మగధ సామ్రాజ్యాన్ని పాలించే రాజశేఖరునికి సంగీతం అంటే చాలా ఇష్టం. కార్యభారం వల్ల బాగా అలసిపోయినప్పుడు ఆ అలసట నుంచి ఉపశమనం పొందడానికి శ్రావ్యమైన పాటలు వింటూ ఉంటాడు. బాగా పాడిన కళాకారులకు విలువైన బహుమతులు ఇస్తూ ఉంటాడు. ఒకసారి రాజశేఖరుడు పాటల పోటీలు నిర్వహించాడు. ఎవరైతే బాగా పాడి తనను మెప్పిస్తారో వాళ్ళకు గొప్ప బహుమతి ఉంటుందని ప్రకటించాడు. రాజుకు పాటలంటే చాలా ఇష్టం కదా! పోటీలో గెలిస్తే చాలా గొప్ప బహుమానం ఇస్తారని చాలామంది పోటీ పడ్డారు. అందులో సుందరుడు, రంగనాథుడు సమాన ప్రతిభను కనబరిచారు. ఎవరిని ఎంపిక చేయాలో అర్థం కావడం లేదు. ఆ బాధ్యత మంత్రి గోవర్ధనునికి అప్పజెప్పాడు రాజు. గోవర్ధనుడు సుందరుని పిలిపించి, "రంగనాథుని ఉత్తమ గాయకుడిగా ఎంపిక చేశాము. ఈసారి బహుమతి రాలేదని బాధపడకండి. ఇంకోసారి అవకాశం వచ్చినప్పుడు మీ అదృష్టం పరీక్షించుకోండి." అన్నాడు. "నా కంటే గొప్ప గాయకుడు ఈ భారతదేశంలో లేడని ఎంతోమంది నన్ను ప్రశంసించారు. మీ ఎంపికలోనే పొరపాటు ఉంది. బహుమతి గెలుచుకున్నంత మాత్రాన అతడు నన్ను మించిన గాయకుడు కాలేడు కదా! బహుమతులు ఇవ్వడంలో రాజకీయాలు మామూలే." అంటూ అక్కడ నుంచి విసురుగా వెళ్ళిపోయాడు. గోవర్థనుడు రంగనాథుని పిలిపించి, "సుందరుని ఉత్తమ గాయకుడిగా ఎంపిక చేశాము. బహుమతి రాలేదని విచారపడకండి. మరోసారి ఎప్పుడైనా మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి." అన్నాడు. "బహుమతి రానందుకు విచారం ఏమీ లేదు. రాజుగారిని మెప్పించిన వారిలో రెండవ స్థానంలో ఉన్నాను. నా పాటలను ఎక్కువమంది ప్రజలు ఆదరిస్తే అదే పెద్ద బహుమతి. ధన్యవాదాలు మంత్రి గారూ!" అన్నాడు రంగనాథుడు. మంత్రిగారి సూచన మేరకు నిగర్వి అయిన రంగనాథుని విజేతగా ప్రకటించడమే కాదు, తన ఆస్థాన గాయకుడిగా నియమించాడు రాజశేఖరుడు.