మాలపేటలో కాపురముండే ఓబులేసు ఊరి పంచాయతీ స్వీపరుగా పనిచేస్తు వీధులు ఊడ్వడం , కాలువలు శుభ్రం చెయ్యడంతో పాటు ప్రభుత్వ పధకాలు ప్రకటనలు ఊళ్లో చాటింపు ద్వారా ప్రజలకు తెలియ చేస్తుంటాడు. ఉన్న ఒక కొడుకు సైదులు చదువు మీద శ్రద్దతో తండ్రిని ఒప్పించి ఊరి ప్రభుత్వ పాఠశాలలో ఎనిమిదవ తరగతి వరకు చదవ గలిగాడు. తండ్రిలా కాకుండా తను గౌరవ ప్రదమైన కొలువు చేస్తానని పట్టు పట్టడంతో యం.ఎల్.ఎ గారి సిఫారసుతో ఊరి హైస్కూలులో ఎటెండరు ఉధ్యోగం సంపాదించ గలిగాడు సైదులు. ఎటెండరుగా సైదులు హైస్కూలు స్టాఫ్ వద్ద వినయం విధేయత కనబరుస్తూ క్రమశిక్షణ పని మాటతీరుతో అందరి మన్ననలు పొందేవాడు. అందువల్ల ఉపాధ్యాయులు ఎటెండరు సైదులంటే ప్రత్యేక అభిమానం కనబరిచేవారు. జాతీయ పర్వదినాలైన ఆగస్టు 15 , జనవరి 26, వంటి సమయాల్లో జాతీయ జండా దిమ్మను రంగులతో అలంకరించి మువ్వన్నెల జండాను చక్కగా తాడుకి అమర్చి పెట్టేవాడు. తన స్వంత డబ్బులతో పిల్లలకు పిప్పరమెంట్లు చాకొలెట్సు కొని పంచేవాడు. అక్కడ చదివే వారందరు చేతివృత్తులు కూలి పని చేసే కష్టజీవుల పిల్లలైనందున బాగా చదువుకుని మంచి కొలువులు సంపాదించి భవిష్యత్ బాగా చూసుకోమని ప్రోత్సహించే వాడు. అందువల్ల అన్ని తరగతుల విధ్యార్థులు ఎటెండరు సైదుల్ని ' బాబాయ్' అని ఆప్యాయంగా పలకరిస్తుంటారు. ఒకవేళ ఎవరైన విధ్యార్థి ఎక్కువ రోజులు స్కూలులో కనబడకపోతే ఎందుకు రావడం లేదో వాకబు చేసేవాడు. కొన్ని సందర్భాల్లో పిల్లల్ని స్కూలుకి పంపకుండా కూలి పనులకు వెంట తీసుకుపోతుంటారు పెద్దలు. అలాంటి వారికి నచ్చచెప్పి స్కూలుకి రప్పించేవాడు. ఊళ్లో బట్టలు కుట్టే టైలర్ హజ్రత్ కూతురు కైరున్నిసాని స్కూలుకి పంపడానికి ఇష్ట పడకపోతే ఒప్పించి స్కూలులో చేర్పించాడు సైదులు బాబాయి. కైరున్నిసా చదువులో చురుకైన తెలివైన పిల్ల. ప్రతి తరగతిలో ఫస్టు వచ్చేది. తనకి పిల్లలు లేనందున కైరున్నిసాను స్వంత కూతురిలా ఆదరించేవాడు. హైస్కూలు చదువు మద్యలో ఉండగా కైరున్నిసాను చదువు మాన్పించి పెళ్ళి ప్రయత్నాలు మొదలెట్టాలనుకున్నాడు టైలరు షేక్ హజ్రత్. కూతురి చదువుకి ఆర్థికంగా తన వల్ల కాదని పెళ్లి చేసేస్తే భాద్యత తీరిపోతుందని చెప్పేడు. టైలర్ హజ్రత్ కి నచ్చచెప్పి తర్వాత చదువుకి అయే ఖర్చు తను భరిస్తానని పెళ్ళి ప్రయత్నాలు ఆపించాడు. అలా శ్రద్ధగా చదువుతు కైరున్నిసా టెన్తు క్లాస్ జిల్లాలో ఫస్టు వచ్చింది. ఊరిలో అందరూ ఆ పిల్లను మెచ్చుకుని షేక్ హజ్రత్ ను అభినందించారు. ఈ గొప్పతనమంతా తనది కాదనీ స్కూల్ ఎటెండరు సైదులిదని తన కృతజ్ఞతలు తెలియ చేసాడు. తర్వాత కైరున్నిసా తెలివితేటల్ని తెలుసుకున్న హైస్కూలు హెడ్మాస్టరు గారు ఆమెను డిగ్రీ చదివించి బి. ఎడ్ పూర్తి చేయించి టీచర్ గా చెయ్యమని సలహా ఇచ్చి అందుకు కావల్సిన ఏర్పాట్లు చేసారు. ఊరి పెద్దల సహాయ సహకారాలతో పట్నంలో డిగ్రీ పూర్తి చేసిన తర్వాత బేచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ కూడా పాసయి అదే స్కూలుకి టీచర్ గా రావడం జరిగింది. ఊరి పెద్దలతో పాటు ఎటెండరు సైదులు ఆనందానికి అంతులేకపోయింది. సైదులుకు ఎన్నో సార్లు ఇతర ప్రదేశాలకు బదిలీ ఆర్డర్లు వచ్చి నప్పటికీ ఊరి పెద్దల రాజకీయ సిఫారసుతో రద్దవుతు వచ్చింది. ఎటెండరు సైదులు ప్రోత్సాహంతో ఊరి యువకులు ఎందరో బాగా చదివి మంచి ఉధ్యోగాల్లో స్థిరపడి ఆర్థికంగా బలపడ్డారు. తను ప్రత్యక్షంగా ఎక్కువ చదువుకునే అవకాశం లేకపోయినా పరోక్షంగా ఊరిలో ఎందరినో విద్యావంతుల్ని చేసి సరస్వతీ పుత్రుడయాడు స్కూల్ ఎటెండరు సైదులు. తన దత్త పుత్రిక కైరున్నిసా నిఖా(పెళ్లి) కోరుకున్న వ్యక్తితో ఘనంగా జరిపించాడు. అంతిమంగా ఎటెండరు సైదులు పదవీ విరమణ చేసే వయసు వచ్చింది. హైస్కూలు స్టాఫ్ తో పాటు ఊరి పెద్దల ప్రశంస సన్మానాలతో రిటైర్మెంట్ వేడుక జరిగింది. పదవీ విరమణ సత్కార సభలో ఏమి కావాలని ఊరి పెద్దలు , ఆర్థికంగా స్థిరపడిన ఉధ్యోగ యువకులు అడగ్గా ఊరి పంచాయితీకి ఒక గ్రంథాలయం ఏర్పాటు చెయ్యమని కరతాళ ధ్వనుల మద్య కోరుకున్నాడు సైదులు. సమాప్తం