శ్రమతో నాస్తి దుర్భిక్షం - కందర్ప మూర్తి

Sramatho naasti durbhiksham

అలకాపురి రాజధానిగా మగధ రాజ్యాన్ని ప్రవీణ్ వర్మ పాలన చేస్తున్నాడు. దైవ భక్తుడైనందున దేవాలయాలను నిర్మించి ప్రజలలో ఆధ్యాత్మిక భావన కలగచేసాడు. అందువల్ల రాజ్య ప్రజలు నేరాలు పాపపు పనులు చెయ్యకుండా దానధర్మాలు దైవ కార్యాలతో ప్రశాంతంగా జీవనం సాగిస్తున్నారు. మహరాజుకు సంగీతంతో పాటు లలిత కళలంటే ఇష్టం. అందువల్ల రాజ్యంలోని గ్రామాలు పల్లెల్లో ఉన్న కళాకారులను, సంగీత విధ్వాంసులను ఆదరించి వారి ద్వారా యువతకు ఇష్టమైన విద్యలో శిక్షణ ఇప్పిస్తూ పర్వదినాల్లో సభా ప్రాంగణంలో వారి విద్వత్తుకు పోటీలు నిర్వహించి బహుమతులతో సత్కరించేవాడు. ప్రవీణ్ వర్మ రాజ్యంలో ధర్మపురి ఒక గ్రామం. అది కొండవాలులో నీటి వసతులకు దూరంగా ఉన్నందున పంటలకు నీటి సౌకర్యం లేక బీడు భూమిగా కనబడేది. ఒకసారి మహరాజు ఆ దారంట వస్తూ అన్ని గ్రామాలు పల్లెలు పంటపొలాలతో పచ్చగా కనబడితే ధర్మపురి గ్రామం మాత్రం బీడుగా ఉండటం చూసి ఆందోళన పడ్డాడు. గ్రామం కొండవాలులో ఉండి వర్షాకాలంలో పడిన వర్షం కిందకు జారి పశువులకు గ్రాసం, సాగు భూములకు నీరు లబ్యం కాక పంటలు పండటం లేదని తెలుసుకున్నాడు. ప్రజలు సరైన పోషణ లేక బక్కచిక్కి కనబడుతున్నారు. పాడి పసువులు డొక్కలు లోపలికి పోయి నీర్సంగా ఉంటున్నాయి. మహరాజు విషయం వాకబు చెయ్యగా గ్రామంలో యువకులు సోమరిపోతులై శరీర శ్రమ చెయ్యడం లేదని తెల్సింది. ఎవరైన గ్రామంలోని భూముల్లో పచ్చని పంటలు పండించిన వారికి బహుమతి ప్రదానం చెయ్యడం జరుగుతుందని ప్రకటించాడు రాజు. గ్రామంలో పనీపాటా లేక సోమరిగా తిరిగే శంకరయ్య , రాజు ప్రకటించిన బహుమతికి ఆశ పడి ఏదో ఉపాయం ఆలోచించి ఎలాగైనా ధర్మపురి గ్రామంలోకి నీరు రప్పించాలను కున్నాడు. తన తోటి యువకులతో ఆలోచన చేసి వర్షాకాలంలో కురిసిన నీటిని కట్టడి చేసి ఒక చోట నిలవ ఉంచి పంట పొలాలకు సాగు నీరు, జనాలకు తాగునీరు, పశువులకు గ్రాసం ఉండేలా నీటి ప్రవాహానికి రాళ్లు మట్టి సున్నంతో ఎత్తైన కట్ట నిర్మించాడు. భూమిలో చెరువు మాదిరి విశాలంగా పెద్ద గొయ్యి తవ్వేరు. దానికి కలుపుతూ కిందకు కాలువలు, చెట్ల మానులు, వెదురు బొంగులతో నీటిని ఊరిలోకి రప్పించారు. ఇప్పుడు ధర్మపురి గ్రామం పంట పొలాలతో పచ్చగా శస్యస్యామలంగా కనబడుతోంది. పాడి పసువులు ఆరోగ్యంగా ఉండి పుష్కళంగా పాలు ఇస్తున్నాయి. ఫల పుష్ప వృక్షాలు నిండుగా గోచరిస్తున్నాయి. పక్షుల కిలకిలారావాలతో సందడిగా ఉంది. గ్రామ ప్రజల ముఖాల మీద ఆనందం కనబడుతోంది. గ్రామాధికారి ద్వారా విషయం మహరాజు ప్రవీణ్ వర్మకు తెలిసి స్వయంగా ధర్మపురికి విచ్చేసి ఇంతకు ముందు తను చూసిన గ్రామ పరిస్థితి ఇప్పటి అభివృద్ధిని చూసి ఆనందించి సోమరిపోతు శంకరయ్యను మిత్రులను అభినందించి గ్రామ ప్రజల సభలో ధనంతో సత్కరించాడు. అప్పటి నుండి యువతలో స్ఫూర్తి కలిగి గ్రామ అభివృద్ధికి పాటు పడేవారు. * * *

మరిన్ని కథలు

Pratibha
ప్రతిభ
- చెన్నూరి సుదర్శన్
Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు