రైల్లో రాధ - కొడవంటి ఉషా కుమారి

Raillo Radha

రైలు ఒకటో నెంబర్ ప్లాట్ ఫాం మీదకి వచ్చి ఆగింది. అంతా హడావిడిగా ఉంది. రైలు వచ్చే వరకు రైలు కోసం ఎదురు చూపులు, రైలు వచ్చాక సీటు కోసం పాట్లు, సీటు దొరికితే ఎప్పుడు బయలుదేరుతున్న అని ఎదురు చూపులు మళ్లీ మొదలు. “ఇదిగో…. అనంతం, ఆ బ్యాగ్ అందుకో, రాధా జాగ్రత్త”, అంటూ జాగ్రత్తలు చెబుతూ భార్యని, మనవరాలిని రైల్ ఎక్కించాడు పెద్దాయన. “హమ్మయ్య! ఇక్కడ చోటు దొరికింది”, అంటూ కూర్చున్నారు. ఒక బెర్త్ మీద బామ్మ తాత గారు మనవరాలు లైన్ గా కూర్చున్నారు. ఎదురు బెర్త్ మీద కిటికీ దగ్గర ఎవరో యువకుడు కూర్చున్నాడు. “బామ్మ, నేను కిటికీ దగ్గర కూర్చుంటాను”, అని మనవరాలు అంది. ఈలోగా సైడ్ బెర్త్ లో ఉన్న పెద్దాయన, “నువ్వు ఇక్కడ కూర్చో అమ్మా! నాకు గాలి ఎక్కువైతే పడదు”, అన్నాడు. “థాంక్యూ తాతగారు”, అంటూ కూర్చుంది ఆమె. కిటికీ దగ్గర ఉన్న యువకుడు నిరాశగా నిట్టూర్చాడు. “ఛ! మంచి ఛాన్స్ మిస్ అయింది. అమ్మాయి ఎదురుసీట్లో కూర్చుని ఉంటే బాగుండేది కదా”, అనుకున్నాడు మనసులో. “ఇదిగో…. అమ్మాయి దగ్గరికి వెళ్తున్నాం, బ్యాగ్ లో గుమ్మడి వడియాలు, రేగి వడియాలు పెట్టావా?”, అన్నాడు తాతగారు. “అబ్బా! మీకు అన్నీ కంగారే. అదిగో ఆ గుడ్డ సంచీలో పెట్టాను”, అంది బామ్మ. “అమ్మో! ఎవరైనా దొంగ వెధవ పట్టుకొనిపోతెనో, నా దగ్గరే పెట్టుకుంటాను”, అన్నాడు, ఎదురు సీట్లో యువకుడి కేసి మిర్రి మిర్రి చూస్తూ. “రాధా, అనంతం జాగ్రత్త. మీరు కిటికీ దగ్గరికి వెళ్ళకండి. దొంగలు ఉంటారు మెడలో గొలుసులు లాగేస్తారు”. “మంచి నీళ్ళ బాటిల్ పెట్టావా? రాధా”, అంటూ బామ్మ ఏదో మాట్లాడడంలో ఇటు తిరిగాడు తాతయ్య. “నేను పెట్టానులే తాతయ్య, కంగారు పడకండి”, అంది యువతి. 'నేను కృష్ణ…. ఆమె రాధా…. ఇంకా ప్రేమించడానికి ఎం ఉంది బాధ' మనసులో అనుకున్నాడు ఆ యువకుడు. క్షణాల్లో కూల్ డ్రింక్స్, చాక్లెట్లు తెచ్చి బామ్మ చేతిలో పెట్టాడు. “తీసుకోండి”, మర్యాదగా అన్నాడు. “ఎందుకు బాబు”, అంటూ బామ్మ మొహమాటపడింది. “అయ్యో తీసుకోండి పర్వాలేదు”, అన్నాడు యువకుడు. బామ్మ ఒక కూల్ డ్రింక్ బాటిల్ ఓపెన్ చేసి, మార చెంబులో పోసుకుంది. తాతగారు అందరితో కలుపుగోలుగా మాట్లాడుతున్నాడు. “నిజం చెప్పాలంటే మా రాధకి చిన్నప్పటినుండి కవిత్వం పిచ్చి కాస్త ఎక్కువే. ఎక్కడ ఏ కవిత కనబడినా చదివేస్తుంది”, అన్నాడు తాతయ్య.బామ్మ చాక్లెట్లు నోట్లో వేసుకుంది. వెంటనే ఆ యువకుడు పుస్తకం పెన్ను బయటకు తీశాడు. ఏదో రాశాడు. “తాతగారు, నా పేరు కృష్ణ. నేను కవితలు రాస్తాను. ఈ కవిత్వం వినండి, రాధాకృష్ణుల మీద రాశాను”. “సరే చెప్పు, రాధ వింటుంది”, అన్నాడు తాతయ్య. రాధ ప్రేమ కృష్ణునికే సొంతం యమునా తటి పై రాధ విరహం కృష్ణునితో సయ్యాటలు రాధ ప్రేమ కృష్ణునికే సొంతం రాధా రాధా రాధా కృష్ణుని ప్రేమ బాధ రాధ ప్రేమ కృష్ణునికే సొంతం “ఎలా ఉంది?” అడిగాడు కృష్ణ. బామ్మ బుగ్గలు ఎరుపెక్కాయి “చూశారా! రాధ ప్రేమ కృష్ణునికే సొంతమట. ఇన్ని సంవత్సరాలయింది, ఒక కవితైనా చెప్పారూ!” “ఇంతకీ ఎలా వుంది నా కవిత?” “ఏదో అఘోరించావులే”, అన్నాడు తాతయ్య. నెక్స్ట్ స్టేషన్ లో రైలు ఆగగానే మంచి కమలాలు ఒక డజను తీసుకొచ్చాడు కృష్ణ. బామ్మ సిగ్గుపడింది, తాత మిర్రి మిర్రి చూశాడు. “తీసుకోండి”, అంటూ ముందు అడుగు వెయ్యబోయినా కృష్ణని చేతి కర్ర తో ఠక్కున ఆపాడు. “ఎవరికివి?” గట్టిగా అన్నాడు. “మీకే”. “అలా పెట్టక్కడ”, అన్నాడు తాతయ్య ఉరిమి చూస్తూ. కృష్ణ భయంగా అక్కడ పెట్టాడు. అక్కడ కూర్చున్న అందరికీ పళ్ళు పంచాడు తాతయ్య. బామ్మ, తాతయ్య ఒకరికొకరు పళ్ళు తినిపించుకున్నారు. “అమ్మాయి, నువ్వు తింటావా?” “వద్దు తాతయ్యా. నాకు కమలాలు ఇష్టం ఉండవు”. 'అయ్యో! అందరూ తింటున్నారు, ఒక్క రాధ తప్ప’, మనసు బాధగా మూలిగింది కృష్ణకి. ఎదురు సీట్లో బాబు, “తాతగారు…. నాకు పళ్ళు వద్దు కూల్ డ్రింక్ కావాలి”, “అదేం భాగ్యం, తీసుకో”, అంటూ ఆ యువకుడు తెచ్చిన బాటిల్ బాబుకి అందించాడు ఉదారంగా. 'అయ్యో! రాధ కోసం తెస్తే ఈ బాబు తాగిస్తున్నడే’, మళ్లీ బాధగా మూలిగింది కృష్ణ మనసు. “రాధగారు తాగుతారని తెచ్చానండి”, అన్నాడు ధైర్యం చేసి. బామ్మ సిగ్గుపడింది. “రాధ కోసం తెచ్చాడు అంట! నా కోసం మీరు ఎప్పుడన్నా తెచ్చారా??!!”, కోపంగా అంది బామ్మ. అలా అంటూనే చాక్లెట్ నోట్లో వేసుకుంది. “చాల్లే!! అఘోరించాడు”. 'ఇలా కాదు తొందరగా నా మనసులో మాట చెప్పాలి’, అనుకున్నాడు కృష్ణ. “మళ్లీ కవిత చెబుతా, వినండి”, అనడంతో అందరూ కూడా హుషారుగా అతనికేసి చూసారు. 'ఈ కృష్ణుని మనసులో రాధ రాధా భరించలేను ఈ విరహ బాధ రాధా రాధా నన్ను చేసుకుంటావా పెళ్లి మళ్లీ మళ్లీ’, అని ఆపాడు కృష్ణ “చేసుకునే దాన్నే!! మా ముసలాయన ఒప్పుకుంటాడో, లేదో”, అంటూ బుగ్గలు బూరెల్లా పొంగించింది బామ్మ. “భడవకానా!…. నా రాధని తన్నుకుపోదామనే….”, అంటూ చేతి కర్ర తీసాడు తాత. “ నేను రాధ గురించి రాసానండి”, అన్నాడు కృష్ణ. రైలు పదో స్టేషన్ లో ఆగుతోంది. “మరి…. రాధంటే ఎవరనుకున్నావు. ఈమె రాధ…. ఈమె గురించేగా నువ్వు కవితలు చెప్పావు. ఆమె సిగ్గు పడ్డది కూడా. ఇంకా కూల్ డ్రింక్ మరక చెంబులో పోసుకుంది, చాక్లెట్లు కూడా తింది”, అన్నాడు తాతయ్య. కృష్ణ అయోమయంగా చూసాడు. “నా భార్య రాధ, నా మనవరాలు అనంతం. ఇంకా నువ్వు ఇక్కడ ఉంటే నా కర్ర నీ వీపు మీద కథాకళి ఆడుతుంది”, అన్నాడు తాతయ్య. కృష్ణ పరుగు పరుగున మరో కంపార్టుమెంటు ఎక్కాడు. కంపార్టుమెంటు అంతా నవ్వులతో నిండింది. అనంతం విరగబడి నవ్వింది. “ఇంతకీ ఈ ఎపిసోడ్ లో ట్విస్ట్ ఏంటంటే నా పేరు కూడా కృష్ణే”, అన్నాడు తాతయ్య. కంపార్టుమెంటు అంతా మరోసారి నవ్వులతో నిండింది.

మరిన్ని కథలు

Pratibha
ప్రతిభ
- చెన్నూరి సుదర్శన్
Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు