ఆటో రిక్షా నుండీ కిందకు దిగింది కావేరి. " ఎవరి బ్యాగ్ వాళ్ళు తీసుకోండి " అని చెప్పింది తన ముగ్గురి పిల్లలకు .
అందరికంటే పెద్దవాడు రాము సూటుకేస్ తీసుకుని దిగాడు. చిన్నవాళ్లు ఇద్దరూ చెరొక సంచీ తీసుకుని సంతోషం తో దిగి పెద్దమ్మ ఇంటిని చూసారు.
ఆటో వాడి దగ్గర మిగిలిన చిల్లర తీసుకుని అక్క ఇంటిలోకి అడుగు పెట్టింది కావేరి.
గుమ్మం దగ్గరే ఎదురొచ్చిన శాంత , కావేరిని చూసి ,గట్టిగా ఆప్యాయంగా కౌగలించుకుంది .
అక్క ప్రేమాభిమానాలకు కావేరి కళ్ళలో నీళ్లు తిరిగాయి.
అంతలోనే తమాయించుకున్న శాంత " పైన రెండవ గది మీకే, వెళ్లి సామానులు పెట్టి , స్నానాలు చేసి భోజనం చెయ్యండి. పిల్లలు పొద్దున్నుండీ ఏమైనా తిన్నారా ,లేదా ? ." అని కావేరిని అడిగి., వెనక్కి తిరిగి ".ఏ ఉమా ఇదుగో ముందు వీళ్లకు కాఫీలు ఇవ్వు ' అని పురమాయించింది అక్కడున్న పెద్ద కూతురుకు.
రాము వెళ్లి పెద్దమ్మ కాళ్లకు ప్రణామాలు చేసాడు. తమ్ముళ్లకు కూడా చేయమని సైగ చేసాడు. అది చూసి తెగ ముచ్చట పడిపోయింది శాంత.
అప్పుడే బయటకి వచ్చిన సుందరి " రాము చాలా ఎత్తు పెరిగి పోయాడే, కాలేజీ లో చేరి పోయాడా? " అంది.
" నమస్కారం అత్తయ్య " అన్నాడు రాము.
సుందరి , శాంత కు వరసకు మరదలు . మంచి ఆర్ధిక స్థోమత కలిగి,డబ్బు తో వచ్చిన పొగరు , బేషజాలు వున్న యువతి . ఎప్పుడూ అందరి దగ్గరా డాబూ దర్పం చూపిస్తూ ఉంటుంది.
శాంత రెండవ కొడుకు పెళ్ళికి వారం ముందుగా రమ్మని చెల్లెలు కావేరి కి దారి ఖర్చులకు కూడా డబ్బులు పంపించి రప్పించుకుంది . తల్లి తండ్రి చిన్నప్పుడే కాలం చేసిన తర్వాత ముగ్గురు అక్కచెల్లెళ్ళకీ పెద్దదిక్కు శాంత. చిన్న చెల్లెలు కావేరి కి ఎప్పుడూ కాస్తో కూస్తో ఆర్ధిక సహాయం చేస్తూ ఉంటుంది శాంత.
ఇల్లంతా పండగ వాతావరణం నెలకొని వుంది. పెళ్లి పనులు మొదలయ్యాయి కానీ ఇంకా దూరపు చుట్టాలెవరూ రాలేదు. శాంత కు ఆరుగురు కొడుకులు. వారందరూ రాము రాగానే ప్రేమగా వెంటేసుకుని ఆటలకు బయటకు తీసుకెళ్ళి పోయారు..
ఇలా శుభ కార్యాలకు వచ్చినప్పుడల్లా కావేరి ని ,పిల్లలను చాలా ప్రేమ గా చూసుకోవటమే కాకుండా వారందరికీ సంవత్సరానికి సరి పడే దుస్తులు, కొత్తవి , పాతవీ ఇచ్చి పంపుతుంది . ఈ కారణం తో శాంత పెద్దమ్మ నుండీ పిలుపు రాగానే ఎగిరి గంతేసి బయలు దేరుతారు కావేరి పిల్లలు.
ఎప్పటి లాగే తన పిల్లలతో సమానంగా కావేరి పిల్లలకు పెళ్లి బట్టలు కొని ఉంచింది శాంత . కావేరి భర్త కున్న చిన్న వుద్యోగం మూలాన అందరిలోకి కావేరి కి ఆర్ధిక ఇబ్బందులు ఎక్కువ.
ఇద్దరి అక్కా చెల్లెళ్ళ ప్రేమాభిమానాలు చూసి ఈర్ష్య పడసాగింది సుందరి.
కావేరి పిల్లలు కష్ట పడే మనస్తత్వం ఉండటం తో పెళ్లి పనుల్లో చురుకుగా తిరుగుతూ వున్నారు. అది గమనించి
"నీకు నీ పిల్లలే మంచి భవిష్యత్తునిస్తారు. అందరూ బాగా చదువుతున్నారు. ...బుద్ధిమంతులు .... వారు కాస్త పెద్దయ్యారంటే నీ కష్టాలు తీరిపోతాయి " అంది రెండో అక్కయ్య దేవి , కావేరిని ఓదారుస్తూ.
" అంతా దేవుడి దయ " అంది కావేరి తల పైకెత్తి చేతులతో దేవుడికి మొక్కుతూ
"సరే..పద కళ్యాణ మంటపం దగ్గరకు వెళ్ళొద్దాం " అంటూ వెంట తీసుకుని వెళ్ళింది దేవి.
*********
శాంత భర్త వ్యాపారం లో మంచి ఎత్తుకి ఎదగటం తో, వివాహం అంగ రంగ వైభవం గా జరిపించాడు ..వివాహం జరిగిన మరుసటి రోజు అందరూ ఇంటికి వచ్చి సర్దుకుని , సరదాగా కబుర్లు చెప్పుకుంటూ గడిపారు. అంతా సవ్యంగా జరిగిందని శాంత చాలా సంతోషంగా వుంది. ఆ రోజు ఇంట్లో బీరువా లో అన్నీ సర్దుతుంటే తన బంగారు నగ ఒకటి తక్కువగా ఉన్నట్లు అనిపించి సరిచూసుకోసాగింది. అన్నీ లెక్కేసుకుంటే ఒక గొలుసు తక్కువగా ఉందని తేలిపోయింది.
శాంత గుండెలు కొట్టుకోసాగాయి.
'ఎవరైనా చూసారా' అని అడిగితే , పెళ్లి ఇంట్లో గొడవలు అవుతాయి. పోయిందని మామూలుగా చెప్పినా సరే ,చుట్టాలందరూ దాన్ని అవమానం గా భావిస్తారు. ఏం చేయాలో తెలీక మొదట చెల్లెళ్లని పిలిచి చెప్పింది. వాళ్లకు కూడా ఏమీ తొచ లేదు. కావేరి అందరిలోకి ఆర్థికంగా తక్కువ స్థాయిలో వున్నందుకు కావేరి మనసులో కాస్త భయం పట్టుకుంది.
కాసేపటికి తేరుకుని మరదలు సుందరిని పిలిచి ఈ విషయం చెప్పింది శాంత .
అది విని " నువ్వేమీ కంగారు పడకు, నీ గదిలోకి వచ్చిన వారు కొందరే, అదెక్కడికీ పోదు, ఇంట్లో దొంగలే తీసుంటారు." అంది సుందరి గుస గుసగా.
"మరేం చేద్దాం, మీ అన్నయ్య కు తెలిస్తే నన్ను వాయించేస్తారు " అంది భయంగా
.
చుట్టూ చూసింది సుందరి. గదిలో ఎవరూ లేరని నిర్ధారించుకుని మెల్లిగా అంది" ఏం చేయాలో తర్వాత నే చెపుతాను , , నువ్వు మాత్రం ఏమీ జరగనట్లుగా వుండు . అందరినీ నమ్ముతావు కదా , నువ్వొట్టి పిచ్చి మొహం . నీ ఆస్తి డబ్బులు చూసి అందరూ ప్రేమ కురిపించే వారే " అని సలహా ఇచ్చింది.
అది విని శాంత మనసంతా కకావికలమై పోయింది .
"సరే" అని పూజ గదిలోకి వెళ్లి పోయింది శాంత .
గంటలోగా అందరికి ఈ విషయం తెలిసి పోయింది,కానీ ఎవరూ మాట్లాడ లేదు. అందరూ గుంభనగా ఉండిపోయారు.
మధ్యాన్నం భోజనాలు అయ్యాక చుట్టాలందరూ కలిసి దగ్గరలో నున్న ఆంజనేయ స్వామి కొండ కి వెళ్లే కార్యక్రమం పెట్టుకున్నారు. అది విని పిల్లలందరూ సంతోషం తో చిందులు వేశారు. అందరికీ సరిపడా చిరుతిళ్ళు తీసుకుని బయలు దేరారు..
అందరూ బయటకు వెళ్లే సమయానికి " నాకు కాస్త పని వుంది మీరెళ్ళండి " అని ఆగిపోయింది శాంత
" అలాగయితే నేనూ వెళ్ళను, పైగా నాకు కాస్త మోకాళ్లు నొప్పిగా కూడా వున్నాయి ' ' అంది కూర్చొని మోకాళ్లు నొక్కుకుంటూ సుందరి.
" మీరందరూ పెళ్లికూతురు తో కలిసి వెళ్లి రండి " అని చెప్పి అందరినీ పంపించింది శాంత.
అందరూ చాలా సంతోషంగా కొండ ఎక్కి దేవుడి దర్శనం చేసుకుని చాలా సేపు అక్కడే గడిపి, ప్రసాదాలు తిని ,కబుర్లు చెప్పుకుంటూ కూర్చొని తర్వాత ఇంటికి చేరుకున్నారు.
రాత్రి భోజనాలైన తర్వాత పడుకోవటానికి ఎవరికి కేటాయించిన గదుల్లోకి వారు వెళ్లి పోయారు.
కావేరి , పిల్లల తో కలిసి పడుకోవటానికి గదిలోకి వెళ్ళింది . అక్కడ తన పెట్టె, సామానులు చూసి నివ్వెర పోయింది కావేరి.
" రాము ..ఇలా చూడరా .." అని పెట్టెలు, సూటుకేసు ను చూపించింది కావేరి.
" ఏమైందమ్మా " అన్నాడు రాము , వాటిని చూసి అర్థం కాక .
" మన పెట్టెలు తీసి చూసారు , బట్టలన్నీ చిందరవందర చేశారు' అంది ఆదుర్ధాగా. .
" ఎందుకని ?" కంగారుగా అడిగాడు రాము
కొడుకు ప్రశ్న విని, కాసేపు తల వంచుకుని అలోచించి అంది " బహుశా పోయిన నగ కొరకు వెదికి నట్లున్నారు, మన పైన అనుమానం ఉన్నట్టుంది.." అంది అవమానం తో కూడిన బాధతో.
" మన మీదెందుకు " అన్నాడు రాము. మనసును మెలి పెట్టిన బాధ కలిగింది రామూకి
" మనం బీద వాళ్ళం కదరా, లేని వాళ్ళను చూస్తే అందరికీ తేలికే " అంది దుఃఖం
తో గుండెలు బరువెక్కి .
" అమ్మా..ఇంకో సారి మనమిక్కడకి రావొద్దు ..రేపే వెళ్ళిపోదాం " అన్నాడు . రాము మొహం లో నిస్సహాయత తో కూడిన ఉక్రోషం కనపడుతూ వుంది.
అది చూసి "మనం కోపం తెచుకోవద్దురా చిన్నా...పేద వాడి కోపం పెదవికి చేటు ..మనకు పెద్దమ్మ అన్నింటా సహాయం చేస్తూ ఉంటుంది.మనం లేని వాళ్లమని అందరికీ అలుసు . ఎవరి పాపం వాళ్ళది, నిజం నిలకడ మీద బయటకు వస్తుంది " అని నిట్టూర్చి . బయటకు వచ్చే కంటి నీరు ను బలవంతంగా ఆపుకుంది
వారం నుండీ వున్న సంతోషం ఆవిరైపోయింది కావేరి కి .
'జీవితం లో బాగా పైకి వచ్చి, వీళ్ళందరికంటే గొప్ప వాడిని కావాలి ' అని ఆ రాత్రి మళ్ళీ స్థిరంగా ,కసిగా నిశ్చయించుకున్నాడు రాము.
కావేరి, రాము ఆ రాత్రి, చీకట్లో చాలా సేపు నిశ్శబ్దన్గా ఏడుస్తూ పడుకున్నారు .
మరుసటి ఉదయం అందరూ తిరుగు ప్రయాణాలకు సిద్ధం కాసాగారు .
" అక్కా ..నేను కూడా బయలు దేరతానే ?" అడిగింది కావేరి .
చెల్లెలి వేపు బాధగా చూసి " ఉండవె మరి కొన్నాళ్ళు , నీకేంటి తొందర ?" అంది శాంత .
మరింక ఏమీ మాట్లాడ కుండా కొడుకుని చూసింది కావేరి. ఏం చేయాలో తెలీక మౌనంగా వుండి పోయాడు రాము.
చుట్టాలందరూ ఉదయం టిఫిన్ లు చేసి ఒక్కొక్కరుగా వెళ్ళిపోవటం చేశారు. వెళ్లే వాళ్లకు మిగిలిన అందరూ బయటకు వచ్చి , రిక్షా ఎక్కించి వీడ్కోలు చెప్పి ,లోపలి రావటం జరుగుతూ వుంది.
మధ్యాన్నం భోజనాలయ్యిన తర్వాత సుందరి కూడా బయలు దేరింది. సుందరిని రైలు స్టేషన్ లో దింపటానికి జీప్ తెప్పించింది శాంత.
పిల్లలు కొందరు చిన్న బ్యాగులు మోసుకుని జీపులో పెట్టసాగారు. సుందరికి వీడ్కోలు చెప్పటానికి అందరూ బయటకు
వీధి లోకి వచ్చేసారు.
పని పిల్లవాడు సుందరి చేతిలోనుండి పెద్ద సూటుకేసి తీసుకుని పైకి లేపి జీపులో పెట్టె సమయానికి ,సరిగ్గా అతడి చేతి లోంచి అది జారి కింద పడి , ఆ దెబ్బకు సూటుకేసి మూత తెరుచుకుని చీరలు ,బట్టలన్నీ కింద మట్టిలో పడిపోయాయి.
అక్కడ పడ్డ బట్టల వైపు చూసి చుట్టాలందరూ అవాక్కయ్యారు!! శాంత కూడా తన కళ్ళను నమ్మలేక పోయింది.
చీరల మధ్యలో అందంగా మెలికలు తిరిగి తళ తళ మెరుస్తూ వుంది శాంత గొలుసు !!!
"ఇదిక్కడికి ఎలా వచ్చిందో నాకర్థం కావటం లేదు " అంది సుందరి .ఆమె మొహం లో రక్తం చుక్క లేకుండా పాలిపోయింది.
శాంత వెళ్లి ఆ గొలుసు చేతిలో తీసుకుని "సరేలే ..నువ్ బయలు దేరు " మొహం లో హావ భావా లేవి చూపకుండా జాగ్రత్తగా అంది.
జీప్ వెళ్ళిపోగానే పక్కనే వున్న చెల్లెలు కావేరి భుజం మీద చేయి వేసి లోనికి తీసుకెళ్లింది శాంత. నెమ్మదించిన మనసుతో అక్క తో అడుగులు వేసింది కావేరి.
ఇదంతా చూసిన రాము మాత్రం లోనికి వెళ్లకుండా , అమ్మకు జరిగిన అవమానాన్ని తలచుకుని ' జీవితం లో వీళ్లందరికంటే పైకి రావాలి' అని కసిగా అనుకుంటూ జీప్ వెనకాల రేగుతున్న దుమ్ముని కళ్ళు ఆర్పకుండా తీక్షణంగా చూస్తూ నిలబడి పోయాడు .