ఆఫీసు లో పని ముగించుకుని ట్రాఫిక్ లేని రూట్ ఎంచుకుని ఇంటికి బయలే దేరాను. నాన్నకి రోజూ పడుకునేముందు ఆపిల్ తినడం అలవాటు. కూకట్ పల్లిలో ఒక చోట ఆగి పెద్దగ బేరం ఆడకుండా ఆపిల్స్ తీసుకున్నాను . ప్రస్తుత ఉద్యోగం లో చేరిన తరువాత ఆర్ధిక స్వాతంత్రం వచ్చి, రేట్లు గురించి ఎక్కువ ఆలోచించడం తగ్గింది. డ్రైవ్ చేస్తున్నా ఆలోచనలు నాన్న గురించే. అంతకు ముందు, నాన్న జీవితం మొత్తం, నేను ఉద్యోగంలో చేరెదాకా, ఆర్థిక ఇబ్బందులతోనే గడిచింది. అమ్మ కేన్సర్ తో చనిపోయేదాకా, ఆ తర్వాత, నా చదువు పూర్తి అయి ఉద్యోగం లో చేరే దాకా నాన్న చాలా ఆర్ధిక ఇబ్బందులు పడడం నా కళ్ళ ముందే జరిగింది. నాన్నని ఎక్కువ ఆనందింప చేసే పనులు ఏమిటా అని ఆలోచన వచ్చింది. ఊళ్ళో ఉన్న రెండెకరాల పొలాన్ని తనఖా నుంచి ముందు విడిపించాలి. ఆ భూమి సంగారెడ్డి కి పది కిలోమీటర్ల దూరం లో ఉంది. ఎప్పుడో ఓ మాటు డబ్బుకి చాలా ఇబ్బంది పడుతోంటే, ఆ రెండెకరాలూ అమ్మేయచ్చు కదా అంటే " అది ఎప్పుడూ ఆలోచించకు . మీ తాత చాలా మాట్లు నాతో అన్నాడు. "అదిపెద్ద నిధి రా. ఎన్ని తరాలయినా మన దగ్గరే ఉండేలా చూడు. అవసరమయితే దాని మీద అప్పు తీసుకో కాని అమ్మ వద్దు. మళ్ళీ సంపాదన రాగానే తనఖ విడిపించి కాగితాలు తెచ్చుకో" అని.మా తాత అన్న మాటలు నాన్న చెప్పడం బాగా గుర్తు. ఆ భూమి తనఖా పెట్టె నాన్న నన్ను చదివించాడు. ఇప్పుడు నా ఆర్ధిక పరిస్థితి బాగానే ఉంది కాబట్టి విడిపించడం విషయాన్ని ఇప్పుడు ఆలోచించాలి అనుకున్నా. మా కంపెనీలో ఫుల్ టైం ఉద్యోగం లో ఉన్నా, మా కంపనీ చైర్మన్ తో కలిసి కన్సల్టింగ్ చేస్తున్నాను. ఇంట్లోకి అడుగు పెట్టగానే, ఎప్పుడూ సోఫాలో కూర్చుని టి వీ చూసే నాన్న కనపడలేదు. రాజయ్య సాయంత్రంవంట చేసి అయిదింటికి వెళ్లి పోతాడు. అమ్మ పోయిన తరువాత, ఇంట్లో నేను, నాన్నే . నేను పూనా లో సిమ్బియాసిస్ లో చదివిన రెండేళ్ళూ నాన్న ఒక్కడే ఉన్నాడు. అది పూర్తి అయి హైదరాబాద్ లో ఉద్యోగంలో చేరిన తరువాత ఇద్దరం ఉంటున్నాము. బెడ్ రూమ్ లోకి వెళ్లి చూస్తె నాన్న పడుకుని ఉన్నాడు. దగ్గరికి వెళ్లి చూస్తె కళ్ళు తెరిచాడు " ఏమిటి ఒంట్లో బాగో లేదా ? " అన్నాను వొంటి మీద చేయి వేసి చూసి " లేదు కొంచం ఓళ్ళు నొప్పులుగా ఉంది. పెరాసిటిమాల్ ఒక టాబ్లెట్ ఇయ్యి అదే తగ్గుతుంది>" అన్నాడు. టాబ్లెట్ ఇచ్చి పడుకోమని చెప్పివచ్చేశాను నాన్న ఆకలిగా లేదంటే, నేను భోజనం చేసి కాసేపు అఫీసు పని చూసికుని పుడుకునే ముందు, నాన్న రూమ్ లోకి వెళ్లి చూస్తె నిద్దర పోతున్నాడు ప్రొద్దుటే వెళ్లి చూస్తె చలితో వణుకు తున్నాడు.లేపి కాఫీ ఇచ్చాను. రాత్రి రెండు మోషన్స్ అయ్యాయి అన్నాడు. మాకు దగ్గరగా ఉన్న డాక్టర్ సెంథిల్ దగ్గరికి తీసుకు వెళ్లాను. నా గురించి ఆయనకు తెలుసు. డాక్టర్ దగ్గరికి వెళ్ళే ముందు కూడా రెండు మోషన్స్ అయ్యాయి. డాక్టర్, బీపీ అవీ చూసి బయట ఏమన్నా తిన్నారా అన్నాడు. క్రితం సాయంత్రం వాకింగ్ నుంచి తిరిగి వస్తూ టిఫిన్ సెంటర్ లో ఎదో తిన్నానని అన్నాడు నాన్న. డాక్టర్ కాసేపు ఆలోచించి, ఎందుకయినా మంచిది హాస్పిటల్ లో అడ్మిట్ చేయండి అన్నాడు. దగ్గరగా ఉన్న కార్పోరేట్ హాస్పిటల్ లో చేరిస్తే,మద్యాహ్నం వచ్చి చూస్తానన్నాడు. తను ఇచ్చిన ప్రేస్క్రిప్షన్ చూపిస్తే, వాళ్ళే మందులు ఇస్తారన్నాడు. ఆయన చెప్పిన హాస్పిటల్కి తీసుకు వెళ్లాను. అడ్వాన్సు పది వేలు కట్టించుకుని నాన్నని ఒక రూమ్ లో ప్రవేశ పెట్టారు. కొంచం పెద్ద గదె. మధ్యన పార్టిషన్ చేసి అవతల ఇంకో పేషంట్ ని పెట్టారు. అటాచ్డ్ బాత్ రూమ్ ఉంది. చేర్చిన వెంటనే నర్సులు బ్లడ్ శాంపిల్ తీసుకుని వెళ్ళారు. డ్రిప్ పెట్టి ముందు గ్లూ కోస్ తరవాత ఎదో ఏంటి బయోటిక్ డ్రిప్ ద్వారానే ఇచ్చారు. కాసేపటికి నాన్నకి మోషన్స్ ఎక్కువ అయ్యాయి. అయిదు నిమిషాల కొమాటు వెడుతూనే ఉన్నాడు. మద్యాహ్నం, సెంథిల్ వచ్చి చూశాడు. అన్నీ చెప్పాను. బ్లడ్ రిపోర్ట్ వచ్చిందనీ కడుపులో ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉందనీ, అది మెల్లిగా తగ్గుతుందనీ, డెంగు, మలేరియ మొదలయినవేమయిన ఉన్నాయెమో ఇంకా రిపోర్ట్ రావాలని, దానికి రెండు రోజులు పడుతుందనీ చెప్పాడు. నాన్నకి, హాస్పిటల్ వాళ్ళే ఎదో ఫుడ్ ఇచ్చారు. అది ఏమీ సయించలేదు. రాత్రికి కూడా మోషన్స్ తగ్గ లేదు. టెంపరేచర్ తగ్గడానికి పేరాసిటమాల్ ఇస్తూనే ఉన్నారు. నాన్న ఒకటే గొడవ " ఒరేయి అదివరకు ఇలా వస్తే, ఏంటి బయోటిక్ ఐదు వందల ఎంజి ప్రారంభించగానే మోషన్స్ ఆగి పోయాయి. ఇదేమిటిరా ఇక్కడ ఒక రోజు గడిచినా అవి కట్టలేదేమిటి? అన్నాడు మర్నాడు సెంథిల్ రాగానే అదే అడిగాము. మళ్ళీ బ్లడ్ ని పరీక్షకి పంపుతున్నాము. ఇన్ఫెక్షన్ ఎలా ఉందొ చూద్దాము అన్నాడు. ఆ రిపోర్ట్ వచ్చేటప్పటికి గెంట్రోఎన్టేరాలజిస్ట్ కూడా వచ్చి చూస్తాడు. అతను ఏమి చెబుతాడో చూద్దాము అన్నాడు. మర్నాడు