నియంత్రణ (Control)
-1-
ఆ రోజు ఆదివారం. పిల్లలు ముగ్గురూ ఇంట్లోనే ఉన్నారు. అమ్మ డైనింగ్ టేబుల్ మీద అన్నీ సర్ది పిల్లల్ని బోజనానికి రమ్మని పిలిచింది. సోమనాథ్, పద్మావతి, విశ్వనాథ్ముగ్గురూ డైనింగ్ టేబుల్ దగ్గరకి వచ్చి కూర్చున్నారు.
“మీరువడ్డించుకుని తినండిరా. నేను నాన్నగారుబోజనానికి ఎప్పుడు వస్తారో అడిగి వస్తాను” అంటూ వెళ్లారు సీతమ్మ గారు.
రామయ్య గారు మేడ మీద తన గదిలే ఏదో ఆఫీసు పని చేసుకుంటున్నారు. ఆయనకు పనిలో పడితే టైము తెలియదు. ఆయన వస్తేనే గాని సీతమ్మ కూడా భోజనం చెయ్యదు. రోజూ రాత్రిళ్లు డిన్నర్, ఆదివారం పూట లంచ్ ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ తినడం ఎప్పటి నుండో వాళ్ళకు అలవాటు.
విశ్వనాథ్ పాత్రల మూతలు తీసి వంటలు ఏమున్నాయా అని చూసాడు. అన్నం, ముద్ద పప్పు, ఏదో వేపుడు కూర, రోటి పచ్చడి, ముక్కల పులుసు, చివరలో పెరుగు గిన్నె ఉన్నాయి.కంచంలో అన్నం పెట్టుకొని నెయ్యి వేసుకున్నాడు. ఇంక ఆలోచనలో పడ్డాడు. ముందు పప్పు కలిపి కూర పెట్టుకు తిందామా? లేక పచ్చడి కలిపి పులుసు ముక్కలు నంచు కుందామా? ఎంతకీ తేల్చుకో లేక పోతున్నాడు. విశ్వనాథ్ చిన్నప్పటి నుండీ అంతే. ఎంత చిన్న విషయమైనా తెగ ఆలోచిస్తాడు. ఆ ఆలోచించడంలో ఎంత టైము అయిందో తెలియదు.వీడి సంగతి తెలిసినట్లు సోమనాథ్, పద్మావతి తినేసి చదువు కోవడానికి స్టడీ రూమ్ కు వెళ్ళి పోయారు.
రామయ్య గారు ఎవరికో ఇచ్చిన సలహా చిన్నప్పుడే విశ్వనాథ్ తలలో గట్టిగా నాటుకు పోయింది.
“ఆలోచన చెయ్యాలి”
“ఆలోచించ కుండా ఏ పనీ చేయకూడదు”
“ఆలోచన లేని పని అనర్థాలకు దారి తీస్తుంది”
అప్పటి నుండి ఎంత చిన్న విషయమైనా తెగ ఆలోచించడం అలవాటుగా మారింది. తనలో తానే అనుకుంటూ ఉండేవాడు.
“కలలు కనండి అని కలాం గారు అన్నారు”
“ ఏరా ఇంకా నీ భోజనం కాలేదా” అంటూ వచ్చింది విశ్వనాథ్ వాళ్ళ అమ్మ. కంచంలో అన్నం అలాగే ఉంది. విశ్వనాథ్ సీలింగ్ వైపు చూస్తూ ఏదో ఆలోచిస్తున్నాడు.
“ఒరేయ్ నీ ఆలోచనలు కట్టిపెట్టరా. మనస్సు భోజనంమీద పెట్టి తొందరగా పూర్తి చెయ్యి” అంది. అమ్మ మాటలతో ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చాడు. వెంటనే తినడం మొదలు పెట్టి పది నిముషాలలో పూర్తి చేసి చేతులు కడుతున్నాడు. అమ్మ ఏదైనా అంటే చాలు తన ఆలోచనలు పక్కన పెట్టి వెంటనే ఆ పని పూర్తి చేయడం విశ్వనాథ్ కి మరో అలవాటు.
విశ్వా స్టడీ రూమ్‌కి వెళ్ళాడు. అక్క, అన్నయ్యదేని గురించో వాదులాడు కుంటున్నారు. విశ్వనాథ్కి ఆ టాపిక్ రుచించ లేదు. పద్మావతి అడిగింది “ఏరా తినడం ఇప్పటికి అయ్యిందా” అని. “అవును అక్కా” అంటూ ఒక కుర్చీలో కూర్చొని మళ్ళీ ఆలోచనల్లోకి జారిపోయాడు.
-2-
విశ్వాకి స్కూల్ లో జరిగిన ఒక సంగతి గుర్తుకు వచ్చింది. అప్పుడు నాల్గవ తరగతి చదువుతున్నాడు. లంచ్ టైము అయ్యింది. లంచ్ బాక్స్ విప్పాడు. అదృష్టం బాగుంది. అమ్మ వెజిటబుల్ బిర్యాని పెట్టింది. ఆరోజు ఏది ముందు తినాలి అని ఆలోచించాల్సిన అవసరం రాలేదు. వెంటనే డబ్బా ఖాళీ చేసాడు. స్కూలు గ్రౌండ్ లో ఉన్న ఓ చెట్టు కింద కూర్చొని ఏదో ఆలోచిస్తూ కూర్చున్నాడు.ఇంతలో చెట్టు మీద నుండి కాయ ఒకటి నెత్తి మీద పడింది. పైకి చూస్తే అది ఒక జామచెట్టు. చెట్టుకి చాలా జామకాయలు ఉన్నాయి. వెంటనే ఆలోచించడం మొదలెట్టాడు. జామకాయ క్రిందకు ఎందుకు పడాలి? పైకెందుకు వెళ్ళ కూడదు? ప్రక్కకు వెళ్ళి ఎందుకు పడ కూడదు? తిన్నగా క్రిందకే పడిందంటే భూమికి ఏదో ఆకర్షణ ఉండాలి అనే నిశ్చయానికి వచ్చాడు.
ఇంతలో క్లాసు బెల్ మ్రోగింది. పరిగెత్తుకొని వెళ్ళి బుద్ధిగా క్లాసులో కూర్చొన్నాడు. అది సైన్సు పీరియడ్. విశ్వనాథ్ టీచర్ కి భూమి ఆకర్షణ గురించి తనకు వచ్చిన ఆలోచన చెప్పాడు. వెంటనే మాష్టారు “ ఒరేయ్! న్యూటన్ అనే సైంటిస్ట్ ఏపిల్ పండు క్రింద పడడం చూసి భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉందని 350 సంవత్సరాల క్రితమే కనుకున్నాడు. నువ్వు మళ్ళీ దాన్ని జామ కాయలతో కనిపెట్టాల్సిన అవసరం లేదు. నీ ఆలోచనలు ఆపి నీ మనస్సు పాఠాల మీద లగ్నం చెయ్యి” అన్నారు. అప్పటి నుండి స్కూలులో ఉన్నంతసేపు తన ఆలోచనలు తగ్గించుకున్నాడు.
ఈ విషయం గుర్తు రాగానే తన ఆలోచనలు కట్టిపెట్టి హోమ్ వర్కు చేయడం మొదలు పెట్టాడు.
-3-
విశ్వనాథ్ తెలివైన వాడు. ఆలోచనలు ఆపి ఏదైనా పని మొదలు పెడితే తన తోటి విద్యార్థుల కంటే చాలా వేగంగా పూర్తి చేస్తాడు. అందుకనే బి.టెక్ మంచి మార్కులతో పాసయ్యాడు. సోమనాథ్ డిల్లీలో సెక్రెటేరియట్ లో పని చేస్తున్నాడు. పెళ్ళి అయ్యాక అక్కడే కాపురం పెట్టాడు. పద్మావతి పెళ్ళి చేసుకొని అమెరికా వెళ్ళి పోయింది.విశ్వనాథ్ కి తల్లి తండ్రులను వదలిపెట్టి ఇంకో చోట ఉద్యోగానికి వెళ్ళడం ఇష్టం లేదు. అందుకని హైదరాబాద్ లోనే ఒక పెద్ద సంస్థలో ఇంజనీరుగా ఉద్యోగంలో చేరాడు.
రామయ్య గారు టిఫిన్ చేసి పేపరు చూస్తున్నారు. తొమ్మిది గంటలు కావస్తోంది.విశ్వనాథ్ ఏదో ఆలోచిస్తూ కూర్చున్నాడు. “విశ్వా! ఏమిటి ఈ రోజు ఆఫీసుకి వెళ్ళడం లేదా! ఇంకా అలాగే కూర్చున్నావ్ !నీ ఆలోచనలు కట్టిపెట్టితొందరగా తయారవ్వు.” అన్నారు రామయ్య గారు. ఉలిక్కిపడి టైము చూసుకున్న విశ్వా “సారి డాడీ” అని రెండు నిమిషాల్లో తయారయ్యి ఆఫీసుకు వెళ్ళిపోయాడు.
విశ్వా ఆఫీసుకి వెళ్ళి సీటులో కూర్చొని మరల ఏదో ఆలోచనలో పడ్డాడు. బాస్ కేబిన్లోకి వచ్చినా తెలియ లేదు. “విశ్వా” అన్న పిలుపు విని ఉలిక్కిపడి, బాస్ ని చూసి లేచి నిలబడ్డాడు. “ విశ్వా! నీ ఆలోచనలు కట్టిపెట్టి మన వర్క్ మీద కాన్సెన్ట్రేట్ చెయ్యి. ఆ డిజైన్స్ పూర్తి చేసి సాయంత్రం 5 గంటల లోపు నా టేబుల్ మీద ఉంచాలి. నేను వాటిని చెక్ చేసి రేపు హెడ్ ఆఫీసుకు పంపాలి.” అని చెప్పి వెళ్ళిపోయాడు బాస్ పరంధామయ్య. ఆయనకు విశ్వా అంటే చాలా ఇష్టం. ఎంతటి క్లిష్టమైన డిజైన్ నయినా సునాయాసంగా పూర్తి చేస్తాడు. ఆయనకు విశ్వా తాలూకు వీక్నెస్ కూడా తెలుసు. జాయినయిన కొద్ది రోజుల్లోనే గ్రహించాడు. అందుకే పని విషయంలో విశ్వాతో సీరియస్ గా మాట్లాడతాడు. విశ్వా డిజైన్స్ ని పూర్తి చేసి నాలుగు గంటలకే బాస్ కి పంపించాడు.
-4-
ఇంటి దగ్గర రామయ్య గారు, సీతమ్మ విశ్వాకి పెళ్ళి చేసి వాళ్ళ బాధ్యత పూర్తి చేసుకోవాలని అనుకున్నారు.సీతమ్మగారు స్వాతిని ఒక పెళ్లిలో చూసారు. ఆ అమ్మాయి చలాకీతనం, కలుపుగోలుతనం బాగా నచ్చాయి. ఈ అమ్మాయిని విశ్వాకి చేసుకుంటే బాగుంటుంది, పిల్లలిద్దరికీ ఈడూ జోడు సరిపోతుంది అని అనుకున్నారు.స్వాతి తల్లితండ్రులతోపరిచయం చేసుకున్నారు. స్వాతి హోమ్ సైన్సు లో డిగ్రీ చేసింది.విశ్వనాథ్, స్వాతి ఒకరి నొకరు ఇష్టపడ్డారు.మంచి ముహూర్తంలో పెళ్ళి జరిగి పోయింది.
ఆరోజు మొదటి రాత్రి. విశ్వనాథ్ శోభనం గదిలో పూలతో అలంకరించిన పాన్పు పైన కూర్చొని పెళ్ళికూతురు రాక కోసం ఎదురు చూస్తున్నాడు. బుర్ర నిండా ఎన్నో ఆలోచనలు తిరుగుతున్నాయి. పరిచయం లేని అమ్మాయితో ఎలా మాటలు కలపాలి? మరీ ఉత్సాహం చూపించి దగ్గరకు వెడితే వీడికి సిగ్గు లేదనుకుంటుందేమో? అలాగని రిజర్వుడ్ గా ఉంటే వేరే ఏమైనా అనుకుంటుందేమో? ఏమిటి చేయాలి అనే సందిగ్ధతతో తెగ ఆలోచించేస్తున్నాడు. అయినా సమాధానం దొరక లేదు.
ఇంతలో తలుపు దగ్గర ఆడవాళ్ళ నవ్వులు వినబడ్డాయి. పెళ్ళికూతురు పాల గ్లాసుతో ప్రత్యక్షమైంది. శోభనం అలంకారంతో స్వాతి దేవకన్యలా కనపడింది. అలా చూస్తూ మంత్రముగ్దుడులా ఉండిపోయాడు. రెండు నిముషాలు తలుపు దగ్గరే నిలబడ్డ స్వాతి ఏదో గుర్తుకు వచ్చినట్లుగా ఒక చిరునవ్వు నవ్వి తలుపు గడియ పెట్టి వయ్యారంగా నడిచి వచ్చి భర్త పక్క కూర్చుంది. “పాలు తీసుకోండి” అంటూ పాల గ్లాసుతో చేయి ముందుకు చాచింది. ఆ మాటతో విశ్వా ఈ లోకంలో పడ్డాడు. పాలగ్లాసు తీసుకుంటూ స్వాతి కళ్లలోకి చూసాడు. ఆ కళ్ళు మత్తుగాతనతోఏవో కబుర్లు చెప్తున్నట్టుగా ఉన్నాయి. పాలు సగం తాగి గ్లాసు తిరిగి ఆమె చేతికి అందించాడు. మిగిలిన పాలు తాగి గ్లాసు టేబులు మీద పెట్టింది. చిరునవ్వు చిలకరిస్తూ, విశ్వా కళ్ళల్లోకి సూటిగా చూస్తూ “ అత్తయ్య గారు మీ గురించి అంతా చెప్పారు. ఆలోచనల నుండి బయటకు వచ్చి సరదాగా ఏమైనా కబుర్లు చెప్పండి” అంది. అంతే ఆలోచనలన్నీ పటాపంచలు అయ్యాయి. ఎక్కడలేని హుషారు వచ్చింది. హాయిగా నవ్వుతూ భార్యను దగ్గరకు తీసుకొని ముద్దాడాడు.ఆ రాత్రి ఇద్దరూ స్వర్గం అంచుల వరకూ వెళ్ళి వచ్చారు.
విశ్వా ఉదయం నిద్ర లేచి బద్దకంగా మంచం మీద దొర్లుతున్నాడు. స్వాతి ఎప్పుడు లేచిందో తెలియదు కాని చక్కగా తయారయ్యి కాఫీ కప్పుతో ప్రత్యక్షమైంది. “ ఇంక మీ ఆలోచనలు కట్టిపెట్టి లేచి కాఫీ తాగి తొందరగా తయారవ్వండి. ఇంటి నిండా చుట్టాలున్నారు. బాగోదు”. ఆ రోజు నుండి ఇంటిలో విశ్వనాథ్ మీద నియంత్రణ(Control)భార్య చేతిలోకి మారింది. విశ్వాకి అప్పుడు అర్థమైంది, అమ్మకు స్వాతి అంతలా ఎందుకు నచ్చిందో.విశ్వనాథ్స్వాతి వైపు చూసి కొంటెగా నవ్వాడు.
నేను ఊహల్లో నుండి బయటకు వచ్చి ప్రాక్టికల్ గా ఉండాలంటేనాపై ఎవరో ఒకరి నియంత్రణతప్పనిసరి. నన్ను ప్రేమతో నియంత్రించ గలిగిన అమ్మ, నాన్న, మాష్టారు, బాస్, ఈ రోజు స్వాతి నా జీవితం లోకి రావడంనా అదృష్టం అనుకున్నాడు విశ్వనాథ్.ఇంతకీ ఈ విశ్వనాథ్ ఎవరో చెప్పలేదు కదా. వాడు చిన్నప్పటి జామకాయల గురుత్వాకర్షణ శక్తి నుండి ఇప్పటి వరకూ వాడిఆలోచనలు అన్నీ నాతో పంచుకొనే నా బాల్యమిత్రుడు.
***