పాండు, ఎ.బి.సి. పాండు - కణ్ణన్

Paandu ABC Paandu

ఆరోజు శ్రీధరుకే గాదు, ప్రపంచమంతటికీ గుర్తు. తనతోబాటుగా వేలాదిమంది అనాధలయినందుకు సంతోషపడాలో, బాధపడాలో శ్రీధరుకు ఇప్పటికీ అర్థం కాలేదు. అప్పుడు తను హైదరాబాదులో ఉండేవాడు. చిక్కడపల్లిలో ఒక ఇంటిపైనున్న గదిని అద్దెకు తీసుకుని తన చిన్నప్పటి స్నేహితుడు, సహపాఠి అయిన ఎ.బి.సి. విఠలుతో కలిసి ఎలాగైనా ఐ..ఎస్. అవడానికి నిద్రాహారాలు మాని విశ్వ ప్రయత్నం చేస్తుండేవాడు.

చదువులో భాగంగా ప్రపంచ సమాచారాలు తెలుసుకోవడానికని ఒక టీవీ కూడా ఉండేది. శ్రీధరు నాన్న మాంచి కామందు కాబట్టి అతనికి పెద్దగా డబ్బు గురించి సమస్యలేమీ లేవు. శ్రీధర్ ఎంత కావాలంటే అతని తండ్రి రాజశేఖరం అంతకంటే ఎక్కువ పంపేవాడు. విఠల్ కుటుంబం అతనిని ఏదో ఒక గుమాస్తాగా ఉద్యోగం చూసుకోమంటే వాళ్లకు నచ్చచెప్పి విఠల్ చదువుకు అయ్యే ఖర్చును తానే భరిస్తానని చెప్పి విఠల్ కూడా సివిల్సుకు తయారవడానికి కారణమయ్యాడు. ఆయన విఠలును శ్రీధరుతో పంపడానికి చాలా కారణాలున్నాయి. మొదటిది శ్రీధర్ చెడిపోకుండా విఠల్ చూసుకుంటాడు. రెండవది శ్రీధరుకు విఠల్ వంట చేసి పెట్టగలడు. బయట తిండి తిని కొడుకు ఆరోగ్యం పాడవడం రాజశేఖరానికి సుతరామూ ఇష్టం లేదు. మూడవది విఠల్ శ్రీధర్ కంటే తెలివిగలవాడు. చిన్నప్పటినుంచీ శ్రీధర్ చదువులో తన సహకారం చాలా విలువైనది. ఆఖరి కారణమేమంటే, ఒకవేళ శ్రీధరుకు బదులుగా విఠల్ ఐ..ఎస్. అయినా తనకు ఉపయోగమే. ఆయన ముందుచూపు ఆయన జీవనరేఖకన్నా పెద్దది. ఆయన చనిపోయిన రెండేళ్ళకు విఠల్ ఐ..ఎస్.గా సెలక్ట్ అయితే శ్రీధర్ కస్టమ్స్ ఆఫీసరయ్యాడు.

రాజశేఖరం వాళ్ళిద్దరినీ ఢిల్లీ వెళ్ళి కోచింగ్ తీసుకోమన్నాడు. శ్రీధర్ అంతకు ముందే డిల్లీ వెళదామని అనుకున్నాడు. కానీ తండ్రి ఢిల్లీ వెళ్ళమన్నాడని, తండ్రి చెప్పింది వింటే తన వ్యక్తిస్వాతంత్ర్యం దెబ్బతింటుందని భావించి అతను హైదరాబాదుకు వచ్చాడు. ఎటూ ఇద్దరి ఖర్చూ మీరే భరిస్తున్నారు కాబట్టి హైదరాబాదులో అయితే కొంచెం ఖర్చు తగ్గుతుందని తండ్రితో వాదించాడు. తమకున్న ఆస్థిలో ఈ ఖర్చులు ఒక లెక్క కావని రాజశేఖరం ఎంత నచ్చచెప్పినా వినలేదు.

ఆరోజు సెప్టెంబరు పదకొండు. రెండువేల ఒకటో సంవత్సరం. రోజూ కరెంట్ ఎఫైర్స్ తెలుసుకోవడానికని టీవీ చూసినా, ఆరోజు మాత్రం శ్రీధర్, విఠల్ ఇద్దరూ టీవీకి అతుక్కుపోయారు. ఏ ఛానెల్ చూసినా వరల్డ్ ట్రేడ్ సెంటర్ భవనాలు కూలడం లూపులో చూపిస్తున్నారు. హృదయవిదారక దృశ్యాలను చూసి ప్రపంచమంతా దిగ్భ్రాంతి చెందింది. అందరితో బాటే శ్రీధర్, విఠల్ కూడా. అర్థరాత్రి దాటేంత వరకూ టీవీ చూసి చల్లగాలికోసం బయటకు బయలుదేరారు స్నేహితులిద్దరూ. అప్పుడు మ్రోగింది శ్రీధర్ దగ్గరున్న నోకియా ఫోన్. ఆ సమయంలో ఇంటినుంచి ఫోన్ చూసి నొసలు చిట్లించాడు శ్రీధర్.

రాజశేఖరం పది దాటితే మేలుకోడు. అలాటిది ఈ సమయంలో తనకు ఫోన్ ఎందుకు చేసినట్లు? భయం భయంగానే ఫోన్ తీశాడు శ్రీధర్. అదే విషయాన్ని తనూ తలచుకుంటూ స్నేహితుడి వంక చూస్తున్నాడు విఠల్.

బాబూ” విమల గొంతు వినబడగానే శ్రీధరుకు గుండె గొంతుకు అడ్డం పడ్డట్టు అనిపించింది. విమల అతని సవతి తల్లి. అతనికంటే కేవలం పదేళ్ళు పెద్దది. అతని తల్లి శ్రీధరుకు అయిదేళ్ళున్నప్పుడే చనిపోతే అన్నీ తానే అయి పెంచిన రాజశేఖరం, పదిహేనేళ్ళ తరువాత ఎందుకు పెళ్ళి చేసుకున్నాడన్నది శ్రీధరానికే కాదు, రాజశేఖరాన్ని ఎరిగిన ఎవ్వరికీ అర్థం కాలేదు. యుక్తవయస్కుడైన శ్రీధర్ అభ్యంతరాన్ని త్రోసిపుచ్చి విమల మెళ్లో తాళి కట్టాడు రాజశేఖరం. ఈ రెండేళ్ళలో శ్రీధర్, విమలలు ఎప్పుడూ మాట్లాడుకోలేదు.

అలాటిది మొదటిసారి విమల ఫోన్ చేసింది. అదీ అర్థరాత్రి. వరల్డ్ ట్రేడ్ సెంటర్ బిల్డింగ్ తన కళ్ళ ముందే కూలిపోతున్నట్లు అనిపించింది శ్రీధరానికి.

* * *

సుందరమూర్తి ఇంకా టీవీ చూస్తున్నాడు. ఇంట్లో అందరూ పడుకున్నారు కానీ అతనికి మాత్రం కూలుతున్న బిల్డింగులను లూపులో చూడటం ఎందుకో బాగా ఇంట్రెస్టింగుగా ఉంది. మాధవి, అదే సుందరమూర్తి భార్య తన భర్తను ఒక చిన్న పాటి భయస్తుడైన శాడిస్టుగా భావిస్తుంది. ఎంతసేపూ టీవీలో దున్నపోతులను తినే సింహాలనూ, జింకలను వేటాడే చిరుతలనూ చూస్తాడు. బొద్దింకను చూసి కాళ్ళు కుర్చీపైకి లాగే మూర్తిని చూసి "ఇలా ఎంత సేపు సింహాలను చూసినా మీరు ధైర్యవంతులు కాలేరు" అని దెప్పి పొడిచేది. ఆరోజూ అదే అంది. కానీ, ఎటూ రేపు ఆఫీసులో అందరూ ఈ విషయం గురించే మాట్లాడతారు కాబట్టి, తాను ఎంత సేపు టీవీ చూస్తే అంత బాగా మాట్లాడొచ్చని అతను టీవీకి అతుక్కుపోయాడు. అతని దృష్టిలో ఆఫీసులో జరిగే చర్చలలో చివరిమాట చెప్పడమంటే ఒలింపిక్సులో స్వర్ణపతకం సాధించడంతో సమానం.

పిల్లలు నిద్రపోయి చాలా సేపయింది. ఈరాత్రి మొగుడు జాగారం చేస్తాడని గ్రహించిన ఆ మహా ఇల్లాలు తనవంతు బాధ్యతగా ఒక ఫ్లాస్కు నిండా అల్లం టీ తయారు చేసి నడుం వాల్చింది. రాత్రి బోజనానంతరం రెండు టీలు, మూడు సిగిరెట్లు సేవించిన సుందరమూర్తి మళ్ళీ సిగరెట్ కాలుద్దామని లేవబోయేంతలో...

ట్రింగ్... ట్రింగ్..”

త్వరలో అంతరించిపోయే జాతికి చెందిన నల్లని రాక్షసబల్లి లాంటి, తాతలకాలం నాటి ఫోన్ మ్రోగింది. రేపు ఆఫీసులో చర్చకోసం తయారవడానికి ఎవరైనా తన స్నేహితుడు ఫోన్ చేసి ఉంటాడనుకుని రెండంగలలో ఫోన్ చేరుకున్నాడు సుందరమూర్తి.

నమస్తే మామయ్యా” విఠల్ గొంతు. ముఫ్ఫైఐదేళ్ళ వయస్సులో, ఇరవైరెండేళ్ళ కుర్రాడు మామయ్యా అని వరస కలిపితే ఎవరికైనా మండుతుంది. సుందరమూర్తికి ఆ క్షణంలో ఎంత కోపం వచ్చిందో అతని ముఖంలో ప్రస్ఫుటంగా కనిబడుతోంది. చీకట్లో అతని కళ్ళు చింతనిప్పుల్లా ఎర్రబడ్డాయి. కుబుసం విడిచిన నాగులాగా బుసకొడుతూ విఠల్ గొంతును గుర్తు పట్టనట్టుగా “ఎవరూ?” అన్నాడు మూర్తి.

నేనే మామయ్యా, విఠల్ ని”

మళ్ళీ మామయ్య అంటాడు వీడు” విఠలుకు మళ్ళీ మామయ్య అనడానికి అవకాశం ఇచ్చినందుకు తనను తానే తిట్టుకుంటూ “ఇంత రాత్రి వేళ ఫోనేమిటి?” అన్నాడు.

చాలా ఎమర్జెన్సీ మామయ్యా. మా ఫ్రెండు శ్రీధర్ లేడూ. వాళ్ళ నాన్నగారు, అదే రాజశేఖరంగారు ఆత్మహత్య చేసుకున్నారట. ఇప్పుడే వాడి పిన్ని ఫోన్ చేసింది. కొంచెం మా పాండుగాడిని పిలుస్తావా?” సుందరమూర్తికి మధ్యలో ఆపి ప్రశ్నలు వేసే అవకాశం ఇవ్వకుండా గబగబ చెప్పేశాడు విఠల్.

