నిర్ణయ రహస్యం - వెంకటరమణ శర్మ పోడూరి

Nirnaya rahasyam

నిర్ణయ రహస్యం ఆవేళ ఆఫీసునుంచి ఇంటికి వచ్చేటప్పటికి రాత్రి తొమ్మిది అయింది. డిన్నర్ చేసి, అంత క్రితం రోజు ప్రారంభించిన కథ మగించాలని లాప్టాప్ ముందు కూర్చున్నాను. నాన్న గారు నా పక్కన కూర్చుని ఎదో నవల చదువుతున్నారు. కథ చివరకు వచ్చి కొసమెరుపు ఎలా ఉంటే బాగుంటుందా అన్న ఆలోచనలో పడ్డాను. ఒక చిన్న కథ రాయటం కంటే, నవల రాయడం సులువు. రెండు వందల పేజీలు కథని ఏవేవో మలుపులు తిప్పి చివరికి ఎలాగాయినా ముగించ వచ్చు. కానీ కథలో అలా కాదు ముగింపు అంత సులువు కాదు. కథ ముగియ గానే కొద్ధి సేపు పాఠకుడు ఆలోచించేలా ఉండాలి. ఆ ఓపిక లేని కొంత మంది పాఠకులు, మీరు కథని సడన్ గా ఆపేస్తారు అని కామెంట్ పెడుతూ ఉంటారు. ఆలోచనల్లో ఉన్న నాకు అమ్మ రావటం గమనించలేదు. ఓ కవరు పక్కన పెట్టి " వాటిని చూడరా," అంది " ఏమిటమ్మా ఇవి అన్నాను " ఒక కవర్ విప్పుతూ " ఎవరో సంబంధాలు వాళ్ళు ఫోటోలు పంపారు రా. నువ్వు ఎంచుకుని, మాట్లాడి నిర్ణయిస్తే, నాన్న గారు వాళ్లతో మాట్లాడతారు " అంది వర లక్ష్మి గారు " చూస్తాలే అమ్మా, అని పక్కన పెట్టేశాను " ఇది అప్పుడే రెండో బాచ్. " సరే చూస్తాను' అన్నాడు కదా ? మనకి తెలిసున్న కుటుంబాలలో ఎవరు అమ్మఅయిలూ లేరా ? అన్నారు నాన్న గారు అమ్మతో. ఈ మధ్యన మా చిన్నాన్న కొడుకు రాజా, చిన్నాన్న ఫ్రెండ్ కూతురు పెళ్లిలో చూసిన అమ్మాయిని చేసుకున్నాడు. తెలిసిన వాళ్ళు అందరూ అమ్మాయి గురించి బాగాచెప్పడం తో ఫార్మల్ గా ఎన్ని చూసినా కుదరని వాడి పెళ్లి సులువు గా అయిపోయింది. అప్పటి నుంచి నాన్నగారి మనసులో అది ఉంది. నాకు కూడా ఈ మాట్రిమోనియల్ ఫోన్ లు , స్కైప్ లో మాట్లాడటాలు అవి కొంచం చిరాకు గానే ఉంది. "అందరికి ఒకే లాగా జరగాలని ఏముంది? మనం మీనమేషాలు లెక్కపెడుతూ కూర్చుని, వయసుముదిరితే మనకి తగ్గ అమ్మాయిలు దొరకరు" అంది అమ్మ. వెంకీ పెళ్లి సుబ్బి చావుకు అన్నట్టు, అమ్మ ఫ్రెండ్ భద్రమ్మ గారి కొడుకు పరిస్థితి నాకు వస్తుందేమోనని ఆవిడ భయం. ఆ మాట అన్న తరవాత ఆ భద్రమ్మ గారికి కొడుకు కు ఎందుకు పెళ్లి అవలేదొ క్లుప్తం గా నయినా చెప్పవలిసిందే. భద్రమ్మ గారికి ఒక్కడే కొడుకు మోహన్. ఒక్కడే కొడుకు ఉన్న తల్లికి వాడి పెళ్లి సమయం లో చాలా చిక్కు వస్తుంది. కావలిసిన వి అన్ని ఒక్క అమ్మాయిలోనే చూసి సెలెక్ట్ చేసుకోవాలి. అఫ్ కోర్సు ఆ అవకాశం కొడుకు ఇవ్వాలి. భద్రమ్మ గారి విషయం లో, మోహన్ అన్నీ తల్లికి వదిలేశాడు. వచ్చిన సంబంధాలన్నీ, అమ్మాయి, సన్నం గా ఉందనీ, లావుగా ఉందనీ, చామనఛాయ గానే ఉందనీ, మరీ పొడుగు అనీ, పొట్టి అనీ, ఇలా చాలా సంబంధాలు చూడడం లో కొడుక్కి 30 దాటడం తో, అతని కి ఈడు అయిన అమ్మాయిల సంఖ్య తగ్గడం, ఒకళ్ళో ఇద్దరో అందులో నచ్చినా, వాళ్లకి మోహన్ నచ్చక పోవడంతో బెండకాయ ముదిరి పోయింది. ఇప్పుడు పరిస్థితి ఏమిటి అంటే . డైవోర్సీ, అయినా , విడో అయినా పరవాలేదు అనే స్థితి లో ఉంది వ్యవహారం. అందుకనే అమ్మ తొందర పెట్టడం. నా ఫ్రెండ్ నారాయణ ఇంటికి వచ్చినప్పుడల్లా వాడితో గుస గుస లాడుతుంది. నాకు నచ్చ చెప్పమని. ఆమె ఇంకా గుర్తించని విషయం ఒకటి ఉంది నాలుగు ఫొటోలలో నేను ఒకటి సెలెక్ట్ చేస్తే, సెలక్ట్ చేసిన అమ్మాయి పెళ్ళికి ఒప్పేసుకుంటుందని ఆమె అనుకుంటోంది . ఇప్పుడు అమ్మాయిలు కూడా సెలెక్ట్ చేసుకుంటున్నారు. అంత సులువు గా ఒప్పుకోవడం జరగడం లేదు. ఆ విషయం గా నేను ఆందోళనకి గురి అవుతానని నాకు కొద్దిరోజులలోనే తెలిసింది. దానికి నాంది మా పిన్ని కూతురు రాజ్యం మా ఇంటికి వచ్చి రెండు రోజులున్నప్పుడు జరిగింది. దాని బావ గారి కూతురు పెళ్లి నిశ్చయానికి వచ్చి వెళ్ళింది.అది ఉన్న రెండు రోజులూ నేను ఒక ప్రాజెక్ట్ పని లో చాలా బిజీ గా ఉండి నారాయణ ని దానిని ఎక్కడికి కావాలిస్తే అక్కడికి తీసుకెళ్లమని కారు ఇచ్చాను. ఎంగేజ్మెంట్ అయే దాకా రెండు రోజులూ రాజ్యం తో ఉండి నాకు ఆఫీసు టెన్షన్ లేకుండా చేశాడు నారాయణ. రాజ్యం, దాని పెళ్లి అయేదాకా మా ఇంట్లోనే ఉండి చదువు కుంది. రాజ్యం నా మనోభావాలు బాగా తెలిసిన వ్యక్తి. అన్నయ్యా నీకు తగ్గ అమ్మాయిని నేనే సెలెక్ట్ చేస్తా అనేది. నేను రాసిన చాలా కథలు దాని తో చర్చలలో కలిగిన ప్రేరణలే. అది కావాలనే, ఇంజనీరింగ్ చేసినా వ్యవసాయం చేసుకుంటున్న రామారావు ని చేసుకుని రాజోలు లో ఉంటోంది. వాళ్ళది ఇప్పటికి ఉమ్మడి కుటుంబం. పెళ్ళికి నన్ను తప్ప కుండా రమ్మంది. నారాయణ ని కూడా పెళ్ళికి రమ్మని పిలిచింది రాజ్యం. కానీ వాడికి ఆఫీసులో ఆడిట్ అవుతుండడంతో రాలేనన్నాడు. పెళ్ళి తేదీ నాటికి ఆఫీసులో ప్రాజెక్ట్ పూర్తి అయి ఇంకో ప్రాజెక్ట్ ప్రారంభానికి చిన్న గ్యాప్ రావడం తో రిలాక్సింగ్ గా ఉండి, రాజ్యం బావ గారి కూతురి పెళ్ళికి రాజోలు వెళ్లడానికి నిశ్చయించాను. **** ఒక రోజు ముందుగానే రాజోలు చేరుకున్నాను నేను. రాజ్యం వాళ్ళ ఇల్లు సినిమాలలో చూపించే ఊరి పెద్దల ఇళ్ల లాగ చాలా పెద్దది. వాళ్ళాయన ముగ్గురు అన్న దమ్ములూ కలిసి ఉంటున్న పెద్ద మేడ. క్రింద నాలుగు . పైన నాలుగు బెడ్ రూములు, వెనకాల పెద్ద ఔట్ హౌస్ తో చాలా విశాలంగా ఉంది . పెళ్లి వారికి రెండిళ్ళ అవతల ఉన్న మోతుబరి పైడి రాజు గారి ఇల్లు విడిది గా ఇచ్చారు. నేను వెళ్లిన సాయంత్రం పెళ్లి వారు బస్సు లో హైదరాబాద్ నుంచి వస్తున్నారని తెలిసింది " పెళ్ళివారిని రిసీవ్ చేసుకునే వాళ్లలో నిన్ను కూడా వేశాం. అందుచేత ఐదింటికె తయారవు. మగపెళ్లి వారిలో పెళ్ళికొడుకు కజిన్ మాధురి కూడా ఉంది. నువ్వు గుర్తు పట్టేలాగా వాళ్ళు బస్సు దిగ గానే ఆ అమ్మాయిని పిలుస్తాను. నువ్వు ఆ అమ్మాయికి స్వాగతం చెప్పాలి. బావగారు, వాళ్ళ అన్నయ్య వాళ్ళు మిగతా వాళ్ళకి స్వాగతం చెబుతారు. " అంది "' ఆగు ఆగు ఎదో ఉంది. ఆ అమ్మాయి ఎవరు ? నన్ను ఎందుకు చేయమంటు న్నావు "? అన్నాను " పెళ్ళిళ్ళు, పెళ్లి కాని అబ్బాయిలకి, అమ్మాయిలకి మంచి అవకాశం కల్పిస్తాయి కదా ? ఒకళ్లకి ఒకళ్ళు నచ్చితే. " అంది నవ్వుతూ "ఆ అమ్మాయి నీకు ముందే ఎలా తెలుసు ?" అడిగాను "మొన్న నిశ్చితార్థం ఫంక్షన్ లో కలిసింది. నాతో ఎక్కువ సేపే గడిపింది. నీ గురించి నాకు తెలుసు కదా . మంచి జోడీ అవుతారనిపించింది " అంది రాజ్యం " అందుకా పెళ్లికి తప్పకుండా రమ్మని నువ్వు, వెళ్ళమని అమ్మా, నా వెంట పడ్డారు . ముందే ప్లాన్ చేశారు అన్నమాట " అన్నాను " నీకు నచ్చితే చాలు పెళ్లి అయిపోతుంది అనుకుంటోంది దొడ్డమ్మ. కానీ ఆమెకి తెలియంది ఏమిటంటే, ఈ రోజుల్లో అమ్మాయిలు కూడా అంత త్వరగా ఓకే చేయటం లేదు. అందు చేత నువ్వు అదికూడా దృష్టిలో పెట్టుకోవాలి " అంది " ఇప్పుడు ఆ అమ్మాయిని ఇంప్రెస్ చేయాలి అన్నమాట. సినిమాలలో అయితే ఆకతాయిలతో వాగించి, వాళ్ళని కొట్టేసి హీరో మార్కులు కొట్టేస్తాడు. ఇక్కడ అలా కుదరదే " అన్నాను నవ్వుతూ " అదేమీ అక్కర లేదు కానీ అది దృష్టి లో పెట్టుకుని అవకాశము ఏదయినా వస్తే వాడుకోవాలి " అని ఒక చిన్న పూల గుత్తి, చిన్న కర్పూరం దండ ఇచ్చి వెళ్లి పోయింది. " రాజ్యం చెపినట్టే, బస్సు రాగానే అక్కడ మిగతా వాళ్ళతో నుంచున్నాను. చెప్పినట్టే, మిగతా వాళ్ళని పట్టించు కోకుండా బస్సులోంచి దిగే వాళ్ళ మీదదృష్టి పెట్టి , రాజ్యం కేసి చూస్తున్నాను ఏ అమ్మాయిని చూపిస్తుందా అని. నా బాటింగ్ గూగ్లి ఎదుర్కోవడం తో ప్రారంభం అవుతుందని నేను ఊహించ లేదు. ఒక మెరుపు తీగ బస్సు దిగ గానే "హై మాధురి! అని రాజ్యం అనడం, నేను అది చూసి ముందుకు అడుగు వేసే లోపే నాకంటే ముందుగా ఒక యువకుడు మాధురి దగ్గరగా వెళ్లి పూలగుత్తి ఇచ్చి స్వాగతం చెప్పడం జరిగి పోయింది. మాధురి నవ్వుతూ పూలగుత్తి తీసుకుని మిగతా వాళ్ళతో విడిది లోకి వెళ్ళింది. ఉత్సాహం, నిరుత్సాహం రెండు కలిసి ఒకే మాటు వస్తే ఎలా ఉంటుందో అప్పుడే తెలిసింది. ఉత్సాహం ఎందుకంటే మాధురి నిజం గా మెరుపు తీగ లాగే అనిపించింది. చూసింది కొద్ధి సేపే అయినా ఆమె రూపం మనసులో ముద్ర పడిపోయింది. నాఅభిరుచులకి తగ్గట్టుగా , చీరకట్టు, చెవులకి రంగులు, బాడీ లాంగ్వేజ్ లో హుషారు నన్ను ఆకట్టుకున్నాయి . అందుకే రాజ్యం ఆ అమ్మాయిని నాకు ఎంపిక చేసింది. అయితే అనుకోకుండా నా కంటే స్మార్ట్ గా కనడుతున్న వ్యక్తి సడన్ గా పోటీలో ప్రవేశించాడా అనిపించి కొంచం నిరుత్సాహం కలిగింది. నేను మళ్ళీ రాజ్యం వాళ్ళ ఇంటికి వెనక్కి వచ్చి రాజ్యం తో మాట్లాడే అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను. పెళ్లి వారికి ఫల హారాలు అవీ చూసి, రాత్రి ఎనిమిదింటికి జరిగే ఎదురు సన్నాహం ఏర్పాట్లు అయిన తరువాత, పందిట్లో ఒక పక్కన కూర్చున్న నా దగ్గరికి స్నాక్స్ ప్లేట్ పట్టుకుని వచ్చింది రాజ్యం. " సారీ నేను అనుకోనిది జరిగింది. సరిగ్గా నేను ఆలోచించినట్టే మా తోడికోడలు ఆలోచించి తన తమ్ముడు కారుణ్యని రంగం లోకి దింపింది. "నిశ్చితార్ధం సమయం లో మాధురిని చూసి,మంచి పెళ్లి కూతురు కదూ" అని అన్నప్పుడు , ఆవిడ మనసులో తన తమ్ముడు ఉన్నాడన్న సంగతి తట్టలేదు. నేను ఆలోచించినట్టే ఆలోచించి, అతన్ని రంగం లో దింపింది కారుణ్య గట్టి పోటీ యే కానీ, నువ్వు తగ్గద్దు. నువ్వూ ఏ విషయం లోను తక్కువేమీ కాదు" అంది. అమ్మ గుర్తుకు వచ్చింది. కొడుకు అవునంటే ఏ అమ్మాయి అయినా ఒప్పేసుకుంటుంది అనే భావం లో ఉంది ఆవిడ. కారుణ్య కూడా, చదువు లోను, సంపాదన లోను, లుక్స్ లోను గట్టిపోటీ యే అనిపించింది, రాజ్యం అతని వివరాలు చెపినప్పుడు. **** రాత్రి భోజనాలు అవగానే సంగీత్ ఏర్పాటు చేశారు. ఉత్తరాది పద్ధతి ని ఈ 💐 మధ్యన మన పెళ్ళిళ్ల లో కూడా పెడుతూ ఉండడం మంచిదే అనిపించింది. అందరూ తమ తమ ప్రతిభలని షో కేస్ చేసుకోవడం బాగానే ఉంది. మర్యాదలు జరపలేదని దెబ్బలాటాలు కంటే మంచి పరిణామమే. అయితే, కారుణ్య , సాగర సంగమం లోని బాలకనక మయ పాటకి శాస్త్రీయ నృత్యం చేయడం, అది మాధురి రెప్ప వేయకుండా చూడడం నాకు ఆందోళన కలిగించిన మాట వాస్తవం. సంగీత్ అయి అందరూ వేడుతోంటే, మాధురి తో కలిసి వెడుతున్న రాజ్యం నా దగ్గర ఆగి " మా అన్నయ్య కృష్ణ , అప్పుడు చెప్పాను కదా " అని పరిచయం చేసింది. మాధురి నా కేసి చూసి రాజ్యం మీ గురించి చెప్పారు" అంది నవ్వుతూ. ఆమె కళ్లు అందం అద్భుతం. అంతటి ఎక్స్ప్రెసివ్ కళ్లు ఎక్కడా చూడ లేదు. ఆమె చూపులతోటే నన్ను అంచనా వేసుకుంటోందా అనిపించింది. పలకరించి వెళ్లిపోవడం కొద్ధి క్షణాలయినా ఆమె ఆలోచనల తోటే నాకిచ్చిన గది కి వెళ్ళాను. కారుణ్య నుంచి అసలయి న ఛాలెంజ్ మరునాడు ప్రొద్దుట మగ పెళ్ళివారి విడిది లో ఎదురయింది. స్నాతకం చూడడానికి అందరం అక్కడ చేరినా, కొద్దిసేపు అక్కడ జరిగే కార్యక్రమం చూసి, బయట పెద్ద హాలు లోకి వచ్చాను. ఆడ-మగ పెళ్లి వారు అందరినుంచి చాలామంది యువత అక్కడ చేరింది.