దేవతలకు రాజు ఇంద్రుడు. రాక్షసులపై జరిగిన యుద్ధంలో విజయం సాధించి, మూడు లోకాలకు నేనే ప్రభువును అనే అహంకారంతో ఉన్నాడు. ఒకనాడు నవరత్నకచితమైన సింహాసనం మీద శచీదేవితో కూడి రాజసంతో, నిండు సభలో కొలువై ఉన్నాడు.ఆ సమయంలో ఇంద్రసభలో ప్రవేశించినదేవగురువు, బృహస్పతిని చూసి దేవేంద్రుడు సింహసనం దిగలేదు. గౌరవంగా స్వాగతం పలుక లేదు. ఏ విధమైన మర్యాద ఇవ్వలేదు.దేవేంద్రుని అహంకారాన్ని గమనించిన బృహస్పతి కోపంతో ఇంద్రసభ నుండి నిష్కమించాడు.బృహస్పతి సభ నుండి వెళ్ళిన తరువాత ఇంద్రుడు తన తప్పును తెలుసుకొని పశ్చాత్తాప పడ్డాడు. వెంటనే గురువు గారి గృహానికి వెళ్ళాడు. ఇంద్రుడు తన ఇంటికి వస్తున్నాడని తెలుసుకున్న బృహస్పతి తన యోగ మాయతో అదృశ్యుడైనాడు.
ఈ విషయాన్ని వేగుల వల్ల తెలుసుకున్న రాక్షసులు తమ గురువైన శుక్రాచార్యులతో చర్చించి స్వర్గంపై దండయాత్ర చేయడానికి సన్నద్ధులైనారు.దేవతలూ, రాక్షసులూ ద్వేషంతో పరస్పరం పోరాడారు. దేవతలు, రాక్షసుల పరాక్రమానికి ఎదురు నిలువలేక పారిపోయారు.వారు క్షతగాత్రులై బ్రహ్మదేవుని సన్నిధికి వెళ్ళారు.ఆయనకు ప్రణామం చేసారు. బ్రహ్మదేవుడు దేవతలకూ, రాక్షసులకు, సర్వ లోకాలకు హితం కోరేవాడు.
బ్రహ్మదేవుడు వారికి అభయం ఇచ్చి ఇలా అన్నాడు. మీరు గురువును అవమానించి గురుద్రోహం చేసారు. ఆ దోషం ఇప్పుడు మీకుశత్రురూపంలో అనుభవానికి వచ్చింది. బలహీనులైన రాక్షసులు తమ గురువైన శుక్రాచార్యుణ్ణి పూజించి ఆయన మంత్రశక్తిచే శక్తి సంపన్నులైనారు. మీరు “త్వష్ట” అనే మనువు కుమారుడు అయిన విశ్వరూపుణ్ణి ఆశ్రయిస్తే ఆయన మీ కష్టాలను తీరుస్తాడు అని బ్రహ్మదేవుడు ఉపాయం చెప్పాడు. దేవతలు బ్రహ్మదేవుడి వద్ద శలవు తీసుకొని విశ్వరూపుని సన్నిధికి వెళ్ళి నమస్కరించింద తమకు గురువుగా ఉండమని వేడుకున్నారు.
విశ్వరూపుడు విష్ణుమాయ వలన, రాక్షసులు కొల్లగొట్టిన దాని కంటె ఎక్కువ ఐశ్వర్యాన్ని, సంపదలను దేవేంద్రుడికి సాధించి పెట్టాడు. రాక్షసులను ఓడించి రాజ్యం సంపాదించగల విష్ణు మాయాతత్త్వం తెలిపే వజ్ర కవచమూ, రక్షా కవచమూ అయిన “నారాయణ కవచాన్ని” ఉపదేశించాడు. అది “ఓం నమో నారాయణాయ” అనే ప్రణవపూర్వకమైన అష్టాక్షరీ మంత్ర రాజం.నారాయణ కవచాన్ని ఉపాసించిన విష్ణుభక్తులను అతిక్రమించడం ఎటువంటి వారికీ సాధ్యం కాదు. దేవేంద్రుడు ఆ మంత్రాన్ని గ్రహించి దాని ప్రభావం వల్ల తన శత్రువులైన రాక్షసులను జయించాడు.ముల్లోకాలకూ ప్రభువై ప్రకాశించాడు.
సుర పురోహితుడైని విశ్వరూపునకు మూడు తలలు. వానిలో మొదటిది దేవతల వలె సురాపానం చేస్తుంది. రెండవది రాక్షసుల వలె సోమపానం చేస్తుంది. మూడవది మనుష్యుల వలె అన్నం తింటుంది. విశ్వరూపుడు దేవతలకు గురువై యజ్ఞాలు చేయిస్తూ వారితో హవిర్భాగాలు అందుకుంటూ ఉండేవాడు.
కొన్నాళ్ళ తరువాత అతని బుద్ధిలో మార్పు వచ్చింది.విశ్వరూపుని తల్లి “రచన” రాక్షసులకు ఆడపడుచు. దేవతల కళ్ళు కప్పి తన తల్లివైపు వారైన రాక్షస ప్రముఖులకు రహస్యంగా యజ్ఞాలలోని హవిర్భగాలనుఅందించడం మొదలు పెట్టాడు. దీనితో భయపడిన దేవేంద్రుడు విశ్వరూపుని మూడు తలలను ఖండించాడు.బ్రహ్మ హత్యా పాతకం మూడు విధాలైన పక్షులుగా మారి ఇంద్రుణ్ణి నిర్భందింప సాగింది. ఇంద్రుడు ఆ పాపాన్ని భరించలేక భూదేవినీ, నీటినీ, చెట్లనూ, స్త్రీలనూ పిలిచి అ పాపాన్ని నాలుగు విధాలుగా చేసి వారిని తీసుకోమని ప్రార్థించాడు. దానికి ప్రతిఫలంగా వారికి వరాలు ప్రసాదించాడు.
విశ్వరూపుని తండ్రి త్వష్ట తన కుమారుని చంపినందుకు కోపంతో ఇంద్రుణ్ణి సంహరించడం కోసం మారణహోమం ప్రారంభించాడు. ఆ హోమగుండంలో నుండి భయంకరమైన చూపులతో ఒక మహాభూతం ఉదయించింది. యమధర్మరాజు కంటే భయంకరంగా ఉన్న ఆ రూపం ప్రతిదినమూ ఎన్నో రెట్లు పెరుగుతూ వజ్రాయుధం వంటి పదునైన కోరలతో కూడిన నోటితో “వృత్తాసురుడు” జన్మించాడు.
వృత్తాసురుని శరీరం నేల నుండి ఆకాశాన్ని అంటే అంత పెద్దదిగా ఉంది. వాడు తండ్రి తపశ్శక్తి వల్ల భలవంతుడై లోకాలన్నీ ఆక్రమించ సాగాడు. సమస్త దేవతలపై శత్రుత్వంతో పరాక్రమించాడు. ఆ భయంకరాకారం గల వృత్తాసురుని పైకి దేవతలందరూ గుంపులు గుంపులుగా శస్త్రాలతో దాడి చేసారు. వీరాధివీరుడైన ఆ అసురుడు ఆ శస్త్రాలన్నింటినీ చుట్టచుట్టి నోటితో మ్రింగివేసి, మహా భయంకరంగా గర్జించాడు. దేవతలందరూ భయంతో పారిపోయి శ్రీమన్నారాయణుడు తప్ప మనని ఎవ్వరూ కాపాడలేరు. ఆయనను ప్రార్థించి మన స్వర్గాన్ని కాపాడమని వేడుకుందామని తలచి విష్ణుదేవుని సన్నిధికి బయలు దేరారు.
ఇంద్రాది దేవతలు వైకుంఠం చేరి వాసుదేవుణ్ణి స్తోత్రం చేసారు. వృత్తాసురుని బారి నుండి రక్షించమని వేడుకొన్నారు. ఈ విధంగా ప్రార్థిస్తున్న దేవతలకు లక్ష్మీనాథుడు ప్రసన్నుడై దర్శనమిచ్చాడు. నీవే మాకు దిక్కు. స్వామీ! ఈ రాక్షసుని బారినుండి మమ్ములను రక్షించు అని మరల మరల ప్రార్థించారు.
“దేవతలారా! “దధీచి” అనే పేరుగల మహర్షి ఉన్నాడు. ఆ ఋషి దేహం “నారాయకవచ” ప్రభావం వల్ల మహాతేజోవంతమై ఉంటుంది. మీరు ఆ మహర్షి దగ్గరకు వెళ్ళి ఆయనను ప్రార్థించి ఆయన దేహాన్ని పుచ్చుకోండి. విశ్వకర్మ ఆ మహర్షి ఎముకలతో వజ్రాయుదాన్ని తయారు చేస్తాడు. ఆ వజ్రాయుధం వృత్తాసురుని శిరస్సు ఖండిస్తుంది. అప్పుడు మీ మీ తేజస్సులు, అస్త్ర శస్త్రాలు మరల మీకు సంప్రాప్తిస్తాయి.” అని విష్ణుమూర్తి దేవతనుఆజ్ఞాపించి అంతర్ధానమయ్యాడు.
దేవతలు పరమాత్మ ఆదేశం ప్రకారం దధీచి మహర్షిని కలిసి దేహాన్ని దానం చేయండి అని ప్రార్థించారు. దేవతల మాటలు ఆలకించిన దధీచి మహర్షి చిరునవ్వు నవ్వుతూ “భగవంతుడు వచ్చి యాచించినా ఎవరూ తమ దేహాన్ని దానం చేయరు. కాని నేను నా దేహాన్ని మీకు అర్పించడానికి ఇష్టపడుతున్నాను. ఈ శరీరం ఎప్పటికైనా విడిచి పెట్టవలసిందే. మీకు దానం చేయడం వలన శాశ్వతమైన యశస్సూ పుణ్యమూ దొరుకుతుంటే ఈ అవకాశాన్ని ఎందుకు వదులు కుంటాను” అని అన్నాడు.తరువాత దధీచి మహర్షి సమస్త బంధాలు త్రెంపుకొని, మనస్సు బుద్ధి ఇంద్రియాలతో కూడిన జీవాత్మను పరమాత్మలో ఐక్యం చేసాడు. యోగమార్గం ద్వారా శరీరాన్ని పరిత్యజించాడు.
విశ్వకర్మ మహర్షి ఎముకలతో నూరంచులతో ప్రకాశించే పదునైన వజ్రాయుధాన్నితయారు చేసాడు. దేవేంద్రుడు ఆ ఆయుధాన్ని ధరించి ఐరావతాన్ని అధిరోహించి యుద్ధానికి బయలుదేరాడు. శత్రువులు దండెత్తి వస్తున్నారని తెలుసుకొన్న వృత్తాసురుడు ప్రళయకాల యముని వలె గర్జిస్తూదేవేంద్రుని మీదకు దూకాడు. ఉభయపక్షాల వీరులు కలియబడి ఘోరమైన సంగ్రామం సాగించారు. యుద్ధరంగం మహా ప్రళయంగా మారిపోయింది. దేవదాలవుల సైన్యాలు రెండూ సమానమైన పరాక్రమం కలవి. ఈ విధంగా నర్మదానదీతీరంలోకృతయుగంలో మొదలైన దేవదానవ పోరాటం త్రేతాయుగం ప్రవేశించే వరకూ సాగుతూనే ఉంది.
మళ్ళీ దేవతలు దానవుల మీద నిర్విరామంగా శస్త్రాలు గుప్పించారు. ఆ దెబ్బలకు తట్టుకోలేక కొద్దిమంది రాక్షసులు తోక ముడిచి పారిపోయారు. అపుడు వృత్తాసురుడు అమరవీరులను చూసి బ్రహ్మాండం బద్దలయ్యేటట్లు భుజం చరిచి పెద్దగా అరిచాడు. ఆ మహాధ్వనికి లోకాలన్నీ చీకాకు పడ్డాయి. సుర సైనికులు సృహతప్పి మూర్ఛిల్లారు.ఇంద్రుడు వేసిన గదను పట్టి వృత్తాసురుడు ఐరావతం కుంభస్థలం మీద గట్టిగా ఒక్క పెట్టు పెట్టాడు.
తన సోదరుడు విశ్వరూపుని హతమార్చిన ఇంద్రునితో ఇలా అన్నాడు. “నాకు అన్నగారు నీకు గురువుగారు అయిన మహానుభావుడు విశ్వరూపుని దుర్భుద్ధితో హత్య చేసిన పాపాత్ముడివి నువ్వు. నిన్ను చంపి నా అన్నగారిరుణం తీర్చుకుంటాను. లేదా నీ వజ్రాయుధం వేటుకు నా సంసార బంధాలన్నీతెగిపోతాయి. నేను నారాయణ భక్తపరాయణుడను.” తర్వాత వృత్తాసురుడు పరమేశ్వరుణ్ణి ఇలా ప్రార్థించాడు. “ స్వామీ! నా వాక్కు ఎప్పుడూ నిన్నే స్తుతించాలి. నా శరీరం ఎప్పుడూ నీ సేవే చేయాలి. ఇదే నా కోరిక. నేను ఇంద్రభోగం కాని బ్రహ్మపదం కాని ఆశించిను. నీ సమాగమం కోసం నా హృదయం ఉవ్విళ్ళూరుతున్నది”.
ఇంద్రుడు వజ్రాయుధంతో వృత్తాసురుని హస్తాన్ని నరికి వేసాడు. అపుడు ఆ దానవుడు ఆగ్రహంతో ఇంద్రునిపై దుమికాడు. “ఈ లోకంలో జయమూ అపజయమూ, చంపేవాడూ చంపబడేవాడూ– సమస్తమూ ఆ భగవంతుని స్వరూపాలే. పరాత్పరుని కంటె వేరే ఈ లోకంలో ఏదీ లేదు. నా ఆయుధం విరిగిపోయింది. నా చేయి తెగిపోయింది. అయినా నీతో యుద్ధం చేయడానికీ, నీ ప్రాణాలు తీయడానికీ సంసిద్ధంగా ఉన్నాను” అన్నాడు. వృత్తాసురుని మాటలు విన్న దేవేంద్రుడు ఆశ్చర్యపోయాడు. ఆ దానవుడిలో భగవంతుడు కనిపించాడు.అతనికి వాసుదేవుని ఆంతరంగిక భక్తుడిగా గ్రహించాడు.
వృత్తాసురుడు లోకాలన్నీ హాహాకారం చేస్తుండగా ఐరావతం, వజ్రాయుధంతో కలిపి దేవేంద్రుడిని చుట్టిపట్టి మ్రింగేశాడు. లోకాలన్నీ చిమ్మ చీకట్లు అలుముకున్నాయి. రక్త వర్షం కురిసింది. వృత్తాసురుని కడుపులో ఉన్న దేవేంద్రుడు శ్రీహరి వల్ల రక్షణ పొందినవాడై నిర్భయంగా ఉన్నాడు. యోగబలం వల్ల వజ్రాయుధంతో వృత్తాసురుని పొట్ట చీల్చి బయటకు వచ్చాడు. మరల వజ్రాయుధాన్ని ప్రయోగించి వృత్తాసురుని శిరస్సు ఖండించాడు.వృత్తాసురుని శరీరం నుండి ఒక దివ్య తేజస్సు వెలువడింది. అది ఈ లోకం నుండి వైకుంఠం చేరి విష్ణుమూర్తిలో లీనమైంది.
హరిభక్తుడైన వృత్తాసరుణ్ణి చంపినందుకు దేవేంద్రుడికి మరల బ్రహ్మహత్యాపాతకం చుట్టుకుంది. ఆ పాపం భరించలేక అతను దురవస్థపాలై నాడు. సిగ్గుతో ఈశాన్య దిక్కు వైపు పరిగెత్తి అత్యంత పవిత్రమైన మానస సరోవరంలో ప్రవేశించాడు. ఆ సరోవరంలోని ఒక తామరతూడు తంతులో కలిసిపోయాడు. పాప పరిహారం కోసం వెయ్యేండ్లు తపస్సు చేసాడు.ఆ సమయంలో నహుషుడు అనేవాడు స్వార్గాధిపతిగా ఉన్నాడు.పరమేశ్వరుడి కరుణతో పాపాలన్నీ నశించి మరల దేవేంద్రుడు ఆధిపత్యాన్ని పొందాడు.
ఈ వృత్తాసురుడు పూర్వ జన్మలో శూరసేన దేశానికి మహారాజైన చిత్రకేతువు. ప్రజారంజనంగా పరిపాలించాడు. పిల్లలు లేక పుత్రకామైష్టి చేసి పొందిన కుమారుణ్ణి చిన్నతనంలోనే పోగొట్టుకుని వైరాగ్యజ్ఞానం పొందాడు. నారదుని ద్వారా నారాయణ మంత్రోపదేశం పొంది, విద్యాధర చక్రవర్తిత్వాన్ని, దివ్య విమానాన్నీ పొందాడు. శ్రీమన్నారాయణుని అనుగ్రహంతో ఆ విమానంలో విహరిస్తూ ఆదిశేషుణ్ణి సందర్శించాడు. చిత్రకేతుడు పరమ భాగవతోత్తముడై కిన్నెరకాంతల చేత, యక్షకాంతల చేత శ్రీహరి దివ్యలీలలను గానం చేయించేవాడు. పుండరీకాక్షుని నామాలను నిరంతరం జపం చేసేవాడు.
ఒకనాడు కైలాస పర్వతంపై కొలువు తీరిన పరమేశ్వరుణ్ణి దర్శించాడు. దేవతలందరూ సేవిస్తుండగా తొడమీద కూర్చొన్న పార్వతీదేవిని ఆలింగనం చేసుకొని నిండు కొలువున్న ఈశ్వరుణ్ణి చూసి పకాపకామని నవ్వాడు. దీనికి కోపగించిన పార్వతీదేవి చిత్రకేతుని రాక్షసుడుగా పుట్టమని శపించింది.అప్పుడు చిత్రకేతుడు విమానం దిగి పార్వతీదేవికి సాష్టాంగ ప్రణామం చేసి చేతులుజోడించాడు. పరమభాగవతుడైన చిత్రకేతుడు శాంతచిత్తంతో దేవి శాపాన్ని స్వీకరించాడు. పార్వతి పరమేశ్వరులు ప్రసన్నులైనారు. ఆ చిత్రకేతుడే వృత్తాసురుడనే దానవుడుగా జన్మించాడు. శాపవిమోచన పొంది శ్రీమహావిష్ణువు లో ఐక్యమయ్యాడు.
ఈ వృత్తాసురుని పూర్వజన్మ వృత్తాంతాన్ని, చిత్రకేతుని పవిత్ర చరిత్రని భక్తితో చదివినవారికీ, విన్నవారికీ పాపాలన్నీ పటాపంచలవుతాయి. సమస్త వైభవాలు సంప్రాప్తిస్తాయి.
*****