(ప్రేయసి కోరిక పార్ట్ 2)
ఆది వారం ప్రొద్దుటే జలజ ఇంటికి వెళ్ళాను. ఎక్కడయినా బ్రేక్ ఫాస్ట్ చేసి వెడదామని అనుకున్నాము. జలజ ఇంటికి వెళ్ళ గానే, ఇంట్లో చేసిన ఉప్మా పెట్టి " ప్లాన్ లో కొంచం చేంజ్ ఉంది. మీ ఊరు మళ్ళీ వారం వేడదాము. మా చిన్నాన్న కూతురుని నిమ్స్ లో చేర్చారట. కేన్సర్ అని అనుమానం. అమ్మ చూడడానికి వెడదామంటోంది. నువ్వు కూడా రా అంది" అనుకున్నట్టు అలాగే అని చెప్పి వాళ్ళతో వెళ్లాను. అంత మంది, లోపలికి వెళ్లి పేషంట్లని డిస్టర్బ్ చేయడం ఎందుకని, ఒక మాటు చూసి నేను బయట వార్డ్ లో ఉంటానని చెప్పి వచ్చేశాను. జలజ, వాళ్ళ అమ్మ, డాక్టర్ వచ్చేదాకా ఉండి వస్తామన్న్నారు. వార్డు లో రక రకాల పేషంట్లనిచూస్తె మనసు పాడయి పోయింది. మిగతా వ్యాధుల మాట ఏదయినా, కేన్సర్ బారిన పడిన వాళ్ళకి, ఒకటి రెండు రకాల లో తప్పించి, బయట పడడటం కష్టం. అది తెలిసీ కూడా అనేక స్థాయిలలో, ఫలితం ఉండదని తెలిసీ డబ్బు ఖర్చుచేయడం తప్పదు. దానికి తోడు డాక్టర్లకి, ఆసుపత్రికీ నీతి కొరవయితే ఇంక చెప్పక్కరలేదు. ఈ ఆలోచనలలో ఉండగా జలజా వాళ్ళు బయటికి వచ్చారు. తిరిగి వస్తోంటే జలజ చెప్పిన విషయాలు నాకు వైద్య వ్రుత్తి మీద గౌరవం పెంచాయి. వాళ్ళ చిన్నాన్న గారికి వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్, నిమ్స్ లో పనిచేస్తున్న రమేష్ అనే డాక్టర్ దగ్గరకి వెళ్ళ మన్నారట. రమేష్ కి ఒక కార్పోరేట్ హాస్పిటల్ వాళ్ళు నెలకి అయిదు లక్షలు జీతం ఇస్తామన్నారట. అయితే నెలకి ఇరవయి అయిదు లక్షలు బిజినెస్ వాళ్లకి జనరేట్ చేయాలిట. అంటే పేషంట్ల అవసరం తో సంబంధం లేకుడా ఆ పని చేయాలి. నాన్న ఆసుపత్రి బిల్లులు గుర్తుకు వచ్చాయి నాకు . రమేష్ ఆ ఆఫర్ వద్దని, నెలకి లక్ష మాత్రమె జీతం వస్తున్నా, సేవా దృష్టి తో ఇక్కడ చేరాడట. కలికాలం లో ధర్మం ఒక పాదం మీదయినా నడవటానికి కారణం డాక్టర్ రమేష్ లాంటి వాళ్ళు ఇంకా ఉండటమే ననిపించింది. మరుసటి ఆది వారం, అనుకున్నట్టుగానే నేను, జలజ, కారు లో సంగారెడ్డి బయలుదేరాం. సంగారెడ్డి కి పది కిలోమీటర్ల పైనే ఉంటుంది మా ఊరు కంది. ఎప్పుడో చిన్నప్పుడు ఒక్క మాటు నాన్నతో వచ్చాను. తారు రోడ్డు వేశారు కానీ, తారు అక్కడక్కడే కనపడుతోంది. ఎంక్వైరీ చేసి నారాయణ శెట్టి కొడుకు దేవరాజు షాపు లోపలికి వెళ్ళాము. అతనితో “నేను పెంచలయ్య గారి మనవడిని. మీ నాన్నగారి దగ్గర మా నాన్న భూమి తనఖా పెట్టి డబ్బు తీసుకున్నాడు. డబ్బు కట్టి భూమి విడిపించుకుందామని వచ్చాను. లెక్కలు చూసి చెబుతారా? " అన్నాను అతను నేను చెప్పినది విని ఆలోచనలో పడ్డాడు.