పెళ్లి చూపులు - ఉషా కుమారి

Pellichoopulu

"సార్…. వాళ్ళు వచ్చారు", ఫోన్లో చెప్పాడు వాచ్ మెన్. అలా అంటూనే, గేట్ తీశాడు. "సార్ వాళ్లు వచ్చేశారు", గట్టిగా అరిచాడు లోపల మొక్కలకు వీళ్లు పెడుతున్న వ్యక్తి. "సార్….. వచ్చేసారు వాళ్లు", చేతిలోని వాక్యూమ్ క్లీనర్ పక్కన పెడుతూ గట్టిగా అరిచాడు మరో వ్యక్తి. "సుశీల….. వాళ్ళు వచ్చారు", గట్టిగా అన్నాడు విక్రమ్ సింహ. "అమ్మాయి…... వాళ్ళు వచ్చారు", లోపలికి చూస్తూ అంది సుశీల. అలా అంటూ ఇద్దరు ముందుకు నడిచారు. కారులోంచి దిగుతున్న వాళ్ళని చూసి, "రండి …... లోపలికి రండి", నవ్వుతూ అన్నారు ఇద్దరు. "నాన్న! చూసావా, బయట మనం ఒక వాచ్ మెన్ ని, ఇద్దరు సర్వెంట్స్ ని చూసాం. ఇంకా లోపల ఎంతమంది ఉన్నా రో?!" "అవును రోయ్ ఆస్తి కోట్లలోనే ఉంటుంది." "జాగ్రత్తగా డీల్ చెయ్యాలి నాన్న. చాలా ఎక్కువ కట్నం రాబట్టాలి సుమా." "నువ్వు నాకు చెప్పాలా?", అంటూ ఏదో అనబోయాడు. "ఉష్….. ఆగండి వాళ్లు వస్తున్నారు. మాట్లాడకండి! వాళ్లు వింటే బాగోదు", నెమ్మదిగా అంది జనార్ధనరావు భార్య విమల. అందరూ లోపలికి నడిచారు. "కూర్చోండి", అన్నాడు విక్రమసింహ. "ఈమె నా భార్య విమల. వీడు నా కొడుకు శ్రీపతి ఇక నేను జనార్దన్ రావు." "నేను విక్రమ్ సింహ, ఈమె నా భార్య సుశీల", అంటూ పరిచయం చేశాడు విక్రమ్. "ఇక…. ఈయన….", అంటూ ఏదో చెప్పబోయాడు విక్రమ్. "నాన్న…. ఇప్పుడు చూడు నా తెలివి, అతనికి ఓ నమస్కారం పెట్టి మరింత క్రేజ్ పెంచుకుంటా. అలాగే నా కట్నం కూడా అదే పెరుగుతుంది", అని నెమ్మదిగా అంటూ, చటుక్కున లేచి ఆ పెద్దాయన కాళ్ళకి దండం పెట్టాడు. ఆయన అయోమయంగా విక్రమ్ కేసి చూసాడు. విక్రమ్ తల వూపడంతో, "శుభం!", అంటూ మళ్లీ పేపర్ చదువుకోసాగాడు. "ఈయన పేరు రంగయ్య. మా ఇంటికి కావలసిన కూరగాయలన్నీ పండిస్తాడు. ఏ కాలంలో ఏది ఎక్కువ పడుతుందో తెలుసు. ఒకరకంగా చెప్పాలంటే ఇంటి ఆరోగ్యం చూసుకునేది ఈయనే, ఈ వేళ ఈయనకి సెలవు అందుకే పెరటి పని చేయడం లేదు", అంటూ పరిచయం చేశాడు. చేతిని అటు ఇటు తిప్పి మళ్లీ పేపర్ చదువుకోవడం మొదలుపెట్టాడు. "పని వాడా!…. పని వాడిని సోఫాలో కూర్చోపెట్టడం ఏమిటి?! నేను కాళ్లకు దండం పెట్టడం ఏమిటి?!", చిరాగ్గా అనిపించింది శ్రీపతి కి. *** టిఫిన్లు కాఫీలు అయ్యాయి. "అమ్మాయి రామ్మ", అని సుశీల పిలవడంతో వచ్చి అక్కడ ఉన్న సోఫాలో కూర్చుంది. "ఎక్కడ భయం, బిడియం కనబడటం లేదురా", అంది విమల. "అబ్బా…. ఇప్పుడు ఇలాంటివన్నీ కామన్ నువ్వు కాసేపు మాట్లాడకు", నెమ్మదిగా అన్నాడు శ్రీపతి. ఎల్లో కలర్ చీరలో సాదాగా ఉంది. మెడలో సన్నటి చైన్, చెవులకు చిన్నగా ఏవో ఉన్నాయి. "మా అమ్మాయి రుచిత", పరిచయం చేశాడు విక్రం. "నమస్తే", అంటూ చిన్నగా నవ్వింది. "ఇదేమిట్రా మెడలో ఒక్క నగా లేదు", రహస్యంగా అంది విమల కొడుకుతో. "ఇప్పుడు అందరూ లాకర్లలో పెట్టుకుంటున్నారులే అమ్మ, నువ్వు మాట్లాడకు", అంటూ చిన్నగా కసురుకున్నాడు శ్రీపతి. కాసేపయ్యాక, "నేను కాసేపు ఒంటరిగా మాట్లాడాలి అనుకుంటున్నాను", అన్నాడు శ్రీపతి. "ఓకే నో ప్రాబ్లం", అంటూ టేబుల్ మీద ఉన్న కార్ తాళాలు అందుకుంది రుచిత. 'ఓహ్…. కారులో బయటకు వెళుతూ మాట్లాడుకుంటాం అన్నమాట. ఈ పద్ధతి కూడా బాగానే ఉంది', మనసులోనే ఆనందంగా అనుకున్నాడు. "నాన్న కాస్త జాగ్రత్తగా మాట్లాడు. ఎక్కువ కట్నం వచ్చేలా చూడు. నేను కూడా కానుకలు అవి అంటూ మాట్లాడుతాను", రహస్యంగా అన్నాడు. "నువ్వు చెప్పాలా. నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళు", అంటూ మరింత నెమ్మదిగా అన్నాడు. *** కారు నెమ్మదిగా నడుపుతూ, "ఇప్పుడు చెప్పండి ఏదో మాట్లాడాలి అన్నారు." "ఏం లేదు, కాసేపు మాట్లాడుకుంటే మన అభిప్రాయాలు తెలుస్తాయని….", అన్నాడు శ్రీపతి. "మీకు డౌట్స్ ఏమన్నా ఉంటే చెప్పండి, క్లారిటీ ఇస్తా." "అదేం లేదు. ఇంతకీ మీ ఇంట్లో ఉన్న పెద్దాయన మీ బంధువా?" "కాదు గార్డెన్ లో పని చేస్తారు." "మరి సోఫాలో…. ఎందుకు కూర్చున్నాడు", ఆశ్చర్యంగా అన్నాడు శ్రీపతి. "అదా, మా ఇంట్లో పనిచేసేవాళ్ల అందరితో మా నాన్న రోజు వైకుంఠపాళి ఆడతారు. ఆటలో ఎవరు గెలిస్తే, వాళ్లు ఆరోజు ఇంటి పనులు చేయనవసరం లేదు. హాయిగా ఇంట్లో ఉండొచ్చు, కావలసినవి తినొచ్చు, ఎలాగైనా ఉండొచ్చు. నిన్న రంగయ్య గెలిచాడు. అందుకే హాయిగా సోఫాలో కూర్చుని పేపర్ చదువుకుంటున్నాడు", నవ్వుతూ అంది రుచిత. "అవునా….", ఆశ్చర్యంగా అన్నాడు. "మీకు ఇంకో విషయం తెలియదు, మా నాన్న ప్రతి నెల రెండు గంటలు వాచ్ మెన్ పని చేస్తారు. ఇంకా గార్డెనర్ గా మారిపోతారు. అప్పుడు ఇంట్లో అందరం బోలెడన్ని సెల్ఫీలు దిగుతాం." "మీ నాన్నగారు అలా…. ఇక మా నాన్నగారు అయితే చాలా జాగ్రత్త మనిషి. నా చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు నా కోసం పెట్టిన మొత్తం ఖర్చు రాసి పెడుతూ ఉంటారు. అదంతా ఇప్పటికీ రెండు కోట్లు ఉంటుంది. అందులో సగమైన నా కట్నం రూపేణా తీసుకోవాలని అని మా నాన్న ఆశయం." "ఓహ్! ఐ సీ…. ఇలాంటి ఆశయాలు కూడా ఉంటాయా?! ఈ పద్ధతి కూడా బాగానే ఉంది. చిన్నప్పటినుండి నా కోసం ఖర్చు చేసినవన్నీ మా నాన్నని రాయమంటాను. ఆహ్….. చిన్నప్పుడు నాకు అన్నప్రాసన గోల్డెన్ స్పూన్తో చేశారు. అది రాయమంటాను నేను ఎక్కువగా తింటాను ఆ ఖర్చు కూడా….." "అరే!….. మీకెందుకు లెండి ఇవన్నీ", మొహం మాడ్చుకుని అన్నాడు. "ఓహ్….. అయితే ఈ మీ కోసం మాత్రమే అన్నమాట. ఇంతేనా…. ఇంకా ఏమన్నా…. ఆశయాలు ఉన్నాయా?" "ఇంతేనా అంటే ఇంకా చాలా ఉంది, నాకు నా పెళ్లి చాలా ఘనంగా జరగాలని ఆశ. అంటే ఓ కోటిరూపాయలు ఖర్చుపెట్టి చేసుకోవాలని, ఇంకా మీరు ఎలాగో ఖరీదైన కారు బహుమతిగా ఇస్తారు అనుకోండి. మా ఫ్రెండ్స్ అందరికీ నేనే ఆదర్శం కావాలనుకుంటున్నాను." "ఓహ్…. ఆదర్శం అంటే కోటి రూపాయలు ఖర్చు పెట్టి పెళ్లి చేసుకోవడం. ఓకే.. నేను ట్వంటీ మీరు ఎయిటి…." "అంటే…." "నేను ఇరవై లక్షలు పెళ్లి కోసం ఖర్చు పెడతాను. మీరు ఎనభై లక్షలు పెట్టండి. ఆదర్శం మీది కదా, అందుకే మీకే ఎక్కువ ఆఫర్ చేస్తున్నాను", మొహం పాలిపోయినట్లు అయింది శ్రీపతి కి. "అబ్బే….! ఎందుకు లెండి…. తక్కువలోనే కానిచ్చేద్దాం. అనవసరంగా డబ్బు దండగ. అంటే ఓ రెండు లక్షలు…." "అప్పుడైనా పర్సంటేజ్ లో మార్పు ఉండదు లెండి." 'అమ్మో…. ఈమె చాలా తెలివైనది జాగ్రత్తగా డీల్‌చేయాలి. అయినా పెళ్లికి నేను ఎందుకు డబ్బులు పెడతా అంతా వాళ్ళ చేతే పెట్టిస్తా', మనసులో అనుకున్నాడు శ్రీపతి. "ఆ విషయం తరువాత చూద్దాం కానీ, మీరు ఉంటున్న బిల్డింగ్ చాలా బాగుంది. చాలా అందంగా ఉంది. ఎంత ఉంటుందంటారు? సుమారు పదికోట్ల వరకూ ఉంటుందంటారా?" "మీరు ఊహించిన దానికన్నా చాలా ఎక్కువగానే ఉంటుంది. ఇంతకీ మీకు కూడా ఇల్లు ఉంది కదా, అది ఎంత ఉంటుంది?" ఆమె మాటల్లో చిన్న అల్లరి కూడా తొంగిచూస్తోంది. "మా ఇల్లా…. మీ ఇల్లంత కాదు గానీ, రెండు కోట్లు ఉండొచ్చు." "ఓ…. అలాగా." "మన మ్యారేజ్ అయ్యాక మీ నాన్నగారికి ఆహ్లాదంగా ఉండే చిన్న ఇంటికి షిఫ్ట్ చేయండి. ఆయనకీ ఇబ్బంది ఉండదు, మనకీ ఉండదు." "ఓకే... అంతకుముందు మీరు మరో పని చేయాలి." "ఏం చేయమంటారు? మీరు ఎలా చెప్తే అలాగే." "అయితే మీరు కూడా మీవాళ్లకి ఒక చిన్న ఇల్లు చూసి వాళ్లని అక్కడికి షిప్ట్ చేయండి. మనం పది రోజులు ఇక్కడ, పది రోజులు అక్కడ, ఉందాం. సరేనా?" "నేను మా వాళ్లని వేరేగా ఎందుకు ఉంచాలి?" "మరి నేను మాత్రం ఎందుకు ఉంచాలి? మీకు మరొక శుభవార్త. ఆ బిల్డింగ్ మా నాన్న అనంతరం అనాధ శరణాలయానికి వెళుతుంది." గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయింది. "ఎందుకలా…. మరి మీకో…. ఓహో, మీకు ఇంకా కోట్ల కొలది డబ్బు ఉంది కదా అది అంతా మీకే.... ఇంకా మిమ్మల్ని చేసుకోబోయే వారికే…. అవునా ….", సిగ్గు పడుతూ అన్నాడు శ్రీపతి. "అదేం లేదు…. మా నాన్నకు ఉన్న స్థిరచరాస్తులు అన్నీ, అంటే ఈ బిల్డింగ్ కాకుండా మిగిలిన అన్నీ కూడా, కొంత తిరుపతి దేవస్థానానికి, మరికొంత షిరిడి సంస్థానానికి చెందుతుంది." అతనికి నోట మాట రాలేదు గొంతు తడారిపోతోంది. "అమ్మో నా ఆస్తి…. ఇలా…. ఎవరెవరికో పోతోంది. అయినా రుచితని పెళ్లి చేసుకుంటే ఇదంతా నా ఆస్తి. అలా ఎలా పోనిస్తా…." "మీకు మంచి నీళ్ళు కావాలా? ఇదిగో బాటిల్….", అంటూ అందించింది. ఇంతలో ఫోన్ మోగడంతో రుచిత ఫోన్ తీసుకుంది. అనాలోచితంగానే ఆ సంభాషణ అంతా శ్రీపతి వింటున్నాడు. "రుచిత స్పీకింగ్…. ఎస్ దొరికాడా…. రాస్కెల్…. వాడి సంగతి నేను చూసుకుంటాను. సాయంత్రం ప్రెస్ మీట్ అరేంజ్ చేయండి…. మొత్తం మీడియా అంతా ఉండాలి. కమాన్ హరి యప్." మాట్లాడుతున్న రుచిత మొహం ఎర్రగా మారింది. అమ్మో…. రుచిత ఇలా మాట్లాడుతోంది…. మీడియా ఎందుకు.... ప్రెస్ మీట్ ఏమిటి…. ఏమీ అర్థం కావడం లేదే, అతడు అయోమయంగా చూడసాగాడు. "ఓహ్…. మీకేం అర్థం కావడం లేదు కదా…. నేను ఏ.సి.పి. రుచితా సిరహా", ఆమె చిన్నగా మందహాసం చేసింది. *** "కానీ మ్యాట్రిమోనీలో మీది బ్యాంకు ఉద్యోగం అని ఉంది. అంటే డిగ్రీ అయిన కొత్తలో కొంతకాలం బ్యాంకులో పని చేశాను. అప్పుడు మ్యాట్రిమోనీలో మా నాన్న రిజిస్టర్ చేశారు. అది చూసి పెళ్లి చూపులకు వచ్చిన వాళ్లు ఒకవేళ కట్నం కనుక అడిగితే వాళ్లను ఒక ఆట ఆడుకుంటారు. అది మా నాన్న హాబీ. నిద్రలో కూడా కట్నం అంటే భయపడేలా చేస్తారు. అయినా…. నీలాంటి బకరా గాళ్ళు ఎప్పుడో గాని దొరకరుగా." "మే….మేడం, సారీ…. నేను వెళతాను", గొంతు పెకిలించుకొని అన్నాడు. "అలాగే వెలుదువుగానీ, మీవాళ్లకి ముందు ఫోన్ చెయ్యి, ఏదో ఒక కారణం చెప్పి ఇంటికి బయలుదేరమని…. అలా కాకుంటే జరిగేదానికి నేను బాధ్యురాలిని కాదు", తాపీగా అంది రుచిత. వెంటనే ఫోన్ చేశాడు శ్రీపతి. "హలో నాన్న! మీరు అక్కడి నుండి వెంటనే బయలుదేరండి", అన్నాడు. "ఒరేయ్! ఎందుకురా ఈయన చాలా మంచివాడు చాలా కట్నం కూడా ఇచ్చేలా ఉన్నాడు." "నాన్నా! మీకు అర్థం కావడం లేదు. కట్నం గురించి మాట్లాడితే జైల్లో తోస్తారు. వాళ్ళ అమ్మాయి ఏ. సి. పి రుచిత సింహ. ఏదో ఒక కారణం చెప్పి బయటపడండి", అంటూ ఫోన్ పెట్టేశాడు. "మేడం మీరు కారు ఆపితే నేను వెళ్ళిపోతాను మేడం." "ఆ... ఆహ్…. నీ ఎదురుగా ఒక ఫోన్ ఉంది చూసావా?" "చూసాను మేడం." "ఇప్పుడు నువ్వు మాట్లాడినదంతా దాంట్లో రికార్డయింది. ఆడియో, వీడియో కూడా. నువ్వు మరోచోట ఎక్కడైనా కట్నం గిట్నం అన్నావనుకో జైలుకి వెడతావ్ జాగ్రత్త. ఇంకా నీ మ్యారేజ్ అయ్యాక మీ భార్యని డబ్బులు కోసం ఇబ్బంది పెట్టావనుకో నీకు మరొక చాన్స్ ఉండదు. డైరెక్ట్ గా జైలుకే. కారు దిగు", అంటూ కారు ఆపింది రుచిత. శ్రీపతి ఒక్క సెకండ్ లో కారు దిగి మరు నిమిషంలోనే మాయమయ్యాడు. రుచిత పెదవులపై చిన్న చిరునవ్వు మెరిసింది. ఆకాశం చిన్నగా చిరుజల్లు కురిపించింది.

మరిన్ని కథలు

Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు
Pratibha
ప్రతిభ
- చెన్నూరి సుదర్శన్
Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు