుందేమోనని సోఫాలో కూర్చున్నాడు సుబ్బారావు. బాబీగాడిని స్కూలుకు పంపలేదులావుంది. వాడు టీవీ చూస్తున్నాడు. తను కూడా ఒక కప్పు కాఫీ తెచ్చుకుని అతనిని ఆనుకుని కూర్చుంది దేవిక. అతను భయపడుతూ, మెల్లగా ఒక గుటకేస్తే కాఫీ ఎలా ఉందన్నట్లు కళ్ళెగరేసింది దేవిక. "ఫర్లేదు, బానే ఉంది". నిజంగానే కాఫీ బాగానే ఉంది. బ్రహ్మాండం కాదుగానీ, భయపడాల్సిన అవసరం లేదు.
"నిన్న జరిగిందానికి సారీ" అతన్నే చూస్తూ అంది దేవిక.
పర్లేదన్నట్లు తలూపాడు సుబ్బారావు. "అసలు నేను బాక్సులో పెట్టే ముందు రుచి చూడాల్సింది", తన సంజాయిషీ మొదలెట్టింది. "అంటే, ముందు పులిహోర రుచి చూశాను. ఉప్పెక్కువగా ఉంది. మా అమ్మకు ఫోన్ చేస్తే నిమ్మకాయరసం పోయమంది. కంగారులో చక్కెరపొంగలిలో నిమ్మకాయరసం పోసేశాను".
అతనికి నవ్వాగలేదు. "హమ్మయ్య, మీకు కోపం పోయింది" అతనికి దగ్గరగా జరిగింది దేవిక.
ఆరోజు నుంచి అతను వంట చేస్తుంటే దగ్గరుండి చూసి నేర్చుకుంది. ఆరునెలలు తిరుగకుండానే అతనికంటే బాగా వండటం మొదలెట్టింది - అంటే, పాపం ఆఫీసుకెళుతున్న మనిషితో మళ్ళీ వంట కూడా చేయించడమెందుకని. ఆ సంవత్సరం దీపావళికి అత్తమామలనూ, తలిదండ్రులనూ పిలిచింది దేవిక. వద్దని చెప్పలేక అయిష్టంగానే వచ్చారందరూ. కానీ, కోడలు వంటచేస్తుంటే ప్రశాంతంగా టీవీ చూస్తున్న అల్లుడిని చూస్తే దేవిక తండ్రికి ముచ్చటేసింది. దేవిక అత్తామామలైతే, తమ కోడలి వంటలను పొగడ్తలతో ముంచెత్తారు.
ఇప్పుడు కూడా సుబ్బారావు వంట చేస్తాడు. అప్పుడప్పుడూ. దేవికకు బోరు కొట్టినప్పుడు. దేవిక ఎంత బాగా వంట చేసినా, సుబ్బారావుకి మాత్రం ఆమెను పులిహోర, చక్కెరపొంగలి చేయమని అడగడానికి ధైర్యం చాలదు.