కాసేపు ఆలోచించి " అవును చాలా కాల మయింది కదండీ. ఆ కాగితాలు ఎక్కడున్నాయో చూడాలి. పుస్తకాలు చూసి లెక్క కట్టాలి. అన్నీ, లోపల ఎక్కడో ఉన్నాయి. మీరు భోజనం చేసి మధ్యాహ్నం రండి అప్పటికి చూసి చెబుతాను" అన్నాడు సంగారెడ్డి వెళ్లి లంచ్ చేసి వెనక్కి వస్తోంటే " మీ నాన్న గారు ఎంత అప్పు తీసుకున్నారో, ఎంత వడ్డీ రేటో అన్నీ కనుక్కునావా? అంది జలజ. బయలు దేరే ముందు నాన్న ఇచ్చిన కాగితం జేబులోంచి తీసి జలజకి ఇచ్చాను. అది చూసి " ఇరవై అయిదు వేలు, పద్నాలుగు ఏళ్లలో అయిదు లక్షలు దాటు తుంది " అంది కాగతం చూసి. "రెండు రూపాయలు వడ్డీ కదా అవుతుంది" అన్నాను మేము తిరిగి దేవరాజు షాపు చేరేటప్పటికి మూడున్నర అయింది, మమ్మలిని చూసి డ్రాయర్లోంచి పాత రిజిస్టర్ ఒకటి తీసి ఒక పేజీ తెరిచాడు. ఒక చిన్న పేపర్ మీద మొత్తం ఎంత కట్టాలో రాసి ఇచ్చాడు. దానిని చూసి జలజకి చూపించాను. "భూమి కాగితాలు చూడవచ్చా" అన్నాను నెను మళ్ళీ డ్రాయర్ లోంచి ఒక పాత కవర్ తీసి ఇచ్చాడు. అందులో ముందు నాలుగు స్టాంప్ పేపర్స్, స్థలం వివరాలతో ఉన్నాయి.వాటికి వెనకాలస్టేపిల్ చేసి ఒక లెటర్ లాంటిది ఇంగ్లీష్ లో ఉంది. పైన, చెన్నైరబ్బర్ ఫాక్టరీ ప్రైవేట్ లిమిటెడ్ అని ఉంది. చదివితే నాకు ముందు అర్థం కాలేదు. మళ్ళీ చదివాను, చలమయ్య కుమారుడయిన పెంచలయ్య , షేరు ఒక్కంటికి వంద రూపాయల చొప్పునఅయిదు వందల షేర్ల తో, కంపనీ స్థాపకుల్లో ఒకరని వివరిస్తూ ప్రకటించిన పత్రం అది. కంపెనీ చైర్మన్ మా పిళ్ళై సంతకం చేసి, కంపెనీ సీల్ తో ఇచ్చిన పత్రం అది. అది జలజ కి చూపించాను. జలజ కూడా చదివింది. నన్ను పక్కకి రమ్మని " మొత్తం కాగితాల కి ఫోటో తీసుకుని వెళ్లి, తరవాత వచ్చి డబ్బుకట్టి కాగితాలు తీసుకువెడదాతామని చెబుదాం" అంది. ఎలాగూ ఇప్పుడు డబ్బు తేలేదు కాబట్టి అదే మంచిది అనుకున్నాను. సెల్ లో కాగితాల కాపీ తెసుకుని మళ్ళీ వస్తామని చెప్పి వచ్చేశాము ఇంటికి రాగానే నాన్నని అడిగాను. భూమి కాగితాలకి జత చేసి ఉన్న కాగితం గురించి. "అదేదో తాతకి సేవలకి ఇచ్చిన సెర్టిఫికేట్ అనుకున్నా. తాత భూమి పత్రాలని చెన్నై తీసుకువెళ్ళి మా పిళ్ళైకి చూపించి వచ్చినప్పటినుంచీ అది వాటికి జత చేసే ఉంది. అందుకనే దానిని వేరు చేయలేదు. ఏమిటది?" అన్నాడు "అది మా పిళ్ళై కంపెనీ లో ఇచ్చిన షేర్ల కాగితం. నేను ఇంకా సరిగ్గా చూడాలి " అన్నాను మిగతా వివరాలు చెప్పి. త్వరలోనే విడిపించి కాగితాలు తెస్తానని చెప్పాను. రాత్రి భోజనం చేసి మెయిల్స్ చూస్తోంటే జలజ ఫోన్ చేసింది. " మీ తాత గారి కి షేర్లు ఇచ్చినప్పుడు అది ప్రైవేట్ కంపనీ. ఇప్పుడు అది పబ్లిక్ కంపెనీ. షేర్లు ఖోట్ అవుతున్నాయి. మీ తాత కి ఇచ్చినవీ, ఖోట్ అవుతున్నవీ ఒక్కటే అవునో కాదో కనుక్కోవాలి. ఇప్పుడు అవి ఎంత ఖోట్ అవుతున్నాయో తెలుసా? అంది "ఎప్పటికి అప్పటికి అనుకుంటూనే షేర్ మార్కెట్ పైన దృష్టి పెట్టలేదు నేను " ఎంత ఉందేమిటి ?" అన్నాను.ఎదో ఉంటుందిలే అనే ఉద్దేశ్యంతో. "హోల్డ్ యువర్ బ్రీద్ "అరవై అయిదు వేలు" . అంది . అయిదు వందల షేర్లు అరవై అయిదు వేలా ? అన్నాను, మనసులో లెక్క కట్టడానికి ప్రయత్నిస్తూ. " బలే వాడివే ఒక్కొక్కటి అరవై అయిదు వేలు. అంటే ఎంతో తెలుసా? మూడు కోట్ల పైనే. జాక్పాట్ కొట్టినట్టున్నావు." అంది నవ్వుతూ. లాటరీ టికెట్లు వచ్చాయని చెప్పి కొన్ని కథలలో మలుపులు తిప్పుతూ ఉంటారు. అలాంటి కథలు నాకు చిరాకు. కాని జీవితంలో అటువంటివి అరుదుగా జరిగినప్పుడు వాళ్ళ మనసు ఎలా ఉంటుందా అనిపించేది. ఇప్పుడు జలజ చెప్పినది వింటే మనసు మొద్దు బారి పోయింది. " అయినా ఇంకా కంపెనీ లో కనుక్కోవాలి కదా ? అదీ కాకుండా అవి తాత పేరున ఉన్నాయి" అన్నాను సందేహిస్తూ " రేపే మా కపెనీసెక్రెటరీని కలుద్దాము. నువ్వు లంచ్ టైం లో మా ఆఫీసుకురా. నా ఉద్దేశ్యం లో కొంచం టయిము పట్టినా అంత డబ్బూ వస్తుంది" " అందులో సగం ఎలాగా నీదే కదా?" అన్నాను ఎప్పటి నుంచో మనసు లో ఉన్నది పైకి చెబుతూ " సగం నాదా?" అదెలాగా అంది ? "ఏమో ఊహించు" అని ఫోన్ పెట్టేశాను. ఇద్దరమూ బాగా దగ్గరయినా పైకి ఎప్పుడూ అనుకోలేదు. మరుక్షణమే మెసేజ్ వస్తే చూశాను. జలజ నుంచి " అమ్మ దొంగా !" అని. ఆమెకి అర్థమవడం, అంగీకారం అన్నీ ఆ ఒక్క మాట లో నాకు స్ఫురించాయి . రెండు విషయాలూ ఉక్కిరి బిక్కిరి చేసి రాత్రి నిద్ర సరిగ్గా పట్టలేదు. మరునాడు జలజ ఆఫీసుకి వెళ్ళగానే, వాళ్ళ కంపెనీ సెక్రెటరీ అరవిందన్ దగ్గరికి తీసుకు వెళ్ళింది. ఆయనకి ఒక ఏభై పైనే ఉంటాయి. మమ్మలిని నవ్వుతూ రెసీవ్ చేసుకున్నాడు. జలజ, తను తెచ్చిన లెటర్ కాపీ తీసి