విషయం వినగానే తనకు విఠల్ మీద ఉన్న కోపం మాయమయింది. “ఒక్క నిముషం లైన్లో ఉండు. ఇప్పుడే మీ వాడిని పిలుకుకొస్తా” ఫోన్ రిసీవర్ ప్రక్కనే పెట్టి బయటకు వెళ్ళాడు మూర్తి. విఠల్ వాళ్ళ కుటుంబం పై పోర్షనులో అద్దెకు ఉంటున్నారు. అద్దె తక్కువే అయినా, వాళ్ళలాగా అణిగి మణిగి ఉండేవాళ్ళు అరుదుగాబట్టి, తనను భరించే శక్తి సగటు కుటుంబాలకు ఉండదని వాళ్ళని ఎప్పుడూ ఇల్లు ఖాళీ చేయమనలేదు. అందులో విఠల్ వాళ్ళ అమ్మ చేసే పులిహోర చాలా రుచిగా ఉండడం వల్ల, పెళ్ళాం పోరెట్టినా కూడా తన బామ్మర్దికి విజయవాడ బదిలీ అయి ఇల్లు అవసరమయినా వాళ్ళను ఖాళీ చేయించలేదు సుందరమూర్తి. విఠల్ ఇంటి విషయమెలా ఉన్నా, రాజశేఖరం మాత్రం సుందరమూర్తికి బాగా తెలుసు. మిరపకాయలూ, పొగాకూ విదేశాలకు ఎగుమతి చేసి పిత్రార్జితమైన లక్షలను కోట్లుగా మార్చాడు రాజశేఖరం. అందులోనూ ఏ రాజకీయ పార్టీతోనూ పెద్దగా పొత్తులేకుండా. ఆయన అన్ని పార్టీ నాయకులకూ బినామీగా వ్యవహరిస్తాడని కొందరు అంటుంటారు. కానీ ఈ విషయం వినడానికి బాగున్నా, నమ్మడానికి మాత్రం ఎలాటి ఆధారాలూ లేనందువల్ల, వ్యాపారంలో ఎంత చతురుడైనా, ధనికుడైనా వ్యక్తిగతంగా భోళా మనిషి కావడం వల్ల రాజశేఖరం అంటే ఊళ్ళో అందరికీ సదభిప్రాయమే. అందుకే సుందరమూర్తి ఆదరాబాదరాగా మెట్లెక్కసాగాడు.

రేపు ఆఫీసులో వరల్డ్ ట్రేడ్ సెంటర్ బిల్డింగులు కూలడం ఎంత హాట్ టాపిక్ ఔతుందో, రాజశేఖరం ఆత్మహత్య కూడా అంతే హాట్ టాపిక్ ఔతుంది. కానీ, ఈ విషయంలో మాత్రం మిగతా వాళ్ళందరికంటే ఎక్కువ సమాచారం తన దగ్గరే ఉంటుందనే సంగతి సుందరమూర్తిని ఆరాత్రిలో ఉత్సుకతను నింపింది. కానీ ప్రస్తుతం పాండును నిద్ర లేపాలనే విషయం గుర్తుకు రాగానే, చెలియలికట్ట దాటలేక నిస్సత్తువగా పడిపోయిన అలలాగా ఆయన ఉత్సాహం నీరుగారిపోయింది.

పై పోర్షన్లో గుమ్మం ముందే నవ్వారు మంచం మీద ముసుగేసుకు పడుకుని ఉన్నాడు ఎ.బి.సి. పాండు. నిజం చెప్పాలంటే విఠల్ కన్నా పాండు తెలివిగలవాడు. కానీ బాగా బద్ధకస్తుడు. అంటే జడ పదార్థమని కాదు. ఏ పనైనా త్వరగా ముగించి విశ్రాంతి తీసుకోవడమే అతని సిద్ధాంతం. కావడానికి సగటు తెలుగు విద్యార్థిలాగా ఇంజనీరింగు స్టూడెంటే అయినా, మెడిసిన్ నుంచి లా వరకూ అన్ని పుస్తకాలూ చదువుతాడు. రాత్రి ఎనిమిదింటి నుంచి ప్రొద్దున ఎనిమిది వరకూ ఖచ్చితంగా నిద్రపోతాడు. ప్రక్కన గుళ్ళోంచి ఘంటసాల, సుబ్బులక్ష్మి అతనికి సుప్రభాతం పాడి అలసిపోవాలేగాని, అతను మాత్రం నిద్ర లేవడు. “స్లీప్ ఈజ్ ది సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ” అని తన గురించి చెప్పుకుంటాడు. ఎక్కువ ఎనర్జీ కోసం మధ్యాహ్నం కూడా భోజనానంతరం ఒక మూడు గంటలు నిద్ర పోతాడు.

పాండును లేపే ప్రయత్నంలో తన ఎనర్జీని పోగెట్టుకోవడం తథ్యమని గ్రహించిన సుందరమూర్తి వాళ్ళింటి తలుపు గొళ్ళెం పట్టుకుని దబదబా కొట్టాడు.

లోపల నుంచి పాండు వాళ్ళమ్మ శ్యామల “ఎవరదీ” అంటూ లేచి వచ్చింది. మంచం మీద నుంచి కదలకుండానే పక్కింటికి వినిపించే టట్లుగా పాండు వాళ్ళ నాన్న “అర్థరాత్రి వేళ అంకమ్మ శివాలన్నట్లు, ఎవరే ఇప్పుడు” అని, తన కర్తవ్యనిర్వహణ పూర్తయినట్లుగా అటువైపు తిరిగి పడుకున్నాడు. వరండాలో ఉన్న లైటు ఆన్ చేసి తలుపు తీసింది శ్యామల. బయటున్న సుందరమూర్తిని చూసి “ఏంటన్నయ్యగారూ, ఈవేళప్పుడు” ఎంత ప్రయత్నించినా గొంతులోని చిరాకును దాచడం ఆమె వల్ల కాలేదు. అయినా ఆ చిరాకునూ, పరాకునూ పట్టించుకునే స్థితిలో లేడు సుందరమూర్తి.

రాజశేఖరంగారు ఆత్మహత్య చేసుకున్నారు” బ్రేకింగ్ న్యూస్ ముందు చెప్పాడు సుందరమూర్తి. అతనిచ్చిన షాకుకి ఆమె కళ్ళు మూయడం కూడా మర్చిపోయింది. “విఠల్ ఫోన్ చేశాడు. లైన్లో ఉన్నాడు. పాండుని పిలిచాడు. మాట్లాడాలట. వీడిని నిద్ర లేపండి. అక్కడ అర్జంటు మరి”.

పక్కనుంచే కోరమాండల్ ఎక్స్ ప్రెస్ వెళితే అదిరిన తాటాకు గుడిసెలా అదిరి పడింది శ్యామల. రాజశేఖరం మూలంగానే విఠల్ ఐ..ఎస్.కు ప్రిపేర్ అవగలుగుతున్నాడు. ఆయనే లేకపోతే...

ఆమెకు ఊహించుకోడానికే భయం వేసింది. విఠల్ ఏ గుమాస్తాగానో సెటిల్ అవడానికి ఒప్పుకుంటాడా? అతనిని ఐ..ఎస్.కు ప్రిపేర్ చేయించడం తమవల్ల ఔతుందా?

అమ్మాయ్. పాండును నిద్రలేపు”.

సుందరమూర్తి అరుపులకు మళ్ళీ స్పృహలోకి వచ్చన శ్యామల రెండంగలలో పాండు పడుకుని ఉన్న మంచం దగ్గరకెళ్ళి “పాండూ, లేవరా. అన్నయ్య ఫోన్లో ఉన్నాడు. నిన్ను పిలుస్తున్నాడు” పెద్దగా కేకలేస్తూ ఒకే ఊపులో మంచాన్ని ఒకవైపు పట్టుకుని లేపింది. రెండోవైపు దభీల్మని కింద పడ్డాడు పాండు.

ఏందమ్మా ఈ హడావుడి” అంత నిద్రలోనూ అమ్మ ఇంత తీవ్రంగా తనను నిద్ర లేపడానికి ప్రయత్నిస్తుందంటే ఏం జరిగిందోనని ఆలోచిస్తూ లేచాడు పాండు.

మీ అన్నయ్య ఫోన్లో నీకోసం వెయిట్ చేస్తున్నాడు” అన్నాడు సుందరమూర్తి.

జారిపోతున్న లుంగీని గట్టిగా చుట్టుకుంటూ కొంగ ఎగురుతున్నట్టుగా ఒక్కో గెంతులో మూడు నాలుగు మెట్లు దిగుతూ సుందరమూర్తి ఇంట్లోకి వెళ్లాడు పాండు.

* * *

సైకిల్ తొక్కుతూ పాండు వెళ్ళేటప్పటికి రాజశేఖరంగారి ఇంటిముందు జనాలు గుమికూడారు. పోలీసులు కూడా వచ్చేశారు. జనాలను “జరగండి, జరగండి” అంటూ తోసుకుని ముందుకెళ్ళాడు పాండు.

విమల మెట్లమీద కూర్చుని “నన్ను అన్యాయం చేసి పోయాడురో దేవుడా” అంటూ పెడబొబ్బలు పెడుతోంది. ఆమె తమ్ముడు జారగా మూసి ఉన్న తలుపుకు ఆనుకుని నిలబడి ఉన్నాడు. విమల కూర్చున్న చోటునుంచి అయిదడుగుల దూరంలో రాజశేఖరం శరీరం పడి ఉంది. నేరుగా తలపై వాలినట్లున్నాడు. తల పగిలి మెదడు బయటకు వచ్చింది. మెదడులోని కొన్ని భాగాలు తరిగిన కాలీఫ్లవర్ ముక్కల్లా చెదురుగా పడి ఉన్నాయి. మెడ కూడా విరిగినట్లుంది. తలకు చుట్టూ రక్తం మడుగు. కాకపోతే రక్తస్రావం పెద్దగా లేదు.

పక్కింటి ఆడవాళ్ళు అక్కడే ఉండి ఆ శవాన్ని చూసి అక్కడ ఉండడానికి భయపడి తిరిగి వెళ్ళినట్టున్నారు. ఒక లేడీ కానిస్టేబుల్ విమలను ఇంటిలోపలకు వెళ్ళమని బ్రతిమాలుతుంది. కానీ విమల భర్తను వదలి వెళ్ళడానికి ఒప్పుకోక నిర్జీవ శరీరం వైపు పోబోతుంది. అతి కష్టం మీద ఆ కానిస్టేబుల్ ఆమెను అక్కడే కూర్చోబెట్టడానికి ప్రయత్నిస్తూంది. ఇన్స్పెక్టర్ మురళి మొబైల్ ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతున్నాడు.

ఒక్క అర నిముషం పాటు అక్కడున్న పరిస్థితిని బాగా గమనించి రాజశేఖరం శరీరం వైపు అడుగైసాడు పాండు. “ఏయ్. ఆగు. వెనక్కెళ్ళు” లాఠీ ఊపుతూ పాండును గదమాయించాడు ఇన్స్పెక్టర్ మురళి. పాండును లాగేయమన్నట్లు కానిస్టేబుళ్ళ వైపు సంజ్ఞ చేశాడు.

పాండు ముందుకు వెళ్ళలేదు. వెనక్కీ వెళ్ళలేదు. అక్కడే ఆగాడు. ఒక కానిస్టేబుల్ వచ్చి పాండు భుజంపై చెయ్యేసి నెట్టాడు. తలుపుకు ఆనుకుని ఉన్న విమల తమ్ముడు సుధీర్ పాండువైపే చూస్తున్నాడు.

ఒక్క నిముషం. నన్ను రాజశేఖరంగారి అబ్బాయే పంపాడు” కానిస్టేబులుతో నెమ్మదిగా స్పష్టంగా చెప్పాడు పాండు. వెంటనే అతన్ని నెట్టడం ఆపి “కొంచెం పక్కనుండు బాబూ. యస్సైగారి అనుమతి లేకుండా శవం దగ్గరకు వెళ్ళకూడదు” అని కానిస్టేబుల్ మురళి దగ్గరకు వెళ్ళి పాండు గురించి చెప్పాడు. వెంటనే అతను పాండు వైపు తీక్షణంగా చూస్తూ సెల్ ఫోనులో ఏదో చెప్పి కాల్ కట్ చేశాడు. పాండును తన వద్దకు రమ్మన్నట్లుగా చెయ్యి ఊపాడు. శవానికి ఒక మీటరు కంటే దగ్గరకు రాకుండా శవాన్నే చూస్తూ మురళి దగ్గరకు వెళ్ళాడు పాండు.

నీ పేరు?”

పాండు. .బి.సి. పాండు” అదేదో “బాండ్, జేమ్స్ బాండ్” అన్నట్లుగా చెప్పాడు.

విషయం ఏంటన్నట్లుగా చెయ్యూపాడు మురళి.

రాజశేఖరం అంకుల్ గారి అబ్బాయి శ్రీధర్ ఫోన్ చేసి అంకుల్ ఆత్మహత్య చేసుకున్నారని చెప్పాడు. వెంటనే ఇక్కడికి వచ్చి చూసి తనకు ఫోన్ చేయమన్నాడు. అంతలో సుందరమూర్తి, పాండు వాళ్ళ నాన్న జనార్ధనం వచ్చారు. ఇద్దరూ పాండు యస్సైతో మాట్లాడటం గమనించి వాళ్ళవైపే వచ్చారు. వాళ్ళను ఆగమన్నట్లు చెయ్యి చూపాడు మురళి. పాండు వైపు చూసి ఇంకా ఏమిటన్నట్లు చూశాడు. తండ్రిని సుందరమూర్తిని చూసి పాండు గాభరా కొంత తగ్గింది.

ఆయన మా నాన్నగారు” తండ్రిని చూపిస్తూ అన్నాడు పాండు.

అయితే ఏంటన్నట్టు చూశాడు మురళి. గట్టిగా ఊపిరితిత్తుల నిండా గాలి పీల్చుకుని వదిలాడు పాండు. “కొంచెం అంకులు ఎలా ఉన్నారో చూసి శ్రీధరన్నయ్యకు ఫోన్ చేస్తాను” అన్నాడు పాండు.

దగ్గరకు వెళ్లడానికి వీల్లేదు. ఇది పోలీసు వ్యవహారం” కటువుగా అన్నాడు మురళి. “ఆ అబ్బాయిని ఏదైనా సరే రేపు స్టేషనుకొచ్చి మాట్లాడమను”. విమల తమ్ముడి వైపు చూశాడు మురళి. “అయినా దీంట్లో మాట్లాడడానికి ఏముంది. ఇట్ ఈజ్ ఎ క్లియర్ కేస్ ఆఫ్ సూసైడ్”. తన మాటే ఆఖరి మాట.

పాండు రాజశేఖరంవైపు తిరిగితే అడ్డంగా చెయ్యిపెట్టి వద్దన్నట్లు తల ఊపాడు మురళి. విమల, ఆమె తమ్ముడు తనవైపే చూడడం గమనించాడు పాండు. స్విచ్ వేసి ఆపినట్లు ఆగిపోయాయి విమల పెడబొబ్బలు. మురళి వైపు తిరిగి “మీ ఫోన్ ఒకసారి ఇస్తారా. విషయం చెప్పేస్తాను” అన్నాడు.

మరీ కర్కోటకుడని ముద్ర వేయించుకోవడం ఎందుకన్నట్టు ముఖం పెట్టి అయిష్టంగా తన సెల్ ఫోన్ పాండుకి ఇచ్చాడు.

వెంటనే నంబరు డయల్ చేసి ఫోన్ చెవికి అదిమి పట్టుకున్నాడు పాండు. దాదాపు పది రింగులయిన తరువాత “ఎవరూ?” నిద్రలో కూడా కంఠం గంభీరంగా ఉంది.

అక్కడ శబ్టం ఎక్కువ ఉన్నట్లుగా పక్కకు వెళ్ళాడు పాండు. “సార్. నేను పాండుని. .బి.సి. పాండుని. మీరు నా “అప్లయింగ్ టెక్నాలజీ టు ఎక్స్పడైట్ జస్టిస్” పేపరు చదివి బాగుందన్నారు. ఆ పాండుని”.

