లీలా విలాసం - B.Rajyalakshmi

Leelaa vilasam

“విశ్వం గారూ” అన్న పిలుపు విని అప్పుడే క్లాస్ నుంచి బయటకు వచ్చిన విశ్వం వెనక్కి తిరిగి చూసాడు .ప్రక్క క్లాస్ నుంచి బయటకు వచ్చిన సహా ఉపాధ్యాయురాలు లీల దగ్గరగా వచ్చింది .”విశ్వం గారూ రెండు రోజుల క్రిందట మీరు ‘వేయి పడగలు ‘చదువుతుంటే చూసాను .నేను చదివి వారం రోజుల్లో తిరిగి యిస్తాను “లీల చిన్ని నవ్వుతో విశ్వాన్ని చూసింది .విశ్వం లీల ను చూస్తూ వుండిపోయాడు .అతని వాలకం గమనిస్తూ లీల నవ్వుకుంటూ మరో క్లాస్ కి వెళ్లిపోయింది .విశ్వం యింకా అలాగే నిలబడిపోయాడు .ఏం విన్నాడో యేమో కానీ చూపులన్నీ లీల నే చూసాయి .విశ్వం లీల ఆ పాఠశాలలో జాయినై రెండు సంవత్సరాలయ్యింది .కానీ యెప్పుడూ యిద్దరూ కలిసి మాట్లాడుకున్న సందర్భమే లేదు .విశ్వం స్వతహాగా బిడియస్తుడు ,నెమ్మది ,కలుపుగోలు తక్కువ !తన పాఠాలు ,తన స్టూడెంట్స్ ,తనలోకం ,ఫ్రీ టైం దొరికితే సాహిత్య పుస్తకాలు చదువుకుంటాడు .ఆడవాళ్లతో చనువు పెంచుకోవడం ,మాట్లాడం యిష్టం లేదు .జాయిన్ అయిన మొదటి రోజు లీల కూడా అదే టైం కి వచ్చింది .సన్నజాజిలా అందం గా లీల చూపరులను వెంటనే ఆకర్షిస్తుంది .అందమైన చురుకైన లీల కళ్లల్లో జీవం తొణికిసలాడుతూ వుంటుంది .క్రమం గా విశ్వానికి లీల అంటే అదో ఉత్సాహం కానీ మాట్లాడాలంటే జంకు !

లీల మనస్తత్వం చనువు ,చొరవ ,కలుపుగోలు తనం ! విశ్వాన్ని పలకరించాలని ప్రయత్నించింది కానీ అతను అసౌకర్యం గా ఫీల్ అవుతున్నాడని గ్రహించి యిబ్బంది పెట్టకూడదని అనుకుంది .లీల కూడా సాహిత్య పఠనాభిలాషిణి ! అందుకే ‘వేయిపడగలు ‘విశ్వాన్ని అడిగింది . ! మరో విషయం యేమంటే యిద్దరికీ పెళ్లి కాలేదు .విశ్వం తల్లితండ్రులు పల్లెటూళ్లో వుంటారు .విశ్వం గది అద్దెకు తీసుకుని వుంటున్నాడు .లీల కు తల్లి లేదు .తండ్రీ ,లీలా వుంటారు .

లీల మర్నాడు మరో సారి విశ్వాన్ని ‘వేయిపడగలు ‘ గుర్తు చేస్తూ పలకరించింది .విశ్వం మనసు మరో లోకం లో వుంది ,అది గ్రహించి లీల “పరధ్యానం గా వున్నారా ?” అంటూ చిన్నగా దగ్గింది .ఉలిక్కి పడుతూ “ఎప్పుడడిగారు ?” అన్నాడు ,” విశ్వం గారూ పంతుళ్లకు మతి మరుపైతే పిల్లల చదువులు గోవిందా ,మిమ్మల్ని ‘వేయిపడగలు ‘అడిగాను ,నిన్న తెచ్చారా ?”ప్రశ్నించింది లీల .అప్పుడు విశ్వానికి నిన్నటి సన్నివేశం గుర్తుకొచ్చింది .సిగ్గుపడుతూ “రేపు తప్పకుండా తెస్తాను “అన్నాడు .

“సాయంకాలం యింటికి పట్టుకొచ్చెయ్యండి ,అలాగే భోజనానికి కూడా వచ్చెయ్యండి ,యిదిగో నా అడ్రెస్ ,ఏడింటికల్లా మీకోసం యెదురుచూస్తుంటాను” అంటూ చిరునామా కాగితం విశ్వం చేతిలో పెట్టి వెళ్లిపోయింది .విశ్వానికి లీల ఆజ్ఞ యిచ్చినట్టుగా అనిపించింది .అనుమతి అనవసరం అనుకుందేమో !ఇప్పుడు విశ్వం మనసులో లీల వూహలు గుసగుసలాడుతున్నాయి .లీల తో చనువు పెంచుకోవాలన్న కోరిక ,తీయని అనుభూతి మెదలయ్యింది.అందమైన లీల రూపం మనసులో నిలిచిపోయింది .వేళావిశేషమంటే యిదే కాబోలు ! మనసు లీల యింటికి వెళ్లమని నొక్కి నొక్కి చెప్తున్నది

విశ్వం సాయంకాలం నీట్ గా తయారయ్యి ‘వేయిపడగలు ‘ మర్చిపోకుండా చేతిలో పట్టుకుని లీల దగ్గరికి బయల్దేరాడు .కాలింగ్ బెల్ మ్రోగగానే లీల నవ్వుతూ తలుపు తెరిచింది .ఆహ్వానించి రీడింగ్ రూమ్ లో విశ్వాన్ని కూర్చోమని లోపలికి వెళ్లింది .

విశ్వం రీడింగ్ రూమ్ లో కూర్చుని చుట్టూ పరిశీలించాడు .ముచ్చటగా వుంది ,పుస్తకాన్ని రాక్ లో నీట్ గా అమర్చబడున్నాయి .టేబుల్ పైన నోట్బుక్ పెన్ ,నైట్ లాంప్ ! కిటికీ ప్రక్కనించి సన్నజాజుల పరిమళాలు ! విశ్వానికి అక్కడ ప్రశాంతత యేదో తన్మయత్వం !కర్టెన్ తొలగిస్తూ లీల వచ్చింది ! నీలిరంగు కాటన్ చీర ,గంధం రంగు జాకెట్ ,వదులుగా వేసుకున్న వాలుజడ ,మల్లెల మాల ,నుదుట గుండ్రని తిలకం ! విశ్వం ఆ అందాన్ని ఆస్వాదిస్తున్నాడు .

“అయ్యో యెండుమిరపకాయలు లేవే “అంటూ లీల విశ్వాన్ని చూసింది !
తత్తరపడుతూ విశ్వం “ఎందుకిప్పుడు మిరపకాయలు ?”అన్నాడు .

లీల సీరియస్ గా చూస్తూ “దృష్టి తగిలితే మరి మిరపకాయలు కావాలిగా “అంటూ నవ్వేసింది ! అప్పుడు విశ్వానికి ట్యూబ్ లైట్ బుర్ర వెలిగింది . “సారీ “అన్నాడు ! ఇద్దరూ డైనింగ్ గదికి వెళ్లారు ! ఘుమఘుమలు పిలుస్తుంటేనే విశ్వానికి ఆకలి జోరందుకుంది .లీల ఒక్కొక మూత తీసింది .మామిడికాయ పప్పు ,ములక్కాయల పులుసు ,అరటికాయ కూర ,వడియాలు ,అప్పడాలు ,పెరుగు నెయ్యి ! ఆత్మారాముడి ఆజ్ఞ అయ్యింది గా తానే వడ్డించుకోబోయాడు ,కానీ లీల అతనికి తానే వడ్డించి తానూ వడ్డించుకుంది .ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ రుచులు వర్ణించుకుంటూ భోజనాలు ముగించారు .విశ్వం తినడం చూస్తుంటే మాయాబజార్ లోని ఘటోత్కచుడు గుర్తుకొచ్చాడు .

ఇంతలో బయట కార్ హారన్ వినిపించింది ,”నాన్నగారొచ్చినట్టున్నారు పరిచయం చేస్తాను రండీ “అంటూ బయటకొచ్చింది లీల .డ్రైవర్ యెదురొచ్చి”లీలమ్మగారూ ,బాబుగారు సూట్కేస్ సర్దిమ్మన్నారు అర్జెంటు గా వూరికెళ్ళాలిట “ అన్నాడు . అది విన్న విశ్వం “లీల గారూ నేను సెలవు తీసుకుంటాను ,‘వేయిపడగలు ‘బల్ల మీద పెట్టాను “ అంటూ వెళ్లిపోయాడు . లీల సరేనంది .

వేసవి సెలవులు మొదలవుతున్నాయి ,లీల విశ్వాన్ని బళ్లో కలిసి “ రేపేనా మీ ప్రయాణం ? సాయంత్రం వెళ్తున్నారు కదూ “అంటూ ప్రశ్నించింది .విశ్వానికి విస్మయం కలిగింది .”మీకెలా తెలిసింది నా ప్రయాణం ?”అంటూ లీల ను చూసాడు .”అబ్బో దీనికి అంతలా ఆలోచించాలా ,ప్రతిసెలవుల్లో వెంటనే వెళ్తారుగా ,స్టేషన్ కు వస్తాను “ అంటూ వెళ్లిపోయింది .అసలు లీల యెప్పుడూ విశ్వం అనుమతి కోసం యెదురుచూడదు .విశ్వానికి లీల లో నచ్చింది కూడా అదే ,తనలాంటి నెమ్మదస్తుడికి లీల లాంటి చురుకయిన తోడుండాలి .విశ్వానికి లీల భార్య అయితే బాగుండన్న వాంఛ కలిగింది కానీ లీల మనసు లోతు తెలియదుగా !

మర్నాడు విశ్వం స్టేషన్ లో లీలను కలిసాడు .” ఇంత ఆలస్యం చేసారేమిటి ?ట్రైన్ వచ్చేసింది ,పదండి పదండి “అంటూ లీల కూడా తన లగేజ్ తో విశ్వం తో పాటు యెక్కేసింది . ఇద్దరివీ యెదురెదురు సీట్లు ! ట్రైన్ స్టార్ట్ అయ్యింది ! మళ్లీ నోరెళ్లబెట్టాడు విశ్వం ! “దోమలు దూరుతాయండి బాబూ “అన్నది లీల .లీల హాయిగా అన్నీ సర్దుకుని యిద్దరికీ చపాతీలు ప్లేట్ లో పెట్టి విశ్వాన్ని తినమంది .నిరుత్తరుడయ్యాడు ,మాట్లాడకుండా తిన్నాడు .”ఇక బుద్ధి గా పడుకోండి “అంటూ మరో మాటకు అవకాశం యివ్వకుండా తనుకూడా పడుకుంది .

స్టేషన్ వచ్చింది ,విశ్వం దిగబోతూ లీలను చూసాడు ,లీల కూడా దిగడానికి సిద్ధమయ్యింది ,విశ్వానికి భయమేసింది నాన్న లీల ను చూసి యేమంటాడో ? పనివాడు రామయ్య విశ్వం దగ్గరకొచ్చాడు ,” చిన్న బాబుగారూ ,సిన్నమ్మగారేరండీ “అంటూ అటూయిటూ చూస్తున్నాడు .

విశ్వం ,”సిన్నమ్మగారెవరురా “అంటూ వింతగా అడిగాడు .

“లీలమ్మగోరండీ ,మీతోపాటు బళ్లో పనిచేసే అమ్మగారండీ ,లీలమ్మ నాన్నగారు మనింట్లోనే యిప్పుడున్నారండి , మీకు లీలమ్మగోరికి లగ్గం కదా సిన్నబాబుగారూ “అన్నాడు రామయ్య ! అప్పుడే అక్కడకు వచ్చి దిగుతున్న లీల విశ్వాన్ని చూసి కిలకిలా నవ్వింది !

ఇప్పుడు విశ్వానికి అంతా అర్ధమయ్యింది .నాన్నా లీల నాన్నా బాల్యమిత్రులన్నమాట ! తామిద్దరికీ పెళ్లి చేయాలనుకుని ప్లాన్ చేసినట్టున్నారు ! విశ్వానికి ఆనందం గా వుంది ! మనసులోని కోరిక ఫలించింది దేవుడు కరుణించాడు ! హాయిగా వూపిరిపీల్చుకున్నాడు . ఇదంతా లీలకు ముందే తెలుసు !

“ఏమిటాలోచిస్తున్నారు ?మీ నాన్నగారు యేమైనా ప్రశ్నిస్తారా “అడిగింది లీల విశ్వం చెయ్యి పట్టుకుంది ఆ చేతి స్పర్శ విశ్వానికి కొండంత ధైర్యం యిచ్చింది .

“లీలా విలాసాలు యింకా యింకా యెన్ని చూడాలో ,అయినా నీ దగ్గర నా ఓటమి కూడా నాకు అందమైన అనుభవమే “ఆప్యాయం గా లీల చెయ్యి ముద్దు పెట్టుకున్నాడు ! ఇద్దరూ తృప్తిగా నవ్వుకుంటూ స్టేషన్ బయటకు వచ్చారు !

మరిన్ని కథలు

Veda samskruthi
వేదసంస్కృతి
- టి. వి. యెల్. గాయత్రి.
Nijamaina bhakthi
నిజమైన భక్తి
- బోగా పురుషోత్తం, తుంబూరు.
Ontaritanam 2.0
ఒంటరితనం 2.0
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Sanghajeevi
సంఘజీవి
- ప్రభావతి పూసపాటి
Samayam viluva
సమయం విలువ
- చలసాని పునీత్ సాయి
Aakali
ఆకలి
- వేముల శ్రీమాన్