ఇచ్చి విషయం చెప్పింది. ఆ షేర్లు ఎలాగా ఇప్పుడు అమ్మడం? సమస్యలు ఏమన్నా ఉన్న్నాయా ? అని అడిగింది. ఆయన లెటర్ చదివి కొంచం ఆశ్చర్య పోయాడు. సిఆర్ఎఫ్ అయిదు వందల షెర్లా? వీటి విలువ ఇప్పుడు ఎంతో తెలుసా? అన్నాడు " నిన్న రేట్లు చూస్తె మూడు కోట్ల పైనే లాగ ఉంది " అంది జలజ. ఆయన మళ్ళీ లెటర్ చూసి, పక్కన లాప్ టాప్ లో ఎదో కొట్టి చూశాడు. మళ్ళీ మాకేసి చూసి మీరు సరిగ్గా చూసినట్లు లేదు. ఇందులో చెప్పిన షేర్లు ఒక్కొక్కటి వంద రూపాయలు. ఇప్పుడు వస్తున్న కొటేషన్ పది రూపాయలది " మేము తెల్ల బోయాము. అంటే ఇప్పుడు వాటి వులువ-అని ఆగిపోయాము" " ముఫయి కోట్లు పైనే ఉంటుంది" అని ఆయన చెప్పగానే మేము అలా చూస్తూ ఉండి పోయాము " నాకు గుజరాత్ లోపని చేసిన రోజులు గుర్తుకు వస్తున్నాయి. అప్పట్లో మామూలుగ కాగితాల లో ఉండే సర్టిఫికెట్లు డిమాట్ చేయాలనీ వచ్చింది కదా. కొన్ని కొన్ని కుటుంబాల వాళ్ళు సంచీల నిండా ఎప్పుడో దశాబ్దాల క్రితం కొన్నవి పట్టుకువచ్చేవారు. అక్కడ చాలా వ్యాపారస్తుల సంపద అలాగే పెరిగింది. వాళ్ళు మంచి షేర్లు కొని మరిచిపోతే అవి కోట్లు అవడం నేను కళ్ళతో చూశాను. రియల్ ఎస్టేట్ కి దీటుగా వాళ్ళు షేర్లలో కోట్లు గడించారు. ఈ లెటర్ ద్వారా ఇచ్చిన షేర్లు మీతాత గారి పేరున ఎప్పుడో ఇచ్చినవి. ముందు అక్కడ పుస్తకాల లో పరిస్థితి చూసి, మీ పేరిట ఎలా మార్చాలో చూద్దాము" అని ఆయన ఇంటర్కం లో పిఎ కి చెన్నైలో సిఅరేఫ్ కంపెనీ సెక్రెటరీని కలప మన్నారు. ఆయన మరేదో ఫోన్ వస్తే అది మాట్లాడుతున్నారు ఈ లోపులో అటెండర్ తెచ్చిన కాఫీ తాగుతూ ఆయన చెప్పిన విషయాలు జీర్ణించు కోవడానికి ప్రయత్నించాను. "నిజంగా అంత డబ్బు వస్తే ఏమిచేయాలి? నాన్నకి ఒక్క మాటు చెప్ప కూడదు" ఇలా పోయాయి ఆలోచనలు. ఆయన పిఎ కలిపిన ఫోన్ వస్తే ఆయన మాట్లాడారు. జలజ ఇచ్చిన ఉత్తరం తీసుకుని ఆయన ఫోన్లో ఒక అయిదు నిమిషాలు మాట్లాడారు. ఫోన్ పెట్టి, "వాళ్ళు రికార్డ్ చూసి చెబుతానన్నారు. నాకు మెయిల్ వస్తుంది. రాగానే మీకు పంపుతాను అని నా మెయిల్ ఐడి తీసుకున్నారు. వాళ్ళువివరాలు ఇవ్వగానే జలజకి కూడా చేబుతాని అంటే, ఆయనకి థాంక్స్ చెప్పి వచ్చేశాము. మరునాడు ప్రొద్దున్న దాకా, నాకు మెయిల్ ఏమీ రాలేదు. జలజ కూడా ఫోన్ చేయలేదు. ఆఫీసుకి బయలుదేరుతోంటే. జలజ ఫోన్ చేసింది, అరవిందన్ ఫోన్ చేశాడనీ, ఆఫీసుకు శలవు పెట్టి తన ఆఫీసుకి వెంటనీ రమ్మనీ చెప్పింది. నేను ఆఫీసుకి వెళ్ళకుండా డైరెక్ట్ గా జలజ ఆఫీసుకి వెళ్లాను. తను అప్పటికే నాకోసం వైట్ చేస్తోంది. ఇద్దరం అరవిందన్ ఆఫీసుకి నడిచాము.జలజ ని చూడగానే " ఏమిటి విసేషం? గుడ్ న్యూస్ ఆర్ బాడ్ న్యూస్ ?" అన్నాను ఉండబట్ట లేక. "నాకూ ఆయన చెప్ప లేదు. నిన్ను తీసుకు రమ్మన్నాడు." అంది జలజ మేము వెళ్ళేటప్పటికి అరవిందన్ ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నాడు. కూర్చోమని సైగ చేశాడు. కాల్ ముగించి ఆయన నవ్వుతూ అన్నాడు " మీరు చాలా అదృష్ట వంతులు. నిన్న చెప్పిన దానికంటే మీ షేర్లు విలువ చాలా ఎక్కువ" అన్నాడు ఆయన నాకేసి చూసి " అదెలాగ ఒక్క రోజులో రేటు పెరిగి పోతుందా ? " అన్నాను నాకు అర్థం కాక " లేదు, జాగ్రత గా వినండి. ఎ కంపనీ అయినా వాళ్లకి అదనం గా కాపిటల్ కావలిసినప్పుడు, అనేక మార్గాల ద్వారా సేకరిస్తారు, అందులో రైట్ ఇస్స్యు ఒక మార్గం. ఈ పద్ధతి లో అప్పటికి ఉన్న వాటా దారులకే, మార్కెట్ ధరకంటే కొంచం తక్కువ ధరకి షేర్లు అమ్ముతారు. అలా సేకరించిన మొతాన్ని వ్యాపారానికి వాడుకుంటారు. మీతాత గారికి మొదట ఇచ్చిన అయిదు వందలకి ఇంకో అయిదువందలు రైట్స్ పద్ధతి లో ఇచ్చారు. దానికి సొమ్ము కట్టినట్టు, ఆతరువాత మరో అయిదువందలు షేర్లు ఆయన ఖాతా లో చేర్చారు. దానికి డబ్బు ఆయన కి షేర్లు ఇచ్చిన వాళ్ళే కట్టి ఉండాలి. దాని వల్ల అయిదు వందలు వెయ్యి అయాయి. వంద రూపాయల షేరు పది రూపాయల షేరు గా విభజించడం వల్ల మొత్తం పదివేలు అయ్యాయి. లాభాలు బాగా వచ్చినప్పుడు, రిసర్వులు ఎక్కువగా ఉన్నప్పుడు, కొన్ని కంపెనీలు బోనస్ షేర్లు ఇస్తారు. అంటే డబ్బు కట్టక్కర లేకుండానే ఉచితంగా షేర్లు ఇస్తారు. అంటే లాభాల నిల్వలని మూలధనగా మారుస్తారు. ఎప్పుడో చాలా కాలం క్రితం ఒకటి ఒకటి నిష్పత్తిలో బోనస్ ఇవ్వడం వల్ల, ఇప్పుడు మొత్తం మీతాత గారి ఖాతాలో ఇరవయి వేలు షేర్లు ఉన్నాయి. అయితే ఆ తరువాత ఎప్పుడూ బోనస్ ఇవ్వలేదు. ప్రతి సంవత్సరం లాభాలు బాగా వస్తున్నాయి కాబట్టి షేర్ విలువ మార్కెట్ లో బాగా పెరిగింది. ఇప్పుడు మొత్తం వాటి విలువ నూట ముఫయి కోట్లు పైనే ఉంటుంది" అన్నాడు ఆయన వివరణ ముగించి అదివినగానే, నేను జలజ ముఖం ముఖం చూసుకుని తెల్ల పోయాము. ఆలోచన స్తంభించి పోయింది. మేము తేరుకునే లోపలే ఆయన, మరునాడు వస్తే, నాన్న పేరిట ఆ షేర్లు ఎలా మార్చుకోవాలో చెబుతాను అన్నాడు. ఒక నెల పట్టవచ్చునని చెప్పాడు. అలాగే అని ఆయన కి థాంక్స్ చెప్పి వచ్చేస్తోంటే ఆయన ఒక సలహా ఇచ్చాడు. "అన్నీ ఆమ్మేయకండి ఒక ఇరవయి కోట్లు షేర్ల లోనే పెట్టండి. వారెన్ బఫెట్, రాకేశ్ జున్జున్వాలా లాగా ఆలో చించి పెట్టండి. "వాళ్ళు ఎలా ఆలోచించారు?" అన్నాను కుతూహలంగా " ఏముంది ఎప్పటికీ డిమాండ్ ఉండే వస్తువులకి సంబంధించిన కంపనీల షేర్లు కొనడమే. ఉదాహరణకి కాల్గేట్, బాటా, టైటాన్ (గోల్డ్) ఏషియన్ పైన్ట్స్ ఇలాంటివి కొనండి. మిఅగాతా డబ్బు మీ ఇష్టం అన్నాడు అక్కడనుంచి జలజ ఇంటికి వచ్చి జలజ రూమ్ లో కూర్చున్నాము. షాక్ ని దిగమింగుతూ. జలజ వాళ్ళ అమ్మగారు తెచ్చిన కాఫీ తాగుతూ అంది జలజ " సగం నీదే కదా అన్న మాట సీరియస్ గానే అన్నావా " అంది నవ్వుతో. నాకు అంత క్రితంరోజు నేను అన్న మాటలు, తన మెసేజ్ గుర్హ్తుకువచ్చింది. " సగం ఏమిటి మొత్తం తీసుకో " అన్నాను నవ్వుతూ " నాకు ఏమీ అక్కర లేదు కాని నేను చెప్పినట్టు చేస్తావా?" అంది కళ్ళల్లో నాకు అందని భావాలేవో పలికిస్తూ "చెప్పు అలాగే చేద్దాము అన్నాను" మనఃస్పూర్తిగా. ఆ తారావాత, నెల లోపే ముందు మా పెళ్లి జరిగింది, జలజ ప్రోద్బలం మీద ఒక హాస్పిటల్ తెరవాలని నిర్ణయించాము నిమ్స్ లోపనిచేస్తున్న రమేష్ గారిని సలహా దారుగా తీసుకుని ఆయన్ని సంప్రతించడం జరిగింది. . లాభాపెక్ష లేకుండా, హాస్పిటల్ నిర్వహణకి ఆయన ఒప్పుకునారు. ఆయన మిత్రులని కూడా జత చేస్తానన్నారు. కార్పోరేట్ హాస్పిటల్స్ లాగ దోచుకోకుండా, కోలుకోవడానికి అవకాశం లేని వ్యాధుల వాళ్లకి సహాయకారిగా ఉంటూ నడపాలని నిర్ణయించాము. మదురై దగ్గర నడుపుతున్న వేలమ్మాల్ హాస్పిటల్ ని స్టడీ చేసి ఆవిధంగా నడపాలని నిర్ణయించాము. "పెంచలయ్య ట్రస్ట్' పేరిట ఒక హాస్పిటల్ కట్టాము. ఏమర్జన్సీ లకి సిటీ లో ఒక యూనిట్, దీర్ఘకాల ట్రీట్మెంట్ కావాల్సిన వాళ్ళకోసం సంగారెడ్డి దగ్గర మా స్థలానికి ఇంకో ఇరవయి ఎకరాలు చేర్చి ఒక పెద్ద హాస్పిటల్ ఏర్పాటు చేశాము. వేరుగా పెట్టిన ఇరవయి కోట్లు కాకుండా, మిగతా డబ్బులో హాస్పిటల్ నిర్వహణకి అవసరానికి మించి ఉన్న నిధులని బ్లూ చిప్ షేర్ల లో పెట్టడానికి అరవిందన్ సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. మా స్థలం లోనే కట్టిన ఒక ఇంట్లో, "పెంచలయ్య ట్రస్ట్' ని చూస్తూ మానాన్న తన విశ్రాంత జీవితం గడపడం నాకు చాలా త్రుప్తినిచ్చింది.