ఇప్పుడు టైమెంతో తెలుసా?” గొంతులో చిరాకు స్పష్టంగా ఉంది.

సార్. మా ఫ్రెండ్ వాళ్ళ నాన్నని హత్య చేశారు సార్. అది ఆత్మహత్యగా పోలీసులు మారుస్తున్నారు”

అతని మాటలు వింటూనే మురళి చటుక్కున ఫోన్ లాక్కుని కాల్ కట్ చేశాడు. అదే ఊపులో అతని రెండో చెయ్యి పాండు చెంప చెళ్ళుమనిపించింది.

అక్కడున్న అందరూ ఒక్క సెకనులో మాటలాడటం ఆపేశారు. విమల, ఆమె తమ్ముడు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. పాండుకు గూబ గుయ్య్ మంది. కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. మండుతున్న చెంపపై చేతిని పెట్టుకుని మురళి వైపు చూశాడు.

ఏంటి సార్ మా అబ్బాయిని కొడుతున్నారు?” ఆందోళనతో ముందుకు వచ్చిన జనార్దనం గుండెలపై చెయ్యేసి ఆపాడు మురళి.

మురళి ఏదో చెప్పబోయేంతలో పాండు పెద్దగా అరిచాడు “నేను ఫోన్ ఎవరికి చేశానో తెలుసా?”.

మురళికి ఏం జవాబివ్వాలో తెలియలేదు. అప్పటికింకా స్మార్ట్ ఫోనులు రాలేదు. అతను తన సెల్ లోని కాల్ హిస్టరీ చూసి ఆ నంబరు ఎవరిదో కంట్రోల్ రూముకు ఫోన్ చేసి కనుక్కోమని ఒక కానిస్టేబులుకు చెప్పాడు.

నేను ఫోన్ చేసింది జిల్లా జడ్జికి. ప్రభాకరంగారికి”.

మురళికి నమ్మ బుధ్ధి కాలేదు. అతనికి అక్కడికక్కడే పాండును రోడ్డుపై పడేసి కాలితో తొక్కాలన్నంత కసిగా ఉంది.

కావాలంటే జడ్జిగారి ఇంటి నంబరు అడగండి మీ కంట్రోల్ రూములో. త్వరగా కన్ఫర్మ్ చేస్తారు” ఇప్పుడు విసురుగా ఉంది పాండు కంఠం.

పాండు సుందరమూర్తి వైపు తిరిగి “అంకుల్ మీరు ఇంటికి వెళ్ళి ప్రభాకరంగారికి ఫోన్ చేసి ఇక్కడకు రమ్మనమనండి” అన్నాడు.

ఏంట్రా నాటకాలేస్తున్నావు?” పెద్దగా అరిచాడు మురళి. సుందరమూర్తికి భయం వేసింది. అసలు తాను ఇక్కడికి ఎందుకు వచ్చినట్లు?

ఇక్కడ నుంచి ఎవ్వరూ కదలడానికి వీల్లేదు” ఇంకోసారి పెద్దగా అరిచాడు మురళి.

రెండు చేతులూ గుండెలకడ్డంగా కట్టుకున్నాడు పాండు. “మీరు వెళ్ళనవసరం లేదంకుల్. ప్రభాకరంగారే ఫోన్ ఎక్కడనుంచి వచ్చిందో కనుక్కుని పావుగంటలో ఇక్కడికి వస్తారు” నిమ్మళంగా ఉంది పాండు మాటతీరు.

పాండు మాటలు విననట్లుగా ముఖం పక్కకు తిప్పుకున్న మురళి అంబులెన్సు ఎంత సేపట్లో వస్తుందో కనుక్కోవడానికి ఫోన్ చేశాడు. డ్రైవరు కోసం వెతుకుతున్నారట. వాడెక్కడ తాగి పడున్నాడోనని మనసులోనే తిట్టుకుంటూ చేయడానికి ఇంకేమీ లేనందువలన, అందరితోబాటు తానూ అంబులెన్సుకోసం వేచి చూడసాగాడు. ఎవరో ఒకరు పోస్ట్ మార్టెమ్ లాటి మాటలు మాట్లాడక మునుపే శవాన్ని ఇక్కడనుంచి తీసుకెళ్ళాలి.

కొంతసేపటికి దూరంనుంచి అంబులెన్సు సైరెన్ శబ్డం వినిపించింది. అంతలోనే మురళి చేతిలో ఫోన్ మ్రోగింది. ఎస్.పి. గారి ఇంటినుంచి. మాడిన ముఖంతో ఫోన్ చెవిదగ్గర పెట్టుకున్నాడు. “డెడ్ బాడీని కదిలించవద్దు. ఫోరెన్సిక్ టీముని రమ్మను. జిల్లాజడ్డిగారు వస్తున్నారు – నేనూ వస్తున్నాను”.

కాల్ కట్టవగానే మురళి ముఖకవళికలు మారిపోయాయి. ఓరకంట విమల తమ్ముడి వైపు చూస్తూ “అందరూ పక్కకు జరగండి. కాస్సేపట్లో అంబులెన్సు వస్తుంది” అంటూ ఇంకో వైపుకు వెళ్ళి నిలుచున్నాడు. పాండువైపు చూడడానికి ధైర్యం చాలలేదు.

పది నిముషాలలో జడ్డి ప్రభాకరంగారిని తనకారులోనే తీసుకుని ఎస్.పి.గారు వచ్చారు. జడ్డిగారిని చూడగానే పాండు చేతులు జోడించి “నమస్కారం సార్” అంటూ ముందుకు వెళ్లాడు. మురళి కూడా వచ్చి అధికారులిద్దరికీ సెల్యూట్ కొట్టాడు.

కారులోనే ప్రస్తుత పరిస్థితిని ఎలా అదుపు చేయాలో నిర్థారించుకుని వచ్చినట్లున్నారు. ఎస్.పి.గారు మౌనంగా కారుకు ఆనుకుని నిలుచున్నారు. జడ్జిగారు పాండు భుజం మీద చెయ్యివేసి “ ఊ. చెప్పు” అన్నారు.

పాండు “రాజశేఖరంగారి అబ్బాయి, మా అన్నయ్య చిన్నప్పటి నుంచీ క్లాస్ మేట్సు సార్. ఇప్పుడు కూడా ఇద్దరూ హైదరాబాదులో ఒకే రూములో ఉంటూ సివిల్సుకు ప్రిపేర్ ఔతున్నారు. మా అన్నయ్యను చదివిస్తుంది రాజశేఖరంగారే”. జరగబోయే నాటకానికి నాంది పలికి, ప్రస్తావనగా మురళి వైపు తిరిగాడు పాండు. “రాజశేఖరంగారు ఆత్మహత్య చేసుకున్నప్పుడు సమయమెంతయింది సార్”?

తనను ఒక కుర్రాడు ఇంటరాగేట్ చేయడమేమిటన్నట్లు చూశాడు మురళి. కానీ జడ్జి ప్రభాకరంగారు తనవైపే చూస్తూ ఉండటం చూసి, నోరు తెరవకపోతే తరువాత కష్టాలు తప్పవని అర్థమైంది. తన వాచీలో సమయం చూశాడు. ఒకటిన్నర అవుతుంది. జడ్జిగారి వైపు చూసి “మాకు పన్నెండుంబావుకు ఫోన్ వచ్చింది సార్. అప్పటికి ఆయన బిల్డింగ్ పైనుంచి దూకి అయిదు నిముషాలయి ఉంటుంది”.

ఈ ప్రశ్నావళి వినడానికన్నట్లుగా అందరూ మౌనంగా ఉన్నారు. విమలతో సహా. మురళి సమాధానం విన్న ఎస్.పి. తలదించుకునే నొసలు చిట్లించాడు.

అందరికీ వినబడేటట్లుగా పాండు పెద్దగా “గంటన్నరలో శవం వాసన గొట్టదు గదా సార్” అన్నాడు. మురళి పై ప్రాణాలు పైకే పోయాయి. తనకు ఇంత వరకూ ఈ సంగతి తట్టలేదు. విమల తమ్ముడుతో బార్లో బాగా పరిచయం ఉండటం వల్ల ఇంటి ముందు జనాలు చేరకముందే శవాన్ని తీయించాలనుకున్నాడుగాని, ఇది ఆత్మహత్యే కాదన్న విషయం అతనికి తట్టలేదు. గ్లాస్ మేటు తనకు అబద్ధం చెబుతాడని అతను ఊహించలేదు. కానీ పాండు మాటలు వినగానే అతనికి తనను విమల, ఆమె తమ్ముడు బాగా వాడుకున్నారని అర్థమయింది. తెలిసి చేసినా, తెలియక చేసినా తప్పు తప్పే. అందులో ఎస్.పి.గారి ముందు తనెంత తెలివితక్కువవాడో పాండు ఒక్క సెకనులో ఋజువుచేశాడు. పాండు మాటలు వినగానే అక్కడున్న అందరికీ శవం నుంచి వాసన వస్తున్న విషయం, దానిని కప్పి పుచ్చడానికి శవానికి సెంటుగొట్టిన విషయం అర్థమయ్యాయి.

వెంటనే పాండు రాజశేఖరం శరీరం దగ్గరకు వెళ్ళాడు. ఒక చేయి కదిపాడు. ఫ్రీగా కదిలింది. రెండో చేయి కదిపాడు. చాలా బిగుసుకుని ఉండింది. ప్రభాకరం వైపు చూసి “రిగర్ మార్టిస్ కూడా మొదలయింది. ఒక చెయ్యిలో మాత్రం పైనుంచి కిందకు పడ్డ అదుటికి రిగర్ మార్టిస్ బ్రేక్ అయింది”. నెమ్మదిగా విమల వైపు, ఆమె వెనుకనున్న ఆమె తమ్ముడివైపు చూశాడు. “రాజశేఖరంగారు చనిపోయి చాలా సేపయింది. శవం పైనున్న చొక్కా పక్కకు జరిపి నల్లగా మారిన వీపును పక్కనుంచి చూపించాడు. “రక్తం కూడా వీపుపై చేరిపోయింది”.

విమల తమ్ముడు ఇంట్లోకి వెళ్ళడానికని తిరిగాడు. వెంటనే అతనివైపు చేయిచాపి, “అతన్ని లోనికి పోనీయమాకండి సార్” పాండు అరుపుతో ఆ వీధి ప్రతిధ్వనించింది. విమల తమ్ముడు అక్కడే ఆగిపోయాడు. విమల పైటకొంగుతో కళ్ళకు బదులుగా మెడపై కారుతున్న చెమటలు తుడుచుకోసాగింది. పాండు లేచి ప్రభాకరం గారితో “సార్, నాతో మీరూ వస్తారా” అని ఇంటిలోనికి వెళ్ళాడు. పాండు వెనుక ప్రభాకరంగారు, ఆయన వెనుక ఎస్.పి.గారు, చివరలో మురళి ఇంటిలోకి వెళ్ళారు. కానిస్టేబుళ్ళు ముగ్గురూ మురళికి మూడిందని గ్రహించి ఒక పక్కకు ఒదిగి నిలబడ్డారు. విమల తమ్ముడు రోడ్డువైపు వెళ్ళబోతే వాళ్ళలో ఒకడు పోలీసు సహజమైన కర్కశ స్వరంలో“ ఎక్కడికీ వెళ్లొద్దు. మీ అక్క పక్కన కూర్చో” అన్నాడు. విమల తమ్ముడు పిల్లిలా అక్క పక్కన కూర్చున్నాడు.

పాండు నేరుగా మొదటి అంతస్థులోనున్న రాజశేఖరంగారి పడకగదిలోకి వెళ్లాడు. కదలకుండా ఆ గదిని పరిశీలించి చూసి మెల్లగా గది మధ్యలో ఉన్న మంచాన్ని సమీపించాడు. మంచానికి అవతల పడి ఉన్న దిండును ఒక కొనలో పట్టుకుని పైకెత్తాడు. దిండు మధ్యలో బాగా నలిగి ఉంది. తడిసి ఆరినట్లుంది. “ఈ దిండును టెస్టు చేయిస్తే ఆయన నోటి ఉమ్మి మరకలు ఉంటాయి సార్” అంటూ మళ్ళీ బయటకు వచ్చాడు.

నేరుగా విమల తమ్ముడిని చేయి చాపమన్నాడు. ఆ చేతులు చూసిన తరువాత విమల చేతులు చూశాడు. “ఇలా రండమ్మా అంటూ ఆమెను బాగా వెలుతురు ఉన్న చోటికి తీసుకెళ్ళి లేడీ కానిస్టేబులుకు సైగ చేశాడు. తను రాగానే ఆమె చెవిలో మెల్లగా ఎదో చెప్పాడు. లేడీ కానిస్టేబుల్ విమలను ఇంట్లోకి తీసుకెళ్లి అరనిముషంలో బయటికి తీసుకొచ్చింది. పాండు వైపు చూసి నిర్ధారణ చేస్తున్నట్లు తలఊపింది. జడ్జిగారికి చూపించమన్నట్లు పాండు చెయ్యి చూపాడు. వెంటనే విమల భుజం పట్టుకుని ఆమెను జడ్జి, ఎస్.పి.ల ముందుకు తోసి విమల పైటచెంగు జరిపి జడ్డిగారితో “ఇవిగోండి సార్. రాజశేఖరంగారి గోళ్ళ గుర్తులు” అన్నది కానిస్టేబుల్.

ఈమె తమ్ముడు కాళ్ళు గట్టిగా పట్టుకుంటే, ఈమె రాజశేఖరంగారి ముఖంపై దిండు ను అదిమి ఆ దిండుపై కూర్చుని ఆయన చేతులు పట్టుకుంది. కానీ పెనుగులాటలో రాజశేఖరంగారి గోళ్ళు ఆమె నడుముపై తమ గుర్తులు వదిలాయి. ఫోరెన్సిక్ టీం చెక్ చేస్తే శవం కాళ్ళపైనో, పైజామా పైనో ఈమె తమ్ముడి వేళ్ళ గుర్తులు ఉంటాయి” పాండు హత్యా రహస్యాన్ని విశదీకరించి విమల వైపు తిరిగి అడిగాడు. “దస్తావేజులు ఎక్కడ దాచిపెట్టావు?”

ఊబిలో ఇరుక్కున్న ఎలుగుబంటిలా చూసింది విమల. అంతా అయిపోయిందన్నట్లు తమ్ముడివైపు చూసింది. అతను అంతవరకూ చొక్కాకూ, బనియనుకూ మధ్యలో దాచి ఉంచిన దస్తావేజులు తీసి మౌనంగా పాండుకి ఇచ్చాడు. పాండు ఆ దస్తావేజుల చివర చూసి “ఆయన సంతకం చేయడానికి ఒప్పుకోలేదా?”

అవునన్నట్లుగా అక్కాతమ్ముళ్ళిద్దరూ తలలు వంచారు. “అందుకే టీవీ సీరియళ్ళు చూసి మర్డర్లు ప్లాన్ చేయకూడదనేది. ఈ దస్తావేజులు చెల్లవు. చెల్లకపోవడానికి చాలా కారణాలున్నాయి. కానీ, మీకు తెలియవలసినది ఒక్క కారణమే. రాజశేఖరం లాటి విద్యావేత్త సంతకం పెట్టకుండా వేలిముద్ర వేశాడంటే ఎవరు నమ్ముతారు? అందులోనూ ఆయనను చంపి, శవంతో ముద్ర వేయించిన తరువాత కనీసం ఆ వేలు కడగాలి కదా?” అక్కాతమ్ముళ్ళను చూసి నవ్వాడు పాండు.

ప్రభాకరంగారు ఒకడుగు ముందుకు వేసి “వెల్ డన్ మై బోయ్” పాండు భుజం తట్టారు. ఎస్.పి.గారు మురళివైపు చూసి “నీపని ఎలా చేయాలో ఈ కుర్రాడిని చూసి నేర్చుకో” అని, పాండు వైపు చేయిచాచి, “నీ పేరేంటబ్బాయ్?” అని అడిగారు.

పాండు సర్. .బి.సి. పాండు”.

.బి.సి?” ఎస్.పి.గారి ముఖంలో ప్రశ్నార్థకం.

పాండు సిగ్గు పడ్డాడు “అన్నం బాల చంద్ర పాండు”.

మరిన్ని కథలు

Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు