“ఏమిటీ!!??మీరు చెప్పేది నిజమే!!??” రెట్టించింది నా భార్య సంధ్య.
“ముమ్మాటికి నిజం “అన్నాను నేను నిర్వికారంగా.
“అంటే ఆ వ్యక్తి ...మీలాంటి మనిషి తో ఆ మాట అందా !!??” అని అడిగింది సంధ్య ఆశ్చర్యం, అపనమ్మకం మిళితమైన స్వరంతో.
“అబ్బ!!అరిగిపోయిన పాత గ్రామఫోన్ రికార్డులా ఎన్నిసార్లు అదే మాట అడుగుతావు !!??”అన్నాను నేను విసుగ్గా.
“అవునులెండి అదెవత్తో ఒళ్ళు కొవ్వెక్కి తగుదునమ్మా అని రమ్మంది.....మీరు రెడీ అయిపోతున్నారు.”అంది సంధ్య కోపంగా .
“అర్థం లేకుండా మాట్లాడకు సంధ్యా.జరిగినది అంతా నీకు చెప్పానుకదా.”అన్నాను నేను కాస్త కోపంగా.
“జరిగిన దానిని గురించి నేను బాధపడడం లేదండి .ఇక జరగబోయే దానిని ఊహించుకొంటే అసహ్యం,కంపరం పుడుతోంది...ఛీ!ఛీ!”అంటూ వెగటుగా మొహం పెట్టింది సంధ్య .
“సంధ్యా ఇందులో నా తప్పేమీలేదు .ఆ విషయం నీకూతెలుసు కదా!?”అన్నాను నేను.
“ఇంకా మీ తప్పేమీ లేదు అంటారేమిటండి?అది అన్న మాటలకు దాని రెండు చెంపలూ పగలగొట్టి ,బుద్ధి చెప్పాల్సింది పోయి, అసలు ఏమీ జరగనట్లు.......జరగకూడనిది ఏమీ జరగదు అన్నట్లు మాట్లాడతారేమిటి!!??”కస్సుమంది సంధ్య.
“సంధ్యా....”నేను ఏదో చెప్పబోయాను. సంధ్య నా మాటలకు అడ్డు తగిలింది.
“ఇంక నాకేమీ చెప్పకండి .”
“సంధ్యా నేను ఒక గైనికోలొజిస్ట్ గా అనేక వేలమంధి స్త్రీలను పరీక్షించాను. .అందులో ఏదయినా తప్పు ఉందా?”అన్నాను నేను.
“అది మీ వృత్తి ధర్మం.మీరు కేవలం ఒక డాక్టర్ గా వ్యవహరించారు.కానీ ఇప్పుడు మీరు చేయబోయేది వ్యభిచారం. దానికి బుద్ధి లేదనుకోండి.మీ ఇంగితజ్ఞానం ఏమైనట్లు?”
“అంతా విని మళ్ళీ మొదటకి వస్తున్నావు.” అన్నాను నేను కాస్త అసహనంగా .
“నాకు సవతిని తెచ్చి మీరు నా జీవితం అంతం చేసెయ్యడానికి ప్రయత్నిస్తున్నారు.”అంది సంధ్య .
“సంధ్యా.నువ్వు ఏదైతే ఘోర అపరాధం అనుకుంటున్నావో అది కూడా నా వృత్తి ధర్మంగానే భావిస్తున్నాను.” అన్నాను నేను .
“ఏమిటీ మీరు చెయ్యబోయే మహాకార్యం వృత్తి ధర్మమా!?”సంధ్య కంఠంలో వెటకారం స్పష్టంగా ధ్వనించింది.
“అవును.ఒక పేషెంట్ బాధ పడుతుంటే మాత్రలో ,ఇంజెక్షన్లో ఇచ్చి ఆ బాధ తగ్గించడం ఒక డాక్టర్ గా నా కర్తవ్యం.”అన్నాను నేను .
“ఆహ !! వృత్తిపట్ల ఎంత నిబద్ధత కలవారో...వృత్తిని ఎంత గౌరవిస్తారో..పరాయి ఆడవాళ్ళతో అతి చనువుగా మసలడం కూడా మీ వృత్తి ధర్మమేనా!??..మీ..మీరు........”సంధ్య మొహం కోపంతో ఎరుపెక్కిపోయింది.మాటలు తడబడ సాగాయి.
“సంధ్యా నేను చెప్పేది కాస్త విను”అన్నాను నేను నచ్చచెప్పే ధోరణిలో.
“ఇంకా ఏమిటండీ వినేది!?సాంఘిక సేవ ,వృత్తి ధర్మం అంటూ పచ్చి వ్యభిచారం చేయడానికి సిద్ధ పడిపోయి, ఏమీ ఎరుగని నంగనాచిలా మాట్లాడుతున్నారు.”
“అసలు...” ఏదో అనబోయాను .నా మాటలను అదిలోనే త్రుంచి వేసింది సంధ్య.
“ఇంకేమి వినదలుచుకోలేదు.ఇక మీ దారి మీది, నా దారి నాది.”అంటూ కళ్ళమ్మట ధారగా నీరు కారుతుండగా వడి వడిగా బెడ్ రూమ్ లోనుంచి వంటిట్లోకి నడిచింది సంధ్య.
నేను ఒక విచిత్ర పరిస్థితిలో ఇరుక్కున్నాను.ఆ పరిస్థితి నుంచి ఎలా బయట పడాలో ఏంచేయాలో అర్థం కావడం లేదు.దానికి తోడు సంధ్య నన్ను సూటిపోటి మాటలతో నన్ను గాయపరుస్తోంది . నా మస్తిష్కంలో ఆలోచనలు ఈగలలా ముసరసాగాయి.నాలుగు రోజుల ముందు జరిగిన సంఘటన ,జరిగిన విషయాలు పదేపదే నా మనోనేత్రం ముందు సినిమా రీళ్ళలా తిరగసాగాయి.........................................
నేను ఆ ఊరిలోనే పేరు మోసిన గైనికోలొజిస్ట్ ని. ఒకసారి ఆసుపత్రిలో అడుగు పెట్టిన తరువాత కేవలం ఒక డాక్టర్ మాత్రం నాలో ఉంటాడు.నేను చేసే ప్రతీ పని మనసా,వాచా ,కర్మణా కేవలం డాక్టర్ గానే చేస్తాను.
నా డైయోగ్నోసిస్ నైపుణ్యత ,నా ట్రీట్మెంట్ విధానం ,అన్నింటికన్నా ఈ రోజులలో కూడా పేషెంట్లని ఎంతో ఓపికగా చూడడం ,మాట్లాడడంతో పాటు ,అత్యవసరమైతే తప్ప టెస్ట్ లు రాయకపోవడంతో, నిజానికి నాకు ఆ ఊరిలోనే కాదు మొత్తం జిల్లాలో మంచి పేరు వచ్చింది.
డాక్టర్ నా వృత్తి అయితే అంతో ఇంతో సంఘసేవ చేయడం నా ప్రవృత్తి.నాకు అవకాశం చిక్కిన ,వీలైన సమయంలో ఉచిత మెడికల్ క్యాంపులు వగైరా నిర్వహిస్తూ ఉంటాను.అయితే నేను ఏ సంస్థలతో పొందు పెట్టుకోను.నా అంతట నేనే స్వంత ఖర్చులతో ఉడతా భక్తిగా సేవ చేస్తే ఆ తృప్తే వేరని నా భావం.నేను ప్రచారాలకు ,అర్భాటాలకు కూడా దూరంగా ఉంటాను.
అ రోజు మెడికల్ క్యాంపులో నేను ఏ మాత్రం ఊహించనిది ,విచిత్రమైనది ఒక సంఘటన జరిగింది. అప్పటి వరుకు దాదాపు ఏబయి మంది పేషెంట్లను చూసి ఉంటాను.
ఆ రోజుకి ఆఖరు పేషెంట్ గా దాదాపు పాతిక సంవత్సరాల ఒక యువతి వచ్చింది.అ వ్యక్తిని చూడగానే ‘పేషెంట్’ అని చెప్పడానికి వేలకొలది పుస్తకాలు చదివి ఉండక్కర్లేదు,వందలాది టెస్ట్ లు చేయక్కర్లేదు.ఆమె ముఖం, లోపలకు నడిచి వచ్చిన తీరు ఆమె ఒక దీర్ఘ కాలిక వ్యాధిగ్రస్తురాలు అని చెప్పకనే చెపుతున్నాయి. అయితే ఆమెని పరీక్షించి,కొన్ని ప్రశ్నలు అడిగి,ఆమె దగ్గరున్న రిపోర్టులు చూసాక నాకు విషయం పూర్తిగా అర్థమయ్యింది.ఆమె పేరు రాగిణి .ఆమె ఒక కాన్సర్ పేషెంట్.అది కూడా వ్యాధి పూర్తిగా ముదిరిన స్థితిలో ఉంది. బహుశా ఆమె ఇక కొన్ని నెలలు కన్నా బతకదు.అ విషయం ఎలా చెప్పాలో అని తటపటాయిస్తున్నాను.
“మీతో ఎవరైనా వచ్చారా రాగిణి గారు?”అని అడిగాను.
“డాక్టర్ బహుశా అసలు విషయం ఎలా చెప్పాలో అని సందేహిస్తున్నట్టు ఉన్నారు. నాకు అంతా తెలుసు.”అంది రాగిణి.
“అంటే.........” నేను ఏదో చెప్పబోయి ఆగిపోయాను .
రాగిణి చుట్టుపక్కలకు చూసింది.అ రోజుకు రాగిణి ఆఖరు పేషెంట్ అవడం వల్ల,ఆమెను కూడా పరీక్షించడం అయిపోవడం వలన ,నా అసిస్టెంట్లు పరికరాలను సర్దుకోడం ,కేసుషీట్లను ఫైల్ చేసుకోవడంలాంటి పనులలో నిమగ్నమైపోయారు.నాకు,రాగిణికి దగ్గరలో ఎవరూ లేరు.
“డాక్టర్ నేను ఈ కాంపుకు వస్తున్నట్లు ఇంట్లో ఎవ్వరికీ చెప్పలేదు.ఎందుకంటే కేవలం పేదవాళ్ళ కోసం ఏర్పాటు చేసిన ఈ క్యాంపుకు నేను రాకూడదు.నేను ఒక పెద్ద పారిశ్రామికవేత్త ఏకైక సంతానాన్ని.” ఒక్క క్షణం ఆగింది రాగిణి.
నేను భ్రుకుటి ముడివేసి,కన్నులు చిన్నవి చేసి రాగిణి చెప్పేది పరిశీలనగా వినసాగాను.
“డాక్టర్ మీరు చెప్పబోయే విషయం నాకు తెలుసు.నా జీవితం కొన్ని నెలలు మాత్రమే మిగిలి ఉంది.”
“రాగిణి గారు ...అంటే..అంటే కొన్ని కేసులు “అంటూ రాగిణిని కాస్త ఉత్సాహ పరుద్దామని అనుకున్నాను.
“డాక్టర్ నాకన్నీ తెలుసు.దయచేసి నన్ను మభ్యపెట్టడానికి ప్రయత్నించకండి.మీ గురించి,మీ నైపుణ్యత గురించి,మీ మంచితనాన్ని గురించి విన్నాను.ఈ రోజు ప్రత్యక్షంగా చూసాను.అసలు నాకు కాన్సర్ అని తెలియగానే మీ దగ్గరకు వచ్చి సలహా తీసుకుందామనుకున్నాను.కానీ డబ్బు ప్రాణం కూడా కొనగలదు అనుకున్న మా నాన్నగారు నన్ను తిప్పని దేశం కానీ,ఆసుపత్రి కానీ లేవు. అలాగే చూపించని గైనికలోజిస్ట్,ఓనోకాలొజిస్ట్ ప్రపంచం లోనేలేరు అంటే అతిశయోక్తి కాదేమో !!? చిన్నప్పుడే తల్లిని కోల్పోయిన నాకు తల్లి అయినా తండ్రి అయినా ఆయనే. అన్ని జబ్బులు డబ్బులు,డాక్టర్లు తగ్గంచగలిగితే ఇంకా దేవుడు అనే వాడిని పట్టించుకుంటామా!?లెక్క చేస్తామా !?”అంటూ నిర్వేదంగా నవ్వింది రాగిణి.ఆమె తన్నుకొచ్చే బాధని పాంటి బిగువన నొక్కిపెట్టడం గమనించాను నేను .
