" ఏరా , ఉష భలే అందం గా వుంది కదూ ?!! " అంది సుకన్య ,తమ్ముడు రాజు చెవిలో చిన్నగా, అతని భావాలను గమనిస్తూ .
" ఊఁ ,అవును " అన్నాడు రాజు లోపలి నుండీ ట్రే లో కాఫీ కప్ లను పట్టుకొస్తున్న ఉష ను చూస్తూ.
లోపలి నుండీ టవల్ తో చేతులు తుడుచు కుంటూ వచ్చి సుకన్య పక్కన కూర్చొంది ఉష వదిన రమ.
"ఎప్పుడొచ్చారు మీ తమ్ముడు " అడిగింది రమ, రాజు ను ఉద్దేశించి.
" రెండు రోజులైంది." అంది సుకన్య కాఫీ త్రాగుతూ..
" ఏం చేస్తుంటారు?" ప్రశ్నించింది రమ. ఉష కూడా కుతూహలంగా చూసింది.
రాజు ను చూసి సైగ చేసింది సుకన్య ,నువ్వే చెప్పమన్నట్టుగా.
కాఫీ కప్ కింద పెట్టి చెప్పాడు రాజు " స్వంతంగా ప్లాస్టిక్ పరిశ్రమ ,
పెట్టానండి. అదే చూసుకుంటాను. ప్రస్తుతం కరోనా లాక్ డౌన్ నడుస్తూ వుంది , సో ... ఫ్యాక్టరీ పని చేయటం లేదు . '' ఇంకా ఏం చెప్పాలో తెలీక ఆగి పోయి అక్క సుకన్య వేపు చూసాడు. అందరూ కూడా సుకన్య వేపు చూసారు .
" దాంతో ఖాళీ గా ఉండి , నా దగ్గరకు వచ్చాడు,రెండు రోజుల నుండీ ఎటూ కదల కుండా ఇంట్లోనే ఫుల్లుగా నిద్ర పోతున్నాడు..అది చూసి
మీ ఇంటికి తీసుకొచ్చా, బోర్ అవుతున్నాడని.." చెప్పింది సుకన్య నవ్వుతూ..
" ఈ పల్లెలో ఎటు వెళ్లాలండి ? ఏమీ తోచటం లేదు,, ఏం చేయను " అన్నాడు చిరు నవ్వుతో రాజు.
స్నేహితురాళ్ళిద్దరూ మాటల్లో పడ్డారు. రాజు , ఉష మౌనంగా వింటూ కూర్చున్నారు.
ఉష వేపు చూపు తిప్పకుండా, మనసుని అదుపులో ఉంచి ,తలవంచుకుని కూర్చున్నాడు రాజు.
కొద్దిసేపటికి రమ తేరుకుని రాజు ని చూసి " అరెరే ..మనం మాట్లాడుతూ వున్నాం ..రాజు కు బోర్ కదా...ఉషా ..మీ తోట చూపించు రాజు కి." అని ఉషని చూసింది .
" రాజు..అలా సరదాగా చూసి రా ,వీరి తోట ..... ఇంటి వెనకాలే " అంది చిరు నవ్వుతో రాజుని చూసి వెళ్ళమన్నట్లుగా సైగ చేసి.
"సరే అక్కయ్య " అంటూ లేచి ఉష వెనక నడిచి వెళ్ళాడు రాజు.
ఇంటి వెనక వేపున్న గేట్ లో నుండి తోట లోకి అడుగు పెట్టారు ఇద్దరు. చుట్టూ
కలయ చూసాడు రాజు. ఒక వేపు మల్లె తోట లో పూలు నిండుగా పూసి , వాటి పరిమళం తెరలుగా తాకుతూ వుంది.
మరొక వేపు పొద్దు తిరుగుడు మొక్కలు నిండుగా వున్నాయి .
కాస్త దూరం లో మామిడి చెట్ల తోపు దట్టంగా కనపడుతూ వుంది.
ఒక పక్క నుండీ సన్నని నీటి కాల్వ పారుతూ వుంది. చల్లటి పిల్ల తెమ్మరలు మొహానికి తాకుతూ వున్నాయి.
అక్కడక్కడా జామ చెట్లు కూడా వున్నాయి.
మనసు ను అదుపు చేసుకోలేక ఒక సారి ఉష ను చూసాడు రాజు.
