పూర్వం కన్యాకుబ్జం అనే పట్టణంలో అజామిళుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు.అతడు పూర్వజన్మలో సత్కర్మలు చేసి మంచి ప్రవర్తన కలిగి ఉండడం వలన బ్రాహ్మణుడుగా పుట్టాడు. ధర్మ మార్గాన నడుచుకుంటూ వేదాలు, శాస్త్రాలు చదువుకొని పాండిత్యం సంపాదించాడు. ఎల్లప్పుడూ గురువులకూ, అతిథులకూ, పెద్దలకు సేవలు చేసేవాడు.
అప్పుడే కౌమారదశ నుండి యవ్వనంలో ప్రవేశించిన అజామిళుడి దేహ సౌందర్యంఇనుమడించింది.ఇంతలో వసంత ఋతువు వచ్చింది. అందరికీ ఆనందదాయకమైన ఆ మధుమాసంలో తన తండ్రి ఆజ్ఞానుసారం ధర్భలూ, సమిధలూ, పుష్పాలూ, పండ్లూ తేవడానిక తోటలోనికి వెళ్ళి తిరిగివస్తూ ఒక దట్టమైన పొదరింటిలో ఒక దృశ్యాన్ని చూసాడు.
ఆ పొదరింటిలో కామక్రీడలో ఉన్న ఒక జంటను చూసాడు. అతని శరీరం పులకించింది. కామోన్మత్తుడైన ఒక నవ యవ్వనుడు తన ప్రియురాలితోశృంగారక్రీడలో ఉండడం అతని మనస్సు పై చెరగని ముద్ర వేసింది. ఆ అందాలరాశి ఒక జార వనిత.ఆ వెలయాలి అందానికి కామోద్రేకంతో బ్రాహ్మణ కుమారునిమనస్సు పట్టు తప్పింది. నిత్యకృత్యాలైన వైదిక కర్మలనూ, శాస్త్రపాఠాలనూ మరచిపోయాడు. ఆమెను పొందాలన్న కోరికతోమంచి మర్యాదలను మరచిపోయాడు. ఆమె అందచందాలకు లొంగిపోయితండ్రిగారి ఆస్తి నంతటినీ ఆ వెలయాలి పాలుచేసాడు.
ఇంటివద్ద నున్న సౌందర్యవతి, సుగుణవతి అయిన తన భార్యను విడిచిపెట్టి ఆ వెలయాలి ఇంటిలోనే కాపురం పెట్టాడు.నా అన్న వారందరినీ దూరం చేసుకున్నాడు. ఆమె దయా దాక్షిణ్యాలపైబ్రతుకుతూ ఆమె యందుపదిమంది కొడుకులను కన్నాడు. ఆ పిల్లల ఆలనా పాలనలతో, ముద్దు ముచ్చటలతో చాలా కాలం గడిపాడు.
కాలంతోబాటుబలం సన్నగిల్లి అవయవాలు పట్టుతప్పాయి.కంటి చూపు కుంటుపడింది.పండ్లు ఊడిపోయాయి. దగ్గు ఆయాసం లాంటి ఎన్నో జబ్బులు పెచ్చరిల్లాయి. ముసలితనం ముంచుకు వచ్చింది.ఎనభై ఏళ్ళు నిండే సరికి మతి చలించింది. అతని చిన్న కొడుకు పేరు నారాయణుడు. వాడంటే అజామిళుడికి ప్రాణం. నారాయణుడు ప్రక్కన లేకపోతే భోజనం కూడా చేయడు. వాడితో ఆడుతూ పాడుతూ కాలం గడుప సాగాడు.
ఈ విధంగా ఆ ముసలి బ్రాహ్మణుడు కాలచక్రాన్ని గమనించకుండానే కాలక్షేపం చేస్తున్నాడు. అంతలో భయంకరమైన మరణకాలం సమీపించింది.పాపాత్ములను పట్టి బంధించడానికి వచ్చిన ముగ్గురు యమకింకరులు వికారమైన ముఖాలతో, క్రూరమైన చూపులతోఅతనికి కనిపించారు. వారి చేతిలో భయంకరమైన త్రాళ్ళూ, కత్తులూ కటారులూ పైకిలేస్తూప్రాణాలు తీయడానికి సిద్ధంగా ఉన్నాయి.
అటువంటి యమబటులను చూడగానే అజామిళుని ఇంద్రియాలు పట్టుతప్పాయి. అతని ఆత్మ గిలగిల లాడింది. ఆ క్షణంలో దూరంగా ఆడుకుంటూ ఉన్న అతడి చిన్న కుమారుడు అతనికి గుర్తు వచ్చాడు. వెంటనే “నారాయణా, నారాయణా” అంటూ బిగ్గరగా తన కుమారుణ్ణి పిలిచాడు. ఆ విధంగా మరణ సమయంలో అజామిళుడు నారాయణ నామ స్మరణ చేయడంతో దేవదూతలు ప్రత్యక్షమైపెద్దగా కేకలు వేస్తున్న యమకింకరులను అడ్డగించారు.పాశాలతో ప్రాణాలను గుంజుతున్న యమబటులను నెట్టివేసారు.
తమ ప్రయత్నాన్ని అడ్డుకుంటున్న విష్ణుదూతలను ఉద్ధేశించి యమదూతలు ఇలా అన్నారు. “అయ్యా నీలమేఘాల వంటిదేహచ్ఛాయలు కలవారూ, శ్రేష్టమైన పచ్చని దుస్తులు ధరించినవారూ అయిన మీరు ఎవరు? కర్తవ్య నిర్వహణలో ఉన్న యమధర్మరాజు భటులమైన మమ్ములను ఎందుకు అడ్డుకొంటున్నారు?పద్మం, శంఖం, గద, చక్రం మొదలైన ఆయుధాలు ధరించిన మీ స్వరూపాలు, మీ మొహంలోని తేజస్సు విష్ణు భగవానుని గుర్తుకు తెస్తున్నాయి”.
అలా ప్రశ్నించిన యమదూతలను చూసి చిరునవ్వుతో గోవిందుని దూతలు గంభీరమైన స్వరంతో ఇలా అన్నారు. “మీరు ధర్మ స్వరూపుడైనయముని కింకరులన్న మాట. అలాగయితే పుణ్య లక్షణాలనూ పాప స్వరూపాలను వివరించండి. ఎవరు దండింపతగినవారో ఎవరు కారో వివరించండి”.
అప్పుడు యమభటులు ఇలా అన్నారు. “వేదాలలో ఏది కర్తవ్యమని చెప్పబడిందో అదే అందరికీ అమోదకరమైన ధర్మం. అంతకంటే వేరైనది అధర్మం. వేదం సాక్షాత్తూ నారాయణ స్వరూపమని పెద్దలు చెప్పారు.నారాయణుడు అంతర్యామియై అన్ని ప్రాణులలో నిండి ఉన్నాడు. సూర్యుడు, అగ్ని, ఆకాశం, వాయువు, భూమి, చంద్రుడు, పగలు, రాత్రి, కాలం– ఇవన్నీ జీవుల కర్మలన్నిటికీ సాక్షులు. వీరి సాక్ష్యంతోనేధర్మాధర్మాలనిర్ణయం జరిగి అధర్మపరులు దండింప బడతారు.మీరు దీనికి అడ్డు పడ్డారు. జీవుడు ప్రస్తుత జన్మలో ఎంత సుకృతం చేస్తాడో ఎంత దుష్కృతం చేస్తాడో ఆ పుణ్యపాపాల పరిమాణాన్ని బట్టి భవిష్యత్తులో ఫలితాలు అనుభవిస్తాడు. ఈ జన్మలో ప్రవర్తనలకు అనుగుణంగానే వారికి రాబోయే జన్మలు ప్రాప్తిస్తాయి. ధర్మస్వరూపుడైన మా ప్రభువు యమధర్మరాజు సమస్త జీవులలో అంతర్యామిగా ఉంటాడు. అలా ఉండి ఆ జీవులు చేసే ధర్మాధర్మాలను విశేష దృష్టితో గమనిస్తాడు. జీవుడు స్వయంగా తను ఏర్పరుచుకొన్న కర్మబంధాలలో చిక్కుకొనిమగ్గిపోతూ ఉంటాడు. జీవుని వర్తమాన జీవితంలో నడవడికను బట్టిఅతడుపూర్వజన్మలో ఎలాగుండేవాడు, రాబోయే జన్మలో ఎలా ఉంటాడో నిర్ణయించ వచ్చు.”
యమబటులు ఇంకా ఇలా అన్నారు. “ఈ అజామిళుడు పూర్వ జన్మలలోమంచి పనులు చేసి బ్రాహ్మణ కులంలో జన్మించాడు. ఇంద్రియాలను జయించి ధర్మమార్గాన నడుచుకుంటూ వేదాలన్నీ పఠించాడు. సత్య సంధుడై సద్గుణాలను తన యందు నిల్పుకున్నాడు.కాని యవ్వనం వచ్చాక కామోద్రేకంతో ఒక వెలయాలి అందచందాలకు లొంగిపోయాడు. తండ్రి సంపాదించిన ఆస్తినంతటినీ దానిపాలు చేసాడు. వేదమంత్రాలతో పరిణయమాడిన సౌందర్యవతి, యవ్వనవతి అయిన భార్యను విడిచి పెట్టాడు. కులాచార మర్యాదలు కూల ద్రోసాడు. సాధులక్షణాలు విడనాడాడు.వెలయాలితో కాపురం పెట్టి సంతానాన్ని కన్నాడు. అందువల్ల ఈ పాపాత్ముణ్ణి బంధించి తీసుకొనిపోతున్నాము”.
ఇదంతా శ్రద్ధగా విన్న నీతిశాస్త్ర పండితులైన విష్ణుదూతలు ఈ విధంగా చెప్పారు. “మీ వివేకం, మీ ధర్మనిర్ణయ పాండిత్యం తెలిసింది.మీ అజ్ఞానం వెల్లడయింది.మీరు ధర్మదేవత దూతలు కదా! ఒక్కసారి ఆలోచించండి. ఇతడు కోటి జన్మలలో చేసిన పాపాలను ఈ జన్మలో ఇప్పుడు బుద్ధిమంతుడై పారద్రోలాడు. మరణ సమయంలో అమృతం వంటి భగవంతుని పుణ్యనామ సంకీర్తన చేసిన భాగ్యం ఇతనికి లభించింది. భగవన్నామ కీర్తన అన్ని పాపాలను దహించి వేసి, ముక్తిని ప్రసాదిస్తుంది.”
“ఇతను ‘నారాయణా’ అని పిలిచినప్పుడు ఇతని హృదయం కుమారునిపై లగ్నమై ఉందని మీరు తలంపవద్దు. భగవంతుని పేరును ఏ విధంగా పలికినప్పటికీ వాసుదేవుడు రక్షకుడై ఉంటాడు. ఆటలోనైనా, పరిహాసంగానైనా, ధుఃఖంలోనైనా, భయంతోనైనా, బాధ కలిగిప్పుడైనా అమ్మో! బాబో! అనకుండా వాసుదేవుని నామం ఒక్కసారి ఉచ్ఛరించితే చాలు, అటువంటి వారికి యమబాధలు ఉండవు. అంత్యకాలం సమీపించి నపుడుపూర్వజన్మ విశేషం ఉంటే తప్ప పరాత్పరుడు మనస్సులోకి రాడు. నారాయణ నామస్మరణ చేసే భాగ్యం లభించదు. అటువంటప్పుడు బాహాటంగా ‘నారాయణ నామం’ ఉచ్చరించిన ఈ సత్పురుషుడి జీవితం ఎందుకు వృధా అవుతుంది”.