“అయాం సారీ .మీకు తల్లిగారు లేరా !? ఇంతకీ ఇక్కడకు ఎందుకు వచ్చారు!!??”అంటూ అడిగాను నేను ఆమె కళ్ళల్లోకి చూస్తూ .
“మిమ్మల్ని ప్రత్యక్షంగా చూద్దామని “అంది రాగిణి జీవం లేని నవ్వు నవ్వుతూ.
రాగిణి చుట్టుపక్కలకు చూసి ,ఎవ్వరూ మా మాటలు వినే అంత దూరం లో లేరని నిశ్చయించుకుని,
తన మొహం నా మొహంకి దగ్గరగా పెట్టి
“డాక్టర్ నేను పోయే ముందు ఒక్క రాత్రి మీతో గడపాలని ఉంది.మీ ఫోటో చూసాక, మిమ్మల్ని గురించి విన్నాక ,నాకు ఆ కోరిక కలిగితే, మిమ్మల్ని చూసాక అది బలపడింది.నాకు పెళ్ళిపెటాకులు ఎటూ ఉండవు.ఒక రాత్రి మీతో గడపాలని ఉంది.ఈ టెర్మినల్లీ ఇల్ పేషెంట్ కోరిక తీరుస్తారు కదూ.డాక్టర్ గా మీకు కాన్సర్ అంటు వ్యాధి కాదని తెలుసు కదా.ఐయాం మేకింగ్ ఏ విష్ “ అంది రాగిణి అదోలా నవ్వుతూ.
రాగిణి మాటలు విన్న నేను ఒక్కసారి షాక్ కి గురి అయ్యాను. కొంచెం సేపు నా మెదడు మొద్దుబారినట్టుగా అయిపోయింది.ఆమెకి సమాధానంగా ఏం చెప్పాలో నాకు పాలుపోలేదు.
రాగిణి దూరంగా జరిగి నా వైపు ఆశగా చూస్తూ కూచుంది. కొన్ని నిమషాలు అక్కడ నిశబ్దం రాజ్యం చేసింది.
మెల్లగా నా గొంతు పెగిలింది.”రాగిణి గారు ...”
నా మాటలకు రాగిణి అడ్డు పడింది. “డాక్టర్ మీ ఉదేశ్యం నాకు అర్థం అయ్యింది.మీ డ్యూటీ పేషెంట్ల రోగాలు, బాధలు తగ్గించడం గాని ,వారి కోరికలు తీర్చడం కాదు .నిజమే .ఒప్పుకుంటాను.అలాగే నా కోరిక ఆహేతుకమైనది,అసాంఘికమైనది,నీచమైనది అని. కానీ పేషెంట్ ఆఖరి కోరిక.మీ ఇష్టం.”అంటూ కుర్చీలో వెనక్కి జార్ల పడి కూచుంది.
కొంత సేపటికి నేను “రాగిణి గారు ఒక విచిత్ర పరిస్థితిలో పడేసారు నన్ను. అసలు ఈ పరిస్థితిలో ఏం చేయాలో, ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. నాకు కొంచం వ్యవధి ఇవ్వండి.నాలుగు రోజులాగి ఫోన్ చెయ్యండి.” అంటూ నా విజిటింగ్ కార్డు అందించాను.రాగిణి ఫోన్ నెంబర్ తీసుకున్నాను. ‘పర్చేజింగ్ టైం’ అంటే అదేనేమో !! ఏదో అలా అన్నాను గాని ఏం చేయాలో పాలుపోని పరిస్థితి నాది.
ఆ రోజు ఇంటికి వెళ్ళిన తరువాత కూడా నేను మాములు మనిషిని కాలేకపోయాను. జరిగిన సంఘటన నా మనస్సులో విపరీతమైన తుఫాను సృష్టించింది.నన్ను అల్లకల్లోలంలోకి నెట్టి వేసింది.నేను మూడీగా తయారయ్యాను.నాకేమయ్యిందో అని సంధ్య కంగారు పడిపోయింది.
నేను డాక్టర్ ని .కానీ అంతకంటే ముందు ఒక మనిషిని.రాగిణి కోరిక సరిఅయినదా ,సమాజం హర్షిస్తుందా అన్నది ఒక పక్కన పెడితే,రాగిణిది మృత్యు ముఖంలో ఉన్న ఒక పేషెంట్ ఆఖరి కోరిక . ఆమె ఆఖరిస్థితి లో ఉన్న ఒక కాన్సర్ పేషెంట్ .
నేను ఎంతో తర్జనబర్జన పడ్డాక ఒక నిర్ణయానికి వచ్చాను. వారం తరువాత రాగిణి ఫోన్ చేసింది.
“ఓ.కే.”అన్నాను నేను .
రాగిణి ఫోన్ లోనే నన్ను కౌగలించుకుంది..........................................
“ఈ రోజు ఆసుపత్రికి వెళ్ళేది ఉందా !?లేక ఆవిడ గారి ధ్యాసే సరిపోతుందా !!??”అని సంధ్య కోపంగా అన్న మాటలకు ఈ లోకంలోకి వచ్చాను.
రాగిణి ఇచ్చిన అడ్రెస్స్ ప్రకారం ఇల్లు కనుక్కోవడం పెద్ద కష్టం కాలేదు.కారు తిన్నగా వాళ్ళ ఇంటిముందు ఆపాను.రాగిణి నేను వస్తానని ,నా కారు నెంబర్ తో సహా, ముందే చెప్పిందో ఏమో గుర్ఖా సెల్యూట్ చేసి గేటు తీసాడు.
కాలింగ్ బెల్ మొగించగానే మెయిన్ డోర్ ఎవరో ముసలావిడ తీసింది.నన్ను లోపలకి ఆహ్వానించింది.అంతలోకే రాగిణి పరుగు పరుగున వచ్చింది. రాగిణి శోభనపు పెళ్ళి కూతురులా అలకరించుకుంది. ఆమె అంత్య దశలో ఉన్న కాన్సర్ వ్యాధిగ్రస్తురాలు అయినా ఆ క్షణంలో మాత్రం ఆమెలో ఏదో వింత జీవ కళ ఉట్టి పడుతోంది!!??
“వావ్!!?? రండి డాక్టర్ వెల్కం.”అంటూ నా చేతిని అందుకుని నన్ను ఇంట్లోకి నడిపించుకు వెళ్ళింది.
నేను మొహమాటంగానే లోపలకు వెళ్ళాను.’ఇంద్ర భవనం’ అంటే ఇలాగే ఉంటుంది అనిపించింది ఆ ఇంటిని చూసాక .
“ఈ రోజు నాన్నగారు ఊరు వెళ్ళారు.తమ్ముడు తన ఫ్రెండ్స్ తో టూర్ వెళ్ళాడు.ఇంట్లో ఉన్నదీ నేను, ఆయా.అయాకి అన్నీ తెలుసు..”అంటూ కిలకిలా నవ్వింది రాగిణి.
‘ఆ రోజు నేను చూసిన పేషెంట్ ఈ అమ్మాయేనా !!??’అనుకున్నాను ఒక్కక్షణం.
“మీరు ఏమనుకుంటున్నారో అర్థం అయ్యింది డాక్టర్ .ఆరిపోయే ముందు దీపం పెద్దగా వెలుగుతుంది అంటారు కదా” రాగిణి గొంతులో బాధ,కళ్ళలో నీళ్ళు నేను స్పష్టంగా గమనించాను.
ఒక్క క్షణం ఆగి“రండి బెడ్ రూంలోకి వెళ్ళి మాట్లాడుకుందాం” అంటూ ఒక రూమ్ లోకి దారి తీసింది రాగిణి.
రాగిణి బెడ్ రూమ్ లోకి అడుగు పెట్టిన నా కళ్ళు చెదిరి పోయాయి.రాగిణి కోరుకున్న ‘రాత్రికి ‘ అ గది అద్భుతంగా అలంకరించి ఉంది.
‘వృత్తి ధర్మం అనే ముసుగులో తప్పు చేస్తున్నావు దుర్మార్గుడా.క్షమించరాని నేరం చేస్తున్నావు. ‘అంటూ నా అంతరాత్మ నన్ను నిలదీయసాగింది.
“ఆయా ప్రస్తుతం నాకు, డాక్టర్ గారికి మంచి బాదం పాలు తీసుకు రా....కాసేపాగి భోజనం ,మిగతావి తీసుకురా.”అంటూ ఆయాని ఆజ్ఞాపించింది రాగిణి.
లోపలకు వెళ్ళి నుంచున్న నన్ను ఒక్కసారిగా మంచం మీదకి లాగింది రాగిణి.నేను పడబోయి నిలదొక్కుకున్నాను.
“కూచోండి. అంత సిగ్గు పడతారేమిటి !?మీరు డాక్టరు .అందులోనూ మా ఆడవాళ్ళ డాక్టరు.”అంటూ చనువుగా భుజం మీద చెయ్యివేసి , నన్ను తనపక్కన కూచోబెట్టుకుంది రాగిణి.
ఆయా ఇద్దరకి పెద్ద గ్లాసుల్లో బాదం పాలు పట్టుకొచ్చింది.
“ఆయా తలుపులు దగ్గరగా వేసి వెళ్ళు.మళ్ళీ నేను పిలిచే వరకూ ఇటు రాకు.”అంది రాగిణి.
ఆయా వెళ్ళడం ,వెళుతూ తలుపులు బయట గడియ పెట్టడం జరిగింది!!??
“తాగండి డాక్టర్ గారు.” అంటూ నా నోటికి గ్లాస్ అందించింది రాగిణి.
నాకు ఏమిటో అంతా వింతగా ,కంగారుగా ఉంది.’అసలు రాగిణి అడిగినదానికి ఒప్పుకుని తప్పు చేసానా !?’అని మొదటిసారిగా అనిపించింది నాకు.
“డాక్టర్ నేను అడగగానే నా కోరిక తీర్చేందుకు ఒప్పుకున్నందుకు థాంక్స్ .ఇదే నా మొదటి రాత్రి. నేను ఈ రాత్రిని బతికి ఉన్నంతవరకు మర్చిపోకూడదు.ఏమంటారు!?”అంటూ గలగలా నవ్వింది రాగిణి.
“అవును..అవును”అన్నాను నేను సాలోచనగా.
ఆ తరువాత అరగంట సేపు ఆగకుండా కబుర్లు చెప్పింది రాగిణి.ఇంచుమించు తన బాల్యం నుంచి ఆ రోజువరకు తన జీవితంలో జరిగిన ముఖ్య సంఘటనలు అన్నీ నాకు చెప్పింది.అందులో ఎక్కువ కాన్సర్ బారిన పడిన తరువాతవి, భాధకరమైనవే.తన మాటలు వినేవారు,తనతో కాలం గడిపేవారు కరువు అయిపోయారని ,ఆ రోజు నేను దొరకడం వలన తన మనస్సులోని భారం కొంత వరకు తగ్గించుకున్నానని చెప్పింది రాగిణి.
నాకు మనస్సు చివుక్కుమంది.ఎందుకంటే కాన్సర్ ట్రీట్మెంట్ లో మందులు వగైరా కన్నా ముఖ్యమైనది బంధు మిత్రుల స్వాంతన. రాగిణికి అది కూడా కరువు అవడం బాధాకరం.రాగిణి చెప్పినట్లు ఆమె తండ్రి డబ్బుతో కూతురుని బాగుచేయవచ్చు అనుకున్నాడు. కానీ ప్రేమ పంచి ఆమె బాధ తగ్గించవచ్చు అని తెలుకోలేకపోయాడు.ఒక ఆడపిల్లగా, కాన్సర్ పేషెంట్ గా తల్లి లేకపోవడం రాగిణికి చాలా పెద్ద లోటు .
“డాక్టర్ ఇప్పుడు ఇక అసలు విషయానికి వచ్చేద్దామా !?”అంటూ నవ్వుతూ అడిగింది రాగిణి.
ఒక డాక్టర్ గా కొంత సేపటి నుంచి ఒక ప్రశ్న నన్ను వేధిస్తోంది .’ఒక టెర్మినల్లీ ఇల్ పేషెంట్ ఇంత ఉత్సాహంగా ఎలా ఉండగలుగుతోంది.విల్ పవర్ అంటే అదేనేమో!?.’
“డాక్టర్......”రాగిణి కంఠంలో గాంభీర్యం ధ్వనించింది.నేను పూర్తి ధ్యానంతో ఆమె చెప్పేది వినసాగాను .
“డాక్టర్ ...మీతో ఒక రాత్రి గడపాలని ఉంది అన్నాను గాని ...మీతో శరీరం పంచుకుంటాను అనలేదు కదా !!??” అని అడిగింది రాగిణి.
“వ్వ్హాట్ !!??...”అని అరిచాను నేను షాక్ తిన్న వాడిలా .
“ ఒక అడ ,మగ మనుషులు ఒక రాత్రి పంచుకుంటామంటే ఆ ఇద్దరూ శారీరకంగా ఒకటి అవుతారనేగా అర్థం.” అంది రాగిణి నాకేసి అదోలా చూస్తూ.
“అవును “అన్నాను నేను.
“ఒక డాక్టర్ గా, నాలాంటి పేషెంట్ తో, శారీరక సంబంధం, ఎంత మాత్రం ఆనందంగా ఉంటుందో మీకు తెలియనిది కాదు.అయినా సరే నా కోసం,నన్ను సంతోషపెట్టడం కోసం మీరు వెంటనే ఒప్పుకున్నారు.నా పాలిట దేవుడు మీరు “అంటూ వెక్కి వెక్కి ఏడవసాగింది రాగిణి.
నేను ఆమెని ఓదార్చే ప్రయత్నం చెయ్యలేదు.ఎందుకంటే ఆమె హృదయంలో పేరుకుపోయి ఉన్న బాధ కరిగిపోవాలి. కొంత సేపటికి రాగిణి తేరుకుంది.కళ్ళు తుడుచుకుంది.
“డాక్టర్ వృత్తి కూడా మిగిలిన వృత్తులలాగే కేవలం ఒక వృత్తి. ఆసుపత్రిలో ఉన్నంత కాలం అతను డాక్టర్.మాములు సమయయాలలో ఒక మనిషి.సామాన్యమైన మనిషి.నేను డాక్టర్ గా మీ ప్రాబ్లం తెలుసుకున్నాను. ఒక సాధారణమైన మనిషిగా మీ బాధను... అర్థం చేసుకున్నాను.”
“ డాక్టర్, నేను ,మీతో ఈ రాత్రంతా గడపాలి.కానీ ... మనిద్దరం శారీరక సుఖాలలో మునిగి కాదు.ఒకరితో ఒకరు సరదాగా మాట్లాడుతూ , నేను మిమ్మల్ని నవ్విస్తూ,నన్ను మీరు ఆనందంలో ముంచెత్తుతూ ....ఈ రాత్రి నా జీవితంలో అత్యంత మధురమైన రాత్రిగా ,నా మిగిలిన జీవితానికి మధురానుభూతిగా మలచుకుంటాను.థాంక్స్ డాక్టర్....థాంక్స్ “అంటూ నా రెండు చేతులు పట్టుకుంది రాగిణి కళ్ళ నీళ్ళు పెట్టుకుంటూ .
“ రాగిణి నా జీవితంలో మీలాంటి స్నేహితురాలు దొరకడం నేను అతి తీయని కలలో కూడా ఊహించని అద్భుతం” అన్నాను నేను సంతోషంగా ###