పల్లవి చిన్నప్పటి నుంచి చదువులో అందరి కంటే ముందు ఉండేది. స్నేహితులను ప్రోత్సహిస్తూ ఉండేది. కానీ ఆటల్లో అస్సలు పాల్గొనకపోయేది. ఆటల్లో పాల్గొంటే దెబ్బలు తగులుతాయని భయపడేది. కనీసం క్యారమ్స్, చెస్ వంటి ఆటల్లో కూడా పాల్గొనకపోయేది. వాటిల్లో అయినా పాల్గొనవచ్చు కదా అంటే ఆటలతో టైం వేస్ట్ అనేది. స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా ఆటల పోటీలు నిర్వహిస్తూ ఉంటే కనీసం వాటిని చూస్తూ స్నేహితులను ప్రోత్సహించడం వంటివి చేసేది కాదు. ఆ సమయంలో మరో ఇద్దరు అమ్మాయిలతో కలిసి తరగతి గదిలో కూర్చుని చదువుకోవడం లేదా నోట్సులు రాసుకోవడం చేసేది. ఆటలతో కాలక్షేపం చేయకుండా క్షణం కూడా వృథా చేయకుండా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే కలెక్టర్ వంటి పెద్ద పెద్ద ఉద్యోగాలు సాధించవచ్చు అనేది. ఉపాధ్యాయులు సైతం ఆమెను మార్చలేకపోయారు. వ్యాయామ ఉపాధ్యాయుడు తరచూ చెప్పేవాడు. "చూడమ్మా పల్లవీ! చదువుతో పాటు ఆటపాటలు కూడా ఉంటే చాలా మంచిది. ఆటల వ్యవధిలో ఆటలు ఆడాలి. రోజూ ఓ గంటసేపు ఆటలు ఆడాలి. ఆ తర్వాత చదువుకోవాలి. ఆదివారాలు మరియు సెలవు రోజుల్లో మూడు నాలుగు గంటలైనా ఆటలకు కేటాయిస్తే శారీరకంగానూ, మానసికంగానూ ఎంతో ఆరోగ్యంగా ఉంటాము. నిరంతరం చదువుతూ ఉంటే తొందరగా అలసిపోయి ఎంత చదివినా బుర్రలోకి ఎక్కవు. మధ్యలో విశ్రాంతి తీసుకొని ఆటలు ఆడితే ఆ తర్వాత నూతన ఉత్సాహంతో మరిన్ని విషయాలు నేర్చుకోవచ్చు." అన్నాడు. చెవిటి వాని ముందు శంఖం ఊదినట్లు అయింది. ఒకసారి మండల స్థాయిలో అన్ని పాఠశాలలు పాల్గొనేలా వివిధ ఆటల పోటీలు, ఉపన్యాస పోటీలు, క్విజ్ మొదలైనవి జరిగాయి. పాఠశాలలకు సెలవు రోజుల్లో నిర్వహించారు. ఆ మూడు రోజులూ వివిధ పోటీలలో పాల్గొనే అందరూ జిల్లా కేంద్రాలలో ఉండాలి. పల్లవి క్విజ్, వ్యాస రచన పోటీలలో పాల్గొనాలని వచ్చింది. ఖచ్చితంగా తనకంటే తెలివైన వారు ఉండరు కనుక తనకే బహుమతి తథ్యం అని అనుకొని పేరు ఇచ్చింది. విధిగా మూడు రోజులు ఉండి అన్ని పోటీలు చూడవలసి వచ్చింది. కబడ్డీ, ఖోఖో, టెన్నికాయిట్ ఇంకా అనేక పోటీలలో శివాని అనే అమ్మాయి విశేష ప్రతిభను ప్రదర్శించి అందరి మన్ననలనూ పొందింది. పల్లవికైతే చూస్తున్నంత సేపూ నోట మాట రాలేదు. ఎక్కడి బలం ఈమెది. ఎవ్వరూ ఆమెను ఓడించలేక పోతున్నారు అంటే ఈమె ఎప్పుడూ ఆటలతోనే కాలక్షేపం చేస్తుంది. చూస్తున్న వారంతా ఈమెను ఒకటే మెచ్చుకుంటున్నారు. కానీ ఈమె మురిపెం ఎంతసేపు. క్విజ్, వ్యాస రచన పోటీలలో అసలు పాల్గొనలేదు కదా! ఎప్పుడూ ఆటలే ఆడే ఈమెకు చదువు ఏమి వస్తుంది అని ఆలోచించింది పల్లవి. క్విజ్ పోటీలో ఎంత కష్టమైన ప్రశ్నకు అయినా తడుముకోకుండా జవాబులు చెప్పింది శివాని. ఉపన్యాసంలో అదరగొట్టింది శివాని. ఇలా చాలా పోటీలలో ఫస్ట్ వచ్చింది. శివానీ వచ్చి పల్లవిని పరిచయం చేసుకోబోయింది. పల్లవి ముఖం మాడ్చుకొని ఏమీ మాట్లాడటం లేదు. ఇంతలో ఒక ఆకతాయి వచ్చి పల్లవితో అనుచితంగా ప్రవర్తించాడు. పల్లవి ఏడుస్తుంది. శివానీ వచ్చి ఆ ఆకతాయిని బాగా తిట్టింది. "ఎంత పొగరు నీకు నిన్ను కొడతాను చూడు." అన్నాడు ఆకతాయి. "నాతో కొట్లాటకు వస్తే నీ పరువు పోతుంది. ముందుకు రా!" అని గట్టిగా అంది శివాని. ఆకతాయి బెదిరి వెనకడుగు వేశాడు. ఉపాధ్యాయులు వచ్చి అతనికి బుద్ధి చెప్పారు. "నీకు ఇంత ధైర్యం ఎందుకు వచ్చింది?" అని అడిగింది పల్లవి. "వాడు నన్నేం కొట్టగలుగుతాడు. చిన్నప్పటి నుంచి అన్ని ఆటలూ ఆడీ ఆడీ బలాన్ని పొందాను." అన్నది శివాని. "ఎప్పుడూ ఆటలు ఆడే నువ్వు చదువులో ముందు ఉండటం ఏమిటి?" అని అడిగింది. పగలబడి నవ్వింది శివాని. "నేను చదువుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను. కానీ నిరంతరం చదువుతూ ఉంటే బుర్ర వేడెక్కదూ! అందుకే ప్రతిరోజూ విరామం తీసుకుంటూ ఆటలు కూడా ఆడితే అటు ఆరోగ్యంగా ఉంటాము. చదువులో కూడా రాణిస్తాము. చూశావా! నువ్వు ఏ ఆటలు ఆడక ఇలా బలహీనంగా ఉన్నావు. ఫలితంగా ఏమైంది?" అన్నది. పల్లవికి వ్యాయామ ఉపాధ్యాయుడు చెప్పిన మాటలు కూడా గుర్తుకు వచ్చాయి. తానూ విరామ సమయంలో ఆటలు ఆడటం మొదలు పెట్టింది.