ఉష నడుస్తూ ఉంటే అచ్చంగా వన దేవత లాగా కనిపించింది.
మైమరచిపోయి చూస్తూ ఉండగా చటుక్కున రాజు ను చూసింది ఉష .
వెంటనే చూపులు మరల్చుకుని " బావుంది ..మీ పూల తోట,పండ్ల తోట " అన్నాడు రాజు.
సమాధానం గా చిన్న చిరునవ్వు తో రాజు వేపు చూసింది ఉష.
ఆ నవ్వు చూసి మరింత సమ్మోహితుడై పోయాడు రాజు.
" ఏం చదువుతున్నారు ?" అడిగాడు , తనను తాను సంభాళించుకుని .
"ఇంజినీరింగ్ ఆఖరి సంవత్సరం " అంది ఉష.
" ఓహో..తర్వాత ఏం చేస్తారు ? ." అడిగాడు సంభాషణ పొడిగిస్తూ .
"నేనేమీ అనుకోలేదండి .. అదంతా అన్నయ్య ఇష్టం " అంది పొడిపొడి గా.
" మీ నాన్నగారు ఏం చేస్తుంటారు ?" ప్రశ్నించాడు , ఉష పాదాలను
గమనిస్తూ .
" మా నాన్నగారు లేరు..అంతా అన్నయ్యే" అంది కాస్త నిరుత్సాహంగా .
మరింకేమీ
మాట్లాడ కుండా మామిడి తోట లోకి నడిచారు ఇద్దరూ.
"రంగయ్య .." అని అక్కడ పని చేస్తున్న
నడి వయస్కున్ని పిల్చింది ఉష .
వడివడిగా నడుస్తూ వచ్చాడు రంగయ్య.
" ఇంట్లోకి వెళ్లి తాగటానికి నీళ్లు పట్టుకు రా " అని రంగయ్య చెప్పి, రాజు వేపు తిరిగి చూసి,
చెట్టు కింద రెండు ప్లాస్టిక్ కుర్చీలను చూపిస్తూ " అక్కడ కూర్చుందాం రండి " అని దారి తీసింది ఉష.
ఎటువంటి అలంకరణ లు లేక పోయినప్పటికీ చాలా అందంగా వుందీ అమ్మాయి అనుకున్నాడు. .
నగలు , ఆభరణాలు లేకున్నా ఏదో తెలీని అందం.
" మీ చదువు, కాలేజీ గురించి చెప్పండి ..క్యాంపస్ సెలెక్షన్స్ ఉంటాయా మీ కాలేజీ లో ? "
మర్యాద పూర్వకంగా అన్నాడు. .
" మా వూర్లో కాలెజీ ఉందని తెలియక పోవచ్చు ఈ కంపెనీలకు.. అందుకే ఒక్కటీ రాదు" అంది పక్కున నవ్వి.
" మీరెక్కడ ఉండటం "అంది స్నేహంగా చూస్తూ. ఇతడి కళ్ళలోకి చూస్తూ మాట్లాడటం కష్టమే , మంచి ఆకర్షణ , అనుకుంది.
"బాపట్ల " సమాధానం చెప్పాడు.
ఇద్దరూ కాలేజీ విశేషాలు , కుటుంబ విషయాలు చాలా సేపు మాట్లాడుకున్నారు.
వాచీ చూసుకున్నాడు రాజు. రెండు గంటలు తెలీకుండా గడిచిపోయాయి అనుకున్నాడు.
ఇంత లో రంగయ్య వచ్చి "అమ్మగారు పిలుస్తున్నారండీ" అని చెప్పాడు.
.
" వెళదాం పదండి " అంటూ లేచి ఇంటి వేపు నడిచింది ఉష.
ఇంకాసేపు కూచుంటే బావుండేది అనుకున్నాడు రాజు.
అక్కడనుండి రాజు , సుకన్య , స్కూటర్ మీద వెను తిరిగారు.
కొద్ధి దూరం వెళ్ళాక ఒక్క సారి వెనక్కి చూసాడు రాజు ,ఇంకా ఇంటి బయటే నిలబడ్డ ఉష వెంటనే చెయ్యి లేపి గాల్లోకి ఊపింది. అది చూసి సంతోషంగా నవ్వుకుని ముందుకి సాగాడు .
మరుసటి ఉదయం టిఫిన్ చేసి, ముందు గదిలో కూర్చొని టివి చూస్తున్న రాజు కు కాలి మువ్వల చప్పుడు వినిపించి ముందు తలుపు వేపు చూసాడు.
ఒక జడ ముందుకు ,ఇంకో జడ వెనక్కు వేసుకుని లోనికి కాలు పెడుతున్నఉష కనిపించింది. చటుక్కున లేచి నిలబడ్డాడు.
ఉష సౌందర్యాన్ని చూస్తూ ముగ్దుడైపోయి చూస్తూ నిలబడి పోయాడు రాజు.
తలలో రింగుల జుట్టు , చెంపల మీదుగా జారి, తెలీని అందాన్ని తెచ్చిపెట్టాయి.
ఒత్తయిన కనుబొమలు, విశాలమైన నేత్రాలు , పొడవాటి ముక్కు, సన్నని పెదాలు .చిన్న నుదురు, అందంలో వేటికవే పోటీ పడుతున్నాయి.
ఉలుకు పలుకూ లేకుండా నిలబడ్డ రాజుని చూసి " సుకన్య వదిన లేరా?" అడిగింది మనోహరంగా నవ్వి,నవ్వకుండా.
ఆ మాటతో ఉలిక్కి పడి ఈ లోకం లోకి వచ్చి "వున్నారండి " అని కంగారుగా అంటూ చెయ్యెత్తి లోపలి వేపు చూపించాడు.
సరేనంటూ లోపలి కి వెళుతూ ,రాజు తత్తరపాటు చూసి ,అటు వేపు తిరిగి నవ్వుకుంది ఉష.
కొద్ధి సేపటికి లోపలి నుండీ వచ్చిన సుకన్య ,ఒక ప్లేట్ లో స్వీట్స్ తీసుకుని వచ్చి " ఇదుగో రా ,ఉష తీసుకొచ్చింది " అని రాజు చేతి లో పెట్టి , ఉష వేపు తిరిగి " , ఏం చేస్తోంది మీ వదిన ? " అని అడిగి " కూర్చో ఉష" అంటూ రాజు ముందు వేపు కి కుర్చీ లాగి సరి చేసింది.
ఉష ను చూస్తు మైమరచి పోయి గంట సేపు బాతాఖాని వేసాడు రాజు . ఇద్దరూ చాలా ఉత్సాహంగా కబుర్లు చెప్పుకోవటం చూసి , వయసు ప్రభావం అటువంటిది అనుకుని లోనికి వెళ్ళింది సుకన్య . అక్కడే మధ్యాహ్నం భోజనం చేసి సాయంత్ర ఇంటికి వెళ్ళింది ఉష.
ఆ ఊరిలో వున్నన్ని రోజులు రాజు , ఉష , ప్రతి ఉదయం , పగలు ,రాత్రి ఫోన్ లో గంటలు మాట్లాడుకోవటం గమనించింది సుకన్య. వాళ్లిద్దరూ కొన్ని సార్లు చెరువు గట్టు మీద, మరి కొన్ని సార్లు కాళికా దేవి గుడిలో కలుసు కునే వారు. కొద్దీ రోజుల తర్వాత ఒంటరి గా వూరికి దూరంగా పొలం గట్టు దగ్గర కలిసి సన్నిహితంగా వుండే వారు.
ఇలా ప్రతి రోజూ ఏదో విధంగా కలుస్తూ, మానసికంగా చాలా దగ్గరయి, ఒకరినొకరు వదల లేనంత ప్రేమ లో పడ్డారు. నెల రోజులు గిర్రున తెలీకుండా గడిచిపోయాయి.
ఇంతలో లాక్ డౌన్ ఎత్తి వేశారు. తిరిగి ఫ్యాక్టరీ తెరిచే సమయం వచ్చింది రాజుకి.
ఆ రోజు సాయంత్రం ఊరి చివర్లో వున్న పాడుబడ్డ గుడి దగ్గర కలుసుకున్నారిద్దరూ.
" రేపు వెళ్ళాలి , ఫ్యాక్టరీ పనులు మొదలు అవుతాయి. " కాస్త నీరసంగా చెప్పాడు రాజు.
"మళ్ళీ ఎప్పుడొస్తావు రాజు ?" భయంగా అడిగింది ఉష, రాజు భుజం మీద తల వాల్చి.
గుడి మెట్ల పైన కూర్చుని దూరంగా మిణుకు మిణుకు మంటున్న ఊరి వీధి దీపాలను చూస్తూ , మౌనంగా వుండి పోయారు ఇద్దరూ. పాత గుడి కావటం మూలాన ఎక్కువ జనాలు రాకుండా, కాల క్రమేణా పాడుబడి పోయింది.
" నాకు తొందరలో పెళ్లి చేసేస్తారు, నువ్వొచ్చి మాట్లాడాలి రాజు." అంది ఆదుర్ధాగా ఉష.
" మా ఇంట్లో వాళ్లకు ముందు చెప్పి, వాళ్ళను ఒప్పించి , మీ ఇంటికి వస్తాను, లేదా మా అమ్మ,నాన్నను పంపిస్తాను. " అన్నాడు , ఉష భుజాల మీద చేతులు వేసి దగ్గరకు హత్తుకుంటూ .
రాజు గుండెల మీద వొదిగి పోయి " కులాలు , గోత్రాలు , శాఖల గొడవలు ..ఎలా వుంటాయో ఏమో " అంది . ఉష జడ లోనుంచి వస్తున్న మల్లెల సువాసన రాజు గుండెల్లో నిండి పోయింది.
,
" అవన్నీ నేను చూసుకుంటాను ,నువ్ అధైర్య పడకు , కానీ రోజూ ఫోన్ చేస్తూ వుండు " అని
ఉష చుట్టూ వున్న చేతులు తీసాడు రాజు,ఇక వెళదాం అన్నట్లుగా.
" ఇంకాసేపు ఉందాము " అంది ఉష ,రాజు చేతులు వదల కుండా.
ఇద్దరి మధ్యా మౌనం రాజ్యమేలింది.
గంట తర్వాత లేచి ఇద్దరూ ఒకరి చేతులు ఇంకొకరు పట్టుకుని చీకట్లో ఇంటి వేపు నడిచారు.
మరుసటి రోజు అక్కయ్యకు వీడ్కోలు చెప్పి బస్సు ఎక్కి వెళ్ళిపోయాడు రాజు.
ప్రతీ రోజు అన్న, వదిన లకు తెలీకుండా రాతుళ్ళు చాలా సేపు మెల్లిగా మాట్లాడుతూ ఉండేది ఉష.
మధ్య రాత్రులు మెలకువ రాగానే , దుప్పటి నిండా కప్పుకుని ఫోన్ లో మాట్లాడుకునే వారు.అలా ఒక నెల చాలా గడిచి పోయింది.
రాత్రి ౨పన్నెండు గంటల వరకూ కబుర్లు చెప్పుకుని పడుకున్నారు రాజు, ఉష.
ఉదయం లేచిన తర్వాత ఫ్యాక్టరీ కి వెళ్లే వరకూ ఉష నుండీ ఫోన్ రాలేదు . మధ్యాహ్నం వరకూ ఎదురు జూసి , తానే ఫోన్ కలిపాడు. ఫోన్ నాట్ రీచబుల్ అని రావటం తో మళ్ళీ కాసేపు ఆగి చేసాడు. అయితే మళ్ళీ అలాగే రాసాగింది. ఏదో ప్రాబ్లెమ్ వున్నట్లుంది అనుకుని , పనిలో పడిపోయాడు.
సాయంకాలం పని వాళ్ళందరూ వెళ్ళిపోయాక , చైర్ లో వెనక్కి వాలి , అదే నెంబర్ కలిపి చూసాడు . కానీ కలవటం లేదు. అదే మెసేజ్ వస్తూ వుంది.
ఇంటికి వెళ్లి డిన్నర్ చేసాక, మంచం మీద పడుకుని , నెంబర్ కలిపాడు. ఎన్ని సార్లు కలిపినప్పటికీ నాట్ రీచబుల్ అని వినపడింది. అర్ధ రాత్రి వరకూ నిద్ర పట్టక చాల సేపు మంచం పైన మసలుతూ వుండిపోయాడు తర్వాత నిద్ర పోయాడు.
ఏం చేయాలో తెలీక ఉష నుండీ ఫోన్ వస్తుందని ప్రతి రోజూ ఎదురు చూడసాగాడు. ప్రతి పది నిముషాలకు ఫోన్ చూసుకోసాగాడు. ఉష గురించి , ఉష నుండీ కాల్ ఎందుకు రావట్లేదని ఆలోచనలతో సతమతమై పోయాడు.
పది రోజుల తర్వాత ఏదో నెంబర్ నుండి ఫోన్ వచ్చింది.
" హలో చెప్పండి , ఎవరూ " అన్నాడు రాజు .
అటు నుండీ ఉష గొంతు వినిపించింది. " హలో ! రాజు " కంగారుగా అంది ఉష.
గుండెలు అదురుతుండగా వెంటనే అన్నాడు రాజు " నీ నెంబర్ దొరకటం లేదు. ఏమైంది.. ఉష, నువ్వెందుకు చేయటం లేదు ."
అటునుండి భయంగా ఉష గొంతు వినిపించింది "నా ఫోన్ తీసేసుకున్నారు మా అన్నయ్య, నా పరిస్థితి బాగా లేదు,ఇది నా ఫ్రెండ్ నెంబర్ , నువ్వు ఇక్కడికి వచ్చాక మాట్లాడుతాను " అని పెట్టేసింది ఉష.
"హలో హలో " అన్నాడు రాజు, కానీ అటువైపు నుండీ చప్పుడు లేదు.
మళ్ళీ వచ్చిన అదే నెంబర్ కు కాల్ చేసాడు రాజు. కానీ నాట్ రీచబుల్ అని
వినిపించింది. ఎన్ని మార్లు చేసినప్పటికీ అలాగే వచింది.
'ఏం జరిగిందో ఏమో , వెళ్ళటం మంచింది, ఇంకా ఆలస్యం చేయ కూడదు' అనుకున్నాడు రాజు. ఫ్యాక్టరీ నుండీ ఇంటికి వెళ్ళగానే " అమ్మా ,...నీతో ఒక విషయం మాట్లాడాలి " అని ఎదురుగా కూర్చోపెట్టుకుని అమ్మతో అన్ని విషయాలు చెప్పాడు రాజు.
అన్నీ విని నిట్టూర్చింది రాజు అమ్మగారు.
" అమ్మా..నాన్నగారి తో నువ్వే మాట్లాడాలి ఉష విషయం "అని
చెప్పాడు రాజు.
" మీ నాన్నగారు ఢిల్లీ నుండీ రావటానికి ఇంకో పదిహేను రోజులు పట్టవచ్చు, రాగానే ఇద్దరం చెప్పి చూద్దాం, నువ్వు ఖంగారు పడకు " సమాధాన పరుస్తూ అంది రాజు అమ్మగారు.
అమ్మ మాట తో కొండంత ధైర్యం వచ్చింది రాజుకు.
ఉష నుండీ మళ్ళీ ఫోన్ వస్తుందేమో అని ప్రతి రోజూ ఎదురు చూసాడు, కానీ రాలేదు.
ఉష నుండీ వచ్చిన ఫోన్ నెంబర్ కు మళ్ళీ ట్రై చేసాడు, కానీ అటువైపు నుండీ చప్పుడు లేదు.
సుకన్య అక్క కు చేయాలా వద్దా అని ఆలోచించాడు.
ఊరికి వెళ్ళినప్పుడు చెప్పటం మంచిదని ఊరుకున్నాడు.
ఫ్యాక్టరీ పనులు చేసుకుంటూ , ఉష మీద ధ్యాస తో ఆ కొద్ధి రోజులు గడిపాడు.
దాదాపు ఇరవై రోజుల తర్వాత రాజు నాన్నగారు తిరిగి వచ్చారు.
నాన్న రాగానే భోజనం చేస్తూ విషయం కాస్త టూకీగా చెప్పాడు.
కొడుకు ప్రేమ కథ అంతా విన్న రాజు నాన్నగారు భోజనం పూర్తి చేసి ఏమీ మాట్లాడకుండా లేచి వెళ్ళిపోయాడు.
అది చూసి ఏం చేయాలన్నట్లుగా అమ్మ వేపు చూసాడు .
" కాస్త ఆలోచించటానికి నాన్నకు సమయం ఇవ్వు " సమాధాన పరుస్తూ అంది రాజు అమ్మ గారు.
నాన్న ఏం చెబుతారో ,ఏమంటారో అని దాదాపుగా పదిహేను రోజులు
ఎదురు చూసాడు రాజు .
ఆఖరికి ఒక రోజు ధైర్య చేసి అడిగాడు. " నాన్నా, ఉష విషయం లో ఏమంటారు , ఏం చేయను ? " అని.
" ఇది చాలా సంక్లిష్ట మైన విషయం రాజు, వాళ్ళు మన వారు కాదు, వారి ఇంటి కి మేము పెద్దలుగా వెళ్ళితే , ఆ ఇంటి వారు ఎలా స్పందిస్తారో తెలీదు. ముందుగా వారి అభిప్రాయం కనుక్కుంటే, వెళ్ళటానికి వీలు అవుతుంది " అన్నాడు గడ్డం కింద చేతులు పెట్టుకుని సుదీర్ఘంగా ఆలోచిస్తూ.
" సరే నాన్న అయితే మరి,నేనే వెళ్ళొస్తా, సుకన్య అక్కయ్య తో మాట్లాడి వాళ్ళ అభిప్రాయం కనుక్కుని రమ్మంటాను ?" అడిగాడు రాజు
ఆలోచనలతో , శూన్యం లోకి చూస్తూ ,,ఏమీ మాట్లాడ కుండా ,వెళ్ళు అన్నట్లుగా తల మాత్రం ఊపాడు రాజు నాన్నగారు.
మరుసటి రోజు ఫ్యాక్టరీ పనులు త్వరగా పూర్తి చేసుకుని సాయంత్రం ఉష ను కలిసే ఆనందం తో కార్ ,ఎక్కి వేగంగా పరిగెత్తించాడు.
కార్ దిగి ఇంట్లొకి వెళ్లే సరికి సుకన్య భర్త ఎదురు వచ్చాడు ."రా.. రా.. రాజు , అంత క్షేమమేనా? కాళ్ళు కడుక్కుని ఇంట్లోకి రా ' అంటూ లోనికి దారి తీసాడు.
లోపలి కి వెళ్ళాడు రాజు . ఇల్లంతా నిశ్శబ్దం గా వుంది.
" అక్కయ్య లేరా ?" ఆదుర్ధా గ ప్రశ్నించాడు రాజు.
" ఇదుగో ఇప్పుడే పసుబ్బోట్టుకంటూ వెళ్ళింది.. కాస్త ఆలస్యం కావచ్చు ..నువ్వంత వరకూ సేద తీర్చు కో ..కాఫీ కలపనా?" అంటూ లేచి వంటింట్లోకి వెళ్ళాడు సుకన్య భర్త.
బావ ఇచ్చిన కాఫీ త్రాగి, ఒక మారు ఉష ఇంటి వేపు వెళ్లి వస్తే బావుంటుందేమొ అనుకుని
" బావా ఇప్పుడే వస్తా" అంటూ బయటకు నడిచాడు రాజు.
ఉష ఇల్లు దగ్గర అవుతున్న కొలదీ రాజు గుండె వేగం పెరగ సాగింది
చీకటి పడటం మూలాన , ఆ వీధి అంతా చీకటిగా వుంది .ఉష ఇంటి ముందు ఏమీ కనపడటం లేదు. అప్పుడే చంద్రుడు మబ్బుల లోనుండీ బయటకు తొంగి చూసాడు. మెల్లిగా అప్పుడే వెన్నెల వీర బూసింది.
ఇంకాస్త దగ్గరకు నడిచే సరికి , ఇంటి బయట గేట్ ముందు ఉష నిలబడి ఉండటం చూసాడు. గుండె ఉప్పోగి పోయింది. సంతోషం తో ఉక్కిరి బిక్కిరై పోయాడు.
పసుపు రంగు చీరలో, వెంట్రుకలు విరబోసుకుని ఆకాశం నుండీ దిగి వచ్చిన ఊర్వశి లాగ వుంది.
రాజు ను చూసి గబగబా ముందుకు వచ్చి " రాజు!! ... మనం ఎప్పుడూ కలిసే కాళికా దేవి గుడి వద్ద కు వెళ్ళు , నే కాసేపటిలో వచ్చేస్తా.. వెళ్ళు! .. అన్నయ్య చూసాడంటే పెద్ద గొడవ అవుతుంది! " అని వేగంగా చెప్పి ఇంట్లోకి లోపలి కి వెళ్లి పోయింది. ఎలా ఉంటుంది అని
ఒక్క క్షణం అలాగే నిలబడి పోయాడు రాజు. ఉష అంతలా ఎందుకు భయపడుతోందో అర్థం కాలేదు. అప్పుడే లోనికి వెళ్లి ఉష అన్నయ్యతో మాట్లాడితే ఉంటుంది అని ఇంకో క్షణం ఆలోచించాడు.
ఉష చెప్పినట్లుగా ముందు తనతో గుడి దగ్గర మాట్లాడితే బెటర్ అనుకుని అక్కడ నుండీ కదిలాడు రాజు. ఆ వూరిలో రెండు, వీధులు తిరిగి గుడి దారి పట్టాడు . గుడి దగ్గర నిర్మాణుష్యంగా వుంది. చంద్రుడి వెన్నెల పుచ్చపూవులా పరుచుకుని వుంది. వీధి లో గుడికి వెళ్లే దారిలో వీధి దీపాలు వెలగటం లేదు.
గుడి ముందున్న చిన్న మండపం లో ఉష నిలుచుని ఉండటం చూసి ఆశ్చర్య పోయి
దగ్గరకు వెళ్లి కౌగిట్లోకి తీసుకున్నాడు. తనకంటే ముందుగా అక్కడకు ఎలా వచ్చిందో అర్థం కాలేదు.
ఒకరి గుండెల చప్పుడు ఇంకొకరికి వినపడ సాగింది.
గాఢ పరిశ్వంగం లో మునిగి పోయారు. మండపం అంతా చీకటిగా వుంది.
ఇన్నాళ్లు వారిద్దరిలో బంధించిన ప్రేమ అవధులు లేకుండా కట్టలు తెంచుకుని ఉరకలు వేసింది.
అంతు లేని ఉష అందం రాజు మతి పోగొట్టి కోరికలకు వివశున్ని చేసింది.
ఇద్దరి మధ్య గాలి కదల లేదు. కోరికలు శృంఖలాలు తెంచుకున్నాయి , అక్కడ ఇద్దరి ఊపిరి బుసలు కొట్టింది.
ఇద్దరూ అలసి సొలసి ఒకరి చేతుల్లో ఇంకొకరు సమయం తేలీ కుండా, బాహ్య ప్రపంచాన్ని మరిచి నిద్ర లోకి జారుకున్నారు.
కాసేపటికి ముందుగా లేచిన ఉష , తన వేళ్ళతో రాజు వెంట్రుకలు, నుదురు నిమిరి,కొంగుతో చెమటను తుడిచి "మన విషయం తెలిసి అన్నయ్య పెద్ద గొడవ చేసాడు. నా ఫోన్ కూడా లాగేసుకున్నారు. వేరే సంబంధం ఖాయం చేస్తున్నారు..నువ్ రేపే వచ్చి మాట్లాడు. నేను ప్రతి రోజూ నీ గురించి ఎదురు చూసి చూసి ఇక ఆశ వదులుకున్నాను. " అంది మెల్లిగా ఏడుస్తూ .
" అందుకే వచ్చాను..రేపే ఇంటికి వస్తాను..నా నుండి ఇంకెవరూ నిన్ను విడదీయ లేరు " అన్నాడు ఉష కళ్ళ నీరు తుడిచి,చెంపలను నిమురుతూ.
కాసేపు మౌనంగా వుండి పోయారిద్దరూ.
" మరిక వెళదాం ..ఈపాటికే ఇంట్లో కంగారు పడుతూ ఉంటుంది వదిన " అని లేచి నుంచుని చీర కుచ్చెళ్ళు సరి చేసుకుంది ఉష.
"పద నేను కూడా ఇంటి వరకూ వస్తాను " అని లేచాడు రాజు.
" వద్దు ఆ, ఎవరైనా చూస్తే బావుండదు,నువ్ ముందు వెళ్ళు, నే కాస్త వెనకగా వస్తాను " అంది ఉష
సరేనంటూ కొంత దూరం నడిచి వెనక్కు చూసాడు రాజు. గుడి మండపం బయట నిలబడి చేయి లేపి నువ్ వెళ్ళు అన్నట్లుగా ఊపింది ఉష .
చీకట్లో గుడి వేపు నుండీ ఒంటరి గా వస్తున్న రాజు ని ఒకరిద్దరు విచిత్రంగా చూడసాగారు.
అక్క ఇంట్లోకి అడుగు పెడుతున్న రాజు ని చూసి " ఎటు వెళ్ళావు రా రాజు , ఇంత సేపు ? " అని కంగారుగా అడిగింది సుకన్య.
అక్కడే ఆరు బయట వున్న, కుర్చీలో కూర్చొని అక్కయ్యను సంతోషంగా చూసాడు రాజు..
అతని మొహం లో వెలుగును గమనించి " ఏంటిరా ఏమైంది ..చాలా హ్యాపీ గా వున్నావే ?" అంది .
" అక్కా నీకొక ముఖ్యమైన సంగతి చెప్పాలి.. " అంటూ మనసారా నిండు గా నవ్వాడు.
" చెప్పు చెప్పు ..ఏమైనా గుడ్ న్యూసా ? చాలా హ్యాపీ గా వున్నావు " అంది .
" అవునే .. మీ స్నేహితురాలు రమ చెల్లెలు ఉష, నేనూ పెళ్లి చేసుకుందామని అనుకున్నాం ...అమ్మా ,నాన్న ను ఒప్పించాను ..ఇక్కడ ఉష ఇంట్లో నువ్ చూసుకోవాలి " అన్నాడు రెట్టించిన ఉత్సాహం తో.
అది వినగానే సుకన్య మొహం పాలి పోయింది " మీకా ఉద్దేశ్యం ఉన్నట్లు నాకెప్పుడూ చెప్పలేదే .. నిజంగా ఉష మనింటికి వస్తే ఎంతో బావుండేది రా రాజు..
అసలీ విషయాన్ని ఇన్నాళ్లు ఎందుకు దాచావు.? మంచి పిల్ల ..చాలా బావుండేది.." అంది విషాదంగా
'' అందుకే వచ్చా అక్కా ..రేపే వెళదాం వాళ్ళింటికి" అన్నాడు నిండుగా నవ్వుతూ
' 'లేదురా ,ఇంకేం వెళతాం .ఉష ఇంట్లో యేవో గొడవలు జరిగి , ఆఘ మేఘాల మీద పోయిన నెల పెళ్లి చేసి పంపించేశారు. అక్కడ ఏం జరిగిందో తెలీదు కానీ , అత్తారింటికి వెళ్లిన వారం లోగా ..ఉష కిరోసిన్ పోసుకుని ఆత్మ హత్య చేసుకుందని తెలిసింది. కొందరంటారు భర్తే అనుమానం తో కాల్చేశాడు అని " అంటూ కళ్ళ లో వచ్చే నీరు కొంగు తో తుడుచు కుంది.
అది వినగానే రాజు తల గిర్రున తిరిగింది. ఏమీ అర్థం కాలేదు .
మస్తిష్కం మొద్దు బారి పోయింది. మెదడులో నరాలు చిట్లినంత నొప్పి మొదలైంది. గుండె పగిలి పోయింది.
సుకన్య వేపు ఆశ్చర్యంగా చూసాడు " అక్కా !! ఏంటీ నువ్ అంటోంది ? నేనిప్పుడే ఉషను కలిసి వచ్చా !!"
" ఉష ను కలవటం ఏంట్రా ? తాను చనిపోయి ఇరవై రోజులు దాటింది. ఇక్కడే దహనం చేశారు " అంది కంగారుగా.
" మేమిద్దరం ఇప్పుడే పాత గుడి దగ్గర కలిసాం. చనిపోవటం ఏంటి ..నేను నమ్మను " అంటూ లేచి ,చెప్పులు కూడా వేసుకోకుండా బయటకు వేగంగా వెళుతున్న రాజునూ చూసి " రాజు..ఎటు వెళ్తు న్నావురా?" అని అరిచింది.
చీకట్లో పిచ్చి వాడిలా " ఉషా..ఉషా " అంటూ అరుస్తూ గుడి వేపు పరిగెత్తసాగాడు రాజు.
వీధిలో ఆరు బయట కూర్చున్న ఊరి జనాలు అతని వేపు అయోమయంగా చూడసాగారు.
ఆ తర్వాత మరి రాజు ఎవరికీ కనపడ లేదు . ఎన్నో సంవత్సరాలు వెదికారు. కానీ ఎక్కడా దొరక లేదు.