ప్రొద్దుట కానీ ఆయన రాలేదు. అప్పటికి మూడు రోజులయింది. ఆయన వచ్చి రిపోర్ట్ లో ఇంకా ఇన్ఫెక్షన్ చూపుతోందని చెప్పి మందు మార్చమని చేబుతానని చెప్పి వెళ్లి పోయాడు. మందులకీ, బ్లడ్ రేపోర్టులకీ, స్పెషలిస్ట్ విజిట్ కీ ఎప్పడికప్పుడు బిల్లుల మీద సంతకాలు తీసుకుంటున్నారు. ఏంటి బయోటిక్ డోస్ బాగా పెంచిన తరువాత మర్నాటికి కానీ మోషన్స్ తగ్గ లేదు, అన్నీ బాగున్నాయని, మళ్ళీ ఓమాటు బ్లడ్ రిపోర్ట్ చూసి మర్నాడు డిశ్చార్జి చేస్తామని చెప్పారు. నెను మధ్యలో రాజయ్యని నాన్న దగ్గర కూర్చో పెట్టి, ఇంటికెళ్ళివచ్చి , ఆఫీసు ముఖ్య విషయాలు ఆన్ లైన్లోనే అటెండ్ అవుతున్నాను. మర్నాడు నాన్నని డిశ్చార్జి చేస్తారనగా, ముందు రోజు హాస్పిటల్ కాంటీన్ కి వెడుతూ వాళ్ళ ఆఫీసు రూముల ముందు నుంచి వెడుతూ, యాదాలాపంగా లోపలికి చూస్తె ఒక డెస్క్ దగ్గర జలజ ని చూసి ఆశ్చర్య పోయాను. జలజ నాకు పూనా లో రెండేళ్ళు జూనియర్. చివరలో నాకు బాగా దగ్గర అయింది. రెండు క్రిటికల్ సబ్జక్టుల్లో ఆమె కి సహాయం చేశాను. ఆ సందర్భంగా మా ఇద్దరి మధ్య కొంచం బంధం గట్టి పడుతూ ఉండగా నేను ఇంటర్న్ షిప్ కి వెళ్లిపోవడంతో ముందుకు వెళ్ళ లేదు నన్ను చూసి ఆశ్చర్య పోయి లేచి వచ్చింది. నాతొ కేంటీన్ దాకా వచ్చి ఎదురుగా కూర్చుంది. నన్ను చూడగానే ఆమె ముఖంలో కనపడ్డ ఆశ్చర్యం, ఆనందం నన్ను ఆనంద పరిచాయి. కాసేపు మాట్లాడుకుని కెరీర్ పరంగా అప్ డేట్ చేసుకున్నాము. తను ఈ హాస్పిటల్ కార్పోరేట్ ఆఫీసు లో కార్పోరేట్ అఫైర్స్ చీఫ్ గా చేస్తోందట. ఎదో ఇన్ఫర్మేషన్ కోసం, హాస్పిటల్ లో ఉన్న రికార్డ్ రూమ్ కి వచ్చిందట. ఆమె ఆఫీసు హైటెక్ సిటీలో ఉందట. నేను వచ్చిన పని, అదీ విని, హాస్పిటల్ మీద నా అభిప్రాయం అడిగింది. నా సందేహాలన్నీ చెప్పాను. అన్ని రిపోర్టులు అవసరమా? ముందే సరయిన డోస్ ఇవ్వవచ్చుకదా? అన్నాను " ఆమె నవ్వి, అన్నీ ముందే ఇచ్చేస్తే మిమ్మలిని నాలుగు రోజులు ఎలా ఉంచడం? బిల్లు చిన్నదయి పోతుంది కదా!" అంది నవ్వుతూ " అదే అనుమానం నాకూ వచ్చింది, అన్ని మాట్లు బ్లడ్ శాంపిల్సూ, అన్ని రకాల రేపోర్టులూ అవసరమా అనిపించింది" " ఇంకా ఏమయింది రేపు డిశ్చార్జి చేసే ముందు గేస్ట్రోఎన్టేరాలజిస్ట్ ఏమి చెబుతాడో చూడండి" అంది లేచి వెడుతూ. మళ్ళీ కలుస్తానని చెప్పి ఫోన్ నంబర్ తీసుకుని వచ్చేశాను. రాజయ్యని నాన్నకి తోడు గా ఉంచాను మరునాడు , నేను హాస్పిటల్ కి వెళ్ళే టప్పటికి గేస్ట్రోఎన్టేరాలజిస్ట్ డాక్టర్ శరత్ వచ్చి వెళ్లి పోయాడు. " ఆయన నాన్నతో ఆవేళ డిశ్చార్జి చేస్తున్నామని, కాని నాలుగు రోజుల తరువాత రెండు టెస్టులు చేయించుకోవడం మంచిదనీ చెప్పాడట. కోలోనోస్కోపి, ఒకటి, ఎండో స్కోపిi ఒకటి తప్పకుండా చేయించుకుంటే మంచిదనీ చెప్పాడట. ఆయన ఎలా, ఏమి చెప్పాడో కాని, నాన్న చేయించు కోవడానికే నిశ్చయించు కున్నాడు. నాన్నని ఇంటికి తీసుకువచ్చి, జలజ కి ఫోన్ చేసి చెప్పాను. మొత్తం నాలుగు రోజులకి బిల్లు ఏభై అయిదు వేలు అయిందనీ, ఇప్పుడు చెప్పిన పరీక్ష లకి మరో పదిహేను అయేలా ఉందని చెప్పాను. డాక్టర్ శరత్ ఏమి భయ పెట్టాడో కాని నాన్న ఆయన చెప్పిన టెస్టులు చేయించాలని పట్టు పట్టాడు. ప్రస్తుతం వాడుతున్న టాబ్లెట్స్ అయిన తరువాత రమ్మన్నాడు కనుక, వారం తర్వాత జలజ కి ఫోన్ చేసి నాన్నని మళ్ళీ తీసుకువెళ్లాను. రెండు టెస్టులుకి ఆరు వేలు కట్టించుకున్నారు. అవి టెస్ట్ కే, మళ్ళీ అనుమానానం ఎందుకని బయోప్సి చేస్తాడని, దాని రిపోర్టులకి మళ్ళీ వేరే కట్టించుకుంటారనీ చెప్పింది. అలాగే జరిగింది. నాన్నకి అనుమాలు అన్నీ తీరి ఆనందంగా ఉన్నాడు. మొత్తం ఖర్చు ఆయనకి చెప్ప లేదు. ఖాళీ ఉన్నప్పుడు జలజని కలవడం జరుగుతోంది. ఒక మాటు ఇంటికి పిలిచి వాళ్ళ అమ్మగారిని పరిచయం చేసింది. అప్పటినుంచీ అప్పుడప్పుడు వాళ్ళ ఇంట్లోనే, కాఫీ కనీ, లంచ్ కనీ కలవడం జరుగుతోంది. జలజ చెప్పిన విషయాల నేపధ్యంలో అమ్మ కేన్సర్ ట్రీట్మెంట్ సమయం గుర్తుకు వచ్చింది. బతక దని తెలిసీ కూడా నాన్న ఎంత డబ్బు ఖర్చు చేశాడు. జపాన్ నుంచి ఇంజక్షన్లు కావాలని, పదేసి వేల చొప్పున ఎన్ని మాట్లు కట్టాడు? రిటైర్మెంట్ డబ్బులు పదిహేను లక్షలు ఆవిరి అయిపోయినా అమ్మ దక్కలేదు. ఇప్పుడు నాన్నకి జరిగినది చూస్తె, అప్పటి ఖర్చులో, ఎంత అవసరం? ఎంత కార్పోరేట్ లాభం ? భగవంతుడికే తెలియాలి ఒక వారం తరువాత జలజ ఫోన్ చేసి తను అక్కడ రిజైన్ చేశానని, వేరే కంపెనీ లో కార్పోరేట్ అఫైర్స్ చీఫ్ గా చేరుతున్నాని చెప్పినప్పుడు, నేను ఆశ్చర్య పోలేదు. ఇంకా జాయిన్ అవడానికి పదిరోజులు ఉందంటే, మా ఇంటికి ఆహ్వానించాను. రెండు మాట్లు వాళ్ళ అమ్మగారితో వచ్చి వెళ్ళింది. తరుచు గా ఫోన్ లో మాట్లాడుకోవడం జరుగుతూనే ఉంది **** ఆ వేళ ఆదివారం. లంచ్ అయిన తరువాత నాగదిలో లాప్ టాప్ లో మెయిల్స్ చూసుకుంటున్నాను. మామూలుగా నాన్న లంచ్ అయినతరువాత తన గదిలో కునుకు తీస్తాడు. ఎప్పుడు వచ్చి కూర్చున్నాడో నా డెస్క్ కి వెనకాల ఉన్న కుర్చీలో వచ్చి కూర్చున్నాడు. నాన్న దగ్గితే, వెనక్కి తిరిగి చూశాను " ముఖ్య మయిన పని మీద ఉన్నావా ?" అన్నాడు "లేదు ఏమిటి చెప్పు అన్నాను, విషయం ఏమిటో అనుకుంటూ" "నీకు జీతం అదీ బాగానే వస్తుంది కదా ఇప్పుడు. చేతిలో డబ్బు ఉంటె ఒక పని చేయాలి రా" " ఏమిటది ? అన్నాను పైకి . నాకు తెలుసు ఆయన మనసులో ఏముందో " అదేరా తనఖా పెట్టిన ఆ రెండు ఎకరాలూ విడిపించుకుంటే బాగుంటుందిరా. ఖాళీ గానే ఉన్నాను కదా, ఓ బోరు వేసి ఏదయినా పండించుకుంటే కాల క్షేపం అవుతుంది కదా. నాకుఇక్కడ ఎలాగూ తోచడం లేదు" అన్నాడు మెల్లిగా " ఎప్పుడో నా చదువు కు తాకట్టు పెట్టిన భూమి, ఇప్పుడు విడిపించడమంటే, డబ్బు ఎక్కువ అవుతుందేమో" అన్నాను " భూముల రేట్లు కూడా పెరిగాయి కదరా. తాత చాలా కష్టపడి సంపాదించిన భూమి అది. నీకు తెలుసు కదా ఆ భూమి తాత ఎలా కొన్నాడో ? " అమ్మ ఉండగా చాలా మాట్లు చెప్పడం జరిగింది. అది చెప్పడం నాన్నకి ఇష్టమని నాకు తెలుసు. అందుకే అడిగాను " తాత ఎలా కొన్నాడు? ఎప్పుడు కొన్నాడు చెప్పు "అన్నాను " మీ తాత అసలు చదువుకోలేదు. రజాకార్ల గొడవలు ప్రారంభమయేదాక వ్యవసాయ కూలీ గా చేసే వాడు. పెళ్లి అయిన ఒక సంవత్సరానికి గొడవలు ప్రారంభమయి జీవనం కష్ట మయితే, బామ్మని వాళ్ళ పుట్టినింట్లో వదిలి, పనికోసంకొందరితో కలిసి మద్రాసు వెళ్ళాడు . వెళ్ళడం రంగూన్ వెడదామని వెళ్ళాడు. కాని అక్కడ మాపిళ్లై అనే ఆయన తో పరిచయ మయి ఆయన దగ్గర బుడగలు, పిల్లలు ఆడుకునే రబ్బర్ బొమ్మలు లాంటివి తయారు చేసే పనులలో సహాయ పడి, ఆయన బాగా చూసుకుంటూ ఉండడంతో రంగూన్ వెళ్ళ లేదు. ఇంటికి డబ్బు పంపుతూ అప్పుడప్పుడు వచ్చి వెడుతూ ఉండేవాడు. నేను పుట్టడం, మా మాపిళ్లై వ్యాపారం పెరిగి కంపనీ పెట్టడం జరిగినా, ఆయన దగ్గరే నమ్మకం గా ఉండి పోయాడు. ఒక మాటు ఇద్దరూ ట్రామ్ దిగుతూంటే ఒక కారు వీళ్ళని గుద్ద బోతే, తాత మాపిళ్లై ని, తన క్షేమం చూసుకోకుండా తప్పించి, కాలు విరగ కొట్టుకున్నాడట. తన ప్రాణాలు తాత కాపాడాడని ఆయన నమ్మకం. నాకు అయిదేళ్ళు నిండినప్పుడు, "గొడవలు తగ్గాయి మా ఊరు వెళ్లి పో తాను" అని మాపిళ్లై తో అన్నాడట. తాతకి మాపిళ్లై కొంత డబ్బు ఇచ్చి మన ఊరు వెళ్లి కొంత భూమి కొనుక్కోమని పంపించి, భూమి కొన్న తరవాత ఆ పత్రాలు తెచ్చి చూపించమన్నాడు. రెండు నెలల తర్వాత తాత రెండు ఎకరాల భూమి కొని పత్రాలు చూపించడానికి పట్టుకువెళ్ళాడు. అప్పటికి ఆయన కొత్త గా కంపెనీ పెట్టి ఆఫీసు అదీ తెరిచాడు. నాన్న తెచ్చిన పత్రాలు ఆయన ఆఫీసు లోపెట్టుకుని, రెండు రోజులు ఉండి కొత్త కంపేనీ యంత్రాలూ అవీ చూసి వెళ్ళ మన్నాడు. రెండు రోజుల తర్వాత నాన్న బయలు దేరుతోంటే, భూమి పత్రాలు ఒక కవరులో పెట్టి ఇచ్చి, వాటిని ఒక నిధి లా చూసుకోమని, ఎంత అవసరమయినా అమ్మ వద్దనీ, ముందు తరాలకి అందులో నిధి ఉందనీ చెప్పి పంపించాడు. నాన్న ఆ కవరు తెచ్చి ఇంట్లో జాగ్రత పెట్టి, ఆ భూమి లో వ్యవసాయం చేసే వాడు. నిజాం కాలం లో చాలా చోట్ల చెరువులూ అవీ వుండి వ్యవసాయం బాగానే ఉండేది. తరవాత చెరువులూ అవీ ఆక్రమణలకి గురి అయి, వ్యవసాయం పూర్తిగా వర్షాధారమయిపోయింది. భూమి పత్రాలుఇప్పుడు నారాయణ శెట్టి కొడుకు దగ్గర ఉన్నాయి, వాడే ఎవరికో ఇచ్చి కొద్దిగా వచ్చే దానిని కొంత వడ్డీ గా తీసుకుంటున్నాడు విడుదల కి ఎంత అడుగుతాడో ఏమిటో. ఒక మాటు వెళ్లి వస్తావా.? " అన్నాడు. నాన్న చెప్పినదంతా విని ఆలోచనలో పడ్డాను. ఇప్పుడు నాన్న సెంటిమెంట్ కోసం దానిని విడిపిస్తే ఏమన్నా లాభం ఉంటుందా ? అంటే అప్పు, వడ్డీ తో సహా భూమి ఖరీదుకంటే ఎక్కువ ఉంటుందేమో !" అన్న ఆలోచనలో పడ్డాను " సరే డబ్బు చూసుకుని వెడతాను. అయినా ఈ వయసులో అక్కడికి వెళ్లి వ్యవసాయం చేయగలవా?" అన్నాను నాన్నతో " ఇక్కడ దుమ్ము ధూళి మధ్య కంటే, ఒక రెండు గదులు అక్కడ వేసుకుంటే, వ్యవసాయం, చేసినా చెయ్యక పోయినా పెన్షన్ తో బాగానే గడప వచ్చు కదా? అయనా ముందు విడిపించు తరవాత ఆలోచిద్దాము" అని పడుకోవడానికి లేచి వెళ్ళాడు. **** జలజ కొత్త కంపెనీ లోకి మారిన తరువాత ఎదో ఒక సలహాకోసం కలుస్తూనే ఉంది. నెల రోజులు ప్రోజక్ట్ పని మీద జపాన్ వెళ్ళవలిసి వస్తే, జలజని అప్పుడప్పుడు వెళ్లి నాన్నని చూడమని కోరాను. ఆ సందర్భంగా జలజ అప్పుడప్పుడు మా ఇంటికి వెళ్లి వస్తోంది. నేను తిరిగి వచ్చిన తరువాత మరునాడు ఆఫీసు నుంచి వస్తూ వాళ్ళ ఇంటికి వెళ్లాను. వాళ్ళ అమ్మ గారు ఇచ్చిన ఫిల్టర్ కాఫీ తాగి కాసేపు ఇద్దరి ఆఫీసు విషయాలు మాట్లాకుంటూ ఉండగా సడన్ గా " మీ నాన్నగారు మీ ఊరు పొలం గురించి ఎక్కువ ఆలోచిస్తున్నట్టున్నారు. ఆ విషయం చూడ వచ్చు కదా ?" అంది " నువ్వు కూడా వస్తావా ఒక మాటు వెళ్లి వద్దాము" అన్నాను. జలజ సరే నంటే ఆ మరుసటి ఆదివారం వెళ్ళడానికి ప్లాన్ చేశాము