ఈ విధంగా విష్ణుదూతలుభాగవత ధర్మాన్ని, భగవన్నామ మహాత్త్వాన్నీ వివరించారు. అజామిళునిభయంకరమైన యమపాశాల నుండి విడిపించి ధైర్యం కలిగించారు.యమదూతలుఅప్పుడు హరినామమహత్తునుఅర్థం చేసుకున్నారు. వట్టి చేతులతోయమలోకానికి తిరిగి వెళ్ళారు. ప్రభువైన యమ ధర్మరాజుకుజరిగిన సంగతి వివరించారు.
ఇక్కడ అజామిళుడుఆనందంతో చేతులెత్తి దేవదూతలకు నమస్కరించాడు. దేవదూతలు చిరునవ్వు నవ్వి మాట్లాడకుండా అంతర్ధానం చెంది వైకుంఠానికి వెళ్ళిపోయారు. ఆ విష్ణుదూతల యమదూతల సంవాదం విన్న అజామిళునికి జ్ఞానోదయం అయ్యింది. భయంకరమైన యమపాశాల నుండిరక్షించిన ఆ మహానుభావులు ఎక్కడనుండి వచ్చారో, ఎక్కడికి పోయారో అని ఆలోచించాడు. పూర్వజన్మలో చేసిన పుణ్యం వలననే మరణిస్తున్న సమయంలో భగవంతుని నామం ఉచ్చరించే భాగ్యం కలిగిందని మరియు ఆ దేవతామూర్తుల దర్శనం కలిగిందని గ్రహించాడు. అమాయకులైన ముసలి తల్లి తండ్రులను, తన ధర్మపత్నిని బాధ పెట్టినందుకు, తను చేసిన అన్ని పాపాలకు పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు. అతనిమనస్సు పరివర్తన కోసం పరితపించింది. దోష భూయిష్టమైన మాయ నుండి బయట పడ్డాడు.
ఈ విధంగా అజామిళుని హృదయం ఆత్మజ్ఞానంతో నిండి ప్రకాశించింది. ఉత్తమ పురుషులతో స్నేహం చేసాడు. మోహం వలన కలిగిన సంసార బంధాలన్నిటినీతెంపేసాడు. లక్ష్మీనాథుడు అయిన వాసుదేవుని పై మనస్సు పూర్తిగా లగ్నం చేసాడు. ఆ విప్రుడు తత్త్వజ్ఞానియై గంగా ద్వారానికి చేరి అక్కడ ఒక దేవాలయంలో యోగమార్గాన్ని ఆశ్రయించాడు. తన ఆత్మను పరమాత్మలో లీనం చేసాడు. అప్పుడు అతనికి మొదట తనని రక్షించిన ఆ దివ్యపురుషులు కనిపించారు. విష్ణుదూతలకు చేతులు మోడ్చుతూ గంగాతీరంలో శరీరం విడిచాడు.
ఈ విధంగా అజామిళుడు, స్వధర్మాన్ని వదలి, వెలయాలితో కలిసి జీవించి, దుష్కర్మలతో బ్రష్టుడై నరకంలో పడబోతూచివరి గడియలో నారాయణ నామస్మరణతో, క్షణమాత్రంలో మోక్షాన్ని అందుతున్నాడు. ఈ ఇతిహాసాన్ని ఎవరైనా సరే ఏకాగ్ర చిత్తంతో విన్నా, చదివినావిష్ణుదేవుని ప్రీతికి పాత్రులవుతారు. పాపాలు దరిచేరవు. శుభం కలుగుతుంది.
*** శుభం ***