ఆశా జీవి - వెంకట్ దండుగుల

Aashajeevi

కోడి పుంజు ఇంకా కూయనే లేదు. సెల్లు పోను మాత్రం అదే పనిగా మోగడం మొదలు పెట్టింది. కోడి కూతకు బదులు ఫోన్ మోత నిద్ర లేపింది నన్ను. నాలుగు కొట్టడానికి తయారుగా ఉంది గడియారం. హలో..! అనేలోపే అవతలి గొంతు..శనార్థయ్యా'..! అన్నది. గత పాతికేండ్లు గా పరిచయం ఉన్న గోంతే అది. నిద్ర మత్తులో కూడా గుర్తు పట్టడానికి ఎక్కువ సమయం పట్టలేదు. ఆ గొంతు పేరే గంగన్న. గంగన్న మా పాలేరు.. నా దగ్గరే నమ్మకంగా పని చేస్తున్నాడు. పొలం పనులన్నీ వాడే దగ్గరుండి చూసుకుంటాడు. కష్ట జీవి. కష్ట పడే వారంటే నాకు చాలా అభిమానం. నేనూ నా కష్టాన్ని నమ్ముకొనే చిన్న రైతు స్థాయి నుంచి ఊర్లో మోతుబరి రైతుల్లో ఒకన్ని అయ్యాను. ఏందిరా గంగూ..ఇంత పొద్దుగాల ఫోన్ జేసినవ్, ఏమ్ సంగతి అని అడిగాను కళ్లు పూర్తిగా తెరిచె ప్రయత్నం చేస్తూ. చెమించయ్యా...మీ నిద్దుర సెడ గొట్టినట్టున్నాను. నిన్న రేతిరి నుంచి నాకొంట్లో బాగుందలేదు.. ఈ యేల డేక్టేరు దగ్గర్కి పొయ్యి సూపించుకొని, అట్ నుంచటే పొలం కాడికి పోతనయ్యా.. అన్నాడు అమాయకంగా. ఓరినీ రేతిరి తాటి కళ్లు ఎక్కువగా తాగినవా ఏంది..? అట్టాగే పోయి సూపించుకో ఆస్పత్రిలో.. డబ్బులుమన్నా గావాలంటే మీ అమ్మగోరిని అడిగి పట్టుకుపో అన్నాను వాడికి ధైర్యం చెబుతున్నట్లుగా, ఫోన్ పెట్టేస్తుండగానే పెరట్లో నుంచి కోడి కూత.. నాకేదో గుర్తొచ్చినట్లుగా ఏమేవ్...! ఇయ్యాల పట్నం పోవాలే కదా.. మర్చిపోయావా, తెల్లారింది లెవ్వు అని కేకేసాను మా ఇంటిదాన్ని. పాలేరు తోడు లేకుండా నేను పట్నం ఎప్పుడూ పోయి ఎరుగను. ఇయ్యాల ఒక్కన్నే పోవాలి. అయినా పట్నం నాకు కొత్తేమి కాదు. కాకపోతే పట్నమోళ్లంటేనే పడదు నాకు. పల్లెటూరోళ్లంటే సానా సిన్న సూపు ఆళ్లకు. అమాంతం మోసం సెయ్యాలనుకుంటారు. పనీ పాట సెయ్యకుండానె కష్టపడకుండానే పైసా సంపాదించాలని సూస్తారు. పట్నం పరిసరాలు ఎంత కాలుష్యంగా ఉంటాయో పట్నం ప్రజల్లో అంత కల్మషం ఉంటుంది. అంతా దోపిడీ, మోసం. అయినా మా బోటి పల్లెటూరోళ్లకు పట్నం బోక తప్పదాయే. పొలానికి సంభందించిన పతీది పట్నం లోనే కొనాలే. పట్నం బోయే బస్సు పదిoటికి వస్తుంది ఊళ్ళోకి. గంట ముందే తయారయ్యి ఇంటి ముందు కుర్చీలో కూసోని పేపర్ తిరగస్తున్నాను సుట్ట కలుస్తూ.. సిటీ పేపరులో అన్నీ నేరాలు, ఘోరాలే. ఇగ ఈ పట్నం ప్రజలు మారరు అనుకుంటుండగానే బస్సు హారన్ మోగింది. కండువా భుజాన వేసుకొని, చేతిలో కర్రతో దర్జాగా బస్సులో ఎక్కి కూర్చున్నాను. దుమ్ము రేపుతూ.. సిటీ బస్సు స్టాపులో ఆగింది బస్సు. దిగాల్సిన ప్రయాణికులు ఇంకా దిగనే లేరు.. అవేమి పట్టింపు లేకుండా ఎక్కల్సిన వారు అపాటికే సగం మంది ఎక్కేసారు తోసుకుంటూ. బస్సు దిగక ముందే మొదలయ్యాయి నా తిప్పలు. పావు గంట పట్టింది బస్సు దిగాలంటే, బతుకు జీవుడా అనుకున్నాను ధోతి సరి చేసుకుంటూ. రెండడుగులు కూడా ముందుకు వేయనేలేదు, అయిదారు ఆటో రిక్షాలు ఆగాయి ఒకదానికి పోటీ పడుతూ మరొకటి. ముందుగా వచ్చిన ఆటో వాలా కిదర్ జానేకా అన్నాడు నిర్లక్ష్యంగా.. వాడి ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండానే తల అడ్డంగా ఊపాను. వాడేదో గొనుక్కుంటూ చికాకుగా మొహం పెట్టి వెళ్ళిపోయాడు. వాడి చికాకులో 'ఎక్కడినుండి వస్తారు ఈ పల్లెటూరోళ్లు' అని అర్ధం ఉందని నాకు అర్ధం అయ్యింది. అంతలోనే ఇంకో ఆటోవాలా మాసిన గడ్డం తో.. వచ్చి బోలో సాబ్ కహా జానా హై ఆప్కో అన్నాడు. భాషలో కొంచెం మర్యాద కనిపించింది. అయినా మోసగాళ్లు మర్యాద ప్రదర్శిస్తారని తెలుసు నాకు. "గాంధీ చౌక్ " వస్తావా అన్నాను.. కూర్చోండి సాబ్.. ఎంత తీసుకుంటావ్ అరవై రూపాయలు సాబ్.. నేనేమి కొత్త కాదు. నెలకు పది సార్లు వెళతాను, యాభై రూపాయలే అవుతుంది. యాభై ఇస్తాను వస్తావా..? లేదు సాబ్ అరవై అవుతాయి.. ఇప్పుడు రేట్లు పెరిగాయి. రెండు రోజులకే రేట్లు పెరిగాయా.. నేను మొన్ననే ఎక్కాను ఆటో అని తెలివిగా వాదించాను. పది రూపాయల కోసం ఆలోచించకండి సాబ్ అన్నాడు. నేను అరవై ఇవ్వకూడదు అనుకున్నది పది రూపాయలు లేక కాదు, పట్నం ఆటో వాలా వద్ద మోస పోవడం ఇష్టం లేక. యాభై కి వస్తే రా.. లేకపోతే వేరే ఆటో చూసుకుంటా అన్నాను కొంచెం కోపంగానే. కూర్చోండి సాబ్.. యాభై యే ఇవ్వండి అన్నాడు నిరాశగా, ఇక తప్పదు అన్నట్లుగా.. ఆటో వాలా నిరాశ కొట్టొచ్చినట్లు కనిపించింది నాకు అతని మొహం లో.. అయినా అవేమి పట్టించు కోలేదు నేను. ఆటో నాలుగు రోడ్ల కూడలి వద్ద ఆగింది.. సిగ్నల్ కోసం చూస్తున్నాడు ఆటో వాలా. ఆటో పక్కనే తెల్లటి పొడవైన కారోచ్చి ఆగింది. కారు ఆగగానే మా ఆటో వెనకాలే ఉన్న ఒక వ్యక్తి కారు అద్దాలపైన నీళ్లు చల్లి.. చిన్నపాటి వైపర్ తో తుదవడం మొదలు పెట్టాడు. అద్దాలు తుదవడం అయిపోయాక డబ్బులు అడిగాడు కారు డ్రైవర్ ను సైగలతోనే. ఆ వ్యక్తినే గమనిస్తున్న నేను.. ఈ పట్నం లో ఇదొక పద్ధతి అడుక్కోడానికి అనుకున్నాను మనసులో. అంతలోనే సిగ్నల్ పడింది. కారు డ్రైవర్ ఆ వ్యక్తిని పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. ఆ వ్యక్తి మరో కారు దగ్గరకు వెళ్ళ బోయేంతలో ఆటో వాలా అతన్ని పిలిచి, జేబులో నుంచి పది రూపాయలు తీసి ఇచ్చాడు. ఆ వ్యక్తి మొహం ఆనందం తో వెలిగిపోయింది. ఆశ్చర్య పోవడం నా వంతయ్యింది. నాతో పది రూపాయల కోసం పది నిమిషాల పాటు వాదించిన ఆటో వాలా.. ఆ వ్యక్తి అడగకుండానే పది రూపాయలు ఇచ్చాడు. ఆటో తో పాటు గా నా ఆలోచనలు కూడా కదిలాయి. అద్దం లో కనపడుతూంది అతని మొహం. ఇంతకు ముందున్న నిరాశ ఇప్పుడు కనిపించట్లేదు. ఆత్మ విశ్వాసం తో కూడిన తీక్షణమైన చూపు. నాకు ఆ ఆటో వాలా ని పలకరించాలని పించింది. ఈ ఆటో రిక్షా నీదేనా..? లేదు సాబ్ కిరాయి ఆటో చూడడానికి చదువుకున్నట్లుగా ఉన్నావు.. ఈ ఆటో రిక్షా ఎందుకు తోలుతున్నావు..? అవును సాబ్ ఎమ్మె వరకు చదువుకున్న.. కరోనా వల్ల ఉద్యోగం పోయింది. ఇంకో ఉద్యోగం వెతుక్కుంటున్న అంతవరకు ఈ ఆటో. మరి అంత ఆర్ధిక పరిస్థితి బాగా లేనప్పుడు, ఆ వ్యక్తికి పది రూపాయలు ఎందుకు దానం చేసావు అని అడిగాను ఆత్రంగా. ఓ అదా.. నేను చేసింది దానం కాదు సాబ్. అతను బిచ్చగాడు కాదు. అతనికి రెండు కాళ్ళు లేవు. అయినా అతను అడుక్కోవడం లేదు. ప్లాస్టిక్ కాళ్ళను పెట్టుకొని పని చేసి పైసలు తీసుకుంటున్నాడు. బ్రతుకు పైన ఆశ ఉన్న వాడికి అడుక్కోవాల్సిన అవసరం లేదని ఆ అవ్యక్తి ని చూసి తెలుసుకున్నా సాబ్.. నేనిచ్చింది అతని ఆత్మ స్థైర్యానికి అన్నాడు. నా అశ్చర్యం రెండింతలు రెట్టింపయ్యింది. కష్టపడి పనిచేసే వ్యక్తి నాకు అడుక్కునేవాడిలా కనిపించాడు. ఆత్మ విశ్వాసం గల ఆటోవాలా మోసగాడిలా అనిపించాడు. రెండు కాల్లు లేకున్నా పనిచేసుకుంటున్న ఆ వ్యక్తి వ్యక్తిత్వం ముందు, పది రూపాయల కోసం పరి తపించి పోయే పరిస్థితుల్లో ఉన్నా, కష్టపడే వానిని అదే పది రూపాయలతో ప్రోత్సహించిన ఆటోవాలా మానవత్వం ముందు, పట్నం ప్రజల పట్ల ప్రతికూల దృక్పధం తో ఉన్న నా మూర్ఖత్వం సిగ్గుతో తల దించుకునేలా చేసింది. దిగండి సాబ్ గాంధీ చౌక్ వచ్చేసింది అన్న ఆటో వాలా మాటలు నా ఆలోచనలను అడ్డు కున్నాయి. ఆటో దిగి ఆటో వాలాకు అరవై రూపాయలు ఇవ్వబోయాను. అతను పది రూపాయలు తిరిగి నాకు ఇచ్చేస్తూ.. మనం మాట్లాడుకున్నది యాభై రూపాయలే సాబ్ అన్నాడు. తిరిగి ఇచ్చినా ఆటో వాలా తీసుకోడని నాకు తెలుసు అతని వ్యక్తిత్వం అటువంటిది. ఈ రోజు ఒక గొప్ప పాఠాన్ని నేర్పించాడు ఈ ఆటోవాలా.. ఆటో వాలా కాదు అతను ఆశాజీవి. ఉంటా సాబ్ అని ఆటో రిక్షా స్టార్ట్ చేస్తున్న అతన్ని అలాగే చూస్తుండి పోయాను చేతిలో పది రూపాయల నోటుతో.

మరిన్ని కథలు

Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు
Pratibha
ప్రతిభ
- చెన్నూరి సుదర్శన్
Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు