పొద్దు - బోగా పురుషోత్తం,

Poddu

గంగయ్య మనసంతా అదోలా వుంది. అసలు జీవితంలో అతనెప్పుడూ బుర్ర బద్ధలు కొట్టుకునేలా ఆలోచించాల్సిన అవసరం రాలేదు. తన జీవనాధారమైన జీవాలు కళ్లెదుటే ఒకే సారి కన్ను మూయడంతో తీవ్రంగా ఆలోచించసాగాడు. ఏమి చేయాలో పాలుపోవడం లేదు. ఎంత ఆలోచించినా మనసులో అలజడి తగ్గలేదు. ఈ పరిస్థితి తనకే కాదు.. పక్కింటి రంగయ్యకూ ఎదురైంది.
గంగయ్య బలహీనుడు..నోరు లేనోడు..భయస్తుడు.. అందుకే వున్న పది పొట్టేళ్లు మోతుబరి ఘాతుకానికి బలైనా పల్లెత్తుమాట అనలేదు. కళ్లెదుటే జీవాలు గిలగిలా తన్నుకు చస్తున్నా నిస్సహాయ స్థితిలో ప్రేక్షకుడిలా చూస్తుండిపోయాడు. ఇక లాభం లేదు. ఎదిరించకుంటే తన జీవితం మోడువారుతుంది. జరుగుతున్న విషాదాన్ని చేతకాని వాడిలా సూస్తుండిపోవడమేనా? ఆ మోతుబరి చేసే అకృత్యాలను మౌనంగా తిలకించడం తప్ప మరో మార్గం లేదా?’ ఆలోచిస్తుంటే మనసు పొరల్లో కన్నీరు ఉప్పొంగింది. ఎలాగైతేనేం ఓ నిర్ణయానికొచ్చాడు.
గత ఏడాది పెద్దమ్మాయి పెళ్లికి చేసిన యాభై వేల రూపాయల అప్పు ఇంకా తీరలేదు. ఈ ఏడు అబ్బాయి చదువుకు ఇరవైవేల రూపాయలు ఫీజు కట్టాల్సి వుంది. వున్న నాల్గు మేకల్ని పదికి పెంచాడు. పది గొర్రెల్ని పాతిక చేశాడు. ఐదు పొట్టేళ్లని సంతలో అమ్మేద్దామని బాగా మేపుతున్నాడు. అంతలో ఏదో జబ్బువచ్చి గొర్రెలన్నీ మృత్యువాతపడ్డాయి. వారం కూడా తిరక్కముందే వున్న పొట్టేళ్లన్నీ మోతుబరి ఆగ్రహానికి బలయ్యాయి. ఆ రాత్రంతా నిద్రపట్టలేదు. ఏం చేయాలా? అని ఆలోచించసాగాడు. ఈ సమస్య సమసిపోకముందే మరోముప్పు ముంచుకొచ్చింది.
‘‘ నాన్నా! అన్నం తిందువుగానీ రా..’’ కూతురు ఎల్లమ్మ పిలుపుతో ఆలోచనల్లోంచి తేరుకుని ఈ లోకంలోకొచ్చాడు గంగయ్య.
‘‘ వద్దమ్మా..నాకేం తినాలపించడం లేదు.. ఆకలిగా లేదు..’’ తల అడ్డం ఊపాడు గంగయ్య.
‘‘ అలా అంటే ఎలా నాన్నా..! పొద్దున ఆరు గంటలకే చద్దన్నం తాగావు..ఇప్పుడు సాయంత్రం ఆరు గంటలవుతోంది...ఏదైనా తినకుంటే నీ ఆరోగ్యం ఏమి కావాలి? నీకేమైనా అయితే మాకు దిక్కెవ్వరు?’’ కంటతడి పెట్టింది కూతురు ఎల్లమ్మ.
గంగయ్య గుండె చివుక్కుమంది.
‘‘ నా చిట్టి తల్లీ నీకేమీ కాదు..నేనున్నాగా..మరేం భయపడకు..వున్న జీవాలన్నీ పోయినా సరే..నా ప్రాణం పోయే లోపు నిన్ను ఓ అయ్య చేతిలో పెట్టే బాధ్యత నాది..’’ అంటూ ఓదార్చసాగాడు గంగయ్య.
అంతలో..
‘‘ నాన్నా! నాన్నా ! మన జీవాలు ఆమోతుబరి పొలంలోకి వెళ్లాయి. ఎంత తరిమినా అవి అక్కడి నుంచికదల్లేదు..’’ బిక్క మొహం వేశాడు కొడుకు రంగడు.
పిడుగు పడ్డట్లైంది గంగయ్యకి. లేచి ఒక్క అంగలో మోతుబరి పొలం ముందు ప్రత్యక్షమయ్యాడు.
అప్పటికే అనుకున్నట్లే అంతా జరిగిపోయింది. పచ్చటి పొలం చుట్టూ నల్లటి కరెంటు తీగకు అతుక్కుపోయి గిలగిలా తన్నుకుంటున్న మేకల్ని చూసి విలవిలలాడాడు గంగయ్య. చివరగా మిగిలిన పది మేకలూ కళ్లెదుటే ప్రాణం విడుస్తుంటే గుండెల్లోంచి పొంగుతున్న దు:ఖాన్ని గుండెల్లోనే దాచుకున్నాడు. కళ్లు చింత నిప్పుల్లా మండాయి. మోతుబరి ఇంటివైపు నడిచాడు.
చిన్నచిన్న చేపపిల్లల్ని మింగిన తిమింగళంలా చిన్న చితకా ఇళ్లను ఆక్రమించి నిర్మించిన ఆ మోతుబరి భవనం ముందు నిలబడ్డాడు గంగయ్య.
చీకట్లు ముసురుకుంటున్న వేళ.. గంగయ్య మనసంతా ఆవేశంతో ఊగుతోంది. ఈ రోజు తాడోపేడో తేల్చుకోవాలని నిశ్చయించుకున్నాడు.
‘‘ ఏమయ్యా మోతుబరి..’’ గొంతుచించుకు అరిచాడు గంగయ్య.
మోతుబరి ఎంతకీ రాలేదు. మళ్లీ రెండుసార్లు అరిచాడు. ఈ సారి కూడా ఆచూకీ లేదు. వెనుకనే భుజం మీద వేసుకొచ్చిన జీవాల్ని గుమ్మం ముందు వేశాడు. దాని ప్రాణం ఇంకా తన్నుకుంటూనే వుంది. గంగయ్య కళ్లు ఎర్రబడ్డాయి.
‘‘ ఉరేయ్‌ !మోతుబరీ రారా.. బయటికి రా..’’దిక్కులు పిక్కటిల్లేలా అరిచాడు రంగడు.
లోపల మంచం మీడ కూర్చొని టీవీ చూస్తున్నాడు మోతుబరి. రంగడి పిలుపు వినబడలేదు.
ఈ సారి ఓ పెద్ద రాయితీసి కిటికీ మీదికి విసిరాడు రంగడు. ఆ రాయి మోగుబరి నెత్తిమీదుగా వెళ్లి టీవీ ముందుపడిరది.
‘‘ ఎవర్రా రాయి వేసిందీ? ఎంత ధైర్యం?’’ తోకతొక్కిన నాగులా పైకిలేచి బయటికొచ్చాడు మోతుబరి.
‘‘ ఒరేయ్‌! యదవ బతుకు..మీ జీవాల్ని చంపినా ఇంకా బుద్ధి రాలేదురా..మీకింకా..!’’ హేళనగా నవ్వాడు మోతుబరి.
‘‘ అదేరా..అదే..మా జీవాల్ని ఎందుకు చంపావో చెప్పు..’’ గద్దించాడు రంగడు.
‘‘ ఉరే పిల్లకుంకా..నీయ్యే కాదు..ఈ పల్లెలో వున్న జీవాలేవైనా నా పొలంలో పడితే చాలు చంపేస్తా’’ హెచ్చరించాడు మోతుబరి.

‘‘ నువ్వలా అన్యాయంగా చంపేస్తుంటే చూస్తూ ఊర్కునే దద్దమ్మలంకాము..’’ ఆవేశంతో అన్నాడు గంగయ్య.
‘‘ న్యాయమో... అన్యాయమో కోర్టులో చూస్తారుగా తోక తొక్కిన నాలుగా బుస కొట్టాడు మోతుబరి.
మోతుబరి భార్య పోలీసులకు ఫోను చేసింది. క్షణాల్లో ఇద్దరు కానిస్టేబుళ్లు అక్కడ ప్రత్యక్షమయ్యారు. ‘‘ ఏయ్‌! ఏందిరా అయ్యగోర్ని నానామాటలు అన్నావట.. అదీగాక హత్యాయత్నం కూడా చెయ్యబోయావంటా..’’ ప్రశ్నిస్తూనే రంగడు, గంగడి చేతుల్ని వెనక్కి తిప్పి సంకెళ్లు వేసి వ్యానులో తోశారు.
పులి ముందు పిల్లిలా వణుకుతున్న తండ్రీకొడుకులపై సింహంలా విరుచుకుపడ్డారు పోలీసులు. పోలీసుల లాఠీల ప్రతాపానికి గువ్వల్లా వణికారు తండ్రీకొడుకులు. వంటి మీద దెబ్బలకు స్పృహ కోల్పోయారు. కళ్లు తెరచి చూసే లోపే ఇనుప ఊచల్లో బందీ అయ్యారు.
‘‘ ఏరా..అయ్యగోర్ని ఎదిరిస్తావా..నువ్వు..?’’ చింతనిప్పుల్లా మండాయి పోలీసుల కళ్లు.
మళ్లీ తండ్రీకొడుకులపై లాఠీలు విరిగాయి. దెబ్బలకి పండుటాకులా వణికింది బక్కచిక్కిన గంగయ్య దేహం..కళ్లలో దు:ఖం తన్నుకొచ్చింది. నేలపై ఒరిగిపోయి వెక్కివెక్కి ఏడవసాగారు. మోతుబరి దాష్టీకాలు మనసుపొరల్ని కదిల్చి వేశాయి.
పెళ్లీడు కొచ్చిన కూతురు ఎల్లమ్మ గురించే ఆలోచించసాగాడు.
కాలచక్రం గిర్రున తిరిగింది. తండ్రీకొడుకులిద్దరూ కోర్టుకు, జైలుకు పరిమితమయ్యారు.
ఇంట్లో ఎల్లమ్మ ఏమైందోనని తల్లడిల్లిపోయాడు తండ్రి గంగయ్య.
ఎలా బయటపడాలా? అని ఓ రెండు రోజులు తిండి కూడా లేకుండా ఆలోచించసాగాడు రంగడు. రోజురోజుకీ దేహం బక్కచిక్కింది. ఎలాగైనా బయటపడాలి అని తీవ్రంగా ఆలోచించసాగాడు. ఆరు నెలలు గడిచాయి.
అప్పటికే వారి జైలు జీవితం మూడేళ్లు గడిచాయి. ఇప్పుడు మనసంగా ఒకటే ఆలోచన..మోతుబరి ఆకృత్యాలను ఎలా ఎదుర్కోవాలా? ప్రతికారం రగులుతున్న వేళ.. నిస్సహాయత ఆవహించింది.
ఓ రోజు టపాసుల మోత..ఆకాశం చిల్లులు పడేలా ఒకటే శబ్దం... ఏమిటో తెలుసుకోవాలనే ఉత్సుకత. తనకి చెప్పే వాళ్లెవ్వరూ? ‘చీకటి దోవలో కాంతి రేఖలు ప్రసరించే భాగ్యం తనకి వస్తుందా?’ ఆలోచనలు మనసు దొంతరలను తొలచి వేస్తున్నాయి. అదంతా కలా.. నిజమా? పడుకున్న వాడు ఒక్కసారి లేచి చూశాడు.
కాదు.. నిజమే స్వప్నం కాదు..
ఎదురుగా తన కూతురు ఎల్లమ్మ.. వల్లంతా రంగుపొడులు చల్లి గుర్తు తెలియనంతగా మారిపోయింది.
‘‘ నాన్నా..! నేను సర్పంచిగా పోటీ చేస్తున్నా మన కాలనీ వాళ్లంతా సపోర్టు చేస్తున్నారు.. నీ ఆశీర్వాదం కోసం వచ్చాను..నామినేషన్‌ వేయడానికి వెళుతున్నా.. దీవించు...’’ అని ఇనుప ఊచల ఆవల తలదించింది.
ఏమి చెప్పాలో తెలియట్లేదు. ప్రత్యర్థి మోతుబరి. అంతపెద్ద కొండను ఢీకొట్టడం మాటలా? వద్దమ్మా.. వద్దు..’’వారించాను.అక్కనే వున్న కొడుకు ‘‘ అలా అనొద్దు నాన్నా..!’’ దిక్కులు పిక్కటిల్లేలా అరిచాడు. ఆ అరుపుకి ఎస్‌ఐ అక్కడి వచ్చాడు. వచ్చిన వాళ్లందరినీ తరిమివేశాడు.
ఆర్థిక బలహీనుడ్ని.. కూతురు ఎలక్షన్లో నిలబడే సాహసం చేసినందుకు ఓ పక్క ఆనందమే కానీ.. ఆ మోతుబరి పగకి ఎక్కడ బలైపోతోందోనని భయం వెంటాడసాగింది గంగయ్యని.
ఆందోళనతో ఎదురుచూడసాగాడు. రెండు వారాలు గడిచాయి. ఎన్నిక ముగిసింది.
ఆరోజు ఇంకా తెల్లారలేదు. ఒకటే టపాసుల మోత.. మళ్లీ కలే అనుకున్నా.. కాదు నిజంగానే తూర్పు కొండల్లో ఎర్రటి సూరీడు ఉదయిస్తున్న వేళ..మోతుబరి దౌర్జన్యాలకు విసిగిన ప్రజాగ్రహం బ్యాలెట్‌ బాక్సులో నిక్షిప్తమైన ఒక్కో ఓటరి తీర్పు మోతుబరి ఓటమిని నిర్దేశిస్తుంటే టపాసుల మోత మిన్నంటింది. తనలో అలుముకున్న తిమిరాన్ని తారాజువ్వల వెలుగు సంహరించింది. గంగయ్య, అతని కొడుక్కే కాదు.. ఆ వాడలో అందరికీ దీపావళి వెలుగొచ్చింది.. కాంతి.. బానిస బతుకు తుత్తునియలై సంక్రాంతి వెలుగొచ్చింది.

మరిన్ని కథలు

Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు
Pratibha
ప్రతిభ
- చెన్నూరి సుదర్శన్
Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు