పొగరు - సరికొండ శ్రీనివాసరాజు

Pogaru

ఆ అడవికి రాజైన సింహం చాలా చక్కగా రాజ్యాన్ని పరిపాలిస్తూ అడవి జీవుల సమస్యల్ని పరిష్కరించేది. తప్పు చేసిన వాటిని కఠినంగా శిక్షించేది. అయితే దాని కుమారుని అతి గారాబంగా పెంచింది. ఫలితంగా యువ సింహం పొగరుగా ప్రవర్తిస్తూ అడవి జీవుల పట్ల అనుచితంగా ప్రవర్తించేది. ఎలుగుబంటిని పట్టుకొని "నల్లగా అసహ్యంగా ఉన్నావు. దూరంగా వెళ్ళు." అన్నది. ఆ ఎలుగుబంటి "రాజు కొడుకువు కాబట్టి ఏమీ అనలేక పోతున్నా. ఒళ్ళు జాగ్రత్త." అన్నది. యువ సింహం వెళ్ళి తన తండ్రితో ఆ ఎలుగుబంటి తన రూపాన్ని వికృతంగా వర్ణించి హేళన చేసిందని చెప్పింది. సింహం విచారణ కూడా లేకుండా ఆ ఎలుగుబంటిని అడవి నుంచి శాశ్వతంగా బహిష్కరించింది. మరోసారి యువ సింహం అడవిలో వెళ్తుండగా ఏనుగు కనిపించింది. "కొండలా లావుగా ఉన్నావు. కానీ నీకు బుర్ర లేదు. బండలా ఉన్న నీ ఆకారాన్ని చూసి మురిసిపోకు." అని హేళన చేసింది. "'మర్యాదగా మాట్లాడు. తొండంతో చుట్టేసి బండకేసి కొడతాను." అన్నది. ఏనుగు అలా అన్నదని యువ సింహం తన తండ్రికి చెప్పింది. సింహం ఏనుగును అడవి నుంచి బహిష్కరించింది. వనరాజు అత్యవసరంగా అడవీ జీవులన్నింటినీ పిలిపించింది. "నన్ను ఎంత గౌరవిస్తున్నారో నా కుమారుణ్ణి అంతే గౌరవించాలి. ఎవరైనా నా కుమారుణ్ణి హేళన చేసినా, వేధించినా వాళ్ళను కఠినంగా శిక్షించి, ఈ అడవి నుంచి శాశ్వతంగా బహిష్కరిస్తాను." అంది. యువ సింహం పిచ్చి పట్టిన దానిలా రెచ్చిపోతూ అడవి జీవులను రకరకాలుగా వేధిస్తుంది. భయానికి అవి ఏమీ అనడం లేదు. అన్ని జీవులు ఆ అడవికి మంత్రి అయిన చిరుతతో తమ సమస్యను చెప్పుకున్నాయి. రాజుతో మంత్రికి చనువు ఎక్కువ. "వనరాజా! నీ కుమారుణ్ణి వేధిస్తున్న కారణంగా చాలా జీవులను అడవి నుంచి బహిష్కరించారు. అడవి అంటే నీ కుమారుడు మాత్రమే కాదు కదా! చాలా అడవి జీవులు దుర్మార్గుల వేధింపులతో మానసికంగా కుంగి పోతున్నాయి. మరి వాటిని వేధిస్తున్న వారికి శిక్షలు ఏవి?" అని చిరుత ఏనుగును ప్రశ్నించింది. "నా పరిపాలనలో ఎవ్వరికీ ఏ సమస్యా లేదు కదా!" అన్నది సింహం. "మానవ చక్రవర్తులు అయితే మారు వేషాల్లో తిరుగుతూ ప్రజల కష్టసుఖాలను తెలుసుకుంటారు. మీరూ అలా చేయండి. తెలుస్తుంది." అన్నది చిరుత. సింహం అడవిలో సంచరిస్తూ అక్కడక్కడా దట్టమైన చెట్ల మాటున దాగి ఉండి పరిస్థితులను గమనిస్తుంది. అలా చాలా చోట్ల గమనిస్తుంది. ఒకరోజు చెట్ల మాటున పొంచి యుండగా యువ సింహం కనిపించింది. "గండు ఛీ!మల్లారా! నల్లగా అసహ్యంగా ఉన్నారు. ఇంత గొప్ప అడవిలో జీవించే అర్హత మీకు ఉందా? మర్యాదగా వేరే అడవిలోకి వెళ్ళండి." అన్నది. చెట్టు మీద ఉన్న రామచిలుక ఇలా అంది. "చీమలు శ్రమ జీవులు. శ్రమ జీవులే ఈ లోకానికి రాజులు. నీలా సోమరిగా తిరుగుతూ కనిపించిన జీవులనల్లా వేధించే వాటికి ఈ అడవిలో ఉండే అర్హత లేదు." అని. "ఉఫ్ అంటే ఎగిరిపోయే అల్పజీవివి. నువ్వా నన్ను ఎదిరించేది. నీ సంగతి మా నాన్నకు చెప్పి, మొత్తం చిలుక జాతినే అడవిలో లేకుండా చేయిస్తా." అన్నది యువ సింహం. "అక్కడ ప్రత్యక్షమైన సింహం "నా కడుపున చెడ బుట్టావురా. ఇతర జీవులను వేధిస్తున్న వారికి ఎవరికైనా ఒకటే శిక్ష. మర్యాదగా ఈ అడవి వదలి వెళ్ళిపో. లేకపోతే నువ్వు కొడుకువన్న ఆలోచన కూడా లేకుండా చంపేస్తా." అన్నది సింహం. అడవి జీవులన్నీ తమ ఆవేదన చెప్పుకున్నాయి. వాటిని క్షమించమని సింహం వేడుకుంది. తన కుమారుని కారణంగా బహిష్కరించబడిన జంతువులను తిరిగి రప్పించే ప్రయత్నం చేసింది. ఇకపై ఏ జీవీ మరో జీవిని రూపంలో లోపం కానీ, అవయవ లోపం కానీ, మరే ఇతర లోపాలను ఎత్తి చూపి హేళన చేసినా, వేధించినా ఆ నేరం ఋజువైతే కఠినమైన శిక్ష మరియు అడవి బహిష్కరణ తప్పదని ఆదేశాలు జారీ చేసింది. తన గారాబం మూలంగా తన కొడుకు ఇలా తయారయ్యాడని తన తప్పు తెలుసుకుని, తన కుమారునికి నైతిక విలువలను బోధించింది. కుమారునిలో మార్పు తీసుకు వచ్చింది.

మరిన్ని కథలు

Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు
Pratibha
ప్రతిభ
- చెన్నూరి సుదర్శన్
Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు