వైద్యవిధాన పరిషత్తు ఆవరణ జనంతో కిటకిటలాడుతోంది. వారం రోజులుగా రోగుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఎటు చూసినా జ్వరాలతో వచ్చిన పిల్లలతో ఆ ప్రాంగణం అరుపులతో గోలగోలగా ఉంది. కానుగ చెట్టు అరుగుపై చలికి వణుకుతున్నాడు ఆరేళ్ల అబ్బాయి. అతనిపై చిరిగిన దుప్పటి కప్పుతూ ‘‘కాసేపు ఓపిక పట్టు..డాక్టరు వస్తే ఇంజక్షను వేస్తారు..చలి జ్వరం కాస్త తగ్గుద్ది.. ఆ తర్వాత మాత్రలు రాసిస్తారు..అవి మింగితే పూర్తిగా తగ్గిపోద్ది’’ అని ధైర్యం చెబుతున్నాడు చింపిరి జుట్టు, మాసిన పంచెకట్టుతో వున్న అతని తండ్రి మల్లయ్య
అప్పుడే కారులో దుమ్మురేపుతూ అక్కడికి వాయువేగంతో దూసుకొచ్చాడు. ఆ దుమ్ముకు అక్కడి వారందరూ అటుఇటు పరిగెత్తారు. కారు ఆపేందుకు కాస్త అడ్డుగా ఉండడంతో ‘‘ దూరంగా పో..పోవయ్యా..’’ కోపంతో ముఖం చిట్టించుకున్నాడు.
అదేమీ పట్టలేదు మల్లయ్యకు.. ‘‘సార్..సార్..! నాల్గు రోజులుగా మా అబ్బాయికి ఒకటే జ్వరం..నీరసంతో పైకి లేచి నిలబడలేకపోతున్నాడు... కాస్త ఓ సూది, మాత్రలు రాసివ్వండి సార్..’’ చేతులు జోడిరచాడు ఆశతో మల్లయ్య.
డాక్టరు కళ్లు చింతనిప్పుల్లా మండాయి. ‘‘ ఇప్పుడు విషజ్వరాలు వస్తున్నాయి.. జాగ్రత్తగా ఉండాలి.. అపరిశుభ్రంగా ఉంటే అంతేమరి.. ఇంతకీ అది ఏ జ్వరమో ఎవరికి తెలుసయ్యా? అన్ని పరీక్షలు చేస్తేగాని తెలియదు.. ఇక్కడ పరీక్షించడానికి ఏమున్నాయని.. ఇక్కడికి పరిగెత్తుకొచ్చావ్..! దండగ.. సాయంత్రం మన వైద్యశాలకొచ్చి కలువు.. మంచి ట్రీట్‌మెంటు ఇస్తా..బాగవుద్ది..’’ ఓ విజిటింగు కార్డుచేతిలో పెట్టాడు డాక్టరు.
మల్లయ్యకు చదవడం రాదు. రంగురంగులతో ఉన్న ఆ విజిటింగ్ కార్డుని తీస్కుని పక్కనే కూర్చున్న వ్యక్తి వద్దకు నడిచాడు. ‘‘ అయ్యా ఇది ఎక్కడ వుందో అడ్రసు కొంచెం చెప్పునాయనా..! మా చిన్నోడు జ్వరంతో అల్లాడుతున్నాడు.. మంచి వైద్యం చేస్తారక్కడ..’’ అన్నాడు మల్లయ్య.
ఆయనకు నవ్వు ఆగలేదు.. ‘‘ ఈ ఆస్పత్రిని నువ్వు భరించలేవు..వెళ్లాలంటే లక్షలు గుంజుతారు..నువ్వు ఆ డాక్టరునే వైద్యం చెయ్యమని అడుగు..’’ సలహా ఇచ్చాడు ఆ వ్యక్తి.
అంత డబ్బు ఖర్చుచెయ్యాలంటే తన వద్ద లేదు..అమ్మో భరించలేను..శరీరం భయంతో కంపించింది. చలికి వణుకుతున్న పిల్లోడ్ని చంకలో వేస్కుని డాక్టరు గదిలోకి పరుగు తీశాడు. తల వంచుని పేపరు తిరగేస్తున్న డాక్టరును చూసి గుమ్మంలోనే ఆగిపోయాడు.
‘‘ ఎవరు నువ్వు..? ఇక్కడ మందులేం లేవు..సాయంత్రం మా ఆస్పత్రిలో కలువు..’’ బయటికి వెళ్లు అన్నట్టు విసుక్కున్నాడు డాక్టరు.
‘‘ అయ్యా..! పేదోడిని.. మా ఊరునుంచి రావడానికి వెయ్యి రూపాయలు ఖర్చయ్యింది. అది మా పక్కింట్లో అప్పు తీస్కొచ్చా.. మా అబ్బాయికి జ్వరం తగ్గే మందులివ్వండి సారూ..!’’ దీనంగా ప్రాధేయపడ్డాడు.
డాక్టరు ‘‘ వీలు కాదు.. ఇక్కడ ఎలాంటి మందులూ లేవు..వెళ్లు..వెళ్లొళ్లు..’’ గెంటేంత పనిచేశాడు.
కొడుకుని చేతిలోనే పట్టుకుని నిరాశతో నడిచాడు గంగయ్య. అంతకంతకూ పెరుగుతున్న వేడిని చూసి విస్తుపోయాడు మల్లయ్య. కొడుకు ఏమైపోతాడో అన్న భయం వెంటాడిరది. చేతిలో పైసా లేదు..కొడుకుని భుజాన వేసుకుని ఇంటిదారి పట్టాడు. మండుటెండలో చెమటలు పడుతున్నాయి. తను పనిచేసే ఆసామి ఇంటి ముందు నిల్చొన్నాడు. కనికరించిన ఆసామి రెండు వేలు ఇచ్చాడు. తీస్కుని డాక్టరు వద్దకు నడిచాడు. విజిటింగ్ కార్డు పట్టుకుని ఆస్పత్రి ముందు ప్రత్యక్షమయ్యాడు. రంగురంగుల అద్దాలతో ఆ మేడ సూర్యుని కిరణాలకు కాంతిలీనుతోంది. ఆ కాంతికి మల్లయ్య కళ్లు చెదిరాయి. లోనికి అడుగుపెట్టాడు. ఎంట్రన్సులో సెక్యూరిటీ గార్డు ‘‘ఎవరయ్యా నువ్వు..?’’ ప్రశ్నించాడు.
‘‘ అయ్యా.. అయ్యా.. పేదోడిని మా వాడికి జ్వరం వచ్చింది.. వారం రోజులుగా తగ్గలేదు.. ప్రభుత్వ ఆస్పత్రికి వెళితే డాక్టరు ఈ కార్డు ఇచ్చి కలవమన్నాడు..’’ అని విజిటింగు కార్డు చూపాడు మల్లయ్య.
‘‘ ఆ సారూ లోపల ఉంటారు.. ముందు ఓపీ టిక్కెట్ తీస్కెళ్లు..’’ అటు చూపాడు.
అక్కడ వరుసగా వేసిన కుర్చీలో కూలబడ్డాడు మల్లయ్య. క్యూ రెండు పర్లాంగులు దూరం ఉంది. వారు వెళ్లిన తర్వాత చివరలో రెండు వందలు ఇచ్చి ఓపీ తీసుకున్నాడు. ఎటు వెళ్లాలో తెలియక వెర్రిచూపులు చూస్తుంటే సెక్యూరిటీ అటు వెళ్లవయ్యా అని డాక్టరు గది చూపించాడు.
గబగబ లోనికి ప్రవేశించాడు మల్లయ్య. అక్కడ యాభై మంది రోగులు ఉన్నారు. వారిని పరీక్షిస్తున్నాడు డాక్టరు. వారిని తోసుకుంటూ లోనికెళ్లే సరికి డాక్టరుకు కోపం కట్టలు తెచ్చుకుంది. ‘‘ ఎవరయ్యా.. నువ్వు.. కాస్తయినా బుద్ధి వుందా?’’ విసుకున్నాడు.
పాపం మల్లయ్య అదేమీ పట్టించుకోలేదు. వెనక్కి వెళ్లి నిరీక్షించాడు. గంట తర్వాత తన వంతు వచ్చింది. వెళ్లి డాక్టరు ముందు నిల్చొన్నాడు.
డాక్టరు నల్లగా మాసిన అతని దుస్తులు చూసి అసహ్యించుకున్నాడు. ‘‘ ఆ చెప్పు ఏంటి ప్రాబ్లం?’’ అడిగాడు.
‘‘ మా వాడికి వారం రోజులుగా జ్వరం సారూ..’’ అని చెప్పే లోపే ఓ నాలుగు టెస్టులు చేసుక్కుని రా.. ట్రీట్‌మెంట్ సంగతి తర్వాత ఆలోచిద్దాం..’’ అని ఓ కాగితం చేతిలో పెట్టాడు డాక్టరు.
ఆ కాగితం తీసుకుని ల్యాబ్ వద్దకు పరుగులు తీశాడు. ఆ చీటి ఇచ్చాడు. వాళ్లు అబ్బాయి చేతిలో రక్తం, మూత్ర నామూనాలు సేకరించారు. ఆ రిపోర్టు వచ్చే సరికి సాయంత్రం ఏడు గంటలైంది. చేతిలో ఉన్న రెండువేలు రూపాయలు ఫీజు వారి చేతిలో పెట్టి, అది తీసుకుని డాక్టరు వద్దకు పరుగుపరుగున వెళ్లాడు.
డాక్టరు అప్పుడే ఇంటికి బయలుదేరుతున్నాడు. ‘‘ సార్..సార్.. మా పిల్లాడికి ఏవైనా మందులు రాసివ్వండి సారు..’’ దీనంగా వేడుకున్నాడు మల్లయ్య. ఎప్పుడో ఇంటి వద్ద ఉదయం తిన్న చద్దెన్నం అరిగిపోయింది. ఇక మధ్యాహ్నం కూడా తినలేదు. పచ్చి మంచి నీళ్లుకూడా ముట్టలేదు తన కొడుకు పరిస్థితికి భయపడి. మల్లయ్యను చూసి మండి పడ్డాడు డాక్టరు. రిపోర్టులన్నీ పూర్తిగా రానిదే ఎలాంటి జ్వరమో నిర్థారించలేం.. రేపు ఉదయం వస్తాను లేవయ్యా.. అప్పుడేం ముంచుకుపోయిందని?’’ విసురుగా కారు ఎక్కి రివ్వున దూసుకుపోయాడు డాక్టరు.
మల్లయ్యకు కడుపులో ఎలుకలు పరుగెడుతున్నాయి. ఎప్పుడో తెల్లారి తిన్న చద్దన్నం అరిగిపోయింది. పేగులు ఆకలితో అలమటిస్తున్నాయి. చేతిలో తెచ్చిన రెండు వేలు అయిపోయాయి. కొడుకు చలికి వణుకుతున్నాడు. డాక్టరు వైద్యం చేసివుంటే ఇంటిదారి పట్టేవాడు. ఇక ఈ రాత్రికి ఎక్కడ పడుకోవాలో ఏమో అనుకుంటూ ఆస్పత్రి గేటు దాటి బయటికొచ్చాడు మల్లన్న. వంట్లో నీరసంగా వుంది. కొడుకుని భుజాన వేస్కుని నడవలేక నడుస్తున్నాడు. ప్రాణం గాలికి కొట్టుకుపోతున్నట్లు వుంది. ఎవరో ఎదురుగా గుడి దగ్గర అన్నదానం చేస్తుంటే అక్కడికి వెళ్లాడు. ఓ విస్తరి చేతికి దొరకడంతో కడుపార తిన్నాడు. అక్కడే పడుకున్నాడు. వంటిపై భుజాన ఉన్న మాసిన గుడ్డను పండుటాకులా వణుకుతున్న కొడుకుపై కప్పాడు. వణుకుడు కాస్త తగ్గింది. సూర్యుడి ఉదయం కోసం వేచి చూశాడు. మల్లన్నకు కంటి మీద కునుకులేదు. తెల్లారింది. చేతిలో పైసా లేదు. కడుపులో పేగులు అరుస్తున్నాయి. సమయం పది గంటలు అవుతోంది. ఎదురుగా రామాలయంలో పూజారి మంత్రాలు చదువుతున్నాడు.
కొడుకుని అక్కడే వదిలి రామాలయం వద్దకు వెళ్లాడు. పూజ ముగిసింది. పూజారి ప్రసాదం పెట్టాడు. పెరుగన్నం పిడికిలితో పట్టుకున్నాడు. అది చాలదన్నట్లు ముఖం అయోమయంగా పెట్టాడు. పూజారి ఆకులో సగం పెరుగన్నం తెచ్చి మల్లన్న చేతిలో పెట్టాడు. తీసుకుని చెట్టుపక్కకెళ్లి తిని క్షుద్బాధను తీర్చుకున్నాడు. ఆ పక్కనే ఉన్న కుళాయిలో దోసిలితో కడుపు నిండా నీళ్లు తాగి కొడుకు వద్దకు వడివడిగా నడిచాడు.
జ్వరంతో రొప్పుతున్న కొడుకును చూసి ‘‘ నాన్నా... కాస్త లేవరా ఈ పెరుగన్నం తినరా..స్వామి కరుణిస్తాడు..’’ భుజం తట్టాడు.
వళ్లు నొప్పులతో బాధపడుతున్న కొడుకు ‘‘ ఊహు..’’ విసుకున్నాడు. కొడుకు ఆకలి తండ్రిని పిండేసింది. ఎంతైనా కన్న పేగుకదా.. నోరు తెరిసి ఓ ముద్ద పెట్టాడు. బలవంతంగా మింగాడు. తన కొడుక్కి త్వరగా జ్వరం తగ్గితే చాలు మనసులోనే స్వామిని తలుచుకున్నాడు. సరిగ్గా అదే సమయానికి ఎదురుగా డాక్టరు కారు వస్తోంది.
కారుకు అడ్డంగా వెళ్లి నిల్చొన్నాడు మల్లయ్య. ‘‘ సార్..!సార్!! ఈ రోజైనా మా అబ్బాయికి చికిత్స ఇప్పించండి..భరించలేకపోతున్నాడు..’’ కాళ్ల మీద పడేంత పనిచేశాడు. డాక్టరు అతడిని చూడలేదు. ‘‘ ఎవరయ్యా.. నువ్వు.. వెళ్లు..వెళ్లెళ్లు..’’ ముఖం చిట్లించుకున్నాడు డాక్టరు. వదల్లేదు.. పట్టు వదలని విక్రమార్కుడిలా కొడుకుని భజంపై వేస్కొన్న మల్లయ్య డాక్డరు వెనుకే వెళ్లాడు. పరీక్ష రిపోర్టును చూపించాడు. డాక్టరుకు కాస్తయినా కనికరం కలగలేదు. ‘‘ ఇది వైరల్ జ్వరంలా ఉంది. ఇది చాలా ప్రమాదం.. వారం రోజులు ఎందుకు ఆలస్యం చేశావయ్యా?’’ ఆగ్రహించాడు.
‘‘ సార్..సార్ వారం రోజులుగా నేను ప్రభుత్వ ఆస్పత్రికి తిరిగి మిమ్మల్ని కలిశాను.. మీరు ఇక్కడికి రమ్మంటే వచ్చాను..’’ ఏదో చెప్పబోయాడు మల్లన్న.
‘‘ చాలు.. చాలు నీ సోది.. ఇదిగో వెంటనే వెళ్లి ఈ మందులు పట్రా..’’ ఓ ఎ 4` సైజు పేపరు నిండా రాశాడు డాక్టరు.
దాన్ని తీసుకుని మందుల షాపు వద్ద వెర్రి చూపులు చూస్తూ నిల్చొన్నాడు. చేతిలో చిల్లిగవ్వ లేదు.. మందుల షాపు వాడు మందులు చేతిలో పెట్టాడు. బిల్లు ప్రింటు తీసి అందించాడు. మల్లయ్య దాన్ని చూసే సరికి గుండె ఆగినంత పనైంది. కాస్త ఓర్పుతో తమాయించుకున్నాడు. దిక్కు తోచలేదు. ఏమి చేయాలా ఆలోచించసాగాడు.
అదృష్టం తలుపుతట్టింది. ఎదురుగా గుమ్మంలో తన ఆసామి వస్తున్నాడు. గంపెడు ఆశతో ఆయన వద్దకు వెళ్లి విషయం చెప్పాడు. తన కొడుకు ప్రాణాలు కాపాడాలని వేడుకున్నాడు. ఆసామి తన చేతిలో వున్న పదకొండు వందల రూపాయలు మల్లయ్య చేతిలో పెట్టాడు. వెయ్యి రూపాయలు మాత్రం మందుల వానికి ఇచ్చాడు. ఇంకా రెండు వేలు బాకీ ఉంది. ఇక చేసేదేమీ లేక తీసుకున్న మందుల్లో సగం తిరిగి ఇచ్చి వెయ్యి రూపాయలకు సరిపడా మందులు కొన్నాడు. త్వరగా అక్కడి నుంచి డాక్టరు ముందు ప్రత్యక్షమయ్యాడు.
అతని చేతిలో ఉన్న మందులు చూశాడు డాక్టరు. ‘‘ ఇలా కనీసం మందులు కూడా కొనలేనోడివి ఇక్కడికెందు కొచ్చావయ్యా?.. ఏ ధర్మాసుపత్రో చూసుకోవాలిగాని..?’’ కళ్లు ఎర్రజేశాడు డాక్టరు.
మల్లన్న డాక్టరు ముఖం చూశాడు. డాక్టరు మందులు చేతికి తీసుకుని ఈ మందు ఇవ్వు... తర్వాత చూద్దాం..’’ ఒక్క ముక్కలో చెప్పేపి లోనికెళ్లాడు. ఇక లాభం లేదు. అంతకంతకూ పెరిగిపోతున్న వేడిని కొడుకు తట్టుకోలేకపోతున్నాడు.శరీరంలో శక్తి పూర్తిగా సన్నగిల్లుతోంది. భుజం మీద వేసుకుని ప్రభుత్వ ఆస్పత్రి దారి పట్టాడు. సాయంత్రం వరకు డాక్టరు కోసం ఎదురుచూశాడు.
సాయంత్రం డాక్టరు కారు వచ్చి ఆగింది. ఆశగా వెళ్లి రెండు చేతులెత్తి దణ్ణం పెట్టాడు. డాక్టరు మల్లయ్య ముఖం చూడలేదు. వేగంగా లోనికెళ్లాడు. ఆయన వెనుకే కొడుకుని భుజాన వేస్కొని లోనికెళ్లాడు. ‘‘ ఎవరయ్యా.. నువ్వు’’ ఎదురు ప్రశ్న వేశాడు. మల్లన్నకు దిక్కుతెలియలేదు. ‘‘ ఉదయం మీ ఆస్పత్రికి వచ్చాను.. మందుల కొనలేకపోతేనూ మీరు ఇక్కడికి రమ్మన్నారు కద్సార్?’’ తన కొడుకు పరిస్థితిని వివరించాడు మల్లన్న. కూలిపని చేసుకుని బతికే తనకు పూటగడవడమే కష్టం..రెండేళ్ల క్రితం కాయకష్టం చేసి చేదోడువాదోడుగా ఉన్న తన భార్య అనారోగ్యంతో కన్నుమూసింది. ఓ పక్క ఆవేదన గుండెల్ని పిండేస్తున్నా లోనే దాచుకుంటూ ఒక్కగా నొక్క కొడుకును కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు. ఒంటిపై చీమ కుట్టినా నిద్రపోవడం లేదు. ఇప్పుడు ఈ జ్వరం రావడంతో కంటి మీద కునుకు లేకుండా ఆస్పత్రి చుట్టూ తిరుగుతున్నాడు. తనకు ఉన్న ఆధారం కొడుకు ఒక్కడే..అతని జ్వరం తగ్గించాలన్నా తాపత్రయం..అందుకే ‘‘ నా కొడుక్కి వైద్యం అందించండి సారూ...’’ డాక్టరు కాళ్లపై పడి అడుక్కున్నాడు.
‘‘చెబితే వినవేం? ఆ జ్వరానికి ఇక్కడ సరైన మందులు లేవయ్యా..’’
‘‘ ఏ జ్వరం సారూ..’’
‘‘ డెంగ్యూ..’’
ఒక్క సారిగా గుండె ఆగినంతపనైంది మల్లయ్యకు.
ఇక లాభం లేదనుకున్నాడు. భుజాన వేసుకుని ఇంటిముఖం పట్టాడు. ఎలా పడుకున్న వాడు అలాగే నిద్రపోయాడు. ఇంటి కెళ్లి దింపాడు. కొడుకులో చలనం లేదు. ఇటుఅటు కదిపాడు. కదల్లేదు.. గుండె పట్టి చూశాడు. వల్లంతా ఒక్క సారి చల్లబడిరది.. గుండె ఆగింది. మల్లయ్య కళ్లలో కన్నీరు ఉబికింది. నిరాశ, నిస్పృహలు ఆవరించాయి. ఉన్న ఒక్క కొడుకునూ దూరం చేసుకున్నాడు. ఇక తన చుట్టూ మిగిలింది చీకటే.. రోజులు భారంతో గడుస్తున్నాయి..
ఓ రోజు ప్రభుత్వ వైద్యశాల ముందు నడిచి వెళుతుంటే ఎవరో మృతదేహాన్ని రోడ్డుపై పెట్టి ధర్నా చేస్తున్నారు. ‘‘ ప్రభుత్వ డాక్టరు నిర్లక్ష్యం నశించాలి... ప్రభుత్వం వెంటనే చర్య తీసుకోవాలి..’’ వారి నినాదాలు మిన్నంటాయి. వారి సమీపానికి వెళ్లాడు మల్లన్న. బాధితులకు అండగా అక్కడ కు వచ్చి నిలబడ్డారు ప్రజా సంఘాల నాయకులు. వారితో పాటూ తనకు జరిగిన అన్యాయం గురించి గట్టిగా అరవాలనుకున్నాడు మల్లన్న. గొంతు పెగల్లేదు. ఎవరో వెనుక నుంచి వచ్చి గొంతు నొక్కేసినట్లయింది. వెనక్కి చూశాడు. రోడ్డుపై ఇటు, అటు కిలో మీటరు మేర ట్రాఫిక్ స్తంభించింది. ఆ చివర్లో మంత్రి కారు ఆగింది. విషయం ఏమిటని తెలుసుకుని వారి ముందుకు వచ్చాడు మంత్రి యల్లయ్య. ‘‘ ఏందిరా ఇది.. ఇట్టా రోడ్డుకడ్డంగా కూచుంటే మేమెట్టా వెళ్లాలిరా..’’ కోపం చిర్రెత్తుకొచ్చింది.
ఒక్క క్షణంలోనే అక్కడ పోలీసులు ప్రత్యక్షమయ్యారు. లాఠీలు విజృంభించాయి. బాధితుల నిరసనలపై నీళ్లు చల్లారు. జనం చెల్లాచెదురై పరుగులు తీశారు. చివరకు వారి బాధను తెలుపుకునే అవకాశం కూడ కరువైంది. ఉచితంగా అందాల్సిన ప్రభుత్వ వైద్యం వారికి ఎడారిలో ఎండమావిగా నే మిగులుతోంది.