వాళ్ళల్లో మాధురిని, కారుణ్యని చూసి నేను కొంచెం ఇవతల గా కూర్చుని మాధురిని చూస్తున్నాను. వాళ్ళు మాట్లాడుకునేవన్ని స్పష్టంగా వినపడుతున్నాయి. కారుణ్య సినిమాల గురించి మాట్లాడుతున్నాడు, ఎవరో అడిగిన దానికి జవాబుగా కాబోలు అంటున్నాడు. " మన తెలుగు లోను , తమిళం లోను వచ్చే ఎక్కువ శాతం సినిమాలు చెత్త గా ఉంటున్నాయి క్వాలిటీ లో ఎక్కువ శాతం మలయాళం సినిమాలు బాగుంటున్నాయ్. " మంచి సాహిత్యం వస్తే మంచి వినిమాలు వస్తాయి "అన్నారు ఎవరో. వెంఠనే కారుణ్య " అవును బెంగాల్ లో చూడండి ఒకప్పుడు శరత్ , టాగోర్ వంటి వాళ్ళ సాహిత్యం వల్ల మంచి సినిమాలు వచ్చాయి అక్కడ" " మన తెలుగు లో రాసిన చలం కూడా శరత్ అంత గొప్పవాడుట కదా " అని ఇంకెవరో ఎదో చెప్పబోతోంటే అతని కంటే ముందుగా కారుణ్య అందుకుని " అవును చలం కూడా గొప్పవాడే " " మరి అతని సాహిత్యం ఒకప్పుడు విమర్శలు కు గురి అయింది ట కదా" ఎవరో అమ్మాయి అంది. " అదంతా సాహిత్యం మీద అవగాహన లేక. శరత్, చలం ఇద్దరూ స్త్రీల పరిస్థితుల మీద స్పందించిన వారే. శరత్ కమలాన్ని చూపించి, అది బురద లోంచి వచ్చింది అని చెబితే, చలం బురద చూపించి అందులోంచి కమలం వచ్చింది " అన్నట్టు రాశాడు. " ఏమి సాహిత్యమో ! ఏ కథ, నవల చదివినా ప్రేమ గోల తప్ప వేరే విషయం ఉండటం లేదు" అంది మాధురి పక్కన కూర్చున్న ఒక అమ్మాయి. " ఎందుకు లేవు ఇంగ్లీష్ లో ఆర్ కె నారాయణ్ చాలా కథలు, నవలలు రాశాడు. వాటిలో ప్రేమ విషయం పది శాతం కంటే ఉండదు. మన తెలుగు లో కూడా ఈ మధ్యన 'తెలుగు కథ' అనే వెబ్ మ్యాగజైన్ లో రోహిణి గారు చాలా కథలు, జీవితాన్ని అనేక కోణాలనుంచి చూపిస్తూ రాస్తున్నారు. " అన్నాడు కారుణ్య దానికి స్పందనగా ఎదో అనబోయి ఆగిపోయింది మాధురి. మళ్ళీ ఇంకెవరయినా మాట్లాడే అవకాశం ఇవ్వకుండానే, కారుణ్య మళ్లీ అందుకున్నాడు. "ఇప్పుడు తెలుగు రాయడం, చదవడం తగ్గిపోవడం వల్ల, వినడానికి వీలుగా రోహిణి గారు స్వయం గా చదివి సైట్ లో పెడుతున్నారు." అన్నాడు ఏ సబ్జక్ట్ వచ్చినా ఇంకెవరినీ మాట్లాడనీయకుండా కారుణ్య మాట్లాడటం గమనించాను. అది నాకు సమస్య కాదు. అతను చెప్పేవన్ని రెప్ప వేయకుండా మాధురి వినడం ఆందోళన కలిగించింది. టి.20 లో మొదట బ్యాటింగ్ చేసే వాడు 250 పరుగులు చేస్తే, బౌలింగ్ టీమ్ కెప్టెన్ లా ఉంది నా పరిస్థితి. బ్యాటింగ్ కొనసాగించాడు కారుణ్య ఎదురుగా మాధురి పక్కన ఉన్న కుర్రాడిని " నీకు పైథాగరస్ సిద్ధాంతం తెలుసా ?" అని అడిగాడు. మనవాడు లెక్కలు కూడా వదలటం లేదే అనుకున్నాను. ఇక్కడ ఏమి చెబుతాడా అనుకుంటూ. ఆకుర్రాడు తెలుసు అంటే " ఏదీ వివరించు" అన్నాడు " ఏముంది రైట్ యాంగిల్ ట్రై యాంగిల్ లో సైడ్స్ యొక్క స్క్వె ర్ల మొత్తం హైపోటెన్యూస్ స్క్వెర్ కి సమానం. " అన్నాడు "Ok ఒక ఉదాహరణ చెప్పు " అన్నాడు నవ్వుతూ అందరూ ఆకుర్రాడి నే చూస్తుంటే కొంచం గొప్ప గా ఫీల్ అయి " ఏముంది అడ్డం 8 అయితే నిలువు 6 అనుకుంటే , రెండు స్క్వెర్ల మొత్తం 64+36 కలిపితే 100 కదా. ఇది హైపోటెన్యూస్ స్క్వెర్ కి సమానం కాబట్టి , హైపోటెన్యూస్ 100కి స్క్వెర్ రూట్ అవుతుంది.అంటే 10 అన్నమాట." వెరీ గుడ్. అంటే హైపోటెన్యూస్ స్క్వెర్ ముందు కనుక్కుని, దాని స్క్వెర్ రూట్ కనుక్కుంటేనే హైపోటెన్యూస్ కనుక్కోగలం. కానీ స్క్వెర్ రూట్ కనుక్కోవడం అంత సులువు కాదు. అందు చేత స్క్వెర్ రూట్ అక్కర లేకుండా హైపోటెన్యూస్ కనుక్కో గలవా ? " పైథాగరస్ సిద్ధాంతం లేకుండా ఎలా కనుక్కుంటాము? " కనుక్కోవచ్చు ఎప్పుడో ఒక తమిళ శాస్త్రవేత్త కనుక్కున్నాడు " " ఎలాగ అన్నారు పిల్లలు అందరూ " " అడ్డం సైడ్ 8 భాగాలు లో ఒక భాగం తీసేసి, నిలువు సైడ్ సగం భాగం తో కలిపితే , స్క్వెర్ రూట్ అక్కర లేకుండా హైపోటెన్యూస్ కనుక్కోవచ్చు. ఇప్పుడు నీ ఉదాహరణ లో అడ్డం 8 భాగాలలో ఒక భాగం తీసేస్తే 7 కదా, నిలువు 6 లో సగం3 కదా . ఇప్పుడు 7, 3 కలిపితే 10 హైపోటెన్యూస్ స్క్వెర్ రూట్ అక్కర లేకుండా వచ్చింది. వేరే నంబర్లు తీసుకుని నువ్వు పరీక్షించు కో వచ్చు. " అన్నాడు కారుణ్య మాధురి తో సహా అందరూ తప్పట్లు కొట్టారు. స్కోర్ 250 దాటి 300 అవుతుందనే భయం నాకు. నా లాంటిదే ఒక అమ్మాయి " అబ్బ ఇవన్నీ బోరు. ఎవరయినా సంగీతం పాడ వచ్చు కదా అంది " హమ్మయ్య వీడు ఔట్ అయ్యాడు రా బాబు అనుకుంటూ ఉంటే, కారుణ్య అది కూడా వదలలేదు. " హిందూస్థానీ యా , కర్నాటిక్ నా అన్నాడు " కొంపతీసి పాడేస్తాడా అని భయం పట్టుకుంది నాకు " ఏమిటి తేడా అంది అదే అమ్మాయి " " కర్నాటిక్ ఎక్కువ తాళం ప్రధానం, హిందుస్తానీ మెలోడీ ప్రధానం" అని ఇంకా ఏదో మొదలెట్ట బోతోంటే. ఒకడు విసిగి పోయి. " కాసేపు సైలెన్స్ ఎంజాయ్ చేద్దామా " అన్నాడు అసలు సైలెన్స్ అంటే తెలుసా నీకు. అని దాని మీద కూడా ఎదో మొదలు పెట్ట బోతోంటే " రండి భోజనాలకి టైం అయింది " అని రాజ్యం వస్తే బ్రతకు జీవుడా అనుకుని లేచాను. భోజనం చేస్తూ ఆలోచించాను కారుణ్య గురించి . నిస్సందేహం గా లుక్స్ లోను, ప్రదర్శించడానికి అవకాశం తీసుకుని ప్రదర్శించిన తెలివి లోను మాధురి ఇంప్రెస్స్ అయి ఉండాలి అనుకున్నాను. నేను కూడా లుక్స్ అంత తీసికట్టు కాదు కాబట్టి, ఒకటి గుర్తుకు వచ్చి కొంచం ధైర్యం వచ్చింది. కారుణ్య బ్యాటింగ్ చేస్తున్నంత సేపు, అతనిని నేను చూస్తున్నా, మయం లో మాధురి కేసి చూసినప్పుడు, అప్పుడే ఆమె నా నుంచి చూపు మరల్చుకోవడం రెండు మూడు మాట్లు గమనించాను. అది గుర్తుకు వచ్చి కొంత ఉపశమనం కలిగినా అతనే రేస్ లో ముందు ఉన్నాడన్న భావన కలిగింది. ఆ తరవాత పెళ్లి పూర్తి అయి అప్పగింతలు తరవాత పెళ్ళివారు బస్సు ఎక్కేదాకా, మాధురిని అనేక చీరలలో చూడడం, ఆమె వెనకాలే తిరుగుతూ ఆమె దృష్టి లో పడడానికి కారుణ్య ని గమనించడం తోటే సరిపోయింది. అన్ని అలంకరణ లోను మాధురిని చూసి ఆమెని దక్కించుకునే వాడు నిజం గా అదృష్ట వంతుడే అనిపించింది. మిగతా అర్హతలతో బాటు, అతని వాక్చాతుర్యం, వివిధ విషయాల పరిజ్ఞానం దృష్ట్యా, మాధురి వోట్ అతనికే పడుతుందని పించి, అదే మాట రాజ్యం తో చెప్పి వచ్చేశాను. మాధురి మాట ఎలా ఉన్నా, కారుణ్యని చూసిన తరువాత, ఇంకో కథకి వస్తువు దొరికింది అనిపించింది. *** ఆ తరవాత అమ్మ మళ్లీ , ఫోటోలు తో దాడి చేస్తున్నా, మనసులో మాధురి మరుగున పడేదాకా వేరే ఆలోచన చేయలేదు. ఒకవేళ కారుణ్య, మాధురీల పెళ్లి కార్డు వచ్చి ఉంటే అదే జరిగేది. రెండు నెలలు ఆఫీసు లో బిజీ గా మిగతా ఏవీ ఆలోచించ లేదు. ఆరోజు నా రూమ్ లో ఎదో ముఖ్యమయిన కాల్ లో ఉండగా, అమ్మ మెల్లిగా తలుపు తెరిచి కాల్ అయిన తరువాత హాల్ లోకి రమ్మన్నట్టు సంజ్ఞ చేసి వెళ్ళిపోయింది. కాసేపటికి హాల్ లోకి వచ్చేటప్పటికి నాన్నగారు ఎవరితోటో మాట్లాడుతున్నారు. ఇద్దరు పెద్దమనుషులు కూర్చున్నారు. వాళ్ళ అమ్మాయిని నీకు ఇద్దామని వచ్చారు రా అని ఒకాయనని చూపించి అన్నారు. " వాళ్ళ అమ్మాయి మాధురిని మొన్న రాజోలు పెళ్లిలో చూశావుట కదా ?" అన్నారు నాన్నగారు. ఒక్క మాటు గాలి స్థంభించి మనసు ఎగిరి పడింది. సినిమాలలో అయితే వైజాగ్ బీచ్ లో సముద్ర తరంగం రాళ్లను కొట్టుకుని ఒక్క మాటు ఎత్తు గా లేవడం చూపిస్తారు. ఇదంతా లిప్త కాలం లో నే జరిగింది. తేరుకుని నవ్వి ఊరుకున్నాను. ***** ఆ తరవాత నెల రోజులకి నా పెళ్లి మాధురితో నిన్న జరగడం, మొదటి సారి గా ఆమెని ఈ రాత్రి కలుస్తున్నందుకు రెండు విధాలు గా ఆత్రుత గా ఉన్నాను. పెళ్లి నిశ్చయం అయిన తరువాత ఫోన్ లోమాట్లాడినప్పుడు , కారుణ్యని కాదని నన్ను చేసుకోవడానికి కారణం ఎన్నిమాట్లు అడిగినా, అది స్వయంగా కలిసినప్పుడే చెప్పే దని, తరువాత చెబుతానని చెప్పి వాయిదా వేస్తూనే ఉంది. రాజ్యన్ని అడిగినా తనే చెబుతుంది అని దాట వేసింది. రాత్రి, మిగతా విషయాలు ఏమీ మాట్లాడకుండానే "ముందు అసలు విషయం చెప్పు" అన్నాను పాల గ్లాసు తో వచ్చిన మాధురిని " ఏ విషయం " అంది. " అదే కారుణ్యని కాదని నన్ను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావు ?అతను చాలా విషయాలు చెప్పి ఇంప్రెస్ చేశాడు కదా ?" అన్నాను " అతను చెప్పిన విషయాలు కంటే మీరు ఎక్కువ విషయాలు చెప్పారు కదా ? " అంది చిలిపి గా చూస్తూ. ఆమె చిలిపి తనం కవ్విస్తున్నా విషయం తెలిసే దాకా చాలా నిగ్రహం తో ఉన్నాను " నేను చెప్పానా ? ఎక్కడ ?అని ఆగి, అనుమానం వచ్చి నా రచనలు చదివావా ? అన్నాను. " కారుణ్య రోహిణి గురించి చెప్పగానే నేను ఏదో చెప్ప బోయి ఆగిపోవడం మీరు గమనించారు కదా " " అంటే నాకేసి చూస్తూనే ఉన్నావు అన్నమాట" " మీరు అతన్ని చూస్తున్నప్పుడల్లా నేను మిమ్మలిని గమనిస్తూనే ఉన్నాను" అంది " నేనే రోహిణి ని అని నీకు అప్పటికే తెలిసిందన్న మాట" " నిశ్చయానికి వచ్చినప్పుడు మీ రాజ్యం ద్వారా తెలిసింది. నేను మీ కథ చదవడం చూసి, మా అన్నయ్యే ఆ రచయిత అంది." "ఓహో అప్పటికే నా రచనలు చదువుతున్నావు అన్న మాట" అన్నాను ఆశ్చర్యం గా " జాహ్నవి" ఎవరు అనుకున్నారు ? అంది కళ్ళు ఎగరేస్తూ. ఓహ్ మై, మై, నువ్వు జాహ్నవి వా ? ఇంచు మించు నేను రాయడం మొదటి నుంచి నువ్వు ఫాలో అవుతున్నావు. నీ ప్రొఫైల్ లో ఫోటో కాకుండా పువ్వులు పెట్టావు. అందుకే తెలియ లేదు."అన్నాను ఇంకా ఆశ్చర్యం లో ఉండే " మీరు కూడా ప్రొఫైల్ లో ఏ ఫోటో పెట్ట లేదు కదా?" "అది సరే మిగతావి అన్ని విషయాలలోను ఇంచుమించు సమంగా ఉండి, నా కంటే లుక్స్ లో బాగుండే కారుణ్యని కాదని, నన్ను ఎలా సెలెక్ట్ చేశావు ? " ఆడిగాను " ఏ ఆడదయినా మగవాడి అందం కంటే దాంపత్యం లో ఏమి కోరుకుంటుంది ?" " ఏ ఒక్కడో పర్వర్టెడ్ తప్ప, ,మామూలు గా అందరూ బాగానే చూసుకుంటారు కదా ?" " కానీ ఇంకో ముఖ్య మయినది ఉంది. అది మీలో పుష్కలం గా ఉంది అని నేను గుర్తించాను" అంది నవ్వుతూ " ఏమిటది. నాలో ఉందని ఎలాగుర్తించావు ?" అడిగాను " ఏ వధువు అయినా వివాహ జీవితం ఎలా ఉండాలని కోరుకుంటుందో మీరు ఒక కథలో చెప్పారు కదా ? " " ఏ కధ ?" అడిగాను ఆతృతగా. ఆకథ గురించి మాధురి కి తెలిసే అవకాశం లేదు కదా అనుకుంటూ. " సరస సంకేతాలు" అంది రహస్యం విప్పుతూ. " ఆగు, ఆగు, నాకథలు నాన్నగారు కూడా చదువు తున్నా రని, ఎంబరాసింగ్ గా ఉంటుందని ఆ ఒక్కటీ నేను ఇంకో పేరుతో రాశాను. అది రాజ్యానికి కూడా తెలియదు. నీ కెవరు చెప్పారు ఈ విషయం ?" అన్నాను. " అన్నయ్య నిశ్చయం సమయం లో రాజ్యం మీ గురించి అన్నీ చెబుతున్నప్పుడు, మీ ఫ్రెండ్ నారాయణ గారు అక్కడే ఉన్నారు. రాజ్యం గారు లేనప్పుడు ఈ కథ గురించి చెప్పి, అది చదవండి, మీకు కృష్ణ లో ఇంకో ముఖ్య మయిన కోణం తెలుస్తుంది" అని చెప్పారు. ఆ కథ చదివిన తరువాత ఏ కారుణ్య నిలబడ్తాడు ?" నా నిర్ణయం అప్పుడే అయిపోయింది. " నారాయణా యూ అర్ ఏ ఫ్రెండ్ ఇన్ డీడ్ " అనుకున్నా. మనసు లో.

మరిన్ని కథలు

Pratibha
ప్రతిభ
- చెన్నూరి సుదర్శన్
Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు