నేటి మగువ తపన - B. .Rajyalakshmi

Neti maguva tapana

సుధ కళాశాల లెక్చరర్ గా రెండేళ్లక్రిందట పదవీ విరమణ చేసింది ! భర్త జానకిరామ్ చనిపోయి మూడేళ్లవుతున్నది .ఒక్కడే కొడుకు రమణ తండ్రి చనిపోయే సమయానికే బ్యాంకు వుద్యోగం లో స్థిరపడ్డాడు ! భర్త మరణం సుధను కృంగదీసింది .ఒంటరి పయనం లో తనకు తానుగా నిలదొక్కుకుని యిప్పుడు తన అభిరుచులలో జీవనాన్ని ప్రశాంతం గా గడుపుతున్నది .స్నేహితురాలు నీరజ తో అప్పుడప్పుడు మాట్లాడుతూ అభిరుచులను పంచుకుంటూ వుంటుంది .

ఆ రోజు వుదయమే పని ముగించుకుని సగం అల్లిన స్వెటర్ బయటకు తీసింది .రమణ బ్యాంకుపని మీద ఢిల్లీ వెళ్లాడు .వారం దాకా రానన్నాడు .ఇంతలో కాలింగ్ బెల్ మోగింది .తలుపు తీసింది సుధ

“రావే అల్లరిపిల్లా. ! మెసేజ్ కానీ కాల్ కానీ చెయ్యకుండా వూడిపడ్డావ్ ,నిన్ననే అమ్మతో మాట్లాడాను అమ్మైనా చెప్పలేదు “అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తూ నీరజ కూతురు శ్రీదేవిని ఆప్యాయం గా పలకరించింది సుధ .
“ఆంటీ ,మీ ప్రశ్నలతో నన్ను వుక్కిరిబిక్కిరిచెయ్యకండి .ప్రశ్న మర్చిపోయే ప్రమాదముంది “ అంటూ నీరజ నవ్వుతూ లగేజ్ తో గెస్ట్ రూమ్ లోకి వెళ్లింది .
సుధ నవ్వుకుంటూ వంటింట్లో కి వెళ్లి భోజనం ఏర్పాట్లు చేస్తున్నది .తాను కూడా యింకా తినలేదు ,యిద్దరికీ వంటకాలు సరిపోయేలా వున్నాయి .కొన్ని అప్పడాలు వేయించి అన్నీ డైనింగ్ టేబుల్ పైన అమర్చింది .సుధ కు అన్నీ పద్ధతిలో అయిపోవాలనే మనస్తత్వం !పావు గంట తర్వాత లేత నీలంరంగు టీషర్ట్ ,తెల్లని పైజామా ,జుట్టు బిగించి కట్టింది ,ముంగురులు అందం గా నుదిటిమీద వూగుతున్నాయి.శ్రీదేవి ఫ్రెష్ అయ్యి వచ్చింది !

“ఆంటీ ! బాగా ఆకలేస్తున్నది ! ముందు ఆత్మారాముణ్ణి చల్లబరిచి మీతో బోలెడు కబుర్లు చెప్పాలి ,”అంటూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని యిద్దరికీ వడ్డించింది శ్రీదేవి .ఆవకాయ చూడగానే నోట్లో నీళ్ళూరాయి ,ములక్కాయ పులుసు కందిపచ్చడి ,అన్నీ అన్నీ శ్రీదేవికి యిష్టమైనవే ! యిద్దరూ సరదా కబుర్లు చెప్పుకుంటూ భోజనం ముగించారు .హాల్లోకి వచ్చి సోఫాలో హాయిగా తీరిగ్గా కూర్చున్నారు .

“ఆంటీ నేనొస్తున్నట్టు అమ్మకు తెలియదు .నేరుగా మీ దగ్గరికే వచ్చాను ,”శ్రీదేవి కళ్లల్లో నీలినీడలను పసికట్టింది సుధ .

“సరేలే యిక్కడ్నించి వెళ్లినతర్వాత నన్ను గుర్తుపెట్టుకుని మరీ వచ్చావు దేవీ ,కాసేపు పడుకో ,లేచిన తర్వాత మీరున్న పోర్షన్ చూద్దువు “అంటూ టాపిక్ మార్చింది సుధ .శ్రీదేవి సోఫా లో అలాగే నిద్ర పోయింది .సుధ వంటింట్లో గిన్నెలు సర్దుకుని వచ్చి తాను కూడా సోఫాలో పడుకుంది .ఇద్దరూ సుమారు నాలుగింటికి లేచారు .టీ త్రాగిన తర్వాత యిద్దరూ ప్రక్క పోర్షన్ కి వెళ్లారు .అక్కడ పారిజాత పందిరి క్రింద వున్న వుయ్యాల బల్ల చూడగానే ఛంగున యెక్కి వూగుతూ పారిజాతాలను చేత్తో ప్రేమగా నిమురుతూ బుగ్గలకు నిమురుకుంది .అది చూస్తున్న సుధకు పెళ్లయిన కొత్తలో శ్రీదేవి గుర్తుకొచ్చింది .శ్రీదేవి ,శ్రీనాథ్ పెళ్లి అవుతూనే సుధ పోర్షన్ లో కొత్త కాపురం మొదలు పెట్టారు .ఇద్దరూ ఆ వుయ్యాల బల్ల మీద వూగుతూ కబుర్లు చెప్పుకునేవాళ్లు.సుధా ,జానకిరామ్ వాళ్లను తమ పిల్లలలాగా చూసుకునేవాళ్లు.శ్రీదేవి మహా సందడి ,అతి చురుకు !ఒక్క క్షణం కూడా వూరికేవుండేది కాదు . టెక్స్టైల్ టెక్నాలజీ చాలా యిష్టం .శ్రీనాథ్ నెమ్మదస్తుడు ,మితభాషి .పాపాయి నీలిమ పుట్టి సంవత్సరం వచ్చేదాకా సుధ పోర్షన్ లోనే వున్నారు .శ్రీదేవి ఆ పోర్షన్ చూస్తూ గతం లోకి వెళ్లి “ ఆంటీ మీకు గుర్తుందా నీలిమ పాక్కుంటూ పారిజాత పందిరిలో పడిపోయింది .నేను అక్కడ తప్ప యిల్లంతా వెదికాను చివరకు దాని యేడుపు వినిపించి కనుక్కున్నాను “అంటూ నవ్వేసింది .సుధ కూడా నవ్వేసింది .

ఇద్దరూ మళ్లీ హాల్లోకి వచ్చారు .కొద్దిగా చల్లబడింది .”నీలు బంగారు యెలా వుంది “ అడిగింది సుధ .

“హాయిగా అమ్మ దగ్గర బోలెడు కథలు చెప్పించుకుంటూ ,గారాలు పోతూ రుచి గా అన్నీ తింటూ రాకుమారిలాగా వుంది “శ్రీదేవి కళ్లల్లో మెరుపు !అమ్మతనం అంటే అదేగా అనుకుంది సుధ .సుధా ,శ్రీదేవి బయటకెళ్లి కొన్ని కూరలు తెచ్చుకున్నారు .అలాగే కాసేపు వాకింగ్ చేసి వచ్చారు .సుమారు యేడు గంటలు అవుతుండగా “దేవీ డిన్నర్ నేను చపాతీ తింటాను మరి నీకు ఏం చేయమంటావు “అడిగింది .

“రాత్రుళ్లు నేనూ చపాతీలే తింటాను ,బంగాళాదుంప కూర నేను చేస్తాను “అంటూ శ్రీదేవి బంగాళదుంపలను ప్లేట్ లో తీసుకుంది .

“అయితే యింట్లో నువ్వేనా వంట ?” అడిగింది సుధ .

“ఉదయం అత్తయ్యగారు సాయంకాలం నేను చేస్తాం కానీ ఆర్నెల్లుగా ఆవిడ మా పెద్దబావ గారి దగ్గర వున్నారు “శ్రీదేవి మాటల్లో మళ్లీ యేదో నిర్వేదం ధ్వనించింది .మొత్తానికి శ్రీదేవి ఒకనాటి అల్లరి దుడుకు పిల్లకాదనీ యేవోసమస్యలలో వుందని అర్ధమయ్యింది సుధకు .

కబుర్లు చెప్పుకుంటూ చపాతీలు తిన్నారు .శ్రీదేవి లాప్టాప్ ఓపెన్ చేసి సోఫా లో కుర్చీని పని చేసుకుంటున్నది ,సుధ వంటిల్లు సద్దుకుని తీరిగ్గా వచ్చి శ్రీదేవి దగ్గర కూర్చుంది .శ్రీదేవి లాప్టాప్ మూసేసింది .

“ఆంటీ అమ్మ తో మాట్లాడి మీరే ఒప్పించాలి “అన్నది సుధ కళ్లల్లోకి చూస్తూ .

“అంత సీరియస్ విషయమా ?” అన్నది సుధ .

“నిజానికి అది మా తరానికి సీరియస్ విషయం కాదు కానీ మీ తరానికి అది సీరియస్ విషయం ! నేను నా ఎస్టాబ్లిషమెంట్ మొత్తం యిక్కడికి షిఫ్ట్ చేస్తున్నాను నా ఆఫీస్ యిక్కడికి మార్చుకుంటున్నాను “ అన్నది శ్రీదేవి .

“ మంచి విషయమే గా ,పాపాయి కి కూడా దగ్గరే వుంటారుగా ,అమ్మా ,నాన్నా అమ్మమ్మ తాతయ్య బంగారు తల్లి చిట్టితల్లి అంతా సందడే ! “అన్నది సుధ .

“ఆంటీ ,నేనొక్కదాన్నే వస్తున్నాను .శ్రీనాథ్ రావడం లేదు .” అన్నది శ్రీదేవి .

“దేవీ , ఏమైనా మనస్పర్థలు వచ్చాయా మీ యిద్దరికీ ?”అడిగింది సుధ .

“ఏం చెప్పాలి ఆంటీ ! శ్రీనాథ్ నా స్కూలు ఫ్రెండ్ ,అప్పట్లో నన్ను అన్నిట్లో ముందుండి మరీ ప్రోత్సహించేవాడు ,నేను నాకంటూ ఒక గుర్తింపు ,ఏదైనా ఇన్నోవేటివ్ కోసం తపన పడే తత్త్వం నాది
అందుకోసం నేను యెంతైనా కష్టపడతాను.ఫాబ్రిక్ డిజైనింగ్ .ప్రింటింగ్ లో డిఫరెంట్ కాంబినేషన్ ట్రై చేస్తూ సక్సెస్ అవుతున్నాను ,అందుకే పాపాయిని అమ్మదగ్గర వుంచాను .గుజరాత్ లో నేనిప్పుడు నా కెరీర్ మీద మొత్తం ఫోకస్ చేసాను .ఒక్కోసారి వేరే ప్రదేశాలకు వెళ్లాల్సివస్తుంది ,కొన్నిరోజులు వుండాల్సివస్తుంది , అది శ్రీనాథ్ కి నచ్చడం లేదు .అదంతా మానేసి యింట్లో కూర్చోమంటున్నారు ,మా యిద్దరికీ రోజూ గొడవలే , నెల క్రిందట నా వృత్తిరీత్యా యిద్దరు మగవాళ్లు యింటికి వచ్చారు ,మేం మా డిజైనింగ్ ప్రింటింగ్ గురించే మాట్లాడుకున్నాం అదికూడా శ్రీనాథ్ అక్కడే వున్నారు .వాళ్లు వెళ్లిన తర్వాత నన్ను బాగా విసుక్కోని ఆవేశం లో నన్ను యింట్లో నించి వెళ్లిపొమ్మని నోరు జారారు “శ్రీదేవి ధ్వని లో ఆవేశం ,కళ్లల్లో కోపం బాధ మిళితమయ్యాయి .

“శ్రీనాథ్ నీ చురుకుతనం చూసే కదా పెద్దవాళ్లను ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నాడు .యిప్పుడు యీ అనుమానాలేమిటి ? “సుధ కూడా బాధపడింది .

“ మంచీ ,చెడూ యే రంగం లో లేవు చెప్పండి !పెళ్లంటే ఒకరిమీద మరొకరికి నమ్మకం ,ప్రేమ ! శ్రీనాథ్ కు నేనంటే మహా ప్రేమ అదే యిప్పుడు అతని దృష్టి కోణం మార్చింది .అతని దృష్టిలో ప్రస్తుతం నేను యిల్లు పట్టించుకోని మొగుణ్ణి పట్టించుకోని ఆడదాన్ని ! ఎంత నచ్చచెప్పినా వినడం లేదు .నాకు వాదించే శక్తి నశించింది ,నేను యిలాగే అతని దగ్గర వుంటే పిచ్చిదాన్నవుతాను ,అందుకే యీ నిర్ణయం తీసుకున్నాను”ఇప్పుడు శ్రీదేవి గొంతులో గంభీరం ,ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతున్నాయి .
సుధ మౌనం గా వుండిపోయింది .నేటి తరం ఆడపిల్లలు ఒకవైపు తమ ని తాము ప్రూవ్ చేసుకోడానికి తపన పడుతున్నారు మరో వైపు వివాహ బంధం బీటలు బారుతున్నది . పుట్టిన పిల్లల భవిష్యత్తు అగాధం అవుతున్నది .సమస్యలను సానుకూలం గా పరిష్కరించుకోవచ్చు కానీ పంతం పట్టింపు యెక్కువయ్యి జీవితాన్ని చిన్నాభిన్నం చేసుకుంటున్నారు .

,

మరిన్ని కథలు

Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు
Pratibha
ప్రతిభ
- చెన్నూరి సుదర్శన్
Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు